సాస్.. తస్మాత్ జాగ్రత్త
- ప్రమాదకర రసాయనాలతో తయారీ
- బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు సరఫరా
- భారీగా నిల్వ చేసిన డ్రమ్ములు, క్యాన్ల పట్టివేత
ఉప్పల్, న్యూస్‌లైన్: బేకరీలో వేడి వేడి పఫ్ తినాలనుందా?.. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌కి వెళ్లి నూడిల్సో, మంచూరియానో లాగించేయాలనుకుంటున్నారా?.. అందులో కమ్మగా ఉండేందుకు సాస్ అద్దుకోవాలనుకుంటే మాత్రం ఆలోచించాల్సిందే. ప్రమాణాలు పాటించకుండా, రసాయనాలు కలిపిన సాస్‌ను తయారు చేస్తూ నగరంలోని ప్రముఖ బేకరీలు, ఫాస్ట్‌ఫుడ్ సెంటర్లకు సరఫరా చేస్తున్న అంతర్ రాష్ర్ట ముఠా గుట్టును ఎస్‌వోటీ, ఉప్పల్ పోలీసులు, సర్కిల్ అధికారులు రట్టు చేశారు.
ఉప్పల్ పోలీసుల కథనం ప్రకారం.. రాజస్థాన్‌కు చెందిన మోతీలాల్ కుమావత్, తారస్‌నాహిల్, ఘన్‌శ్యామ్, జగదీష్ ముఠాగా ఏర్పడి ఉప్పల్ కళ్యాణ్‌పురిలోని ఓ ఇంట్లో (నెం.9-1-120/2/1) గుట్టుచప్పుడు కాకుండా ప్రమాదకరమైన సాస్‌లను తయారుచేస్తున్నారు. టమోట, చిల్లీ, సోయాబీన్.. ఇవేవీ వాడకుండానే వీటి పేరుతో హానికరమైన ఎసిటిక్ యాసిడ్, గంజిపొడి, ఫుడ్ కలర్స్ మిశ్రమాలు కలిపి సాస్‌లు తయారు చేస్తున్నారు. ఇలా డ్రమ్ముల కొద్దీ తయారుచేస్తున్న సాస్‌ను రెండేళ్లుగా నగరంలోని 80 ప్రముఖ పాస్ట్‌పుడ్ సెంటర్లు, పేరొందిన బేకరీలకు సరఫరా చేస్తున్నారు.
ఎలాంటి అనుమతులు లేకుండా ప్రజారోగ్యంపై తీవ్ర ప్రభావం చూపే కెమికల్స్‌ను వాడుతూ వీరు సాస్ తయారుచేస్తున్నట్లు ఎస్‌వోటీ పోలీసులు సమాచారం అందుకున్నారు. బుధవారం తయారీ కేంద్రంపై దాడిచేసి 200 లీటర్ల సామర్థ్యం కలిగిన 14 డ్రమ్ములు, 1542 పది లీటర్ల క్యాన్లు, ఆటో స్వాధీనం చేసుకున్నారు. తదుపరి పరీక్షల నిమిత్తం సాస్‌లను సర్కిల్ అధికారులకు అప్పగించారు. దాడుల్లో ఎస్‌వోటీ సీఐ పుష్పకుమార్, ఎస్‌ఐ నాగరాజు, ఉప్పల్ సీఐ లక్ష్మికాంత్‌రెడ్డి, ఎస్‌ఐ ప్రవీణ్‌కుమార్, సర్కిల్ అధికారులు పాల్గొన్నారు.