ఇంట్లో సాఫ్ట్ వేర్ కొలువు..పొలంలో ప్రకృతి సేద్యం | Singapore Software Company employe starts Natural Farming in india | Sakshi
Sakshi News home page

ఇంట్లో సాఫ్ట్ వేర్ కొలువు..పొలంలో ప్రకృతి సేద్యం

Jan 21 2025 4:04 AM | Updated on Jan 21 2025 4:04 AM

Singapore Software Company employe starts Natural Farming in india

 అటు సింగపూర్‌ కంపెనీలో డైరెక్టర్‌ స్థాయి ఉద్యోగం.. ఇటు 8.5 ఎకరాల్లో ప్రకృతి సేద్యం

పండ్ల తోటలతో పాటు.. 75 సెంట్లలో పాలీహౌస్‌ నిర్మించి 35 రకాల పంటల సాగు

బ్రకోలి, ఫైనాఫిల్, ఎర్ర క్యాబేజీ, ఎర్ర బెండ తదితర కొత్త పంటల సాగు

ఉద్యాన పంటల సాగులో చక్కగా రాణిస్తున్న బాల భాస్కర శర్మ

ఇంటి దగ్గరి నుంచే విదేశీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తూనే 8.5 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు సాగు చేస్తూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు కర్నూలుకు చెందిన యు. బాల భాస్కర శర్మ. ఎంటెక్‌ చదివి సింగపూర్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉన్నత స్థాయిలో డైరెక్టర్‌ స్థాయికి ఎదిగిన ఆయన కరోనా సమయంలో కర్నూలుకు వచ్చారు. ఇప్పటికీ అదే హోదాలో ఇంటి నుంచే ఉద్యోగం చేస్తూనే నిబద్ధతతో కూడిన ప్రకృతి వ్యవసాయం లో అద్భుతంగా రాణిస్తున్నారు. సొంత స్టోర్‌ నిర్వహించటంతో పాటు వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ అమ్మకాలతో పాటు కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం కూరగాయలు విక్రయిస్తూ అందరి చేతా ఔరా అనిపిస్తున్నారు.

సాఫ్ట్‌వేర్‌ రంగంలో ఉన్నతోద్యోగిగా పనిచేస్తూనే ప్రకృతి వ్యవసాయంలో రాణిస్తున్న బాల భాస్కర శర్మ కృషి ప్రశంసనీయం. కర్నూలు జిల్లా కల్లూరు మండలం నాయకల్లు గ్రామం వద్ద‡వారసత్వంగా సంక్రమించిన 8.5 ఎకరాల భూమిలో అంబా గో ఆధారిత వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేసి ఉద్యాన పంటలు సాగు చేస్తున్నారు. 75 సెంట్లలో పాలీహౌస్‌ ఏర్పాటు చేసుకొని అందులో అనేక కొత్త పంటలు పండిస్తున్నారు. 


పెనుగాలులు, భారీ వర్షాలకు దెబ్బతింటున్నందున సాధారణంగా ఉద్యాన శాఖ పాలీహౌస్‌లను ప్రోత్సహించటం లేదు. అయితే, శర్మ తన పొలం చుట్టూ గాలులను తట్టుకునేలా నేరేడు, రేగు తదితర పండ్ల చెట్లు పెంచి, మధ్యలో పాలీహౌస్‌ నిర్మించి, సమర్థవంతంగా నిర్వహించటం విశేషం. జిల్లాకు పరిచయమే లేని వెల్లుల్లి, బ్రకోలి తదితర అనేక రకాల కూరగాయలను పాలీహౌస్‌లో సాగు చేస్తున్నారు. 

బ్రకోలిని కిలో రూ.100 చొప్పున విక్రయిస్తున్నారు. పాలిహౌస్‌లో వంగ, బీర, టొమాటో, పచ్చి మిరప, కాళీఫ్లవర్, క్యాబేజీ, ఎర్ర క్యాబేజి, ముల్లంగి, బీట్‌రూట్, క్యారెట్, బీన్స్, చిక్కుడు, కాకర, క్యాప్సికం, ఎర్రబెండ, సొర, పొట్ల, తంబకాయ, బుడం కాయ, కీరదోసతో పాటు.. ఎర్రతోట కూర, కొత్తిమీర, పుదీన, గోంగూర, తోటకూర,  పాలకూర, బచ్చలి, చుక్కకూర, మెంతికూర వంటి 35 పంటలు సాగు చేస్తున్నారు. ఎతై ్తన బోదెలు ఏర్పాటు చేసుకొని మల్చింగ్, వీడ్‌ మ్యాట్‌ వేసి మొక్కలు నాటుకున్నారు. ఆరుబయట పొలాల్లో 3 నెలలు దిగుబడినిచ్చే కూరగాయలు పాలీహౌస్‌లో 5 నెలల వరకు దిగుబడినిస్తున్నాయి.

పండ్ల చెట్లు.. ఫైనాపిల్‌ కూడా..
7.75 ఎకరాల్లో చాలా రకాల పండ్ల చెట్లను పూర్తిగా ప్రకృతి సేద్య పద్ధతుల్లో శర్మ పెంచుతున్నారు. నిమ్మ 250, జామ 200, సీతాఫలం 200, మామిడి 40, అంజూర 100, నేరెడు 200, మునగ 200, అరటి 80 చెట్లతో పాటు కొన్ని సపోటా, కొబ్బరి, ఉసిరి, నేరెడు, రేగు, రామాఫలం చెట్లు పెంచుతున్నారు. రాయలసీమప్రాంతంలో ఇంతవరకూ లేని ఫైనాపిల్‌ మొక్కలను కూడా పెంచుతున్నారు.  మధురై నుంచి ఎర్రబెండ సీడ్‌ తెప్పించి నాటుకున్నారు.

ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌ మార్కెటింగ్‌
కర్నూలులోని నంద్యాల చెక్‌పోస్టు దగ్గర ఆర్గానిక్‌ స్టోర్‌ ఏర్పాటు చేయటంతో పాటు బాలబాస్కర శర్మ ఆన్‌లైన్‌ మార్కెటింగ్‌ కోసం ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ రూపొందించారు. తను పండించిన కూరగాయలు, ఆకుకూరలు, పండ్లతో పాటు కెమికల్స్‌ లేకుండా ఆహార పంటలు పండిస్తున్న రైతుల నుంచి బియ్యం, పప్పులు, పసుపు తదితరాలను సేకరించి విక్రయిస్తున్నారు. 8 దేశీ ఆవులను పోషిస్తూ నాలుగు ట్యాంకుల ద్వారా ద్రవ జీవామృతం పంటలకు ఇస్తున్నారు. 

వర్మీ కంపోస్టుతో పాటు రోజుకు 40 లీటర్ల వర్మీవాష్‌ కూడా ఉత్పత్తి చేసి డ్రిప్‌ ద్వారా అందిస్తున్నారు.  చీడపీడల నివారణకు అవసరాన్ని బట్టి కషాయాలు, వేపనూనె తదితరాలను వాడుతున్నారు. సోలార్‌ ట్రాప్స్, తెలుపు, పసుపు జిగురు అట్టలను ఏర్పాటు చేశారు. పండ్ల తోటలకు నష్టం కలిగించే పండు ఈగ ట్రాప్‌కు ఏర్పాటు చేశారు. అన్ని పంటలకు డ్రిప్‌ సదుపాయం కల్పించారు.

రసాయనాల్లేకుండా పండించిన పంట కావడం వల్ల కూరగాయలు, ఆకు కూరలకు డిమాండ్‌ ఎక్కువగా ఉంటోంది. శర్మ కృషిని గుర్తించిన కర్నూలు జిల్లా యంత్రాంగం.. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం ప్రత్యేకంగా కెమికల్స్‌ లేకుండా పండించిన కూరగాయలు విక్రయించేందుకు అవకాశం ఇచ్చిప్రోత్సహిస్తుండటం విశేషం. 

ఇంటి దగ్గరి నుంచే విదేశీ సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉన్నతోద్యోగం చేస్తూనే 8.5 ఎకరాల్లో పండ్లు, కూరగాయలు సాగు చేస్తూ చక్కని ఫలితాలు సాధిస్తున్నారు కర్నూలుకు చెందిన యు. బాల భాస్కర శర్మ. ఎంటెక్‌ చదివి సింగపూర్‌లోని సాఫ్ట్‌వేర్‌ కంపెనీలో ఉన్నత స్థాయిలో డైరెక్టర్‌ స్థాయికి ఎదిగిన ఆయన కరోనా సమయంలో కర్నూలుకు వచ్చారు. ఇప్పటికీ అదే హోదాలో ఇంటి నుంచే ఉద్యోగం చేస్తూనే నిబద్ధతతో కూడిన ప్రకృతి వ్యవసాయం లో అద్భుతంగా రాణిస్తున్నారు. సొంత స్టోర్‌ నిర్వహించటంతో పాటు వెబ్‌సైట్‌ ద్వారా ఆన్‌లైన్‌ అమ్మకాలతో పాటు కలెక్టరేట్‌లో ప్రతి సోమవారం కూరగాయలు విక్రయిస్తూ అందరి చేతా ఔరా అనిపిస్తున్నారు.

రసాయనాల్లేని ఆహారం అందిస్తున్నా..!
సింగ్‌పూర్‌లో 2020 వరకు సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌గా పనిచేశా. కరోనా కారణంగా ఇంటికి వచ్చేశా. ఇంటి నుంచే సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం చే స్తూ ప్రకృతి వ్యవసాయ క్షేత్రాన్ని అభివృద్ధి చేసుకున్నా. 8 ఆవులను పెంచుతూ పూర్తిగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నా. మా వ్యవసాయ క్షేత్రంలో కెమికల్స్‌ వాసన అనేది ఉండదు. ప్రతి సోమవారం కలెక్టరేట్‌లో కూరగాయల విక్రయ కేంద్రాన్ని ఏర్పాటు చేసుకునేందుకు జిల్లా కలెక్టర్‌ అవకాశం ఇచ్చారు. ప్రత్యేక స్టోర్‌తో పాటు వెబ్‌సైట్‌ ద్వారా కూడా విక్రయిస్తున్నాం. రసాయనిక అవశేషాలు లేని నాణ్యమైన కూరగాయలు, ఆకుకూరలు తదితర ఉత్పత్తులను వినియోగదారులకు అందిస్తున్నామనే సంతోషం ఉంది. ఎర్ర బెండకాయకు మంచి ఆదరణ ఉంది. పోషకాలు ఎక్కువగా ఉండటం వల్ల ఎర్ర బెండకాయను ప్రజలు ఇష్టంగా తీసుకుంటున్నారు.
– యు. బాల భాస్కర శర్మ (62817 00553), 
సాఫ్ట్‌వేర్‌ ఇంజనీర్‌ కమ్‌ ప్రకృతి రైతు, కర్నూలు

– గవిని శ్రీనివాసులు,  సాక్షి కర్నూలు (అగ్రికల్చర్‌)

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement