Organic fertilizers
-
ఆదర్శ రైతు ఇంట.. ‘ఆర్గానిక్’ పెళ్లంట
నేటి ఆధునిక కాలంలో పెళ్లిళ్ల తంతు అంతా కృత్రిమమే... ఫంక్షన్ హాళ్లు, సెట్టింగ్‌లు మొదలు పందిళ్లు, తోరణాలు, చివరకు గ్లాసులు, విస్తళ్ల వరకు అన్నీ ప్లాస్టిక్‌మయమే... కానీ ఆ ఇంట మాత్రం కొబ్బరాకులు, అరిటాకులు, అరటికాయలు, పూలతో తయారు చేసిన పెళ్లి మండపం.. పింగాణి ప్లేట్ల స్థానంలో మోదుగు, అడ్డాకుల ప్లేట్లలో భోజనం, కూల్‌డ్రింక్‌ల స్థానంలో చెరకు, ద్రాక్ష రసం.. చికెన్, మటన్ బదులు సేంద్రియ ఎరువులతో పండించిన కాయగూరల భోజనం.. ఇదీ ఓ ఆదర్శ రైతు ఇంట జరిగిన ‘ఆర్గానిక్’ వివాహం. ఒంటికి ఆరోగ్యం, కంటికి ఆహ్లాదం కలిగేలా నిర్వహించిన ఈ వివాహం ప్రత్యేకంగా నిలవడమే కాక ఆ రైతుకు ప్రకతిపై ఉన్న ప్రేమను చాటిచెప్పింది. సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం కోయచెలక గ్రామానికి చెందిన ఆదర్శ రైతు చెరుకూరి రామారావు తన కుమారుడు కిరణ్ వివాహాన్ని సైతం అందరికీ ఆదర్శంగా నిర్వహించాడు. పెళ్లి ప్రక్రియలో ఆసాంతం ప్రకతికి పెద్దపీట వేశాడు. రామారావుకు తల్లిదండ్రులు రంగమ్మ, సత్యం, భార్య రమణతోపాటు ఇద్దరు కుమారులు కిరణ్, సురేశ్ ఉన్నారు. పెద్ద కుమారుడు కిరణ్ కోయంబత్తూరులో మెకానికల్ ఇంజనీరింగ్ చేసి నాలుగేళ్లుగా ఖమ్మంలో ఆర్గానిక్ స్టోర్ నిర్వహిస్తున్నాడు. ఆయన వివాహం బంధువుల అమ్మాయి ఉదయశ్రీతో నిశ్చయమైంది. శుక్రవారం జరిగిన ఈ వివాహాన్ని మధురమైన జ్ఞాపకంగా చేసుకోవడంతోపాటు ఆశీర్వదించడానికి వచ్చిన అతిథులకు మంచి ఆహారం అందించాలని రైతు రామారావు ఏర్పాట్లు చేసుకున్నాడు. ఎక్కడా ప్లాస్టిక్ వాడకుండా, ఫంక్షన్ హాల్లో కాకుండా ఇంట్లోనే పెళ్లి చేశాడు. పెళ్లి మండపాన్ని జమ్మిగడ్డి, కొబ్బరికాయలు, అరటిగెలలు, పూలతో చూపరులను ఆకట్టుకునేలా అలంకరించారు. భోజనాలకు బెంగళూరు నుంచి అడ్డాకు ప్లేట్లు, ఇతర ప్రాంతాల నుంచి మోదుగు ఆకు ప్లేట్లు తెప్పించారు. ఇక వంటలకు తమ పొలంలో ఎటువంటి రసాయన ఎరువులను వాడకుండా పండించిన కూరగాయలనే వాడారు. వంటకాల కోసం చెక్కగానుగ నూనె, రాక్ సాల్ట్, దేశీయ స్వచ్ఛమైన దేశీ ఆవు నెయ్యి, సహజంగా తయారు చేసిన బెల్లం, పెనగంచిప్రోలు నుంచి ఎండుమిర్చి కారం, ఏలూరు నుంచి కొబ్బరిబొండాలు, అరటిగెలలు, దమ్మపేట నుంచి కొబ్బరి మొక్కలు తెప్పించారు. వివిధ ప్రాంతాల ఆదర్శ రైతులతో వధూవరులు పెళ్లి వంటకాలు ఇవే.. పెళ్లిలో మాంసాహారానికి బదులు ముద్దపప్పు, నెయ్యి, వడియాల చారు, గోంగూర పచ్చడి, నాటుదోసకాయ పచ్చడి, వంకాయ, నాటు చిక్కుడుకాయ కూరలు, మష్రూమ్ ధమ్ బిర్కానీ, ఖద్దూకా ఖీర్, చెరుకు రసం, ద్రాక్ష జ్యూస్ ఏర్పాటు చేశారు. ఈ వివాహానికి బంధువులతోపాటు వ్యవసాయ శాస్త్రవేత్త పురుషోత్తం, ఏలూరు, అనంతపురం, జహీరాబాద్, చిక్‌బళ్లాపూర్ తదితర ప్రాంతాల నుంచి 300 మంది ఆదర్శ రైతులు, కేవీకే, జేడీఏ, హార్టికల్చర్ అధికారులను ఆహ్వానించారు. వారంతా నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఇంటికి తాళం వేయొద్దని.. ఫంక్షన్హాల్లో వివాహం చేసుకుంటే హడావుడి తప్ప ఆనందం ఉండదు. అదే ఇంటి వద్ద అయితే రెండు, మూడు రోజులు ఇల్లంతా సందడిగా ఉంటుంది. ఇక ఫంక్షన్ హాల్లో పెళ్లయితే ఇంటికి తాళం వేసి అంతా వెళ్లాలి. అలా చేయడం నాకు, మా నాన్నకు ఇష్టం లేదు. అందుకే ఇంటి వద్ద వివాహం చేసుకున్నా. – చెరుకూరి కిరణ్, పెళ్లి కుమారుడు ప్రకృతికి విరుద్ధంగా ఉండొద్దనే.. ప్రకతి మనకు ఎన్నో ఇచ్చింది. అలాంటి ప్రకృతికి విరుద్ధంగా వ్యవహరించొద్దనే ఉద్దేశంతోనే పెళ్లి ప్రక్రియలో ఎక్కడా ప్లాస్టిక్‌ను వాడలేదు. అతిథులు మరిచిపోలేని విధంగా సేంద్రియ ఆహారం వడ్డించాం. – చెరుకూరి రామారావు, ఆదర్శ రైతు -
కొబ్బరి పొట్టుతో సేంద్రియ ఎరువు! ఎలా తయారు చేసుకోవాలంటే!
How To Prepare Coconut Coir Based Compost: కొబ్బరి పొట్టుతో తయారు చేసిన సేంద్రియ ఎరువు ‘మట్టి లేని సేద్యాని’కి ఉపయోగపడుతోంది. నిస్సారమైన భూముల్లో లేదా సాగుకు నేల అందుబాటులో లేని అర్బన్ ప్రాంతాల్లో నివాస గృహాల పైన, మిద్దెలపైన, గేటెడ్ కమ్యూనిటీల్లోని ఖాళీ స్థలాల్లో.. గ్రో బ్యాగ్‌లలో కొబ్బరి పొట్టు ఎరువు (కంపోస్టు)తో.. కూరగాయలు, ఆకుకూరలు, ఔషధ మొక్కల సాగుకు మట్టి లేని సేద్యం ఉపకరిస్తుంది. తామర తంపరగా పట్టణీకరణ విస్తరిస్తున్న నేపథ్యంలో ఎక్కువ జనం కూడే పట్టణాలు, నగరాల దగ్గర్లోనే తాజా కూరగాయలు, ఆకుకూరల లభ్యతను పెంచడానికి ఈ సేద్యం ఉపయోగకరమని బెంగళూరులోని భారతీయ ఉద్యాన పంటల పరిశోధనా సంస్థ (ఐఐహెచ్ఆర్) చెబుతోంది. ఆ విశేషాలు ఈ నెల 16న ‘సాక్షి సాగుబడి’లో ప్రచురించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో కొబ్బరి పొట్టుతో చక్కటి సేంద్రియ ఎరువు తయారీ పద్ధతి గురించి తెలుసుకుందాం.. కొబ్బరి డొక్కల నుంచి ఒక కేజీ పీచును వేరు చేసే క్రమంలో 6 నుంచి 8 కేజీల కొబ్బరి పొట్టు వస్తుంది. ఈ ముడి పొట్టును నేరుగా వ్యవసాయంలో వినియోగించకూడదు. ముడి కొబ్బరి పొట్టులోని ‘కర్బనం–నత్రజని’ నిష్పత్తి మొక్కలకు అనుకూలం కాదు. దీనిలో ‘లెగ్నిన్’ కూడా అధిక మోతాదులో ఉంటుంది. అందువల్ల దీన్ని కుళ్లబెట్టకుండా నేరుగా వాడితే మొక్కలకు హాని జరుగుతుంది. కొబ్బరి పొట్టును ఒక శిలీంధ్రం కలిపి కుళ్లబెడితే సేంద్రియ ఎరువుగా మారుతుంది. మట్టి లేని సేద్యానికే కాకుండా.. సాధారణ పొలాల్లో పంటల సాగులో కూడా సేంద్రియ ఎరువుగా వాడుకోవచ్చు. కొబ్బరి పొట్టును సులువుగా సేంద్రియ ఎరువుగా మార్చే ప్రక్రియను సెంట్రల్ కాయిర్ బోర్డు ప్రమాణీకరించింది. ‘ఫ్లూరోటస్ సాజర్ కాజూ’అనే శీలింధ్రాన్ని ఉపయోగించి పొట్టును వేగంగా కుళ్లబెట్టే ప్రక్రియను కాయిర్ బోర్డు రైతులకు పరిచయం చేసింది. రసాయనిక పదార్థాలు వాకుండా ఫ్లూరోటరస్ సాజర్ కాజూ, అజొల్లా, వేప పిండినివినియోగిస్తూ వేగంగా కొబ్బరి పొట్టును కుళ్లబెట్టే విధానం ఇది. కోనసీమ రైతుల ‘కృషీవల కోకోనట్ ఫార్మర్స్ ప్రొడ్యూసర్ కంపెనీ’ కొబ్బరి పొట్టు ఎరువును తయారు చేస్తోంది. కొబ్బరి పొట్టు ఎరువు తయారీకి కావలసిన పదార్ధాలు: ►టన్ను కొబ్బరి పొట్టు (బేబీయార్న్ తొలగించినది) ►10 కేజీల అజొల్లా ∙30 కేజీల వేప పిండి. ►5 కేజీల ఫ్లూరోటస్ సాజర్ కాజూ శిలీంధ్రం. ►వీటిని పొరలు, పొరలుగా వేసి తడుపుతూ ఉంటే నెల రోజుల్లో బాగా చివికిన కొబ్బరి పొట్టు ఎరువు తయారవుతుంది. ►ఫ్లూరో టస్ సాజార్ కాజూ శిలీంధ్రం ధవళేశ్వరంలోని కాయిర్ బోర్డు రీజనల్ కార్యాలయంలో లభిస్తుంది. కొబ్బరి పొట్టుతో కంపోస్టు తయారీ ఇలా.. ►ఒక టన్ను కొబ్బరి పొట్టుకు 12 అడుగుల పొడవు, 6 అడుగుల వెడల్పు, 2 అడుగుల ఎత్తున బెడ్ తయారు చేసుకోవాలి. ►ముందుగా 200 కేజీల కొబ్బరి పొట్టును సమతలంగా, నీడగా ఉన్న ప్రదేశంలో ఒక పొరలా వేయాలి. ►దీనిపై నీరు చిలకరించి (సుమారు 20 లీటర్లు) ఒక కేజీ ఫ్లూరోటస్ సాజర్ కాజూ శిలీంధ్రాన్ని వెదజల్లాలి. ►దీనిపై మళ్లీ 200 కేజీల పొట్టు వేయాలి. పొట్టు వేసిన తరువాత అజోల్లా, వేపపిండి మిశ్రమం 20 కేజీలు వేయాలి. ►20 లీటర్ల నీరు పోసి మళ్లీ 200 కేజీల పొట్టు వేయాలి ►తరువాత ఫ్లూరోటస్ సాజర్ కాజు 2 కేజీలు వేసి నీరు చల్లి, తిరిగి 200 కేజీల పొట్టు వేయాలి. ►తరువాత నీటితో తడపాలి. ►మరోసారి మిగిలిన 20 కేజీల అజొల్లా, వేప పిండి మిశ్రమం, ఫ్లూరోటస్ శిలీంధ్రం 2 కేజీలు చల్లి.. దానిపై నీరు చిలకరించి, మిగిలిన 200 కేజీల కొబ్బరి పొట్టును వేసి నీరు చల్లాలి. ►కనీసం 30 రోజులు దీనిపై ప్రతి రోజూ స్వల్పమోతాదులో నీరు చల్లి తడపాల్సి ఉంది. ►నెల రోజుల్లో పొట్టు బాగా కుళ్లి మంచి ఎరువుగా తయారవుతుంది. ►కొబ్బరి పొట్టు ఎరువు తయారీకి మరో పద్ధతి కూడా ఉంది. ►గైలరిసీడియా (గిరిపుష్పం) చెట్ల ఆకులు, గోమూత్రం కలిపిన పశువుల పేడ, ముడి కొబ్బరి పొట్టును పొరలుపొరలుగా వేసి కుళ్లబెట్టినా కొబ్బరి పొట్టు కంపోస్టు తయారవుతుంది. ►అయితే, ఈ పద్ధతిలో రెండు నెలల సమయం పడుతుంది. – నిమ్మకాయల సతీష్‌బాబు, సాక్షి అమలాపురం చదవండి: Sagubadi: కూరగాయల్లోనూ ‘డ్యూయల్ గ్రాఫ్టింగ్’! ఒకే మొక్కకు రెండు అంట్లు! Organic Farming: 34 ఎకరాల భూమిలో ప్రకృతి సేద్యం.. ఆరోగ్యసిరిగా...! -
ఇల్లే కదా.. ‘సేంద్రియ’ సీమ
సాక్షి, సిద్దిపేట: చెత్తే కదా.. అని తీసిపారేయకండి. అది సేంద్రియ ఎరువుగా మారి సత్తా చాటుతోంది. మిద్దెతోటలకు జవం అవుతోంది. మొక్కలకు జీవం పోస్తోంది. ఒకటి, రెండు కాదు, ఏకంగా 1,450 ఇళ్ల ల్లో సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. వీటి ని ఇంటి మేడపైన సాగవుతున్న మిద్దెతోటలకు విని యోగిస్తున్నారు. చెత్తరహిత సమాజం దిశగా కృషి చేస్తున్న సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛబడిని ఏర్పాటు చేశారు. ఇంట్లోనే సేంద్రియ ఎరువులను తయారు చేసే విధానాన్ని వివరిస్తున్నారు.చెత్తను ఎరువుగా తయారు చేసి సాగుకు ప్రయోజకనకరంగా మలచడంతో సిద్దిపేట మున్సిపాలిటీ ఆదర్శంగా నిలుస్తోంది. పట్ణణవాసులందరూ ఈ విధానాన్ని అవలంబిస్తే చెత్త, డంపింగ్ యార్డుల సమ స్యలు తీరుతాయని అధికారులు అంటున్నారు. హానికరమైన చెత్తనే ప్రతిరోజు మున్సిపాలిటీ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చెత్తబండ్లు పట్టణంలోని గృహాలకు తడి, పొడి, హానికరమైన చెత్తను వేర్వేరుగా సేకరిస్తున్నాయి. పట్టణంలో 26,045 నివాస గృహాలుండగా, 1,450 ఇళ్లలో సేంద్రియ ఎరువులు తయారు చేస్తున్నారు. ఈ గృహాలవారు కేవలం హానికరమైన చెత్తనే చెత్తబండికి అందజేస్తారు. తడి, పొడి చెత్తతో వేర్వేరుగా సేంద్రియ ఎరువును తయారు చేసి మిద్దెతోటల్లోని మొక్కలకు చల్లుతున్నారు. ఇలా ఇంట్లోనే తయారు చేసే సేంద్రియ ఎరువుతో కూరగాయల బాగా కాస్తుండటంతో పట్టణంలో సేంద్రియ ఎరువుల తయారీ సత్ఫలితాలిస్తోంది. రోజూ తరగతులు: సిద్దిపేట మున్సిపాలిటీ ఆధ్వర్యంలో స్వచ్ఛబడిని ఏర్పాటు చేశారు. బెంగుళూరు తరహాలో సిద్దిపేటలో రాష్ట్ర ఆర్థికమంత్రి తన్నీరు హరీశ్‌రావు ప్రత్యేక చొరవతో స్వచ్ఛబడిని ఏర్పాటు చేశారు. అక్కడే సేంద్రియ ఎరువుల తయారీపై శిక్షణ ఇస్తున్నారు. ప్లాస్టిక్ కవర్లకు బదులు క్లాత్ బ్యాగులను వినియోగించాలని ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. ఇదే విధమైన స్వచ్ఛబడిని తమ ప్రాంతాల్లో ఏర్పాటు చేసేందుకు ఇతర మున్సిపాలిటీలు ముందుకొస్తున్నాయి. హానికరమైన చెత్తనే బయటకు.. మా ఇంటిలోని తడి, పొడి చెత్తను చెత్తబండికి ఇవ్వం. గతేడాది నుంచి ఇంట్లోనే సేంద్రియ ఎరువును తయారు చేస్తున్నాం. ఇంట్లో తయారు చేసిన ఎరువునే మిద్దెతోటలోని కూరగాయల మొక్కలకు చల్లుతున్నాం. ఇంటికి సరిపడా కూరగాయలు మిద్దె తోటలో పండుతున్నాయి. - డాక్టర్ డీఎన్.స్వామి, సిద్దిపేట మన చెత్త.. మన ఎరువు మా ఇంట్లో తడి, పొడి చెత్తతోనే ఎరువు తయారు చేస్తున్నాం. మిద్దెతోట కోసం ఎరువులను ఇదివరకు బయట నుంచి కొనుగోలు చేశాం. గతేడాది నుంచి ఇంట్లోనే ఎరువు తయారు చేసి మిద్దెతోటలో వినియోగిస్తున్నాం. మా ఇంటికి వచ్చిన బంధువులు, స్నేహితులందరికి వారికి సరిపడా కూరగాయలను అందిస్తున్నా. -నాగరాజు, సిద్దిపేట ప్రజల్లో అవగాహన పెంచుతున్నాం సేంద్రియ ఎరువుల తయారీపై అవగాహన పెంచు తున్నాం. మంత్రి హరీశ్‌రావు చొరవతో స్వచ్ఛ బడి ఏర్పాటు చేశాం. సేంద్రియ ఎరువులను ఎలా తయారు చేయాలో చూపిస్తున్నాం. మున్సిపాలిటీలో ఇప్పటివరకు 1,450 నివాసాల్లో సేంద్రియ ఎరువులు సొంతంగా తయారు చేస్తున్నారు. -రమణాచారి, కమిషనర్, పురపాలక సంఘం, సిద్దిపేట -
ఆఖరికి చెత్తనూ వదల్లేదు..
సాక్షి, రాచర్ల (ప్రకాశం) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో మండలంలోని ప్రతి పంచాయతీలో డంపింగ్‌యార్డుల (చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు) నిర్మాణాలను పూర్తి చేశారు. డంపింగ్‌యార్డు నిర్మాణాలను అధికార పార్టీ నాయకుల సొంతం చేసుకుని ఇష్టారాజ్యంగా పనులను పూర్తి చేశారు. మరికొన్ని చోట్ల అధికార పార్టీ నాయకుల వ్యవసాయ పొలాలకు అనుకూలంగా ఉండేలా డంపింగ్‌యార్డుల నిర్మాణాలు చేసుకున్నారు. భవిష్యత్తులో డంపింగ్‌యార్డుల నిర్మాణాలను ఆక్రమణ చేసుకుని వారి సొంత పనులకు వాడుకొనేలా ఏర్పాట్లు చేసుకున్నారు. మండలంలోని 14 పంచాయతీలుండగా 14 పంచాయతీల్లో డంపింగ్‌యార్డు నిర్మాణాలు పూర్తియ్యాయి. ఓబుల్‌రెడ్డిపల్లె గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు పాలకవీడు పంచాయతీలోని ఓబుల్‌రెడ్డిపల్లె గ్రామ సమీపంలోని తన వ్యవసాయ పొలం అనుకుని ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలం డంపింగ్‌యార్డు నిర్మాణం పూర్తి చేసుకుని తన సొంత పనులకు వినియోగించుకుంటున్నట్లు పలువురు విమర్శిస్తున్నారు. గుడిమెట్ట గ్రామంలో గ్రామానికి దాదాపు కిలోమీటరు దూరంలో డంపిండ్‌యార్డు నిర్మాణం చేశారు. చోళ్లవీడు గ్రామంలో ప్రైవేటు స్థలం పంచాయతీకి ఇవ్వకుండానే ఆ స్థలంలో డంపింగ్‌యార్డు నిర్మాణం చేశారు. డంపింగ్‌యార్డు నిర్మాణం పూర్తయిన చెత్త నుంచి సంపద తయారు చేయడం లేదు. ఆ డంపింగ్‌యార్డు భవిష్యత్తులో అధికార పార్టీ నాయకులు తన సొంత పనులకు వాడుకొనేందుకు సిద్ధం చేసుకుంటున్నట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఓబుల్రెడ్డిపల్లెలో టీడీపీ నాయకుడి వ్యవసాయ పొలం పక్కనే నిర్మించిన డంపింగ్‌యార్డు ఇలా చేయాలి... నిర్మాణం పూర్తయిన తర్వాత సిబ్బందిని నియమించి, రిక్షాలను ఏర్పాటు చేయాలి. సిబ్బంది పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ప్రతి ఇంటి వద్ద నుంచి తడి, పొడి చెత్తను రిక్షాల ద్వారా షెడ్ వద్దకు తీసుకొచ్చి వేరు చేయాలి. తడి చెత్తను తొట్టెల్లో వేసి వానపాములను వదిలి సేంద్రియ ఎరువులను తయారు చేయాలి. పొడి చెత్తను ప్లాస్టిక్ ద్వారా రీసైక్లింగ్ చేయాల్సి ఉంది. ఇదంతా చేసేందుకు గ్రామ పంచాయతీలో 1000 మంది జనాభాకు ఒక్కరు చొప్పున గ్రీన్ అంబాసిడర్లతో పాటు ఒక్కో కేంద్రానికి ఒక వాచ్‌మెన్‌ను నియమిస్తారు. వారికి స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా నెలకు రూ.6 వేల జీతం చెల్లిస్తారు. చేస్తున్నది ఇలా.. మండలంలోని 14 పంచాయతీలకు గానూ ఎట్టకేలకు 12 పంచాయతీల్లో డంపింగ్‌యార్డు నిర్మాణాలు పూర్తి చేశారు. 10 చోట్ల అధికార టీడీపీ నాయకులు తమకు సంబంధించిన వ్యక్తులకు గ్రీన్ అంబాసిడర్లుగా, వాచ్మెన్లుగా నియమించుకున్నారు. మండలంలో ఎక్కడ కూడ డంపింగ్‌యార్డుల్లో చెత్త నుంచి సేంద్రియ ఎరువులు తయారు చేయడం ప్రారంభిచలేదు. రాచర్ల, గుడిమెట్ట, సోమిదేవిపల్లె గ్రామాల్లో షో చేసేందుకు కొంత చెత్తను పోగు చేసి వదిలేశారు. ఏ ఒక్కరూ వారి పనులు చేయడం లేదు. మండలంలో డంపింగ్‌యార్డు నిర్మాణాలకు మంజూరైన నిధులు పంచాయతీ అంచనా మెత్తం (రూ.లక్షల్లో) ఆకవీడు రూ.7,41,735 అనుములపల్లె రూ.2,57,454 చినగానిపల్లె రూ.2,88,337 చోళ్లవీడు రూ.3,93,599 యడవల్లి రూ.3,92,860 గౌతవరం రూ.2,43,961 గుడిమెట్ట రూ.3,01,977 జేపీ చెరువు రూ.3,22,915 కాలువపల్లె రూ.2,78,362 ఒద్దులవాగుపల్లె రూ.2,57,509 పాలకవీడు రూ.3,54,797 రాచర్ల రూ.6,92,455 సత్యవోలు రూ.2,51,914 సోమిదేవిపల్లె రూ.2,81,335 -
రైతులు సేంద్రియ ఎరువులనే వాడాలి
మొయినాబాద్ రూరల్(చేవెళ్ల): ప్రజలందరికీ అన్నం పెట్టే రైతు అన్నదాతలను ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని సర్పంచ్ల సంఘం రాష్ట్ర్ర కార్యదర్శి, బాకారం సర్పంచ్ సుధాకర్ యాదవ్ అన్నారు. మండలంలోని బాకారం గ్రామంలో స్ట్రీట్ క్రాస్ ఈఫోర్స్ సంస్థ ద్వారా రైతులకు సేంద్రియ ఎరువుల తయారీపై అవగహన కల్పించారు. ఈ సందర్భంగా సర్పంచ్ సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ.. స్ట్రీట్ క్రాస్ ఈఫోర్స్ సంస్థ సభ్యులు గ్రామాలలో రైతులకు పండించే పంటలపై, పంటలకు కావాల్సిన ఎరువులపై అవగాహన కల్పించడం ఎంతో మంచిదని అన్నారు. రసాయన ఎరువులు కాకుండా సేంద్రియ ఎరువుల తయారీలో శిక్షణ కల్పించడం రైతులకు ఎంతో లాభదాయకం అని తెలిపారు. కార్యక్రమంలో మాజీ సర్పంచ్‌లు శ్రీరాం రెడ్డి, మాడి వెంకట్ రెడ్డి, సంస్థ సభ్యులు మనోహర్ రెడ్డి, ఈశ్వర్, సుమయ్య, రిషిత, హేమంత్, చైతన్య, కౌసల్య, గ్రామస్తులు పాల్గొన్నారు. స్ట్రీట్ క్రాస్ ఈ ఫోర్స్ సంస్థ ద్వారా మండలంలోని ఆమ్డాపూర్ పాఠశాల విద్యార్థులకు నోటు పుస్తకాలు, పరీక్షలకు కావాల్సిన ప్యాడ్లు, సామగ్రిని అందజేశారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ కొళ్ల సిద్దయ్య, ఎంపీటీసీ సామ రాంరెడ్డిలు పాల్గొని పుస్తకాలను పంపిణీ చే«శారు. పేద విద్యార్థుల కోసం తమ వంతు సాయం అందిస్తున్నామని సంస్థ సభ్యులు మనోహర్ రెడ్డి తెలిపారు. కార్యక్రమంలో మధుసూదన్ చారి, గుంటం సైపాల్ రెడ్డి, హరిపాల్ రెడ్డి పాల్గొన్నారు. -
టీటీడీ ఎరువులు, ఫ్లోర్క్లీనర్లు
సాక్షి ప్రతినిధి, తిరుపతి: తిరుపతి వెంకన్న లడ్డూకు ఉన్న పేరు ప్రఖ్యాతులు అందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇక సేంద్రియ ఎరువులు, ఫ్లోర్ క్లీనర్లు, సువాసన వెదజల్లే సుగంధాల తయారీపై తిరుమల తిరుపతి దేవస్థానం దృష్టి సారించింది. ఈ వనరులను పుష్కలంగా కలిగిన టీటీడీ త్వరలో ఉత్పత్తుల తయారీ యూనిట్లు నెలకొల్పనుంది. ఇప్పటికే ఉత్తరాఖండ్‌లోని పతంజలి గో ఆశ్రమం, పంజాబ్‌లోని దివ్యజ్యోతి సంస్థాన్ ఆయుర్వేద కేంద్రాలను సందర్శించిన టీటీడీ అధికారులు సంతృప్తి వ్యక్తం చేశారు. అదే తరహాలో తిరుపతిలోనూ తయారీ కేంద్రాలను ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. టీటీడీ వద్ద 3 వేలకుపైగా గోవులు తిరుపతిలోని శ్రీవేంకటేశ్వర గో సంరక్షణశాలలో 3,000కుపైగా ఆవులున్నాయి. పలమనేరు దగ్గర వంద ఎకరాల్లో టీటీడీ ఏర్పాటు చేసిన గోశాలలో మరో 400 ఆవులున్నాయి. గో సంరక్షణలో భాగంగా వట్టిపోయిన గోవులకు ఆశ్రయం కల్పించి పోషిస్తున్నారు. పాలిచ్చే గోవుల కన్నా వట్టిపోయిన ఆవులు సంఖ్య పెరగటంతో నిర్వహణ వ్యయం ఎక్కువైంది. ఈ నేపథ్యంలో గోవుల మూత్రం, పేడను వినియోగించి ఎరువులు, ఫ్లోర్క్లీనర్లు తయారు చేయాలని నిర్ణయించారు. దీనివల్ల గోశాలల నిర్వహణ భారం కూడా తగ్గుతుంది. త్వరలో యూనిట్ ప్రారంభం.... ఆవు పేడతో సేంద్రియ ఎరువులు, గో మూత్రంతో ఫ్లోర్ క్లీనర్ల తయారీకి సంబంధించిన శాస్త్రీయ అధ్యయనం ముగిసిం ది. గోశాల ఆవరణ లో తయారీ యూనిట్‌ను నెలకొల్పనున్నాం. మిషనరీ, టర్నర్లను కొనుగోలు చేయాల్సి ఉంది. నాలుగు నెలల వ్యవధిలో ఉత్పత్తి ప్రారంభించే అవకాశముంది. –హరినాథరెడ్డి, తిరుపతి గోశాల డైరెక్టర్. నెలకు 150 టన్నులు.. తిరుపతి గోశాలలో నిత్యం 15 టన్నుల మేర పేడ లభ్యమవుతోంది. దీన్ని ఎండబెడితే తేమ శాతం పోయాక నెలకు సుమారు 150 టన్నుల పేడ మిగులుతుంది. ఎండుగడ్డి, పచ్చిగడ్డి, గో మూత్రం మిశ్రమాలతో కలిపి దీన్ని నిల్వ చేసి శాస్త్రీయ విధానంలో కొన్ని ముడి పదార్థాలు కలపటం ద్వారా ఎరువుగా మారుతుంది.గో మూత్రానికి పైనాయిల్, లెమన్ గ్రాస్ ట్రీ ఆయిల్ లాంటి ఆయుర్వేద ఉత్పత్తులను కలిపి మిశ్రమాన్ని వేడి చేయటం ద్వారా ఫ్లోర్క్లీనర్గా మార్చవచ్చు. ఆవు పేడతో తయారైన సేంద్రియ ఎరువులను వరి, చెరకు, వేరు శెనగ, కూరగాయల సాగుకు వినియోగించటం ద్వారా మెరుగైన ఫలితాలను పొందవచ్చని వ్యవసాయ శాస్త్రవేత్తలు సూచించారు. తొలిదశలో ఈ ఎరువులను టీటీడీ నిర్వహించే ఉద్యాన వనాలు, పండ్ల తోటలకు వినియోగిస్తారు. తరువాత బయట మార్కెట్లోకి ప్రవేశ పెట్టాలని అధికారులు భావిస్తున్నారు. వాడిన పుష్పాలతో సుగంధాల తయారీ తిరుమల శ్రీవారికి నిత్యం అలంకరించే వివిధ రకాల పుష్పాలను వాడిపోగానే తొలగిస్తారు. ఇవి టన్నుల్లోనే ఉంటాయి. వీటిని వృథాగా పారవేయకుండా సువాసనలు వెదజల్లే సుగంధాలను తయారు చేయాలని టీటీడీ తోటల విభాగం ప్రతిపాదనలు తయారు చేస్తోంది. -
ఎద్దు పాయె.. ఎరువు పాయె ఎవుసాయం తీరే మారె!
నాగేటి సాళ్లలో ట్రాక్టర్ల పరుగులు - కానరాని జోడెడ్ల జోరు - వ్యవసాయంలో పెరిగిన యాంత్రీకరణ - చేనూచెలకా పనులన్నీ మెషీన్లతోనే - పల్లెల్లో కానరాని పశుసంపద.. - సేంద్రియ ఎరువుల స్థానంలో విచ్చలవిడిగా రసాయనాలు - జీవం కోల్పోతున్న నేల.. పెరిగిపోతున్న పెట్టుబడి ఖర్చులు - పల్లెకు వెళ్లి ‘సాగు’ను పరిశీలించిన ‘సాక్షి’ సాక్షి నెట్వర్క్ ‘నాగేటి సాళ్ల తెలంగాణ’మాగాణి భూములను ట్రాక్టర్లు ఎడాపెడా దున్నేస్తున్నాయి. యాంత్రీకరణతో వ్యవసాయంలో ఎద్దుల పాత్ర క్రమంగా తగ్గిపోతోంది. నాడు పశువుల కొట్టంలోని సేంద్రియ ఎరువుతో నేలకు జీవం అందేది. నేడు ఆ ఎరువులకు దూరమై విచ్చలవిడిగా రసాయన ఎరువులు, పురుగు మందులు చల్లుతున్నారు. దీంతో నేల జీవం కోల్పోయి నిస్సారమవుతోంది. ఖరీఫ్ ప్రారంభంలో రైతులు అవలంబిస్తున్న సాగు పద్ధతులు, కొనసాగిస్తున్న సంప్రదాయాలను పరిశీలించేందుకు ‘సాక్షి’ఆదివారం రాష్ట్రవ్యాప్తంగా ఒక్కో జిల్లాలో ఒక్కో గ్రామానికి వెళ్లింది. దాదాపు అన్నిచోట్లా యాంత్రీకరణ జాడలే వెలుగుచూశాయి. కానరాని కాడెడ్లు.. రైతు ఇంటి ముందు కాడెడ్ల స్థానంలోకి ట్రాక్టర్ వచ్చి చేరింది. ఉదాహరణకు కామారెడ్డి జిల్లా ఆరెపల్లి గ్రామాన్నే తీసుకుంటే.. ఇక్కడ 840 ఎకరాల సాగు భూమి ఉంది. 335 మంది రైతులు ఉన్నారు. పదేళ్ల కిందట దాదాపు 300 జతల ఎడ్లు ఉండేవి. ఇప్పుడు ఎడ్ల సంఖ్య 3 జతలకు పడిపోయింది. గ్రామంలో 18 మంది రైతుల వద్ద ట్రాక్టర్లు ఉన్నాయి. దున్నకాలు, ఇతర వ్యవసాయ పనులకు వీటినే వినియోగిస్తున్నారు. వీరి పనులు అయిపోగానే గ్రామంలోని మిగతా రైతులు వాటిని అద్దెకు తీసుకుని పనులు చేయించుకుంటున్నారు. సిద్దిపేట జిల్లా వరికోలు పేరుకు తగ్గట్టే వరి పంటకు ప్రసిద్ధి. ఇక్కడి 1,800 మంది రైతుల వద్ద ఐదేళ్ల క్రితం వరకు 60 జతల ఎద్దులుండేవి. ఇప్పుడు భూమి దున్నాలంటే అందరూ ట్రాక్టర్ కోసం ఎదురుచూస్తున్నారు. మెదక్ జిల్లా అవుపులపల్లిలో మచ్చుకు జత కాడెడ్లు కూడా కనిపించలేదు. ఈ గ్రామంలో 400 వ్యవసాయ భూమి ఉంటే.. దాదాపు 35కిపైగా ట్రాక్టర్లు ఉన్నాయి. 15 ఏళ్ల కిందట ఈ గ్రామంలో 150కి పైగా జతల ఎద్దులు ఉండేవని రైతులు చెప్పారు. ఇప్పుడవి 5 జతలకు పడిపోయాయి. మహబూబ్‌నగర్ జిల్లా నిజాలాపూర్‌లో 500 కుటుంబాలు సాగుపై ఆధారపడి ఉన్నాయి. వీరిలో 12 మంది రైతులకు సొంత ట్రాక్టర్లు ఉన్నాయి. 11 మంది వద్ద 11 జతల ఎద్దులు ఉన్నాయి. వీరు కూడా ట్రాక్టర్లతో దున్నించడానికే మొగ్గు చూపుతున్నారు. సంగారెడ్డి జిల్లా జిన్నారం మండలం నల్లవెల్లిలో మాత్రం కాస్త భిన్నమైన పరిస్థితులు కనిపించాయి. ఇక్కడ దాదాపు 3 వేల వరకు సాగు భూమి ఉంది. ఇప్పటికీ 60 శాతం మంది రైతులు కాడెడ్లతోనే వ్యవసాయం పనులు చేస్తున్నారు. వరంగల్ రూరల్ జిల్లాలో నాచినపల్లిలో 13 మంది రైతులకు సొంత ట్రాక్లర్లు ఉన్నాయి. నల్లగొండ జిల్లా మునుగోడు మండలం చొల్లేడులో 2,308 ఎకరాల భూమి ఉంది. 705 మంది రైతులుంటే 38 ట్రాక్టర్లు, 300 వరకు ఎద్దులు ఉన్నాయి. సాగు సన్నద్ధ ఖర్చే రూ.10 వేలు.. ఎడ్ల కొరత, సమయం ఎక్కువ తీసుకోవడం వంటి కారణాలతో ఎక్కువ మంది ట్రాక్టర్లతోనే భూములను దున్నుతున్నారు. జత ఎద్దుల అద్దె రోజుకు రూ.500గా ఉంది. ఎకరం భూమిని ఎడ్లతో దున్నిస్తే కనీసం రెండ్రోజులు పడుతుంది. ట్రాక్టర్‌కు గంటకు రూ.700 అద్దె వసూలు చేస్తున్నారు. ఎకరం నేల దున్నడానికి కనీసం 2–3 గంటలు పడుతుందని అంచనా. ఇంకా కలుపు తీత, ఎరువులు, విత్తనాల కొనుగోళ్లు, ట్రాక్టర్ అద్దె, కూలీలకు కలిపి ఖరీఫ్ సన్నద్ధతకే రూ.10 వేలకు పైగా ఖర్చవుతోంది. ఇది వరి ఇతర పంటల వరకే. అదే పత్తి అయితే ఖర్చు రూ.25 వేలు దాటుతోంది. చేతిలో పైసల్లేవు.. ఖరీఫ్ పనుల్లో తలమునకలై ఉన్న రైతులు చేతిలో పైసల్లేక అల్లల్లాడుతున్నారు. ఎరువులు, విత్తనాల కొనుగోలుకు నగదు సర్దుబాటు చేసుకునేందుకు తిప్పలు పడుతున్నట్టు ‘సాక్షి విజిట్’లో కనిపించాయి. ప్రస్తుతం రైతులంతా రబీ ఉత్పత్తులను ఐకేపీ కేంద్రాల్లో విక్రయించారు. మరికొందరు ఇప్పటికీ విక్రయానికి పడిగాపులు కాస్తున్నారు. అమ్మిన ధాన్యానికి 48 గంటల్లో బ్యాంకు ఖాతాల్లో డబ్బులు జమవుతాయనే అధికారుల మాటలు ఎక్కడా అమలు కావడం లేదు. ఆ డబ్బులు వస్తే ఖరీఫ్‌లో పెట్టుబడుల కోసం రైతులంతా ఎదురుచూస్తున్నారు. ఖర్చులిలా.. ట్రాక్టర్ దుక్కి అద్దె (గంటకు): రూ.700 నాట్ల సమయంలో కేజ్‌వీల్స్‌తో బురదలో దున్నడానికి (గంటకు): రూ.1,600 ఎకరం గొర్రు కొట్టడానికి కూలీ(రోజుకు): రూ.1,000 ఎకరం దున్నడానికి ఎద్దు కూలీ (రోజుకు): రూ.500 పత్తి అచ్చు కొట్టుడు వ్యయం(రోజుకు): రూ.200 నుంచి రూ.500 వరకు ఎకరం భూమి దున్నడానికి ప్లవుకు(గంటకు):రూ.2 వేలు రోటోవీటర్ (గంటకు)–1,200 రెండు జతల ఎడ్లుండే..: మాకు రెండు జతల ఎడ్లుండే. వాటితోనే దున్నకాలు చేసేటోళ్లం. ఎడ్లను ఎప్పుడో అమ్మేసినం. ట్రాక్టర్ ఉంది. దాంతోనే గెరెలు కొట్టి విత్తనం పెడుతున్నం. పదెకరాల భూమి ఉంది. ఏటా కరువు కాటకాలతో ఇబ్బంది పడుతున్నం. లాగోడి అస్తలేదు. – గడ్డం రాంరెడ్డి, రైతు, ఆరెపల్లి -
పశుసంపద తగ్గుదలతో అల్ప దిగుబడులు
నేలలలో సేంద్రియ పదార్థం, జీవన ద్రవ్యాల కొరత ఏర్పడటం వల్ల ఐరోపాలోని పలు దేశాల్లో ప్రధాన పంటల సాగులో 1990 నుంచి దిగుబడుల్లో పెరుగుదల నమోదవలేదని శాస్త్రవేత్తల తాజా విశ్లేషణ తేల్చింది. భూమికి సేంద్రియ ఎరువులను అందించే పశుసంపద 1980నుంచి ఐరోపాలో క్రమేపీ తగ్గిపోతోంది. దీని ప్రభావంతో పంట దిగుబడులు, సాగుయోగ్యమైన భూములు తగ్గిపోతున్నాయి. జర్మనీకి చెందిన మ్యునిచ్ సాంకేతిక విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తల బృందం ప్రపంచ వ్యవసాయ, ఆహార సంస్థ (ఎఫ్ఎఓ) నుంచి సమాచారాన్ని సేకరించి విశ్లేషించింది. మధ్య, ఉత్తర ఐరోపాలో గత 20 ఏళ్లుగా విస్తృతంగా సాగవుతోన్న బార్లీ, గోధుమ వంటి చిరుధాన్యపు పంటలను పరిశోధన కోసం ఎంచుకున్నారు. గత ఇరవయ్యేళ్లుగా ఈ పంటల దిగుబడుల్లో పెరుగుదల లేదని తేలింది. సైన్స్ ఆఫ్‌ది టోటల్ ఎన్విరాన్మెంట్ పత్రికలో ఈ అధ్యయన ఫలితాలను ప్రచురించారు. నేలలో ఉండే సేంద్రియ పదార్థం, జీవన ద్రవ్యాలపైనే దిగుబడులు ఆధారపడి ఉంటాయి. వీటిని నేలకు అందించే కారకాలు ముఖ్యంగా పశుసంపద తగ్గిపోవటం వల్ల పంట దిగుబడులకు అత్యంత అవసరమైన జీవనద్రవ్యం నిల్వలు తగ్గిపోతున్నాయని వారు ఆందోళన వ్యక్తం చేశారు. పంట దిగుబడులపై ఇది పెను ప్రభావం చూపుతుంది. దీంతోపాటు ఉష్ణోగ్రతల్లో పెరుగుదల వల్ల సేంద్రియ పదార్థం సరఫరా నిలిచిపోయి.. అధిక స్థాయిలో జీవనద్రవ్యం నశించిపోవటం వంటి విపరిణామాలు తలెత్తుతున్నాయి. రసాయనిక ఎరువులను తక్కువగా వినియోగించటం, పప్పుజాతి పంటలను అధికంగా సాగుచేయటం, పంటమార్పిడి పద్ధతిని పాటించటం ద్వారానే ఈ సమస్యను అధిగమించగలమని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. సేంద్రియ పదార్థం అందకుంటే దీర్ఘకాలంలో నేల జీవనద్రవ్యాన్ని కోల్పోతుంది. ‘ఇది ఇలానే కొనసాగితే భూగర్భ నీటి నిల్వలు, నేల భూసారంపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతుందని మ్యునిచ్ సాంకేతిక విశ్వవిద్యాలయం శాస్త్రవేత్త వియోస్మియర్ చెప్పారు.పంట దిగుబడులకు సంజీవనిలా పనిచేసే జీవనద్ర వ్యాన్ని కాపాడుకోవటం అవసరమని దీనికోసం సేంద్రియ పద్ధతుల్లో సేద్యం చేయటం, పంటమార్పిడిని పాటించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. దీంతోపాటు అటవీ వనాల పెంపకం, పంట వ్యర్థాలను పొలంలోనే సేంద్రియ ఎరువులుగా మార్చే ప్రక్రియలను చేపట్టటం ద్వారా జీవనద్రవ్యాన్ని నష్టపోకుండా నివారించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. -
చిరుధాన్యాల సేద్యం చిన్న రైతు సుభిక్షం!
* సంప్రదాయ సేద్య జీవన సంబురం * జహీరాబాద్ ప్రాంత రైతులు చూపుతున్న వెలుగుబాట ఇదే * విత్తనాలు, సేంద్రియ ఎరువులు, కషాయాలు.. అన్నీ సొంతవే * అప్పులు అవసరం లేని.. ఆత్మహత్యల్లేని వ్యవసాయం * కరువు కాలంలోనూ ప్రకృతితో కరచాలనం చినుకు కరువై.. సాగు బరువై.. గుండె చెరువై.. అప్పులు అలవికాని భారమై రైతులు నిస్సహాయంగా ఆత్మహత్యల పాలవుతున్నారు. ఒకే పంట వేయడం.. ఖరీదైన విత్తనాలు ఏటా ఒకటికి రెండు, మూడు సార్లు కొనడం.. రసాయనిక ఎరువులు, పురుగుమందుల కోసం ఎంత వడ్డీకైనా సరే అప్పులు తెచ్చి డబ్బు ఎద పెట్టడం.. చివరికి అప్పులే మిగలడం.. ఆత్మహత్యల పాలవడం.. ఇదంతా ఆధునిక సేద్యపు ఎడారిలో ఏకాకై‘పోతున్న’ తెలుగు బడుగు రైతుల దుస్థితి! మరోవైపు.. మెదక్ జిల్లా జహీరాబాద్ ప్రాంతంలో వేలాది మంది రైతుల జీవనవిధానం దీనికి భిన్నంగా ఉంది. వీరిది సంప్రదాయ చిరుధాన్యాల సేద్యం. విత్తనాలు.. సేంద్రియ ఎరువులు.. కషాయాలు.. అన్నీ వారి సొంతవే, డబ్బిచ్చి కొనే పని లేదు. కఠినమైన కరువు కాలంలోనూ దిగుల్లేదు. ప్రతి పొలంలోనూ 10 - 14 రకాల చిరుధాన్యాలు, పప్పులు, నూనె గింజల పంటలను కలిపి సాగు చేస్తున్నారు. ఇవన్నీ కొద్దిపాటి వర్షానికి పండే సంప్రదాయ వంగడాలే. ఏ కష్టమొచ్చినా ‘సంఘం’ బాసటగా ఉంటుంది. ఆహార స్వావలంబన, విత్తన స్వాతంత్య్రంతోపాటు తమ సేంద్రియ ఉత్పత్తుల్ని మార్కెట్ చేసుకునే సొంత వ్యవస్థ ఈ రైతుల సొంతం. కమ్యూనిటీ రేడియో వీరి నేస్తం. నేలకు, మనిషికి, పశువుకు సంపూర్ణ ఆరోగ్యాన్నిచ్చే సంప్రదాయ పంటల సాగు పాఠాలను వీరు నేర్చింది ప్రకృతి బడిలోనే..! అప్పుల్లేవు. ఆత్మహత్యల్లేవు. ఒక్కమాటలో.. వీళ్లు కొడిగడుతున్న సేద్య దీపానికి సరికొత్త దివ్వెలు. చిన్న, సన్నకారు రైతులందరికీ ఆదర్శప్రాయమైన వీరి సుస్థిర సేద్య జీవన సారం ‘సాగుబడి’ పాఠకుల కోసం.. హైదరాబాద్‌కు 120 కిలోమీటర్ల దూరం.. మెదక్ జిల్లా జహీరాబాద్ పరిసర గ్రామాల్లోకి వె ళ్తుంటే రోడ్డుకిరువైపులా.. ఆత్మస్థయిర్యంతో నిలబడిన రైతన్నల్లా చిరుధాన్యపు పంటల కంకులు నవ్వుతూ ఆహ్వానం పలుకుతాయి. జొన్న, సజ్జ, రాగి, కొర్ర, సామ, అవిశె, పెసలు, కందులు, నువ్వులు.. కలిసి పచ్చగా పెరుగుతూ.. కరువు కాలంలోనూ నీకు మేమున్నామంటూ రైతన్నకు భరోసానిస్తుంటాయి. జహీరాబాద్, ఝరాసంగం, రాయికోడ్, న్యాల్కల్ మండలాల్లోని 72 గ్రామాల్లో జీవితేచ్ఛను ఇనుమడింపజేసే సంప్రదాయ చిరుధాన్యాల సేద్యం కళకళలాడుతోంది. 3,500 మంది రైతులు తమకు వారసత్వంగా వచ్చిన చిరుధాన్యాలు, పప్పుధాన్యాలు, నూనెగింజ పంటల్ని సుమారు ఏడు వేల హెక్టార్లలో సాగు చేస్తున్నారు. వీరిలో చాలా మంది ఎకరం, రెండెకరాలున్న బడుగు రైతులే. వీరిలో 800 మంది రైతులకు (పీజీఎస్) సేంద్రియ సర్టిఫికేషన్ కూడా ఉంది. సేంద్రియ పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా భూసారం పెరగడంతో పాటు నాణ్యతతో కూడిన మంచి దిగుబడులు లభిస్తున్నాయి. ఈ పంటలకు నీటి అవసరం తక్కువ. వీరి పొలాల్లో బోర్లు లేవు కాబట్టి సేద్యానికి విద్యుత్ అవసరం లేదు. వర్షాధారమే. చాలా తక్కువ వర్షం పడినా తమను పస్తు పెట్టకుండా, అప్పులపాలు చేయని సంప్రదాయ పంటలనే పండిస్తున్నారు. దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ 32 ఏళ్ల క్రితం వీరిని సంఘం గొడుగు కిందకు తీసుకొచ్చింది. సేంద్రియ పద్ధతుల్లో కలిపి పంటలు (మిశ్రమ పంటల) సాగు చేయడంలో మేలేమిటో చెప్పింది. తమ వారసత్వ పంటలను, వాటి సాగు విజ్ఞానాన్ని అంతరించిపోకుండా పరిరక్షించుకుంటున్నారు. 30 ఏళ్లుగా చిరుధాన్యాల సేద్యం.. ఎర్రోళ్ల జయప్పకు (8008487517) ఎకరం పొలం ఉంది. ఇతనిది ఝరాసంఘం మండలంలోని బర్దీపూర్ గ్రామం. గత 30 ఏళ్ల నుంచి చిరు ధాన్యాల సేద్యంతోనే తన కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. జయప్పకు ఆరుగురు సంతానం. ఇందులో నలుగురు కుమారులు, ఇద్దరు కుమార్తెలు. ఒక కుమారుడిని ఇంజనీరింగ్, మరొక కుమారుడిని ఎంబీఏ చదివించారు. మరో ఇద్దరు కుమారుల్ని బీఈడీ చదివిస్తున్నారు. ఇద్దరు కుమార్తెలను నర్సింగ్ కోర్సు చేయించారు. ఇంట్లోనే ఒక పాడి ఆవును పెంచుకుంటున్నారు. ఎకరానికి ఖర్చులు పోను సంవత్సర నికరాదాయం 45 వేలు. పంటల సాగు అనుభవాలు ఆయన మాటల్లోనే... ‘నా పొలంలో 18 రకాల పంటల విత్తనాలు వేస్తాను. కొర్రలు, రాగులు, సజ్జలు, జొన్న వంటి చిరుధాన్యాలు.. కంది, ఉలవ, పెసర, అనుములు, బొబ్బర్లు వంటి పప్పుధాన్యాలు.. నువ్వు, కుసుమ వంటి నూనెగింజల పంటలు పొలంలో పక్కపక్కనే వేస్తాం. విత్తనాలు మొలకెత్తడానికి ఒక్క వర్షం చాలు. వర్షాలు బాగా పడితే పంట మంచి దిగుబడినిస్తుంది. ఇప్పటిలాగా వర్షాలు తక్కువైనా పంట పూర్తిగా పోదు. కొన్ని పంటలైనా బాగా పండుతాయి. నా పొలానికి అవసరమైన విత్తనాల్ని సంఘం ద్వారా నడిచే విత్తన బ్యాంకు నుంచి ఉచితంగా తెచ్చుకుంటాను. పంటచేతికొచ్చినాక తీసుకున్న విత్తనాలకు రెట్టింపు గింజల్ని విత్తన బ్యాంకుకు తిరిగి ఇచ్చేస్తాను. పంటలకు చీడపీడలు ఆశించకుండా వాయిలాకు, అడ్డసరం ఆకు, వేపాకు, గానుగ ఆకు రసాల మిశ్రమాన్ని మందులుగా చల్లుతాను. భూసారాన్ని పెంచేందుకు జీవామృతం, పిడకల పొడి , వర్మీ కంపోస్టులను ఎరువులుగా వేస్తాను. జీవామృతాన్ని మా ఆవు పేడ, మూత్రంతోనే తయారు చేసుకుంటాను. మా పొలాల్లో కలుపు తీయడానికి కలుపు సంఘంలోని సభ్యులు మార్కెట్ రేటు కంటే 10 శాతం తక్కువకే వస్తారు. మా పొలం పనులు లేకపోతే నా భార్య, నేను బయటి పొలంలో కూలి పనికి వెళ్తుంటాం. మా ‘సంఘం’ 15 రోజులకొకసారి మా ఊళ్లోనే సమావేశం ఏర్పాటు చేస్తుంది. అప్పటి వాతావరణ, పంటలు, చీడపీడల పరిస్థితులను చర్చించుకుంటాం. సంఘంలోని రైతులెవరికైనా కష్టమొస్తే కలిసికట్టుగా నిలబడతాం. ఆర్థికసాయంతో పాటు మనోస్థయిర్యాన్ని అందిస్తాం. మాకు (కమ్యూనిటీ) రేడియో ఉంది. ఎప్పటికప్పుడు మాకు వ్యవసాయ సూచనలు, సలహాలను రేడియోలో చెబుతారు. విత్తనాలేసిన రెండు, మూడు నెలల నుంచి ఒక్కొక్క పంట దిగుబడి వస్తూ ఉంటుంది. మా కుటుంబం తినడానికి సరిపడా ఉంచుకుని మిగిలిన పంటను డీడీఎస్‌కు అమ్ముతాను. సంఘం తరఫున వాళ్లు వినియోగదారులకు అమ్ముతారు. ఆవుకు మా పొలంలో పండిన చొప్పనే మేతగా వేస్తాను. మేం పండించుకున్న పంటలే తింటాం. ఉప్పు, అగ్గిపెట్టె వంటివి తప్ప బయట కొనేదేమీ లేదు..’ అని జయప్ప (80084 87517) చెప్పారు. 3,500 మంది రైతులు.. ఏడు వేల హెక్టార్లు.. జయప్ప మాదిరిగానే జహీరాబాద్ పరిసర మండలాల్లో సుమారు 3,500 మంది ైరె తులు స్వల్ప ఖర్చుతో సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో ఏడు వేల హెక్టార్లలో సంప్రదాయ మిశ్రమ పంటల్ని సాగు చేస్తూ జీవనం సాగిస్తున్నారు. వీరి పొలాల్లో పంటల జీవవైవిధ్యం వర్థిల్లుతోంది. రసాయనాలు వాడకుండా తమ భూములను పరిరక్షించుకుంటున్నారు. జీవితాన్ని తల్లకిందులు చేసే వాణిజ్య పంటల జోలికి వెళ్లకుండా.. తమకు కరువు కాలంలోనూ ఆహార భద్రతను, జీవన భద్రతను ఇచ్చేవి.. తాము తినడానికి అవసరమైన అన్ని రకాల పంటలను సాగు చేసుకుంటున్నారు. తాము ఆరోగ్యంగా జీవిస్తూ.. ఆరోగ్యవంతమైన ఆహారోత్పత్తులను సమాజానికి అందిస్తున్నారు. వీరిని సంఘటితపరిచి ఆత్మగౌరవంతో ముందుకు నడిపించడంలో డీడీఎస్ నిర్వహిస్తున్న పాత్ర కీలకమైనది. జహీరాబాద్ ప్రాంతంలో ఈ విధంగా సేంద్రియ సేద్యం చేస్తున్న రైతుల పొలాలను ఆసక్తి కలిగిన రైతులు స్వయంగా వెళ్లి చూడొచ్చు. రెండు, మూడు రోజుల పాటు క్షేత్రస్థాయి సందర్శనకు వెళ్లాలనుకునే రైతులు ముందుగా డీడీఎస్ కార్యాలయం నుంచి ఈ మెయిల్ (ddshyderabad@gmail.com, 040 27764577) ద్వారా అనుమతి పొందాల్సి ఉంటుంది. సందర్శకులు బస చేసేందుకు నిర్దేశిత రుసుమును చెల్లించాల్సి వుంటుంది. - అరుణ్ కుమార్ మరపట్ల, సాగుబడి డెస్క్ ఫొటోలు: పి.