Good yields
-
నేలతల్లిని బీడువారిస్తే తర్వాతేమి తింటాం?’
► 9 ఏళ్లుగా ప్రకృతి సేద్యంలో రాణిస్తున్న మహిళా రైతు మల్లీశ్వరి ► జీవామృతం, గో మూత్రం అందిస్తూ అరటి, చెరకు, పసుపు, మినుము పంటల సాగులో మంచి దిగుబడులు ► చీడపీడలు, తెగుళ్ల బెడద లేకుండా రుచికరమైన, నాణ్యమైన వ్యవసాయోత్పత్తులు కృష్ణా తీరంలో సారవంతమైన భూముల్లో ప్రకృతి వ్యవసాయం ఫలప్రదమవుతోంది. వ్యవసాయాన్నే నమ్ముకున్న చిన్న, సన్నకారు రైతులు నేలతల్లికి ప్రణమిల్లుతున్నారు. పాలేకర్ పద్ధతిలో సేద్యం చేస్తూ నాణ్యమైన పంటలను పండిస్తున్నారు. 9 ఏళ్ల క్రితం నుంచే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న కొద్ది మంది తొలి తరం ప్రకృతి వ్యవసాయదారుల్లో అన్నపురెడ్డి మల్లీశ్వరి ఒకరు. తన భర్త సంజీవరెడ్డితో కలిసి రోజుకు పది గంటల పాటు పొలంలో శ్రమిస్తూ ఆదర్శప్రాయంగా ప్రకృతిసేద్యం చేస్తూ.. సత్ఫలితాలు పొందుతున్నారు. ‘2008లో విజయవాడ పోరంకిలో సుభాష్ పాలేకర్ మీటింగ్‌కు మొదటిసారి వెళ్లాం. ప్రకృతి సేద్యం గురించి పాలేకర్ చాలా సంగతులు చెప్పారు. 2010లో పాలేకర్ గుంటూరు వచ్చినపుడు కూడా వెళ్లాను. రసాయనాలు, క్రిమిసంహారక మందులతో నేల ఎంత నిస్సారమవుతున్నదో పూసగుచ్చినట్టు చెబుతుంటే మనసు కదిలిపోయింది. ‘నేలను నమ్ముకుని బతికేవాళ్లం నేలతల్లిని బీడువారిస్తే తర్వాత ఏం తింటాం?’ అనిపించింది. ఏమైనా సరే ఇలాగే పండించాలనుకున్నాం...వెంటనే ఒక ఆవును కొని, మొదలుపెట్టాం’ అని మల్లీశ్వరి గుర్తుచేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి ఆమె స్వగ్రామం. తొలినాళ్లలో ఘన జీవామృతం, జీవామృతం, వివిధ రకాల కషాయాలు వాడారు. నాలుగేళ్ల క్రితం నుంచి కేవలం గోమూత్రం, జీవామృతం తోనే మంచి దిగుబడులు సాధిస్తున్నారు. 20 రోజులకోసారి జీవామృతం.. 10 రోజులకోసారి గోమూత్రం.. ఆరు ఎకరాల నల్లరేగడి భూమిలో అరటితోపాటు చెరకు, పసుపు పంటలను మల్లీశ్వరి సాగు చేస్తున్నారు. బోరు నీళ్లను డ్రిప్పు ద్వారా పంటలకు అందిస్తున్నారు. పంట ఏదైనా వారు అనుసరించే సాగు విధానం మాత్రం ఒక్కటే. ముందుగా దుక్కిలో ఎకరాకు 2 ట్రక్కుల కోళ్ల ఎరువు వేస్తారు. ఎకరాకు 200 లీటర్ల జీవామృతాన్ని ప్రతి 20 రోజులకోసారి.. 10 రోజులకోసారి గోమూత్రాన్ని డ్రిప్పు ద్వారా పంటలకు అందిస్తారు. కలుపు నివారణకు, భూసారం పెంపొందించడానికి గడ్డీ గాదం, పంట వ్యర్థాలను ఆచ్ఛాదనగా వేస్తూ.. మంచి దిగుబడులు సాధిస్తున్నారు. రెండు ఆవులను పెంచుతున్నారు. ఆవుల పాకలో గోమూత్రం నిల్వ చేసేందుకు గుంత తవ్వి 3 సిమెంట్ వరలు ఏర్పాటు చేశారు. దాని అడుగున గులకరాళ్లు, బేబీ చిప్స్, ఇసుక మిశ్రమాన్ని వేశారు. ఈ గుంతలోకి 10 రోజులకోసారి 30 లీటర్ల గోమూత్రం చేరుతుంది. ఈ మూత్రాన్ని బకెట్లతో సేకరించి వడకట్టి, డ్రిప్ ట్యాంకులో పోసి, పంటలకు అందిస్తారు. 20 అడుగులు పెరిగిన అరటి చెట్లు.. 2008లో తొలిసారిగా అరటిని ప్రకృతిసేద్య పద్ధతిలో సాగు చేశారు. ఎకరాకు వెయ్యి మొక్కలు నాటారు. జనవరి–ఫిబ్రవరి మాసాల్లో కోతలయ్యాయి. చక్కెరకేళి రకంలో గెలకు 70 కాయలు.. కర్పూర అరటి చెట్లు దాదాపు 20 అడుగుల ఎత్తు పెరగటం విశేషం. గెలకు 200 కాయలతో ఒక్కో గెల 45 కిలోల వరకూ బరువు తూగుతోంది. రసాయన ఎరువులతో సాగు చేసిన అరటి కాయల కన్నా.. ఇవి అధికంగా పొడవు పెరిగి, మంచి రంగుతో ఆకర్షణీయంగా, రుచిగా ఉన్నాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయి. దీంతో వ్యాపారస్తులు ఈ అరటికాయలపై ఆసక్తి చూపుతున్నారు. వీరి పసుపు పొలంలో పుచ్చు సమస్య లేదు. దుంప బాగా ఊరి ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఒకటిన్నర ఎకరాలో చెరకును సాగు చేస్తున్నారు. గత రబీలో మల్లీశ్వరి ఎకరాకు 5 క్వింటాళ్ల మినుము దిగుబడి సాధించి.. ఔరా అనిపించారు. – బి.ఎల్.నారాయణ, సాక్షి, తెనాలి, గుంటూరు జిల్లా ఇంతకంటే భరోసా ఏముంటుంది? ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గాయి. తోటి రైతులు ఎకరా భూమిలో సేద్యానికి ఏటా 10 పిండి కట్టలు (డీఏపీ, యూరియా, పొటాష్..) వేస్తున్నారు. సగటున ఒక పంటకు ఎకరాకు రూ.7–8 వేలు ఖర్చవుతోంది. పురుగుమందుల ఖర్చు అదనం. ఈ ఖర్చులు లేకుండానే ప్రకృతి సేద్యం చేస్తున్నాం. జీవామృతం, ఘనజీవామృతం సొంతంగా తయారుచేసుకోవటానికి కాస్త శ్రమ పడుతున్నప్పటికీ.. సంతృప్తి ఉంది. పండ్లు నాణ్యంగా, రుచికరంగా ఉంటున్నాయి. మంచి ధర పలుకుతోంది. ఆరోగ్యానికి, ఆదాయానికీ ఇంతకంటే భరోసా ఏముంటుంది? నాకు మందుబిళ్లలతో అవసరమే రాలేదంటే ప్రకృతి ఆహారాన్ని తినటమే కారణం. – అన్నపురెడ్డి మల్లీశ్వరి, మహిళా రైతు, నూతక్కి, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా వాతావరణం ఎలా ఉన్నప్పటికీ నిలకడగా పంట దిగుబడులు! మల్లీశ్వరి రోజుకు 10 గంటలు పొలంలోనే ఉండి అన్ని పనులూ స్వయంగా చూసుకుంటుంది. 9 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నందువల్ల మా భూమి బాగుపడింది. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పంట దిగుబడులు నిలకడగా వస్తున్నాయి. పంట నాణ్యత బావుంది. సాగు ఖర్చులు బాగా తగ్గాయి. మమ్మల్ని చూసి మా ఊళ్లో కొంతమంది రైతులు ప్రకృతి సేద్యంపై ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతున్నారు. – అన్నపురెడ్డి సంజీవరెడ్డి (99510 60379), నూతక్కి, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా -
ఆకుపచ్చని వాస్తవం..ప్రకృతి సేద్య జగత్తు!
నిరాశా నిస్పృహలు అలముకున్న రైతు జీవితానికి ఆశాదీపం ప్రకృతి సేద్యమని నిరూపిస్తున్నారు యువ రైతు జగదీశ్‌రెడ్డి. డబ్బు ధారపోసి రసాయనిక సేద్యం చేసి నష్టపోయిన చోటే.. ప్రకృతి సేద్యంలో విజయపతాక ఎగరేస్తున్నారు. అంతేకాదు.. ప్రకృతి వ్యవసాయోత్పత్తుల్లో అధిక పోషక విలువలు ఉంటాయని అనేక వేదికల్లో ఎలుగెత్తి చాటుతున్నారు. సాటి రైతులను, సాగుపై ఆసక్తి ఉన్న సాఫ్ట్వేర్ ఉద్యోగులనూ ఆ దిశగా ప్రోత్సహిస్తున్నారు. వరి, మామిడి, వేరుశనగ సాగులో రాణిస్తున్న చిత్తూరు జిల్లా రైతుప్రకృతి సేద్యంలో వరి సాగుతో ఎకరాకు రూ. 80 వేల నికరాదాయం మామిడిలో పెరిగిన పంటకాలం వేరుశనగ పండించి..గానుగ నూనె విక్రయిస్తూ అధిక ఆదాయార్జన ఉన్న కొద్దిపాటి బావి నీటినే పొదుపుగా వాడుకుంటూ 30 ఎకరాల్లో వరి, వేరుశనగ, మామిడి పంటలను పెట్టుబడి లేని ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు ఎనమల జగదీశ్ రెడ్డి. గిర్ ఆవులు, కుందేళ్లు, పెరటి కోళ్లను కూడా పెంచుతున్నారు. చిత్తూరు జిల్లా బంగారుపాళ్యం మండలం దండువారిపాళ్యం ఆయన స్వగ్రామం. 2012లో తిరుపతిలో పెట్టుబడి లేని ప్రకృతిసేద్యం పితామహుడు సుభాష్ పాలేకర్ శిక్షణా శిబిరానికి హాజరైనప్పటి నుంచి జగదీశ్‌రెడ్డి ప్రకృతి సేద్యం చేస్తున్నారు. పాలేకర్ శిక్షణ ఆయన సేద్య జీవితంలో గుణాత్మక మార్పునకు దోహదపడింది. తొలి పంటలో 25 బస్తాల ధాన్యం దిగుబడి జగదీశ్‌రెడ్డి పొలంలో వరి దిగుబడి ప్రకృతి వ్యవసాయం ప్రారంభించిన తొలి ఏడాది ఎకరాకు 25 బస్తాలు పండింది. ప్రస్తుతం 30కు పెరిగింది. ప్రస్తుతం ఐదెకరాల్లో అమన్ రకం వరిని సాగు చేస్తున్నారు. ముందుగా జనుము, జీలుగ వంటి పచ్చిరొట్ట పైర్ల గింజలు చల్లి.. నెల రోజులకు దమ్ములో కలియదున్నుతారు. విత్తనాన్ని బీజామృతంతో శుద్ధిచేస్తారు. సాళ్ల పద్ధతిలో నాట్లు వేస్తారు. కలుపును నివారించేందుకు సాళ్ల మధ్యలో కోనోవీడర్‌తో రెండు సార్లు దున్నుతారు. నెలకోసారి ఎకరాకు 200 లీటర్ల జీవామృతం నీటి ద్వారా అందించటంతో పాటు పైరుపై పిచికారీ చేస్తారు. నెలకోసారి నీమాస్త్రం పిచికారీ చేస్తారు. పంటను ఎలాంటి చీడపీడలు, తెగుళ్లు ఆశించకపోతే ఇతర కషాయాలు వాడాల్సిన అవసరం రాలేదని జగదీశ్ రెడ్డి చెప్పారు. ఎకరాకు రూ. 80 వేల నికరాదాయం! ధాన్యాన్ని నేరుగా విక్రయించకుండా బియ్యంగా మార్చి జగదీశ్‌రెడ్డి విక్రయిస్తున్నారు. రసాయన సేద్యంలో సాగు చేసిన ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే క్వింటాకు 60 కిలోల బియ్యం వస్తుండగా.. తన ధాన్యానికి క్వింటాకు 80–85 కిలోల బియ్యం వస్తున్నాయని ఆయన చెప్పారు. ఎకరాలో ధాన్యాన్ని మిల్లింగ్ చేస్తే 16 క్వింటాళ్లకు పైగా బియ్యం దిగుబడి వస్తోందన్నారు. కిలో బియ్యాన్ని రూ. 55–70 చొప్పున సేంద్రియ ఉత్పత్తులు విక్రయించే షాపులు, ఉద్యోగులకు విక్రయిస్తున్నారు. ఎకరాకు రూ. 90 వేల వరకు ఆదాయం లభిస్తోంది. దమ్ము, నాట్లు, కూలీలకు, ఎకరా వరి సాగుకు రూ. 10 వేల వరకు ఖర్చవుతోంది. ఎకరాకు రూ. 80 వేల నికరాదాయం రైతుకు లభిస్తోంది. తమ ప్రాంతంలో రసాయన సేద్యం చేసిన రైతు ధాన్యాన్ని విక్రయిస్తే ఎకరాకు రూ. 45 వేలకు మించి ఆదాయం రావటంలేదన్నారు. వేరుశనగ నూనె విక్రయం... ఐదెకరాల్లో వేరుశనగను సాగు చేస్తున్నారు. నెలకోసారి జీవామృతం, నీమాస్త్రాలను పిచికారీ చేయటంతో పాటు సాగు నీటి ద్వారా అందిస్తారు. గింజ నాణ్యంగా ఉండి కాయలు తూకానికి వస్తున్నాయి. జగదీశ్‌రెడ్డి తాను పండించిన వేరుశనగ గింజల నుంచి నూనె తీసి విక్రయిస్తున్నారు. 20 కిలోల గింజలను గానుగ ఆడిస్తే 8 కిలోల నూనె లభిస్తుంది. నూనె లీటరు రూ. 250 చొప్పున విక్రయిస్తున్నారు. మామిడిలో పెరిగిన పంటకాలం జగదీశ్‌రెడ్డి 20 ఎకరాల్లో మామిడి తోటను సాగు చేస్తున్నారు. పంటకు పోషకాలను అందించేందుకు నెలకోసారి జీవామృతం... చీడపీడల నివారణకు దశపత్ర కషాయం, నీమాస్త్రాలను పిచికారీ చేస్తున్నారు. మామిడిలో సాధారణంగా జూన్ నెలతో కాపు పూర్తవుతుంది. కానీ జగదీశ్‌రెడ్డి మామిడి తోటలో మాత్రం జూన్ నెలమొత్తం కాపు కాయటం విశేషం. ప్రకృతిసేద్యంలో పండించిన బంగినపల్లి రకం కాయలను అమ్ముకోవటంలో ఎలాంటి ఇబ్బందులు ఎదురవటం లేదు కానీ తోతాపురి రకం మామిడి కాయలను విక్రయించటం కష్టమవుతున్నదన్నారు. తోటలో తోతాపురి రకం చెట్లను ఎక్కువగా సాగు చేయటం.. వాటిని మామిడి గుజ్జు పరిశ్రమలో ఉపయోగిస్తున్నారు. దీని వల్ల ప్రకృతిసేద్యంలో పండించినా మార్కెట్లో మాత్రం సాధారణ ధరకే విక్రయించాల్సి రావటంతో తాము నష్టపోతున్నామని దీన్ని నివారించేందుకు కుటీర పరిశ్రమ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రోత్సహించాలని జగదీశ్‌రెడ్డి కోరారు. ప్రకృతి వ్యవసాయం రైతుకు ఆర్థిక భద్రత కల్పించడం గురించి, ఈ ఆహారోత్పత్తుల పోషక విలువలను గురించి తెలియజెప్పేందుకు అటు రైతులు, ఇటు వినియోగదారులకు కూడా ఆయన అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. తన స్వగ్రామంలోని 30 మంది రైతులకు శిక్షణ ఇచ్చి ప్రకృతి సేద్యం చేపట్టే దిశగా ప్రోత్సíß స్తున్నారు. ఈ ఆహారోత్పత్తుల వినియోగంతో కలిగే ప్రయోజనాలపై హైదరాబాద్, బెంగళూరు, చెన్నై, ముంబయి, న్యూఢిల్లీ నగరాల్లో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఆయన కృషికి గుర్తింపుగా నేషనల్ న్యూట్రిషన్ అవార్డు.. ఏసియన్ అగ్రి ఫౌండేషన్ అవార్డులు వరించాయి. - గాండ్లపర్తి భరత్ రెడ్డి, సాక్షి, చిత్తూరు నా కొడుకును రైతుగా చూడాలనుకుంటున్నా! మన సాగు భూమికి మనం ధర్మకర్తలం మాత్రమే. పంటలు సాగు చేసుకొని జీవిస్తూనే.. భూమి సహజత్వాన్ని, సారాన్ని యథాతథంగా భవిష్యత్ తరాలకు అందించాల్సిన బాధ్యత మనదే. ఢిల్లీ తదితర నగరాల్లో పలువురు కేన్సర్ తదితర దీర్ఘ రోగులు నా ఆహారోత్పత్తులు వాడి ఉపశమనం పొందుతున్నారు. ఆరోగ్యకరమైన ప్రకృతి సేద్య ఆహారోత్పత్తులను ప్రజలకు అందిస్తున్నాననే సంతృప్తి ఉంది. నా కొడుకును కూడా ప్రకృతి వ్యవసాయదారుడిగానే చూడాలనుకుంటున్నా. – ఎనమల జగదీశ్‌రెడ్డి (94400 44279), ప్రకృతి వ్యవసాయదారు, దండువారి పాళ్యం,బంగారుపాళ్యం మండలం, చిత్తూరు జిల్లా -
దున్నకుండా ముప్పయ్యేళ్లుగా సేద్యం!
రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా వ్యవసాయం చేస్తున్నారంటే ఇప్పుడెవరూ ఆశ్చర్యపోవడం లేదు. కానీ.. ఎద్దులతోనో, ట్రాక్టరుతోనో దున్నే పనే లేకుండా ప్రకృతి వ్యవసాయం చేయొచ్చంటే.. చెప్పినోడికి వ్యవసాయం తెలియదని నవ్విపోతారు. అయితే, మధ్యప్రదేశ్‌కు చెందిన రైతు రాజు టైటుస్ మాత్రం ఇలాగే వ్యవసాయం చేస్తున్నారు. పొలాన్ని అసలు దున్నకుండా, రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా గత 30 ఏళ్లుగా ఫుకుఓకా బాటలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు. ♦ రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా.. పొలాన్ని దున్నకుండా 30 ఏళ్లుగా సేద్యం చేస్తున్న మధ్యప్రదేశ్ రైతు ♦ జపాన్ ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా సందర్శించిన అద్భుత వ్యవసాయ క్షేత్రం మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌కు చెందిన ‘రాజు టైటుస్’ ప్రభుత్వోద్యోగి. అయినా కుటుంబ వారసత్వంగా వచ్చిన 12 ఎకరాల పొలాన్ని సాగు చేయటం మానలేదు. 70వ దశకంలో అందరిలానే ఆయనా ‘హరిత విప్లవం’ ఒరవడిలో రసాయన ఎరువులు, కీటకనాశనులు వాడటం మొదలుపెట్టారు. మొదట్లో దిగుబడులు పెరిగి ఆదాయం వచ్చినా పదిహేనేళ్లు తిరిగేసరికి పంట భూమి నిస్సారమయింది. దిగుబడులు తగ్గి నష్టాల పాలయ్యి పొలం అమ్మేయాలని నిశ్చయించుకున్నాడు. ఇది జరిగింది 1984లో. రాజు నిర్ణయంతో తల్లి హతాశురాలయింది. గాంధేయవాదులు నడిపే స్వచ్ఛంద సంస్థ ‘ఫ్రెండ్స్ రూరల్ సెంటర్’ కార్యకర్తలతో ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. వారు ఆమె చెప్పినదంతా విని జపాన్ దేశానికి చెందిన ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా రాసిన ‘గడ్డిపరకతో విప్లవం’ (ఒన్ స్ట్రా రివల్యూషన్) పుస్తకాన్ని ఇచ్చి మీ సమస్యకు ఈ పుస్తకం పరిష్కారాన్ని చూపుతుందని చెప్పారు. కలుపు తీయకుండా.. దుక్కిదున్నకుండా.. ఎరువులు వేయకుండా.. పురుగు మందులు పిచికారీ వంటి పద్ధతులు అనుసరించకుండానే పంటలను సాగు చేసే పద్ధతుల గురించి పుకుఒకా ఆ పుస్తకంలో వివరించారు. ఈ పుస్తకాన్ని చదివిన రాజు సాగులో తను అనుసరిస్తున్న పద్ధతులు అనర్థ హేతువులని అర్థం చేసుకున్నారు. అవహేళనలను అధిగమించి.. 15 ఏళ్లుగా రసాయన ఎరువులు వేస్తూ పంటభూమిని ధ్వంసం చేస్తున్నానని అర్థం చేసుకున్న రాజు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాడు. 1985 నుంచి పుకుఒకా చెప్పిన పద్ధతులను అనుసరించి వ్యవసాయం చేయటం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి నేలను దున్నటం, ఎరువులు, పురుగుమందుల వాడకం ఆపేశాడు. రకరకాల గడ్డి, చెట్ల విత్తనాలను పొలంలో వెదజల్లి అవి పెరిగాక కత్తిరించి ఆచ్ఛాదనగా వాడతాడు. దీనివల్ల వర్షపు నీరు బయటకు వెళ్లకుండా పొలంలోనే ఇంకింది. దీనివల్ల మట్టి గుల్లబారటంతో పాటు తేమను పట్టి ఉంచింది. 80వ దశకం చివరికల్లా రసాయన ఎరువుల వాడకం తార స్థాయికి చేరింది. వాటిని వాడకుండా సేద్యం చేయటం అసాధ్యమనే అభిప్రాయం రైతుల్లో బలంగా నాటుకుపోయింది. అట్లాంటి పరిస్థితుల్లో రాజు చేస్తున్న ప్రయత్నం ఆ గ్రామస్తుల మోములపై నవ్వులు పూయించింది. రైతులు కలుపు మొక్కలను పంట మొక్కలకు శతృవులుగా భావించి నిర్మూలిస్తారు. అలాంటిది కలుపు, గడ్డి మొక్కలను పంటలతో పాటు పెంచటమనే విషయం వినగానే పడీపడీ నవ్వేవారు. అవహేళనలే కాదు సాటి రైతుల నుంచి రాజుకు పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎత్తుగా పెరిగిన సుబాబులు చెట్ల నీడ తమ పొలాల మీద పడి పంటలు పండటంలేదని వాటిని నరికివేయాలని పొరుగు రైతులు ఫిర్యాదు చేసేవారు. మరోవైపు రాజు పొలంలో బాగా పెరిగిన గడ్డితో గ్రామస్తుల పశువులు మంచి విందు చేసుకునేవి. పక్క పొలాల్లో రైతులు తగులబెట్టిన పంట వ్యర్థాల నుంచి నిప్పు రాజు పొలంలోకి పాకి గడ్డి తగులబడేది. ఇలాంటి అడ్డంకులను అధిగమించి రాజు ప్రకృతిసేద్యం దిశగా వడివడిగా అడుగులు వేశారు. విత్తన బంతులతో పంటల సాగు! అంకితభావంతో అతను చేసిన కృషి ఫలితాన్నిచ్చింది. 1988 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొనటానికి ఇండియా వచ్చిన ఫుకుఒకా ప్రకృతిసేద్యం చేస్తున్న రాజు గురించి తెలుసుకొని ఆయన పొలాన్ని సందర్శించాడు. ఫుకుఒకా సలహాలు సూచనలను అనుసరించి రెట్టించిన ఉత్సాహంతో రాజు సాగుకు ఉపక్రమించాడు. పుకుఒకా సూచన మేరకు పంటను విత్తుకోవటానికి బదులు.. ఒక పాలు సోయా విత్తనం, ఏడు పాళ్లు మట్టి కలిపి క్రికెట్ బాల్ పరిమాణంలో ఉండే ‘విత్తన బంతుల’ ను తయారు చేశాడు. భార్య శాళిని సహకారంతో.. అడుగుకో బంతి చొప్పున.. పొలంలో వేశాడు. దీనివల్ల మొలకెత్తినప్పటి నుంచే మొక్కలు పోషకాలను, సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహించి ఏపుగా ఎదుగుతాయి. ఆ ఏడాది దిగుబడి బావుండటంతో పాటు నాణ్యమైన పంట వచ్చింది. ఎత్తుగా పెరిగిన గడ్డిని కత్తిరించి భూమిపైన ఆచ్ఛాదన కల్పించారు. దీనివల్ల పంటలకు మేలు చేసే వానపాములు, మిత్రపురుగులు, సూక్ష్మజీవులకు ఆశ్రయం లభిస్తుంది. పంటలకు హానిచేసే శతృ పురుగులను ఇవి నిర్మూలిస్తాయి. దీనివల్ల రసాయనిక ఎరువులు, కీటకనాశనుల అవసరం తప్పుతుంది. ఇవి నేలలో చేసే బొరియల వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. వేర్లు లోతుకంటా చొచ్చుకుపోయి తేమను పోషకాలను గ్రహిస్తాయి. నేల గుల్లబారి భూ సారం పెరిగి మంచి పంట దిగుబడులు వస్తాయి. నేలను దున్నాల్సిన అవసరం లేకపోవటం వల్ల ట్రాక్టరు.. ఎద్దుల కోసం రైతులకు అప్పు చేయాల్సిన అగత్యం తప్పుతుంది.రాజు పొలంలో నత్రజనిని స్థిరీకరించేందుకు సుబాబుల్ చెట్లను సాగు చేస్తున్నాడు. దీనివల్ల యూరియా రూపంలో రసాయన ఎరువును అందించాల్సిన అవసరం ఉండదని ఆయన అంటారు. సుబాబుల్ ఆకులు మేకలకు మంచి మేతగా ఉపయోగపడుతున్నాయి. ఈ చెట్ల కలప, మేకల విక్రయం ద్వారా ఆదాయం లభిస్తోంది. ఇప్పుడాయన వయసు 71. గత 30 ఏళ్లుగా పొలాన్ని దున్నకుండానే సేద్యం చేస్తూ సమృద్ధిగా పంటలు పండిస్తూ దేశవ్యాప్తంగా పేరుపొందారు. దేశ విదేశాల నుంచి వచ్చే వేలాది మంది రైతులకు స్ఫూర్తినిస్తున్న ఈ రాజు నిజంగా ప్రకృతి వ్యవసాయానికి రారాజే! సారవంతమైన పొలమే మూలాధారం వినియోగదారులు కూడా ఆరోగ్యకరమైన ఆహారం కోసం డిమాండ్ చేసినప్పుడే రైతులు రసాయన ఎరువులు వాడటం మానేస్తారు. ఆరోగ్యకరమైన నేల ద్వారానే ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తి సాధ్యమనే విషయాన్ని గుర్తిస్తారు. భారతదేశంలో ప్రజలకు సోకుతున్న పలు జబ్బులకు మూలకారణం ఆహార పంటల సాగులో వాడుతున్న యూరియా. దీనివల్ల తొలుత మధుమేహం సోకి పలు దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తుంది. నాకు పక్షవాతం వచ్చింది. నా భార్య గుండెజబ్బు వ్యాధిగ్రస్తురాలు. అయినా మేం కోలుకోవటానికి ప్రకృతిసేద్య పంట ఉత్పత్తులే కారణం. మా కుటుంబ అవసరాల కోసం ప్రస్తుతం ఎకరా పొలంలో ధాన్యం, పండ్లు, కూరగాయలను సాగు చేస్తున్నాం. ఖరీఫ్‌లో గోధుమ, వరి, మొక్కజొన్న, రబీలో పెసరను సాగు చేస్తున్నాం రోజురోజుకు వ్యవసాయంలో పెరుగుతున్న ఖర్చులే రైతు ఆత్మహత్యలకు కారణం. ఫుకుఒకా విధానంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సేద్యం మూలసూత్రాలను ఒంటబట్టించుకుంటే ఏ రైతైనా పొలాన్ని దున్నకుండానే సేద్యం చేయవచ్చు. – రాజు టైటుస్ (091797 38049), హోషంగాబాద్, మధ్యప్రదేశ్ rajuktitus@gmail.com – దండేల కృష్ణ, సాగుబడి డెస్క్ -
సేంద్రియ సాగు మేలు
