సుభాష్‌నగర్, న్యూస్‌లైన్: నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర పట్టణ ప్రాంతాలలో చిన్న, పెద్ద హోటళ్లు, దాబాలు, ఫ్యా మిలీ రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలు వందల సంఖ్యలో ఉన్నాయి. చిన్నచిన్న పట్టణాలు, గ్రామాలలోనూ హోటళ్లున్నాయి. మందుబాబు ల కోసం ప్రతి వైన్ షాప్, బెల్ట్ షాప్‌ల వద్ద ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు వెలిశాయి. వీటిపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. కేంద్రాల నిర్వాహకులు లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. పదార్థాల తయారీలో నాసి రకం వస్తువులు, నూనెలు వాడుతున్నారు. పరిసరాల పరిశుభ్రతను పట్టించుకోకపోవడంతో తినుబండారాలపై ఈగలు, క్రిమికీటకాదులు వాలుతూ ప్రజలను ఆనారోగ్యం పాలు చేస్తున్నాయి.
చిన్న హోటళ్లు
పేద మధ్య తరగతి ప్రజలు చిన్న హోటళ్లకే వెళ్తుంటారు. ఇక్కడ తక్కువ ధరకు ఆహార పదార్థాలు లభిస్తుండడమే ఇందుకు కారణం. అయితే ఎక్కువగా చిన్న హోటళ్లు ఇరుకు గదుల్లో, మురికి కూపాలలోనే ఉంటున్నాయి. పరిశుభ్రత అన్నది భూతద్దంతో వెతికినా కనిపించదు. తక్కువ ధరకు టిఫిన్లు, భోజనం అందించడం కోసం వారు చవుకబారు వస్తువులనే వాడుతున్నారు. అధికారులు వీటి వైపు కన్నెత్తి చూడకపోవడంతో చిరు హోటళ్ల నిర్వాహకుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది.
బడా హోటళ్లలోనూ
జిల్లావ్యాప్తంగా పేరు పొందిన బడా హోటళ్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. పైకి చక్కగా కనిపించినా, వాటి కిచెన్, పరిసరాలు మరీ అధ్వానంగా ఉం టాయి. అంటే పైన పటారం లోన లొటారం అన్న చందంగా ఉంటాయి. మిగిలిపోయిన ఆహార పదార్థాలను నిల్వ చేసి తరువాతి రోజుల్లో విక్రయిస్తారన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఆ రోజు మిగిలిన మాంసాహారాన్ని నిల్వ ఉంచి, తర్వాతి రోజు వేడి చేసి వడ్డిస్తున్నారని తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా చాలా మంది అస్వస్థతకు గురి అవుతున్నారు.
ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో
జిల్లావ్యాప్తంగా ప్రతి కూడలిలో ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలున్నాయి. వీటిలో పరిశుభ్రత దేవతావస్త్రమే. వీరు వాడే వస్తువులు చాలా వరకు నాసిరకంగా ఉంటాయి. ఇక నూనె అయితే కడాయిలో గంటల తరబడి కాగుతూనే ఉంటుంది. తర్వాతి రోజు ఆ నూనెలోనే మళ్లీ కొత్త నూనె పోసి ఫాస్ట్‌ఫుడ్స్ తయారు చేస్తుంటారు. ఇది జగమెరిగిన సత్యం. అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలపై దృష్టి సారించడంలేదన్న విమర్శలున్నా యి. దీంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు.
మార్పు తీసుకొచ్చి చర్యలు తీసుకుంటాం : అమృతశ్రీ, జిల్లా ఆహార భద్రత అధికారి
పరిశుభ్రత పాటించని హోటళ్ల నిర్వాహకులతో మాట్లాడతాం. వారిలో మార్పు తీసుకువస్తాం. ఒకేసారి మార్పు రావడం కష్టం. మెల్లిమెల్లిగా విజయం సాధిస్తాం. ప్రజారోగ్యం విషయంలో రాజీపడబోం. నిబంధనలు పాటించని హోటళ్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తాం.
ప్రజారోగ్యం గాలిలో దీపం
Published Mon, Mar 3 2014 3:29 AM | Last Updated on Sat, Sep 2 2017 4:16 AM
Advertisement
Advertisement