జి. నాగరాజు 55 గ్రామాల్లో విత్తన బ్యాంకులు.. మా విత్తన బ్యాంకులో 80 రకాల సంప్రదాయ పంటల విత్తనాలు ఉన్నాయి. నాలుగు మండలాల్లోని 55 గ్రామాల్లో విత్తనాల బ్యాంకులు పనిచేస్తున్నాయి. రైతుల నుంచి సేకరించిన విత్తనాలను వేపాకులు, బూడిద కలిపి కుండల్లో దాస్తాం. మా సంఘం సభ్యులైన రైతులకు విత్తనాలు ఇస్తాం. పంటలు పండిన తర్వాత అంతకు రెట్టింపు విత్తనాలను తిరిగి తీసుకుంటాం. సేంద్రియ పద్ధతుల్లో పండించాలనుకునే ఇతర రైతులకూ విత్తనాలు ఇస్తున్నాం. ఇతర రాష్ట్రాలకు చెందిన సంస్థలు కూడా మా విత్తనాలు తీసుకెళ్తుంటాయి. - లక్ష్మమ్మ, విత్తన బ్యాంకు నిర్వాహకురాలు, పస్తాపూర్, మెదక్ జిల్లా వర్షాలు తగ్గినా పంట చేతికొస్తుంది! మా రెండెకరాల పొలంలో పాతికేళ్లకు పైగా 18 రకాల సంప్రదాయ పంటల్ని సాగు చేస్తున్నాం. మాకు రెండు ఆవులున్నాయి. రెండెకరాలకు రూ. ఐదువేల పెట్టుబడి అవుతుంది. విత్తన బ్యాంకు నుంచి విత్తనాలు తెచ్చుకుంటాను. వర్షాలు సరిగా కురవక పోయినా పంట చేతికొస్తుంది. మా కుటుంబానికి సరిపడా తిండి గింజల్ని ఉంచుకుని మిగతావి డీడీఎస్‌కు అమ్ముతాను. అన్ని ఖర్చులు పోనూ నికరాదాయం రూ. 50 వేల వరకు వస్తుంది. పెనిమిటి చాలా ఏళ్ల నాడే చనిపోయాడు. ఐదుగురు పిల్లలున్నారు. పంటల కోసం అప్పు చేసిందెన్నడూ లేదు. - కర్నేని నర్సమ్మ, మహిళా రైతు, గేంజేటి, న్యాల్కల్ మండలం, మెదక్ జిల్లా కరువును తట్టుకొనే వ్యవసాయం ఇది.. ఆహార భద్రత, పర్యావరణ భద్రత, జీవన భద్రతలను ఇచ్చేదే సంప్రదాయ చిరుధాన్యాల వ్యవసాయం. సంప్రదాయ పంటలు కరువు పరిస్థితులను అధిగమించి దిగుబడులిస్తాయి. కాబట్టి రైతులు ఆత్మహత్యల పాలయ్యే పరిస్థితులేర్పడవు. జహీరాబాద్ ప్రాంతాల రైతులు సంఘంగా ఏర్పడి అనేక పంటలు కలిపి సాగు చేస్తున్నారు. ఈ పద్ధతుల్లో సాగుచేస్తున్న వాళ్లెవరూ ఆత్మహత్య చేసుకోలేదు. విద్యుత్తు, నీరు అవసరం లేకుండా కరువును తట్టుకొని వ్యవసాయం చేస్తున్నందుకు ప్రత్యేక బోనస్ ఇచ్చి ప్రభుత్వం ఈ రైతులను ప్రోత్సహించాలి. - పి.వి.సతీష్, డెరైక్టర్, దక్కన్ డెవలప్మెంట్ సొసైటీ, పస్తాపూర్ -
'సేంద్రీయ ఎరువులే మేలు'
వజ్రకరూర్ (అనంతపురం) : రసాయన ఎరువులను వాడకుండా కేవలం సేంద్రీయ ఎరువుల వాడకంతో కూడా అధిక దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయ శాఖ జేడీ శ్రీరాంమ్మూర్తి అన్నారు. ఆయన శుక్రవారం అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం గొల్యపాలెం గ్రామంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన పలువురు రైతులతో మాట్లాడారు. రసాయన ఎరువులు వాడకుండా.. వేరుశెనగ పంటను సాగు చేస్తున్న గాయత్రిదేవి అనే మహిళను ఆయన ప్రశంసించారు. -
గుట్కా మాఫియా
ఇన్ బాక్స్ అన్ని మాఫియాల్లాగే గుట్కా మాఫియా కూడా రెండు రాష్ట్రాలలోనూ విస్తరించి ప్రజల ప్రాణాల మీదికి తెస్తూ కేన్సర్ వంటి రోగాలు విస్తరిం పజేస్తున్నా అధికార యంత్రాంగం మాత్రం చూసీచూడనట్టు వ్యవహ రించడం శోచనీయం. గుట్కా కేంద్రాలు ఎక్కడ ఉన్నాయో తెలుసు. దీని వెనుక ఎవరున్నారో అందరికీ తెలుసు. కానీ పట్టుకోవడానికి మాత్రం ఏ అధికారికీ సాహసం లేదు. వాళ్లిచ్చే కాసుల కోసం కక్కుర్తి పడి ఈ వ్యాపారాన్ని పరోక్షంగా అధికారులే నడిపిస్తున్నారంటే ఇంతకం టే ఘోరం ఇంకొకటి ఉంటుందా? గుట్కా వ్యాపారం ఏడాదికి 2,000 కోట్లు ఉందంటే ఇంక ఏమి చెప్పాలి? మొక్కుబడికి ఏవో రెండు కేసులు పెట్టి చేతులు దులుపుకుంటున్నారు తప్ప శాశ్వత పరిష్కారం దిశగా మాత్రం కృషి చేయడం లేదు. జంటనగరాలలో ఏ పాన్‌షాప్‌లో చూసి నా గుట్కా అందుబాటులో ఉంటుంది. అంతేకాదు.. కాలేజీలు, స్కూళ్లు ఇంకా అక్కడా ఇక్కడా అని లేకుండా ఎక్కడైనా విచ్చలవిడిగా వ్యాపా రం జరుగుతోందంటే ఇంక నిషేధం మాటెక్కడ? పైగా ఇక్కడి నుంచి ఇతర రాష్ట్రాలకు కూడా తరలించడం. ఎన్ని చట్టాలు చేస్తే మాత్రం ఏమి లాభం? ప్రజల ఆరోగ్యంతో చెలగాటం ఆడుతున్న గుట్కా కేంద్రాలు మూయించడమే కాదు అమ్ముతున్న వాళ్లకు కూడా కఠినంగా శిక్షలు వేయాలి. ఇప్పటికైనా అధికార యంత్రాంగం కళ్లు తెరిచి వెంటనే ఈ గుట్కా మహమ్మారిని అంతం చేయాలి. పద్మావతి హైదరాబాద్ ఒంటినిండా విషపదార్థాలే! సహజ సిద్ధంగా పండించిన ఆహార పదార్థాలకు మనం ఎప్పుడో దూరమయ్యాము. అధిక దిగుబడుల కోసం సేంద్రియ ఎరువులను వదిలి, రసాయన ఎరువుల వైపు రైతులు మొగ్గు చూపుతున్నారు. ఈ రసాయన ఎరువుల వాడకం వల్ల అనేక ఆరోగ్య సమస్యలు ఎదుర వుతున్న విషయం తెలిసిందే. వరి, గోధుమ, మక్క, జొన్న లాంటి ఆహార పంటలను చూస్తే.. మనం సహజ పంటలకు ఎప్పుడో దూరమయ్యాం. మన ఆరోగ్యానికి అవసర మైన ఏ పదార్థమూ ఇప్పుడు మనకు అందుబాటులో లేదు. ఇక ఫలాల విషయానికి వస్తే, మామిడి, సపోట, అరటి లాంటి పండ్లయితే అచ్చం విష పదార్థాలు కలిపి మగ్గిస్తున్నారు. ముఖ్యంగా రానున్న మధుర ఫలం మామిడి విషయా నికి వస్తే కాల్షియం కార్బైడ్ అనే రసాయనం వేసి మగ్గించి అమ్మడం సర్వసాధారణమైపోయింది. ఈ విష పదార్థం వాడి పండించిన పండ్లు చూడ్డానికి తేడా కనిపించకపోయినా రుచి, వాసన సహజంగా పండిన పండుకు ఎంతమాత్రం సాటిరాకపోగా అనేకమైన ఉదరకోశ వ్యాధులు సంభవిస్తాయని నిపుణులు పదే పదే హెచ్చరిస్తున్నారు. ఇప్పటికైనా అధికారులు ప్రత్యామ్నాయ చర్యలు తీసుకోవాలి. ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడే రసాయనాలను తక్షణం అరికట్టే విధంగా ప్రభుత్వాలు స్పందించాలని కోరుతున్నాం. తవుటు రాంచంద్రం జగిత్యాల, కరీంనగర్ జిల్లా పాల(కు)ల పునరావాసం సిఫార్సులు, రాజకీయ పలుకుబడి ఉన్నవాళ్లకే టీటీడీ పాలక మండలిలో స్థానం. కానీ ఆధ్యాత్మిక భావాలు కలిగిన వారికి చోటులేదు. ఇంతవరకూ పాలక మండలి నియామకం ఇలాగే జరగడంపై ఎన్ని విమర్శలు వచ్చినా వీసమంత మార్పు మాత్రం శూన్యం. సారా కాంట్రాక్టర్లు, వ్యాపారం చేసుకునే వాళ్లు, సినిమాలో స్త్రీల అందాలను చూపించే వాళ్లు ఇలా చెప్పుకుంటూపోతే కొండవీటి చేంతాడు. అక్కడ వీఐపీలకు సేవలు చేస్తూ తెరవెనుక వాళ్ల వ్యాపారాలు, పైరవీలు చేసు కునేందుకు అదొక రాజకీయ పునరావాసం. తిరుపతి ఎమ్మెల్యే సీటు ఇవ్వలేకపోయినందుకు గాను మన బాబుగారు, కృష్ణమూర్తికి చైర్మన్ పోస్టు ఇచ్చారు. ఇంతవరకూ ఏ పాలక మండలి కూడా భక్తుల గురించి పట్టించుకున్న పాపాన పోలేదు, సరికదా ఆర్జిత సేవాటికెట్ల కుంభ కోణం దగ్గర నుంచి ఫినాయిల్ కాంట్రాక్ట్ కుంభకోణం వరకూ ఏ ఒక్క దానికీ అతీగతీలేదు సరికదా బుట్టదాఖలు కావడం శోచనీయం. అసలు పాలక మండలి ఉన్నా లేకపోయినా ఒకటే. ఇది వీఐపీలకు సేవా మం డలి కానీ భక్తులకు సౌకర్యాలు కల్పించే దిశగా మాత్రం ఏనాడూ ఏమీ చేసిన పాపాన పోలేదు సరికదా భక్తులను లాఠీలతో కొట్టించి తప్పుడు కేసులు పెట్టిన ఘనత మాత్రం మన పాలక మండలి ఘనతే అని చెప్ప వచ్చు. కాబట్టి ఇప్పటికైనా పాలక మండలి తీరు మార్చుకుని భక్తులకు సేవ చేయాలి. ఎస్ విశ్వనాథం చిక్కడపల్లి, హైదరాబాద్ -
ఇంటి ఆవరణలో ఒంటరి సేద్యం
* 200 గజాల స్థలంలో ఆకుకూరల సాగు * ఆదర్శంగా నిలుస్తున్న వృద్ధురాలు మల్లమ్మ ఘట్కేసర్: ఒకవైపు వృద్ధాప్యం.. మరోవైపు చుట్టుముట్టిన కష్టాలు.. అయినా ఆమె కుంగిపోలేదు. చిన్న జాగాలోనే ఆకుకూరలు పండిస్తోంది. ఎకరాలకొద్ది స్థలం లేకున్నా కేవలం 200 గజాల స్థలంలోనే గ్రామ పంచాయతీ బోరు నీటితో మడులను తడుపుతూ.. సేంద్రియ ఎరువులను వాడుతూ ఆకుకూరలు సాగు చేస్తోంది. నెలకు రూ.5 వేల వరకు సంపాదిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తోంది మల్లమ్మ. మండలంలోని బొక్కానిగూడేనికి చెందిన సక్కూరు మల్లమ్మ (57), పెంటారెడ్డి( 59) దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు. వీరిది వ్యవసాయ కుటుంబం. ఒకప్పుడు 3 ఎకరాల భూమి, పాడి గేదెలు ఉండేవి. కూతుళ్లకు వివాహాలు చేశారు. వీరి పెళ్లిల కోసం అప్పులు చేశారు. వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతో అప్పులు తీర్చారు. ఏడు సంవత్సరాల క్రితం వీరి ఒక్కగానొక్క కుమారుడు మధుసూదన్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వీరి భూమిని కాజేయాలని భావించిన కొందరు వ్యక్తులు పథకం పన్నారు. భూమిని కోర్టు వివాదంలోకి నెట్టారు. దీంతో ఈ దంపతుల్ని వరుస కష్టాలు మానసికంగా కుంగదీశాయి. కుమారుడి ఆకస్మిక మరణం వారికి తీవ్ర మానసిక వేదన కలిగించింది. కొంతకాలం డిప్రెషన్‌కు గురై మంచాన పడ్డారు. కొడుకు జ్ఞాపకాలే మనసులో వెంటాడేవి. ఆ జ్ఞాపకాల నుంచి తేరుకోవడానికి కొంత కాలం గ్రామాన్ని విడిచి దూరంగా వెళ్లారు. వృద్ధాప్యం మీదపడటంతో చేసేవారు లేక పాడిగేదెలు అమ్మేశారు. కొడుకు మరణించిన బాధకు దూరం కావాలంటే.. ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలని చిన్న కూతురు ఇచ్చిన సలహాతో తాము నివసిస్తున్న 200 గజాల పశువుల పాక స్థలం కనిపించింది. అందులోనే ఆకుకూరల సాగు ప్రారంభించారు. గ్రామ పంచాయతీ నల్లా నీటిని పారిస్తున్నాను. పాలకూర, కోయికూర, మెంతం కూర, కొత్తిమీర, పుదీనా తదితర ఆకుకూరలు పండిస్తున్నారు. మల్లమ్మ ప్రతి రోజు ఉదయం ఆకుకూరలను గంపలో పెట్టుకొని రెండు కిలో మీటర్ల దూరంలోని ఘట్కేసర్కు నడుచుకుంటూ వెళ్లి విక్రయిస్తోంది. నెలకు రూ. 5 వేల వరకు సంపాదిస్తున్నట్లు మల్లమ్మ చెబుతోంది. భర్త పెంటారెడ్డి ఓ పరిశ్రమలోని చెట్లకు నీరు పెట్ట్టే పనిలో కుదిరాడు. వృద్ధాప్యంలో మరొకరిపై ఆధారపడటం కంటే రెక్కలున్నంత వరకు సాగు చేస్తానని చెబుతోంది మల్లమ్మ. -
రాను..రాను.. నేను రాను... కుదరదయ్యో
‘పొలం పిలుస్తున్నా’ పలకని రైతులు జిల్లాలోని 46మండలాల్లో నిర్వహణ కనబడని అనుబంధ శాఖలు అరకొరగా నిధులు గుడ్లవల్లేరు : ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమానికి జిలాల్లోలో స్పందన కరువైంది. ఈనెల 12 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం దాదాపు మూడు నెలల వరకూ జిల్లాలోని 46మండలాల్లో నిర్వహిస్తున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులను సాధించేలా రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖాధికారులు ప్రయత్నిస్తున్నారు. యాంత్రీకరణలో సబ్సిడీలు, గ్రామీణ విత్తనోత్పత్తి, సేంద్రియ ఎరువుల వినియోగం, జీవన ఎరువుల ఉపయోగంపై అవగాహన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కానీ వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ఈ కార్యక్రమానికి పిలిచినా అన్నదాతలు పలకడం లేదు. ఆదర్శరైతులు ప్రభుత్వానికి సహకరించకపోడంతో కనీసం గ్రామాల్లో రైతులను తీసుకొచ్చేందుకు సిబ్బంది కరువయ్యారు. అధికారులే రైతుల్ని బతిమాలుకుని కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వస్తోంది. అనుబంధ శాఖలు ఎక్కడ..? వ్యవసాయశాఖతో పాటు అనుబంధ శాఖలు ఈ కార్యక్రమానికి పూర్తిస్థాయిలో హాజరుకావడం లేదు. తరచూ గైర్హాజరవుతున్నారు. పశుసంవర్ధక, మత్స్యశాఖలు మాత్రం అక్కడక్కడ కనబడుతున్నాయి. ఉద్యానశాఖతో పాటు జిల్లాలోని పరిశోధనా కేంద్రం, క్రిషి విజ్ఞాన కేంద్రం, రైతు శిక్షణ కేంద్రాల నుంచి రావాల్సిన అధికారులు, శాస్త్రవేత్తలు హాజరుకాలేకపోతున్నారు. దీంతో మూసపద్ధతిలోనే అధికారులు రైతులకు సలహాలు ఇస్తుండటంతో వారు పెడచెవిన పెడుతున్నారు. ఈ కారణంగా దాదాపు ప్రభుత్వం ఉద్దేశం నెరవేరడం లేదు. నిధుల సంగతేంటి..? ఈ సదస్సుల కోసం ప్రభుత్వం నిధులు అరకొరగా కేటాయించింది. అవికూడా జిల్లాకు పూర్తిగా చేరలేదు. ఒక్కో మండల ఏవోకు కారు అలవెన్సుల కింద రోజుకు రూ.వెయ్యి కేటాయించారు. మూడు నెలలపాటు మంగళ, బుధవారాల్లో 24రోజులకుగాను రూ.24 వేలు ఇవ్వాల్సి ఉంది. ఈ డబ్బుతో కార్యక్రమాలు చేపట్టే స్థలంలో కనీసం రైతులకు టీ, బిస్కెట్లు ఇచ్చి కనీసం షామియానాలు కూడా వేయిం చలేని దుస్థితి ఏర్పడటంతో ఏవోలు ఎక్కువగా పొలాలకే పరిమితమవుతున్నారు. ఒకవేళ పంచాయతీ కార్యాలయాల్లోనే సదస్సులు నిర్వహించినా రుణమాఫీ, పంటనష్ట పరిహారం, పంట బీమా తదితరాలపై రైతులు సంధిస్తున్న ప్రశ్నలకు వారు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై జిల్లా జేడీఏ వి. నరసింహులును వివరణ కోరగా నిధులు రావాల్సి ఉందని తెలిపారు. ఎంత కేటాయించారో కూడా తెలియదని పేర్కొన్నారు. -
కూరగాయల సాగుకు ప్రోత్సాహం
‘మన ఊరు-మన కూరగాయలు’పథ కం ప్రారంభం ఇళ్ల వద్ద పెంపకానికి తోడ్పాటు రాజేంద్రనగర్: కూరగాయల సాగును మరింత పెంచి, రైతుకు లాభాలు అందించేందుకు వ్యవసాయ శాఖ నడుం బిగించింది. ఇందులో భాగంగా ‘మన ఊరు-మన కూరగాయలు’ పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకానికి ఉద్యాన, వ్యవసాయ, మార్కెటింగ్ శాఖలు తోడ్పాటునందించనున్నాయి. నగరానికి 11 లక్షల టన్నుల కూరగాయలు అవసరం ఉండగా, కేవలం 3 లక్షల టన్నులే రైతులు ఉత్పత్తి చేస్తున్నారు. మిగిలిన వాటిని ఇతర ప్రాంతాల నుంచి తీసుకువస్తున్నారు. మన ఊరు-మన కూరగాయలు పథకం ద్వారా నగరానికి మరిన్ని కూరగాయలను సరఫరా చేసేందుకు నిర్ణయించారు. ఇందుకోసం రైతులకు శిక్షణతో పాటు తోడ్పాటునందిస్తారు. బుధవారం యూనివర్సిటీలో 42 ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేసి రైతులకు అవగాహన కల్పించారు. ఇళ్లలో సేద్యానికి... పొలాలతో పాటు ఇళ్లలోనూ కూరగాయలను పండిం చేందుకు వివిధ ప్రైవేట్ నర్సరీలు సేవలందిస్తున్నాయి. మొక్కలను పెంచి, వాటిని 35 పైసల నుంచి రూ.1.50 వరకు విక్రయిస్తున్నాయి. ఇందులో ప్రధానంగా టమాటా, క్యాప్సికమ్, వంకాయ, కాకర, సొర, బొప్పాయి, బెండ తదితర కూరగాయలతో పాటు బంతిపూలు సైతం ఉన్నాయి. మొక్కలను పొలాలు, ఇళ్లలోని కుండీలలో సైతం పెంచవచ్చని నర్సరీ సిబ్బంది సూచిస్తున్నారు. నాణ్యమైన విత్తనాలు రైతులకు నాణ్యమైన విత్తనాలు అందించేందుకు స్టాళ్లను ఏర్పాటు చేశారు. సాగు గురించి వివరించడంతో పాటు స్వయంగా కంపెనీల సిబ్బందే పొలాలకు వెళ్లి, పంటల ను పరిశీలించేలా చూస్తున్నారు. తద్వారా నకిలీలను అరికట్టవచ్చని చెబుతున్నారు. సేంద్రియ ఎరువులు ప్రస్తుతం సేంద్రియ ఎరువుల వినియోగం పెరుగుతోంది. దీంతో యూనివర్సిటీలోని సేంద్రియ ఎరువుల ఉత్పత్తి కేంద్రం నుంచి రైతులతో పాటు నగరంలోని ఇళ్లలో పెంచే వారికీ వీటిని అందించనున్నారు. ఈ స్టాల్ విశేషంగా ఆకట్టుకుంటోంది. వీటితో పాటు వ్యవసాయ పనిముట్లు, డ్రిప్ ఇరిగేషన్ పరికరాలు, సోలార్ పంప్సెట్లూ ఆకట్టుకుంటున్నాయి. -
మెట్ట సేద్యంలోనూ సిరుల పంట!
పాడి-పంట గుడ్లవల్లేరు (కృష్ణా), న్యూస్‌లైన్: రాష్ట్రంలోని వ్యవసాయ భూముల్లో చాలా వరకు వర్షాలపై ఆధారపడినవే. ఈ భూముల్లో అన్ని రకాల పైర్లు పండుతున్నప్పటికీ నీటి వసతి కింద పండిస్తున్న పంటలతో పోలిస్తే దిగుబడులు చాలా తక్కువగా ఉంటున్నాయి. అయితే కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టడం ద్వారా మెట్ట భూముల్లోనూ సిరుల పంటలు పండించవచ్చునని కృష్ణా జిల్లాకు చెందిన రిటైర్డ్ ఏడీఏ పి.సత్యనారాయణ సూచిస్తున్నారు. ఆ వివరాలు... రాష్ట్రంలోని మెట్ట భూముల్లో 65% ఎర్ర నేలలైతే 25% నల్లరేగడి నేలలు. మెట్ట పంటలకు కేవలం వర్షపు నీరే ఆధారం కాబట్టి దానిని వృథా చేయకూడదు. అదను, పదును చూసుకొని విత్తనాలు వేసుకోవాలి. సారవంతం కావాలంటే... మెట్ట పంటల్ని పండించే ఎర్ర గరప, చెల్కా, దుబ్బ నేలల్లో సేంద్రియ పదార్థాలే కాకుండా భాస్వరం, జింక్ పోషకాలు కూడా తక్కువగా ఉంటాయి. ఈ భూములకు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం సైతం తక్కువగానే ఉంటుంది. వీటితో పోలిస్తే నల్ల రేగడి నేలలు సారవంతంగా ఉంటాయి. ఇవి నీటిని నిల్వ చేసుకోగలుగుతాయి. మరి ఎర్ర నేలల్ని కూడా సారవంతం చేసుకోవాలంటే చెరువు మట్టి, పశువుల ఎరువు తోలి భూమిలో కలియదున్నాలి. గిరిజన ప్రాంతాల్లో ఏం చేయాలి? గిరిజనులు నివసించే ప్రాంతాల్లో కొండలు, గుట్టలు, అడవులు ఎక్కువగా ఉంటాయి. కాబ ట్టి ఇక్కడి భూములు చదునుగా ఉండవు. ఎత్తుపల్లాలుగా ఉంటాయి. ఇలాంటి భూముల్లోనూ మంచి దిగుబడులు పొందాలంటే రైతులు ముందుగా భూసారాన్ని పరిరక్షించుకోవాలి. ఆధునిక మెట్ట వ్యవసాయ పద్ధతుల్ని అవలంబించాలి. ఇందుకోసం భూమిని వాలుకు అడ్డంగా దున్నాలి. దీనివల్ల వర్షపు నీరు కొట్టుకుపోదు. భూమిలోనే ఇంకిపోతుంది. భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కాబట్టి పైరు బెట్టకు గురికాదు. అలాగే వాలుకు అడ్డంగా విత్తనాలు వేసుకోవాలి. ఈ పనులకు ఖర్చు కూడా చాలా తక్కువగానే అవుతుంది. సేంద్రియ ఎరువులు వేయాలి మెట్ట సేద్యంలో సేంద్రియ ఎరువుల వినియోగం తప్పనిసరి. ఇవి భూమిలోని సేంద్రియ పదార్థాన్ని గణనీయంగా పెంచుతాయి. ఈ పదార్థం తేమ శాతాన్ని పెంచుతుంది. భూమికి బెట్టను తట్టుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు... భూమిలో నత్రజనిని పెంచేందుకు అవసరమైన బాక్టీరియా జీవులు వృద్ధి చెందుతాయి. సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉన్న భూముల్లో సూక్ష్మ పోషక లోపాలు ఏర్పడవు. పంటలు ఏపుగా ఎదుగుతాయి. మంచి దిగుబడులు వస్తాయి. సేంద్రియ ఎరువుల వినియోగంతో భూమిలో పోషకాల లభ్యత పెరుగుతుంది. పంటలకు చీడపీడల్ని తట్టుకునే శక్తి కూడా పెరుగుతుంది. పత్తి, వేరుశనగ పంటలు వేసే వారు ఎకరానికి 8-10 బండ్ల పశువుల ఎరువును చేలో చల్లుకోవాలి. వర్షాలను ఆసరాగా చేసుకొని... రాష్ట్రంలో అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలను ఆసరాగా చేసుకొని రైతులు మెట్ట భూముల్లో లోతు దుక్కులు చేసుకోవాలి. భూమిని సుమారు 30 సెంటీమీటర్ల లోతు వరకు దున్నవచ్చు. దీనివల్ల గత పంటకు సంబంధించిన అవశేషాలు, కలుపు మొక్కలు నశిస్తాయి. నేల లోపలి పొరల్లో దాగిన కీటకాలు, వాటి గుడ్లు బయటపడతాయి. అవి ఎండ వేడిమికి నాశనమవుతాయి. లేదా పక్షులు వాటిని పట్టుకొని తినేస్తాయి. ఫలితంగా పంటకాలంలో చీడపీడల తాకిడి తగ్గుతుంది. అంతేకాదు... లోతు దుక్కులు చేస్తే వర్షపు నీరు వృథా కాకుండా భూమిలోకి ఇంకిపోతుంది. తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కాబట్టి పంట బెట్టకు గురికాదు. పంట మొక్కల వేర్లు కూడా భూమిలోని తేమను, పోషకాలను బాగా గ్రహిస్తాయి. ఫలితంగా దిగుబడులు పెరుగుతాయి. ఎరువుల వినియోగం వర్షాధార పంటలు వేసే వారు ముందుగా భూసార పరీక్షలు చేయించడం మంచిది. దీనివల్ల భూమిలో ఏయే పోషకాలు తక్కువ మోతాదులో ఉన్నాయో తెలుస్తుంది. దీనిని బట్టి వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సిఫార్సు మేరకు పంటకు పోషకాలను అందించాలి. ముఖ్యంగా నత్రజని ఎరువును యూరియా రూపంలో వేసేటప్పుడు మొక్కకు 2 అంగుళాల దూరంలో గొయ్యి తీసి వేసుకున్నట్లయితే ఆ ఎరువు వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది. అలాగే జింక్, బోరాన్, మెగ్నీషియం వంటి సూక్ష్మ పోషకాలను కూడా అవసరమైన మేరకు పంటకు అందించాలి. కలుపు నివారణ కీలకం మెట్ట పైర్లకు నీటి లభ్యత తక్కువగా ఉంటుంది. అందుబాటులో ఉండే కొద్దిపాటి నీటి కోసం అటు పంట మొక్కలే కాకుండా కలుపు మొక్కలు కూడా పోటీ పడతాయి. కాబట్టి కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు తొలగించడం చాలా ముఖ్యం. లేకుంటే దిగుబడులు 25% నుంచి 40% వరకు తగ్గుతాయి. కలుపు నివారణ కోసం రసాయన మందులు పిచికారీ చేయడంతో పాటు విత్తనాలు వేసిన 25, 40 రోజులప్పుడు విధిగా అంతరకృషి చేయాలి. సాళ్లలోని కలుపు మొక్కల్ని కూలీలతో తీయించాలి. దీనివల్ల భూమి గుల్లబారుతుంది. పంట వేర్లకు తేమ, ప్రాణవాయువు (ఆక్సిజన్) అందుతుంది. పత్తి, వేరుశనగ, మొక్కజొన్న పంటల్లో కలుపు నివారణ కోసం విధిగా అంతరకృషి చేయాలి. పంట విత్తిన 25-30 రోజుల మధ్య గొర్రు లేదా గుంటకను ఉపయోగించి కలుపు మొక్కల్ని నిర్మూలించాలి. అయితే నిరంతరాయంగా వర్షాలు పడినప్పుడు అంతరకృషి సాధ్యం కాదు. అప్పుడు రసాయన కలుపు మందుల్ని పిచికారీ చేయాల్సి ఉంటుంది. -
ఆశల సాగు
శ్రీకాకుళం అగ్రికల్చర్, న్యూస్‌లైన్: గత నాలుగేళ్లుగా వరుస విపత్తులతో కుదేలైన జిల్లా రైతులు మరోసారి తన అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సిద్ధమవుతున్నారు. ఖరీఫ్ సీజన్ సమీపిస్తుండటంతో పంట సాగుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. ప్రకృతి విపత్తుల మాటెలా ఉన్నా.. ప్రతి ఏటా ఎదుర్కొంటున్న ఎరువులు, విత్తనాల సమస్యకు తోడు ఈసారి పంట రుణాల సమస్య ఎదురయ్యే సూచనలు కనిపిస్తున్నాయని ఆందోళన చెందుతున్నారు. ప్రతికూలతలు, అడ్డంకులు ఉన్నప్పటికీ ఈ ఏడాది సాగు విస్తీర్ణం పెరిగే అవకాశముందని వ్యవసాయ శాఖ అంచనా వేస్తోంది. ఎన్నికల బిజీ నుంచి ఇప్పుడిప్పుడే తేరుకుంటున్న అధికారులు ఖరీఫ్ ప్రణాళికలు సిద్ధం చేయడంలో నిమగ్నమయ్యారు. ఏటా విత్తనాలతో సమస్య జిల్లాలో అత్యధికంగా సాగయ్యే పంట వరి. గత నాలుగేళ్లుగా వరుస విపత్తులతో పంట నష్టపోయి విత్తనాలు తయారు చేసుకొనే అవకాశం లేకుండా పోయింది. జిల్లాలో ఖరీఫ్ సగటు సాగు విస్తీర్ణం 2.53 లక్షల హెక్టార్లు. ఇందులో 1.85 లక్షల హెక్టార్లలో వరి, 22 వేల హెక్టార్లలో వేరుశనగ, మిగిలిన విస్తీర్ణంలో గోగు, పప్పు దినుసులు తదితర పంటలు సాగు చేస్తున్నారు. గత ఏడాది సుమారు 2.05 లక్షల హెక్టార్లలో వరి సాగు చేశారు. వరి సాధారణ విస్తీర్ణమైన 1.85 లక్షల హెక్టార్లకు సుమారు 1.45 లక్షల క్వింటాళ్ల విత్తనాలు అవసరమవుతాయి. ఇందులో 30 శాతం అంటే సుమారు 45 వేల క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే సాధారణంగా ప్రభుత్వం అందిస్తోంది. కానీ ఈ ఏడాది 49 వేల క్వింటాళ్ల విత్తనాలు అందనున్నాయని వ్యవసాయశాఖ అధికారులు చెబుతున్నారు. ఇప్పటి వరకు జిల్లాకు 20 వేల క్వింటాళ్లు మాత్రమే వచ్చాయి. ఎలా చూసుకున్నా అవసరమైన విత్తనాల్లో ఇది మూడో వంతు మాత్రమే. మిగిలిన విత్తనాలను రైతులే సమకూర్చుకోవలసి వస్తోంది. ప్రస్తుతం రైతుల వద్ద ఒక్క గింజ కూడా లేదు. ఫలితంగా బహిరంగ మార్కెట్లో ఎక్కువ ధర పెట్టి విత్తనాలు కొనుగోలు చేసుకోవాల్సిందే. దీన్ని ఆసరాగా తీసుకుని ప్రైవేటు కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తాయని, గతంలో ఇది తమకు అనుభవమేనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. దీనికితోడు ప్రైవేటుగా కొనుగోలు చేసే విత్తనాల్లో నకిలీ, నాసిరకం ప్రమాదం కూడా ఉంటుందని అంటున్నారు. ఎరువులదీ అదే దారి ఎరువుల విషయంలోనూ రైతులు ఇదే రకమైన ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. గతంలో కేంద్ర ప్రభుత్వం ఎరువుల ధరలు పెంచుకునే స్వేచ్ఛను ఆయా కంపెనీలకే కట్టబెట్టడంతో ధరలు చుక్కలనంటుతున్నాయి. దీంతో రైతుల పరిస్థితి మూలిగే నక్కపై తాటికాయ పడ్డ చందంగా తయారైంది. జిల్లాకు ఖరీఫ్‌లో 99373 టన్నుల ఎరువులు అవసరం. ఇందులో డీఏపీ 15950 టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 18390 టన్నులు ఉన్నాయి. జిల్లా రైతులు సేంద్రియ ఎరువులపై ఆసక్తి చూపకుండా రసాయనిక ఎరువులపైనే ఆధారపడుతున్నారు. వీటి ధరలు ఇష్టారాజ్యంగా పెరిగిపోతుండటం.. సీజనులో డిమాండ్ తగినంతగా సరఫరా కాకపోవడం సమస్యగా పరిణమిస్తోంది. మట్టి నమూనా ఫలితాలు అందేనా.. పంటల సాగులో భూసారం తెలుసుకోవడం అత్యంత ప్రధానం. ఏటా వ్యవసాయ శాఖ భూసార పరీక్షలంటూ రైతుల నుంచి మట్టి నమూనాలు సేకరిస్తోంది. వాటి ఫలితాలను సకాలంలో రైతులకు అందజేయడంలో మాత్రం ఘోరంగా విఫలమవుతోంది. ఈ సారి కూడా ఖరీఫ్ సీజన్‌కు సంబంధించి ప్రతి గ్రామ పంచాయతీ నుంచి మట్టి నమూనాలు సేకరించి పరీక్ష కేంద్రాలకు పంపే పనిలో వ్యవసాయాధికారులున్నారు. అయితే వాటిని ఎప్పుడు పరీక్షిస్తారు.. ఫలితాలు ఎప్పుడు రైతులకు అందజేస్తారన్నవి మాత్రం సమాధానం లేని ప్రశ్నలే. అవగాహన లోపం పంటల సాగు విధానంలో వస్తున్న మార్పులు.. తీసుకోవాల్సిన జాగ్రత్తలు.. అందుబాటులో ఉన్న పథకాలు.. తదితర అంశాలపై రైతులకు సరైన అవగాహన ఉండటం లేదు. రైతులను చైతన్యపరిచేందుకు ఏటా ఖరీఫ్ సీజన్‌కు ముందు వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో రకరకాల పేర్లతో గ్రామాల్లో చైతన్య యాత్రలు నిర్వహించేవారు. అయితే ఈ ఏడాది గ్రామాల్లో ఎన్నికల హడావుడి, అధికారులు కూడా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండడంతో చైతన్య యాత్రలు అటకెక్కాయి. అరకొర పరిజ్ఞానంతోనే రైతులు సాగుకు సిద్ధమవుతున్నారు.