సాక్షి ప్రతినిధి, కర్నూలు : అంతన్నారు.. ఇంతన్నారు.. అధికారంలోకి వస్తే ఆంధ్రప్రదేశ్‌ను సింగపూర్ చేస్తానన్నారు. ఇంటికో ఉద్యోగం.. రైతు, డ్వాక్రా రుణాల మాఫీ.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో హామీలు.. అమలుకు సాధ్యం కాని వాగ్దానాలను ఇచ్చారు. ఇదంతా గతం.. ప్రస్తుతం ఏరుదాటాక తెప్ప తగలేసిన చందం. ఎవరో కాదు సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అడుతున్న గారడీ ఇది. స్వాత్రంత్య్ర వేడుకల సందర్భంగా గురువారమే ఆయన కర్నూలుకు చేరుకున్నారు.
ఏపీఎస్పీ బెటాలియన్‌లో
జాతీయ జెండాను శుక్రవారం ఎగురవేయనున్నారు. అలాగే రాష్ట్ర ప్రజలనుద్దేశించి ప్రసంగించనున్నారు. అధికారంలోకి రాకముందు ఆయన జిల్లా ప్రజలకు ఎలాంటి హామీలు ఇచ్చారో..
వాటి అమలు తీరు ఎలా ఉందో ఒకసారి పరిశీలిస్తే..
రైతులు, డ్వాక్రా మహిళలు ఎవరూ రుణాలు చెల్లంచవద్దని, తాను అధికారంలో వస్తే వాటన్నింటినీ మాఫీ చేస్తానని టీడీపీ అధినేత, ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు పదేపదే హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక తాను సమైక్యాధ్రప్రదేశ్‌లో హామీ ఇచ్చానని మాట మార్చారు. కమిటీ పేరుతో కాలయాపన చేశారు. కొద్ది రోజులకు రూ.లక్షన్నర మాఫీ అన్నారు. రీషెడ్యూల్‌ను తెరపైకి తెచ్చారు. ఇవి కూడా అమలుకు నోచుకోలేదు. కొత్త రుణాలు లభించక జిల్లా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
అయినా ప్రభుత్వంలో చలనం రావడం లేదు. పైగా బ్యాంకర్లు అప్పులను వడ్డీలతో సహా చెల్లించాలంటూ రైతులకు నోటీసులు ఇస్తున్నారు. వ్యక్తిగత ఖాతాలోని మొత్తాన్ని రుణాల కింద జమ చేసుకుంటున్నారు. డ్వాక్రా రుణాలదీ ఇదే పరిస్థితి.
ఇంటికో ఉద్యోగం పేరుతో నిరుద్యోగులకు ఆశ కల్పించారు. నిరుద్యోగులకు నెలకు రూ.2 వేలు భృతి ఇస్తామన్నారు. ఇప్పుడు ఆ మాటే మరిచారు.
24 గంటల ఉచిత విద్యుత్ అన్నారు.. వ్యవసాయానికి తొమ్మిది గంటల నాణ్యమైన విద్యుత్‌ను సరఫరా చేస్తామని ప్రకటనలు చేశారు. ఉచిత విద్యుత్‌ను అటకెక్కించారు. వ్యవసాయానికి తొమ్మిది గంటలు పోయి ఏడు గంటలకే దిక్కులేదు. దీంతో రైతుల పరిస్థితి దయనీయంగా మారింది.
ఎన్నికల సమయంలో ఆలూరు, కోసిగి, ఆత్మకూరులో నిర్వహించిన బహిరంగ సభలో చంద్రబాబు ఇచ్చిన హామీలివి..
వేదావతి నదిపై ఎత్తిపోతల పథకం నిర్మాణం.
నాగులదిన్నె వంతెన పునర్నిర్మాణం.
మంత్రాలయంలో 30 పడకల ఆసుపత్రి, డిగ్రీ కళాశాల ఏర్పాటు.
వరదల నుంచి ప్రజలను కాపాడేందుకు రక్షణ గోడు నిర్మాణం.
తాగునీటి సమస్యలు ఉన్న ప్రాంతాల్లో మండలానికి ఒక జలాశయం నిర్మాణం.
ఆత్మకూరుకు కృష్ణాజలాల మళ్లింపు.
శ్రీశైలం నియోజక వర్గంలో తాగునీటి సమస్య పరిష్కారం.
బీఈడీ విద్యార్థులకు ఎస్‌జీటీల్లో అవకాశం.