ఆదిలాబాద్ అగ్రికల్చర్ : పంట సాగులో రైతులు రసాయన ఎరువులు వాడి లాభాల కంటే నష్టాలే చవిచూస్తున్నారు. అదే సేంద్రియ సాగుపై దృష్టి సారిస్తే మంచి దిగుబడి సాధించవచ్చు. వానపాముల వ్యర్థ పదార్థాలతో వర్మీకంపోస్టు ఎరువు తయారు చేసుకోవచ్చని వ్యవసాయ పరిశోధన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ మోహన్‌దాస్ తెలిపారు. వర్మీకంపోస్టు తయారీ విధానం, వానపాముల అభివృద్ధి గురించి వివరించారు. వర్మీకంపోస్టు తయారీ విధానం కుళ్లిన వ్యవసాయ వ్యర్థాలను ఆహారంగా తీసుకొని వానపాములు వర్మీ కంపోస్టు తయారుచేస్తాయి. కుండీల్లో తయారైన కంపోస్టు సేకరించిన తర్వాత మరోసారి తయారు చేయాలి. అలా చేయాలంటే వానపాములు సమృద్ధిగా ఉండాలి. అనుకూల వాతావరణంలో వానపాములు వేగంగా పెరుగుతాయి. ఎలుకలు, తొండలు కప్పలు, పాములు, పందులు, చీమలు వంటి సహజ శత్రువుల నుంచి రక్షణ ఏర్పాట్లు తప్పని సరి. ఇంకా వానపాములను వేగంగా వృద్ధి చేయాలంటే ‘సీడ్’ తయారీపై దృష్టి పెట్టాలి. వ ర్మీకంపోస్టు తయారీ విధానం సుభమమే అయినా ‘సీడ్’ తయారీ మాత్రం శ్రద్ధతో చేయాల్సిన పని. నాలుగు కుండీల్లో వర్మీకంపోస్టు తయారు చేసే రైతులు వీటిలో కొంత భాగాన్ని సీడ్ తయారీకి వాడుకోవచ్చు. కంపోస్టు తయారీకి కుండీల్లో రెండు, మూడు అంగుళాల మేర ఎండిన డోక్కల, కొబ్బరి పొట్టు లాంటివి వేయాలి. దీనినే వర్మీ బెడ్ అంటాం. సాధారణంగా ఈ వర్మీబెడ్పై కుళ్లిన వ్యర్థాలు, మగ్గిన పేడ లాంటి వాటితో బెడ్ మొత్తం నింపి, గోనెలు కప్పి ప్రతీరోజు క్యాన్‌తో తడిపితే వర్మీకంపోస్టు తయారువుతుంది. దీనిని రెండు రోజులు ఆరబెట్టి (డీ-వాటరింగ్) అపై కంపోస్టు సేకరిస్తాం. ఇలా సేకరించే సమయంలో కంపోస్టుతోపాటుగా వానపాముల గుడ్లు కూడా బయటకు పోతుంటాయి. పరిమితంగానే వానపాములు కుండీల్లో మిగులుతాయి. అయితే ఈ విధానం సీడీ తయారీకి అనుకూలం కాదు. వానపాముల అభివృద్ధి ఇలా.. కుండీల్లో ‘వర్మీబెడ్’ వేసిన తర్వాత ఒక కుండీలో చిన్న భాగంలో ఎండిన పేడ చిన్నచిన్న ఉండలుగా బెడ్‌పై సమానంగా 1/2 అంగుళం ఎత్తున వేయాలి. రోజు క్యాన్‌తో బాగా తడిపి చదరపు మీటర్‌కు కేజీ వానపాముల విత్తనం చల్లాలి. తినే పదార్థం చాలా తక్కువగా ఉండడంతో కేవలం 20 రోజుల్లో వర్మీకంపోస్టు 1/2 అంగుళం ఎత్తున తయారవుతుంది. దీనిని సేకరించరాదు. దీనిపై మరో 1/2 అంగుళం ఎత్తున ఎండిన పేడ పలచగా వేసి తడపాలి. ఈసారి మరో పది రోజులల్లోనే వర్మీ కంపోస్టు తయారవుతుంది. ఇలా ప్రతీ పది రోజులకు 1/2 అంగుళం ఎత్తున పశువుల పేడ వేసి తయాైరె న ఎరువును ఎత్తకుండా ఉంచితే కుండీ పైభాగం వరకు చేరేందుకు సుమారు 70 రోజులు పడుతుంది. దీనిలో సమృద్ధిగా ‘కకూన్స్’ వానపాములు చిన్న పిల్లలు చాలా అధికంగా ఉంటాయి. దీనిని సేకరించి మరో కొత్త ప్రదేశంలో వర్మీ కంపోస్టు తయారీకి వినియోగించుకోవచ్చు. గమనించాల్సిన విషయాలివి.. {పతీ కకూన్కు (గుడ్లు) నాలుగు నుంచి ఆరు వానపాములు వస్తాయి. 90 రోజుల వయస్సు కలిగిన పెద్ద వానపాములు తన క్రైటెల్లం (గుడ్ల శేరు) నుంచి ప్రతి 15 రోజులకోకసారి ఒక కకూన్ విడుదల చేస్తుంది. 90 రోజుల తర్వాత నుంచి రెండేళ్ల వరకు ప్రతీ 15 రోజులకు ఒక కకూన్ చొప్పన సుమారు 168 నుంచి 252 వానపాములు పెరుగుతాయి. వీటిలో ప్రతీ వానపాము 90 రోజుల వయసు వచ్చిన తర్వాత మళ్లీ 168 నుంచి 252 రేట్లు పెరిగేందుకు దోహదపడతాయి. వీటి సంఖ్య అపరిమితంగా పెరిగిపోతుంది. ‘సీడ్’ పెద్దవి కాకుండా వేరే కుండీల్లోకి తరలించాలి. పెద్ద వానపాములు వలస (మైగ్రేషన్) తట్టుకోలేవు. చిన్నచిన్న పాములు, కకూన్స్ వల్ల ఇబ్బంది ఉండదు. వీటిని ప్లాస్టిక్ తొట్టెల్లో కూడా సేకరించి ఇతర ప్రాంతాలకు సైతం రవాణా చేయవవచ్చు. వానపాములు కకూన్స్ బాగా ఫలప్రదం. (హేచింగ్) కావడానికి ప్రతీ 30 రోజులకోసారి పశువుల మూత్రం 1:10 నిష్పత్తిలో నీరు కలిపి బెడ్స్‌పై గోనెలు తడపాలి. నీరు అధికంగా పోయకూడదు. గోనె తట్టును మాత్రమే తడిగా ఉండేటట్టు తడిపితే సరిపోతుంది. ఏడాది పొడుగునా కకూన్స్ ఉన్నా శీతాకాలంలో కకూన్స్ పెట్టేందుకు, అవి హెచ్ అయ్యేందుకు మరింత అనుకూలం. సీడ్ పెంచే కుండీలు ప్రతీ ఆరునెలలకోసారి శుభ్రం చేయాలి. వర్మీబెడ్ను కూడా మార్చి కుండీ రెండు రోజులు డ్రై (ఆరబెట్టాలి) చేయాలి. -
విత్తనమే కీలకం!
సాధారణంగా విత్తనాలు సూటి రకాలు, హైబ్రీడ్ రకాలుగా ఉంటాయి. సూటి రకాలంటే రైతులు ప్రతి సంవత్సరం తమ పంట నుంచి వచ్చిన విత్తనాన్ని తరువాత పంటగా వేసుకోవచ్చు. విత్తనాలను మార్చుకునేటప్పుడు ధ్రువీకరించిన వాటినే వేసుకోవడం మంచిది. హెబ్రిడ్ రకాలంటే ఏటా సంకర పర్చి తయారు చేసిన విత్తనాలు. ప్రతి పంట కాలానికి కొత్త విత్తనం వాడాల్సి ఉంటుంది. పాత విత్తనాలను వాడినట్లయితే దిగుబడి గణనీయంగా తగ్గుతుంది. ధ్రువీకరణ విత్తనం జన్యుపరమైన అసలు లక్షణాలు కలిగి, చీడపీడలను తట్టుకునే శక్తి అధికంగా ఉంటుంది. ఇతర వంట విత్తనాలు కానీ కలుపు మొక్కల విత్తనాలు లేకుండా పరిశుభ్రంగా ఉంటాయి. వ్యర్థ పదార్థాలు లేకుండా ధ్రుడమైన విత్తనాలు ఎక్కువ శాతం కల్గి ఉంటాయి. బాగా మొలకెత్తే ఎక్కువ మొలక సాంద్రత కల్గిన విత్తనాలు అధిక దిగుబడికి దోహదపడతాయి. విత్తనం ద్వారా వ్యాపించే శిలీంధ్రాల నుంచి రక్షణ ఎక్కువగా ఉంటుంది. విత్తనంలో నిర్ణీత తేమ శాతం వల్ల ఎక్కువ కాలం నిల్వ చేయవచ్చు. నాణ్యమైన విత్తన లక్షణాలు నాణ్యమైన విత్తనమంటే వంద శాతం జన్యు స్వచ్ఛత మొలక శాతం కలిగి ఉండాలి. మేలైన విత్తనం 20 నుంచి 25 శాతం అవసరాల్లో 8 నుంచి 9 శాతం దిగుబడిని పెంచుతుంది. అంతర్గత చీడపీడలు లేని ఆరోగ్యకరమైన విత్తనమే నాణ్యంగా ఉన్నట్లు లెక్క. విత్తనాలు తయారు చేసుకోవడం ఇలా.... ప్రతి రైతు తనకు కావాల్సిన విత్తనాలను తన పంట నుంచి లేదా బాగా పండిన ఇతర రైతుల పంట నుంచి సేకరించాలి. భద్రంగా దాచుకోవాలి. స్వపరాగ సంపర్కం జరిగే పంటలలో రైతులు ఎవరి విత్తనాన్ని వారు తయారు చూసుకుంటే విత్తనంపై పెట్టే పెట్టుబడి తగ్గడమే కాకుండా నాణ్యమైన విత్తనాన్ని పొందే అవకాశం ఉంటుంది. విత్తనోత్పత్తి చేసే పొలం సారవంతమైనదిగా ఉండాలి. నీటి వసతితో పాటు మురుగునీరు పోయేలా ఏర్పాట్లు ఉండాలి. విత్తనం కోసం పండించే పొలానికి అదే పంటకు చెందిన ఇతర రకాల పొలానికి మధ్య కనీస దూరం ఉండాలి. విత్తనోత్పత్తి చేయదల్చిన పొలంలో నీటితడి ఇచ్చినట్లయితే అంతకు ముందు పండించిన రకం విత్తనాలు మొలకెత్తుతాయి. తరువాత గొర్రు, గుంటుకతో దుక్కి చేయిస్తే పొలంలో ఉండే కల్తీ మొక్కులతో పాటు కలుపు మొక్కలు నాశనం అవుతాయి. విత్తనోత్పత్తి చేసే పొలంలో బెరుకులు (కేశీలు) ఏరి వేయాలి. మొక్క ఎదుగుదల దశలో పంట పూత దశలో గింజ గట్టిపడే దశలో మూడు సార్లు కలుపు మొక్కలు లేకుండా చూడాలి. మొదటి దశ ఎత్తులో తేడా ఉన్న మొక్కలను పీకేయాలి. ఆకుల రంగు, ఆకారం, అమరికలో తేడా లేకుండా చూడాలి. రెండో దశలో కంకుల్లో తేడా ఉన్న మొక్కలను తొలగించాలి. రెమ్మల అమరిక, పుప్పొడి రంగులో తేడా పుప్పొడి తిత్తుల్లో తేడా లేకుండా చూసుకోవాలి. మూడోదశలో గింజ ఆకారం, పరిమాణం, గింజ రంగు వీటన్నింటినీ రెండు మూడు సార్లు విత్తన క్షేత్రమంతా తిరిగి ఏరి వేయాలి. -
సేంద్రియ ఎరువులతో మంచి దిగుబడులు
జోగిపేట: సేంద్రియ ఎరువులతోనే మంచి ఫలితాలు ఉంటాయని సెర్ప్ నాన్ పెస్టిసైడ్స్ మేనేజ్మెంట్ (ఎన్‌పీఎం) రాష్ట్ర డెరైక్టర్ డి.వి.నాయుడు అన్నారు. గురువారం అందోలు మండలం పరిధిలోని నాదులాపూర్, నేరడిగుంట గ్రామాల్లో పర్యటించారు. ఈ ఎరువుల వల్ల తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులు వస్తాయని తెలిపారు. సేంద్రియ ఎరువులు వాడుతూ పంటలను సాగు చేస్తున్న రైతులతో మాట్లాడి పలు సూచనలు, సలహాలు ఇచ్చారు. రసాయన ఎరువులు వాడకుండా పంటలు సాగు చేస్తున్న నాదులాపూర్ గ్రామానికి చెందిన రైతు కిష్టయ్య పొలాన్ని సందర్శించారు. ఆయన పండిస్తున్న పాలకూర, కొత్తిమీర, బీర తదితర పంటల వివరాలను అడిగి తెలుసుకున్నారు. రైతు తయారు చేసుకున్న అజోలాను పరిశీలించారు. గ్రామ శివారులో ఏర్పాటు చేసిన నాడెపు కంపోస్టును పరిశీలించి పలు సూచనలు చేశారు. ఎలాంటి ఫెర్టిలైజర్ వాడకుండా దీన్ని ఉపయోగించుకోవచ్చునన్నారు. డీపీఎం వాసుదేవ్, ఏపీఎం సీఎంఎస్ఏ సంగీత, ఏపీఎం విశ్వేశ్వర్‌గౌడ్, సీఏ చెన్నయ్య, సీఆర్పీ రమేశ్, జడ్పీటీసీ సభ్యురాలు శ్యామమ్మ భూమయ్య, వైస్ ఎంపీపీ రమేష్ , సర్పంచ్ నర్సింలు, ఎంపీటీసీ సభ్యురాలు నల్లోల బాలమ్మ తదితరులు ఆయన వెంట ఉన్నారు. -
కూరగాయల సాగే మేలు
వర్గల్: వరికి బదులుగా కూరగాయ పంటలు సాగు చేస్తే మంచి దిగుబడులు సాధించవచ్చని గజ్వేల్ డివిజన్ ఉద్యాన అధికారి చక్రపాణి అన్నారు. ‘గడా’ వ్యవసాయ విభాగం ఓఎస్డీ అశోక్ కుమార్‌తో కలిసి మండల పరిధిలోని అంబర్‌పేటలో బుధవారం ఉద్యాన రైతులతో సమావేశం నిర్వహించారు. కూరగాయల సాగు, వివిధ ప్రభుత్వ పథకాలపై కర్షకులకు అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా హార్టికల్చర్ అధికారి మాట్లాడుతూ.. ప్రణాళికాబద్ధంగా కూరగాయలు సాగు చేస్తే తక్కువ నీరు, తక్కువ వ్యవధిలో అధిక దిగుబడులు సాధించవచ్చన్నారు. ఉద్యాన రైతులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం రాయితీపై విత్తనాలు అందజేస్తోందని తెలిపారు. నాణ్యమైన ఉత్పత్తుల సాధన కోసం పందిరి నిర్మాణాలు, మల్చింగ్ ఏర్పాటుకు సబ్సిడీ ఇస్తోందని చెప్పారు. బొప్పాయి, అరటి లాంటి ఉద్యాన పంటల సాగుతో మంచి ఫలితాలు రాబట్టవచ్చని, ఆర్థికంగా నిలదొక్కుకోవచ్చని వివరించారు. రైతులు సంఘంగా ఏర్పడి కూరగాయల సాగుకు ముందుకు వస్తే వేసవిలో ఉద్యాన క్లస్టర్‌గా ఏర్పాటు చేసేందుకు ప్రభుత్వానికి ప్రతిపాదిస్తామని చెప్పారు. క్లస్టర్ ఏర్పాటుతో కలిగే ప్రయోజనాలను వివరించారు. గడా ఓఎస్డీ అశోక్ కుమార్ మాట్లాడుతూ.. రైతులు బతకాలి, వ్యవసాయం బాగుండాలంటే గ్రామానికి వచ్చే ప్రతి అధికారి సేవలను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అధికారులతో రైతులు మమేకం కావాలన్నారు. త్వరలోనే ముఖ్యమంత్రి కేసీఆర్ నియోజకవర్గంలో పల్లెబాట కార్యక్రమం ప్రారంభించనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో రైతులు కేశవరెడ్డి, కిష్టారెడ్డి, కుమార్, వెంకటేష్, మాణిక్యం, ఎల్లం తదితరులు పాల్గొన్నారు. -
అంతర పంటలతో అధిక లాభాలు
గజ్వేల్: మొక్కజొన్నలో చిక్కుడును అంతర పంటగా వేస్తూ రైతులు మంచి ఫలితాలు రాబడుతున్నారు. వర్షాలు బాగా కురిస్తే రెండు పంటల ద్వారా ఆదా యం గడిస్తున్నారు. ఒక వేళ వర్షాభావ పరిస్థితులు నెలకొంటే సమర్థవంతంగా తట్టుకునే శక్తి చిక్కుడుకు ఉంటుంది. ఖరీఫ్ సీజన్లో చాలా మంది రైతులు మొక్కజొన్న లో అంతర పంటగా దీన్ని వేస్తున్నారు. దీనితో పాటు కంది, బబ్బెర, జొన్న, చిక్కుడు తదితర పంటలను సాగు చేస్తున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పెరుగుతున్న జనాభాకు సరిపోయే మేర పప్పులు, కూరగాయల దిగుబడి ఉండడం లేదు. ఫలితంగా వీటి ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. మొక్కజొన్న పంటలో చిక్కుడును అంతర పంటగా వేస్తూ ఈ ప్రాంత రైతులు అధిక లాభాలు సాధిస్తున్నారు. చిక్కుడును వేయడం వల్ల మొక్కజొన్నకు ఎటువంటి న ష్టం కలగదు. మొక్కజొన్న ఏపుగా పెరిగేంత వరకు చిక్కుడు చిన్నదిగా ఉండడం వలన రైతులకు కలుపు తీయడంలో ఇబ్బందులు ఏర్పడవు. మొక్కజొన్న కోత పూర్తయిన తర్వాత చి క్కుడు తీగ ఏపుగా పెరుగుతుంది.. జూన్ నెలలో వేసిన మొక్కజొన్న అక్టోబర్ నెలలో కోతకు వస్తుంది. చిక్కుడు నవంబర్ నెలలో కాతకు వచ్చి ఫిబ్రవరి నెల వరకు కాత కాస్తుంది. దీర్ఘకాలంగా పంట రా వడం వలన రైతులకు ఆర్థికంగా మేలు చేకూరుతుంది. మొక్కజొన్న పంట తర్వాత ఒకసారి నిపుణుల సూచనలతో ఎరువులు వేసుకోవాలి. పూత దశలో ఆకుముడత, పూత నిలవడం కోసం క్రిమిసంహారక మందులు పిచికారీ చే యాలి. కాతకు వచ్చిన తర్వాత క్రిమికీటకాలు ఆశించకుండా మందులు వా డితే సరిపోతుంది. ఒక ఎకరాలో రూ.60 వేల వరకు దిగుబడి సాధించవచ్చని రైతులు చెబుతున్నారు. వర్షాలు సమృద్ధిగా కురిస్తే ఒక ఎకరాకు రెండు పంటలు కలిపి లక్ష వరకు ఆదాయం వచ్చే అవకాశం ఉంటుంది.