Fast food centers
-
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై విజిలెన్స్ అధికారులు షాకింగ్ నిర్ణయం..
కరీంనగర్: నగరంలోని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లపై గురువారం సాయంత్రం విజిలెన్స్ అధికారులు దాడులు నిర్వహించారు. నగరంలోని భగత్‌నగర్, టవర్ సర్కిల్, సీతారాంపూర్‌తో పాటు పలు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లలో తనిఖీలు నిర్వహించారు. ఆహార నాణ్యత, వాడుతున్న రసాయనాలు, పలు అంశాలపై ఆరా తీశారు. దాడుల్లో డీఎస్పీ శ్రీనివాస్, సీఐలు అనిల్‌కుమార్, వరుణ్‌ప్రకాశ్, తహసీల్దార్ దినేష్‌రెడ్డి, ఫుడ్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో దూసుకెళ్లిన బెలినో కార్
సదాశివపేట (సంగారెడ్డి): వేగంగా వచ్చిన కారు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లోకి దూసుకెళ్లింది. టేక్మాల్ మండలం ఎల్లపేటకు చెందిన శ్రీకాంత్‌తో సహా నలుగురు వికారాబాద్‌లోని అనంతగిరి గుట్ట నుంచి తిరిగి వస్తున్నారు. మార్గమధ్యలో మధ్యాహ్నం 12 గంటల ప్రాంతంలో పట్టణంలో ఉన్న నరసింహ ఫాస్ట్ ఫుడ్ సెంటర్లోకి కారు దూసుకెళ్లింది. ఈ ఘటనలో నాలుగు బైకులు దెబ్బతిన్నాయి. హోటల్‌కూ నష్టం వాటిల్లింది. ప్రమాదం జరిగిన వెంటనే కారులో ఉన్న నలుగురిలో ముగ్గురు పారిపోయారు. ఒకరిని పోలీసులు అదుపులో తీసుకున్నారు. -
ఫాస్ట్‌ఫుడ్.. హెల్త్బ్యాడ్! తెల్లగా మారితే.. ఆరెంజ్ కలర్ వేసి మరీ.. వామ్మో!
రాజన్నసిరిసిల్ల జిల్లా కేంద్రానికి చెందిన పద్నాలుగేళ్ల బాలుడు రాకేశ్ ఏడాదిగా అత్యధిక రోజులు ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో తింటున్నాడు. పొట్టలో విపరీతమైన నొప్పి రావడంతో వైద్యుని వద్దకు వెళ్లాడు. పరీక్షించిన వైద్యుడు గ్యాస్ట్రిక్ సమస్య ఏర్పడిందని ఫాస్ట్‌ఫుడ్ మానేయాలని సూచించాడు. గంభీరావుపేటకు చెందిన ఓ రైతు పది హేను రోజుల క్రితం పని నిమిత్తం సిరిసిల్లకు వచ్చి మధ్యాహ్నం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో నోటికి రుచికరమైన పదార్థాలు ఆరగించాడు. సాయంత్రం ఇంటికెళ్లేసరికి వాంతులు, విరేచనాలు కావడంతో వైద్యుడి వద్దకు వెళ్లాడు. ఫుడ్ పాయిజన్ అయిందన్నారు. దీనికి కారణం వెతకగా..ఫాస్ట్‌ఫుడ్‌గా తేల్చారు. సాక్షి, సిరిసిల్లటౌన్: జిల్లాలో ఫాస్ట్‌ఫుడ్ కల్చర్ వెర్రితలలు వేస్తోంది. నాణ్యత లేని పదార్థాలతో చేస్తున్న వంటలు ప్రజలను ఆస్పత్రుల పాలుచేస్తుంది. జంక్‌ఫుడ్‌గా పిలిచే ఫాస్ట్‌ఫుడ్ అలవాటుగా చేసుకుంటే ప్రాణాల మీదికొచ్చే అవకాశం ఉన్నా జనాలు పట్టించుకోవడం లేదు. ప్రజా ఆరోగ్యంపై ప్రభావం చూపెడుతున్నా నియంత్రించాల్సిన అధికారులు చర్యలు చేపట్టడం లేదు. ఫలితంగా జిల్లాలో ప్రజా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తున్న నాసిరకం, నిబంధనలు పాటించకుండా తయారు చేసే ఫాస్ట్‌ఫుడ్‌పై ‘సాక్షి’ పరిశోధనాత్మక కథనం.. రూ.కోట్లలో వ్యాపారం ఫాస్ట్‌ఫుడ్ కల్చర్ ఒకప్పుడు నగరాల్లోనే ఉండేది. ఇప్పుడది ప్రతీ పల్లెకు విస్తరించింది. చిన్నపాటి గ్రామంలో సైతం ఫాస్ట్‌ఫుడ్‌ను జనాలు ఇష్టపడుతున్నారు. ఫలితంగా ఆరోగ్యాన్ని పాడుచేసేదే అయినా అధిక లాభాలు వస్తుండడంతో వ్యాపారులు విచ్చలవిడిగా విక్రయిస్తున్నారు. జిల్లాలోని సిరిసిల్ల, వేములవాడ పట్టణాలతో పాటు అన్ని మండల కేంద్రాలు, ప్రధాన పల్లెలు, హైవేపై ఉండే గ్రామాల్లో సైతం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు నిర్వర్తిస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 200 పైగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లు నడుస్తున్నాయి. వీటిలో రోజుకు తక్కువలో తక్కువగా రూ.10లక్షల వరకు దందా సాగుతోంది. నెలకు రూ.3కోట్లలో ఫాస్ట్‌ఫుడ్ దందా జరుగుతుంది. నిబంధనలు బేఖాతర్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు నిబంధనలు బేఖాతర్ చేస్తున్నారు. నాణ్యమైన ఆహార పదార్థాలు, నూనెలు వినియోగించాల్సి ఉండగా.. ఎక్కువ ఫాస్ట్సెంటర్లలో నాసిరకం వాడుతున్నట్లు సమాచారం. నాణ్యమైనవి, బ్రాండెడ్ వాడాలంటే.. ఖరీదు కాబట్టి.. తక్కువ రేటుకు దొరికే పదార్థాలు, నూనెలు వాడుతున్నారు. రుచి కోసం ఆహారంలో నిశేధిత రంగులు, రసాయనాలు కలుపుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే నాణ్యమైనవి వాడుతున్నామని ఫాస్ట్‌సెంటర్ నిర్వాహకులు చెబుతున్నా..ఏళ్ల తరబడిగా అధికారుల పర్యవేక్షణ లేకపోవడం విమర్శలకు తావిస్తోంది. ప్రస్తుతం హోటల్స్, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వహణపై తనిఖీలు చేపట్టే అధికారం ఉన్న శాఖలు ‘మామూలు’గా వదిలేస్తున్నారన్న ఆరోపణలు వస్తున్నాయి. ఇవీ ప్రభావాలు.. చికెన్ ఫ్రైడ్‌రైస్ చేసేటప్పుడు తెల్లగా మారిన చికెన్‌ను ఆరెంజ్ రంగు వేసి కనిపించకుండా చేస్తారు. ఈ కలర్ ప్రభావం ఒకసారి మన చేతికి అంటితే వారం రోజుల వరకు రంగు పోదు. సోయాసాస్ రేటు ఎక్కువ కాబట్టి దానిలో నీరు లేదా కొన్ని రోజులుగా కాగిన నూనెను వాడుతున్నట్లు సమాచారం. ఖరీదు తక్కువ..