The cultivation of crops
-
భూమిచ్చారు సరే.. పెట్టుబడి ఖర్చేది.?
ఏడాది గడిచినా పెట్టుబడి ఇవ్వని సర్కారు పంటల సాగుకు లబ్ధిదారుల పాట్లు పట్టించుకోని అధికారులు ఆదిలాబాద్ అర్బన్ : దళితబస్తీ పథకంలో భాగంగా ప్రభుత్వం నిరుపేద దళితులకు మూడెకరాల వ్యవసాయ భూమి ఇచ్చింది. మొదటి ఏడాది పెట్టుబడి ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందన్న భరోసాతో ఎకరాకు రూ.25 వేల వరకు అప్పు చేసి పంట సాగుచేశారు. భూములు పంపిణీ చేసి ఏడాదిన్నర గడుస్తున్నా కార్పొరేషన్ కానీ, అధికారులు గానీ చిల్లిగవ్వ కూడా రుణం ఇవ్వలేదు. దీంతో అప్పులు ఏలా తీర్చాలో తెలియక లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నియోజకవర్గంలో జైనథ్, ఆదిలాబాద్, బేల మండలాల్లోని 104 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం 312 ఎకరాల వ్యవసాయ భూమిని కొనుగోళ్లు చేసి పం పిణీ చేసింది. 2014–15లో జైనథ్ మండలం కాప్రి గ్రా మానికి చెందిన 24 మందికి భూములు పంపిణీ చేశారు. అప్పట్లో పంటలు వేసుకున్న 3 నెలలకు పెట్టుబడి ఖ ర్చులు చెల్లించడంతో లబ్ధిదారులు ఇబ్బందులుపడ్డారు. భూములిచ్చి పంట చేతికొచ్చే సమయంలో సాగుకు అయ్యే ఖర్చుఇచ్చారు. 2015–16 సంవత్సరంలో బేల మండలం బెదోడ గ్రామానికి చెందిన 10 మందికి, అదే మండలంలోని తోయగూడ గ్రామానికి 14 మందికి భూ పంపిణీ చేశారు. జైనథ్ మండలం బాలాపూర్కుచెందిన 13 మందికి, దీపాయిగూడకు చెందిన 18 మందికి, మా ండగడకు చెందిన ఒకరికి, మాంగుర్లకు చెందిన ముగ్గురికి భూములిచ్చారు. 2016–17 యేడాదిలో ఆదిలాబాద్ మండలంలోని అర్లి(బి) గ్రామానికి చెందిన 11 మందికి భూమి పంపిణీ చేశారు. మూడు మండలాల్లో 70 మందికి గతేడాది వేసవిలో భూములు పంపిణీ చేశారు. దీంతో లబ్ధిదారులందరూ పంటలు వేసుకున్నారు. పంటలు సాగై దాదాపు 6 నెలలవుతున్నా ఇప్పటి వరకు మొదటి ఏడాది పెట్టుబడి రాకపోవడంతో అసహనంతో ఉన్నారు. కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. పెట్టుబడి ఊసేత్తని ప్రభుత్వం ప్రభుత్వం దళితబస్తీ ద్వారా పంపిణీ చేసిన భూములకు కార్పొరేషన్ ద్వారా సర్కారు సాగుకు అయ్యే ఖర్చు ఇవ్వాల్సి ఉన్నా ఎవరూ పట్టించుకోవడం లేదు. మొదటి ఏడాది ఖర్చు ప్రభుత్వమే చెల్లిస్తామనడంతో లబ్ధిదారులు ఆశగా ఎదురుచూస్తున్నారు. పంటల వేసుకొని 6 నెలలు గడిచినా లబ్ధిదారుల చేతికి పెట్టుబడి రుణాలు అందకపోవడంతో ఆందోళన పడుతున్నారు. పెట్టుబడి ఖర్చు ఇంకెప్పుడు ఇస్తారని అధికారులను ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చిన మూడెకరాల భూమిలో ప్రస్తుతం పత్తి, సోయా, జొన్న, కంది పంటలు సాగవుతున్నాయి. మండల వ్యవసాయ, రెవెన్యూ అధికారులు వచ్చి పంటలకు కావాల్సిన మొదటి ఏడాది పెట్టుబడి ఖర్చు కార్పొరేషన్ నుంచి ఇప్పిస్తామని చెప్పినా.. ఇంతవరకు దాని ఊసేత్తకపోవడం గమనార్హం. పంటలకు కావల్సిన పెట్టుబడి ప్రైవేట్ వ్యక్తుల వద్ద నుంచి తెచ్చామని, పెట్టుబడి ఖర్చు ప్రభుత్వ ఇస్తే.. ఖర్చు తీర్చే దారి దొరుకుతుందని లబ్ధిదారులు అంటున్నారు. త్వరగా ఇవ్వాలని కోరుతున్నారు. ఈ ఏడాది దిగుబడి అంతంతే.. దళితబస్తీ పథకం కింద పంపిణీ చేసిన భూ ముల్లో ఈ యేడాది దిగుబడి అంతంత మాత్రం గానే వచ్చింది. సోయా పంటను ప్రభుత్వం ప్రోత్సహించడంతో ఎక్కువ మొత్తంలో సోయా వేసుకున్నప్పటికీ కురిసిన వర్షాలతో నష్టం వాటిల్లింది. ఇక, పత్తి పంట వేసుకున్న లబ్ధిదారులకు ఎకరాకు 4–5 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఇలా వచ్చిన దిగుబడి పంట ఖర్చులకు కూడా సరిపోవడం లేదు. ఫలితంగా ఇన్ని రోజులు కూలీ చేసుకుంటూ జీవనం కొనసాగించే లబ్ధిదారులు మొదటి ఏడాది పంట సాగు చేయడంతో కూలీ పనులకు వెళ్లేందుకు అస్కారం లేకుండా పోయింది. దీంతో చేతిలో చిల్లిగవ్వ లేకుండా ఉన్నారు. మొదటి ఏడాది పెట్టుబడి ఖర్చు ప్రభుత్వ చెల్లించినట్లయితే సాగు ఖర్చు అప్పు తీర్చడం, రబీ సీజన్లో పంటలు వేసుకునేందుకు వీలుంటుందని లబ్ధిదారులు భావిస్తున్నారు. ప్రభుత్వం ఇకనైనా పెట్టుబడి ఖర్చులు ఇవ్వాలని కోరుతున్నారు. -
10 మంది రైతుల ఆత్మహత్య
గుండెపోటుతో మరో ఇద్దరు మృతి నెట్వర్క్: ప్రకృతి వైపరీత్యం, పంటల సాగు కోసం చేసిన అప్పుల భారం తట్టుకోలేక రైతులు ఆత్మహత్యకు పాల్పడుతున్నారు. తెలంగాణ జిల్లా ల్లో బుధవారం వేర్వేరు చోట్ల 10 మంది రైతులు ఆత్మహత్య చేసుకున్నారు. మరో ఇద్దరు గుండెపోటుకు గురై మృతి చెందారు. మెదక్ జిల్లా చిన్నశంకరంపేట మండలం జంగరాయి గ్రామానికి చెందిన శ్రీనివాస్ (35) రెండు బోర్లు తవ్వించినా చుక్కనీరు రాలేదు. అప్పులు మూడు లక్షకు చేరడంతో.. తీర్చే మార్గంలేక పొలంలోనే చెట్టుకు ఉరేసుకున్నాడు. కోహీర్ మండలం పైడిగుమ్మల్కు చెందిన గంగపురం చిన్న నర్సయ్య (38) బోర్లు వేయడానికి, సాగుకు తెచ్చిన అప్పులు తీర్చలేక చెట్టుకు ఉరివేసుకొన్నాడు. నిజామాబాద్ జిల్లా నవీ పేట మండలం జన్నెపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతు చిన్నగారి నర్సింగరావు(54), ఆదిలాబాద్ జిల్లా జైనూర్ మండలం అడ్డెసారలోని వడ్డరిగూడకు చెందిన జాదవ్ బాలాజీ(50), నల్లగొండ జిల్లా హాలియా మండలం అనుముల గ్రామానికి చెందిన ఒరికొప్పుల అంజయ్య(46), యాచారం గ్రామానికి చెం ది న అనుముల శివ(22), పెద్దవూర ఈదులగూడెంకు చెందిన జోగు శ్రీను(22), మహబూబ్‌నగర్ జిల్లా ఖిల్లాఘనపురం మండలం అప్పారెడ్డిపల్లికి చెందిన గుంపలి చెన్రాయుడు (36), వరంగల్ జిల్లా ఆత్మకూరు మండలం లింగముడుపల్లెకు చెందిన సూరపు విజేందర్(35), ఖిలా వరంగల్ తూర్పుకోటకు చెందిన రైతు బిల్ల శ్రీనివాస్ (50) బలవన్మరణాలకు పాల్పడ్డారు. గుండె ఆగి మరో ఇద్దరు రైతులు.. వరంగల్ జిల్లా చెన్నారావుపేట మండలం లింగ్యాతండాకు చెందిన భూక్య నార్య(52)కు రూ. 4 లక్షల అప్పులయ్యూరుు. అప్పులకుతోడు రెండు రోజుల క్రితం కురిసిన భారీవర్షానికి వుక్కజొన్న నేలవాలడంతో గుండెపోటుకు గురై మృతి చెందాడు. నిజామాబాద్ జిల్లా తాడ్వాయి మండలం భస్వన్న గ్రామానికి చెందిన రైతు కుమ్మరి రాములు (55) అప్పులు తేర్చే దారిలేక మనోవేదనకు గురై గుండెపోటుతో మృతి చెందాడు. -
బిందుసేద్యంతో సాగునీరు ఆదా
యాచారం: నీటి వనరులున్న ప్రతి రైతు బిందుసేద్యం ద్వారా పంటలు సాగు చేసుకోవాలని, తక్కువ నీటి వాడకంతో మూడింతల పంటలు తీయవచ్చని మైక్రో ఇరిగేషన్ జిల్లా అసిస్టెంట్ ప్రాజెక్టు డెరైక్టర్ హరిప్రసాద్‌రెడ్డి సూచించారు. గురువారం మండల పరిధిలోని చౌదర్పల్లిలో బిందుసేద్యం వాడకంపై కాశమల్ల రాములు వ్యవసాయ క్షేత్రంలో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులు కాల్వల ద్వారా నీటిని పారించడం వంటి పద్ధతుల వల్ల నీరు వృథా కావడంతో పాటు తక్కువ పొలంలో పంటలు సాగు చేయడానికి అవకాశం ఉంటుందని అన్నారు. అదే బిందుసేద్యం పద్ధతుల్లో తక్కువ నీటితో మూడింతల పొలంలో పంటలు తీయవచ్చని సూచించారు. ఆధునిక పద్దతుల్లో వ్యవసాయ చేస్తేనే రైతులకు ఆదాయం వస్తుందని ఆయన పేర్కొన్నారు. అర్హులైన రైతులు బిందు సేద్యం కోసం దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. సదస్సు అనంతరం బిందుసేద్యం పరికరాలు సరఫరా చేసే జైన్ కంపెనీ ప్రతినిధులు ఫ్లోరైడ్ వల్ల బిందు పరికరాల్లో చేరే వ్యర్థాన్ని తొలగించే పద్ధతులపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి సందీప్‌కుమార్, ఇబ్రహీంపట్నం డివిజన్ ఉద్యాన శాఖ క్షేత్రస్థాయి అధికారి యాదగిరి, ఇబ్రహీంపట్నం డివిజన్ మైక్రో ఇరిగేషన్ రాజేష్‌కుమార్, సర్పంచ్ గౌర నర్సింహ, ఎంపీటీసీ సభ్యుడు కృష్ణమూర్తి, ఉప సర్పంచ్ శ్రీధర్‌గౌడ్, రైతులు శ్రీకాంత్‌రెడ్డి, విష్ణు, బుగ్గరాములు పాల్గొన్నారు. -
సేంద్రియ ఎరువులతో సత్ఫలితాలు
సేంద్రియ ఎరువుల్లో ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, దశపత్రి ఎరువులను సుద్దాల రైతులు తయారు చేసి పంటల సాగులో వినియోగిస్తున్నారు. ఘన జీవామృతం ఎరువు ద్వారా భూసారం పెరుగుతుంది. ఘన జీవామృతం తయారు చేయడానికి పది కిలోల ఆవు పేడ, కిలో బెల్లం, ఏదైనా పప్పుధాన్యాల పిండి కిలో, 10 లీటర్ల ఆవు మూత్రం కలిపి ఒక డ్రమ్ములో వేసుకొని 48 గంటలపాటు ఉంచాలి. ఆ తర్వాత తయారైన ఘన జీవామృతం ఎరువు ఎకరానికి సరిపోతుంది. ఈ ఎరువును దుక్కి దున్నాక మాత్రమే చల్లుకోవాలి. ఇలా చేస్తే భూసారం పెరగడమే కాకుండా శత్రు పురుగులు నశించి, మిత్ర పురుగులు పెరుగుతాయి. పంట దిగుబడీ పెరుగుతుంది. ద్రవ జీవామృతం పంటలు వేసి మొలకలు వచ్చాక ద్రవ జీవామృతం ఎరువు చల్లుకోవాలి. పది కిలోల ఆవు పేడ, కిలో బెల్లం, ఏదైనా పప్పుధాన్యాల పిండి కిలో, 10 లీటర్ల ఆవు మూత్రం, గుప్పెడు పుట్ట మట్టి లేదా చెట్టు కింది మట్టిని తీసుకొని డ్రమ్ములో వేసుకోవాలి. అందులో 200 లీటర్ల నీటిని పోసి ఉదయం, సాయంత్రం కలియబెట్టాలి. 48 గంటల తర్వాత ఎకరానికి సరిపడా ద్రవజీవామృతం తయారు అవుతుంది. ఇలా తయారైన ద్రవజీవామృతాన్ని పంటలకు నీరందించే కాలువల్లో వేయాలి. ఇలా చేస్తే ఎరువు మొక్కల వేర్లకు పట్టుకొని బలంగా తయారవుతాయి. ఇలా 15 రోజులకోసారి చల్లుకుంటే పంటలకు చీడ, పీడలు ఆశించవు. దశపత్రి.. దశపత్రి ఎరువు తయారు చేయడానికి పది రకాల ఆకులు అవసరం. ఒక్కో రకం ఆకులు 2 కిలోలు.. ఇలా పది రకాల ఆకులు 20 కిలోలు తీసుకొని ఒక డ్రమ్ములో ఉంచాలి. ఆ డ్రమ్ములో 200 లీటర్ల నీళ్లు, 25 లీటర్ల ఆవు మూత్రం, రెండు కిలోల ఆవు పేడ వేసి నలభై రోజులపాటు ఉంచాలి. ఆ తర్వాత తయారైన ఎరువు 30 ఎకరాలకు సరిపోతుంది. దీనిని పంటలపై పిచికారీ చేసుకోవచ్చు. దశపత్రి ఎరువును వినియోగించడం ద్వారా పంటలకు తెగుళ్లు ఆశించకుండా కాపాడుతుంది. ఉత్తమ దిగబడులూ సాధించొచ్చు. దశపత్రి ఎరువును నెల రోజులకోసారి పంటలపై పిచికారీ చేయాలి. ఈ మూడు ఎరువులను సుద్దాలకు చెందిన సుమారు 10 మంది రైతులు చేల వద్ద తయారు చేస్తూ పంటలకు వినియోగిస్తున్నారు. ఈ ఎరువుల ద్వారా రసాయనిక ఎరువుల వాడకం తగ్గిపోవడమే కాకుండా అధిక దిగుబడులూ పొందుతున్నామని వారంతా చెబుతున్నారు. -
‘సేంద్రియం’ వైపు చూపు..
‘‘సాధారణంగా పంటల సాగులో రైతులు రసాయన ఎరువులను ఎక్కువగా ఉపయోగిస్తారు. అయితే ఈ ఎరువుల ప్రభావం ఆయా పంటలపై ఉంటోంది. రసాయన ఎరువుల ప్రభావంతో భూమిలో సారం తగ్గిపోతుందని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండిస్తే భూసా రం పెరుగుతుందని, అలా పండించిన పంట లు ఆరోగ్యానికీ మంచివని పేర్కొంటున్నారు. నేను సేంద్రియ పద్ధతుల్లో పంటలు పండించాలని నిర్ణయించుకున్నాను. ఏడాది క్రితమే ఈ నిర్ణయానికి వచ్చాను. రుద్రూర్‌లోని కృషి విజ్ఞా న కేంద్రం శాస్త్రవేత్తల సలహాలు తీసుకున్నాను. అంబం(ఆర్) రోడ్డు సమీపంలో ఎకరం 30 గుంటల భూమి ఉంది. ఆ భూమిలో ప్రయోగాత్మకంగా కూరగాయల సాగు ప్రారంభించాను. ఆరు నెలల క్రితం సొంతంగా అభ్యుదయ సేంద్రియ వ్యవసాయ క్షేత్రం ఏర్పాటు చేశాను. వంకాయ, బీరకాయ, బెండకాయ, టమాట, చెర్రి టమాట, కీరదోస, కాకర, సోరకాయ పండిస్తున్నాను. కూరగాయలను అరకిలో, కిలో చొప్పున ప్యాక్ చేసి విక్రయిస్తున్నాను. ఎందరు వారించినా.. సేంద్రియ పద్ధతిలో కూరగాయలు పండిస్తాననగానే తెలిసిన వారు వారించారు. ఖర్చుతో కూడుకున్న వ్యవహారమన్నారు. కూరగాయలను ఎక్కువ ధరకు అమ్మాల్సి వస్తుందని, నష్టపోతావని పేర్కొన్నారు. అయినా నేను వెనుకంజ వేయలేదు. లాభమైనా.. నష్టమైనా.. అనుభవించాలని నిర్ణయించుకుని ముందుకే సాగాను. మా నాన్న రాజారాం మాజీ వైస్ ఎంపీపీ. ఆయనను ఒప్పించి సేంద్రియ పద్ధతు ల్లో కూరగాయల సాగు మొద లు పెట్టాను. పొలంలో బిందు సేద్యం పరికరాలను ఏర్పాటు చేశాను. మల్చింగ్ పద్ధతిని అవలంబిస్తున్నాను. డ్రిప్ కోసం ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ అందించింది. రూ. 12 వేలు ఖర్చయ్యాయి. మిత్రులు చెప్పినట్లుగానే పెట్టుబడి ఖర్చు ఎక్కువైంది. సాధారణ పద్ధతులకంటే దిగుబడి కూడా తక్కువగానే వస్తోంది. దీంతో మార్కెట్ రేటు కంటే ఎక్కువ ధరకు కూరగాయలు అమ్మా ల్సి వస్తోంది. సాధార ణ పద్ధతుల్లో పండించి న కూరగాయలకంటే కిలోకు రూ. 10 నుంచి రూ. 15 ఎక్కువ ధర తీసుకుంటున్నాను. మొదట్లో ఎక్కువ ధర చెల్లించడానికి ప్ర జలు వెనుకంజ వేశారు. అయితే ఇప్పు డు ఆ సమస్య లేదు. ఆరోగ్యానికి ప్రాధాన్య త ఇచ్చేవారు సేంద్రి య పద్ధతుల్లో సాగు చేసిన కూరగాయలు కొనుగోలు చేస్తుండడంతో డిమాండ్ బాగానే ఉంది. ధర ఎక్కువైనా.. కొనుగోలు చేస్తున్నారు. మార్కెటింగ్.. వ్యవసాయ క్షేత్రం వద్దే కాకుండా సమీప గ్రామాల్లో జరిగే సంతలకు కూరగాయలను తీసుకెళ్లి విక్రయిస్తున్నాను. డిమాండ్ బాగానే ఉంది. బోధన్ పట్టణానికి చెందిన కొందరు వైద్యులు ఇక్కడి నుంచి కూరగాయలను తీసుకెళ్తున్నారు. చాలా మంది రెగ్యులర్‌గా మా వద్దే కూరగాయలు కొనుగోలు చేస్తున్నారు. చెర్రి టమాట ధర కిలో రూ. 60, కీరదోస కిలో రూ. 40గా నిర్ణయించాను. ఏడాది వరకు ధరలో మార్పుండదు. ఇతర కూరగాయలను మార్కెట్ ధర కంటే 10 నుంచి 15 శాతం ఎక్కువ ధరకు విక్రయిస్తున్నాను. నెలకు రూ. 25 వేలనుంచి రూ. 30 వేల ఆదాయం వస్తోంది. సేంద్రియ పద్ధతుల్లో పంటల సాగును ప్రోత్సహించడమే నా ధ్యేయం. పలువురు రైతులు ఈ పద్ధతిలో కూరగాయల సాగుకు ముందుకు వస్తున్నాను. త్వరలో నా మిత్రులు మూడెకరాల్లో సేంద్రియ పద్ధతుల్లో పంటలు సాగు చేయనున్నారు’’ అని రామరాజు వివరించారు. -
బిందువే బంధువు
కామారెడ్డి : మాచారెడ్డి మండలం వాడికి చెందిన యువరైతు కుంట భాస్కర్‌రెడ్డికి వ్యవసాయం అంటే మక్కువ. ఆయనకు ఏడున్నర ఎకరాల సాగు భూమి ఉంది. బిందు సేద్యం పద్ధతిలో తక్కువ ఖర్చుతో పంటలు సాగు చేయవచ్చని, ఎక్కువ దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ అధికారుల ద్వారా తెలుసుకున్నాడు. తన పొలంలో రెండు డ్రిప్ యూనిట్లు ఏర్పాటు చేసుకున్నాడు. ఒక్కో యూనిట్ ధర లక్ష రూపాయలు. అయితే ప్రభుత్వం 90 శాతం సబ్సిడీ అందించింది. రెండు యూనిట్లకు కలిపి రైతుకు రూ. 20 వేలు ఖర్చయ్యాయి. ఈ డ్రిప్ యూనిట్లు పదేళ్లవరకు పనిచేస్తాయి. తనకున్న ఏడున్నర ఎకరాల భూమితోపాటు పక్కనే ఉన్న మరో ఎకరం భూమిని కౌలుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నాడు. ఐదున్నర ఎకరాల్లో చెరుకు, మూడెకరాల్లో వరి సాగు చేస్తున్నాడు. పంట సాగుపై ఆయన మాటల్లోనే.. ‘‘అందరిలెక్క కాకుండా ఆధునిక పద్ధతుల్లో పంట సాగు చేయాలనుకున్న. గాయత్రీ షుగర్ ఫ్యాక్టరీ అధికారుల సలహాలు తీసుకున్న. పోయిన ఏడాది డిసెంబర్లో ఐదున్నర ఎకరాల భూమిని దున్ని ఐదు అడుగులకో గెరకొట్టిన. చెరుకు గడలను పరిసి మట్టిని నింపేసిన. డ్రిప్ పైపుల ద్వారా చెరుకు గడలకు నీరు పారిస్తున్న. వారానికోసారి డ్రిప్ ద్వారా యూరియా, క్లోరోఫైరిఫాస్ మందులను పంపిస్తున్న. ఒకసారి పొటాష్ కూడా డ్రిప్ ద్వారానే చెరుకు పంటకు వేసిన. ఇప్పటి వరకు నాలుగు బస్తాల యూరియా, మూడు బస్తాల పొటాష్ వేసిన. బొట్టుబొట్టు చెరుకుకు చేరడం వల్ల పంట ఏపుగా పెరుగుతోంది. రోజూ చెరుకు పంట వద్దకు వెళ్లి చూసుకుంటూ ఉంట. ఇప్పుడు నాకన్నా ఎత్తుగా పంట పెరిగింది. మంచి దిగుబడులు వస్తాయనుకుంటున్న’’ అని వివరించాడు రైతు భాస్కర్‌రెడ్డి. సాధారణంగా చెరుకు 35 నుంచి 40 టన్నుల దిగుబడి వస్తుందని, కానీ డ్రిప్ పద్ధతిలో సాగు చేసిన తన భూమిలో 50 నుంచి 55 టన్నుల దిగుబడి వస్తుందని భావిస్తున్నానని పేర్కొన్నారు. ఇప్పటివరకు సాగు ఖర్చులు దుక్కి దున్నడం, మట్టిపెళ్లలను పగులగొట్టడానికి రూ. 25 వేలు చెరుకు నాటడానికి రూ. 8 వేలు ఎరువులకు రూ. 10 వేలు ఇతర ఖర్చులు రూ. 20 వేలు 10 టన్నుల విత్తనానికి రూ. 26 వేలు రాబోయే రోజుల్లో ఎరువులకు మరో రూ. 10 వేలు ఖర్చు కావచ్చని రైతు భాస్కరరెడ్డి పేర్కొంటున్నారు. చెరుకు నరకడానికి, ఫ్యాక్టరీకి తరలించడానికి టన్నుకు రూ. 600 చొప్పున ఖర్చవుతాయని తెలిపారు. ఎకరానికి కనీసం 50 టన్నుల దిగుబడి వస్తుందని ధీమాతో ఉన్నానన్నారు. గత సీజన్లో ఫ్యాక్టరీ టన్ను చెరుకుకు రూ. 2,600 చెల్లించిందని, ఈ లెక్కన పెట్టుబడి ఖర్చులుపోను రూ. 4 లక్షల వరకు మిగులుతాయన్న ఆశాభావాన్ని వ్యక్తం చేస్తున్నారు.