organic food
-
విశాఖలో ఆకట్టుకుంటున్న ఆర్గానిక్ మేళా
-
ఆర్గానిక్ మహోత్సవ్ అదిరింది
సాక్షి, విశాఖపట్నం: విశాఖపట్నంలో నిర్వహించిన అంతర్జాతీయ ఆర్గానిక్ మహోత్సవ్‌లో రూ.140 కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు కుదిరాయి. ఈ నెల 2వ తేదీ నుంచి ఆదివారం వరకు మూడు రోజులపాటు నగరంలోని గాదిరాజు ప్యాలెస్‌లో రాష్ట్ర వ్యవసాయ శాఖ, రైతు సాధికార సంస్థ సంయుక్తంగా ఈ భారీ మేళాను నిర్వహించాయి. రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయాన్ని ప్రోత్సహించే చర్యల్లో భాగంగా జాతీయ, అంతర్జాతీయ సంస్థలు, వినియోగదారులను ఒకే వేదికపైకి తీసుకొచ్చే లక్ష్యంతో రాష్ట్రంలో తొలిసారిగా దీనిని ఏర్పాటు చేశారు. ఈ మేళాలో సేంద్రియ విధానంలో పండించిన వరి, చిరుధాన్యాలు, పప్పు దినుసులు, బెల్లం, మామిడి పండ్లు, తేనె తదితర సేంద్రియ సహజ ఉత్పత్తులను 123 స్టాళ్లలో ప్రదర్శనకు ఉంచారు. ప్రత్యేకంగా ఒక ఆర్గానిక్ ఫుడ్ కోర్టును కూడా ఏర్పాటు చేశారు. సందర్శకులు వివిధ సేంద్రియ వంటకాలను ఆరగించి సంతృప్తి చెందారు. బహుళజాతి సంస్థల ప్రతినిధులు రాక దేశంలోని వివిధ రాష్ట్రాలతోపాటు సింగపూర్ నుంచి ప్రభుత్వ, ప్రైవేటు, కార్పొరేట్, బహుళజాతి సంస్థల ప్రతినిధులు, రైతులు, వ్యవసాయ ఉత్పత్తిదారుల సంఘాలు ప్రతినిధులు, చిరుధాన్యాల ఉత్పత్తి, సాగుదారులు, కొనుగోలుదారులు భారీగా హాజరయ్యారు. సేంద్రియ, ప్రకృతి వ్యవసాయంపై సెమినార్లు, వర్క్‌షాపులు నిర్వహించారు. ఈ మేళాకు మూడు రోజుల్లో 22 వేల మందికి పైగా సందర్శకులు వచ్చారు. 12కు పైగా సంస్థలు రైతుల తరఫున రైతు సాధికార సంస్థతో అవగాహనా ఒప్పందాలు (ఎంవోయూలు) కుదుర్చుకున్నాయి. వీటిలో బెంగళూరుకు చెందిన ఫలద ఆగ్రో ప్యూర్ అండ్ ష్యూర్ సంస్థ రూ.90 కోట్లు, సాగ్లిష్ హార్వెస్ట్ రూ.10 కోట్లు, సింగపూర్‌కు చెందిన జీఎన్ ఆర్గానిక్ రూ.10 కోట్లతో పాటు ఈ–మిల్లెట్స్, స్వచ్ఛ మిల్లెట్స్, బిగ్ బాస్కెట్, గాట్ కాటన్ తదితర సంస్థలు వెరసి రూ.140 కోట్లకు పైగా విలువైన ఒప్పందాలు చేసుకున్నాయి. ప్రకృతి వ్యవసాయ రైతులతో ప్రతినెలా ఉత్పత్తుల కొనుగోలుకు ముందుకొచ్చాయి. జీవనశైలి వ్యాధులకు దూరంగా ఉండాలంటే జీవన విధానం మార్చాలనే ఇతివృత్తంతో సేంద్రియ పంటలను ప్రోత్సహించాలనే లక్ష్యంతో ఆర్గానిక్ మహోత్సవ్ ఏర్పాటు చేసినట్టు నిర్వాహకులు పేర్కొన్నారు. ఆర్గానిక్ మేళాకు హాజరైన ఆయా సంస్థల ప్రతినిధులకు నిర్వాహకులు సరి్టఫికెట్లు అందజేశారని రైతు సాధికార సంస్థ సీనియర్ థిమాటిక్ లీడ్ ప్రభాకర్ ‘సాక్షి’కి తెలిపారు. -
పేదల ఆకలి తీర్చే ఆర్గానిక్ గార్డెన్స్!
