కాపాడి ఆదుకోండి | help for Dairy forms | Sakshi
Sakshi News home page

కాపాడి ఆదుకోండి

Published Fri, Dec 4 2015 12:24 AM | Last Updated on Sun, Sep 3 2017 1:26 PM

కాపాడి ఆదుకోండి

కాపాడి ఆదుకోండి

జిల్లాలో పడకేసిన పశువైద్యం
 అటెండర్లే దిక్కు..
 ఇప్పటికే పలు కేంద్రాల మూత
 ఖాళీల భర్తీలో ఏళ్ల తరబడి నిర్లక్ష్యం
 ఆస్పత్రులను వృద్ధిచేస్తే ‘కరువు’ రైతులకు మేలు


 జిల్లాలో కరువు కోరలు చాచింది. పీకల్లోతూ కష్టాల్లో రైతులు అల్లాడుతున్నారు. ఇలాంటి తరుణంలో రైతులంతా  ప్రత్యామ్నాయ ఉపాధిగా ‘పాడి’వైపు చూస్తున్నారు. అయితే, గ్రామాల్లో పశువైద్య కేంద్రాల దుస్థితి కలవరపాటుకు గురిచేస్తోంది. సిబ్బంది కొరతతో కేంద్రాలు కునారిల్లుతుండటంతో అనేకచోట్ల అటెండర్లే దిక్కవుతున్నారు. కొన్ని కేంద్రాలు ఇప్పటికే మూతపడ్డాయి. ఈ నేపథ్యంలో సిబ్బందిని యుద్ధ ప్రాతిపదికన భర్తీ చేస్తేనే రైతులకు మేలు జరిగే అవకాశం ఉంటుంది.
 
 పోస్టులు ఖాళీ..  వైద్యం నిల్
 జిల్లాలో మొత్తం 106 పశువైద్యాధికారుల పోస్టులకు గాను ప్రస్తుతం 47 మంది మాత్రమే పనిచేస్తున్నారు. 136 మంది డిప్లొమా హోల్డర్స్‌గానూ 90 మంది, 236 మంది నాలుగో తరగతి ఉద్యోగులకు గానూ 171మంది మాత్రమే పనిచేస్తున్నారు. ‘మిల్క్‌గ్రిడ్’ పథకానికి అంకురార్పణ జరిగిన గజ్వేల్ నియోజకవర్గంలోని గజ్వేల్, తూప్రాన్, ములుగు, వర్గల్, జగదేవ్‌పూర్, కొండపాక మండలాల్లో మొత్తం 12 మంది వైద్యాధికారులు పోస్టుల్లో ఐదు ఖాళీగా ఉన్నాయి. 30 మంది డిప్లొమో హోల్డర్స్‌గానూ 18 పోస్టులు ఖాళీగా, 20 మంది నాలుగో తరగతి ఉద్యోగులకు 12 ఖాళీలున్నాయి. ఇదిలా ఉండగా, గజ్వేల్ మండలం శ్రీగిరిపల్లితో పాటు మరికొన్ని కేంద్రాలు మూతపడ్డాయి. నియోజకవర్గంలోని చాలా కేంద్రాలు అటెండర్ల ఆధారంగానే నడుస్తున్నాయి. ఇలాంటి తరుణంలో ‘మిల్క్‌గ్రిడ్’ ద్వారా విరివిగా పశువులను అందించి ‘పాలధార’ను పెంచాలనుకుంటుండగా రైతులు మాత్రం పశువైద్యంపై ఆందోళన చెందుతున్నారు. సమస్యను వెంటనే పరిష్కరించాలని కోరుతున్నారు.
 
 గజ్వేల్: జిల్లాలో దశాబ్దాలుగా వ్యవసాయానికి అనుబంధంగా పాడిపరిశ్రమను అభివృద్ధి చేసుకుంటూ రైతులు జీవనం సాగిస్తున్నారు. అయితే, ఈసారి ఇక్కడ భిన్నమైన పరిస్థితులు నెలకొన్నాయి. కరువు కారణంగా పంటలు చేతికి అందక రైతులు అల్లాడుతున్నారు. ఇలాంటి తరుణంలో పాడిపరిశ్రమ వారికి ప్రత్యామ్నాయ ఉపాధిగా మారనున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వం పాడి పోషణకు అనుకూలమైన వాతావరణం కల్పించింది. విజయ డెయిరీ పాలధరకు రూ.4కు పెంచడం, జిల్లాలోని గజ్వేల్, సిద్దిపేట ప్రాంతాల్లో ఁమిల్క్‌గ్రిడ్* పథకాన్ని ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. ఈ క్రమంలో గజ్వేల్‌లో పథకానికి అంకురార్పణ జరగడంతో రైతుల్లో హర్షం వ్యక్తమవుతోంది. కానీ, గ్రామీణ ప్రాంతాల్లో పశువైద్య సేవలు కొరవడం వారికి శాపంగా మారింది. మిల్క్‌గ్రిడ్‌తో పాటు ఇతర పథకాల అమలుకు పశువైద్య కేంద్రాల్లో నెలకొన్ని సమస్యలు అవరోధంగా పరిణమించే అవకాశాలుండటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు.  
 
