యాచారం: నీటి వనరులున్న ప్రతి రైతు బిందుసేద్యం ద్వారా పంటలు సాగు చేసుకోవాలని, తక్కువ నీటి వాడకంతో మూడింతల పంటలు తీయవచ్చని మైక్రో ఇరిగేషన్ జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్ హరిప్రసాద్‌రెడ్డి సూచించారు. గురువారం మండల పరిధిలోని చౌదర్‌పల్లిలో బిందుసేద్యం వాడకంపై కాశమల్ల రాములు వ్యవసాయ క్షేత్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కాల్వల ద్వారా నీటిని పారించడం వంటి పద్ధతుల వల్ల నీరు వృథా కావడంతో పాటు తక్కువ పొలంలో పంటలు సాగు చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అదే బిందుసేద్యం పద్ధతుల్లో తక్కువ నీటితో మూడింతల పొలంలో పంటలు తీయవచ్చని సూచించారు.
ఆధునిక పద్దతుల్లో వ్యవసాయ చేస్తేనే రైతులకు ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన రైతులు బిందు సేద్యం కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. సదస్సు అనంతరం బిందుసేద్యం పరికరాలు సరఫరా చేసే జైన్ కంపెనీ ప్రతినిధులు ఫ్లోరైడ్ వల్ల బిందు పరికరాల్లో చేరే వ్యర్థాన్ని తొలగించే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సందీప్‌కుమార్, ఇబ్రహీంపట్నం డివిజన్ ఉద్యాన శాఖ క్షేత్రస్థాయి అధికారి యాదగిరి, ఇబ్రహీంపట్నం డివిజన్ మైక్రో ఇరిగేషన్ రాజేష్‌కుమార్, సర్పంచ్ గౌర నర్సింహ, ఎంపీటీసీ సభ్యుడు కృష్ణమూర్తి, ఉప సర్పంచ్ శ్రీధర్‌గౌడ్, రైతులు శ్రీకాంత్‌రెడ్డి, విష్ణు, బుగ్గరాములు పాల్గొన్నారు.
బిందుసేద్యంతో సాగునీరు ఆదా
Published Fri, Nov 21 2014 12:21 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM
Advertisement