దున్నకుండా ముప్పయ్యేళ్లుగా సేద్యం!
రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా వ్యవసాయం చేస్తున్నారంటే ఇప్పుడెవరూ ఆశ్చర్యపోవడం లేదు. కానీ.. ఎద్దులతోనో, ట్రాక్టరుతోనో దున్నే పనే లేకుండా ప్రకృతి వ్యవసాయం చేయొచ్చంటే.. చెప్పినోడికి వ్యవసాయం తెలియదని నవ్విపోతారు. అయితే, మధ్యప్రదేశ్‌కు చెందిన రైతు రాజు టైటుస్ మాత్రం ఇలాగే వ్యవసాయం చేస్తున్నారు. పొలాన్ని అసలు దున్నకుండా, రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా గత 30 ఏళ్లుగా ఫుకుఓకా బాటలో ప్రకృతి వ్యవసాయం చేస్తూ మంచి దిగుబడులు సాధిస్తున్నారు.
♦ రసాయనిక ఎరువులు, పురుగు మందులు వాడకుండా.. పొలాన్ని దున్నకుండా 30 ఏళ్లుగా సేద్యం చేస్తున్న మధ్యప్రదేశ్ రైతు
♦ జపాన్ ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా సందర్శించిన అద్భుత వ్యవసాయ క్షేత్రం
మధ్యప్రదేశ్‌లోని హోషంగాబాద్‌కు చెందిన ‘రాజు టైటుస్’ ప్రభుత్వోద్యోగి. అయినా కుటుంబ వారసత్వంగా వచ్చిన 12 ఎకరాల పొలాన్ని సాగు చేయటం మానలేదు. 70వ దశకంలో అందరిలానే ఆయనా ‘హరిత విప్లవం’ ఒరవడిలో రసాయన ఎరువులు, కీటకనాశనులు వాడటం మొదలుపెట్టారు. మొదట్లో దిగుబడులు పెరిగి ఆదాయం వచ్చినా పదిహేనేళ్లు తిరిగేసరికి పంట భూమి నిస్సారమయింది. దిగుబడులు తగ్గి నష్టాల పాలయ్యి పొలం అమ్మేయాలని నిశ్చయించుకున్నాడు.
ఇది జరిగింది 1984లో. రాజు నిర్ణయంతో తల్లి హతాశురాలయింది. గాంధేయవాదులు నడిపే స్వచ్ఛంద సంస్థ ‘ఫ్రెండ్స్ రూరల్ సెంటర్’ కార్యకర్తలతో ఆమె తన గోడు వెళ్లబోసుకుంది. వారు ఆమె చెప్పినదంతా విని జపాన్ దేశానికి చెందిన ప్రకృతి వ్యవసాయ శాస్త్రవేత్త మసనోబు ఫుకుఒకా రాసిన ‘గడ్డిపరకతో విప్లవం’ (ఒన్ స్ట్రా రివల్యూషన్) పుస్తకాన్ని ఇచ్చి మీ సమస్యకు ఈ పుస్తకం పరిష్కారాన్ని చూపుతుందని చెప్పారు. కలుపు తీయకుండా.. దుక్కిదున్నకుండా.. ఎరువులు వేయకుండా.. పురుగు మందులు పిచికారీ వంటి పద్ధతులు అనుసరించకుండానే పంటలను సాగు చేసే పద్ధతుల గురించి పుకుఒకా ఆ పుస్తకంలో వివరించారు. ఈ పుస్తకాన్ని చదివిన రాజు సాగులో తను అనుసరిస్తున్న పద్ధతులు అనర్థ హేతువులని అర్థం చేసుకున్నారు.
అవహేళనలను అధిగమించి..
