గోపాల గోపాల | Jawaharlal Nehru Manipuri Dance Academy | Sakshi
Sakshi News home page

గోపాల గోపాల

Published Sun, Apr 19 2015 11:44 PM | Last Updated on Mon, Aug 20 2018 4:42 PM

గోపాల గోపాల - Sakshi

గోపాల గోపాల

మణిపూర్ వైభవానికి ప్రతీకగా నిలిచిన నృత్యరీతులు ‘వసంత్‌రాస్.. పుంగ్ చోలమ్’. ఈ జంట నృత్యాల సవ్వడిలో శిల్పారామంలోని అంఫీథియేటర్ ఆదివారం మార్మోగింది. ఇంఫాల్‌కు చెందిన జవహర్‌లాల్ నెహ్రూ మణిపురీ డ్యాన్స్ అకాడమీకి చెందిన కళాకారులు ప్రదర్శించిన నాట్యం ఆహూతులను ఆద్యంతం అలరించింది. ఈ సందర్భంగా డ్యాన్స్ అకాడమీ డెరైక్టర్ ఉపేంద్రశర్మ సిటీప్లస్ తో పంచుకున్న విశేషాలు ..
- వాంకె శ్రీనివాస్

 
వసంత్‌రాస్.. రాధాకృష్ణుల రాసలీలను కళ్లకుకడుతుంది. వసంత రాస్.. మణిపూర్‌కు వరంగా దొరకడం వెనుక పౌరాణిక గాథ ఒకటి ప్రచారంలో ఉంది. బృందావనంలో గోపికల సమేతంగా రాధాకృష్ణులు రసరమ్య కేళిని.. పార్వతీదేవి చూడాలనుకుంటుంది. ఆమె కోరిక మేరకు శివుడు పార్వతితో కలసి మణిపూర్‌లోని ఓ అందమైన ప్రాంతంలో ఆనందలాస్యం చేశాడని ప్రతీతి.
 
ఆనాటి నుంచి వసంత రాస్.. మణిపురీల సొంతమైంది. పౌరాణిక, చారిత్రక ప్రాశస్త్యం పొందిన వసంత్‌రాస్ నాట్యం మణిపూర్‌తో పాటు వివిధ రాష్ట్రాలకు విస్తరించింది. హైదరాబాదీలు కూడా వసంత్‌రాస్ నాట్యం అభ్యసించడానికి ఉత్సాహం కనబరుస్తున్నారు.
 
నాట్య గోవిందం..
ఈ నాట్యంలో రాధాకృష్ణుల ఆనందకేళి, గోపాలుడితో గోపికల అల్లరి.. కళ్లకు కట్టడమే వసంతరాస్ నాట్యంలో ప్రధానాంశం. తరతరాలుగా ఎందరో మహానుభావులు ఈ నృత్యరీతికి తమ ప్రతిభతో అదనపు సొబగులు అద్దుతున్నారు. ఈ నృత్యంలో నర్తకిలు చేతివేళ్లతో ప్రదర్శించే ముద్రలు ప్రధాన ఆకర్షణగా నిలుస్తాయి. గోపికలంతా శ్రీ కృష్ణుడి చుట్టూ చేరి.. ఆరాధన భావనతో అతనివైపే చూస్తూ నాట్యంలో లీనమైపోతారు. ఒక్కమాటలో చెప్పాలంటే.. ఆనాడు యమునా తీరంలో కృష్ణుడి వైభోగాన్ని ఈ కళాకారులు మన కళ్లముందుంచుతారు.
 
మృదంగలాస్యం..
ఇక మణిపురి నట సంకీర్తన పుంగ్ చోలమ్‌కు విశేష ఆదరణ ఉంది. పుంగ్ అంటే మృదంగం వాయించడం.. చోలమ్ అంటే కదలికలు అని అర్థం. కళాకారులు మృదంగాలు వాయిస్తూ.. పాదాలు చకచకా కదుపుతూ.. గాలిలో ఎగురుతూ చేసే నృత్యం అద్భుతంగా కనిపిస్తుంది. 600 ఏళ్ల క్రితం దీనికి అత్యంత ప్రాధాన్యం ఉండేది. మణిపూర్‌లోని పల్లెల్లో హోలీ సందర్భంగా ఈ నృత్యం చేసేవారు. కాలక్రమంలో పల్లె దాటిన ఈ నృత్యం.. ప్రపంచ వేదికపై కూడా తన వైభవాన్ని చాటింది.

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement