big hotels
-
స్విగ్గీ.. జొమాటోకు షాక్.!
న్యూఢిల్లీ: జొమాటో.. స్విగ్గీ.. పట్టణ ప్రజలకు పెద్దగా పరిచయం చేయాల్సిన అవసరం లేనివి. కరోనా వచ్చిన తర్వాత ఈ ఆన్లైన్ ఫుడ్ డెలివరీ ప్లాట్‌ఫామ్‌ల సేవలు మరింతగా విస్తరించాయి. వైరస్ కారణంగా ఎక్కువ మంది ఆహారం కోసం బయటకు వెళ్లకుండా ఇంటి నుంచే ఆర్డర్ చేసి తెప్పించుకునేందుకు ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకే వీటి ప్రాచుర్యం మరింత పెరిగిపోయింది. ఈ పరిస్థితులను గమనించిన కొన్ని పెద్ద రెస్టారెంట్లు మనమే సొంతంగా ఎందుకు డెలివరీ చేయకూడదు? జొమాటో, స్విగ్గీలపై ఎంతకాలం ఆధారపడడం? అన్న ఆలోచనలకు వస్తున్నాయి. నేషనల్ రెస్టారెంట్ అసోసియేషన్ (ఎన్ఆర్ఏఐ)లో సభ్యత్వం కలిగిన కొన్ని రెస్టారెంట్లు డాట్పే, థ్రైవ్ వంటి టెక్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుని సొంతంగా ఆన్లైన్ ఆర్డర్ ప్లాట్‌ఫామ్‌లను ఏర్పాటు చేసుకుంటున్నాయి. గూగుల్ సెర్చింజన్, ఫేస్బుక్ తదితర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌లపైనా ఆయా రెస్టారెంట్లు తమ ఆన్లైన్ ఆర్డర్ల లింక్‌లకు ప్రచారం కల్పించే మార్కెటింగ్ వ్యూహాలను కూడా అమలు చేస్తున్నాయి. జొమాటో, స్విగ్గీలకు రెస్టారెంట్లు ప్రతీ ఆర్డర్‌పై ఇంత చొప్పున కమీషన్ చెల్లించుకోవాల్సి ఉంటుంది. ఒక్కో సందర్భంలో ఈ కమీషన్ 30 శాతం వరకు ఉంటుందని రెస్టారెంట్లు చెబుతున్నాయి. తామే సొంతంగా జొమాటో, స్విగ్గీ మాదిరిగా కస్టమర్లను చేరుకునే మార్గాలు తెలుసుకుంటే ఈ మేర కమీషన్‌ను ఆదా చేసుకోవచ్చని భావిస్తున్నాయి. ఎక్కువ మందిని చేరుకోవచ్చు.. ‘‘సాధారణంగా 7–10 కిలోమీటర్ల పరిధిలోనే అగ్రిగేటర్లు (స్విగ్గీ, జొమాటో తదితర) సేవలు అందించగలవు. సొంతంగా నెట్‌వర్క్‌ను కలిగి ఉంటే లేదా లాజిస్టిక్స్ కంపెనీలతో భాగస్వామ్యం కుదుర్చుకుంటే ఇంతకుమించిన దూరంలో ఉన్న కస్టమర్లను కూడా చేరుకునేందుకు వీలుంటుంది’’ అని దేవిదయాళ్ వివరించారు. హంగర్ హాస్పిటాలిటీ సైతం 80% ఆర్డర్లను సొంత ఆన్లైన్ ఆర్డర్ ప్లాట్‌ఫామ్ నుంచే సమకూర్చుకుంటోంది. ఈ సంస్థకు బాంబే క్యాంటీన్, ఓ పెడ్రో, బాంబే స్వీట్‌షాప్ తదితర బ్రాండ్లున్నాయి. థ్రైవ్ సాయంతో సొంతంగా ఆర్డర్లను స్వీకరించే టెక్నాలజీ ప్లాట్‌ఫామ్‌ను ఈ సంస్థ ఏర్పాటు చేసుకుంది. సొంత డెలివరీ నెట్‌వర్క్‌ను ఏర్పాటు చేసుకుని కస్టమర్లను చేరుకుంటోంది. ఈ సంస్థ ఇటీవలే రెండు ప్రత్యేకమైన బ్రాండ్లను ఆవిష్కరించింది. ఇవి స్విగ్గీ, జొమాటో ప్లాట్‌ఫామ్‌లపై అందుబాటులో ఉండవు. సొంత ప్లాట్‌ఫామ్‌పైనే వీటిని ఆఫర్ చేస్తోంది. ‘‘మార్కెటింగ్‌కు ఇన్‌స్ట్రాగామ్ సేవలను వినియోగిస్తున్నాం. దీర్ఘకాలం కోసం బ్రాండ్లను ఏర్పాటు చేసుకున్నాం కనుక మార్కెటింగ్ ఖర్చులు సహేతుకంగానే అనిపిస్తున్నాయి’’ అని సంస్థ వ్యవస్థాపకుడు యాష్ బనాజే చెప్పారు. ఢిల్లీకి చెందిన బిగ్ చిల్ కేఫ్ సైతం సొంతంగానే ఆన్ లైన్ ఆర్డర్ల స్వీకరణ, డెలివరీ సేవలను అందిస్తోంది. కస్టమర్లు కోరుకున్న రుచులు రెస్టారెంట్లు సొంతంగానే ఆర్డర్లు తీసుకోవడం వల్ల కస్టమర్లకు ఇష్టమైన రుచులను అందించేందుకు వీలుంటుందని ఫుడ్మ్యాటర్స్ ఇండియా పార్ట్నర్ గౌరీదేవిదయాళ్ పేర్కొన్నారు. కస్టమర్లు కోరుకున్న ప్రత్యేకమైన రెసిపీలను తయారు చేసి డెలివరీ చేసేందుకు వీలుంటుందన్నారు. అదే జొమాటో, స్విగ్గీ ప్లాట్‌ఫామ్‌లపై ఇందుకు పరిమిత అవకాశమే ఉంటుందన్నది ఆయన విశ్లేషణ. -
ఎకో పంథా
సిటీలోని బడా హోటళ్లు నయా పంథాలో నడుస్తున్నాయి. ఆర్గానిక్ ఫుడ్‌కు ఓటేస్తూ కస్టమర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేస్తున్నాయి. మంగళవారం ‘ప్లానెట్ 21’ పేరుతో ‘నోవాటెల్’ వార్షికోత్సవాన్ని పర్యావరణ హితంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆహారం, పర్యావరణం, పచ్చదనం ప్రాధాన్యతను ఇక్కడ వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే తాము టేస్ట్ అండ్ హెల్తీ మెనూను సిద్ధం చేస్తున్నట్టు కార్యక్రమం నిర్వాహకులు తెలిపారు. కాగా, కస్టమర్లు సైతం ఈ తరహా ఫుడ్‌కే ఓటేస్తుండటంతో బడా హోటళ్ల దారిలోనే మధ్య, చిన్నస్థాయి హోటళ్లూ నడుస్తున్నాయి. సేంద్రియ ఆహార ఉత్పత్తులను కాస్త ఎక్కువ రేటైనా పెట్టి కొనుగోలు చేస్తున్నాయి. కొన్ని హోటళ్లయితే ఏకంగా రైతులతోనే అగ్రిమెంట్ చేసుకొని రసాయనిక మందులు వాడని కూరగాయలు, బియ్యం తెప్పించుకుంటున్నాయి. రైతులకు కూడా బాగానే గిట్టుబాటు అవుతుండటంతో హోటళ్లకు తమ ఉత్పత్తులు అందించేందుకు ముందుకు వస్తున్నారు. ‘గిరిజన ప్రాంతాలైన ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, కర్నూలు, కదిరి, మిర్యాలగూడ నుంచి రాగులు, కొర్రలు, జొన్నలు, అరికెలు, పప్పు, జొన్న ధాన్యాలు తెప్పిస్తున్నాం. మిల్లెట్ దోశ, రాగులు, జొన్న ఇడ్లీలు, చిరుధాన్యాల వడ, రాగులతో అటుకులు, జొన్న, సజ్జలతో అటుకులు (పోహ) చేస్తున్నాం, సిటీవాసుల నుంచి వీటికి మంచి రెస్పాన్స్ ఉంద’ని అంటున్నారు బంజారాహిల్స్ ఆహార్ బిస్ట్రో నిర్వాహకురాలు అర్చన. మా వద్దకు వచ్చే కస్టమర్లు టిఫిన్స్, లంచ్, డిన్నర్‌కు వాడే ఐటమ్స్ సేంద్రియ ఆహార పదార్థాలేనా అని అడుగుతున్నారంటే ఆహారం విషయంలో సిటీవాసులు ఎన్ని జాగ్రత్తలు పాటిస్తున్నారో అర్థం చేసుకోవచ్చని అంటున్నారు ట్రైడెంట్ హోటల్ ఉద్యోగి మోనిక. ‘ఒక్క ఆహారం విషయంలోనే కాదు మా హోటల్లో కస్టమర్లు వాడిన శీతలపానీయ బాటిళ్లను పారేయడం లేదు. వాటిని శుభ్రం చేసి అందులో ఇసుక నింపి ఇటుకల మధ్యలో వాడుతున్నాం. అలాగే ఉద్యోగులందరూ సైకిల్‌పై రావాలని కోరాం. తప్పనిసరై బైక్, కార్లపై వచ్చిన ఉద్యోగుల కోసం పొల్యూషన్ చెక్ వెహికల్ అందుబాటులో ఉంచాం. హోటల్‌కు వచ్చిన కస్టమర్ల వెహికల్‌కు కూడా ఫ్రీగానే చెక్ చేస్తున్నాం’ అంటున్నారు నోవాటెల్ హైదరాబాద్ కన్వెన్షన్ సెంటర్ జనరల్ మేనేజర్ నీల్ పీటర్సన్. ఈ సందర్భంగా వృథా అనుకునే ప్రతి వస్తువును తిరిగి ఏదో రకంగా ఎలా ఉపయోగించవచ్చో వివరించారు. - వాంకె శ్రీనివాస్ -
ప్రజారోగ్యం గాలిలో దీపం
సుభాష్‌నగర్, న్యూస్‌లైన్: నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర పట్టణ ప్రాంతాలలో చిన్న, పెద్ద హోటళ్లు, దాబాలు, ఫ్యా మిలీ రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలు వందల సంఖ్యలో ఉన్నాయి. చిన్నచిన్న పట్టణాలు, గ్రామాలలోనూ హోటళ్లున్నాయి. మందుబాబు ల కోసం ప్రతి వైన్ షాప్, బెల్ట్ షాప్‌ల వద్ద ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు వెలిశాయి. వీటిపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. కేంద్రాల నిర్వాహకులు లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. పదార్థాల తయారీలో నాసి రకం వస్తువులు, నూనెలు వాడుతున్నారు. పరిసరాల పరిశుభ్రతను పట్టించుకోకపోవడంతో తినుబండారాలపై ఈగలు, క్రిమికీటకాదులు వాలుతూ ప్రజలను ఆనారోగ్యం పాలు చేస్తున్నాయి. చిన్న హోటళ్లు పేద మధ్య తరగతి ప్రజలు చిన్న హోటళ్లకే వెళ్తుంటారు. ఇక్కడ తక్కువ ధరకు ఆహార పదార్థాలు లభిస్తుండడమే ఇందుకు కారణం. అయితే ఎక్కువగా చిన్న హోటళ్లు ఇరుకు గదుల్లో, మురికి కూపాలలోనే ఉంటున్నాయి. పరిశుభ్రత అన్నది భూతద్దంతో వెతికినా కనిపించదు. తక్కువ ధరకు టిఫిన్లు, భోజనం అందించడం కోసం వారు చవుకబారు వస్తువులనే వాడుతున్నారు. అధికారులు వీటి వైపు కన్నెత్తి చూడకపోవడంతో చిరు హోటళ్ల నిర్వాహకుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. బడా హోటళ్లలోనూ జిల్లావ్యాప్తంగా పేరు పొందిన బడా హోటళ్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. పైకి చక్కగా కనిపించినా, వాటి కిచెన్, పరిసరాలు మరీ అధ్వానంగా ఉం టాయి. అంటే పైన పటారం లోన లొటారం అన్న చందంగా ఉంటాయి. మిగిలిపోయిన ఆహార పదార్థాలను నిల్వ చేసి తరువాతి రోజుల్లో విక్రయిస్తారన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఆ రోజు మిగిలిన మాంసాహారాన్ని నిల్వ ఉంచి, తర్వాతి రోజు వేడి చేసి వడ్డిస్తున్నారని తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా చాలా మంది అస్వస్థతకు గురి అవుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో జిల్లావ్యాప్తంగా ప్రతి కూడలిలో ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలున్నాయి. వీటిలో పరిశుభ్రత దేవతావస్త్రమే. వీరు వాడే వస్తువులు చాలా వరకు నాసిరకంగా ఉంటాయి. ఇక నూనె అయితే కడాయిలో గంటల తరబడి కాగుతూనే ఉంటుంది. తర్వాతి రోజు ఆ నూనెలోనే మళ్లీ కొత్త నూనె పోసి ఫాస్ట్ఫుడ్స్ తయారు చేస్తుంటారు. ఇది జగమెరిగిన సత్యం. అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలపై దృష్టి సారించడంలేదన్న విమర్శలున్నా యి. దీంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. మార్పు తీసుకొచ్చి చర్యలు తీసుకుంటాం : అమృతశ్రీ, జిల్లా ఆహార భద్రత అధికారి పరిశుభ్రత పాటించని హోటళ్ల నిర్వాహకులతో మాట్లాడతాం. వారిలో మార్పు తీసుకువస్తాం. ఒకేసారి మార్పు రావడం కష్టం. మెల్లిమెల్లిగా విజయం సాధిస్తాం. ప్రజారోగ్యం విషయంలో రాజీపడబోం. నిబంధనలు పాటించని హోటళ్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తాం.