మురికివాడల్లో నిరుపేదల సంక్షేమం కోసం ఆహార ధాన్యాలు, పప్పులు ఉప్పులను ప్రభుత్వం సబ్సిడీపై ఇవ్వటం మనకు తెలుసు. వాటితో పాటు సేంద్రియ ఆకుకూరలు, కూరగాయలను అందుబాటులోకి తెస్తోంది రియో డి జనీరో (బ్రెజిల్) నగరపాలక సంస్థ! రియో ఎంతో అందమైన నగరం. అంతే కాదు.. విశాలమైన మనసున్న మహానగరం కూడా! సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలను మడుల్లో పెంచటాన్ని నేర్పించటం ద్వారా సేంద్రియ ఆహారాన్ని వెనుకబడిన ప్రజల్లోనూ ప్రాచుర్యంలోకి తీసుకురావాలనే బృహత్తర లక్ష్యాన్ని పెట్టుకున్నారు రియో నగర మేయర్ ఎడ్వర్డో పేస్. తొలినాళ్లలో ప్రభుత్వ నిధులతో గార్డెన్లను నిర్వహించటం, తదనంతరం స్థానికులే స్వయంగా నిర్వహించుకుని కూరగాయల సాగులో స్వయం సమృద్ధి సాధించేలా ప్రోత్సహిస్తోంది రియో నగర పర్యావరణ శాఖలోని ప్రత్యేక ఉద్యాన విభాగం. పేదల ఇళ్ళకు దగ్గర్లోనే ప్రభుత్వ ఖాళీ స్థలాల్లో కమ్యూనిటీ కిచెన్ గార్డెన్లు ఏర్పాటు చేసింది. వీటిల్లో వేలకొలది ఎత్తు మడులు నిర్మించి, అక్కడి వారితోనే సేంద్రియ కూరగాయలు, ఆకుకూరలు సాగు చేయించి, ఇంటింటికీ పంపిణీ చేస్తోంది. 2006లో ప్రారంభమైన ఈ అర్బన్ అగ్రికల్చర్ ప్రాజెక్ట్ ‘హోర్టాస్ కారియోకాస్’ (‘రియోవాసుల కూరగాయల తోట’ అని దీని అర్థం) సంఖ్య గత 16 ఏళ్లలో 56కి పెరిగింది. వీటిలో 29 మురికివాడల్లో, 27 నగరంలోని పాఠశాలల్లో ఉన్నాయి. దాదాపు 50,000 కుటుంబాలు ఇప్పటికే ఈ ప్రాజెక్ట్‌లో నిమగ్నమై ఉన్నాయి. గత సంవత్సరానికి మొత్తం 80 టన్నుల ఆకుకూరలు, కూరగాయలను వీటిలో పండించి, పంపిణీ చేశారు. ఇది కొందరికి తాజా ఆహారం దొరికింది. మరికొందరికి ఈ గార్డెన్స్‌లో పని దొరకటంతో ఆదాయం సమకూరింది. కరోనా కష్టకాలంలో ఈ గార్డెన్లు తమని ఎంతో ఆదుకున్నాయని ప్రజలు సంతోషపడుతున్నారు. ఆహారం ఎంతో అవసరమైన జనం నివాసమున్న చోటనే కమ్యూనిటీ అర్బన్ గార్డెన్లను మరింతగా విస్తరించాలని రియో నగర పాలకులు సంకల్పించారు. రియో నగర ఉత్తర ప్రాంతంలోని మూడు మురికివాడల్లో నిర్మించిన గార్డెన్లను విస్తరింపచేసి ప్రపంచంలోనే అతిపెద్ద అర్బన్ కమ్యూనిటీ కిచెన్ గార్డెన్‌ను నెలకొల్పాలనే లక్ష్యంతో పనులు చేపట్టారు. ఆ గార్డెన్ ఏకంగా 15 ఫుట్ బాల్ కోర్టులంత ఉంటుందట. అంటే, దాదాపు 11 హెక్టార్ల విస్తీర్ణం అన్నమాట! 2024 నాటికి ఈ కల సాకారం కాబోతోంది! ప్రతినెల లక్ష కుటుంబాలు ఈ ప్రాజెక్ట్ ద్వారా ప్రయోజనం పొందుతాయి. అర్బన్ అగ్రికల్చర్‌కు ఉన్న శక్తి ఏపాటిదో దీన్ని బట్టి అర్థం అవుతుంది అంటున్నారు జూలియో సీజర్ బారోస్. ‘హోర్టాస్ కారియోకాస్’ పథకం అమలుకు రియో డి జనీరో మునిసిపల్ పర్యావరణ విభాగం తరఫున ఆర్గానిక్ గార్డెనింగ్ డైరెక్టర్ హోదాలో శ్రీకారం చుట్టిన అధికారి ఆయన. ‘మా ప్రాజెక్ట్ లక్ష్యం అందమైన తోటను నిర్మించడం కాదు. నగరంలోనే సేంద్రియ ఆహారాన్ని పండించి ఎంత మందికి అందించగలమో చూడాలన్నదే’ అని బారోస్ చెప్పారు. మురికివాడల్లో నివాసం ఉండే వారినే తోట మాలులుగా, సమన్వయకర్తలుగా నియమిస్తారు. వారికి స్టైఫండ్ ఇస్తారు. పండించిన కూరగాయల్లో 50% మురికివాడల్లోని పేదలకు ఉచితంగా పంపిణీ చేస్తారు. మిగిలిన 50% తోటమాలులకు ఇస్తారు. వాళ్ళు ఇంట్లో వండుకొని తినొచ్చు లేదా అక్కడి వారికే సరసమైన ధరలకు అమ్ముకోనూ వచ్చు. ప్రతి తోటకు కొంత కాలమే ప్రభుత్వ సాయం అందుతుంది. చివరికి స్వతంత్రంగా మారాల్సి ఉంటుంది అని బారోస్ చెప్పారు. ఆర్థిక లాభాలతో పాటు, ఒకప్పుడు పరిసరాల్లో సాధారణంగా ఉండే మాదకద్రవ్యాల అక్రమ రవాణా నుంచి ప్రజలు దూరంగా ఉండటంలో ఈ ప్రాజెక్ట్ మరింత పెద్ద సామాజిక ప్రయోజనాన్ని అందిస్తుందని బారోస్ అంటారు. – పంతంగి రాంబాబు -
ఎక్కువగా బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్ తింటున్నారా.. ఈ సమస్య రావొచ్చు
సాక్షి, విజయవాడ: విజయవాడ నగర యువత, చిన్నారులు బిర్యానీపై మనసు పారేసుకుంటున్నారు. బిర్యానీతోపాటు, నాన్‌వెజ్ వంటకాలను తరచూ లాగించేస్తున్నారు. ఆహారంలో నూనె, కార్పొహైడ్రేట్లు ఎక్కువగా ఉండటంతో చిన్న వయసులోనూ ఊబకాయులుగా మారి అనారోగ్యం పాలవుతున్నారు. మరోవైపు మధ్య వయస్సు, వృద్ధులు సంప్రదాయ, ఆర్గానిక్ ఆహారానికి మళ్లుతున్నారు. దీంతో నగరంలో ఆర్గానిక్ స్టాళ్లు వెలుస్తున్నాయి. నగరంలో బిర్యానీ, ఫాస్ట్‌ఫుడ్ వ్యాపారం జోరుగా సాగుతోంది. బిర్యానీ పాయింట్లు ఎక్కడపడితే అక్కడ వెలుస్తున్నాయి. కాలు బయట పెట్టకుండా జుమాటో, స్విగ్గీ వంటి ఆన్లైన్ సర్వీసుల ద్వారా ఇంటి వద్దకే వేడివేడిగా బిర్యానీ వచ్చేస్తున్నాయి. ఆన్లైన్లో ఆర్డర్ చేస్తున్న ఆహారంలో 90 శాతం నాన్ వెజ్ వంటకాలే ఉంటున్నాయి. ఇళ్లలో సైతం నూడిల్స్, బర్గర్లు వంటి వంటలను తయారు చేసుకుని లాగించేస్తున్నారు. ఫాస్ట్ ఫుడ్, బిర్యానీలు, కార్బోహైడ్రేడ్లు ఎక్కువగా ఉన్న ఆహారం తీసుకోవడం యువత, చిన్నారుల్లో ఊబకాయానికి దారితీస్తోందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. చదవండి: కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్‌కు సన్మానం విజయవాడ గాయత్రి నగర్లో ఏర్పాటైన ఆర్గానిక్ స్టోర్ ఒబెసిటీతో ప్రమాదం ఇటీవల 26 ఏళ్ల యువకుడు బ్రెయిన్ స్ట్రోక్‌కు గురై ఆస్పత్రిలో చేరాడు. ఊబకాయం వల్ల మెటబాలిజం దెబ్బతిని, నియంత్రణ లేని మధుమేహం, అధికరక్తపోటు కారణంగా అతను బ్రెయిన్‌స్ట్రోక్‌కు గురైనట్లు వైద్యులు నిర్ధారించారు. చిన్నప్పటి నుంచి అధిక కార్బోహైడ్రేడ్లు ఉన్న ఆహారం తీసుకోవడం వల్ల ఈ సమస్య వచ్చినట్లు పేర్కొన్నారు. ఇలా చాలా మంది ఊబకాయంతో అనారోగ్య సమస్యలు ఎదుర్కొంటున్నారు. చిన్నవయస్సులో ఒబెసిటీ ఉన్న వారిలో మధ్య వయస్సు వచ్చేసరికి మధుమేహం, రక్తపోటు, డైస్టిపీడెమియా వంటి వ్యాధులబారిన పడే అవకాశం ఉంది. బిర్యానీలు అధికంగా లాగించే వారిలో 90 శాతం మందికి ఫ్యాటీ లివర్ ఉంటున్నట్లు వైద్యులు చెపుతున్నారు. ఒబెసిటీ మహిళల్లో బ్రెస్ట్ క్యాన్సర్, ఒవేరియన్ క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. రక్తనాళాల్లో కొల్రస్టాల్ గడ్డలు ఏర్పడి బ్రెయిన్‌స్ట్రోక్, హార్ట్ ఎటాక్ కూడా రావచ్చునని డాక్టర్లు హెచ్చరిస్తున్నారు. చదవండి: పుట్టింటి నుంచి అత్తింటి సారె తీసుకెళ్తూ.. ఇలా చేస్తే మేలు విద్యార్థులకు పాఠాలతోపాటు యోగా, ధ్యానంపై రోజూ గంట శిక్షణ ఇవ్వాలి. ఇంట్లో చిన్న చిన్న వ్యాయామాలు చేయాలి. కనీసం రోజులో ఏడు నుంచి ఎనిమిది గంటలపాటు నిద్రపోవాలి. ఆర్గానిక్ ఆహారానికి గిరాకీ మధ్య వయసు, వృద్ధుల ఆహార పద్ధతుల్లో మార్పులు వస్తున్నాయి. 45 ఏళ్ల వయసు దాటిన వారు పాత తరం ఆహార పద్ధతులను మళ్లీ అలవాటు చేసుకుంటున్నారు. అలాంటి వారి కోసం నగరంలో ఆర్గానిక్ పంటలు, ఆహార పదార్థాల స్టాళ్లు వెలుస్తున్నాయి. ఆర్గానిక్ కూరగాయలు, చిరుధాన్యాలను ఇటీవల కాలంలో ఎక్కువగా భుజిస్తున్నారు. -
సేంద్రీయ ఆహారంతో కేన్సర్ ముప్పు తక్కువ!
సేంద్రీయ ఆహారాన్ని ఎక్కువగా తీసుకుంటే కేన్సర్ వచ్చే అవకాశాలు 25 శాతం వరకూ తగ్గుతాయని అంటున్నారు శాస్త్రవేత్తలు. ఫ్రాన్స్‌లో జరిగిన ఓ అధ్యయనంలో దాదాపు 69 వేల మంది పాల్గొనగా.. నాన్ హాడ్జ్కిన్స్ లింఫోమా, మహిళల్లో రుత్రుస్రావం నిలిచిపోయిన తరువాత వచ్చే రొమ్ము కేన్సర్ల నిరోధానికి సేంద్రీయ ఆహారం ఒక మార్గమని తేల్చింది. మిగిలిన కేన్సర్ల విషయంలో దీని ప్రభావం లేదని కూడా స్పష్టం చేసింది. రసాయనిక పురుగుల మందుల అవశేషాలు ఆహారం ద్వారా శరీరంలోకి చేరకపోవడం కేన్సర్ నిరోధానికి కారణం కావచ్చునని శాస్త్రవేత్తల అంచనా. జీవనశైలి సంబంధిత ఇతర వ్యవహారాలనేవీ పరిగణలోకి తీసుకోకపోయినా.. అధ్యయనం జరిగింది ఐదేళ్ల పరిమిత కాలానిదైనప్పటికీ సేంద్రీయ ఆహారం ప్రాముఖ్యతను తెలిపేందుకు ఈ అధ్యయనం ఉపయోగపడుతుందని టాస్మానియా యూనివర్శిటీ శాస్త్రవేత్త రాజ్ ఈరీ తెలిపారు. అయితే ఈ అధ్యయనంపై కొంతమంది అభ్యంతరాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. సేంద్రీయ ఆహారం పేరుతో సాధారణ కాయగూరలు, పండ్లు తినడం తగ్గిస్తారని ఫలితంగా అసలుకే మోసం వచ్చే అవకాశం ఉందని వీరు హెచ్చరిస్తున్నారు. మొత్తమ్మీద చూస్తే.. సేంద్రీయ ఆహారమన్న విషయాన్ని పట్టించుకోకుండా.. ఎక్కువ మొత్తంలో కాయగూరలు పండ్లు తినడం మంచిదని సూచిస్తున్నారు. ఆయుష్షు పెంచే కొత్త మందు... వేర్వేరు వ్యాధుల చికిత్సకు ఉపయోగిస్తున్న మందులను కలిపి వాడటం ద్వారా సి.ఎలిగాన్స్ అనే సూక్ష్మజీవి జీవితకాలాన్ని రెట్టింపు చేయడంలో శాస్త్రవేత్తలు విజయం సాధించారు. మందుల ద్వారా ఇంత స్థాయిలో ఆయుష్షు పెంచడం ఇదే తొలిసారని అంచనా. మనుషుల్లోనూ ఇదే రకమైన ఫలితాలు వస్తాయని ఆశిస్తున్టన్లు ఈ పరిశోధనల్లో పాల్గొన్న శాస్త్రవేత్త జాన్ గ్రూబర్ అంటున్నారు. ఆయుష్షు పెంచేందుకు అవకాశమున్న అన్ని రకాల మందులను పరిశీలించిన తరువాత తాము యాంటీబయాటిక్ రిఫాంపిసిన్, రాపమైసిన్, మధుమేహానికి వాడే మెట్ఫార్మిన్లతోపాటు ఇంకో రెండు మందులపై పరిశోధనలు చేశామని చివరకు రిఫాంపిసిన్, రాపమైసిన్, అలటోనిన్లను సి.ఎలిగాన్స్‌పై ప్రయోగించామని వివరించారు. దీంతో సాధారణంగా ఇరవై రోజులపాటు బతికే సి.ఎలిగాన్స్ రెట్టింపు కాలం జీవించాయని తెలిపారు. ప్రస్తుతానికి ఈ పరిశోధనలు ప్రాథమిక దశలో ఉన్నట్టే లెక్క అని.. ఈ మందుల కలయిక ఎలా పనిచేస్తుందో తెలుసుకున్న తరువాత మరిన్ని పరిశోధనలు చేస్తేగానీ వాటిని విస్తత వాడకానికి తేలేమని జాన్ వివరించారు. అంతేకాకుండా... ఆయుష్షు పెంచేందుకు మాత్రమే కాకుండా.. వయసుతోపాటు వచ్చే సమస్యలను నిలవరించేందుకు కూడా ఈ ప్రయోగాలను ఉపయోగించుకోవచ్చునని చెప్పారు. -
సేంద్రియ ఆహారంతో క్యాన్సర్‌కు చెక్
లండన్ : క్రిమిసంహారక మందులకు దూరంగా సేంద్రియ ఆహారం తీసుకుంటే క్యాన్సర్ ముప్పు 86 శాతం వరకూ తగ్గుతుందని తాజా అథ్యయనం వెల్లడించింది. బ్లడ్ క్యాన్సర్ సహా ఏ తరహా క్యాన్సర్ ముప్పు అయినా సేంద్రియ ఆహారం మాత్రమే తీసుకునేవారికి 25 శాతం తక్కుగా ఉంటుందని, చర్మ, బ్రెస్ట్ క్యాన్సర్లు సోకే అవకాశం మూడోవంతు తగ్గుతుందని అథ్యయనం పేర్కొంది. స్ధూలకాయుల్లో సేంద్రియ ఆహారంతో మెరుగైన ప్రయోజనాలు చేకూరుతాయని తమ అథ్యయనంలో గుర్తించామని పరిశోధకులు పేర్కొంది. సేంద్రియ ఆహారాన్ని అధికంగా తీసుకునే వారిలో క్యాన్సర్ ముప్పు తక్కువగా ఉన్నట్టు తమ పరిశోధన వెల్లడించిందని అథ్యయన రచయిత, సెంటర్ ఆఫ్ రీసెర్చి ఇన్ ఎపిడెమాలజీకి చెందిన డాక్టర్ జులియా బుద్రీ చెప్పారు. పురుగుమందులు వాడకుండా పండించిన ఆహారాన్ని తీసుకోవడం ద్వారా క్యాన్సర్ ముప్పును తగ్గించుకోవచ్చని, క్యాన్సర్‌ను నివారించేందుకు ప్రజలు సేంద్రియ ఆహారాన్నే తీసుకోవాలని సూచించారు. అథ్యయన వివరాలు జామా ఇంటర్నల్ మెడిసిన్ జర్నల్‌లో ప్రచురితమయ్యాయి. -
