చోళ్లవీడు ప్రైవేటు స్థలంలో నిర్మించిన డంపింగ్‌యార్డు
సాక్షి, రాచర్ల (ప్రకాశం) : మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నిధులతో మండలంలోని ప్రతి పంచాయతీలో డంపింగ్‌యార్డుల (చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలు) నిర్మాణాలను పూర్తి చేశారు. డంపింగ్‌యార్డు నిర్మాణాలను అధికార పార్టీ నాయకుల సొంతం చేసుకుని ఇష్టారాజ్యంగా పనులను పూర్తి చేశారు. మరికొన్ని చోట్ల అధికార పార్టీ నాయకుల వ్యవసాయ పొలాలకు అనుకూలంగా ఉండేలా డంపింగ్‌యార్డుల నిర్మాణాలు చేసుకున్నారు. భవిష్యత్తులో డంపింగ్‌యార్డుల నిర్మాణాలను ఆక్రమణ చేసుకుని వారి సొంత పనులకు వాడుకొనేలా ఏర్పాట్లు చేసుకున్నారు. మండలంలోని 14 పంచాయతీలుండగా 14 పంచాయతీల్లో డంపింగ్‌యార్డు నిర్మాణాలు పూర్తియ్యాయి.
ఓబుల్‌రెడ్డిపల్లె గ్రామానికి చెందిన అధికార పార్టీ నాయకుడు పాలకవీడు పంచాయతీలోని ఓబుల్‌రెడ్డిపల్లె గ్రామ సమీపంలోని తన వ్యవసాయ పొలం అనుకుని ఉన్న ప్రభుత్వ ఖాళీ స్థలం డంపింగ్‌యార్డు నిర్మాణం పూర్తి చేసుకుని తన సొంత పనులకు వినియోగించుకుంటున్నట్లు పలువురు విమర్శిస్తున్నారు. గుడిమెట్ట గ్రామంలో గ్రామానికి దాదాపు కిలోమీటరు దూరంలో డంపిండ్‌యార్డు నిర్మాణం చేశారు. చోళ్లవీడు గ్రామంలో ప్రైవేటు స్థలం పంచాయతీకి ఇవ్వకుండానే ఆ స్థలంలో డంపింగ్‌యార్డు నిర్మాణం చేశారు. డంపింగ్‌యార్డు నిర్మాణం పూర్తయిన చెత్త నుంచి సంపద తయారు చేయడం లేదు. ఆ డంపింగ్‌యార్డు భవిష్యత్తులో అధికార పార్టీ నాయకులు తన సొంత పనులకు వాడుకొనేందుకు సిద్ధం చేసుకుంటున్నట్లుగా గ్రామస్తులు ఆరోపిస్తున్నారు.
ఓబుల్‌రెడ్డిపల్లెలో టీడీపీ నాయకుడి వ్యవసాయ పొలం పక్కనే నిర్మించిన డంపింగ్‌యార్డు
ఇలా చేయాలి...
నిర్మాణం పూర్తయిన తర్వాత సిబ్బందిని నియమించి, రిక్షాలను ఏర్పాటు చేయాలి. సిబ్బంది పంచాయతీ పరిధిలోని గ్రామాల్లో ప్రతి ఇంటి వద్ద నుంచి తడి, పొడి చెత్తను రిక్షాల ద్వారా షెడ్ వద్దకు తీసుకొచ్చి వేరు చేయాలి. తడి చెత్తను తొట్టెల్లో వేసి వానపాములను వదిలి సేంద్రియ ఎరువులను తయారు చేయాలి. పొడి చెత్తను ప్లాస్టిక్ ద్వారా రీసైక్లింగ్ చేయాల్సి ఉంది. ఇదంతా చేసేందుకు గ్రామ పంచాయతీలో 1000 మంది జనాభాకు ఒక్కరు చొప్పున గ్రీన్ అంబాసిడర్లతో పాటు ఒక్కో కేంద్రానికి ఒక వాచ్‌మెన్‌ను నియమిస్తారు. వారికి స్వచ్ఛభారత్ మిషన్ ద్వారా నెలకు రూ.6 వేల జీతం చెల్లిస్తారు.
చేస్తున్నది ఇలా..
మండలంలోని 14 పంచాయతీలకు గానూ ఎట్టకేలకు 12 పంచాయతీల్లో డంపింగ్‌యార్డు నిర్మాణాలు పూర్తి చేశారు. 10 చోట్ల అధికార టీడీపీ నాయకులు తమకు సంబంధించిన వ్యక్తులకు గ్రీన్ అంబాసిడర్లుగా, వాచ్‌మెన్లుగా నియమించుకున్నారు. మండలంలో ఎక్కడ కూడ డంపింగ్‌యార్డుల్లో చెత్త నుంచి సేంద్రియ ఎరువులు తయారు చేయడం ప్రారంభిచలేదు. రాచర్ల, గుడిమెట్ట, సోమిదేవిపల్లె గ్రామాల్లో షో చేసేందుకు కొంత చెత్తను పోగు చేసి వదిలేశారు. ఏ ఒక్కరూ వారి పనులు చేయడం లేదు.
మండలంలో డంపింగ్‌యార్డు నిర్మాణాలకు మంజూరైన నిధులు
పంచాయతీ | అంచనా మెత్తం (రూ.లక్షల్లో) |
ఆకవీడు | రూ.7,41,735 |
అనుములపల్లె | రూ.2,57,454 |
చినగానిపల్లె | రూ.2,88,337 |
చోళ్లవీడు | రూ.3,93,599 |
యడవల్లి | రూ.3,92,860 |
గౌతవరం | రూ.2,43,961 |
గుడిమెట్ట | రూ.3,01,977 |
జేపీ చెరువు | రూ.3,22,915 |
కాలువపల్లె | రూ.2,78,362 |
ఒద్దులవాగుపల్లె | రూ.2,57,509 |
పాలకవీడు | రూ.3,54,797 |
రాచర్ల | రూ.6,92,455 |
సత్యవోలు | రూ.2,51,914 |
సోమిదేవిపల్లె | రూ.2,81,335 |
Comments
Please login to add a commentAdd a comment