వాల్మీకులను ఎస్సీ జాబితాలో చేర్చటానికి కృషి.
బుడగ జంగాల హక్కుల రక్షనకు కృషి.
జిల్లాలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తామని హామీ.
‘నీటి’మూటేనా?
తుంగభద్ర దిగువ కాలువలో నీటి చౌర్యాన్ని అరికట్టి వాటాను రాబడతానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అలాగే చిప్పగిరి సమీపంలోని నగరడోణ రిజర్వాయర్‌ను పూర్తి చేస్తామన్నారు. చెరువులు, కాలువలను పటిష్టం చేసి తాగు, సాగునీరు అందించటంతో పాటు మత్స్యకారుల కుటుంబాలను ఆదుకుంటామన్నారు. జిల్లాలో ఫ్లోరైడ్ నీటితో అనారోగ్యాల పాలవుతున్న వారికి మంచినీరు అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు.
ఎస్సీ వర్గీకరణ ద్వారా మాదిగలను, ప్రత్యేక ప్యాకేజీ కింద ముస్లిం మైనారిటీలను ఆదుకుంటామన్నారు. ఆటో కార్మికులకు వడ్డీలేని రుణాలు, రాయితీలు, అవసరమైతే ఆటోనగర్ నిర్మాణాలు చేపట్టటం వంటివి హామీ ఇచ్చారు. ప్రతి నియోజకవర్గంలో వృద్ధాశ్రమం ఏర్పాటు చేస్తామన్నారు. అధికారంలోకి వచ్చి రెండు నెలలైనా వీటి మాట ఎత్తకపోవడం గమనార్హం.
కనిపించని ప్రగతి..
ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు పదవి చేపట్టి రెండు నెలలైంది. గతంలో సీఎంగా పనిచేసిన అనుభవం ఉన్నా.. పాలనలో ప్రగతి కనిపించడం లేదనే విమర్శలు ఉన్నాయి. జిల్లాలో పాఠశాల భవనాలు అధ్వానంగా ఉన్నాయి. తరగతి గడులు పెచ్చులూడి.. మరుగుదొడ్లు లేక విద్యార్థుల తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మధ్యాహ్న భోజనంలో నాణ్యత ప్రమాణాలు కరువయ్యాయి.
ఇక వసతి గృహాల పరిస్థితి దారుణంగా ఉంది. రాయలసీమ యూనివర్సిటీ సమస్యల సుడిగుండంలో కొట్టుమిట్టాడుతోంది. గతంలో రూ.100 కోట్ల నిధులు మంజూరు చేసినట్లు ప్రకటించినా.. ఇంత వరకు ఒక్క రూపాయి కూడా రాలేదు. కర్నూలు పెద్దాసుపత్రి అభివృద్ధి రూ.100 కోట్లు మంజూరైనా విడుదల కాలేదు.
అసంపూర్తిగానే ప్రాజెక్టులు..
జిల్లాలో పులికనుమ, గుండ్రేవుల ప్రాజెక్టుల నిర్మాణాలు పూర్తి చేస్తే ఖరీఫ్, రబీ సీజన్‌లో లక్షల ఎకరాలకు సాగునీరు అందించవచ్చు. గురురాఘవేంద్ర ఎత్తిపోతల పథకం ద్వారా ఎల్‌ఎల్‌సీ ఆయకట్టుకు నీరందించేందుకు 11 ఎత్తిపోతల పథకాలు, ఒక చెరువు నిర్మాణం పూర్తి చేయాల్సి ఉంది. తెలుగుగంగ లైనింగ్ పనులు పూర్తి కాలేదు. హంద్రీనీవా ఎత్తిపోతల పథకం కాలువ పనులు అసంపూర్తిగానే దర్శనమిస్తున్నాయి. గోరుకల్లు జలాశయం పనులు అసంపూర్తిగానే ఉన్నాయి.
ఇది పూర్తై 11 టీఎంసీల నీటిని నిల్వచేసుకునే అవకాశం ఉంది. పోతిరెడ్డిపాడు ప్రధాన కాలువ, రెగ్యులేటర్ పనులు సాగుతూనే ఉన్నాయి. ఇలా జిల్లాలో ఎన్నో సమస్యలు తిష్టవేసి ఉన్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన వాగ్దానాలతోపాటు జిల్లా అభివృద్ధిపై స్వాతంత్య్ర వేడుకల్లో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టమైన ప్రకటన చేయాలని జిల్లా ప్రజలు కోరుతున్నారు.