సాక్షి, అమరావతి: ప్రకృతిని హ్యాండిల్ చేయగలుగుతున్నా కూడా పొలిటికల్‌గా హ్యాండిల్ చేయలేకపోతున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. గతంలో ఒక జాతీయ పార్టీ అన్యాయం చేస్తే ఇప్పుడు మరో పార్టీ సహాయ నిరాకరణ చేయడంతో పాటు భయాందోళనకు గురిచేస్తోందన్నారు. జిల్లా కలెక్టర్లు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులతో సోమవారం ఆయన టెలీకాన్ఫరెన్స్‌లో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. మన హక్కుల గురించి డిమాండ్ చేస్తే దాడులు చేసే పరిస్థితి ఉందని, ఇది ప్రజాస్వామ్య స్ఫూర్తికాదని, ఐటి దాడులు చేయడం ద్వారా బెదిరిస్తున్నారని ఆయన ఆరోపించారు. కక్ష సాధింపు వైఖరి సరికాదు, న్యాయం, ధర్మం, మంచి పనులే శాశ్వతంగా ఉంటాయన్నారు. అప్పుడు కేంద్రంలో ఓ పార్టీ ఒకరకంగా ఇబ్బంది పెడితే ఇప్పుడు మరో జాతీయ పార్టీ మరోరకంగా ఇబ్బంది పెడుతోందన్నారు. సాంకేతికత, అభివృద్ధితో విపత్తులను అధిగమిస్తున్నామని, దివిసీమ, తూర్పుగోదావరి తుపాన్లలో ప్రాణనష్టం అత్యధికమని, కానీ హుద్ హుద్, తిత్లీ తుపాన్లలో ప్రాణ నష్టం నివారించగలిగామన్నారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో సాధారణ పరిస్థితి వచ్చేదాకా విశ్రమించకూడదన్నారు.
పోలవరం పునరావాసం పనులు వేగవంతం చేయండి
పోలవరం నిర్వాసితులకు పునరావాసం కల్పించే పనులను వేగవంతం చేయాలని అధికారులను సీఎం చంద్రబాబు ఆదేశించారు. సోమవారం ఉండవల్లి ప్రజావేదిక నుంచి పనుల పురోగతిని వర్చువల్ రివ్యూ ద్వారా ఆయన సమీక్షించారు. వచ్చే వారానికి కాఫర్ డ్యామ్ పునాది(జెట్ గ్రౌంటింగ్) పనులు పూర్తవుతాయని అధికారులు వివరించారు. ప్రాజెక్టు కోసం పశ్చిమగోదావరి జిల్లాలో భూసేకరణ పూర్తికాగా, తూర్పుగోదావరి జిల్లాలో ఇంకా 55,858.6 ఎకరాలు సేకరించాల్సి ఉందన్నారు. హీరమండలం రిజర్వాయర్ నుంచి ఇచ్ఛాపురం వరకు చేపట్టిన హైలెవల్ కెనాల్ నిర్మాణంతో వంశధార–బహుదా అనుసంధానం పూర్తవుతుందని చెప్పారు. వైకుంఠపురం బ్యారేజ్, గోదావరి–పెన్నా అనుసంధానం ఫేజ్ 1 టెండర్ల ప్రక్రియ చివరిదశకు వచ్చిందని వివరించారు.
విద్యార్థుల్లో స్ఫూర్తి నింపేందుకే అవార్డులు
సాక్షి ప్రతినిధి ఒంగోలు: విద్యార్థుల్లో స్ఫూర్తిని నింపేందుకే ప్రతిభా అవార్డులు ఇస్తున్నట్లు సీఎం చంద్రబాబు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎంపిక చేసిన 7,010 మంది విద్యార్థులకు ప్రకాశం జిల్లా ఒంగోలులోని మినీ స్టేడియంలో సోమవారం ఏర్పాటు చేసిన సభలో ప్రతిభా అవార్డులను సీఎం అందచేశారు. ఈ సందర్భంగా యన మాట్లాడుతూ కృషి, పట్టుదల, సంకల్పం ఉంటే ఏదైనా సాధించ వచ్చన్నారు. కొన్ని కార్పొరేట్ విద్యాసంస్థలు విద్యార్థులను యంత్రాల్లా పనిచేయిస్తుండడం సరికాదన్నారు. అందుకే ప్రభుత్వం కళాశాలలు, పాఠశాలల్లో ఆటలు, సాంస్కృతిక కార్యక్రమాలకు ప్రాధాన్యం ఇచ్చినట్టు చెప్పారు. ప్రతిభా అవార్డు కింద ఒక్కొక్కరికి రూ.20 వేలు నగదు, అవార్డు ఇస్తున్నట్లు తెలిపారు. ప్రతిభా అవార్డు పొందిన విద్యార్థులు భవిష్యత్తులో ప్రభుత్వ ఉద్యోగాలు పొందితే వారి పదవీకాల సమయం ఓ ఏడాది అధికంగా ఇస్తామన్నారు. అబ్దుల్ కలాం స్ఫూర్తి ప్రదాత అని, ఆయన జీవితం యువతకు ఆదర్శమని సీఎం అన్నారు. నాడు వాజ్‌పేయ్ ప్రభుత్వంలో అబ్దుల్ కలాం దేశ అధ్యక్షుడిగా ఉండాలని తాను ప్రతిపాదించానని చెప్పారు. 2022 నాటికి రాష్ట్రం దేశంలో 3వ స్థానానికి చేరుకుంటుందని, 2029కి నంబర్–1 అవుతుందని, 2050కి ప్రపంచంలోనే అత్యున్నత స్థానానికి చేరుకుంటుందన్నారు. జ్ఞానభేరి పెట్టి జిల్లాకు రూ.10 కోట్లు నిధులు ఇస్తున్నట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో మంత్రులు, గంటా శ్రీనివాసరావు, శిద్దా రాఘవరావు, బాపట్ల ఎంపీ శ్రీరామ్ మాల్యాద్రి తదితరులు పాల్గొన్నారు.
ప్రకృతినే హ్యాండిల్ చేశాం..
Published Tue, Oct 16 2018 3:25 AM | Last Updated on Sat, Oct 20 2018 4:36 PM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment