జోగిపేట: సేంద్రియ ఎరువులతోనే మంచి ఫలితాలు ఉంటాయని సెర్ప్ నాన్ పెస్టిసైడ్స్ మేనేజ్‌మెంట్ (ఎన్‌పీఎం) రాష్ట్ర డెరైక్టర్ డి.వి.నాయుడు అన్నారు. గురువారం అందోలు మండలం పరిధిలోని నాదులాపూర్, నేరడిగుంట గ్రామాల్లో పర్యటించారు. ఈ ఎరువుల వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు వస్తాయని తెలిపారు. సేంద్రియ ఎరువులు వాడుతూ పంటలను సాగు చేస్తున్న రైతులతో మాట్లాడి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు.
రసాయన ఎరువులు వాడకుండా పంటలు సాగు చేస్తున్న నాదులాపూర్ గ్రామానికి చెందిన రైతు కిష్టయ్య పొలాన్ని సందర్శించారు. ఆయన పండిస్తున్న పాలకూర, కొత్తిమీర, బీర తదితర పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతు తయారు చేసుకున్న అజోలాను పరిశీలించారు. గ్రామ శివారులో ఏర్పాటు చేసిన నాడెపు కంపోస్టును పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఎలాంటి ఫెర్టిలైజర్ వాడకుండా దీన్ని ఉపయోగించుకోవచ్చునన్నారు. డీపీఎం వాసుదేవ్, ఏపీఎం సీఎంఎస్‌ఏ సంగీత, ఏపీఎం విశ్వేశ్వర్‌గౌడ్, సీఏ చెన్నయ్య, సీఆర్‌పీ రమేశ్, జడ్పీటీసీ సభ్యురాలు శ్యామమ్మ భూమయ్య, వైస్ ఎంపీపీ రమేష్ , సర్పంచ్ నర్సింలు, ఎంపీటీసీ సభ్యురాలు నల్లోల బాలమ్మ తదితరులు ఆయన వెంట ఉన్నారు.
సేంద్రియ ఎరువులతో మంచి దిగుబడులు
Published Thu, Nov 13 2014 11:41 PM | Last Updated on Sat, Sep 2 2017 4:24 PM
Advertisement
Advertisement