గుర్రపు డెక్కతో సేంద్రియ ఎరువు! | Organic manure with horse hoof! | Sakshi
Sakshi News home page

గుర్రపు డెక్కతో సేంద్రియ ఎరువు!

Published Tue, Jun 26 2018 12:19 AM | Last Updated on Tue, Jun 26 2018 12:19 AM

Organic manure with horse hoof! - Sakshi

కాప్రా చెరువులో పరచుకున్న గుర్రపుడెక్క, గుర్రపుడెక్కతో తయారైన కంపోస్టు

సరస్సులు, చెరువులు, సాగు నీటి కాలువల్లో ఇబ్బడిముబ్బడిగా పెరిగే గుర్రపు డెక్కతో చక్కని సేంద్రియ ఎరువు తయారు చేసే పద్ధతిని హైదరాబాద్‌లోని భారతీయ రసాయన సాంకేతిక సంస్థ(ఐ.ఐ.సి.టి.) శాస్త్రవేత్తలు రూపొందించారు. ఈ టెక్నాలజీతో తొట్టతొలిగా హైదరాబాద్‌లోని కాప్రా చెరువులో నుంచి తొలగించిన గుర్రపు డెక్క మొక్కలతో సేంద్రియ ఎరువును తయారు చేయడంలో ఖాన్‌ ఎనర్జీ సంస్థ సఫలీకృతమైంది. గుర్రపు డెక్క మొక్క మురుగు నీటిలో నుంచి విషపూరిత పదార్థాలను గ్రహిస్తుంది.

అయితే, ఇది చెరువు మొత్తాన్నీ ఆక్రమించెయ్యడం వల్ల నీటి నాణ్యతకు, జలచరాల మనుగడకు గొడ్డలిపెట్టుగా మారింది. ఈ నేపధ్యంలో ఈ సమస్యాత్మక మొక్కలను పునర్వినియోగించడంపై ఐ.ఐ.సి.టి. శాస్త్రవేత్తలు రెండేళ్ల పాటు జరిపిన పరిశోధనలు విజయవంతమయ్యాయి. నీటిలోని విషపూరిత పదార్థాలను గుర్రపుడెక్క మొక్క తన వేర్లలోనే నిల్వ ఉంచుకుంటుంది. కాబట్టి, ఈ వేర్లతో తయారు చేసిన సేంద్రియ ఎరువు కేవలం పూల మొక్కలకు వాడుకోవాలి. అదేవిధంగా, గుర్రపు డెక్క మొక్కల కాండం, ఆకులతో తయారు చేసే సేంద్రియ ఎరువును అధికాదాయాన్నిచ్చే కూరగాయలు, ఉద్యాన పంటలకు వాడుకోవచ్చని ఖాన్‌ ఎనర్జీ సంస్థ ప్రతినిధి కె. లక్ష్మీనారాయణ(93923 75756) ‘సాక్షి’కి తెలిపారు.


గుర్రపు డెక్క మొక్కల కాండం, ఆకులను సేకరించి ముక్కలు చేసి.. ఐ.ఐ.సి.టి. శాస్త్రవేత్తలు తయారు చేసిన బాక్టీరియల్‌ కల్చర్, పేడ కలిపి 45 రోజులు నిల్వ ఉంచితే ఎరువుగా మారుతుంది. భారతీయ ఎరువుల సంస్థ ప్రమాణాలకు అనుగుణంగా ఐ.ఐ.సి.టి. శాస్త్రవేత్తలు రూపొందించిన సాంకేతిక పరిజ్ఞానంతో రూపొందించిన ఈ సేంద్రియ ఎరువులో సాధారణ వర్మీకంపోస్టులో కన్నా అనేక రెట్లు ఎక్కువగా పోషకాలున్నాయని ఆయన తెలిపారు. ఫాస్ఫేటు తప్ప ఇతర పోషకాలన్నీ ఉన్నాయన్నారు. పది కిలోలు వర్మీ కంపోస్టుకు బదులు ఈ ఎరువును కిలో వాడితే సరిపోతుందని, సేంద్రియ కర్బనం పుష్కలంగా ఉందన్నారు. దుర్వాసన ఉండదని, తయారైన ఎరువు ఆరు నెలల వరకు నిల్వ ఉంటుందన్నారు. కిలో ఎరువు తయారీకి రూ. 18 వరకు ఖర్చయిందని, కిలో రూ. 25 చొప్పున విక్రయించనున్నామని తెలిపారు.
 


                                    బస్తాల్లోకి నింపే ముందు ఆరబెట్టిన కంపోస్టు

–కంచికట్ల శ్రీనివాస్, సాక్షి, ఉప్పల్‌

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement