చిరుతపులులు సాధారణంగా సన్నగా ఉంటాయి. పెద్దపులులు, సింహాలతో పోల్చుకుంటే, వీటి బరువు చాలా తక్కువగా ఉంటుంది. అందుకే అవి శరవేగంగా దూకి వేటాడగలవు. చిరుతపులుల సహజమైన తీరుకు భిన్నంగా చైనాలోని ఒక జూలో ఉన్న పదహారేళ్ల చిరుతపులి బాగా లావెక్కిపోయి, ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారింది.
ఈ చిరుత ఫొటోలు చూసి, ఇది చిరుతలా కనిపించడం లేదని, సముద్ర జంతువు సీల్‌లా ఉందని కొందరు వ్యాఖ్యలు చేశారు. చైనాలోని సిచువాన్ ప్రావిన్స్ పాంఝిహువా పార్క్ జూలో ఉన్న ఈ లావాటి చిరుత మిగిలిన చిరుతల్లా చురుగ్గా కాకుండా, మందకొడిగా ఉన్న ఫొటోలు, వీడియోలు ఈ ఏడాది మార్చిలో వైరల్‌గా మారాయి.
ఇది డిస్నీ కామిక్ సిరీస్‌లోని లావాటి పోలీసు పాత్ర ‘క్లాహాసర్’ను తలపిస్తోందంటూ కొందరు వెటకారం చేశారు. జంతుప్రేమికులు మాత్రం అడ్డగోలుగా లావెక్కిన ఈ చిరుత ఆరోగ్య పరిస్థితిపై ఆందోళన వెలిబుచ్చారు. సాధారణంగా చిరుతపులుల బరువు దాదాపు పాతిక నుంచి ముప్పయి కిలోల వరకు ఉంటుంది. ఈ చిరుత మాత్రం రెట్టింపు బరువు పెరిగింది.
దీని గురించి ఆన్‌లైన్‌లో అలజడి మొదలవడంతో చైనా జూ అధికారులు వెంటనే రంగంలోకి దిగి, దీని బరువు తగ్గించడానికి నానా ప్రయత్నాలు ప్రారంభించారు. మేత తగ్గించడం, వ్యాయామాలు చేయించడానికి ప్రయత్నించడం సహా రెండు నెలలకుపైగా ఎన్ని తంటాలు పడినా ఈ చిరుత ఏమాత్రం బరువు తగ్గకపోవడంతో అధికారులు తమ ప్రయత్నాలను విరమించుకున్నారు.
ఇవి చదవండి: కీకారణ్యంలో.. మాయన్ నగర శిథిలాలు! అక్కడేం జరిగిందంటే?
Comments
Please login to add a commentAdd a comment