ఆరోగ్యాన్ని దెబ్బతీసే పామాయిల్ వాడుతున్నట్లు తెలుస్తుంది. ఫ్రైస్ వంటి వంటకాలకు చేతికి దొరికిన పిండిని కలిపేస్తున్నారు. దానిలో పురుగులు ఉంటున్నాయి. టమాట సాస్ ఎక్కువ మోతాదులో ఒకేసారి కొని పెడతారు. కొన్ని సందర్భాలలో పాడైన వాటిని పడేయకుండా వాడతారు. చిల్లీసాస్ వాసన చూస్తే వాంతులు రావడం ఖాయంగా ఉంటోంది. దీని వాడకంతో డబ్బులు బాగానే సంపాదిస్తారు. కానీ ఆరోగ్యంపై పట్టింపు ఉండకుండా దందా సాగిస్తారు. నిబంధనలు పాటించకుంటే కేసులు ప్రజా ఆరోగ్యం దెబ్బతీసే పదార్థాలు వాడొద్దు. వంటశాలలు, హోటల్స్ పరిశుభ్రంగా ఉంచాలి. కస్టమర్లకు తాగునీరు ఇవ్వాలి. మాంసాహారం, సూప్‌లు నిలువ ఉంచినవి వాడొద్దు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్, హోటల్స్ నిర్వాహకులు ఖచ్చితంగా నిబంధనలు పాటించాలి. లేకుంటే కేసులు నమోదు చేస్తాం. – వెల్దండి సమ్మయ్య, మున్సిపల్ కమిషనర్ (చదవండి: గోదావరిఖని.. ఇక పర్యాటక గని!) -
ప్రజల ఆరోగ్యంతో చెలగాటం.. పాచిపోయిన బిర్యానీ, అన్నంలో ఈగలు
సాక్షి, వికారాబాద్: పది రోజులుగా కురుస్తున్న వర్షాలతో పల్లెలు, పట్టణాల్లో సీజనల్ వ్యాధుల భయం కనిపిస్తోంది. ఈ సమయంలో కల్తీ ఆహారం తీసుకున్నా, నాణ్యతా ప్రమాణాలు పాటించని చిరుతిండ్లు తిన్నా రోగాల బారిన పడక తప్పదు. జిల్లాలో అనేక హోటళ్లు, పాస్ట్ ఫుడ్ సెంటర్లు, దాబాలు వెలిశాయి. పలు చోట్ల నాసిరకం, కల్తీ పదార్థాలు, సరుకులతో వంటలు చేస్తున్నారు. దీంతో జనం అనారోగ్యం పాలవుతున్నారు. హోటళ్లు, దాబాలు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లకు.. కిరాణా షాపుల యజమానులు నాణ్యత లేని పదార్థాలను విచ్చలవిడిగా విక్రయిస్తున్నారనే ఆరోపణలున్నాయి. సదరు దుకాణాలపై దాడులు చేసి తనిఖీలు నిర్వహించాల్సిన అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. జిల్లాలో పూర్తి స్థాయి ఫుడ్ ఇన్స్పెక్టర్ లేకపోవడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. సంబంధిత కార్యాలయంలోనూ సరిపడా సిబ్బంది లేక సమా ధానం చెప్పే వారు కరువయ్యారు. జిల్లాలో ఇన్చార్జ్ ఫుడ్ ఇన్స్పెక్టర్గా బాధ్యతలు చేపట్టిన అధికారి చుట్టపు చూపుగా వచ్చి వెళ్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో హోటళ్లు, దాబాలు, టిఫిన్ బండ్ల నిర్వాహకులు ఆడిందే ఆట పాట అనేలా వ్యాపారం సాగిస్తున్నారు. అనుమతులు లేకుండానే జిల్లాలోని వికారాబాద్, తాండూరు, పరిగి, కొడంగల్ పట్టణాలతో పాటు మండల కేంద్రాల్లో ఎలాంటి అనుమతులు లేకుండా హోటళ్లు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లు వెలుస్తున్నాయి. వీటిలో తయారు చేసే భోజన సామగ్రి, నూనె నాణ్యత విషయాలు ఎవరికీ తెలియట్లేదు. తక్కువ ధరకు లభించే నాసిరకం సరుకులతో వంటకాలు చేస్తున్నారనే ప్రచారం ఉంది. చాలా హోటళ్లకు కనీసం మున్సిపల్, గ్రామ పంచాయతీల అనుమతి కూడా లేకపోవడం గమనార్హం. ఈ విషయంపై మున్సిపల్ అధికారులు, గ్రామ పంచాయతీ సెక్రటరీలు పెద్దగా పంటించుకోవడం లేదనే విమర్శలు ఉన్నాయి. ఇదే అదనుగా వ్యాపారులు కల్తీ వస్తువులతో హోటళ్లు నడిపిస్తూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్నారు. పాచిపోయిన బిర్యానీ వికారాబాద్‌లోని పలు బిర్యానీ సెంటర్లలో పాచి పోయిన బిర్యానీ విక్రయిస్తున్నారే ఆరోపణలున్నాయి. రెండు మూడు రోజుల పాటు చికెన్‌ను ఫ్రిజ్‌లో పెట్టి బిర్యానీ చేసి అమ్ముతున్నారు. ఎన్టీఆర్ చౌరస్తాలోని ఓ బిర్యానీ సెంటర్లో తీసుకున్న అన్నంలో ఇటీవల పురుగులు వచ్చాయి. ఈ విషయంపై ఎవరికి ఫిర్యాదు చేయాలో తెలియక బాధితులు కొద్దిసేపు నిర్వాహకులతో గొడవపడి వెళ్లిపోయారు. న్యూ గంజ్‌లోని మరో బిర్యానీ సెంటర్లో వారం రోజుల క్రితం అన్నంలో ఈగలు దర్శనమిచ్చాయి. ఇదేమిటని అడిగితే నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడమే కాకుండా, ఇదే బిర్యానీని మిగతా వారికి వడ్డించడం గమనార్హం. మరో హోటల్ నుంచి తీసుకువెళ్లిన ఇడ్లీ సాంబారులో బొద్దింక వచ్చిందని బాధితులు తెలిపారు. ఇలా ప్రతీ హోటల్లో నాసిరకం ఆహారం అమ్ముతున్నారనే ప్రచారం సాగుతోంది. ఎప్పుడూ తాళమే.. స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలో ఫుడ్ సేఫ్టీ జిల్లా కార్యాలయం ఉంది. ఎప్పుడు చూసినా ఇది తాళం వేసే కనిపిస్తోంది. జిల్లా ఏర్పడ్డ తర్వాత గెజిటెడ్ ఫుడ్ ఇన్స్పెక్టర్, ఫుడ్ సేఫ్టీ అధికారి పోస్టులు కేటాయించారు. జూనియర్ అసిస్టెంట్, అటెండర్ ఉండాలి. కానీ ఈ కుర్చీలన్నీ ఖాళీగా ఉన్నాయి. రంగారెడ్డి జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్కు వికారాబాద్ ఇన్చార్జ్ బాధ్యతలు ఇచ్చారు. ఏడాది కావస్తున్నా ఇప్పటి వరకు జిల్లాలో ఒక్కచోట కూడా తనిఖీలు చేసిన దాఖలాలు లేవు. హోటళ్లు, బేకరీలు, పాస్ట్‌ఫుడ్ సెంటర్లు, ఇతర ఆహార పదార్థాల షాపులను తనిఖీ చేయాల్సి ఉన్నా అధికారుల జాడ లేకపోవడంతో వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. మార్కెట్లో నాణ్యత లేని సరుకులు, ఇతర ఆహార పదార్థాలు జోరుగా విక్రయిస్తుండటంతో వాటిని కొనుగోలు చేస్తున్న ప్రజలు అనారోగ్యం పాలై ఆస్పత్రుల్లో చేరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు స్పందించి జిల్లాలో తనిఖీలు చేపట్టాలని కోరుతున్నారు. -
Panipuri: పానీపూరి పంచాయితీ.. ఎంతకూ తెగకపోవడంతో చివరకు
అనంతపురం సెంట్రల్: పానీపూరి బాగో లేదన్నందుకు వివాదం చెలరేగి చివరకు పోలీస్ స్టేషన్లోనే యువకుడిపై చేయి చేసుకునే స్థాయికి చేరుకుంది. పోలీసులు తెలిపిన మేరకు.. అనంతపురం నగరంలోని పోలీసు కాంప్లెక్స్‌లో రాణి అనే మహిళ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్నారు. బెంగళూరులో ఎంబీబీఎస్ చదువుతున్న రాంనగర్ నివాసి వెంకటకృష్ణారెడ్డి శనివారం సాయంత్రం పానీపూరి తినేందుకు తన తమ్ముడితో కలిసి రాణి నిర్వహిస్తున్న ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు వెళ్లాడు. చదవండి: నాలుగేళ్లుగా సహజీవనం.. ప్రియుడు మందలించడంతో.. పానీపూరి తిన్న తర్వాత రుచి బాగోలేదని తన అభిప్రాయాన్ని ఆ యువకుడు వ్యక్తం చేశాడు. ఇది నచ్చని నిర్వాహకురాలు వెంటనే అతనితో వాదనకు దిగింది. మాటామాట పెరగడంతో స్థానికులు డయల్ 100కు సమాచారం అందించారు. దీంతో అనంతపురం రెండో పట్టణ ఎస్ఐ అల్లాబకాష్, సిబ్బంది అక్కడకు చేరుకుని ఇరువర్గాలను పోలీస్ స్టేషన్‌కు తరలించారు. స్టేషన్లో విచారణ చేస్తున్న సమయంలో వెంకటకృష్ణారెడ్డిపై రాణి చేయి చేసుకోవడం వివాదాస్పదమైంది. ఘటనపై వెంకటకృష్ణారెడ్డి కుటుంబసభ్యులు స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. విషయం తెలుసుకున్న ఆహారకల్తీ నిరోధకశాఖ, నగరపాలకసంస్థ అధికారులు వెంటనే ఫాస్ట్ ఫుడ్ సెంటర్లో తనిఖీలు చేపట్టారు. -
Hyderabad: ఫాస్ట్‌ఫుడ్ లేదన్నాడని.. కత్తితో తెగబడ్డాడు
సాక్షి, హైదరాబాద్(జీడిమెట్ల): దూకాణం మూసే సమయంలో ఫాస్ట్‌ఫుడ్‌ను ఇచ్చేందుకు నిరాకరించడంతో కోపోద్రిక్తుడైన ఓ వ్యక్తి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడిపై కత్తితో దాడి చేసిన ఘటన జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగింది. పోలీసుల వివరాల ప్రకారం.. సుభాష్‌నగర్ లాస్ట్‌బస్టాప్ ప్రాంతంలో బిద్యాధర్(32) ఫాస్ట్‌పుడ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి 10.30 గంటల ప్రాంతంలో దుకాణాన్ని మూసివేస్తుండగా పక్కనే ఉండే పాన్‌షాప్ నిర్వాహకుడు యాసిన్ ఫాస్ట్‌ఫుడ్ కావాలని వచ్చాడు. అయితే చాలా ఆలస్యమైంది, దుకాణం మూసివేస్తున్నాం, ఇప్పుడు ఇవ్వలేనని బిద్యాధర్ సమాధానం ఇచ్చారు. దీంతో ఇరువురికి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అక్కడ నుంచి వెళ్లిపోయిన యాసిన్ 10 నిమిషాల తరువాత తన వెంట కత్తిని తెచ్చుకుని బిద్యాధర్ మెడ, ఛాతిపై పొడిచి తీవ్రంగా గాయపరిచాడు. దీంతో బిద్యాధర్ బిగ్గరగా అరవడంతో చుట్టు పక్కల వారు వచ్చి చూడగా అప్పటికే యాసిన్ పరారయ్యాడు. క్షతగాత్రుడిని షాపూర్‌నగర్‌లోని మెడ్విజన్ ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బాధితుడి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు జీడిమెట్ల పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (Chicken Sales: అయ్య బాబోయ్.. రికార్డు స్థాయిలో చికెన్ లాగించేశారు) -
వెలుగులోకి వేల ఏళ్ల నాటి ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు
రోమ్ : ఇటలీలోని పాంపెలో అతి పురాతన ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు వెలుగు చూశాయి. 2019లో పురావస్తు శాస్త్రవేత్తలు జరిపిన తవ్వకాల్లో ఇవి బయటపడ్డాయి. శనివారం వీటికి సంబంధించిన వివరాలను అధికారులు మీడియాకు వెల్లడించారు. ప్రాచీన రోమన్లు భోజన ప్రియులన్న సంగతిని ఇది తెలియజేస్తోందని పాంపె ఆర్కియలాజికల్ పార్క్ చీఫ్ మాస్సిమో ఒసన్నా అన్నారు. వారు బయట తినడానికి కూడా ఇష్టపడేవారని, దాదాపు 80 రకాల ఫాస్ట్ ఫుడ్స్‌కు సంబంధించిన ఆనవాళ్లు దొరికాయని తెలిపారు. ఇలాంటివి దొరకటం ఇదే మొదటిసారని అన్నారు. దీనిపై ఆంథ్రోపాలజిస్ట్ వలెరియా ఎమోరెట్టి మాట్లాడుతూ.. ‘‘ ఆ ఫాస్ట్ ఫుడ్ కోర్టులు చాలా విశాలంగా మొత్తం ఇటుకలతో నిర్మించి ఉన్నాయి. ( 2021: ప్రపంచం అతలాకుతలమేనట! ) ఆహార పదార్థాలు వేసుకోవటానికి ప్రత్యేకమైన ఏర్పాటు చేయబడి ఉంది. ఫాస్ట్ ఫుడ్ సెంటర్ల గోడలపై అందమైన చిత్రాలు చిత్రీకరించబడి ఉన్నాయి. అక్కడ దొరికే పదార్ధాల గురించి తెలిపే విధంగా చిత్రాలు ఉన్నాయి. కోడి, బాతు, మేక, పందులు, చేపలు, నత్తలకు సంబంధించిన ఆహారం అక్కడ దొరికేది. ఆహారం రుచిగా ఉండటానికి అందులో వైన్ కలిపేవార’’ని తెలిపారు. -
హైదరాబాద్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ లో సోనూసూద్
-
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో సోనూసూద్..
సాక్షి, సనత్‌నగర్ (హైదరాబాద్): ప్రముఖ సినీనటుడు సోనూసూద్ మరోసారి తన ఉదారతను చాటుకున్నారు. ఆయన స్ఫూర్తితో హైదరాబాద్‌లోని బేగంపేటలో ఓ యువకుడు నిర్వహిస్తున్న ‘లక్ష్మీ సోనూ సూద్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్’ను శుక్రవారం సందర్శించారు. అనిల్ అనే యువకుడు కరోనా కష్టకాలంలో తన చైనీస్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను తొలగించి, పూర్తిగా హైదరాబాదీ స్టైల్లో ఫుడ్ కోర్టు నిర్వహిస్తున్నాడు. ఈ విషయం తెలుసుకున్న సోనూ.. ఆ ఫుడ్ కోర్టును సందర్శించేందుకు రాగా అనిల్ ఘనస్వాగతం పలికాడు. ఈ సందర్భంగా సోనూ తానే స్వయంగా ఎగ్ ఫ్రైడ్‌రైస్‌ను తయారు చేసుకుని ఆరగించారు. చదవండి: (విగ్రహం ఏర్పాటుపై సోనూసూద్ కామెంట్) (ఫొటో గ్యాలరీ కోసం ఇక్కడ క్లిక్ చేయండి) -
పాచిపోయిన చికెన్.. పురుగులు పట్టిన స్వీట్‌కార్న్
కదిరి: జిల్లాలోని పలు హోటళ్ల నిర్వాహకులు ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. బూజు పట్టిన ఆహార పదార్థాలు, పాచిన చికెన్ ఇతర ఆహార పదార్థాలను ఇప్పటికే అనంతపురం నగరంతో పాటు ఇతర ప్రాంతాల్లో ఫుడ్ ఇన్స్పెక్టర్ల తనిఖీలో వెలుగు చూసిన సంగతి తెలిసిందే. తాజాగా కదిరిలోనూ ఇలాంటి సంఘటనే మళ్లీ పునరావృతం అయింది. పట్టణంలోని శ్రీక్రిష్ణా గ్రాండ్ హోటల్లో ముందు రోజు మిగిలి పోయిన వంటకాలను తాజాగా స్పెషల్ అంటూ పార్శిల్ల రూపంలో ప్రజలకు అందజేస్తున్నారు. దీనిపై ఓ వ్యక్తి ఫిర్యాదు చేయడంలో శుక్రవారం మున్సిపాలిటీ ఫుడ్ ఇన్స్పెక్టర్ల బృందం తనిఖీ చేసింది. వారి తనిఖీల్లో ఆ ఫిర్యాదు నిజమని తేలింది. ముందురోజు వండిన చికెన్‌ను పార్సిళ్ల రూపంలో అందజేసేందుకు సిద్ధం చేయడాన్ని వారు గుర్తించారు. అలాగే స్వీట్ కార్న్ డబ్బా తెరిస్తే బూజుపట్టి అందులో తెల్లని పురుగులు బయటకొచ్చాయి. కరోనా వైరస్ విజృంభిస్తున్న నేపథ్యంలో అక్కడున్న హోటల్ సిబ్బంది ఒక్కరు కూడా మాస్కులు గానీ, చేతికి గ్లౌజులు గానీ, తలకు క్యాపులు గానీ ధరించకపోవడాన్ని కూడా అధికారులు గుర్తించారు. అనంతరం ఫుడ్ ఇన్స్పెక్టర్ రమణ మీడియాతో మాట్లాడుతూ తమకు అందిన ఫిర్యాదు మేరకు హోటల్‌ను తనిఖీ చేస్తే పాచిపట్టిన, బూజుపట్టిన వంటకాలు తమకు కనిపించాయని , అందుకే ఈ హోటల్‌ను తక్షణం సీజ్ చేస్తున్నట్లు వెల్లడించారు. -
ఫాస్ట్‌పుడ్ తింటున్నారా.. జర జాగ్రత్త!
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్.. ఏ గల్లీలో చూసినా ఇవే దర్శనమిస్తుంటాయి. పట్టణాలు, పల్లెలు అనే తేడా లేకుండా పుట్టగొడుగుల్లా ఫాస్ట్‌పుడ్ సెంటర్లు పుట్టుకొచ్చాయి. ప్రతి ఏరియాలోనూ నాలుగైదు జంక్‌పుడ్ సెంటర్లు కనిపిస్తాయి. దీంతో యువత వీటిపై ఎక్కువ మక్కువ చూపుతున్నారు. స్కూల్ పిల్లలు, యువతీ, యువకులు.. ఇలా అన్ని వర్గాలకు చెందిన వారు ఫాస్ట్‌ఫుడ్‌ను ఆశ్రయిస్తున్నారు. బ్యాచిలర్స్ వీటికి ఎక్కువగా అలవాటు పడుతున్నారు. యువ ఉద్యోగులు రాత్రివేళల్లోనూ పనిచేయాల్సి రావడంతో ఫాస్ట్‌ఫుడ్‌కు పట్టణాలలో బాగా ఆదరణ లభిస్తున్నది. ఇదే సంస్కృతి ఇప్పుడు పల్లెలలో కూడా వ్యాపించింది. జంక్ పుడ్ పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపిస్తుంది. ఇవి తినడం వల్ల ఆరోగ్యం దెబ్బతింటుందని తెలిసి కూడా యువత జంక్‌పుడ్‌పై మోజు చూపుతుంది. ఫాస్ట్‌ఫుడ్‌కు ఎక్కువగా అలవాటు పడితే డయాబెటిస్, రక్తపోటు, స్థూలకాయం, గుండెజబ్బులు, కేన్సర్ వంటి వ్యాధులు తలెత్తే ప్రమాదం ఉన్నట్లు ఇప్పటికే పలు పరిశోధనల్లో తేలిన సంగతి తెలిసిందే. అయితే, ఫాస్ట్‌ఫుడ్ భావోద్వేగాలపై కూడా తీవ్ర ప్రభావం చూపుతుందని తాజా అధ్యయనంలో వెల్లడైంది. ఫాస్ట్‌ఫుడ్ ఎక్కువగా తీసుకునేవారు డిప్రెషన్‌తో బాధపడుతున్నారని చెబుతున్నారు బర్మింగామ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ అలబామాకు చెందిన పరిశోధకులు. కొంతమంది పాఠశాల విద్యార్థుల ఆహారపు అలవాట్లను క్షుణ్ణంగా అధ్యయనం చేసిన తర్వాత ఫాస్ట్‌ఫుడ్ వల్ల వ్యాకులతకు లోనవుతారని నిర్ధారించారు. పరిశోధన జరిగిందిలా.. పరిశీలన కోసం ఫాస్ట్‌పుడ్ ఎక్కువగా తీసుకునే 84 మంది పాఠశాల వయసు గల బాల, బాలికలను తీసుకున్నారు. వీరిలో 95 శాతం మంది తక్కువ ఆదాయ గృహాలకు చెందిన ఆఫ్రికన్ అమెరికన్లు. సోడియం,పోటాషియంల శాతాన్ని పరీక్షించడం కోసం ప్రతి రోజు రాత్రిపూట వారి మూత్ర నమూనాలు సేకరించారు. ఇలా ఏడాదిన్నర కాలంపాటు అధ్యయనం చేసి తర్వాత ఈ విషయాన్ని వెల్లడించారు. జంక్‌పుడ్ తీసుకునేవారిలో సోడియం శాతం పెరిగి, పోటాషియం తగ్గుతుందని పరిశోధనలో తేలిందని యూనివర్సీటీ నిపుణులు పేర్కొన్నారు. సోడియం శాతం పెరగడానికి కారణం ఇవే ‘ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా తీసుకోవడం వల్లే శరీరంలో సోడియం శాతం పెరుగుతుంది. దీని వల్ల కుంగుబాటుకి లోనవుతారు’ అని యూనివర్సిటీ ఆఫ్ అలబామా కు చెందిన మనోవిజ్ఞాన శాస్త్ర ప్రొఫెసర్ సిల్వీ మ్రగ్ తెలిపారు. జంక్పుడ్లో ఎక్కువ మొత్తం కొవ్వు, చక్కెర, ఉప్పు వుంటాయి. శరీరానికి ఉపయోగపడే ప్రొటీన్స్, విటమిన్స్, ఇతర పోషక పదార్థాలు వుండవు. మనకు అవసరమైన పీచు పదార్థాలు లభించవని చెప్పారు. బీన్స్, చిలగడ దుంపలు, బచ్చలికూర, టమోటాలు, అరటిపండ్లు, నారింజ, పెరుగు, కూరగాయలు వంటి ఆహారాన్ని తీసుకోకపోవడం వల్లే పోటాషియం శాతం తగ్గుతుందని చెప్పారు. ఈ అధ్యయనం సోడియం, డిప్రెషన్‌పై మాత్రమే జరిగిందన్నారు. అయితే జంక్పుడ్తో డిప్రెషన్‌కు ఎందుకు లోనవుతారనే దానిపై మరిన్ని పరిశోధనలు చేస్తున్నామని వెల్లడించారు. డిప్రెషన్‌కు లోనయ్యేవారిలో అధికులు వీరే వ్యాకులత గురయ్యే వారిలో ఎక్కువమంది పాఠశాల వయసువారే ఉంటున్నారు. 12 నుంచి 17 ఏళ్ల పిల్లలలో ఎక్కువ మంది డిప్రెషన్‌కు లోనవుతున్నారని జాతీయ డేటా విశ్లేషణలో తేలింది. 2005-2017 మధ్య కాలంలో ఇది 52 శాతం పెరిగింది. ఇక యువకుల్లో ఇది 63 శాతంగా ఉంది. డిప్రెషన్, మానసిక క్షోభకు గురికావడం, ఆత్మహత్య ఆలోచనలు రావడం యువకుల్లో ఎక్కువగా పెరుగుతోంది. ఆహారానికి, డిప్రెషన్‌కి మధ్య బలమైన అనుబంధం ఫాస్ట్‌పుడ్ వల్ల యువకులు కూడా డిప్రెషన్‌కు గురవుతున్నారని ఎన్నో అధ్యయనాల్లో తేలింది. స్పెయిన్‌లో వెలువడిన ఓ అధ్యయనం ప్రకారం.. ప్రాసెస్ చేసిన ఆహారం ఎక్కువగా తీసుకునే వారిలో 48 శాతం మంది డిప్రెషన్‌కు లోనవుతున్నారని తేలింది. దాదాపు 9000 మందిని ఆరేళ్లు పరిశీలించి ఈ విషయాన్ని ప్రకటించారు. మనం తీసుకునే ఆహారానికి, డిప్రెషన్‌కి మధ్య బలమైన అనుబంధం ఉందని పలు పరిశోధనల్లో తేలింది. అమెరికా, స్పెయిన్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా, గ్రీస్ మరియు ఇరాన్ పరిశోధనల యొక్క మెటా విశ్లేషణ ప్రకారం.. ప్రాసెస్ చేసిన ఆహారాన్ని తీసుకోవడం వల్ల అనారోగ్యంతో పాటు డిప్రెషన్‌కు లోనవుతారని తేలింది. తాజా పండ్లు, కూరగాయలు, ఆకు కూరలతో పాటు కొద్ది మోతాదులో ఫాస్ట్‌పుడ్ తీసుకుంటే డిప్రెషన్ ప్రమాదాన్ని అధిగమించవచ్చని నిపుణులు చెబుతున్నారు. ఒత్తిడి తగ్గాలంటే.. ► ఫాస్ట్‌ఫుడ్, ప్రాసెస్ చేసిన ఆహారం, చక్కెరలు ఎక్కువగా ఉన్న ఆహారాన్ని తినకూడదు. ఇవి మెదడులో ఒత్తిడిని కలగజేసే కెమికల్స్‌పై ఏమాత్రం ప్రభావం చూపవు. ఈ క్రమంలో సరైన విటమిన్లు, మినరల్స్ వంటి పోషకాలు కలిగిన ఆహారాన్ని నిత్యం తగిన మోతాదులో సరైన వేళకు తీసుకోవాలి. దీని వల్ల కూడా మనకు కలిగే ఒత్తిడిని తగ్గించుకోవచ్చు. ►తాజా పండ్లు, కూరగాయలు, పీచు పదార్థాలు కలిగి ఉండే ఆహారాన్ని తీసుకోవాలి ►నిత్యం వ్యాయామం తప్పనిసరిగా చేయాలి. కష్టతరమైన ఎక్సర్సైజ్లు చేయకున్నా కనీసం ఒక అరగంట పాటు వాకింగ్ చేసినా చాలు. దీంతో శరీరంలో రక్త సరఫరా మెరుగు పడుతుంది. అంతేకాదు ఇది బరువు తగ్గడం కోసం, మానసిక ఉల్లాసం కోసం కూడా ఉపయోగపడుతుంది. ►ఆరోగ్యవంతమైన వ్యక్తులు రోజుకు కనీసం 6 నుంచి 8 గంటల పాటు తప్పనిసరిగా నిద్రపోవాలి. లేదంటే ఒత్తిడిని కలిగించే హార్మోన్లు వివిధ రసాయనాలను ఎక్కువగా విడుదల చేస్తాయి. దీంతో ఒత్తిడి, ఆందోళన పెరుగుతాయి. కనుక వీటిని తగ్గించుకోవాలంటే నిత్యం తగినంత సమయం పాటు నిద్రపోవడం తప్పనిసరి. ►నిత్యం పని ఒత్తిడితో బిజీగా ఉన్నా ఏదో ఒక సమయంలో వినోదం అందేలా చూసుకోవాలి. దీంతో ఒత్తిడి కొంత మేర తగ్గేందుకు అవకాశం ఉంటుంది. అందరితో ఫన్నీగా మాట్లాడడం, జోక్స్ వినడం వంటివి చేస్తే ఒత్తిడి దూరమవుతుంది. ►ఒత్తిడి అధికంగా ఉన్నట్టు భావిస్తే చేసే పనినంతా పక్కన పెట్టి కొన్ని నిమిషాల పాటు కళ్లు మూసుకుని గట్టిగా శ్వాస తీసుకోండి. గాలి పీల్చేటప్పుడు, వదిలేటప్పుడు శ్వాసను గమనించండి. దీంతో ఒత్తిడి కొద్దిగా తగ్గుతుంది. -శెట్టె అంజి, సాక్షి వెబ్ డెస్క్. -
ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కు నిప్పుపెట్టిన దుండగులు
మైలార్‌దేవ్‌పల్లి: గుర్తుతెలియని ముగ్గురు దుండగులు గురువారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను తగులబెట్టిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు జి.నవీన్‌కుమార్, లక్ష్మీనర్సింహస్వామి మొబైల్ రిపేరింగ్ సెంటర్ యజమాని సందీప్‌కుమార్, స్థానికుడు సూర్యకిరణ్ కథనం ప్రకారం వివరాలు... గత నాలుగు సంవత్సరాలుగా నవీన్‌కుమార్ పద్మశాలిపురంలో ఉంటూ మధుబన్ కాలనీలో ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. పద్మశాలిపురానికి చెందిన సందీప్‌కుమార్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ సమీపంలోనే మొబైల్ రిపేరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ కాలిన ఘటనలో సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు పక్కనే ఉన్న మొబైల్ రిపేరింగ్ సెంటర్, మెకానిక్ గ్యారేజీలు తగులబడ్డాయి. వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు స్థానికుల సహకారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పూర్తిగా కాలిపోగా, మొబైల్ సెంటర్లోని రెండు ల్యాప్టాప్స్, ఒక కంప్యూటర్ ప్రింటర్, ఫర్నీచర్ దగ్ధమయ్యాయి. మొబైల్ షాపులో సుమారు రూ. 25 వేల నగదు కాలిపోయిందని సందీప్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. గత కొన్ని సంవత్సరాలుగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ మంచిగా నడుస్తుందని తాను లాభాల బాటలో ఉండటం తట్టుకోలేక గిట్టని వారు ఈ ప్రమాదానికి పాల్పడి ఉంటారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. గురువారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ముగ్గురు గుర్తుతెలియని దుండగులు వచ్చి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌పై పెట్రోల్ పోసి నిప్పటించారన్నారు. రాత్రి డ్యూటీలో ఉన్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీతో పాటు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు, రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పక్కా ప్లాన్‌తో హత్య?
సాక్షి, వరంగల్ రూరల్,ఏటూరునాగారం: మేడారంలో ఆర్ఎం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో పనిచేయడానికి వచ్చి శనివారం రాత్రి హత్యకు గురైన ప్రసాద్‌ను పక్కాగా ప్లాన్ చేసి అతికిరాతకంగా హత్య చేసినట్లు తెలిసింది. వివాహేతర సంబంధం, ఆర్థికలావాదేవీల కారణంగా తమ బంధువే అతడిని హత్య చేసినట్లు మృతుడి సోదరి శిరీష ఆరోపించింది. ఆమె కథనం ప్రకారం.. వరంగల్ అర్బన్ జిల్లా ధర్మసాగర్ మండలం నారాయణగిరికి చెందిన పట్టెం ప్రసాద్(26) మేడారం జాతర సందర్భంగా జంపన్నవాగుకు సమీపంలో ఆర్ఎం ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లో పనిచేయడానికి వచ్చాడు. తమకు వరుసకు బాబాయి అయిన శివనగర్‌కు చెందిన కంభంపాటి పూర్ణచందర్ శనివారం రాత్రి 7 గంటల ప్రాంతంలో మరో ఇద్దరితో కలిసి వచ్చి షాపు నుంచి ప్రసాద్‌ను బయటికి తీసుకొచ్చి కత్తితో పొడిచి చంపినట్లు ఆమె వెల్లడించింది. పూర్ణచందర్ రక్త సంబంధీకురాలితో ప్రసాద్ వివాహేతర సంబంధం పెట్టుకున్నాడనే కక్షగట్టి గతంలో మడికొండకు చెందిన మహేష్ వద్ద పంచాయతీ పెట్టించి చితకొట్టించాడని తెలిపింది. అంతేగాక గతంలో ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి కొంతమందితో పూర్ణచందర్ అల్లుడికి ప్రసాద్ డబ్బులు ఇప్పించాడని చెప్పింది. ఆ డబ్బులు ఇవ్వాలని ప్రసాద్ పలుమార్లు అల్లుడిని అడిగిన విషయంలో కూడా గొడవలయ్యాయని శిరీష విలేకరులకు తెలిపింది. పై విషయాలను మనసులో పెట్టుకొని ప్రసాద్‌ను చంపివేశారని బోరున విలపించింది. తన సోదరుడిని చంపినవారిని కఠినంగా శిక్షించాలని శిరీష పోలీసులను వేడుకుంది. కేసు నమోదు చేసుకున్న తాడ్వాయి పోలీసులు మృతదేహానికి ఏటూరునాగారం సామాజిక ఆస్పత్రిలో పోస్టు మార్టం నిర్వహించారు. ప్రసాద్‌ను హత్య చేసిన వారి కోసం పోలీసులు గాలిస్తున్నారు. -
ఇక కొత్తగా ‘జునకా-భాకర్’
- కేంద్రాలను ఆధునీకరించాలని యోచిస్తున్న యజమానులు - అనుమతికోసం ప్రభుత్వానికి విన్నపం - ఫోన్లో ఆర్డర్లు.. హోం డెలివరీ సాక్షి, ముంబై: నగరంలోని ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు గట్టి పోటీ ఇవ్వడానికి ‘జునకా-భాకర్’ (జొన్నరొట్టె-సంకటి) విక్రయ కేంద్రాల యజమానులు సిద్ధమవుతున్నారు. ఫోన్లో ఆర్డర్లు తీసుకొని డెలివ రీ చేయాలని యోచిస్తున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 3,500 జునకా-భాకర్ కేంద్రాల రూపురేఖలు మార్చేందుకు అనుమతివ్వాలని రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించారు. ముంబైలో ప్రస్తుతం మెక్ డొనాల్డ్, డొమినోజ్, కెఫే కాఫీ డే, బరిస్తా లాంటి విదేశీ సంస్థలు పెద్ద మొత్తంలో వ్యాపారం సాగిస్తున్నాయని, వీటికి ధీటుగా జునకా-భాకర్ కేంద్రాల వ్యాపారం పెంచాల్సిన అవసరం ఉందని యూనియన్ అధ్యక్షుడు ఉమేశ్ వాఘ్లే అన్నారు. కేంద్రాలలో ఐస్‌క్రీం, కాఫీ, మిఠాయి తదితర తినుబండరాలు విక్రయించేందుకు అనుమతివ్వాలని డిమాండ్ చేశారు. స్టాళ్లు యజమానుల పేరిట లేకపోవడంతో ఆర్థిక సాయం అందించేందుకు బ్యాంకులు కూడా ముందుకు రావడం లేదని, దీంతో వాటిని ఆధునీకరించే వీలు లేకుండాపోయిందని ఆయన అన్నారు. 18 ఏళ్ల కిందట ప్రారంభం నిరుద్యోగులకు ఉపాధి కల్పించాలనే ఉద్దేశంతో 18 ఏళ్ల కిందట అప్పటి బీజేపీ, శివసేన ప్రభుత్వం జునకా-భాకర్ కేంద్రాలకు శ్రీకారం చుట్టింది. కేంద్రాల ఏర్పాటుకు అవసరమైన స్థలం మహానగర పాలక సంస్థ (బీఎంసీ) సమకూర్చి ఇచ్చింది. అందుకు బీఎంసీ నామ మాత్రపు అద్దె వసూలు చేసేది. పేదలకోసం ఏర్పాటుచేసిన కేంద్రంలో రూపాయికే జొన్న రొట్టె, సంకటి విక్రయించాలని షరతు విధించింది. జునకా, భాకర్ మినహా వడాపావ్, మిసల్ పావ్, దోశ, ఉతప్ప లాంటి తినుబండారాలు విక్రయించకూడదని ఆంక్షలు విధించింది. కేవలం జునకా, భాకర్ విక్రయించడం వల్ల ఆదాయం రాకపోవడంతో స్టాళ్లపై యజమానులకు ఆసక్తి తగ్గింది. తర్వాత ప్రభుత్వాలు మారడంతో కేంద్రాలను మూసివేశారు. అయితే రాష్ట్రంలో మరోసారి బీజేపీ, శివసేన కూటమి అధికారంలోకి రావడంతో ‘జునకా-భాకర్’ అంశం మరోసారి తెరమీదకు వచ్చింది. కేంద్రాలను పాత పద్ధతిలో కాకుండా, విదేశీ కంపెనీలకు పోటీగా ఆధునిక పద్ధతిలో నిర్వహించాలని, ఫోన్లో ఆర్డర్లు తీసుకొని డెలివ రీ చేయాలని యజమానులు యోచిస్తున్నారు. -
పశు వ్యర్థాలతో కల్తీ నూనె తయారీకి యత్నం!
మాల్కాపూర్ అటవీప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సన్నాహాలు పరిగి: పశువుల వ్యర్థాలతో నూనెతయారీకి అక్రమార్కులు రంగం సిద్ధం చేసుకున్నారు. పరిగి మండల పరిధిలోని సయ్యద్‌మల్కాపూర్ శివారులోని అటవీ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సన్నాహాలు చేశారు. పశువుల చర్మం, కొవ్వు తదితర వ్యర్థాలతో దుర్వాసన రావడంతో విషయం శనివారం బయటకు పొక్కింది. దీంతో అక్రమార్కులు తమ బండారం బయటపడుతుందని తమ జాగ్రత్తల్లో మునిగిపోయారు. గ్రామాల్లో తయారీపై కన్ను.. ఇటీవల నగర శివారులోని కాటేదాన్ తదితర ప్రాంతాల్లో పశువుల వ్యర్థాలతో అక్రమార్కులు నూనె తయారు చేస్తుండడంతో అధికారులు, పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఈనేపథ్యంలో అక్రమార్కుల కన్ను గ్రామాలపై పడింది. పరిగి ప్రాంతానికి చెందిన కొందరితో కుమ్మక్కై వ్యవసాయ పొలాలు, అటవీ ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా కల్తీనూనె తయారు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. నూనె సరఫరాపై కూడా ఒప్పందాలు కుది రినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, తండాలే టార్గెట్.. ఇప్పటి వరకు వ్యాన్లలో నగరం నుంచి కల్తీనూనె తీసుకొచ్చి గ్రామీణ ప్రాం తాల్లో విక్రయిస్తూ వచ్చిన వ్యాపారులు తమ పంథా మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది. వ్యాపారులు నియోజకవర్గ పరిధిలో ఉన్న పరిగి, కుల్కచర్ల, గండేడ్ మండల పరిధిలోని పలు హాస్టళ్లకు తక్కువ ధరలకు ఆశచూపి కల్తీ నూనె సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇటీవల ఓ కల్తీ నూనె డబ్బాలు తరలిస్తు న్న వ్యాన్ పోలీసులకు పట్టుబడింది. ‘పెద్దల’ ఒత్తిడి పెరగడంతో పోలీసులు సదరు వాహనాన్ని వదిలేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రజారోగ్యం గాలిలో దీపం
