నేలతల్లిని బీడువారిస్తే తర్వాతేమి తింటాం?’ | Will you eat it after we eat it again? ' | Sakshi
Sakshi News home page

నేలతల్లిని బీడువారిస్తే తర్వాతేమి తింటాం?’

Published Tue, Aug 22 2017 12:10 AM | Last Updated on Sun, Sep 17 2017 5:48 PM

నేలతల్లిని బీడువారిస్తే తర్వాతేమి తింటాం?’

నేలతల్లిని బీడువారిస్తే తర్వాతేమి తింటాం?’

9 ఏళ్లుగా ప్రకృతి సేద్యంలో రాణిస్తున్న మహిళా రైతు మల్లీశ్వరి
జీవామృతం, గో మూత్రం అందిస్తూ అరటి, చెరకు, పసుపు, మినుము పంటల సాగులో మంచి దిగుబడులు
చీడపీడలు, తెగుళ్ల బెడద లేకుండా రుచికరమైన, నాణ్యమైన వ్యవసాయోత్పత్తులు


కృష్ణా తీరంలో సారవంతమైన భూముల్లో ప్రకృతి వ్యవసాయం ఫలప్రదమవుతోంది. వ్యవసాయాన్నే నమ్ముకున్న చిన్న, సన్నకారు రైతులు నేలతల్లికి ప్రణమిల్లుతున్నారు. పాలేకర్‌ పద్ధతిలో సేద్యం చేస్తూ నాణ్యమైన పంటలను పండిస్తున్నారు. 9 ఏళ్ల క్రితం నుంచే ప్రకృతి వ్యవసాయం చేస్తున్న కొద్ది మంది తొలి తరం ప్రకృతి వ్యవసాయదారుల్లో అన్నపురెడ్డి మల్లీశ్వరి ఒకరు. తన భర్త సంజీవరెడ్డితో కలిసి రోజుకు పది గంటల పాటు పొలంలో శ్రమిస్తూ ఆదర్శప్రాయంగా ప్రకృతిసేద్యం చేస్తూ.. సత్ఫలితాలు పొందుతున్నారు.

‘2008లో విజయవాడ పోరంకిలో సుభాష్‌ పాలేకర్‌ మీటింగ్‌కు మొదటిసారి వెళ్లాం. ప్రకృతి సేద్యం గురించి పాలేకర్‌ చాలా సంగతులు చెప్పారు. 2010లో పాలేకర్‌ గుంటూరు వచ్చినపుడు కూడా వెళ్లాను. రసాయనాలు, క్రిమిసంహారక మందులతో నేల ఎంత నిస్సారమవుతున్నదో పూసగుచ్చినట్టు చెబుతుంటే మనసు కదిలిపోయింది.

‘నేలను నమ్ముకుని బతికేవాళ్లం నేలతల్లిని బీడువారిస్తే తర్వాత ఏం తింటాం?’ అనిపించింది. ఏమైనా సరే ఇలాగే పండించాలనుకున్నాం...వెంటనే ఒక ఆవును కొని, మొదలుపెట్టాం’ అని మల్లీశ్వరి గుర్తుచేసుకున్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి మండలం నూతక్కి ఆమె స్వగ్రామం. తొలినాళ్లలో ఘన జీవామృతం, జీవామృతం, వివిధ రకాల కషాయాలు వాడారు. నాలుగేళ్ల క్రితం నుంచి కేవలం గోమూత్రం, జీవామృతం తోనే మంచి దిగుబడులు సాధిస్తున్నారు.

20 రోజులకోసారి జీవామృతం..
10 రోజులకోసారి గోమూత్రం
..
ఆరు ఎకరాల నల్లరేగడి భూమిలో అరటితోపాటు చెరకు, పసుపు పంటలను మల్లీశ్వరి సాగు చేస్తున్నారు. బోరు నీళ్లను డ్రిప్పు ద్వారా పంటలకు అందిస్తున్నారు. పంట ఏదైనా వారు అనుసరించే సాగు విధానం మాత్రం ఒక్కటే. ముందుగా దుక్కిలో ఎకరాకు 2 ట్రక్కుల కోళ్ల ఎరువు వేస్తారు. ఎకరాకు 200 లీటర్ల జీవామృతాన్ని ప్రతి 20 రోజులకోసారి.. 10 రోజులకోసారి గోమూత్రాన్ని డ్రిప్పు ద్వారా పంటలకు అందిస్తారు.

