రాను..రాను.. నేను రాను... కుదరదయ్యో
- ‘పొలం పిలుస్తున్నా’ పలకని రైతులు
- జిల్లాలోని 46మండలాల్లో నిర్వహణ
- కనబడని అనుబంధ శాఖలు
- అరకొరగా నిధులు
గుడ్లవల్లేరు : ప్రభుత్వం ఆర్భాటంగా ప్రారంభించిన ‘పొలం పిలుస్తోంది’ కార్యక్రమానికి జిలాల్లోలో స్పందన కరువైంది. ఈనెల 12 నుంచి ప్రారంభమైన ఈ కార్యక్రమం దాదాపు మూడు నెలల వరకూ జిల్లాలోని 46మండలాల్లో నిర్వహిస్తున్నారు. ఆధునిక వ్యవసాయ పద్ధతులతో తక్కువ ఖర్చుతో ఎక్కువ దిగుబడులను సాధించేలా రైతులకు అవగాహన కల్పించేందుకు వ్యవసాయ శాఖాధికారులు ప్రయత్నిస్తున్నారు.
యాంత్రీకరణలో సబ్సిడీలు, గ్రామీణ విత్తనోత్పత్తి, సేంద్రియ ఎరువుల వినియోగం, జీవన ఎరువుల ఉపయోగంపై అవగాహన ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం. కానీ వ్యవసాయ పనులు ముమ్మరంగా జరుగుతున్న సమయంలో ఈ కార్యక్రమానికి పిలిచినా అన్నదాతలు పలకడం లేదు. ఆదర్శరైతులు ప్రభుత్వానికి సహకరించకపోడంతో కనీసం గ్రామాల్లో రైతులను తీసుకొచ్చేందుకు సిబ్బంది కరువయ్యారు. అధికారులే రైతుల్ని బతిమాలుకుని కార్యక్రమాన్ని నిర్వహించాల్సి వస్తోంది.
అనుబంధ శాఖలు ఎక్కడ..?
వ్యవసాయశాఖతో పాటు అనుబంధ శాఖలు ఈ కార్యక్రమానికి పూర్తిస్థాయిలో హాజరుకావడం లేదు. తరచూ గైర్హాజరవుతున్నారు. పశుసంవర్ధక, మత్స్యశాఖలు మాత్రం అక్కడక్కడ కనబడుతున్నాయి. ఉద్యానశాఖతో పాటు జిల్లాలోని పరిశోధనా కేంద్రం, క్రిషి విజ్ఞాన కేంద్రం, రైతు శిక్షణ కేంద్రాల నుంచి రావాల్సిన అధికారులు, శాస్త్రవేత్తలు హాజరుకాలేకపోతున్నారు. దీంతో మూసపద్ధతిలోనే అధికారులు రైతులకు సలహాలు ఇస్తుండటంతో వారు పెడచెవిన పెడుతున్నారు. ఈ కారణంగా దాదాపు ప్రభుత్వం ఉద్దేశం నెరవేరడం లేదు.
నిధుల సంగతేంటి..?
ఈ సదస్సుల కోసం ప్రభుత్వం నిధులు అరకొరగా కేటాయించింది. అవికూడా జిల్లాకు పూర్తిగా చేరలేదు. ఒక్కో మండల ఏవోకు కారు అలవెన్సుల కింద రోజుకు రూ.వెయ్యి కేటాయించారు. మూడు నెలలపాటు మంగళ, బుధవారాల్లో 24రోజులకుగాను రూ.24 వేలు ఇవ్వాల్సి ఉంది. ఈ డబ్బుతో కార్యక్రమాలు చేపట్టే స్థలంలో కనీసం రైతులకు టీ, బిస్కెట్లు ఇచ్చి కనీసం షామియానాలు కూడా వేయిం చలేని దుస్థితి ఏర్పడటంతో ఏవోలు ఎక్కువగా పొలాలకే పరిమితమవుతున్నారు.
ఒకవేళ పంచాయతీ కార్యాలయాల్లోనే సదస్సులు నిర్వహించినా రుణమాఫీ, పంటనష్ట పరిహారం, పంట బీమా తదితరాలపై రైతులు సంధిస్తున్న ప్రశ్నలకు వారు కొంత ఇబ్బంది పడుతున్నారు. ఈ విషయమై జిల్లా జేడీఏ వి. నరసింహులును వివరణ కోరగా నిధులు రావాల్సి ఉందని తెలిపారు. ఎంత కేటాయించారో కూడా తెలియదని పేర్కొన్నారు.