చాలామంది టీనేజర్లు స్లిమ్‌గా ఉండాలని అనుకుంటారు. అయితే అందుకోసం తమలోని కొవ్వులను దహింపజేసుకోకుండా... కడుపు మాడ్చుకుని తమ కండరాలను (మజిల్ మాస్‌ను) కోల్పోతారు. ఇలా ఫ్యాట్‌ను కోల్పోకుండా మజిల్ మాస్‌ను కోల్పోవడం వల్ల చూడ్డానికి సన్నగా, స్లిమ్‌గా అనిపించినప్పటికీ, ఆరోగ్యపరంగా చేస్తే అది మంచి పరిణామం కాదు. అలా జరగకుండా ఉండాలంటే ఏలాంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం.
స్లిమ్‌గా మారి ఆరోగ్యకరమైన సన్నటి దేహాకృతిని పొందాలనుకునేవారు తాము రోజూ తీసుకునే క్యాలరీలను బాగా తగ్గించుకుంటారు. ఇందుకోసం వాటర్‌థెరపీ, ఫ్రూట్‌థెరపీ, క్యారట్ థెరపీ, జీఎమ్ డైట్ వంటి అనేక ప్రక్రియలను ఫాలో అవుతుంటారు. ఈ డైట్ రెజీమ్‌లతో తమ ఆహారంలో తీసుకోవాల్సిన పిండిపదార్థాలను బాగా తగ్గించుకుంటారు.
దీనివల్ల తాము బాగా బరువు తగ్గుతున్నామని అనుకుంటుంటారుగానీ... తాము తమ కండరాల పరిమాణాన్నీ (మజిల్ మాస్)ను / కండరాల శక్తినీ కూడా కోల్పోతున్నామని గుర్తించరు. కండరాలను కోల్పోతుంటే, దాంతోపాటు ఎముక సాంద్రత (బోన్ డెన్సిటీ) ని కూడా కోల్పోతున్నారని కూడా అర్థం. ఇదెంతో ప్రమాదం.
ఆరోగ్యంగా సన్నబడాలంటే...
మంచి సౌష్ఠవంతో కూడిన శరీరాకృతిని పొందాలంటే దహించాల్సినది కొవ్వులను మాత్రమే. మన దేహపు అవసరాలకు పనికి వచ్చాక మన పొట్ట చుట్టూ పేరుకుపోయి ‘సెంట్రల్ ఒబేసిటీ’ని కలిగించే కొవ్వులను మాత్రమే. తక్కువ పోషకాలతోనే మెటబాలిజమ్ జరిగేలా దేహానికి అలవాటు చేయడమూ సరికాదు...
కొన్నిసార్లు సన్నబడాలనే తీవ్రమైన కోరికతో చాలా తక్కువ క్యాలరీలతోనే జీవక్రియలు కొనసాగేలా దేహానికి అలవాటు చేస్తే... అప్పుడు ఆ కొద్దిపాటి ఆహారంతోనే మెటబాలిక్ యాక్టివిటీస్ అన్నీ నిర్వహించుకునే సామర్థ్యాన్ని దేహం పొందుతుంది. ఏళ్ల తరబడి అలా చేశాక కొద్దిపాటి అదనపు ఆహారం తీసుకున్నా అది శరీర బరువును విపరీతంగా పెంచేస్తుంటుంది.
దీన్నే ‘రెసిస్టెంట్ ఒబేసిటీ’ అని అంటారు. ఈ రెసిస్టెంట్ ఒబేసిటీ వల్ల దీర్ఘకాలం పాటు చాలా చాలా అందంగా కనిపించిన హీరో, హీరోయిన్లు... కెరియర్‌కు దూరంగా ఉన్నప్పుడు కొద్ది వ్యవధిలోనే ఒకేసారి లావెక్కిపోయినట్లుగా కనిపించడం చాలామంది సెలబ్రిటీల్లో కనిపిస్తుంటుంది.
కండరాలను కోల్పోకుండానే కొవ్వులను దహించడం ఎలా?
సన్నబడి మంచి శరీరాకృతి (స్లిమ్ బాడీ) పొందాలంటే ప్రణాళికాబద్ధంగా కండరాలను (మజిల్ మాస్‌ను) కోల్పోకుండా, అదనపు కొవ్వులను మాత్రమే దహించే విధంగా, ఆరోగ్యకరంగా సన్నబడాలి. స్లిమ్‌గా ఉండాలంటూ భోజనాన్ని మానేస్తే ఒక్కోసారి అనొరెక్సియా నర్వోజా, బులీమియా లాంటి మానసిక సమస్యలూ రావచ్చు.
అందుకే బాగా తింటూనే మంచి ఆరోగ్యం కోసం దేహానికి కాస్త కష్టం కలిగించే వ్యాయామాలు చేస్తుండాలి. అయితే అంతగా మంచి ఫిట్‌నెస్ లేనివారు మాత్రం దేహానికి విపరీతమైన శ్రమ కలిగించని విధంగా తేలికపాటి వ్యాయామం చేస్తూ... క్రమంగా ఫిట్‌నెస్‌ను సాధించాలి. ఆ తర్వాత స్టామినాను క్రమంగా పెంచుకుంటూపోవాలి.
(చదవండి: పిల్లోలు.. పరుపు ఎలా ఉండాలంటే...)
Comments
Please login to add a commentAdd a comment