మెట్ట సేద్యంలోనూ సిరుల పంట! | Caerulea crop irrigation in the dry! | Sakshi
Sakshi News home page

మెట్ట సేద్యంలోనూ సిరుల పంట!

Published Tue, May 27 2014 2:17 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

మెట్ట సేద్యంలోనూ సిరుల పంట! - Sakshi

మెట్ట సేద్యంలోనూ సిరుల పంట!

పాడి-పంట
గుడ్లవల్లేరు (కృష్ణా), న్యూస్‌లైన్: రాష్ట్రంలోని వ్యవసాయ భూముల్లో చాలా వరకు వర్షాలపై ఆధారపడినవే. ఈ భూముల్లో అన్ని రకాల పైర్లు పండుతున్నప్పటికీ నీటి వసతి కింద పండిస్తున్న పంటలతో పోలిస్తే దిగుబడులు చాలా తక్కువగా ఉంటున్నాయి. అయితే కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టడం ద్వారా మెట్ట భూముల్లోనూ సిరుల పంటలు పండించవచ్చునని కృష్ణా జిల్లాకు చెందిన రిటైర్డ్ ఏడీఏ పి.సత్యనారాయణ సూచిస్తున్నారు. ఆ వివరాలు...

రాష్ట్రంలోని మెట్ట భూముల్లో 65% ఎర్ర నేలలైతే 25% నల్లరేగడి నేలలు. మెట్ట పంటలకు కేవలం వర్షపు నీరే ఆధారం కాబట్టి దానిని వృథా చేయకూడదు. అదను, పదును చూసుకొని విత్తనాలు వేసుకోవాలి.

సారవంతం కావాలంటే...
 మెట్ట పంటల్ని పండించే ఎర్ర గరప, చెల్కా, దుబ్బ నేలల్లో సేంద్రియ పదార్థాలే కాకుండా భాస్వరం, జింక్ పోషకాలు కూడా తక్కువగా ఉంటాయి. ఈ భూములకు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం సైతం తక్కువగానే ఉంటుంది. వీటితో పోలిస్తే నల్ల రేగడి నేలలు సారవంతంగా ఉంటాయి. ఇవి నీటిని నిల్వ చేసుకోగలుగుతాయి. మరి ఎర్ర నేలల్ని కూడా సారవంతం చేసుకోవాలంటే  చెరువు మట్టి, పశువుల ఎరువు తోలి భూమిలో కలియదున్నాలి.

గిరిజన ప్రాంతాల్లో ఏం చేయాలి?
గిరిజనులు నివసించే ప్రాంతాల్లో కొండలు, గుట్టలు, అడవులు ఎక్కువగా ఉంటాయి. కాబ ట్టి ఇక్కడి భూములు చదునుగా ఉండవు. ఎత్తుపల్లాలుగా ఉంటాయి. ఇలాంటి భూముల్లోనూ మంచి దిగుబడులు పొందాలంటే రైతులు ముందుగా భూసారాన్ని పరిరక్షించుకోవాలి. ఆధునిక మెట్ట వ్యవసాయ పద్ధతుల్ని అవలంబించాలి. ఇందుకోసం భూమిని వాలుకు అడ్డంగా దున్నాలి. దీనివల్ల వర్షపు నీరు కొట్టుకుపోదు. భూమిలోనే ఇంకిపోతుంది. భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కాబట్టి పైరు బెట్టకు గురికాదు. అలాగే వాలుకు అడ్డంగా విత్తనాలు వేసుకోవాలి. ఈ పనులకు ఖర్చు కూడా చాలా తక్కువగానే అవుతుంది.

సేంద్రియ ఎరువులు వేయాలి
మెట్ట సేద్యంలో సేంద్రియ ఎరువుల వినియోగం తప్పనిసరి. ఇవి భూమిలోని సేంద్రియ పదార్థాన్ని గణనీయంగా పెంచుతాయి. ఈ పదార్థం తేమ శాతాన్ని పెంచుతుంది. భూమికి బెట్టను తట్టుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు... భూమిలో నత్రజనిని పెంచేందుకు అవసరమైన బాక్టీరియా జీవులు వృద్ధి చెందుతాయి. సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉన్న భూముల్లో సూక్ష్మ పోషక లోపాలు ఏర్పడవు. పంటలు ఏపుగా ఎదుగుతాయి. మంచి దిగుబడులు వస్తాయి. సేంద్రియ ఎరువుల వినియోగంతో భూమిలో పోషకాల లభ్యత పెరుగుతుంది. పంటలకు చీడపీడల్ని తట్టుకునే శక్తి కూడా పెరుగుతుంది. పత్తి, వేరుశనగ పంటలు వేసే వారు ఎకరానికి 8-10 బండ్ల పశువుల ఎరువును చేలో చల్లుకోవాలి.

వర్షాలను ఆసరాగా చేసుకొని...
రాష్ట్రంలో అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలను ఆసరాగా చేసుకొని రైతులు మెట్ట భూముల్లో లోతు దుక్కులు చేసుకోవాలి. భూమిని సుమారు 30 సెంటీమీటర్ల లోతు వరకు దున్నవచ్చు. దీనివల్ల గత పంటకు సంబంధించిన అవశేషాలు, కలుపు మొక్కలు నశిస్తాయి. నేల లోపలి పొరల్లో దాగిన కీటకాలు, వాటి గుడ్లు బయటపడతాయి. అవి ఎండ వేడిమికి నాశనమవుతాయి. లేదా పక్షులు వాటిని పట్టుకొని తినేస్తాయి. ఫలితంగా పంటకాలంలో చీడపీడల తాకిడి తగ్గుతుంది. అంతేకాదు... లోతు దుక్కులు చేస్తే వర్షపు నీరు వృథా కాకుండా భూమిలోకి ఇంకిపోతుంది. తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కాబట్టి పంట బెట్టకు గురికాదు. పంట మొక్కల వేర్లు కూడా భూమిలోని తేమను, పోషకాలను బాగా గ్రహిస్తాయి. ఫలితంగా దిగుబడులు పెరుగుతాయి.

ఎరువుల వినియోగం
వర్షాధార పంటలు వేసే వారు ముందుగా భూసార పరీక్షలు చేయించడం మంచిది. దీనివల్ల భూమిలో ఏయే పోషకాలు తక్కువ మోతాదులో ఉన్నాయో తెలుస్తుంది. దీనిని బట్టి వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సిఫార్సు మేరకు పంటకు పోషకాలను అందించాలి. ముఖ్యంగా నత్రజని ఎరువును యూరియా రూపంలో వేసేటప్పుడు మొక్కకు 2 అంగుళాల దూరంలో గొయ్యి తీసి వేసుకున్నట్లయితే ఆ ఎరువు వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది. అలాగే జింక్, బోరాన్, మెగ్నీషియం వంటి సూక్ష్మ పోషకాలను కూడా అవసరమైన మేరకు పంటకు అందించాలి.
 
కలుపు నివారణ కీలకం

మెట్ట పైర్లకు నీటి లభ్యత తక్కువగా ఉంటుంది. అందుబాటులో ఉండే కొద్దిపాటి నీటి కోసం అటు పంట మొక్కలే కాకుండా కలుపు మొక్కలు కూడా పోటీ పడతాయి. కాబట్టి కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు తొలగించడం చాలా ముఖ్యం. లేకుంటే దిగుబడులు 25% నుంచి 40% వరకు తగ్గుతాయి. కలుపు నివారణ కోసం రసాయన మందులు పిచికారీ చేయడంతో పాటు విత్తనాలు వేసిన 25, 40 రోజులప్పుడు విధిగా అంతరకృషి చేయాలి. సాళ్లలోని కలుపు మొక్కల్ని కూలీలతో తీయించాలి. దీనివల్ల భూమి గుల్లబారుతుంది. పంట వేర్లకు తేమ, ప్రాణవాయువు (ఆక్సిజన్) అందుతుంది.

పత్తి, వేరుశనగ, మొక్కజొన్న పంటల్లో కలుపు నివారణ కోసం విధిగా అంతరకృషి చేయాలి. పంట విత్తిన 25-30 రోజుల మధ్య గొర్రు లేదా గుంటకను ఉపయోగించి కలుపు మొక్కల్ని నిర్మూలించాలి. అయితే నిరంతరాయంగా వర్షాలు పడినప్పుడు అంతరకృషి సాధ్యం కాదు. అప్పుడు రసాయన కలుపు మందుల్ని పిచికారీ చేయాల్సి ఉంటుంది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement