కవిటి: కవిటి మండలంలో పాడి పశువుల పెంపకం కవిటి: డెయిరీలలో పాలు అమ్ముతున్న పాడి రైతులు
ముందు దగా.. వెనుక దగా... కుడి ఎడమల దగా దగా అన్నారు మహాకవి శ్రీశ్రీ. పాడి రైతుల విషయంలో రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరి ఇందుకు అచ్చుగుద్దినట్టుగా సరిపోతుంది. ‘రైతును రాజును చేస్తాం.. ఆదాయాన్ని రెండింతలు చేస్తాం.. వ్యవసాయ అనుబంధ రంగాల్ని ఆదుకుంటాం..’ ఇవన్నీ 2014 ఎన్నికలనాటి హామీలు. అరచేతిలో వైకుంఠం చూపి అధికారం చేజిక్కించుకుని, చెరువు దాటాక తెప్ప తగలేశారు. అతీగతీ లేని, అర్ధంపర్థంలేని నిర్ణయాలతో వ్యవసాయ అనుబంధ రంగాలను కోలుకోలేని దెబ్బతీశారు.
శ్రీకాకుళం , కవిటి: అన్నదాత వెన్ను విరిగిన దుస్థితి.. పాడి రైతు పస్తులుండే పరిస్థితి. ఆకలి కేకలు పాలకుల చెవికెక్కవు. పాపాల భైరవుల చిట్టా రోజురోజుకీ పెరుగుతుందే తప్ప పాపాలను కడిగే ప్రయత్నమైతే లేదు. జిల్లాలో ప్రధాన వ్యవసాయ అనుబంధ రంగమైన పాడిపరిశ్రమలో రైతులు తమ శ్రమకు తగ్గ ప్రతిఫలం పొందలేక దయనీయమైన జీవనం సాగిస్తున్నారు. జిల్లాలోని 38 మండలాల్లో 6,89,323 కుటుంబాలు నివసిస్తున్నాయి. అధికారిక గణాంకాల ప్రకారం జిల్లాలో 70 శాతం కుటుంబాలు వ్యవసాయ, అనుబంధ రంగాలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నాయి. పశుసంవర్ధకశాఖ గణాంకాలను అనుసరించి.. 7,95,000 పాడి ఆవులు, 1,27,000 గేదెలు ఉన్నాయి. వీటికి తోడు 5,73,000 గొర్రెలు, 2,15,000 మేకలు ఉన్నాయి. కోళ్ల పరిశ్రమలో దేశవాళీ రకం 12,14,000, బ్రాయిలర్స్, లేయర్స్ కోళ్లు 8,80,000 ఉన్నాయి.
జిల్లాలో పాల ఉత్పత్తి తీరు
పశుసంవర్ధక శాఖ లెక్కల ప్రకారం డిసెంబర్‌తో ముగిసిన త్రైమాసికం చివరినాటికి జిల్లాలో 6,25,261 మెట్రిక్ టన్నుల పాల దిగుబడి జరిగినట్టు గణాంకాలు వెల్లడిస్తున్నాయి. విశాఖ డెయిరీ, హెరిటేజ్ డెయిరీల ద్వారా రైతుకు దక్కిన ప్రతిఫలం అంతంతమాత్రమే. పాలలో 90 శాతం పైగా ప్రైవేట్ డెయిరీలకే పోస్తున్నట్టు ఓ అనధికారిక అంచనా.
గిట్టుబాటు ధర మృగ్యం
జిల్లాలో పాలు సేకరిస్తున్న ప్రైవేట్ డెయిరీలు బహిరంగ మార్కెట్‌లో వెన్న తీసిన పాలను లీటరు రూ.45 వరకు అమ్ముతున్నారు. రైతు తమ రెక్కల కష్టంతో సేకరించిన పాలను మాత్రం అదే ప్రైవేట్ డెయిరీలు లీటరు రూ.25లకు అటూ ఇటుగా కొనుగోలు చేస్తున్నారు. రమారమి రైతు దగ్గర సేకరించిన ధరకన్నా రెట్టింపు ధరకు వినియోగదారులకు అందిస్తున్నారు.
ప్రభుత్వ ప్రోత్సాహం మృగ్యం
పాడి రైతులకు ప్రభుత్వం అందిస్తున్న ప్రోత్సాహం మృగ్యమైపోయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్‌రెడ్డి తమ పదవీకాలంలో పాడి రైతులను ఆదుకునేందుకు పశుక్రాంతి జీవక్రాంతి వంటి పథకాలను అమలు చేశారు. పాడిపరిశ్రమలో స్వయంసమృద్ధి దిశగా రైతులకు వెన్నుదన్నుగా నిలిచారు. 2014లో చంద్రబాబునాయుడు నేతృత్వంలోని తెలుగుదేశం ప్రభుత్వం పాడిరైతుల ఆర్ధిక స్వావలంబనకు ఆసరాగా నిలుస్తున్న పథకాలకు మంగళం పాడింది. కానీ సీఎం డ్యాష్‌బోర్డులో పశుసంవర్ధకశాఖలో వృద్ధిరేటు రెండంకెల ప్రగతిని దాటిపోయింది. ప్రతి ఏడాది ఇదే పరిస్థితి గణాంకాల్లో కనిపిస్తోంది. వాస్తవానికి క్షేత్రస్థాయిలో పాడిరైతుల పరిస్థితులు అందుకు భిన్నంగానే ఉన్నాయి.
సహకార సంఘాల వ్యవస్థ లేక దోపిడీ
రైతుల నుంచి పాల ఉత్పత్తులను కొనుగోలు చేస్తున్న రైతులకు సహకార సంఘాలు ఏర్పాటు చేయాలి. సహకార సంఘాలు ఏర్పడితే భవిష్యత్‌లో డెయిరీ లాభాల్లో వారికి భాగస్వామ్యం కల్పించాల్సిన పరిస్థితులు తలెత్తుతాయన్న భయంతో ఆ దిశగా ప్రైవేట్ డెయిరీలు ఆసక్తి చూపడం లేదు. పశుసంవర్ధక శాఖకు పాడి ఉత్పత్తులకు సరైన గిట్టుబాటు ధరను అందించే అధికారం కూడా లేదు. ప్రభుత్వమే మార్కెటింగ్ శాఖను పశుసంవర్ధకశాఖతో సమన్వయం చేసి సహకార సంఘాలు విధిగా ఏర్పాటు చేయాలన్న నిబంధనలు కఠినంగా అమలు చేస్తే కొంతైనా పాడి రైతుకు మేలు జరుగుతుంది.
రూ.4 బోనస్‌తోపాడి రైతుకు జగన్ భరోసా
పాల కేంద్రానికి అమ్ముతున్న ప్రతి లీటరు పాలకు.. అక్కడ అందుకునే ధరకు అదనంగా ప్రభుత్వం తరపున రూ.4 బోనస్ ఇస్తామని ప్రజాసంకల్పయాత్ర ముగింపు సభలో ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ప్రకటించారు. వైఎస్సార్‌సీపీ అధికారంలోకి వస్తే పాడి రైతులను ఏ రకంగా ఆదుకుంటామో వివరించారు. సహకార సంఘాల వ్యవస్థలను బలోపేతం చేయడం ద్వారా పాడిరైతులకు బోనస్ అందించడమే కాకుండా పాడి రైతుకు, పాడి పశువులకు రెండింటికీ బీమా సౌకర్యం అందించే వెసులుబాటు కల్పిస్తామని వైఎస్ జగన్ ప్రకటించడం చరిత్రాత్మకమని వైఎస్సార్‌సీపీ ఇచ్ఛాపురం నియోజకవర్గ సమన్వయకర్త పిరియా సాయిరాజ్ చెప్పారు.
ఆదాయం లేకున్నాపశుపోషణ చేస్తున్నాం
తాత ముత్తాల కాలం నుంచి వ్యవసాయం చేసుకుంటున్న తమకు పాడిపశువుల పెంపకం చాలా అవసరం. ప్రభుత్వం నుంచి ఆశించిన సాయం లేదు. పశువు కొనుగోలు ధరలు రూ.50,000 కుపైబడి ఉంటున్నాయి. గడ్డి, తవుడు, దాణా అన్నింటి ధరలూ ఆకాశానంటుతున్నాయి. అప్పు చేసైనా పశువులకు మంచి ఆహారం, వైద్యం అందిస్తున్నాం. ప్రభుత్వ సాయం ఉంటే రైతుకు మేలు.
– కొరికాన లచ్చయ్య,పాడి రైతు, కవిటి మండలం
Comments
Please login to add a commentAdd a comment