రసాయనిక ఎరువులు వాడితేనే అధిక దిగుబడి ఇచ్చేలా ఆధునిక వంగడాలను తయారు చేస్తున్నారు. ఈ ఆధునిక వంగడాల్లో పోషకాలు గత 50 ఏళ్లలో సగానికి సగం తగ్గిపోయాయని భారతీయ వ్యవసాయ పరిశోధనా మండలి (ఐసిఎఆర్) అధ్యయనంలోనే తేలింది. అందువల్ల దిగుబడి తక్కువొచ్చినా పోషకాలతో కూడిన ఆహారోత్పత్తి కావాలనుకుంటే దేశీ వంగడాలే వాడుకోవాలి.
రసాయనాలు వాడకుండా ఆరోగ్యదాయకమైన వ్యవసాయం చేయాలంటే అందుకు తగిన వనరులు సమకూర్చుకోవాలి. అందులో ముఖ్యమైనది అనువైన విత్తనం. ప్రకృతి/సేంద్రియ సేద్యానికి అనువైన విత్తనం దేశీ విత్తనమే. అందుకే ప్రభుత్వాలు కూడా ప్రకృతి వ్యవసాయంతోపాటు దేశీ వంగడాలను ప్రోత్సహిస్తున్నాయి.
కార్పొరేట్ ఉద్యోగాన్ని వదిలిపెట్టి ప్రకృతి సేద్యం చేపట్టిన దార్లపూడి రవి కూడా దేశీ విత్తన పరిరక్షణ కోసం విశేష కృషి చేస్తున్నారు. దేశీ వరి, చిరుధాన్యాలు తదితర పంటలకు సంబంధించి ఏకంగా 600 రకాల దేశవాళీ విత్తనాల సేకరణ, సాగు, అదనపు విలువ జోడించి ఆహార ఉత్పత్తుల తయారీ, విక్రయం.. ఈ పనులన్నీ ఆయన ఒక తపస్సులా చేసుకు΄ోతున్నారు. ఇతరులకు మార్గదర్శకంగా నిలుస్తున్న రవి అనుభవాలు ఆయన మాటల్లోనే..
‘విజయనగరం జిల్లా రేగిడి ఆమదాలవలస మండలంలోని ఉంగరాడ మా గ్రామం. పోస్టు గ్రాడ్యుయేషన్ (పర్యావరణ శాస్త్రం) చదివాక ఓ సిమెంట్ కంపెనీలో ఎజీఎంగా ఉద్యోగం చేశాను. సెలవులకో, శుభకార్యాలకో వచ్చినప్పుడు బంధుమిత్రులు చాలామందిలో ఒక విషయం గమనించాను. అజీర్తి అనో, బీపీ అనో, గ్యాస్ట్రిక్ అనో భోజనం తగ్గించేసేవారు.
ఏదో వంటలు బాగున్నాయని జిహ్వ చాపల్యం ఆపులేక కాస్త ఎక్కువగా తింటే మాత్ర వేసుకోవాల్సి వస్తుందని చెప్పేవారు. దీనికి కారణం పంటల రసాయనీకరణ. రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు పరిమితికి మించి రైతులు వాడేస్తుండటం చూశాను. ఈ పరిస్థితి మారాలంటే మళ్లీ పూర్వపు ప్రకృతి వ్యవసాయమే సరైనదని భావించాను.
అమ్మానాన్నలను దగ్గరుండి చూసుకోవాలని కూడా మనసు చెబుతుండటంతో ఉద్యోగానికి రాజీనామా చేసి ఇంటికి తిరిగొచ్చేశా. మాది వ్యవసాయ కుటుంబం. రెండున్నర ఎకరాల భూమి ఉంది. పూర్తిగా వర్షాధారం. అందులో కొంతమేర మామిడి తోట ఉంది. అంతరపంటగా పెసలు, ఉలవలు, నువ్వులు సాగు చేస్తున్నాను. దాదాపు ఎకరా భూమిలో అరుదైన సంప్రదాయ వరి రకాలను సాగు చేస్తున్నాను. అవన్నీ పూర్తిగా విత్తనాల కోసమే. ఉత్తరాంధ్రలో పలువురు రైతులకు వాటిని ఇచ్చి సాగు చేయిస్తున్నా.
తెలుసుకుంటూనే ‘సాగు’తూ..