 ఖాళీలు భర్తీ చేయాలని ప్రభుత్వానికి నివేదించాం
 జిల్లాలో పశువైద్య సిబ్బంది కొరత ఇబ్బందికరంగా ఉన్న మాట వాస్తవమే. పాలసేకరణ పెంచడానికి ప్రభుత్వం ప్రయత్నిస్తుంది. ఈ పరిణామాన్ని రైతులు హర్షిస్తున్నారు. పశువైద్య కేంద్రాల్లో నెలకొన్న ఖాళీలను భర్తీచేస్తే భారీ ప్రయోజనం ఉంటుంది. ఈ విషయాన్ని ఇప్పటికే ప్రభుత్వానికి నివేదించాం.
           - లక్ష్మారెడ్డి,

 పశుసంవర్ధక శాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్  పశువైద్యం మెరుగుపడాలి

 పాపన్నపేట: దాదాపు 20 ఏళ్లుగా పాడి పరిశ్రమను కొనసాగిస్తున్నా. నాలుగు గేదెలున్నాయి. ఒక్కోగేదె రెండు పూటలా పది లీటర్లచొప్పున పాలిస్తుంది. లక్ష్మీనగర్‌లో పాలకేంద్రం ఏర్పాటు చేశారు. కొంత గిట్టుబాటు అవుతుంది. గేదెల పోషణ ఖర్చు కూడా భారీగానే అవుతుంది. పశువులకు సత్వర చికిత్స అందించే వెసులుబాటు లేదు. పశువైద్యం స్థితిగతులు మరింత మెరుగుపరచాలి.
        - గోగినేని  మాధవి, లక్ష్మీనగర్

 ఒక్కోసారి నష్టం
 మహారాష్ట్రలోని షిర్డీ, బోడేగాం, ఆంధ్రలోని రాజమండ్రి, పిఠాపురం, బీదర్, జగదేవ్‌పూర్, ఎర్రగడ్డల నుంచి ముర్రజాతి గేదెలను కొనుగోలు చేస్తాం. ఒక్కో గేదె సుమారు రూ.50 వేల నుంచి 60 వేలు పలుకుతుంది. ఇక్కడ వాటిని అమ్ముతుంటా. ఒక్కో గేదెపై సుమారు రూ.5 వేల లాభం వస్తుంది. ఒక్కోసారి నష్టం కూడా వస్తుంది. ఎక్కువగా సీజనల్ వ్యాధుల నుంచి వీటిని కాపాడుకోవడం భారమవుతోంది. స్థానిక పశువైద్య శాలల సేవలు మరింత మెరుగుపడితే పాడి రైతులు సంతోషిస్తారు.
                 - గోగినేని రంగారావు,
 
 లక్ష్మీనగర్‌సౌకర్యాల కొరత ఖరీఫ్ సీజన్‌లో వర్షాలు లేక వరిపంట వేయలేదు. దీంతో వరిగడ్డి దొరకడం లేదు. గతంలో రూ.20 దొరికే గడ్డికట్టలు ఇప్పుడు రూ.80 నుంచి రూ.100కు అమ్ముతున్నారు. దీంతో పాల ఆదాయంలో ఎక్కువమొత్తం గడ్డికే ఖర్చు చేయాల్సి వస్తుంది. మరోవైపు సీజనల్ వ్యాధులు ఎక్కువవుతున్నాయి. పశు వైద్యాధికారులు తమ సేవల్ని మెరుగుపరుచుకోవడంతో పాటు వైద్యశాలల్లో సదుపాయాలు, మందులు నిరంతరం అందుబాటులో ఉంచాలి.
                     - దోమకొండ కిషన్‌రెడ్డి, పాపన్నపేట.

