ఇంటి ఆవరణలో ఒంటరి సేద్యం
* 200 గజాల స్థలంలో ఆకుకూరల సాగు
* ఆదర్శంగా నిలుస్తున్న వృద్ధురాలు మల్లమ్మ
ఘట్‌కేసర్: ఒకవైపు వృద్ధాప్యం.. మరోవైపు చుట్టుముట్టిన కష్టాలు.. అయినా ఆమె కుంగిపోలేదు. చిన్న జాగాలోనే ఆకుకూరలు పండిస్తోంది. ఎకరాలకొద్ది స్థలం లేకున్నా కేవలం 200 గజాల స్థలంలోనే గ్రామ పంచాయతీ బోరు నీటితో మడులను తడుపుతూ.. సేంద్రియ ఎరువులను వాడుతూ ఆకుకూరలు సాగు చేస్తోంది. నెలకు రూ.5 వేల వరకు సంపాదిస్తూ అందరికి ఆదర్శంగా నిలుస్తోంది మల్లమ్మ. మండలంలోని బొక్కానిగూడేనికి చెందిన సక్కూరు మల్లమ్మ (57), పెంటారెడ్డి( 59) దంపతులు. వీరికి ఇద్దరు కూతుళ్లు, ఓ కుమారుడు. వీరిది వ్యవసాయ కుటుంబం. ఒకప్పుడు 3 ఎకరాల భూమి, పాడి గేదెలు ఉండేవి. కూతుళ్లకు వివాహాలు చేశారు. వీరి పెళ్లిల కోసం అప్పులు చేశారు.
వ్యవసాయం ద్వారా వచ్చిన ఆదాయంతో అప్పులు తీర్చారు. ఏడు సంవత్సరాల క్రితం వీరి ఒక్కగానొక్క కుమారుడు మధుసూదన్‌రెడ్డి రోడ్డు ప్రమాదంలో మృతిచెందాడు. వీరి భూమిని కాజేయాలని భావించిన కొందరు వ్యక్తులు పథకం పన్నారు. భూమిని కోర్టు వివాదంలోకి నెట్టారు. దీంతో ఈ దంపతుల్ని వరుస కష్టాలు మానసికంగా కుంగదీశాయి. కుమారుడి ఆకస్మిక మరణం వారికి తీవ్ర మానసిక వేదన కలిగించింది. కొంతకాలం డిప్రెషన్‌కు గురై మంచాన పడ్డారు. కొడుకు జ్ఞాపకాలే మనసులో వెంటాడేవి. ఆ జ్ఞాపకాల నుంచి తేరుకోవడానికి కొంత కాలం గ్రామాన్ని విడిచి దూరంగా వెళ్లారు. వృద్ధాప్యం మీదపడటంతో చేసేవారు లేక పాడిగేదెలు అమ్మేశారు.
కొడుకు మరణించిన బాధకు దూరం కావాలంటే.. ఏదో ఒక వ్యాపకం పెట్టుకోవాలని చిన్న కూతురు ఇచ్చిన సలహాతో తాము నివసిస్తున్న 200 గజాల పశువుల పాక స్థలం కనిపించింది. అందులోనే ఆకుకూరల సాగు ప్రారంభించారు. గ్రామ పంచాయతీ నల్లా నీటిని పారిస్తున్నాను. పాలకూర, కోయికూర, మెంతం కూర, కొత్తిమీర, పుదీనా తదితర ఆకుకూరలు పండిస్తున్నారు. మల్లమ్మ ప్రతి రోజు ఉదయం ఆకుకూరలను గంపలో పెట్టుకొని రెండు కిలో మీటర్ల దూరంలోని ఘట్‌కేసర్‌కు నడుచుకుంటూ వెళ్లి విక్రయిస్తోంది. నెలకు రూ. 5 వేల వరకు సంపాదిస్తున్నట్లు మల్లమ్మ చెబుతోంది. భర్త పెంటారెడ్డి ఓ పరిశ్రమలోని చెట్లకు నీరు పెట్ట్టే పనిలో కుదిరాడు. వృద్ధాప్యంలో మరొకరిపై ఆధారపడటం కంటే రెక్కలున్నంత వరకు సాగు చేస్తానని చెబుతోంది మల్లమ్మ.