మన రుచులకు విశేష స్పందన
ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు కర్నూలు (అగ్రికల్చర్) : ఆర్గానిక్ ఫుడ్ ఫెస్టివల్ (మన సీమ రుచులు) నగర జనాన్ని విశేషంగా అలరించింది. రాష్ట్ర పర్యాటక సంస్థ హరిత హోటల్లో ఆదివారం నగర ప్రజలకు మన సీమ రుచుల పేరుతో నిర్వహించిన కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. ఈ సందర్బంగా నిర్వహించిన వివిధ సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. రాగిసంకటి, జొన్న రొట్టె, గోంగూర చెట్ని, ఆలు బఠానిఫ్రై, జీరారైస్, లెమన్ రైస్, మిర్యాల రసం, గోంగూర మాంసం, నాటుకోడి కర్రీ, చేపల పులుసు రుచులను నగర ప్రజలు ఆస్వాదించారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకొని వివిధ కార్యక్రమాలు నిర్వహించారు. ఈనెల చివరి వరకు ప్రతి శని,ఆదివారాల్లో సేంద్రీయ ఎరువులతో పండించిన ఆహార ధాన్యాలతో మన రుచుల పేరుతో ఫుడ్ ఫెస్టివల్ నిర్వహిస్తున్నట్లు ఈ సందర్బంగా పర్యాటక అభివృద్ధి సంస్థ డివిజనల్ మేనేజర్ బాబ్జీ తెలిపారు. వచ్చే శుక్ర, శనివారాల్లో కూడా ఈ కార్యక్రమాలు ఉంటాయన్నారు. పెద్దలకు రూ.350, పిల్లలకు రూ.150, దంపతులకు రూ. 600 ప్రకారం నాన్ వెజిటేరియన్, పెద్దలకు రూ.275, పిల్లలకు రూ.125, దంపతులకు రూ.500 ప్రకారం వెజిటేరియన్ కూపన్లను అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. -
ఆర్గానిక్ ఫుడ్‌తో ‘జీవాతి’ రెస్టారెంట్
• దేశ విదేశాల్లో రెస్టారెంట్లు, స్టోర్లు • విస్తరణలో సృష్టి ఆర్గానిక్ ఫుడ్స్ హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: పూర్తిగా సేంద్రియ ధాన్యాలతో రూపొందిన ఆహార పదార్థాలను వడ్డించే రెస్టారెంట్ హైదరాబాద్‌లో ఏర్పాటైంది. ఐఐఎం విద్యార్థులతో ప్రారంభమైన సృష్టి ఆర్గానిక్ ఫుడ్స్ ఇక్కడి జూబ్లీహిల్స్‌లో జీవాతి పేరుతో ఈ కేంద్రాన్ని నెలకొల్పింది. రెస్టారెంట్‌తోపాటు ఆర్గానిక్ స్టోర్ సైతం ఇందులో ఏర్పాటు చేశారు. 150కిపైగా ఆర్గానిక్ ఉత్పత్తులను ఇక్కడ విక్రయిస్తామని సృష్టి ఆర్గానిక్ ఫుడ్స్ ప్రమోటర్ ఆనంద్ కుమార్ మంద తెలిపారు. కొద్ది రోజుల్లో ఆర్గానిక్ నాన్–వెజ్ రెస్టారెంట్ సైతం అందుబాటులోకి తెస్తామన్నారు. క్విక్ సర్వీస్ రెస్టారెంట్లు, ఫుడ్ ఆన్ వీల్స్ విధానంలో కేంద్రాలను స్థాపించనున్నట్టు వెల్లడించారు. విదేశాల్లో సైతం..: భారత్‌లోని పలు నగరాలతోపాటు ఆస్ట్రేలియా, యూఎస్ తదితర విదేశీ మార్కెట్లలో రెస్టారెంట్లు, స్టోర్లను విస్తరిస్తామని మరో ప్రమోటర్ మహేంద్ర భరద్వాజ్ తెలిపారు. సొంతంగా, భాగస్వామ్యం, ఫ్రాంచైజీల ద్వారా వీటిని నెలకొల్పుతామని చెప్పారు. సొంత ఈ–కామర్స్ పోర్టల్ త్వరలో ప్రారంభిస్తామన్నారు. -
భారీ వ్యాపారమంటూ పెట్టుబడిదారులకు టోపి
బంజారాహిల్స్: సాఫ్ట్వేర్ సంస్థలకు ఆర్గానిక్ ఫుడ్ సరఫరా చేసే టెండర్ దక్కిందని ఆర్గానిక్ హట్ పేరుతో సూపర్‌బజార్‌ను నడిపిస్తున్నానని పెట్టుబడి పెడితే లాభాల్లో వాటా ఇస్తానని నమ్మించి అమాయకుల నుంచి లక్షలాది రూపాయలు దండుకొని మోసంచేసిన న్యూట్రిషియన్‌ను జూబ్లీహిల్స్ పోలీసులు అరెస్టు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం. వెంకటగిరికి చెందిన విఘ్నేశ్వర్(34) తనను న్యూట్రీషియన్‌గా చెప్పుకుని ఓ కిచెన్ ఏర్పాటు చేశాడు. వివిధ సాఫ్ట్వేర్ సంస్థల నుంచి దొంగ ఆర్డర్ డాక్యుమెంట్లు సృష్టించి వారికి ఆర్గానిక్ ఆహారం సరఫరా చేసే వ్యాపారంలో పెట్టుబడులను ఆహ్వానించాడు. అలాగే ఆర్గానిక్ హట్ అనే పేరుతో బజార్ నిర్వహిస్తున్నట్లు చెప్పడంతో వాసు అనే వ్యక్తి రూ. 