సేద్యమేవ జయతే! | vegetables cultivation with drip irrigation | Sakshi
Sakshi News home page

సేద్యమేవ జయతే!

Published Wed, Nov 26 2014 12:17 AM | Last Updated on Sat, Sep 2 2017 5:06 PM

vegetables cultivation with drip irrigation

మూడెకరాల్లో పంటలతో యేటా రూ.2.5 లక్షల ఆదాయం ఆదర్శంగా నిలుస్తున్న చౌదర్‌పల్లి రైతు రాములు
 మండలంలోని చౌదర్‌పల్లికి చెందిన రాములుకు మూడు ఎకరాల పొలం ఉంది. రెండు బోరుబావుల్లోని కొద్దిపాటి నీటితో ఇంటి అవసరాలకు సరిపోను వరి పండిస్తున్నాడు. మిగతా పొలంలో బిందుసేద్యంతో కూరగాయలు పండిస్తున్నాడు.

అక్షర జ్ఞానం లేని రాములు వ్యవసాయాధికారుల సూచనలను కచ్చితంగా పాటిస్తుంటాడు. ఏయే సీజన్‌లలో ఆయా కూరగాయలు పండిస్తున్నాడు. నిత్యం 5 నుంచి 10 మంది కూలీలు ఉపాధి పొందుతున్నారు. ఒక్కొక్కరికి రూ. 200 నుంచి రూ.250 వరకు కూలిడబ్బులు ఇస్తుంటాడు. దిగుబడులను సరూర్‌నగర్ రైతు బజారులో విక్రయిస్తుంటాడు. యేటా కూరగాయల విక్రయాలతో రూ.6 లక్షలు వస్తున్నాయి. ఇందులో పెట్టుబడులు, కూలీల ఖర్చులుపోను రూ. 2.5 లక్షలు మిగులుబాటవుతోందని చెబుతున్నాడు రాములు.

 రైతు సదస్సులన్నీ రాములు పొలంలోనే..  
 బిందుసేద్యంతో పలు రకాల కూరగాయలు పండిస్తూ.. రాములు మంచి లాభాలు పొందుతుండడంతో మిగతా గ్రామాల రైతులకు సూచనలు, సలహాలు తెలియజేయడానికి వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు తరచూ ఆయన వ్యవసాయ క్షేత్రంలోనే సదస్సులు ఏర్పాటు చేస్తుంటారు. ‘మేం చదువుకున్నవాళ్లమైనా నీ నుంచి ఎంతో నేర్చుకోవాల్సి ఉంది’ అని రాములుతో వ్యవసాయ, ఉద్యాన శాఖ అధికారులు చెప్పిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి.

 ఏడాది క్రితం అప్పటి ఉద్యాన శాఖ కమిషనర్ రాణీకుముదిని.. రాములు కూరగాయల పంటలు చూసి అభినందించారు. ప్రస్తుతం ఇబ్రహీంపట్నం ఉద్యానశాఖ అధికారులు కనకలక్ష్మి, యాదగిరి, వ్యవసాయాధికారులు కవిత, సందీప్‌కుమార్, లక్ష్మణ్ తదితరులు రాములును ఆదర్శంగా తీసుకుని కూరగాయలు సాగు చేసుకోవాలని మిగతా గ్రామాల రైతులకు సూచిస్తున్నారు. ఇటీవల రాములు వ్యవసాయ పొలంలో సదస్సుకు వచ్చిన మైక్రో ఇరిగేషన్ ఏపీడీ హరిప్రసాద్‌రెడ్డి ఆయనను అభినందించారు.
 
నిత్యం 12 గంటలు శ్రమిస్తూ..
 టమాటా, చిక్కుడు, బెండ, దోస, కీర, దొండ, కాకర, వంగ, బీర, మిర్చి, పొట్లకాయ, దోస, మునగ పంటలను రాములు సాగు చేస్తున్నాడు.   నిత్యం 12 గంటల పాటు శ్రమించడంతో పాటు రోజూ సరూర్‌నగర్ రైతు బజారుకు వెళ్లి కూరగాయల విక్రయించడం, మళ్లీ  మధ్యాహ్నం వచ్చి వ్యవసాయ పనుల్లో నిమగ్నమవుతుంటాడు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement