పశు వ్యర్థాలతో కల్తీ నూనె తయారీకి యత్నం!
మాల్కాపూర్ అటవీప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సన్నాహాలు
పరిగి: పశువుల వ్యర్థాలతో నూనెతయారీకి అక్రమార్కులు రంగం సిద్ధం చేసుకున్నారు. పరిగి మండల పరిధిలోని సయ్యద్‌మల్కాపూర్ శివారులోని అటవీ ప్రాంతంలో గుట్టుచప్పుడు కాకుండా సన్నాహాలు చేశారు. పశువుల చర్మం, కొవ్వు తదితర వ్యర్థాలతో దుర్వాసన రావడంతో విషయం శనివారం బయటకు పొక్కింది. దీంతో అక్రమార్కులు తమ బండారం బయటపడుతుందని తమ జాగ్రత్తల్లో మునిగిపోయారు.
గ్రామాల్లో తయారీపై కన్ను..
ఇటీవల నగర శివారులోని కాటేదాన్ తదితర ప్రాంతాల్లో పశువుల వ్యర్థాలతో అక్రమార్కులు నూనె తయారు చేస్తుండడంతో అధికారులు, పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఈనేపథ్యంలో అక్రమార్కుల కన్ను గ్రామాలపై పడింది. పరిగి ప్రాంతానికి చెందిన కొందరితో కుమ్మక్కై వ్యవసాయ పొలాలు, అటవీ ప్రాంతాల్లో గుట్టు చప్పుడు కాకుండా కల్తీనూనె తయారు చేసేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. నూనె సరఫరాపై కూడా ఒప్పందాలు కుది రినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి.
ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, తండాలే టార్గెట్..
ఇప్పటి వరకు వ్యాన్‌లలో నగరం నుంచి కల్తీనూనె తీసుకొచ్చి గ్రామీణ ప్రాం తాల్లో విక్రయిస్తూ వచ్చిన వ్యాపారులు తమ పంథా మార్చుకున్నట్లు స్పష్టమవుతోంది. వ్యాపారులు నియోజకవర్గ పరిధిలో ఉన్న పరిగి, కుల్కచర్ల, గండేడ్ మండల పరిధిలోని పలు హాస్టళ్లకు తక్కువ ధరలకు ఆశచూపి కల్తీ నూనె సరఫరా చేస్తున్నట్లు సమాచారం. కాగా ఇటీవల ఓ కల్తీ నూనె డబ్బాలు తరలిస్తు న్న వ్యాన్ పోలీసులకు పట్టుబడింది. ‘పెద్దల’ ఒత్తిడి పెరగడంతో పోలీసులు సదరు వాహనాన్ని వదిలేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.