ఎకో పంథా
సిటీలోని బడా హోటళ్లు నయా పంథాలో నడుస్తున్నాయి. ఆర్గానిక్ ఫుడ్‌కు ఓటేస్తూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మంగళవారం ‘ప్లానెట్ 21’ పేరుతో ‘నోవాటెల్’ వార్షికోత్సవాన్ని పర్యావరణ హితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహారం, పర్యావరణం, పచ్చదనం ప్రాధాన్యతను ఇక్కడ వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తాము టేస్ట్ అండ్ హెల్తీ మెనూను సిద్ధం చేస్తున్నట్టు కార్యక్రమం నిర్వాహకులు తెలిపారు.
కాగా, కస్టమర్లు సైతం ఈ తరహా ఫుడ్‌కే ఓటేస్తుండటంతో బడా హోటళ్ల దారిలోనే మధ్య, చిన్నస్థాయి హోటళ్లూ నడుస్తున్నాయి. సేంద్రియ ఆహార ఉత్పత్తులను కాస్త ఎక్కువ రేటైనా పెట్టి కొనుగోలు చేస్తున్నాయి. కొన్ని హోటళ్లయితే ఏకంగా రైతులతోనే అగ్రిమెంట్ చేసుకొని రసాయనిక మందులు వాడని కూరగాయలు, బియ్యం తెప్పించుకుంటున్నాయి. రైతులకు కూడా బాగానే గిట్టుబాటు అవుతుండటంతో హోటళ్లకు తమ ఉత్పత్తులు అందించేందుకు ముందుకు వస్తున్నారు.
‘గిరిజన ప్రాంతాలైన ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కర్నూలు, కదిరి, మిర్యాలగూడ నుంచి రాగులు, కొర్రలు, జొన్నలు, అరికెలు, పప్పు, జొన్న ధాన్యాలు తెప్పిస్తున్నాం. మిల్లెట్ దోశ, రాగులు, జొన్న ఇడ్లీలు, చిరుధాన్యాల వడ, రాగులతో అటుకులు, జొన్న, సజ్జలతో అటుకులు (పోహ) చేస్తున్నాం, సిటీవాసుల నుంచి వీటికి మంచి రెస్పాన్స్ ఉంద’ని అంటున్నారు బంజారాహిల్స్ ఆహార్ బిస్ట్రో నిర్వాహకురాలు అర్చన. మా వద్దకు వచ్చే కస్టమర్లు టిఫిన్స్, లంచ్, డిన్నర్‌కు వాడే ఐటమ్స్ సేంద్రియ ఆహార పదార్థాలేనా అని అడుగుతున్నారంటే ఆహారం విషయంలో సిటీవాసులు ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు ట్రైడెంట్ హోటల్ ఉద్యోగి మోనిక.
‘ఒక్క ఆహారం విషయంలోనే కాదు మా హోటల్‌లో కస్టమర్లు వాడిన శీతలపానీయ బాటిళ్లను పారేయడం లేదు. వాటిని శుభ్రం చేసి అందులో ఇసుక నింపి ఇటుకల మధ్యలో వాడుతున్నాం. అలాగే ఉద్యోగులందరూ సైకిల్‌పై రావాలని కోరాం. తప్పనిసరై బైక్, కార్లపై వచ్చిన ఉద్యోగుల కోసం పొల్యూషన్ చెక్ వెహికల్ అందుబాటులో ఉంచాం. హోటల్‌కు వచ్చిన కస్టమర్ల వెహికల్‌కు కూడా ఫ్రీగానే చెక్ చేస్తున్నాం’ అంటున్నారు నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ జనరల్ మేనేజర్ నీల్ పీటర్సన్. ఈ సందర్భంగా వృథా అనుకునే ప్రతి వస్తువును తిరిగి ఏదో రకంగా ఎలా ఉపయోగించవచ్చో వివరించారు.
- వాంకె శ్రీనివాస్