మండల పరిధిలోని బోక్కస్‌గాంకు చెందిన జార పోతిరెడ్డి, సావిత్రి దంపతుల కుమారుడు సంగారెడ్డి అధికారుల సాయంతో వర్మీ కంపోస్టు ఎరువులను తయారు చేస్తున్నాడు. రసాయన మందులు వద్దు సేంద్రియ ఎరువులే ముద్దు అనే సూత్రాన్ని పాటిస్తూ మంచి ఫలితాలు రాబడుతున్నాడు. గ్రామ శివారులో ఇతనికి రెండు చోట్ల 4.26 ఎకరాలు భూమి ఉంది. వ్యవసాయమే జీవనాధారంగా సాగుతూ ఆదర్శ రైతుగా కూడా గుర్తింపు పొందాడు. వ్యవసాయం పట్ల ఆసక్తితో వానపాములతో ఎరువుల తయారీకి శ్రీకారం చుట్టాడు. జేడీఏతోపాటు వ్యవసాయ శాఖ శాస్త్రవేత్తలు, అధికారుల మన్ననలు పొందుతున్నాడు.
ప్రారంభంలో కష్టాలు...
వానపాములతో ఎరువుల తయారీ ప్రారంభ దశలో నెలకొన్న ప్రకృతి వైపరీత్యాల కారణంగా సంగారెడ్డి అనేక కష్టాలు ఎదుర్కొన్నాడు. ఏడాది క్రితం వర్మీయాచర్ కోసం ఏర్పాటు చేసిన షెడ్డు గాలివాన బీభత్సంతో ధ్వంసమైంది. దీంతో ప్రభుత్వం ఇచ్చిన రాయితీ, రూ.1 లక్ష వరకు సొంత డబ్బులు నష్టపోయాడు. అయినా ధైర్యం కోల్పోకుండా మరోసారి షెడ్డును నిర్మించుకున్నాడు. అప్పటి నుంచి తిరిగి వెనక్కి చూడలేదు.
వర్మీ ఎరువు తయారీ విధానం...
వర్మీయాచర్ యూనిట్ విలువ రూ.2 లక్షలు ఉంటుంది. దీనికి ప్రభుత్వం 50శాతం సబ్సిడీ ఇస్తుంది. మిగతా ఖర్చును రైతు భరించాల్సి ఉంటుంది. షెడ్డు, 5 బెడ్లు, ఎరువుల నిల్వకు గోదాం నిర్మించాలి. 54 అడుగుల పొడవు, 27 అడుగులు వెడల్పు షెడ్డు నిర్మించాలి. అందులో 50 అడుగుల పొడవు, 4 అడుగులు వెడల్పు, ఒక అడుగు ఎత్తున 5 బెడ్లు నిర్మించాలి. ఒక్కో బెడ్‌లో 20 కిలోల చొప్పున వానపాములు (ఐదు బెడ్లలో కలిపి క్వింటాలు) వేయాలి. వీటికి ఆహారంగా వ్యవసాయ ఉత్పత్తుల అవశేషాలు, చెత్త, ఆకులు, పేడ, పండ్ల తొక్కలు, కూరగాయల వ్యర్థాలు వేయాలి. మూడు నెలల్లో ఎరువు తయారవుతుంది. వానపాముల ఎరువుల సరఫరా కోసం వ్యవసాయ శాఖ అధికారులు రైతు సంగారెడ్డికి ఆర్డరు ఇచ్చారు. 126 బెడ్లకు సరిపోయేన్ని వానపాములను పంపిణీ చేసేందుకు ఆయన శ్రమిస్తున్నాడు.
సొంత పొలంలో వర్మీ ఎరువుల వాడకం...
వానపాములతో తయారు చేసిన ఎరువులను సంగారెడ్డి ఇతర రైతులకు సరఫరా చేస్తున్నాడు. సొంత భూమిలో క్రమంగా రసాయన ఎరువుల వాడకాన్ని తగ్గిస్తూ వర్మీకంపోస్టునే వాడుతున్నాడు. ఖరీఫ్‌లో ఒక ఎకరం కావేరి కేవీ 21 రకం వరి సాగు చేశాడు. మరో 20 గుంటల్లో సాయిరాం సన్న రకం వరి వేశాడు. మరి కొంత మొక్కజొన్న, కూరగాయలు సాగు చేపట్టాడు. వీటన్నింటికీ తన షెడ్లో తయారైన ఎరువులనే వినియోగిస్తున్నాడు. దిగుబడులు ఆశాజనకం గా ఉన్నాయి.
వర్మీకంపోస్టు, సేంద్రియ ఎరువులతో సంగారెడ్డి పండించిన కూరగాయలు, బియ్యాన్నే ఇంట్లో వాడుతున్నాడు. ఇతను పండించిన వరి ధాన్యాన్ని కొనుగోలు చేసేం దుకు పలువురు ఉద్యోగులు ఆసక్తి చూపుతున్నారు. వర్మీ ఎరువులు తీసుకెళ్లేందుకు వివిధ ప్రాంతాలకు చెందిన రైతులు బోక్కస్‌గాంకు వస్తున్నారు. వ ర్మీఎరువును రూ.6 కిలో చొప్పున విక్రయిస్తున్నట్లు ఆయన తెలిపాడు. ఇప్పటి వరకు తాను రూ.1 లక్ష వరకు లాభం పొందానని చెప్పాడు. వ్యవసాయం ఉన్న మక్కువతో తన రెండో కొడుకు విష్ణువర్ధన్‌రెడ్డిని అగ్రీకల్చర్ డిప్లొమా చదివించాడు. వర్మీయూనిట్లను ఏర్పా టు చేసుకునే వారికి సలహాలిస్తానని చెప్పారు.
పట్టుదలే.. పెట్టుబడి!
Published Thu, Nov 20 2014 11:27 PM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement
Advertisement