కలుపు నివారణకు, భూసారం పెంపొందించడానికి గడ్డీ గాదం, పంట వ్యర్థాలను ఆచ్ఛాదనగా వేస్తూ.. మంచి దిగుబడులు సాధిస్తున్నారు. రెండు ఆవులను పెంచుతున్నారు. ఆవుల పాకలో గోమూత్రం నిల్వ చేసేందుకు గుంత తవ్వి 3 సిమెంట్‌ వరలు ఏర్పాటు చేశారు. దాని అడుగున గులకరాళ్లు, బేబీ చిప్స్, ఇసుక మిశ్రమాన్ని వేశారు. ఈ గుంతలోకి 10 రోజులకోసారి 30 లీటర్ల గోమూత్రం చేరుతుంది. ఈ మూత్రాన్ని బకెట్లతో సేకరించి వడకట్టి, డ్రిప్‌ ట్యాంకులో పోసి, పంటలకు అందిస్తారు.

20 అడుగులు పెరిగిన అరటి చెట్లు..
2008లో తొలిసారిగా అరటిని ప్రకృతిసేద్య పద్ధతిలో సాగు చేశారు. ఎకరాకు వెయ్యి మొక్కలు నాటారు. జనవరి–ఫిబ్రవరి మాసాల్లో కోతలయ్యాయి. చక్కెరకేళి రకంలో గెలకు 70 కాయలు.. కర్పూర అరటి చెట్లు దాదాపు 20 అడుగుల ఎత్తు పెరగటం విశేషం. గెలకు 200 కాయలతో ఒక్కో గెల 45 కిలోల వరకూ బరువు తూగుతోంది.

రసాయన ఎరువులతో సాగు చేసిన అరటి కాయల కన్నా.. ఇవి అధికంగా పొడవు పెరిగి, మంచి రంగుతో ఆకర్షణీయంగా, రుచిగా ఉన్నాయి. ఎక్కువ రోజులు నిల్వ ఉంటున్నాయి. దీంతో వ్యాపారస్తులు ఈ అరటికాయలపై ఆసక్తి చూపుతున్నారు.  వీరి పసుపు పొలంలో పుచ్చు సమస్య లేదు. దుంప బాగా ఊరి ఎకరాకు 25 క్వింటాళ్ల దిగుబడి వచ్చింది. ఒకటిన్నర ఎకరాలో చెరకును సాగు చేస్తున్నారు. గత రబీలో మల్లీశ్వరి ఎకరాకు 5 క్వింటాళ్ల మినుము దిగుబడి సాధించి.. ఔరా అనిపించారు.
 – బి.ఎల్‌.నారాయణ, సాక్షి, తెనాలి, గుంటూరు జిల్లా

ఇంతకంటే భరోసా ఏముంటుంది?
ప్రకృతి వ్యవసాయంలో పెట్టుబడులు తగ్గాయి. తోటి రైతులు ఎకరా భూమిలో సేద్యానికి ఏటా 10 పిండి కట్టలు (డీఏపీ, యూరియా, పొటాష్‌..) వేస్తున్నారు. సగటున ఒక పంటకు ఎకరాకు రూ.7–8 వేలు ఖర్చవుతోంది. పురుగుమందుల ఖర్చు అదనం. ఈ ఖర్చులు లేకుండానే ప్రకృతి సేద్యం చేస్తున్నాం. జీవామృతం, ఘనజీవామృతం సొంతంగా తయారుచేసుకోవటానికి కాస్త శ్రమ పడుతున్నప్పటికీ.. సంతృప్తి ఉంది. పండ్లు నాణ్యంగా, రుచికరంగా ఉంటున్నాయి. మంచి ధర పలుకుతోంది. ఆరోగ్యానికి, ఆదాయానికీ ఇంతకంటే భరోసా ఏముంటుంది? నాకు మందుబిళ్లలతో అవసరమే రాలేదంటే ప్రకృతి ఆహారాన్ని తినటమే కారణం.
– అన్నపురెడ్డి మల్లీశ్వరి, మహిళా రైతు, నూతక్కి, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా
 
వాతావరణం ఎలా ఉన్నప్పటికీ నిలకడగా పంట దిగుబడులు!
మల్లీశ్వరి రోజుకు 10 గంటలు పొలంలోనే ఉండి అన్ని పనులూ స్వయంగా చూసుకుంటుంది. 9 ఏళ్లుగా ప్రకృతి వ్యవసాయం చేస్తున్నందువల్ల మా భూమి బాగుపడింది. వాతావరణ పరిస్థితులు ఎలా ఉన్నప్పటికీ పంట దిగుబడులు నిలకడగా వస్తున్నాయి. పంట నాణ్యత బావుంది. సాగు ఖర్చులు బాగా తగ్గాయి. మమ్మల్ని చూసి మా ఊళ్లో కొంతమంది రైతులు ప్రకృతి సేద్యంపై ఇప్పుడిప్పుడే ఆసక్తి చూపుతున్నారు.
– అన్నపురెడ్డి సంజీవరెడ్డి (99510 60379), నూతక్కి, మంగళగిరి మండలం, గుంటూరు జిల్లా

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement