dairy - crop
-
పాడి పుణ్యాన..!
నాగిరెడ్డి రామారావు, విజయగౌరి దంపతులది విజయనగరం జిల్లా బొబ్బిలి రూరల్ మండలం రాజుపేట గ్రామం. కుటుంబం కష్టాల్లో ఉన్న కాలంలో పాడి ఆవుల పెంపకం ప్రారంభించారు. కుటుంబాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తున్నారు. విజయగౌరి పెద్దగా చదువుకోకపోయినా ప్రతి విషయాన్ని ఆసక్తిగా నేర్చుకుంటూ.. ప్రణాళికాబద్ధంగా పనులను చేపడుతూ ముందుకు సాగుతున్న వైనం ఆదర్శప్రాయం. వివరాలు ఆమె మాటల్లోనే.. ‘‘నా భర్త రామారావు. మాకు ఇద్దరు పిల్లలు. ఆయన రాజకీయాలలో ఆర్థికంగా చితికిపోవడంతో ఉన్న ఐదెకరాల్లో మూడెకరాల భూమిని అమ్మేశాం. చిన్నప్పటి నుండీ వ్యవసాయం, పశువుల పెంపకంలో నాకు అనుభవం ఉండటంతో పాడి ఆవుల పెంపకం చేపట్టాను. ఆర్థికంగా కుటుంబాన్ని నిలబెట్టుకోవాలనే లక్ష్యంతో ఏడేళ్ల క్రితం పశు క్రాంతి పథకం ద్వారా విశాఖ డెయిరీ సహకారంతో చెన్నై నుంచి మూడు ఆవులతో పాడి పశువుల పోషణను ప్రారంభించాను. నా భర్త రామారావు సహకారంతో తరువాత పలు జాతుల ఆవులు కొన్నాం. 5 జెర్సీ, 2 హెచ్.ఎఫ్. ఆవులతోపాటు 4 ఒంగోలు, 2 సాహివాల్, 1 పుంగనూరు తదితర దేశీ జాతి ఆవులు.. మొత్తం 16 ఆవులు, 2 పెయ్యలను జాగ్రత్తగా పోషిస్తున్నాం. వ్యవసాయ శాఖ, విశాఖ డెయిరీ, పశుసంవర్ధక శాఖల సహకారంతో కో–4 గడ్డిని ఎకరంలో పెంచుతున్నాం. మిగతా ఎకరంలో వరి పండిస్తున్నాం. పశువులకు ఆరోగ్యకరమైన మేతను, దాణాని అందిస్తూ పాడిపైనే ఆధారపడి జీవిస్తున్నాం. రోజుకు 80 నుంచి 100 లీటర్ల పాలు విశాఖ డెయిరీ వారి పాల కేంద్రానికి పోస్తున్నాం. 15 రోజులకోసారి డబ్బు చేతికందుతుంది. సగం ఆదాయాన్ని పాడి పశువుల పోషణ, బాగోగుల కోసమే ఖర్చు పెడుతున్నాం. అప్పుడప్పుడూ రోజుకు 120 నుంచి 150 లీటర్ల పాలు పోసిన రోజులున్నాయి. పశువుల పేడతోనే గోబర్ గ్యాస్ ఉత్పత్తి చేసి వాడుకుంటున్నాం. నా భర్త, నేను తెల్లవారుఝామున 3.30 గంటలకు లేచి పశువులను శుభ్రం చేసి, పాలు తీస్తాం. పశువులను /కొష్టాన్ని శుభ్రం చేయడం, పాలు తీయడం, డైరీకి పాలు అందించడం, కొన్నిపాలు గ్రామంలో అమ్మడం, పశువుల మేత/దాణా వేయటం, అవసరమైన ఆవులకు మందులు వేయడం.. ఇదే మా దినచర్య. తెల్లవారుజాము నుంచి రాత్రి 10 గంటల వరకు ఏడాది పొడవునా ఇదే మా జీవనం. ఆవులే మాకు ఆధారం. డెయిరీలో లీటరు పాల ధర రూ. 28 రూపాయలు. బయట అమ్మితే రూ. 30 నుంచి 35లు వస్తాయి. నా భర్త రామారావు మా ఊళ్లో విశాఖ డెయిరీ పాలకేంద్రం కార్యదర్శిగా, నీటిసంఘం అధ్యక్షులుగా బిజీగా ఉంటారు. ఆవులు, కుటుంబ బాధ్యతలు నేనే చూసుకుంటున్నాను. పాడి ఆవుల పుణ్యాన మా కుటుంబం ఆర్థికంగా నిలదొక్కుకుంది. ఆర్థిక ఇబ్బందులు తొలగి ప్రస్తుతం హాయిగా ఉన్నాం. మా అబ్బాయి నాగేంద్రకుమార్ ఇంజనీరింగ్ పూర్తిచేసి ప్రైవేటు ఉద్యోగం చేస్తున్నాడు, అమ్మాయి యశోదను తిరుపతిలో ఇంజనీరింగ్ చదివిస్తున్నాం. కష్టపడటానికి ఇష్టపడే వారు నాలుగు పాడి పశువులతో హాయిగా బతికేయొచ్చు.’’– రంపా రాజమోహనరావు,బొబ్బిలి రూరల్, విజయనగరం జిల్లా -
దివ్యదృష్టి
చిన్నారుల ఆరోగ్యానికి, వారి ఎదుగుదలకు పాలు చాలా దోహదం చేస్తాయి. మరి రోజూ మనం తాగే పాలు మంచివేనా అంటే.. సమాధానం లేదు. ప్యాకెట్పాలలో రసాయనాలు కలిపి కల్తీ చేసి ప్రజల ఆరోగ్యాలతో చెలగాటమాడుతున్నారు కొందరు స్వార్థపరులు. దీంతో ఆలోచించిన దివ్యారెడ్డి స్వచ్ఛమైన పాలనే (దేశీయ ఆవులు, గేదెలు ఇచ్చే పాలు) అందజేయాలని నిర్ణయించి ఆ వైపు అడుగులు వేశారు. హైబ్రిడ్ ఆవులు, గేదెలు ఇచ్చే పాలను ఎ1 పాలు అంటారు. ఈ పాలు ఆరోగ్యానికి హాని చేస్తాయి. నిత్యం పిల్లలు ఎ1 పాలు తాగితే అనారోగ్యం బారిన పడే ప్రమాదముంది. దేశీయ ఆవులు ఇచ్చే పాలను ఎ2 పాలు అంటారు. దేశీయ ఆవు పాలు, నెయ్యి, ఇతర ఉత్పత్తులు ఆరోగ్యానికి మేలు చేకూర్చుతాయి.ఎదిగే పిల్లల ఆరోగ్యాన్ని కాపాడుతాయి. ఆన్లైన్లోనేఆర్డర్.. ఆన్లైన్, ఫోన్లో ఆర్డర్ చేస్తే గుమ్మం ముందుకే పాలు, నెయ్యి డోర్ డెలివరీ చేస్తున్నారు. పాలు పితికిన కొద్ది క్షణాల్లోనే స్టీల్ బాటిల్స్‌లో పాలను నింపుతారు. అక్కడి నుంచి నేరుగా డోర్ డెలివరీ చేస్తారు. పరిశుభ్రమైన వెన్న, నెయ్యి కూడా తయారు చేస్తున్నారు. పిల్లల కోసం.... గచ్చిబౌలిలోని ఎస్ఎల్ఎన్ స్ప్రింగ్స్ విల్లాస్‌లో నివాసం ఉండే అల్లోల దివ్యారెడ్డి దేశీయ ఆవులను పెంచాలని నిర్ణయించారు. ఎ1, ఎ2 పాలకు ఉన్న వ్యత్యాసాన్ని తెలుసుకున్నారు. 2015లో గుజరాత్ వెళ్లి పలు గోశాలలను సందర్శించారు. సంగారెడ్డి సమీపంలో ఓల్డ్ ముంబాయ్ జాతీయ రహదారిని ఆనుకొని ఉన్న ఫార్మ్‌లో దేశీయ ఆవులైన గిర్ జాతికి చెందిన 15 ఆవులతో ‘క్లిమమ్ వెల్నెస్ అండ్ ఫార్మ్స్’ను ప్రారంభించి సరఫరా చేయడం ప్రారంభించారు. ఉత్తమ స్పందన రావడంతో 200 గిర్ ఆవులను కొనుగోలు చేశారు. ఈ ఫార్మ్ నేడు స్టార్టప్‌గా మారింది. అనేక అవార్డులు, ప్రశంసలు ♦ బిజినెస్ పర్సన్ ఆఫ్ ద ఇయర్ అవార్డ్– సాక్షి ఎక్సిలెన్స్ అవార్డ్–2017 ♦ నేషనల్ గోపాల రత్న–2018 అవార్డ్‌ను కేంద్ర వ్యవసాయ శాఖ మంత్రి రాధా మోహన్ సింగ్ చేతుల మీదుగా అందుకున్నారు. ♦ ఎకో కాన్షియస్ ఎంటర్ప్రెన్యూర్ ఆఫ్ ద ఇయర్–2016 అవార్డును సౌత్ సోకప్ అండ్ రిట్జ్ మ్యాగజైన్ అంద జేసింది. దేశీయ ఆవుల సంతతిపెంచాలి... అమెరికా, ఆస్ట్రేలియా, ఫ్రాన్స్, సౌతాఫ్రికా లాంటి దేశాల మన దేశీయ ఆవులను పెంచుకునేందుకు ఆసక్తి కనబర్చుతున్నారు. ఆవుల మల, మూత్రాలతో చేపట్టే సేంద్రీయ వ్యవసాయం ఆరోగ్యానికి మేలు చేస్తుంది. దేశీయ ఆవుల సంతతిని పెంచేందుకు చాలా మందికి అవగాహన కల్పించాం. – అల్లోల దివ్యారెడ్డి -
ముందు దగా... వెనుక దగా...
ముందు దగా.. వెనుక దగా... కుడి ఎడమల దగా దగా అన్నారు మహాకవి శ్రీశ్రీ. పాడి రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఇందుకు అచ్చుగుద్దినట్టుగా సరిపోతుంది. ‘రైతును రాజును చేస్తాం.. ఆదాయాన్ని రెండింతలు చేస్తాం.. వ్యవసాయ అనుబంధ రంగాల్ని ఆదుకుంటాం..’ ఇవన్నీ 2014 ఎన్నికలనాటి హామీలు. అరచేతిలో వైకుంఠం చూపి అధికారం చేజిక్కించుకుని, చెరువు దాటాక తెప్ప తగలేశారు. అతీగతీ లేని, అర్ధంపర్థంలేని నిర్ణయాలతో వ్యవసాయ అనుబంధ రంగాలను కోలుకోలేని దెబ్బతీశారు. శ్రీకాకుళం , కవిటి: అన్నదాత వెన్ను విరిగిన దుస్థితి.. పాడి రైతు పస్తులుండే పరిస్థితి. ఆకలి కేకలు పాలకుల చెవికెక్కవు. పాపాల భైరవుల చిట్టా రోజురోజుకీ పెరుగుతుందే తప్ప పాపాలను కడిగే ప్రయత్నమైతే లేదు. జిల్లాలో ప్రధాన వ్యవసాయ అనుబంధ రంగమైన పాడిపరిశ్రమలో రైతులు తమ శ్రమకు తగ్గ ప్రతిఫలం పొందలేక దయనీయమైన జీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని 38 మండలాల్లో 6,89,323 కుటుంబాలు నివసిస్తున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో 70 శాతం కుటుంబాలు వ్యవసాయ, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. పశుసంవర్ధకశాఖ గణాంకాలను అనుసరించి.. 7,95,000 పాడి ఆవులు, 1,27,000 గేదెలు ఉన్నాయి. వీటికి తోడు 5,73,000 గొర్రెలు, 2,15,000 మేకలు ఉన్నాయి. కోళ్ల పరిశ్రమలో దేశవాళీ రకం 12,14,000, బ్రాయిలర్స్, లేయర్స్ కోళ్లు 8,80,000 ఉన్నాయి. జిల్లాలో పాల ఉత్పత్తి తీరు పశుసంవర్ధక శాఖ లెక్కల ప్రకారం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం చివరినాటికి జిల్లాలో 6,25,261 మెట్రిక్ టన్నుల పాల దిగుబడి జరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విశాఖ డెయిరీ, హెరిటేజ్ డెయిరీల ద్వారా రైతుకు దక్కిన ప్రతిఫలం అంతంతమాత్రమే. పాలలో 90 శాతం పైగా ప్రైవేట్ డెయిరీలకే పోస్తున్నట్టు ఓ అనధికారిక అంచనా. గిట్టుబాటు ధర మృగ్యం జిల్లాలో పాలు సేకరిస్తున్న ప్రైవేట్ డెయిరీలు బహిరంగ మార్కెట్లో వెన్న తీసిన పాలను లీటరు రూ.45 వరకు అమ్ముతున్నారు. రైతు తమ రెక్కల కష్టంతో సేకరించిన పాలను మాత్రం అదే ప్రైవేట్ డెయిరీలు లీటరు రూ.25లకు అటూ ఇటుగా కొనుగోలు చేస్తున్నారు. రమారమి రైతు దగ్గర సేకరించిన ధరకన్నా రెట్టింపు ధరకు వినియోగదారులకు అందిస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం మృగ్యం పాడి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం మృగ్యమైపోయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తమ పదవీకాలంలో పాడి రైతులను ఆదుకునేందుకు పశుక్రాంతి జీవక్రాంతి వంటి పథకాలను అమలు చేశారు. పాడిపరిశ్రమలో స్వయంసమృద్ధి దిశగా రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. 2014లో చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం పాడిరైతుల ఆర్ధిక స్వావలంబనకు ఆసరాగా నిలుస్తున్న పథకాలకు మంగళం పాడింది. కానీ సీఎం డ్యాష్‌బోర్డులో పశుసంవర్ధకశాఖలో వృద్ధిరేటు రెండంకెల ప్రగతిని దాటిపోయింది. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి గణాంకాల్లో కనిపిస్తోంది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పాడిరైతుల పరిస్థితులు అందుకు భిన్నంగానే ఉన్నాయి. సహకార సంఘాల వ్యవస్థ లేక దోపిడీ రైతుల నుంచి పాల ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న రైతులకు సహకార సంఘాలు ఏర్పాటు చేయాలి. సహకార సంఘాలు ఏర్పడితే భవిష్యత్‌లో డెయిరీ లాభాల్లో వారికి భాగస్వామ్యం కల్పించాల్సిన పరిస్థితులు తలెత్తుతాయన్న భయంతో ఆ దిశగా ప్రైవేట్ డెయిరీలు ఆసక్తి చూపడం లేదు. పశుసంవర్ధక శాఖకు పాడి ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరను అందించే అధికారం కూడా లేదు. ప్రభుత్వమే మార్కెటింగ్ శాఖను పశుసంవర్ధకశాఖతో సమన్వయం చేసి సహకార సంఘాలు విధిగా ఏర్పాటు చేయాలన్న నిబంధనలు కఠినంగా అమలు చేస్తే కొంతైనా పాడి రైతుకు మేలు జరుగుతుంది. రూ.4 బోనస్తోపాడి రైతుకు జగన్ భరోసా పాల కేంద్రానికి అమ్ముతున్న ప్రతి లీటరు పాలకు.. అక్కడ అందుకునే ధరకు అదనంగా ప్రభుత్వం తరపున రూ.4 బోనస్ ఇస్తామని ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించారు. వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే పాడి రైతులను ఏ రకంగా ఆదుకుంటామో వివరించారు. సహకార సంఘాల వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా పాడిరైతులకు బోనస్ అందించడమే కాకుండా పాడి రైతుకు, పాడి పశువులకు రెండింటికీ బీమా సౌకర్యం అందించే వెసులుబాటు కల్పిస్తామని వైఎస్ జగన్ ప్రకటించడం చరిత్రాత్మకమని వైఎస్సార్సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ చెప్పారు. ఆదాయం లేకున్నాపశుపోషణ చేస్తున్నాం తాత ముత్తాల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటున్న తమకు పాడిపశువుల పెంపకం చాలా అవసరం. ప్రభుత్వం నుంచి ఆశించిన సాయం లేదు. పశువు కొనుగోలు ధరలు రూ.50,000 కుపైబడి ఉంటున్నాయి. గడ్డి, తవుడు, దాణా అన్నింటి ధరలూ ఆకాశానంటుతున్నాయి. అప్పు చేసైనా పశువులకు మంచి ఆహారం, వైద్యం అందిస్తున్నాం. ప్రభుత్వ సాయం ఉంటే రైతుకు మేలు. – కొరికాన లచ్చయ్య,పాడి రైతు, కవిటి మండలం -
కాపాడి ఆదుకోండి
జిల్లాలో పడకేసిన పశువైద్యం అటెండర్లే దిక్కు.. ఇప్పటికే పలు కేంద్రాల మూత ఖాళీల భర్తీలో ఏళ్ల తరబడి నిర్లక్ష్యం ఆస్పత్రులను వృద్ధిచేస్తే ‘కరువు’ రైతులకు మేలు జిల్లాలో కరువు కోరలు చాచింది. పీకల్లోతూ కష్టాల్లో రైతులు అల్లాడుతున్నారు. ఇలాంటి తరుణంలో రైతులంతా ప్రత్యామ్నాయ ఉపాధిగా ‘పాడి’వైపు చూస్తున్నారు. అయితే, గ్రామాల్లో పశువైద్య కేంద్రాల దుస్థితి కలవరపాటుకు గురిచేస్తోంది. సిబ్బంది కొరతతో కేంద్రాలు కునారిల్లుతుండటంతో అనేకచోట్ల అటెండర్లే దిక్కవుతున్నారు. కొన్ని కేంద్రాలు ఇప్పటికే మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో సిబ్బందిని యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తేనే రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది. పోస్టులు ఖాళీ.. వైద్యం నిల్ జిల్లాలో మొత్తం 106 పశువైద్యాధికారుల పోస్టులకు గాను ప్రస్తుతం 47 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 136 మంది డిప్లొమా హోల్డర్స్‌గానూ 90 మంది, 236 మంది నాలుగో తరగతి ఉద్యోగులకు గానూ 171మంది మాత్రమే పనిచేస్తున్నారు. ‘మిల్క్‌గ్రిడ్’ పథకానికి అంకురార్పణ జరిగిన గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లో మొత్తం 12 మంది వైద్యాధికారులు పోస్టుల్లో ఐదు ఖాళీగా ఉన్నాయి. 30 మంది డిప్లొమో హోల్డర్స్‌గానూ 18 పోస్టులు ఖాళీగా, 20 మంది నాలుగో తరగతి ఉద్యోగులకు 12 ఖాళీలున్నాయి. ఇదిలా ఉండగా, గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లితో పాటు మరికొన్ని కేంద్రాలు మూతపడ్డాయి. నియోజకవర్గంలోని చాలా కేంద్రాలు అటెండర్ల ఆధారంగానే నడుస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ‘మిల్క్‌గ్రిడ్’ ద్వారా విరివిగా పశువులను అందించి ‘పాలధార’ను పెంచాలనుకుంటుండగా రైతులు మాత్రం పశువైద్యంపై ఆందోళన చెందుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు. గజ్వేల్: జిల్లాలో దశాబ్దాలుగా వ్యవసాయానికి అనుబంధంగా పాడిపరిశ్రమను అభివృద్ధి చేసుకుంటూ రైతులు జీవనం సాగిస్తున్నారు. అయితే, ఈసారి ఇక్కడ భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కరువు కారణంగా పంటలు చేతికి అందక రైతులు అల్లాడుతున్నారు. ఇలాంటి తరుణంలో పాడిపరిశ్రమ వారికి ప్రత్యామ్నాయ ఉపాధిగా మారనున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం పాడి పోషణకు అనుకూలమైన వాతావరణం కల్పించింది. విజయ డెయిరీ పాలధరకు రూ.4కు పెంచడం, జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట ప్రాంతాల్లో ఁమిల్క్గ్రిడ్* పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ క్రమంలో గజ్వేల్‌లో పథకానికి అంకురార్పణ జరగడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య సేవలు కొరవడం వారికి శాపంగా మారింది. మిల్క్గ్రిడ్తో పాటు ఇతర పథకాల అమలుకు పశువైద్య కేంద్రాల్లో నెలకొన్ని సమస్యలు అవరోధంగా పరిణమించే అవకాశాలుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఖాళీలు భర్తీ చేయాలని ప్రభుత్వానికి నివేదించాం జిల్లాలో పశువైద్య సిబ్బంది కొరత ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవమే. పాలసేకరణ పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ పరిణామాన్ని రైతులు హర్షిస్తున్నారు. పశువైద్య కేంద్రాల్లో నెలకొన్న ఖాళీలను భర్తీచేస్తే భారీ ప్రయోజనం ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం. - లక్ష్మారెడ్డి, పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ పశువైద్యం మెరుగుపడాలి పాపన్నపేట: దాదాపు 20 ఏళ్లుగా పాడి పరిశ్రమను కొనసాగిస్తున్నా. నాలుగు గేదెలున్నాయి. ఒక్కోగేదె రెండు పూటలా పది లీటర్లచొప్పున పాలిస్తుంది. లక్ష్మీనగర్‌లో పాలకేంద్రం ఏర్పాటు చేశారు. కొంత గిట్టుబాటు అవుతుంది. గేదెల పోషణ ఖర్చు కూడా భారీగానే అవుతుంది. పశువులకు సత్వర చికిత్స అందించే వెసులుబాటు లేదు. పశువైద్యం స్థితిగతులు మరింత మెరుగుపరచాలి. - గోగినేని మాధవి, లక్ష్మీనగర్ ఒక్కోసారి నష్టం మహారాష్ట్రలోని షిర్డీ, బోడేగాం, ఆంధ్రలోని రాజమండ్రి, పిఠాపురం, బీదర్, జగదేవ్‌పూర్, ఎర్రగడ్డల నుంచి ముర్రజాతి గేదెలను కొనుగోలు చేస్తాం. ఒక్కో గేదె సుమారు రూ.50 వేల నుంచి 60 వేలు పలుకుతుంది. ఇక్కడ వాటిని అమ్ముతుంటా. ఒక్కో గేదెపై సుమారు రూ.5 వేల లాభం వస్తుంది. ఒక్కోసారి నష్టం కూడా వస్తుంది. ఎక్కువగా సీజనల్ వ్యాధుల నుంచి వీటిని కాపాడుకోవడం భారమవుతోంది. స్థానిక పశువైద్య శాలల సేవలు మరింత మెరుగుపడితే పాడి రైతులు సంతోషిస్తారు. - గోగినేని రంగారావు, లక్ష్మీనగర్సౌకర్యాల కొరత ఖరీఫ్ సీజన్లో వర్షాలు లేక వరిపంట వేయలేదు. దీంతో వరిగడ్డి దొరకడం లేదు. గతంలో రూ.20 దొరికే గడ్డికట్టలు ఇప్పుడు రూ.80 నుంచి రూ.100కు అమ్ముతున్నారు. దీంతో పాల ఆదాయంలో ఎక్కువమొత్తం గడ్డికే ఖర్చు చేయాల్సి వస్తుంది. మరోవైపు సీజనల్ వ్యాధులు ఎక్కువవుతున్నాయి. పశు వైద్యాధికారులు తమ సేవల్ని మెరుగుపరుచుకోవడంతో పాటు వైద్యశాలల్లో సదుపాయాలు, మందులు నిరంతరం అందుబాటులో ఉంచాలి. - దోమకొండ కిషన్‌రెడ్డి, పాపన్నపేట. జబ్బవాపు, గురక వ్యాధి ప్రమాదకరం మెదక్: గేదెలకు చలికాలంలో జబ్బవాపు, గురక వ్యాధులు వస్తాయి. వీటిని గుర్తించి వెంటనే వైద్యం చేయించాలి. ఏమాత్రం నిర్లక్ష ్యం చేసినా 48 గంటల్లో గేదెలు మృత్యువాత పడే ప్రమాదం ఉంది. గురక వ్యాధి సోకిన పశువు నీరసంగా ఉండి మేత మేయదు. అలాగే గాలికుంటు వ్యాధి సోకిన పశువులకు గెటికల్లో పుండ్లు, నాలుక చెడతాయి. పాడిగేదెలు పూర్తిగా పాలివ్వడం మానేస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన పశువులను వెంటనే వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాలి. వ్యాధులు సోకకుండా పశువులకు ఆరు నెలలకోసారి టీకాలు వేయించాలి. జూన్‌లో పశువులకు టీకాలు వేశాం.. మళ్లీ జనవరిలో ఇస్తాం. - ఉమామ సహేరా, పశువైద్యురాలు, మాచవరం, మెదక్ మండలం పచ్చిమేత చాలా అవసరం పాలిచ్చే గేదెలకు పచ్చిమేత ఎంతో అవసరం. ప్రతిరోజు రెండుసార్లు పశువులను శుభ్రంగా కడగాలి. పాకలో దోమలు, ఈగలు వాలకుండా గ్యామగ్జిన్ పౌండర్ చల్లాలి. దాణాతో పాటు మినరల్ మిక్చర్ తప్పకుండా పెట్టాలి. ఈ పద్ధతులు పాటిస్తే ముర్రజాతి గేదెలు 10 నుంచి 15 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. పాడిగేదెలు ఎదకు వచ్చిన విషయాన్ని గమనించి సకాలంలో కృత్రిమ గర్భదారణ చేయించాలి. - బి.సిద్దిరాములు, పాడిరైతు, మెదక్ పశువైద్యులూ అప్రమత్తం సంగారెడ్డి క్రైం: రాష్ర్టంలో పశుగ్రాసం, నీటి తొట్టెల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, కరువును అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ డి.వెంకటేశ్వర్లు సూచించారు. హైదరాబాద్ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశుగ్రాసాన్ని తిరిగికొనే పద్ధతి ద్వారా బోర్లు ఉన్న రైతులు పశుగ్రాసాన్ని సాగు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందన్నారు. వారికి సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల ద్వారా నగదు చెల్లిస్తామన్నారు. నీటి తొట్టెల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, ఎన్ఆర్ఈజీఎస్ ద్వారా పశుగ్రాసాన్ని సాగు చేయాలని, కరువును అధిగమించేందుకు 350 మెట్రిక్ టన్నుల విత్తనాలు, దాణ 1676 మెట్రిక్ టన్నులు, మినరల్ మిక్చర్ 89 మెట్రిక్ టన్నులు, మందుల కోసం రూ.5.90 కోట్లు కేటాయించాలని పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ వి.లక్ష్మారెడ్డి కోరారు. జిల్లాలోని అన్ని మండలాల పశువైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని, సంతల్లో పశువుల అమ్మకాలు, కొనుగోళ్లను గమనించాలని, పశుగ్రాసాలు వేరే జిల్లాకు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. పశువులాస్పత్రికి ‘తాళం’ చిన్నశంకరంపేటలోని పశువైద్యశాలకు తాళం పడింది. ఉదయం 8.30 గంటలకే తెరుచుకోవాల్సిన ఆస్పత్రి.. గురువారం 9.30 కూడా ఓపెన్ చేయలేదు. ఎంపీపీ అధ్యక్షురాలు కర్రె కృపావతి గురువారం వైద్యశాల సందర్శనకు వచ్చేసరికి సిబ్బంది లేరు. డాక్టర్ సంజయ్‌కు ఫోన్‌చేయగా స్పందన లేదు. పశుసంవర్థక ఏడీఏకు ఫోన్‌చేసినా స్పందన లేదు.. దీంతో ఆమె అసహనం వ్యక్తంచేశారు. ఇలా అయితే పశువులకు సకాలంలో వైద్యం ఎలా అందుతుందని వాపోయారు. - చిన్నశంకరంపేట సీజనల్ వ్యాధులతో భద్రం గజ్వేల్: సీజనల్ వ్యాధులను పశువులు తట్టుకోలేవు. కాబట్టి మొదటే పశుపోషకులు ఆయా వ్యాధుల లక్షణాలను గుర్తించి వైద్యుల సలహాలతో నివారణ చర్యలు చేపట్టాలి. కొన్ని సీజనల్ వ్యాధులు, వాటి నివారణ చర్యల గురించి పశువైద్య నిపుణులు ఇస్తున్న సూచనలు.. ‘కుంటు’పడే ఉత్పాదక శక్తి గాలికుంటు వ్యాధి: ఈ వ్యాధి వల్ల మరణం సంభవించదు. అయితే పశువుల్లో ఉత్పాదక శక్తి తగ్గతుంది. బలహీనంగా ఉన్న పశువుల్లో వ్యాధి నిరోదక శక్తి తగ్గడం వల్ల ఈ వ్యాధి సోకుతుంది. లక్షణాలు: పళ్ల చిగుళ్లు, నాలుక, ముట్టె లోపలి భాగాల్లో బొబ్బలు ఏర్పడతాయి. 24 గంటల్లో బొబ్బలు పగిలి చితిగిపోవడం వల్ల పశువులు మేత మేయలేవు. శరీర ఉష్ణోగ్రత 104 నుంచి 106 డిగ్రీ వరకు ఉంటుంది. గాలికుంటు వ్యాధి సోకిన పశువుల పాలు తాగిన దూడలు మృతి చెందుతుంటాయి. ఈ విషయంలో రైతులు జాగ్రత్త వహించాలి. చికిత్స: వ్యాధి సోకిన పశువులను మంద నుంచి వేరుచేయాలి. పొటాషియం పర్మాంగనేట్ కలిపిన నీళ్లతో పుండ్లను కడిగి శుభ్రం చేయాలి. హిమాక్సిన్ లాంటి అయింట్‌మెంట్‌తో పూతవేయాలి. ‘శ్వాస’ను పరీక్షించండి శ్వాసకోశ వ్యాధి: పశువులను కలవరపరుస్తున్న వాటిల్లో శ్వాసకోశ వ్యాధి ఒకటి. ఇది సోకిన పశువులు మృత్యువాత పడే అవకాశం ఉంది. తీవ్రమైన జ్వరం, కళ్లు ఎర్రబారడం, ముక్కు వెంట నీరు కారడం, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి ఇతర పశువులకు సోకే ప్రమాదం ఉంటుంది. లక్షణాలు: శ్వాసకోశ వ్యాధి ప్రధానంగా శ్వాసకోశం నాడీ మండలం, గర్భకోశ వ్యవస్థలను ఆశిస్తుంది. గాలి కష్టంగా పీలుస్తాయి. వ్యాధి తీవ్రంగా ఉంటే నోటి ద్వారా గాలి పీల్చుకుంటాయి. ఈ వైరస్ జీర్ణకోశాన్ని ఆశిస్తే ఆకలి పూర్తిగా నశిస్తుంది. చికిత్స: ఈ వ్యాధి సోకిన పశువులకు ఎక్కువగా యాంటీబయోటిక్ మందులు ఉపయోగించాలి. పైలక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స అందించాలి. యాంటీ రెబీస్ టీకాలు వేయించాలి. వర్షాకాలంలో వచ్చే గొంతువాపు గొంతువాపు వ్యాధి: ఈ వ్యాధి ప్రభావం వర్షాకాలంలో అధికంగా ఉంటుంది. వ్యాధి సోకిన పశువు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. గొంతు, మెడ భాగంలో వాపు వస్తుంది. చికిత్స: గొంతువాపు వ్యాధికి మార్కెట్లో అనేక రకాల యాంటీబయోటిక్ మందులు లభిస్తున్నాయి. సల్ఫాడిమిన్, ఇంటాసెఫ్‌టాజు ఇంజక్షన్లు బాగా పనిచేస్తాయి. జబ్బవాపుతో కష్టమే.. జబ్బవాపు వ్యాధి: ఆకలి లేకపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. 106 నుంచి 108 డిగ్రీల వరకు జ్వరం ఉంటుంది. చికిత్స: జబ్బవాపు వ్యాధి ప్రారంభ దశలోనే పెన్సిలిన్, ఆక్సి లాంటి యాంటీబయోటిక్ మందులు వాడాలి. పశువులకు తగిన సమయంలో టీకా వేయించడం ద్వారా దీన్ని పూర్తిగా నివారించవచ్చు. -
మెట్ట సేద్యంలోనూ సిరుల పంట!
పాడి-పంట గుడ్లవల్లేరు (కృష్ణా), న్యూస్‌లైన్: రాష్ట్రంలోని వ్యవసాయ భూముల్లో చాలా వరకు వర్షాలపై ఆధారపడినవే. ఈ భూముల్లో అన్ని రకాల పైర్లు పండుతున్నప్పటికీ నీటి వసతి కింద పండిస్తున్న పంటలతో పోలిస్తే దిగుబడులు చాలా తక్కువగా ఉంటున్నాయి. అయితే కొన్ని యాజమాన్య చర్యలు చేపట్టడం ద్వారా మెట్ట భూముల్లోనూ సిరుల పంటలు పండించవచ్చునని కృష్ణా జిల్లాకు చెందిన రిటైర్డ్ ఏడీఏ పి.సత్యనారాయణ సూచిస్తున్నారు. ఆ వివరాలు... రాష్ట్రంలోని మెట్ట భూముల్లో 65% ఎర్ర నేలలైతే 25% నల్లరేగడి నేలలు. మెట్ట పంటలకు కేవలం వర్షపు నీరే ఆధారం కాబట్టి దానిని వృథా చేయకూడదు. అదను, పదును చూసుకొని విత్తనాలు వేసుకోవాలి. సారవంతం కావాలంటే... మెట్ట పంటల్ని పండించే ఎర్ర గరప, చెల్కా, దుబ్బ నేలల్లో సేంద్రియ పదార్థాలే కాకుండా భాస్వరం, జింక్ పోషకాలు కూడా తక్కువగా ఉంటాయి. ఈ భూములకు నీటిని నిల్వ చేసుకునే సామర్థ్యం సైతం తక్కువగానే ఉంటుంది. వీటితో పోలిస్తే నల్ల రేగడి నేలలు సారవంతంగా ఉంటాయి. ఇవి నీటిని నిల్వ చేసుకోగలుగుతాయి. మరి ఎర్ర నేలల్ని కూడా సారవంతం చేసుకోవాలంటే చెరువు మట్టి, పశువుల ఎరువు తోలి భూమిలో కలియదున్నాలి. గిరిజన ప్రాంతాల్లో ఏం చేయాలి? గిరిజనులు నివసించే ప్రాంతాల్లో కొండలు, గుట్టలు, అడవులు ఎక్కువగా ఉంటాయి. కాబ ట్టి ఇక్కడి భూములు చదునుగా ఉండవు. ఎత్తుపల్లాలుగా ఉంటాయి. ఇలాంటి భూముల్లోనూ మంచి దిగుబడులు పొందాలంటే రైతులు ముందుగా భూసారాన్ని పరిరక్షించుకోవాలి. ఆధునిక మెట్ట వ్యవసాయ పద్ధతుల్ని అవలంబించాలి. ఇందుకోసం భూమిని వాలుకు అడ్డంగా దున్నాలి. దీనివల్ల వర్షపు నీరు కొట్టుకుపోదు. భూమిలోనే ఇంకిపోతుంది. భూమిలో తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కాబట్టి పైరు బెట్టకు గురికాదు. అలాగే వాలుకు అడ్డంగా విత్తనాలు వేసుకోవాలి. ఈ పనులకు ఖర్చు కూడా చాలా తక్కువగానే అవుతుంది. సేంద్రియ ఎరువులు వేయాలి మెట్ట సేద్యంలో సేంద్రియ ఎరువుల వినియోగం తప్పనిసరి. ఇవి భూమిలోని సేంద్రియ పదార్థాన్ని గణనీయంగా పెంచుతాయి. ఈ పదార్థం తేమ శాతాన్ని పెంచుతుంది. భూమికి బెట్టను తట్టుకునే శక్తి లభిస్తుంది. అంతేకాదు... భూమిలో నత్రజనిని పెంచేందుకు అవసరమైన బాక్టీరియా జీవులు వృద్ధి చెందుతాయి. సేంద్రియ పదార్థం ఎక్కువగా ఉన్న భూముల్లో సూక్ష్మ పోషక లోపాలు ఏర్పడవు. పంటలు ఏపుగా ఎదుగుతాయి. మంచి దిగుబడులు వస్తాయి. సేంద్రియ ఎరువుల వినియోగంతో భూమిలో పోషకాల లభ్యత పెరుగుతుంది. పంటలకు చీడపీడల్ని తట్టుకునే శక్తి కూడా పెరుగుతుంది. పత్తి, వేరుశనగ పంటలు వేసే వారు ఎకరానికి 8-10 బండ్ల పశువుల ఎరువును చేలో చల్లుకోవాలి. వర్షాలను ఆసరాగా చేసుకొని... రాష్ట్రంలో అప్పుడప్పుడు కురుస్తున్న వర్షాలను ఆసరాగా చేసుకొని రైతులు మెట్ట భూముల్లో లోతు దుక్కులు చేసుకోవాలి. భూమిని సుమారు 30 సెంటీమీటర్ల లోతు వరకు దున్నవచ్చు. దీనివల్ల గత పంటకు సంబంధించిన అవశేషాలు, కలుపు మొక్కలు నశిస్తాయి. నేల లోపలి పొరల్లో దాగిన కీటకాలు, వాటి గుడ్లు బయటపడతాయి. అవి ఎండ వేడిమికి నాశనమవుతాయి. లేదా పక్షులు వాటిని పట్టుకొని తినేస్తాయి. ఫలితంగా పంటకాలంలో చీడపీడల తాకిడి తగ్గుతుంది. అంతేకాదు... లోతు దుక్కులు చేస్తే వర్షపు నీరు వృథా కాకుండా భూమిలోకి ఇంకిపోతుంది. తేమ ఎక్కువ కాలం నిల్వ ఉంటుంది కాబట్టి పంట బెట్టకు గురికాదు. పంట మొక్కల వేర్లు కూడా భూమిలోని తేమను, పోషకాలను బాగా గ్రహిస్తాయి. ఫలితంగా దిగుబడులు పెరుగుతాయి. ఎరువుల వినియోగం వర్షాధార పంటలు వేసే వారు ముందుగా భూసార పరీక్షలు చేయించడం మంచిది. దీనివల్ల భూమిలో ఏయే పోషకాలు తక్కువ మోతాదులో ఉన్నాయో తెలుస్తుంది. దీనిని బట్టి వ్యవసాయ శాస్త్రవేత్తలు, వ్యవసాయాధికారుల సిఫార్సు మేరకు పంటకు పోషకాలను అందించాలి. ముఖ్యంగా నత్రజని ఎరువును యూరియా రూపంలో వేసేటప్పుడు మొక్కకు 2 అంగుళాల దూరంలో గొయ్యి తీసి వేసుకున్నట్లయితే ఆ ఎరువు వినియోగ సామర్ధ్యం పెరుగుతుంది. అలాగే జింక్, బోరాన్, మెగ్నీషియం వంటి సూక్ష్మ పోషకాలను కూడా అవసరమైన మేరకు పంటకు అందించాలి. కలుపు నివారణ కీలకం మెట్ట పైర్లకు నీటి లభ్యత తక్కువగా ఉంటుంది. అందుబాటులో ఉండే కొద్దిపాటి నీటి కోసం అటు పంట మొక్కలే కాకుండా కలుపు మొక్కలు కూడా పోటీ పడతాయి. కాబట్టి కలుపు మొక్కల్ని ఎప్పటికప్పుడు తొలగించడం చాలా ముఖ్యం. లేకుంటే దిగుబడులు 25% నుంచి 40% వరకు తగ్గుతాయి. కలుపు నివారణ కోసం రసాయన మందులు పిచికారీ చేయడంతో పాటు విత్తనాలు వేసిన 25, 40 రోజులప్పుడు విధిగా అంతరకృషి చేయాలి. సాళ్లలోని కలుపు మొక్కల్ని కూలీలతో తీయించాలి. దీనివల్ల భూమి గుల్లబారుతుంది. పంట వేర్లకు తేమ, ప్రాణవాయువు (ఆక్సిజన్) అందుతుంది. పత్తి, వేరుశనగ, మొక్కజొన్న పంటల్లో కలుపు నివారణ కోసం విధిగా అంతరకృషి చేయాలి. పంట విత్తిన 25-30 రోజుల మధ్య గొర్రు లేదా గుంటకను ఉపయోగించి కలుపు మొక్కల్ని నిర్మూలించాలి. అయితే నిరంతరాయంగా వర్షాలు పడినప్పుడు అంతరకృషి సాధ్యం కాదు. అప్పుడు రసాయన కలుపు మందుల్ని పిచికారీ చేయాల్సి ఉంటుంది.