20 లక్షలు పెట్టుబడిగా పెట్టాడు. అతనితో పాటు రాధ, జైపాల్‌రెడ్డి, సూరి పలువురు రూ.2 కోట్లకు పైగా పెట్టుబడులు పెట్టారు. అయితే నాలుగేళ్లు గడచినా వ్యాపారం ప్రారంభం కాకపోవడంతో బాధితులు నిలదీయగా వారికి చెక్కులు ఇచ్చిడు. అవి బౌన్్స కావడంతో అనుమానం వచ్చిన బాధితులు ఆరా తీయగా ఆర్గానిక్ హట్ పేరుతో ఎలాంటి బజార్ లేదని సాఫ్ట్వేర్ సంస్థల ఆర్డర్లు కూడా బోగస్‌గా తేలింది. తాము మోసపోయినట్లు జూబ్లీహిల్స్ పోలీసులకు ఫిర్యాదు చేయడంతో పోలీసులు నిందితుడిని అరెస్టు చేసి చీటింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సేంద్రియ సేద్యంలో ఎకరానికి రూ. 30 వేలు
కర్ణాటక రాష్ట్రంలో సేంద్రియ సేద్యానికి పట్టుగొమ్మ అయిన బెర్మ గౌడ ఇటీవల అనారోగ్యంతో తుదిశ్వాస విడిచారు. పాతికేళ్లుగా సేంద్రియ సేద్యం చేస్తున్న ఆయన భారతీయ సేంద్రియ రైతుల సంఘానికి రెండు దఫాలు అధ్యక్షుడిగా సేవలందించారు. ఆయన సేవలకు గుర్తింపుగా కర్ణాటక రాష్ట్ర ప్రభుత్వం 2007లో ప్రతిష్టాత్మక రాజ్యోత్సవ పురస్కారంతో సత్కరించింది. ‘ధరిత్రి’ పేరిట సేంద్రియ రైతులతో ట్రస్టును ఏర్పాటు చేశారు. ట్రస్టు సభ్యులు పండించిన సేంద్రియ వ్యవసాయోత్పత్తులకు విలువను జోడించడం.. సమంజసమైన ధరకు నేరుగా వినియోగదారులకుఅందించడంలో బెర్మ గౌడ విశేష కృషి చేశారు. సేంద్రియ ఆహారం సామాన్యులకూ అందించాలన్నదే తమ లక్ష్యమన్నారు. రెండు నెలల క్రితం చిరుధాన్యాలపై హైదరాబాద్‌లో డెక్కన్ డెవలప్మెంట్ సొసైటీ నిర్వహించిన జాతీయ సదస్సులో బెర్మ గౌడ విశిష్ట అతిథిగా పాల్గొన్నారు. ఆ సందర్భంగా ‘సాక్షి’తో తన సేద్యంపై కొద్దిసేపు సంభాషించారు. ముఖ్యాంశాలు కొన్ని ఆయన మాటల్లోనే.. నా స్వగ్రామం కర్ణాటకలోని గదక్ జిల్లాలోని యలవర్తి. నాకు 8 ఎకరాల పొలం ఉంది. చిన్నప్పటి నుంచి వ్యవసాయం చేస్తున్నా. నీటి వసతి లేదు. సేద్యం అంతా వర్షాధారమే. కరువు ప్రాంతం. భూగర్భ జలం అంతా ఉప్పు మయం. బోర్లు వేయలేదు. చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, పత్తి, మిరప, కూరగాయలు తదితర పంటలు పండిస్తాం. ప్రధాన పంటలతో పాటు కలిసి పెరిగే అంతర పంటలు సాగు చేయడం మాకు అలవాటు. దేశీ వంగడాలే వాడుతున్నాం. మా ప్రాంతంలో రసాయనిక ఎరువులు వాడే రైతులు కూడా అంతరపంటలు వేస్తుంటారు. జయధర్ అనే దేశీ పత్తి (దీనికి కొమ్మలు పెద్దగా రావు. నిటారుగా పెరుగుతుంది..)తోపాటు దేశీ బాడిగ మిరప వంగడం సాగు చేస్తున్నా. శనగతోపాటు జొన్న, కందితోపాటు కొర్రలు, సజ్జలు.. ఇలా పొలంలో ఎక్కడ చూసినా కొన్ని పంటలు కలిపి పండించడం మా అలవాటు. 28 ఏళ్లుగా సేంద్రియ సేద్యం చేస్తున్నా. అయినా, సేంద్రియ సర్టిఫికేషన్ తీసుకోలేదు. నమ్మకమే ముఖ్యం. ముంబైలోని సేంద్రియ దుకాణదారులకు 20 ఏళ్లుగా వ్యవసాయోత్పత్తులు సరఫరా చేస్తున్నా. నా దగ్గర రెండు వేరుశనగ వంగడాలున్నాయి. నిటారుగా పెరిగేది ఒకటి (ఎరెక్ట్ వెరైటీ. మూడున్నర నెలల్లో ఎకరానికి 4-6 క్వింటాళ్ల సేంద్రియ దిగుబడినిస్తుంది. దీనిలో కొర్ర, రాగులు, జీలకర్ర, ధనియాలు అంతరపంటలుగా వేస్తాం), చుట్టూ అల్లుకున్నట్లు పెరిగేది మరొకటి (స్ప్రెడింగ్ వెరైటీ. 5 నెలల పంట. ఎకరానికి 6-7 క్వింటాళ్ల దిగుబడినిస్తుంది. దీంట్లో అంతరపంటల సాగు సాధ్యం కాదు. జీలకర్ర మొక్కలను గట్ల వెంట వేస్తాం). సేంద్రియ పొలాల్లోని పంటల జీవవవైవిధ్యం చీడపీడల బెడద 75% తగ్గుతుంది. కషాయాల పిచికారీ అవసరం కూడా లేదు. మా జిల్లాలోని 110 మంది సేంద్రియ రైతులతో ధరిత్రి అనే పేరుతో 1988లో ట్రస్టును ఏర్పాటు చేసుకున్నాం. పండించిన పంటలకు ఈ ట్రస్టు ద్వారా విలువను జోడించి.. వేరుశనగ నూనె, కందిపప్పు.. తదితర ఉత్పత్తులను స్థానిక ప్రజలతోపాటు ముంబై, బెంగళూరు వంటి నగరాల్లో దుకాణదారులకు అమ్ముతున్నాం. ఎకరానికి రూ. 25 వేల నుంచి 30 వేల వరకు నికరాదాయం పొందుతున్నాం. సంపన్నులకే కాకుండా పేదలకు కూడా సేంద్రియ ఆహారం అందించాలన్నది మా లక్ష్యం. అయితే, మా పంటను వినియోగదారుడికి చేర్చడానికి చాలా ఖర్చు చేయాల్సిరావటం పెద్ద అవరోధంగా మారింది. మా ట్రస్టులో సేంద్రియ రైతులకు అప్పుల బాధా లేదు.. ఆత్మహత్యలు అసలే లేవు. -
ఎకో పంథా
సిటీలోని బడా హోటళ్లు నయా పంథాలో నడుస్తున్నాయి. ఆర్గానిక్ ఫుడ్‌కు ఓటేస్తూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మంగళవారం ‘ప్లానెట్ 21’ పేరుతో ‘నోవాటెల్’ వార్షికోత్సవాన్ని పర్యావరణ హితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహారం, పర్యావరణం, పచ్చదనం ప్రాధాన్యతను ఇక్కడ వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తాము టేస్ట్ అండ్ హెల్తీ మెనూను సిద్ధం చేస్తున్నట్టు కార్యక్రమం నిర్వాహకులు తెలిపారు. కాగా, కస్టమర్లు సైతం ఈ తరహా ఫుడ్‌కే ఓటేస్తుండటంతో బడా హోటళ్ల దారిలోనే మధ్య, చిన్నస్థాయి హోటళ్లూ నడుస్తున్నాయి. సేంద్రియ ఆహార ఉత్పత్తులను కాస్త ఎక్కువ రేటైనా పెట్టి కొనుగోలు చేస్తున్నాయి. కొన్ని హోటళ్లయితే ఏకంగా రైతులతోనే అగ్రిమెంట్ చేసుకొని రసాయనిక మందులు వాడని కూరగాయలు, బియ్యం తెప్పించుకుంటున్నాయి. రైతులకు కూడా బాగానే గిట్టుబాటు అవుతుండటంతో హోటళ్లకు తమ ఉత్పత్తులు అందించేందుకు ముందుకు వస్తున్నారు. ‘గిరిజన ప్రాంతాలైన ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కర్నూలు, కదిరి, మిర్యాలగూడ నుంచి రాగులు, కొర్రలు, జొన్నలు, అరికెలు, పప్పు, జొన్న ధాన్యాలు తెప్పిస్తున్నాం. మిల్లెట్ దోశ, రాగులు, జొన్న ఇడ్లీలు, చిరుధాన్యాల వడ, రాగులతో అటుకులు, జొన్న, సజ్జలతో అటుకులు (పోహ) చేస్తున్నాం, సిటీవాసుల నుంచి వీటికి మంచి రెస్పాన్స్ ఉంద’ని అంటున్నారు బంజారాహిల్స్ ఆహార్ బిస్ట్రో నిర్వాహకురాలు అర్చన. మా వద్దకు వచ్చే కస్టమర్లు టిఫిన్స్, లంచ్, డిన్నర్‌కు వాడే ఐటమ్స్ సేంద్రియ ఆహార పదార్థాలేనా అని అడుగుతున్నారంటే ఆహారం విషయంలో సిటీవాసులు ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు ట్రైడెంట్ హోటల్ ఉద్యోగి మోనిక. ‘ఒక్క ఆహారం విషయంలోనే కాదు మా హోటల్లో కస్టమర్లు వాడిన శీతలపానీయ బాటిళ్లను పారేయడం లేదు. వాటిని శుభ్రం చేసి అందులో ఇసుక నింపి ఇటుకల మధ్యలో వాడుతున్నాం. అలాగే ఉద్యోగులందరూ సైకిల్‌పై రావాలని కోరాం. తప్పనిసరై బైక్, కార్లపై వచ్చిన ఉద్యోగుల కోసం పొల్యూషన్ చెక్ వెహికల్ అందుబాటులో ఉంచాం. హోటల్‌కు వచ్చిన కస్టమర్ల వెహికల్‌కు కూడా ఫ్రీగానే చెక్ చేస్తున్నాం’ అంటున్నారు నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ జనరల్ మేనేజర్ నీల్ పీటర్సన్. ఈ సందర్భంగా వృథా అనుకునే ప్రతి వస్తువును తిరిగి ఏదో రకంగా ఎలా ఉపయోగించవచ్చో వివరించారు. - వాంకె శ్రీనివాస్ -
రసాయనాల్లేని తిండి తిందాం
సేంద్రియ ఆహారోత్పత్తులకు పెరుగుతున్న గిరాకీ - దేశ వ్యాప్తంగా ఏటా రూ.2 వేల కోట్ల వ్యాపారం - ఎగుమతుల వాటా రూ.1,800 కోట్లకు పైమాటే హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రసాయనాలు, పురుగు మందుల అవశేషాలు లేని సేంద్రియ ఆహారంపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రత్యేకించి అమెరికా, యూరప్ వంటి విదేశాలకు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు పెద్ద మొత్తంలోనే ఎగుమతి అవుతున్నాయి. దేశీయంగా పండుతున్న సేంద్రియ వ్యవసాయ దిగుబడుల్లో ఒక వంతు మాత్రమే మన దేశంలో వినియోగిస్తుండగా, అంతకు మూడు రెట్లు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. సాధారణ వ్యవసాయ దిగుబడులతో పోలిస్తే 50 శాతం అధిక ధర ఉన్నా.. మెట్రో నగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఏటా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ గణనీయంగా పెరుగుతోంది.వ్యవసాయ దిగుబడులు పెంచేందుకు, క్రిమికీటకాల నుంచి పంటను రక్షించేందుకు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం ఎక్కువగా జరుగుతోంది. మొక్కలకే వీటిని చల్లుతున్నప్పటికీ దిగుబడుల్లోనూ అవశేషాలు ఉంటున్నాయని, వీటిని తిన్న వారు అనారోగ్యానికి గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు. అందుకే సేంద్రియ ఎరువు, సహజసిద్ధ కీటక నాశినులను వినియోగించి సాగుచేసిన సేంద్రియ వ్యవసాయ దిగుబడులకు ఆదరణ పెరుగుతోంది. అమెరికా, ఐరోపా వంటి దేశాల్లో ఎప్పటినుంచో సేంద్రియ ఆహారాన్ని వినియోగిస్తున్నారు. 2004లో అమెరికాలో 11 బిలియన్ డాలర్ల మేర ఉన్న సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ గతేడాది రూ. 27 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. అదే యూరప్‌లో అయితే గతేడాది రూ.10 బిలియన్ డాలర్లుగా ఉందని ఎస్ బ్యాంక్ నివేదిక చెబుతోంది. ఎగుమతుల వాటా రూ.1,800 కోట్లు.. 2013లో దేశ వ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ విలువ రూ. 2 వేల కోట్లుగా ఉంటే.. ఇందులో అమెరికా, యూరప్ వంటి విదేశాలకు ఎగుమతి అవుతున్నది సుమారు రూ.1,800 కోట్లకు పైగానే ఉంటుందని శ్రేష్ట నేచురల్ బయో ప్రొడక్ట్స్ ఎండీ రాజ్ శీలం ‘సాక్షి బిజినెస్ బ్యూరోకు చెప్పారు. ఏటా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ విలువ 20-22 శాతం పెరుగుతుండగా.. ఎగుమతుల వ్యాపారం మాత్రం 30-40 శాతం పెరుగుతోందని చెప్పుకొచ్చారు. సేంద్రియ ఆహార ఉత్పత్తులు మెట్రో నగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ లభ్యమవుతున్నాయి. రిలయన్స్, హైప ర్సిటీ, ఫుడ్ బజార్, మోర్, నీల్గిరీస్, గోద్రెజ్ నేచర్స్ బాస్కెట్, స్పెన్సర్ వంటి అన్ని రిటైల్ మార్కెట్లతో పాటు మందుల షాపుల్లోనూ సేంద్రియ ఆహార ఉత్పత్తులను విక్రయిస్తున్నారు. 4.43 మిలియన్ హెక్టార్లలో సాగు.. దేశ వ్యాప్తంగా 4.43 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సుమారుగా 5,70,000 మంది రైతులు సేంద్రియ వ్యవసాయాన్ని సాగు చేస్తున్నారు. వీటి నుంచి 1,71,100 టన్నుల సేంద్రియ ఉత్పత్తులను పండిస్తున్నారు. ‘‘మొత్తం 13 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం సాగు చేస్తున్నా. ఇందులో 9 ఎకరాల్లో దానిమ్మ, 4 ఎకరాల్లో కూరగాయలు పండిస్తున్నా. నెలక్రితం అంతర్గత పంట కింద 9 ఎకరాల్లో పుచ్చకాయ పంటను పండించాను. 80 రోజుల్లోనే పంట పూర్తయింది. మొత్తం రూ.50 వేల ఖర్చురాగా.. రెండున్నర లక్షలకు విక్రయించా’’ అని కరీంనగర్ జిల్లాకు చెందిన రైతు, వృత్తిరీత్యా పోలీస్ అధికారి అయిన దాసరి భూమయ్య ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు చెప్పారు. సేంద్రియ వ్యవసాయ సాగుకు ప్రత్యేకమైన గిడ్డంగుల్లేక పెద్ద సంఖ్యలో రైతులు ముందుకురావట్లేదని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే 4 వేల ఎకరాలకు పైగా భూముల్లో సేంద్రియ వ్యవసాయం సాగుతోంది. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోనూ సాగు చేస్తున్నారు.