15 ఏళ్లుగా రసాయన ఎరువులు వేస్తూ పంటభూమిని ధ్వంసం చేస్తున్నానని అర్థం చేసుకున్న రాజు వెంటనే దిద్దుబాటు చర్యలు చేపట్టాడు. 1985 నుంచి పుకుఒకా చెప్పిన పద్ధతులను అనుసరించి వ్యవసాయం చేయటం మొదలుపెట్టాడు. అప్పటి నుంచి నేలను దున్నటం, ఎరువులు, పురుగుమందుల వాడకం ఆపేశాడు. రకరకాల గడ్డి, చెట్ల విత్తనాలను పొలంలో వెదజల్లి అవి పెరిగాక కత్తిరించి ఆచ్ఛాదనగా వాడతాడు. దీనివల్ల వర్షపు నీరు బయటకు వెళ్లకుండా పొలంలోనే ఇంకింది. దీనివల్ల మట్టి గుల్లబారటంతో పాటు తేమను పట్టి ఉంచింది. 80వ దశకం చివరికల్లా రసాయన ఎరువుల వాడకం తార స్థాయికి చేరింది. వాటిని వాడకుండా సేద్యం చేయటం అసాధ్యమనే అభిప్రాయం రైతుల్లో బలంగా నాటుకుపోయింది.
అట్లాంటి పరిస్థితుల్లో రాజు చేస్తున్న ప్రయత్నం ఆ గ్రామస్తుల మోములపై నవ్వులు పూయించింది. రైతులు కలుపు మొక్కలను పంట మొక్కలకు శతృవులుగా భావించి నిర్మూలిస్తారు. అలాంటిది కలుపు, గడ్డి మొక్కలను పంటలతో పాటు పెంచటమనే విషయం వినగానే పడీపడీ నవ్వేవారు. అవహేళనలే కాదు సాటి రైతుల నుంచి రాజుకు పలు ఇబ్బందులు ఎదురయ్యాయి. ఎత్తుగా పెరిగిన సుబాబులు చెట్ల నీడ తమ పొలాల మీద పడి పంటలు పండటంలేదని వాటిని నరికివేయాలని పొరుగు రైతులు ఫిర్యాదు చేసేవారు. మరోవైపు రాజు పొలంలో బాగా పెరిగిన గడ్డితో గ్రామస్తుల పశువులు మంచి విందు చేసుకునేవి. పక్క పొలాల్లో రైతులు తగులబెట్టిన పంట వ్యర్థాల నుంచి నిప్పు రాజు పొలంలోకి పాకి గడ్డి తగులబడేది. ఇలాంటి అడ్డంకులను అధిగమించి రాజు ప్రకృతిసేద్యం దిశగా వడివడిగా అడుగులు వేశారు.
విత్తన బంతులతో పంటల సాగు!
అంకితభావంతో అతను చేసిన కృషి ఫలితాన్నిచ్చింది. 1988 ఇండియన్ సైన్స్ కాంగ్రెస్ సమావేశాల్లో పాల్గొనటానికి ఇండియా వచ్చిన ఫుకుఒకా ప్రకృతిసేద్యం చేస్తున్న రాజు గురించి తెలుసుకొని ఆయన పొలాన్ని సందర్శించాడు. ఫుకుఒకా సలహాలు సూచనలను అనుసరించి రెట్టించిన ఉత్సాహంతో రాజు సాగుకు ఉపక్రమించాడు. పుకుఒకా సూచన మేరకు పంటను విత్తుకోవటానికి బదులు.. ఒక పాలు సోయా విత్తనం, ఏడు పాళ్లు మట్టి కలిపి క్రికెట్ బాల్ పరిమాణంలో ఉండే ‘విత్తన బంతుల’ ను తయారు చేశాడు. భార్య శాళిని సహకారంతో.. అడుగుకో బంతి చొప్పున.. పొలంలో వేశాడు.
దీనివల్ల మొలకెత్తినప్పటి నుంచే మొక్కలు పోషకాలను, సూర్యరశ్మిని ఎక్కువగా గ్రహించి ఏపుగా ఎదుగుతాయి. ఆ ఏడాది దిగుబడి బావుండటంతో పాటు నాణ్యమైన పంట వచ్చింది. ఎత్తుగా పెరిగిన గడ్డిని కత్తిరించి భూమిపైన ఆచ్ఛాదన కల్పించారు. దీనివల్ల పంటలకు మేలు చేసే వానపాములు, మిత్రపురుగులు, సూక్ష్మజీవులకు ఆశ్రయం లభిస్తుంది. పంటలకు హానిచేసే శతృ పురుగులను ఇవి నిర్మూలిస్తాయి. దీనివల్ల రసాయనిక ఎరువులు, కీటకనాశనుల అవసరం తప్పుతుంది. ఇవి నేలలో చేసే బొరియల వల్ల వర్షపు నీరు భూమిలోకి ఇంకుతుంది. వేర్లు లోతుకంటా చొచ్చుకుపోయి తేమను పోషకాలను గ్రహిస్తాయి. నేల గుల్లబారి భూ సారం పెరిగి మంచి పంట దిగుబడులు వస్తాయి.
నేలను దున్నాల్సిన అవసరం లేకపోవటం వల్ల ట్రాక్టరు.. ఎద్దుల కోసం రైతులకు అప్పు చేయాల్సిన అగత్యం తప్పుతుంది.రాజు పొలంలో నత్రజనిని స్థిరీకరించేందుకు సుబాబుల్ చెట్లను సాగు చేస్తున్నాడు. దీనివల్ల యూరియా రూపంలో రసాయన ఎరువును అందించాల్సిన అవసరం ఉండదని ఆయన అంటారు. సుబాబుల్ ఆకులు మేకలకు మంచి మేతగా ఉపయోగపడుతున్నాయి. ఈ చెట్ల కలప, మేకల విక్రయం ద్వారా ఆదాయం లభిస్తోంది. ఇప్పుడాయన వయసు 71. గత 30 ఏళ్లుగా పొలాన్ని దున్నకుండానే సేద్యం చేస్తూ సమృద్ధిగా పంటలు పండిస్తూ దేశవ్యాప్తంగా పేరుపొందారు. దేశ విదేశాల నుంచి వచ్చే వేలాది మంది రైతులకు స్ఫూర్తినిస్తున్న ఈ రాజు నిజంగా ప్రకృతి వ్యవసాయానికి రారాజే!
సారవంతమైన పొలమే మూలాధారం
వినియోగదారులు కూడా ఆరోగ్యకరమైన ఆహారం కోసం డిమాండ్ చేసినప్పుడే రైతులు రసాయన ఎరువులు వాడటం మానేస్తారు. ఆరోగ్యకరమైన నేల ద్వారానే ఆరోగ్యకరమైన ఆహారోత్పత్తి సాధ్యమనే విషయాన్ని గుర్తిస్తారు. భారతదేశంలో ప్రజలకు సోకుతున్న పలు జబ్బులకు మూలకారణం ఆహార పంటల సాగులో వాడుతున్న యూరియా. దీనివల్ల తొలుత మధుమేహం సోకి పలు దీర్ఘకాలిక అనారోగ్యాలకు దారితీస్తుంది. నాకు పక్షవాతం వచ్చింది.
నా భార్య గుండెజబ్బు వ్యాధిగ్రస్తురాలు. అయినా మేం కోలుకోవటానికి ప్రకృతిసేద్య పంట ఉత్పత్తులే కారణం. మా కుటుంబ అవసరాల కోసం ప్రస్తుతం ఎకరా పొలంలో ధాన్యం, పండ్లు, కూరగాయలను సాగు చేస్తున్నాం. ఖరీఫ్‌లో గోధుమ, వరి, మొక్కజొన్న, రబీలో పెసరను సాగు చేస్తున్నాం రోజురోజుకు వ్యవసాయంలో పెరుగుతున్న ఖర్చులే రైతు ఆత్మహత్యలకు కారణం. ఫుకుఒకా విధానంలో ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు అప్పులు చేయాల్సిన అవసరం ఉండదు. ఈ సేద్యం మూలసూత్రాలను ఒంటబట్టించుకుంటే ఏ రైతైనా పొలాన్ని దున్నకుండానే సేద్యం చేయవచ్చు.
– రాజు టైటుస్ (091797 38049), హోషంగాబాద్, మధ్యప్రదేశ్ rajuktitus@gmail.com
– దండేల కృష్ణ, సాగుబడి డెస్క్