రసాయనాల్లేని తిండి తిందాం
సేంద్రియ ఆహారోత్పత్తులకు పెరుగుతున్న గిరాకీ
- దేశ వ్యాప్తంగా ఏటా రూ.2 వేల కోట్ల వ్యాపారం
- ఎగుమతుల వాటా రూ.1,800 కోట్లకు పైమాటే
హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: రసాయనాలు, పురుగు మందుల అవశేషాలు లేని సేంద్రియ ఆహారంపై ఆసక్తి రోజురోజుకూ పెరుగుతోంది. ప్రత్యేకించి అమెరికా, యూరప్ వంటి విదేశాలకు సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తులు పెద్ద మొత్తంలోనే ఎగుమతి అవుతున్నాయి. దేశీయంగా పండుతున్న సేంద్రియ వ్యవసాయ దిగుబడుల్లో ఒక వంతు మాత్రమే మన దేశంలో వినియోగిస్తుండగా, అంతకు మూడు రెట్లు విదేశాలకు ఎగుమతి అవుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు.
సాధారణ వ్యవసాయ దిగుబడులతో పోలిస్తే 50 శాతం అధిక ధర ఉన్నా.. మెట్రో నగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ వీటిని కొనుగోలు చేస్తున్నారు. దీంతో ఏటా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ గణనీయంగా పెరుగుతోంది.వ్యవసాయ దిగుబడులు పెంచేందుకు, క్రిమికీటకాల నుంచి పంటను రక్షించేందుకు రసాయనిక ఎరువులు, పురుగు మందుల వాడకం ఎక్కువగా జరుగుతోంది. మొక్కలకే వీటిని చల్లుతున్నప్పటికీ దిగుబడుల్లోనూ అవశేషాలు ఉంటున్నాయని, వీటిని తిన్న వారు అనారోగ్యానికి గురవుతున్నారని వైద్యులు చెబుతున్నారు.
అందుకే సేంద్రియ ఎరువు, సహజసిద్ధ కీటక నాశినులను వినియోగించి సాగుచేసిన సేంద్రియ వ్యవసాయ దిగుబడులకు ఆదరణ పెరుగుతోంది. అమెరికా, ఐరోపా వంటి దేశాల్లో ఎప్పటినుంచో సేంద్రియ ఆహారాన్ని వినియోగిస్తున్నారు. 2004లో అమెరికాలో 11 బిలియన్ డాలర్ల మేర ఉన్న సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ గతేడాది రూ. 27 బిలియన్ డాలర్ల స్థాయికి చేరింది. అదే యూరప్‌లో అయితే గతేడాది రూ.10 బిలియన్ డాలర్లుగా ఉందని ఎస్ బ్యాంక్ నివేదిక చెబుతోంది.
ఎగుమతుల వాటా రూ.1,800 కోట్లు..
2013లో దేశ వ్యాప్తంగా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ విలువ రూ. 2 వేల కోట్లుగా ఉంటే.. ఇందులో అమెరికా, యూరప్ వంటి విదేశాలకు ఎగుమతి అవుతున్నది సుమారు రూ.1,800 కోట్లకు పైగానే ఉంటుందని శ్రేష్ట నేచురల్ బయో ప్రొడక్ట్స్ ఎండీ రాజ్ శీలం ‘సాక్షి బిజినెస్ బ్యూరోకు చెప్పారు.
ఏటా సేంద్రియ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్ విలువ 20-22 శాతం పెరుగుతుండగా.. ఎగుమతుల వ్యాపారం మాత్రం 30-40 శాతం పెరుగుతోందని చెప్పుకొచ్చారు. సేంద్రియ ఆహార ఉత్పత్తులు మెట్రో నగరాలతో పాటు ద్వితీయ, తృతీయ శ్రేణి పట్టణాల్లోనూ లభ్యమవుతున్నాయి. రిలయన్స్, హైప ర్‌సిటీ, ఫుడ్ బజార్, మోర్, నీల్‌గిరీస్, గోద్రెజ్ నేచర్స్ బాస్కెట్, స్పెన్సర్ వంటి అన్ని రిటైల్ మార్కెట్లతో పాటు మందుల షాపుల్లోనూ సేంద్రియ ఆహార ఉత్పత్తులను విక్రయిస్తున్నారు.
4.43 మిలియన్ హెక్టార్లలో సాగు..
దేశ వ్యాప్తంగా 4.43 మిలియన్ హెక్టార్ల విస్తీర్ణంలో సుమారుగా 5,70,000 మంది రైతులు సేంద్రియ వ్యవసాయాన్ని సాగు చేస్తున్నారు. వీటి నుంచి 1,71,100 టన్నుల సేంద్రియ ఉత్పత్తులను పండిస్తున్నారు. ‘‘మొత్తం 13 ఎకరాల్లో సేంద్రియ వ్యవసాయం సాగు చేస్తున్నా. ఇందులో 9 ఎకరాల్లో దానిమ్మ, 4 ఎకరాల్లో కూరగాయలు పండిస్తున్నా. నెలక్రితం అంతర్గత పంట కింద 9 ఎకరాల్లో పుచ్చకాయ పంటను పండించాను. 80 రోజుల్లోనే పంట పూర్తయింది.
మొత్తం రూ.50 వేల ఖర్చురాగా.. రెండున్నర లక్షలకు విక్రయించా’’ అని కరీంనగర్ జిల్లాకు చెందిన రైతు, వృత్తిరీత్యా పోలీస్ అధికారి అయిన దాసరి భూమయ్య ‘సాక్షి బిజినెస్ బ్యూరో’కు చెప్పారు. సేంద్రియ వ్యవసాయ సాగుకు ప్రత్యేకమైన గిడ్డంగుల్లేక పెద్ద సంఖ్యలో రైతులు ముందుకురావట్లేదని ఆయన చెప్పారు. ప్రభుత్వం ఈ విషయంపై దృష్టి సారించాలని కోరారు. రాష్ట్రంలో శ్రీకాకుళం జిల్లాలో ఇప్పటికే 4 వేల ఎకరాలకు పైగా భూముల్లో సేంద్రియ వ్యవసాయం సాగుతోంది. ఆదిలాబాద్, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల్లోనూ సాగు చేస్తున్నారు.