 జబ్బవాపు, గురక వ్యాధి ప్రమాదకరం
 మెదక్:
గేదెలకు చలికాలంలో జబ్బవాపు, గురక వ్యాధులు వస్తాయి. వీటిని గుర్తించి వెంటనే వైద్యం చేయించాలి. ఏమాత్రం నిర్లక్ష ్యం చేసినా 48 గంటల్లో గేదెలు మృత్యువాత పడే ప్రమాదం ఉంది. గురక వ్యాధి సోకిన పశువు నీరసంగా ఉండి మేత మేయదు. అలాగే గాలికుంటు వ్యాధి సోకిన పశువులకు గెటికల్లో పుండ్లు, నాలుక చెడతాయి. పాడిగేదెలు పూర్తిగా పాలివ్వడం మానేస్తాయి. ఇలాంటి లక్షణాలు కనిపించిన పశువులను వెంటనే వైద్యుల దగ్గరకు తీసుకెళ్లాలి. వ్యాధులు సోకకుండా పశువులకు ఆరు నెలలకోసారి టీకాలు వేయించాలి. జూన్‌లో పశువులకు టీకాలు వేశాం.. మళ్లీ జనవరిలో ఇస్తాం.
     - ఉమామ సహేరా, పశువైద్యురాలు, మాచవరం, మెదక్ మండలం

 పచ్చిమేత చాలా అవసరం
 పాలిచ్చే గేదెలకు పచ్చిమేత ఎంతో అవసరం. ప్రతిరోజు రెండుసార్లు పశువులను శుభ్రంగా కడగాలి. పాకలో దోమలు, ఈగలు వాలకుండా గ్యామగ్జిన్ పౌండర్ చల్లాలి. దాణాతో పాటు మినరల్ మిక్చర్ తప్పకుండా పెట్టాలి. ఈ పద్ధతులు పాటిస్తే ముర్రజాతి గేదెలు 10 నుంచి 15 లీటర్ల వరకు పాలు ఇస్తాయి. పాడిగేదెలు ఎదకు వచ్చిన విషయాన్ని గమనించి సకాలంలో కృత్రిమ గర్భదారణ చేయించాలి.
                       - బి.సిద్దిరాములు, పాడిరైతు, మెదక్

 పశువైద్యులూ అప్రమత్తం
 సంగారెడ్డి క్రైం:
రాష్ర్టంలో పశుగ్రాసం, నీటి తొట్టెల నిర్మాణాలకు ప్రణాళికలు సిద్ధం చేయాలని, కరువును అధిగమించేందుకు చర్యలు తీసుకోవాలని పశుసంవర్ధక శాఖ రాష్ట్ర సంచాలకులు డాక్టర్ డి.వెంకటేశ్వర్లు సూచించారు. హైదరాబాద్ నుంచి గురువారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పశుగ్రాసాన్ని తిరిగికొనే పద్ధతి ద్వారా బోర్లు ఉన్న రైతులు పశుగ్రాసాన్ని సాగు చేస్తే ఉపయుక్తంగా ఉంటుందన్నారు. వారికి సెల్ఫ్‌హెల్ప్ గ్రూపుల ద్వారా నగదు చెల్లిస్తామన్నారు. నీటి తొట్టెల నిర్మాణానికి చర్యలు తీసుకోవాలని, ఎన్‌ఆర్‌ఈజీఎస్ ద్వారా పశుగ్రాసాన్ని సాగు చేయాలని, కరువును అధిగమించేందుకు 350 మెట్రిక్ టన్నుల విత్తనాలు, దాణ 1676 మెట్రిక్ టన్నులు, మినరల్ మిక్చర్ 89 మెట్రిక్ టన్నులు, మందుల కోసం రూ.5.90 కోట్లు కేటాయించాలని పశుసంవర్ధక శాఖ సంయుక్త సంచాలకులు డాక్టర్ వి.లక్ష్మారెడ్డి కోరారు. జిల్లాలోని అన్ని మండలాల పశువైద్యాధికారులు అప్రమత్తంగా ఉండాలని, సంతల్లో పశువుల అమ్మకాలు, కొనుగోళ్లను గమనించాలని, పశుగ్రాసాలు వేరే జిల్లాకు తరలిపోకుండా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు.
 
 పశువులాస్పత్రికి ‘తాళం’
 చిన్నశంకరంపేటలోని పశువైద్యశాలకు తాళం పడింది. ఉదయం 8.30 గంటలకే తెరుచుకోవాల్సిన ఆస్పత్రి.. గురువారం 9.30 కూడా ఓపెన్ చేయలేదు. ఎంపీపీ అధ్యక్షురాలు కర్రె కృపావతి గురువారం వైద్యశాల సందర్శనకు వచ్చేసరికి సిబ్బంది లేరు. డాక్టర్ సంజయ్‌కు ఫోన్‌చేయగా స్పందన లేదు. పశుసంవర్థక ఏడీఏకు ఫోన్‌చేసినా స్పందన లేదు.. దీంతో ఆమె అసహనం వ్యక్తంచేశారు. ఇలా అయితే పశువులకు సకాలంలో వైద్యం ఎలా అందుతుందని వాపోయారు.    
                 - చిన్నశంకరంపేట

 సీజనల్ వ్యాధులతో భద్రం

 గజ్వేల్: సీజనల్ వ్యాధులను పశువులు తట్టుకోలేవు. కాబట్టి మొదటే పశుపోషకులు ఆయా వ్యాధుల లక్షణాలను గుర్తించి వైద్యుల సలహాలతో నివారణ చర్యలు చేపట్టాలి. కొన్ని సీజనల్ వ్యాధులు, వాటి నివారణ చర్యల గురించి పశువైద్య నిపుణులు ఇస్తున్న సూచనలు..
 
 ‘కుంటు’పడే ఉత్పాదక శక్తి
 గాలికుంటు వ్యాధి: ఈ వ్యాధి వల్ల మరణం సంభవించదు. అయితే పశువుల్లో ఉత్పాదక శక్తి తగ్గతుంది. బలహీనంగా ఉన్న పశువుల్లో వ్యాధి నిరోదక శక్తి తగ్గడం వల్ల ఈ వ్యాధి సోకుతుంది.

 లక్షణాలు: పళ్ల చిగుళ్లు, నాలుక, ముట్టె లోపలి భాగాల్లో బొబ్బలు ఏర్పడతాయి. 24 గంటల్లో బొబ్బలు పగిలి చితిగిపోవడం వల్ల పశువులు మేత మేయలేవు. శరీర ఉష్ణోగ్రత 104 నుంచి 106 డిగ్రీ వరకు ఉంటుంది. గాలికుంటు వ్యాధి సోకిన పశువుల పాలు తాగిన దూడలు మృతి చెందుతుంటాయి. ఈ విషయంలో రైతులు జాగ్రత్త వహించాలి.

 చికిత్స: వ్యాధి సోకిన పశువులను మంద నుంచి వేరుచేయాలి. పొటాషియం పర్మాంగనేట్ కలిపిన నీళ్లతో పుండ్లను కడిగి శుభ్రం చేయాలి. హిమాక్సిన్ లాంటి అయింట్‌మెంట్‌తో పూతవేయాలి.
 ‘శ్వాస’ను పరీక్షించండి

 శ్వాసకోశ వ్యాధి: పశువులను కలవరపరుస్తున్న వాటిల్లో శ్వాసకోశ వ్యాధి ఒకటి. ఇది సోకిన పశువులు మృత్యువాత పడే అవకాశం ఉంది. తీవ్రమైన జ్వరం, కళ్లు ఎర్రబారడం, ముక్కు వెంట నీరు కారడం, నీరసం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. ఈ వ్యాధి ఇతర పశువులకు సోకే ప్రమాదం ఉంటుంది.
 
 లక్షణాలు: శ్వాసకోశ వ్యాధి ప్రధానంగా శ్వాసకోశం నాడీ మండలం, గర్భకోశ వ్యవస్థలను ఆశిస్తుంది. గాలి కష్టంగా పీలుస్తాయి. వ్యాధి తీవ్రంగా ఉంటే నోటి ద్వారా గాలి పీల్చుకుంటాయి. ఈ వైరస్ జీర్ణకోశాన్ని ఆశిస్తే ఆకలి పూర్తిగా నశిస్తుంది.
 చికిత్స: ఈ వ్యాధి సోకిన పశువులకు ఎక్కువగా యాంటీబయోటిక్ మందులు ఉపయోగించాలి. పైలక్షణాలు కనిపించిన వెంటనే డాక్టర్‌ను సంప్రదించి చికిత్స అందించాలి. యాంటీ రెబీస్ టీకాలు వేయించాలి.
 
 వర్షాకాలంలో వచ్చే గొంతువాపు
 గొంతువాపు వ్యాధి: ఈ వ్యాధి ప్రభావం వర్షాకాలంలో అధికంగా ఉంటుంది. వ్యాధి సోకిన పశువు శరీర ఉష్ణోగ్రత పెరుగుతుంది. గొంతు, మెడ భాగంలో వాపు వస్తుంది.

 చికిత్స: గొంతువాపు వ్యాధికి మార్కెట్‌లో అనేక రకాల యాంటీబయోటిక్ మందులు లభిస్తున్నాయి. సల్ఫాడిమిన్, ఇంటాసెఫ్‌టాజు ఇంజక్షన్లు బాగా పనిచేస్తాయి.

 జబ్బవాపుతో కష్టమే..
 జబ్బవాపు వ్యాధి: ఆకలి లేకపోవడం, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస తీసుకోకపోవడం లాంటి లక్షణాలు కనిపిస్తాయి. 106 నుంచి 108 డిగ్రీల వరకు జ్వరం ఉంటుంది.
 చికిత్స: జబ్బవాపు వ్యాధి ప్రారంభ దశలోనే పెన్సిలిన్, ఆక్సి లాంటి యాంటీబయోటిక్ మందులు వాడాలి. పశువులకు తగిన సమయంలో టీకా వేయించడం ద్వారా దీన్ని పూర్తిగా నివారించవచ్చు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement