సేంద్రియ ఎరువుల్లో ఘన జీవామృతం, ద్రవ జీవామృతం, దశపత్రి ఎరువులను సుద్దాల రైతులు తయారు చేసి పంటల సాగులో వినియోగిస్తున్నారు. ఘన జీవామృతం ఎరువు ద్వారా భూసారం పెరుగుతుంది. ఘన జీవామృతం తయారు చేయడానికి పది కిలోల ఆవు పేడ, కిలో బెల్లం, ఏదైనా పప్పుధాన్యాల పిండి కిలో, 10 లీటర్ల ఆవు మూత్రం కలిపి ఒక డ్రమ్ములో వేసుకొని 48 గంటలపాటు ఉంచాలి.
ఆ తర్వాత తయారైన ఘన జీవామృతం ఎరువు ఎకరానికి సరిపోతుంది. ఈ ఎరువును దుక్కి దున్నాక మాత్రమే చల్లుకోవాలి. ఇలా చేస్తే భూసారం పెరగడమే కాకుండా శత్రు పురుగులు నశించి, మిత్ర పురుగులు పెరుగుతాయి. పంట దిగుబడీ పెరుగుతుంది.
ద్రవ జీవామృతం
పంటలు వేసి మొలకలు వచ్చాక ద్రవ జీవామృతం ఎరువు చల్లుకోవాలి. పది కిలోల ఆవు పేడ, కిలో బెల్లం, ఏదైనా పప్పుధాన్యాల పిండి కిలో, 10 లీటర్ల ఆవు మూత్రం, గుప్పెడు పుట్ట మట్టి లేదా చెట్టు కింది మట్టిని తీసుకొని డ్రమ్ములో వేసుకోవాలి. అందులో 200 లీటర్ల నీటిని పోసి ఉదయం, సాయంత్రం కలియబెట్టాలి. 48 గంటల తర్వాత ఎకరానికి సరిపడా ద్రవజీవామృతం తయారు అవుతుంది. ఇలా తయారైన ద్రవజీవామృతాన్ని పంటలకు నీరందించే కాలువల్లో వేయాలి. ఇలా చేస్తే ఎరువు మొక్కల వేర్లకు పట్టుకొని బలంగా తయారవుతాయి. ఇలా 15 రోజులకోసారి చల్లుకుంటే పంటలకు చీడ, పీడలు ఆశించవు.
దశపత్రి..
దశపత్రి ఎరువు తయారు చేయడానికి పది రకాల ఆకులు అవసరం. ఒక్కో రకం ఆకులు 2 కిలోలు.. ఇలా పది రకాల ఆకులు 20 కిలోలు తీసుకొని ఒక డ్రమ్ములో ఉంచాలి. ఆ డ్రమ్ములో 200 లీటర్ల నీళ్లు, 25 లీటర్ల ఆవు మూత్రం, రెండు కిలోల ఆవు పేడ వేసి నలభై రోజులపాటు ఉంచాలి. ఆ తర్వాత తయారైన ఎరువు 30 ఎకరాలకు సరిపోతుంది. దీనిని పంటలపై పిచికారీ చేసుకోవచ్చు. దశపత్రి ఎరువును వినియోగించడం ద్వారా పంటలకు తెగుళ్లు ఆశించకుండా కాపాడుతుంది. ఉత్తమ దిగబడులూ సాధించొచ్చు.
దశపత్రి ఎరువును నెల రోజులకోసారి పంటలపై పిచికారీ చేయాలి. ఈ మూడు ఎరువులను సుద్దాలకు చెందిన సుమారు 10 మంది రైతులు చేల వద్ద తయారు చేస్తూ పంటలకు వినియోగిస్తున్నారు. ఈ ఎరువుల ద్వారా రసాయనిక ఎరువుల వాడకం తగ్గిపోవడమే కాకుండా అధిక దిగుబడులూ పొందుతున్నామని వారంతా చెబుతున్నారు.
సేంద్రియ ఎరువులతో సత్ఫలితాలు
Published Mon, Oct 6 2014 2:02 AM | Last Updated on Sat, Sep 2 2017 2:23 PM
Advertisement