ప్రభుత్వానికి వెటర్నరీ జూడాల హెచ్చరిక
తిరుపతి వెటర్నరీ వర్సిటీలో ర్యాలీ
వెంటనే వీసీ, రిజిస్ట్రార్‌ను నియమించాలని డిమాండ్
తిరుపతి సిటీ/లబ్బీపేట(విజయవాడతూర్పు) : వెటర్నరీ జూడాలకు స్టైఫండ్ పెంచకపోతే పోరుబాట తప్పదని వెటర్నరీ వర్సిటీ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జూనపూడి ఎజ్రా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తిరుపతి ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ పశువైద్య కళాశాలలో శుక్రవారం జూడాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్లుగా తమకు స్టైఫండ్ రూ.7 వేలే ఇస్తున్నారని.. అదీ సమయానికి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు.
దేశంలోని అన్ని వెటర్నరీ వర్సిటీల్లో రూ.23 వేలు ఇస్తున్నా.. తిరుపతి వర్సిటీలో మాత్రం పెంచకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న స్టైఫండ్ నిత్యావసరాలకు సరిపోవడం లేదని, వెంటనే రూ.15 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. మూడు నెలలుగా వర్సిటీలో పాలన స్థంభించిపోయిందని, వర్సిటీకి పూర్తి స్థాయి వీసీ, రిజిస్ట్రార్‌లను నియమించాలని కోరారు.
ప్రభుత్వానికి రెండు నెలలు గడువిస్తున్నామని, అప్పటికీ స్పందించకుంటే విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం ఇన్‌చార్జి రిజిస్ట్రార్ చెంగల్రాయులుకు వినతి పత్రం ఇచ్చారు. నిరసన కార్యక్రమంలో జూడాల అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పవన్‌నాయక్, జనరల్ సెక్రటరీ ఆకాష్ పెద్ద సంఖ్యలో జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు.
విజయవాడ జీజీహెచ్‌లో జూడాల నిరసన
తమపై జరుగుతున్న దాడుల నుంచి రక్షణ కల్పించాలని, ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపర్చాలని కోరుతూ విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జూనియర్ వైద్యులు శుక్రవారం మెరుపు ఆందోళనకు దిగారు. ఐదు గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన రవి కలుపుమందు తాగి మెడిసిన్ వార్డులో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందాడు.
ఈ సమయంలో మృతుడి బంధువులు, జూడాల మధ్య వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో మృతుడి బంధువులు జూడాలపై దాడి చేశారు. దీంతో శుక్రవారం ఉదయం సమ్మె నోటీసు తీసుకుని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి.వెంకటేష్ వద్దకు వెళ్లగా.. సమస్యలేమైనా ఉంటే పరిష్కరిస్తామని, సమ్మె నోటీసు తీసుకోనని చెప్పినట్లు జూడాలు తెలిపారు. దీంతో ఉదయం 9 గంటలకు వందలాది మంది జూడాలు ఆస్పత్రి క్యాజువాలిటీ ఎదుట ఆందోళనకు దిగారు.
తమకు రక్షణ కల్పించాలని, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ నరసింహం ప్రభుత్వాస్పత్రికి చేరుకుని జూడాలతో కలిసి సూపరింటెండెంట్ చాంబర్‌లో చర్చలు జరిపారు. సమస్యలు పరిష్కరిస్తానని ఆయన హామీ ఇవ్వడంతో జూడాలు ఆందోళన విరమించారు.
Comments
Please login to add a commentAdd a comment