ముంబై: ఉత్పత్తుల ధరల తగ్గుదల, డిమాండ్ అంతంతమాత్రంగా ఉండటం, రబీ పంట సీజన్‌లో రిజర్వాయర్లలో నీటి నిల్వలు ఒక మోస్తరుగా ఉండటం తదితర అంశాల నేపథ్యంలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరం దేశీ ఆగ్రోకెమికల్స్ రంగం ఆదాయం 3 శాతం మేర క్షీణించనుంది.
క్రెడిట్ రేటింగ్స్ ఏజెన్సీ క్రిసిల్ ఒక నివేదికలో ఈ మేరకు అంచనాలు వేసింది. దశాబ్దకాలంలో ఇలా జరగడం ఇదే తొలిసారని పేర్కొంది. చైనా నుంచి సరఫరా వెల్లువెత్తడంతో అంతర్జాతీయంగా ఆగ్రోకెమికల్స్ ధరలు పడిపోయాయని, ఎగుమతులకు డిమాండ్ తగ్గిందని క్రిసిల్ తెలిపింది. అటు అమ్మకాల పరిమాణం, వసూళ్లు తగ్గడం వల్ల నిర్వహణ మార్జిన్లు 400–450 బేసిస్ పాయింట్లు (బీపీఎస్) మేర క్షీణించి దశాబ్దపు కనిష్టమైన 10–11 శాతానికి పడిపోవచ్చని వివరించింది.
డిమాండ్ అంతంతమాత్రంగా ఉండటంతో తయారీ సంస్థలు తమ మూలధన వ్యయాల ప్రణాళికలను కూడా మార్చుకునే పరిస్థితి నెలకొందని క్రిసిల్ పేర్కొంది. లాటిన్ అమెరికా, అమెరికాలో పంటల సీజన్ మళ్లీ ప్రారంభమయ్యే సమయానికి అంతర్జాతీయంగా తయారీ సంస్థలు తిరిగి నిల్వలను పెంచుకోవడం మొదలెట్టాక నవంబర్ నుంచి ఎగుమతులకు డిమాండ్ మెరుగుపడవచ్చని క్రిసిల్ రేటింగ్స్ డైరెక్టర్ పూనమ్ ఉపాధ్యాయ్ తెలిపారు. ఎగుమతుల్లో ఆ రెండు మార్కెట్ల వాటా 55 శాతం ఉంటుంది.
నివేదికలో మరిన్ని విశేషాలు..
- ఎగుమతులు మందగించడంతో దేశీ తయారీ సంస్థల దగ్గర నిల్వలు భారీగా పేరుకుపోయిన నేపథ్యంలో దేశీయంగా అమ్మకాల వృద్ధి సింగిల్ డిజిట్ స్థాయిలోనే ఉండొచ్చు.
- వర్షపాతం ఆశించినంత స్థాయిలో లేకపోవడం వల్ల రిజర్వాయర్లలో నీటి నిల్వలు తక్కువగా ఉండటం రబీ పంటలపై ప్రభావం చూపనుంది. ఫలితంగా ఆగ్రోకెమికల్స్ పరిశ్రమపైనా ప్రతికూల ప్రభావం పడనుంది. సాధారణంగా దేశీయంగా క్రిమిసంహారకాల వినియోగంలో ఈ సీజన్ వాటా 35 శాతం ఉంటుంది.
- అటు ఎగుమతులు మందగించడం, ఇటు దేశీయంగా డిమాండ్ నెమ్మదించడం వంటి అంశాల కారణంగా ఆగ్రోకెమికల్స్ తయారీ సంస్థల నిర్వహణ లాభదాయకత దెబ్బతినే అవకాశం ఉంది. ఇప్పటికే తొలి త్రైమాసికంలో వాటి ఆపరేటింగ్ మార్జిన్ వార్షిక ప్రాతిపదికన 700–1,000 బేసిస్ పాయింట్ల మేర క్షీణించింది. అయితే, మూడో త్రైమాసికం నుంచి డిమాండ్ పుంజుకునే అవకాశం ఉండటం వల్ల నిర్వహణ లాభదాయకత సీక్వెన్షియల్‌గా మెరుగుపడవచ్చు. అయినప్పటికీ ఈ ఆర్థిక సంవత్సరంలో కాస్త తక్కువగా 10–11 శాతానికే పరిమితం కావచ్చు. గత ఆర్థిక సంవత్సరంలో ఇది 15.2 శాతంగా నమోదైంది.
- రాబోయే రోజుల్లో డిమాండు, కీలక ఎగుమతి మార్కెట్లలో వాతావరణ పరిస్థితులు, ఉత్పత్తులు.. ముడిసరుకు ధరలు మొదలైన వాటిని నిశితంగా పరిశీలించాల్సి ఉంటుంది.
Comments
Please login to add a commentAdd a comment