నాగేటి సాళ్లలో ట్రాక్టర్ల పరుగులు
- కానరాని జోడెడ్ల జోరు
- వ్యవసాయంలో పెరిగిన యాంత్రీకరణ
- చేనూచెలకా పనులన్నీ మెషీన్లతోనే
- పల్లెల్లో కానరాని పశుసంపద..
- సేంద్రియ ఎరువుల స్థానంలో విచ్చలవిడిగా రసాయనాలు
- జీవం కోల్పోతున్న నేల.. పెరిగిపోతున్న పెట్టుబడి ఖర్చులు
- పల్లెకు వెళ్లి ‘సాగు’ను పరిశీలించిన ‘సాక్షి’
సాక్షి నెట్‌వర్క్
‘నాగేటి సాళ్ల తెలంగాణ’మాగాణి భూములను ట్రాక్టర్లు ఎడాపెడా దున్నేస్తున్నాయి. యాంత్రీకరణతో వ్యవసాయంలో ఎద్దుల పాత్ర క్రమంగా తగ్గిపోతోంది. నాడు పశువుల కొట్టంలోని సేంద్రియ ఎరువుతో నేలకు జీవం అందేది. నేడు ఆ ఎరువులకు దూరమై విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగు మందులు చల్లుతున్నారు. దీంతో నేల జీవం కోల్పోయి నిస్సారమవుతోంది. ఖరీఫ్ ప్రారంభంలో రైతులు అవలంబిస్తున్న సాగు పద్ధతులు, కొనసాగిస్తున్న సంప్రదాయాలను పరిశీలించేందుకు ‘సాక్షి’ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో జిల్లాలో ఒక్కో గ్రామానికి వెళ్లింది. దాదాపు అన్నిచోట్లా యాంత్రీకరణ జాడలే వెలుగుచూశాయి.
కానరాని కాడెడ్లు..
రైతు ఇంటి ముందు కాడెడ్ల స్థానంలోకి ట్రాక్టర్ వచ్చి చేరింది. ఉదాహరణకు కామారెడ్డి జిల్లా ఆరెపల్లి గ్రామాన్నే తీసుకుంటే.. ఇక్కడ 840 ఎకరాల సాగు భూమి ఉంది. 335 మంది రైతులు ఉన్నారు. పదేళ్ల కిందట దాదాపు 300 జతల ఎడ్లు ఉండేవి. ఇప్పుడు ఎడ్ల సంఖ్య 3 జతలకు పడిపోయింది. గ్రామంలో 18 మంది రైతుల వద్ద ట్రాక్టర్లు ఉన్నాయి. దున్నకాలు, ఇతర వ్యవసాయ పనులకు వీటినే వినియోగిస్తున్నారు. వీరి పనులు అయిపోగానే గ్రామంలోని మిగతా రైతులు వాటిని అద్దెకు తీసుకుని పనులు చేయించుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా వరికోలు పేరుకు తగ్గట్టే వరి పంటకు ప్రసిద్ధి.
ఇక్కడి 1,800 మంది రైతుల వద్ద ఐదేళ్ల క్రితం వరకు 60 జతల ఎద్దులుండేవి. ఇప్పుడు భూమి దున్నాలంటే అందరూ ట్రాక్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. మెదక్ జిల్లా అవుపులపల్లిలో మచ్చుకు జత కాడెడ్లు కూడా కనిపించలేదు. ఈ గ్రామంలో 400 వ్యవసాయ భూమి ఉంటే.. దాదాపు 35కిపైగా ట్రాక్టర్లు ఉన్నాయి. 15 ఏళ్ల కిందట ఈ గ్రామంలో 150కి పైగా జతల ఎద్దులు ఉండేవని రైతులు చెప్పారు. ఇప్పుడవి 5 జతలకు పడిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లా నిజాలాపూర్‌లో 500 కుటుంబాలు సాగుపై ఆధారపడి ఉన్నాయి. వీరిలో 12 మంది రైతులకు సొంత ట్రాక్టర్లు ఉన్నాయి. 11 మంది వద్ద 11 జతల ఎద్దులు ఉన్నాయి. వీరు కూడా ట్రాక్టర్లతో దున్నించడానికే మొగ్గు చూపుతున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నల్లవెల్లిలో మాత్రం కాస్త భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. ఇక్కడ దాదాపు 3 వేల వరకు సాగు భూమి ఉంది. ఇప్పటికీ 60 శాతం మంది రైతులు కాడెడ్లతోనే వ్యవసాయం పనులు చేస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో నాచినపల్లిలో 13 మంది రైతులకు సొంత ట్రాక్లర్లు ఉన్నాయి. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చొల్లేడులో 2,308 ఎకరాల భూమి ఉంది. 705 మంది రైతులుంటే 38 ట్రాక్టర్లు, 300 వరకు ఎద్దులు ఉన్నాయి.
సాగు సన్నద్ధ ఖర్చే రూ.10 వేలు..
ఎడ్ల కొరత, సమయం ఎక్కువ తీసుకోవడం వంటి కారణాలతో ఎక్కువ మంది ట్రాక్టర్లతోనే భూములను దున్నుతున్నారు. జత ఎద్దుల అద్దె రోజుకు రూ.500గా ఉంది. ఎకరం భూమిని ఎడ్లతో దున్నిస్తే కనీసం రెండ్రోజులు పడుతుంది. ట్రాక్టర్‌కు గంటకు రూ.700 అద్దె వసూలు చేస్తున్నారు. ఎకరం నేల దున్నడానికి కనీసం 2–3 గంటలు పడుతుందని అంచనా. ఇంకా కలుపు తీత, ఎరువులు, విత్తనాల కొనుగోళ్లు, ట్రాక్టర్ అద్దె, కూలీలకు కలిపి ఖరీఫ్ సన్నద్ధతకే రూ.10 వేలకు పైగా ఖర్చవుతోంది. ఇది వరి ఇతర పంటల వరకే. అదే పత్తి అయితే ఖర్చు రూ.25 వేలు దాటుతోంది.
చేతిలో పైసల్లేవు..
ఖరీఫ్ పనుల్లో తలమునకలై ఉన్న రైతులు చేతిలో పైసల్లేక అల్లల్లాడుతున్నారు. ఎరువులు, విత్తనాల కొనుగోలుకు నగదు సర్దుబాటు చేసుకునేందుకు తిప్పలు పడుతున్నట్టు ‘సాక్షి విజిట్’లో కనిపించాయి. ప్రస్తుతం రైతులంతా రబీ ఉత్పత్తులను ఐకేపీ కేంద్రాల్లో విక్రయించారు. మరికొందరు ఇప్పటికీ విక్రయానికి పడిగాపులు కాస్తున్నారు. అమ్మిన ధాన్యానికి 48 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతాయనే అధికారుల మాటలు ఎక్కడా అమలు కావడం లేదు. ఆ డబ్బులు వస్తే ఖరీఫ్‌లో పెట్టుబడుల కోసం రైతులంతా ఎదురుచూస్తున్నారు.
ఖర్చులిలా..
ట్రాక్టర్ దుక్కి అద్దె (గంటకు): రూ.700
నాట్ల సమయంలో కేజ్‌వీల్స్‌తో బురదలో దున్నడానికి (గంటకు): రూ.1,600
ఎకరం గొర్రు కొట్టడానికి కూలీ(రోజుకు): రూ.1,000
ఎకరం దున్నడానికి ఎద్దు కూలీ (రోజుకు): రూ.500
పత్తి అచ్చు కొట్టుడు వ్యయం(రోజుకు): రూ.200 నుంచి రూ.500 వరకు
ఎకరం భూమి దున్నడానికి ప్లవుకు(గంటకు):రూ.2 వేలు
రోటోవీటర్ (గంటకు)–1,200
రెండు జతల ఎడ్లుండే..:
మాకు రెండు జతల ఎడ్లుండే. వాటితోనే దున్నకాలు చేసేటోళ్లం. ఎడ్లను ఎప్పుడో అమ్మేసినం. ట్రాక్టర్ ఉంది. దాంతోనే గెరెలు కొట్టి విత్తనం పెడుతున్నం. పదెకరాల భూమి ఉంది. ఏటా కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్నం. లాగోడి అస్తలేదు.
– గడ్డం రాంరెడ్డి, రైతు, ఆరెపల్లి