సుభాష్‌నగర్, న్యూస్‌లైన్: నిజామాబాద్, కామారెడ్డి, ఆర్మూర్, బోధన్, బాన్సువాడ, ఎల్లారెడ్డి తదితర పట్టణ ప్రాంతాలలో చిన్న, పెద్ద హోటళ్లు, దాబాలు, ఫ్యా మిలీ రెస్టారెంట్లు, ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలు వందల సంఖ్యలో ఉన్నాయి. చిన్నచిన్న పట్టణాలు, గ్రామాలలోనూ హోటళ్లున్నాయి. మందుబాబు ల కోసం ప్రతి వైన్ షాప్, బెల్ట్ షాప్‌ల వద్ద ఫాస్ట్ ఫుడ్ కేంద్రాలు వెలిశాయి. వీటిపై అధికారుల పర్యవేక్షణ కొరవడింది. కేంద్రాల నిర్వాహకులు లాభార్జనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. పదార్థాల తయారీలో నాసి రకం వస్తువులు, నూనెలు వాడుతున్నారు. పరిసరాల పరిశుభ్రతను పట్టించుకోకపోవడంతో తినుబండారాలపై ఈగలు, క్రిమికీటకాదులు వాలుతూ ప్రజలను ఆనారోగ్యం పాలు చేస్తున్నాయి. చిన్న హోటళ్లు పేద మధ్య తరగతి ప్రజలు చిన్న హోటళ్లకే వెళ్తుంటారు. ఇక్కడ తక్కువ ధరకు ఆహార పదార్థాలు లభిస్తుండడమే ఇందుకు కారణం. అయితే ఎక్కువగా చిన్న హోటళ్లు ఇరుకు గదుల్లో, మురికి కూపాలలోనే ఉంటున్నాయి. పరిశుభ్రత అన్నది భూతద్దంతో వెతికినా కనిపించదు. తక్కువ ధరకు టిఫిన్లు, భోజనం అందించడం కోసం వారు చవుకబారు వస్తువులనే వాడుతున్నారు. అధికారులు వీటి వైపు కన్నెత్తి చూడకపోవడంతో చిరు హోటళ్ల నిర్వాహకుల ఇష్టారాజ్యం కొనసాగుతోంది. బడా హోటళ్లలోనూ జిల్లావ్యాప్తంగా పేరు పొందిన బడా హోటళ్లు పదుల సంఖ్యలో ఉన్నాయి. పైకి చక్కగా కనిపించినా, వాటి కిచెన్, పరిసరాలు మరీ అధ్వానంగా ఉం టాయి. అంటే పైన పటారం లోన లొటారం అన్న చందంగా ఉంటాయి. మిగిలిపోయిన ఆహార పదార్థాలను నిల్వ చేసి తరువాతి రోజుల్లో విక్రయిస్తారన్న ఆరోపణలున్నాయి. ముఖ్యంగా ఆ రోజు మిగిలిన మాంసాహారాన్ని నిల్వ ఉంచి, తర్వాతి రోజు వేడి చేసి వడ్డిస్తున్నారని తెలుస్తోంది. ఇలా చేయడం ద్వారా చాలా మంది అస్వస్థతకు గురి అవుతున్నారు. ఫాస్ట్ ఫుడ్ సెంటర్లలో జిల్లావ్యాప్తంగా ప్రతి కూడలిలో ఫాస్ట్‌ఫుడ్ కేంద్రాలున్నాయి. వీటిలో పరిశుభ్రత దేవతావస్త్రమే. వీరు వాడే వస్తువులు చాలా వరకు నాసిరకంగా ఉంటాయి. ఇక నూనె అయితే కడాయిలో గంటల తరబడి కాగుతూనే ఉంటుంది. తర్వాతి రోజు ఆ నూనెలోనే మళ్లీ కొత్త నూనె పోసి ఫాస్ట్ఫుడ్స్ తయారు చేస్తుంటారు. ఇది జగమెరిగిన సత్యం. అధికారులు ఎలాంటి చర్యలూ తీసుకోకపోవడంతో హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ల నిర్వాహకులు నాణ్యత ప్రమాణాలపై దృష్టి సారించడంలేదన్న విమర్శలున్నా యి. దీంతో ప్రజలు అనారోగ్యం పాలవుతున్నారు. మార్పు తీసుకొచ్చి చర్యలు తీసుకుంటాం : అమృతశ్రీ, జిల్లా ఆహార భద్రత అధికారి పరిశుభ్రత పాటించని హోటళ్ల నిర్వాహకులతో మాట్లాడతాం. వారిలో మార్పు తీసుకువస్తాం. ఒకేసారి మార్పు రావడం కష్టం. మెల్లిమెల్లిగా విజయం సాధిస్తాం. ప్రజారోగ్యం విషయంలో రాజీపడబోం. నిబంధనలు పాటించని హోటళ్ల నిర్వాహకులపై కేసులు నమోదు చేస్తాం. -
సాస్.. తస్మాత్ జాగ్రత్త
ప్రమాదకర రసాయనాలతో తయారీ బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు సరఫరా భారీగా నిల్వ చేసిన డ్రమ్ములు, క్యాన్ల పట్టివేత ఉప్పల్, న్యూస్‌లైన్: బేకరీలో వేడి వేడి పఫ్ తినాలనుందా?.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కి వెళ్లి నూడిల్సో, మంచూరియానో లాగించేయాలనుకుంటున్నారా?.. అందులో కమ్మగా ఉండేందుకు సాస్ అద్దుకోవాలనుకుంటే మాత్రం ఆలోచించాల్సిందే. ప్రమాణాలు పాటించకుండా, రసాయనాలు కలిపిన సాస్‌ను తయారు చేస్తూ నగరంలోని ప్రముఖ బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు సరఫరా చేస్తున్న అంతర్ రాష్ర్ట ముఠా గుట్టును ఎస్వోటీ, ఉప్పల్ పోలీసులు, సర్కిల్ అధికారులు రట్టు చేశారు. ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన మోతీలాల్ కుమావత్, తారస్నాహిల్, ఘన్‌శ్యామ్, జగదీష్ ముఠాగా ఏర్పడి ఉప్పల్ కళ్యాణ్‌పురిలోని ఓ ఇంట్లో (నెం.9-1-120/2/1) గుట్టుచప్పుడు కాకుండా ప్రమాదకరమైన సాస్‌లను తయారుచేస్తున్నారు. టమోట, చిల్లీ, సోయాబీన్.. ఇవేవీ వాడకుండానే వీటి పేరుతో హానికరమైన ఎసిటిక్ యాసిడ్, గంజిపొడి, ఫుడ్ కలర్స్ మిశ్రమాలు కలిపి సాస్‌లు తయారు చేస్తున్నారు. ఇలా డ్రమ్ముల కొద్దీ తయారుచేస్తున్న సాస్‌ను రెండేళ్లుగా నగరంలోని 80 ప్రముఖ పాస్ట్‌పుడ్ సెంటర్లు, పేరొందిన బేకరీలకు సరఫరా చేస్తున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే కెమికల్స్‌ను వాడుతూ వీరు సాస్ తయారుచేస్తున్నట్లు ఎస్వోటీ పోలీసులు సమాచారం అందుకున్నారు. బుధవారం తయారీ కేంద్రంపై దాడిచేసి 200 లీటర్ల సామర్థ్యం కలిగిన 14 డ్రమ్ములు, 1542 పది లీటర్ల క్యాన్లు, ఆటో స్వాధీనం చేసుకున్నారు. తదుపరి పరీక్షల నిమిత్తం సాస్‌లను సర్కిల్ అధికారులకు అప్పగించారు. దాడుల్లో ఎస్వోటీ సీఐ పుష్పకుమార్, ఎస్ఐ నాగరాజు, ఉప్పల్ సీఐ లక్ష్మికాంత్‌రెడ్డి, ఎస్ఐ ప్రవీణ్‌కుమార్, సర్కిల్ అధికారులు పాల్గొన్నారు.