కాలిపోయిన షెడ్డు
మైలార్‌దేవ్‌పల్లి: గుర్తుతెలియని ముగ్గురు దుండగులు గురువారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను తగులబెట్టిన ఘటన మైలార్‌దేవ్‌పల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకుంది. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ నిర్వాహకుడు జి.నవీన్‌కుమార్, లక్ష్మీనర్సింహస్వామి మొబైల్ రిపేరింగ్ సెంటర్ యజమాని సందీప్‌కుమార్, స్థానికుడు సూర్యకిరణ్ కథనం ప్రకారం వివరాలు...
గత నాలుగు సంవత్సరాలుగా నవీన్‌కుమార్ పద్మశాలిపురంలో ఉంటూ మధుబన్ కాలనీలో ఓ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌ను నిర్వహిస్తున్నాడు. పద్మశాలిపురానికి చెందిన సందీప్‌కుమార్ ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ సమీపంలోనే మొబైల్ రిపేరింగ్ సెంటర్‌ను ఏర్పాటు చేసుకున్నాడు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ కాలిన ఘటనలో సిలిండర్ పేలడంతో ఒక్కసారిగా మంటలు పక్కనే ఉన్న మొబైల్ రిపేరింగ్ సెంటర్, మెకానిక్ గ్యారేజీలు తగులబడ్డాయి.
వెంటనే అప్రమత్తమైన నిర్వాహకులు స్థానికుల సహకారంతో అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ పూర్తిగా కాలిపోగా, మొబైల్ సెంటర్‌లోని రెండు ల్యాప్‌టాప్స్, ఒక కంప్యూటర్ ప్రింటర్, ఫర్నీచర్ దగ్ధమయ్యాయి. మొబైల్ షాపులో సుమారు రూ. 25 వేల నగదు కాలిపోయిందని సందీప్‌కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు.
గత కొన్ని సంవత్సరాలుగా ఫాస్ట్‌ఫుడ్ సెంటర్ మంచిగా నడుస్తుందని తాను లాభాల బాటలో ఉండటం తట్టుకోలేక గిట్టని వారు ఈ ప్రమాదానికి పాల్పడి ఉంటారని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో బాధితులు పేర్కొన్నారు. గురువారం తెల్లవారుజామున రెండు గంటల ప్రాంతంలో ముగ్గురు గుర్తుతెలియని దుండగులు వచ్చి ఫాస్ట్‌ఫుడ్ సెంటర్‌పై పెట్రోల్ పోసి నిప్పటించారన్నారు.
రాత్రి డ్యూటీలో ఉన్న రాజేంద్రనగర్ ట్రాఫిక్ ఏసీపీతో పాటు మైలార్‌దేవ్‌పల్లి పోలీసులు, రాజేంద్రనగర్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
Comments
Please login to add a commentAdd a comment