పులివెందుల : మనం కొదమ సింహాలమా, వృద్ధ సింహాలమా.. గ్రామ సింహాలమా అనేది ప్రజలు తేలుస్తారని కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డి వ్యాఖ్యానించారు. పులివెందుల పర్యటనలో బుధవారం చంద్రబాబు చేసిన వ్యాఖ్యలపై గురువారం ఆయన మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు భయస్తుడు కాబట్టే తాను ధైర్యవంతుడిని అని చెప్పుకునేందుకు మాటిమాటికి కొదమ సింహం అని అంటున్నాడని ఎద్దేవా చేశారు.
సాగునీటి ప్రాజెక్టులను సందర్శించేందుకు ఆయన ఏ ధైర్యంతో వస్తున్నాడో అర్థంకావడంలేదన్నారు. ఒక అబద్ధాన్ని కళ్లు ఆర్పకుండా చెప్పగలిగే వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఆయన ఇంకా ఏమన్నారంటే.. 11వేల క్యూసెక్కుల సామర్థ్యం ఉన్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్‌వల్ల రాయలసీమతో పాటు నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు సాగునీరు అందించలేమని భావించి దాన్ని 44వేల క్యూసెక్కుల సామర్థ్యానికి పెంచిన ఘనత మహానేత డాక్టర్ వైఎస్సార్‌దే. దీనిని అడ్డుకునేందుకు అప్పట్లో ధర్నాలు చేయించిన విషయం బాబు మరిచిపోయినా ప్రజలు మర్చిపోలేదు.
అలాగే, గండికోట రిజర్వాయర్ సామర్థ్యాన్ని 3 టీఎంసీలకు కుదించిన ఘనుడు చంద్రబాబే. వైఎస్సార్ వచ్చాక 27టీఎంసీలుగా చేశారు. చంద్రబాబు హయాంలో ప్రాజెక్టులో ఎన్నడూ పూర్తిస్థాయి సామర్థ్యంతో నీటిని నింపిన దాఖలాల్లేవు. వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి సీఎం అయ్యాక 27టీఎంసీల పూర్తి సామర్థ్యాన్ని నింపి సీమకు నీళ్లిస్తున్నారు. నిర్వాసితులకు రూ.950కోట్ల పరిహారం ఇవ్వబట్టే ఇది సాధ్యమైంది. అలాగే, చిత్రావతి ప్రాజెక్టు కూడా. తన 14ఏళ్ల పాలనలో ఏనాడూ సీమ ప్రాజెక్టుల గురించి పట్టించుకోని పెద్ద మనిషి చంద్రబాబు.
డ్రిప్‌లో రూ.వెయ్యి కోట్ల బకాయి పెట్టి అబద్ధాలా..
డ్రిప్ ఇరిగేషన్‌కు సంబంధించి చంద్రబాబు హయాంలో ఆయా కంపెనీలకు రూ.1,000 కోట్ల బకాయిలు పెట్టడంతో స్కీం నిర్విర్యమైపోయింది. జగనన్న సీఎం అయ్యాక వాటిని చెల్లించి గత ఏడాది పునఃప్రారంభించారు. పంటల బీమా విషయంలోనూ చంద్రబాబు ఇచ్చిన దానికంటే రెండు రెట్లకు పైగా జగన్ ప్రభుత్వం అందించింది. వైఎస్సార్ జిల్లాలో 2012కు సంబంధించిన శనగపంట బీమా 2014–19 వరకు పెండింగ్‌లో ఉండేది.. జగనన్న వచ్చాక తొలి ఏడాదిలోనే రూ.112కోట్లు రైతుల ఖాతాల్లో వేశారు.
పైడిపాలెం వైఎస్సార్ బ్రెయిన్ చైల్డ్..
పైడిపాలెం రిజర్వాయర్ వైఎస్సార్ బ్రెయిన్ చైల్డ్. ఆయన హయాంలో 90శాతం పనులు పూర్తయ్యాయి. దానిని కూడా బాబు తన ఖాతాలోనే వేసుకుంటున్నాడు. కడప ఎయిర్‌పోర్ట్ రన్‌వే కోసం రూ.75కోట్లు జగనన్న ప్రభుత్వం చెల్లించింది. ఈరోజు రన్‌వే విస్తరణ జరిగి పెద్ద ఫ్‌లైట్లు వస్తున్నాయంటే అది జగన్ చలవే. అలాగే, కుప్పాన్ని కూడా గుండెల్లో పెట్టుకున్న వ్యక్తి సీఎం జగన్. ఇక జిల్లాలో ఎన్నో పరిశ్రమలు వచ్చాయి. ఇవేవీ చంద్రబాబుకు కనిపించడంలేదు.
మరోవైపు.. తన కుటుంబాన్ని సర్వనాశనం చేయాలని తన సోదరి, చంద్రబాబు, బీజేపీలోని టీడీపీ నేతలు, వ్యవస్థలోని ఒక పెద్ద మనిషి కలిసి రెండున్నరేళ్లుగా పన్నాగం పన్నారు. వారి అంతిమ లక్ష్యం వైఎస్సార్‌సీపీని, జగన్‌ను ఇబ్బంది పెట్టడమే. వివేకా కేసులో వాస్తవాలను పక్కన పడేసి రాజకీయ కోణంలో ముందుకు తీసుకువెళుతున్నారు.
క్షమాపణ చెప్పి మాట్లాడాలి
ఇక తెలుగుగంగ ప్రాజెక్టులో బ్రహ్మం సాగర్‌కు నీరు రావాలంటే కావాల్సిన కాలువ రిపేర్లు చేయాలని అనేకసార్లు విన్నవించినా చంద్రబాబు పట్టించుకోలేదు. జగన్ వచ్చిన తర్వాత ఆ కాలువలన్నీ ఆధునికీకరణ చేసి లైనింగ్ చేయించారు. ముందు ఈ ప్రాంత ప్రజలకు చంద్రబాబు క్షమాపణ చెప్పి మాట్లాడాలి.
Comments
Please login to add a commentAdd a comment