పదేళ్ల క్రితం కాకినాడలో ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా శిబిరంలో సుభాష్ పాలేకర్ చెప్పిన పద్ధతులను ఆచరణలో పెట్టాను. 80 సెంట్లలో వరి నాటాను. మామిడి తోటలో అంతర పంటగా పసుపు పెట్టాను. 30 సెంట్ల భూమిలో 30 కిలోల కస్తూరి పసుపు విత్తనం పెడితే 300 కిలోల పంట చేతికొచ్చింది. ఎండబెడితే 180 కేజీల పసుపు వచ్చింది. కొర్రలు వేస్తే మంచి దిగుబడి వచ్చింది. ఆ ఉత్సాహంతో ఐదేళ్ల క్రితం నుంచి మూడెకరాలు కౌలుకు తీసుకొని వరి, కొంతమేర కూరగాయలు, ఆకుకూరలు సాగు చేస్తున్నాను.
దేశవాళీ పంటల తియ్యదనం...
ఒకప్పుడు దేశవాళీ టమాటాను చూస్తే నోరూరేది. ఇప్పుడు మార్కెట్లో దొరుకుతున్న హైబ్రిడ్ టమాటా వంటకు తప్ప తినడానికి చప్పగా ఉంటోంది. అన్ని పంటలదీ అదే పరిస్థితి. ఇది మారాలంటే దేశవాళీ పంటల తియ్యదనం మళ్లీ తెచ్చుకోవాలి. అందుకే దేశవాళీ విత్తనాల సేకరణ ఒక అలవాటుగా మార్చుకున్నాను. 2016 నుంచి ప్రామాణిక పద్దతి ప్రకారం వరి విత్తనాలను సేకరించి, సంరక్షిస్తున్నాను. ప్రతి విత్తన రకానికి ఒక రికార్డు కూడా నిర్వహిస్తున్నా.
సంప్రదాయ వరి విత్తనాలే గాకుండా కూరగాయలు, ఆకు కూరలు, అపరాల విత్తనాలు సేకరించాను. ఔషధ మొక్కలను, విత్తనాలనూ సేకరిస్తున్నాను. వరి వంగడాల్లో ముఖ్యంగా ఎర్రబుడమలు (రెడ్ రైస్), నెల్లూరు మొలకలు విత్తనాలు సేకరించాను. అరుదైన రాజుల చిక్కుడు (ఎరుపు, తెలుపు రంగులో ఉండే విత్తనం), తొక్క తీయకుండా వండుకోవడానికి వీలయ్యే గుత్తి బీర విత్తనాలు కూడా ఉన్నాయి.
ఒడిశా నుంచి తెచ్చిన శీలావతి, గాయత్రి అనే వరి విత్తనాలు, కెంపుసన్నా అనే బాస్మతి రకం విత్తనాలను కర్ణాటకలో సేకరించాను. గోదావరి ఇసుకరవ్వలు అనే రకం కూడా అన్నం వండుతుంటే మంచి సువాసన వస్తుంది. ఈ విత్తనాలనూ మూడేళ్ల నుంచి అభివృద్ధి చేస్తున్నాను.
ఇలా సంప్రదాయ వరి రకాలు, చిరుధాన్యాలు కలిపి దాదాపు ఆరొందల రకాల విత్తనాలు ఇప్పటివరకూ సేకరించగలిగాను. వీటిలో చాలావరకూ తూర్పు కనుమల్లో పలువురు రైతులకు ఇచ్చి ప్రయోగాత్మకంగా సాగు చేయిస్తున్నాను. ఈ ప్రాంతంలో వ్యవసాయక జీవవైవిధ్యాన్ని ప్రోదిచేయడానికి ఈ ప్రయత్నం దోహదపడుతుందనేది నా విశ్వాసం.
విత్తనాల సంరక్షణా ఓ సవాలే...
దేశవాళీ విత్తనాల సంరక్షణా ఒక సవాలు వంటిదే. పూర్వం వెదురుబుట్టల్లో, కుండల్లో విత్తనాలు భద్రపరిచేవారు. ముందుగా కాపుకొచ్చిన మొక్కజొన్న కంకులు, బీరకాయలు, సొరకాయలు, బెండకాయలు ప్రత్యేకంగా వేరుచేసి విత్తనాల కోసం వసారాలో వేలాడగట్టేవాళ్లు. ఆ విధానాలన్నీ ఇప్పుడు విత్తనాల నిల్వ కోసం పాటిస్తున్నాం. ఇలా ఓ సీడ్ బ్యాంక్‌ను నిర్వహించడానికి ఒక ఎన్జీవోను ప్రారంభించాను. దేశీయ పంటలకు విలువ పెంచేలా చిరుధాన్యాలు, పప్పుధాన్యాలతో గానుగ నూనె, బిస్కెట్లు, స్నాక్స్ తయారు చేయించి విక్రయిస్తున్నాం..’(– దార్లపూడి రవి మొబైల్: 86394 56848)
– అల్లు సూరిబాబు, సాక్షి ప్రతినిధి, విజయనగరం
ఫోటోలు: డి.సత్యనారాయణమూర్తి
Comments
Please login to add a commentAdd a comment