
31 రోజుల సమ్మె మరింత తీవ్రతరం
గౌరవవేతనం పెంచాల్సిందేనని డిమాండ్
రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోనూ ఇవే ఆందోళనలు
సాక్షి, తిరుపతి సిటీ/చీపురుపల్లి/గన్నవరం: బ్యాచ్‌లర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ ఇంటర్న్‌షిప్ చేస్తున్న తాము కూడా మెడికోలతో సమానమేనని, వారికి ఇస్తున్నట్లుగానే తమకు రూ.25 వేలు స్టైఫండ్ ఇవ్వాలని కోరుతూ తిరుపతి సహా రాష్ట్ర వ్యాప్తంగా గరివిడి, ప్రొద్దుటూరు, గన్నవరంలలో ఫిబ్రవరి 3 నుంచి తరగతులు బహిష్కరించి నిరసన దీక్షలు చేపట్టిన బీవీఎస్ విద్యార్థులు, బుధవారం తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేశారు.
హాస్టళ్లను మూసివేయాలన్న అధికారుల నిర్ణయం వారి ఆగ్రహం మరింత కట్టలు తెంచుకునేలా చేసింది. హాస్టళ్లను మూసివేసి బయటకు గెంటి, ఆకలి బాధల్లోకి నెట్టినా తమ సమస్యల పరిష్కారం అయ్యే వరకూ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.
వర్సిటీ దిగ్బంధం
తిరుపతి ఎస్వీ వెటర్నరీ వర్సిటీలో తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. సర్క్యులర్‌కు అనుగుణంగా ఉదయం ఒక్కసారిగా విద్యార్థుల హాస్టళ్లను మూసివేసి బయటకు గెంటివేశారు. దీంతో ఆగ్రహించిన విద్యార్థులు, వర్సిటీలోకి అధికారులను, అధ్యాపకులను, ఉద్యోగులను ప్రవేశించకుండా దిగ్బంధం చేశారు. దీంతో అధికారులు, ఉద్యోగులు విధులకు వెళ్లకుండా వర్సిటీ ప్రధాన ద్వారం వద్ద గంటల తరబడి వేచి ఉండాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది.
కాగా బుధవారం రాత్రి తాజాగా వెటర్నరీ జూనియర్ డాక్టర్లతో అధికారులు, పోలీసులు జరిపిన సుదీర్ఘ చర్చలు ఎట్టకేలకు ఫలించాయి. విద్యార్థుల వసతి గృహాలను తిరిగి ప్రారంభించేందుకు అధికారులు సుముఖతను వ్యక్తం చేశారు. దీంతో వైద్య విద్యార్థులు వర్సిటీ దిగ్బంధ ఆందోళనను విరమించుకున్నారు. అయితే గౌరవ వేతనాన్ని పెంచేంతవరకూ సమ్మెను యథాతథంగా కొనసాగిస్తామని వెటర్నరీ జూడాలు తేల్చిచెప్పడం గమనార్హం.
ఎక్కడ ఉండాలి.. ఏం తినాలి?
కాగా, హాస్టల్ మూసివేస్తే తామంతా ఎక్కడ ఉండాలి.. ఏం తినాలి.. అంటూ విజయనగరం జిల్లా గరివిడి మండలంలోని శ్రీ వెంకటేశ్వర పశు విశ్వవిద్యాలయం విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేశారు. విజయనగరం–పాలకొండ ప్రధాన రోడ్డులో ఉన్న యూనివర్సిటీ ప్రధాన గేటుకు అడ్డంగా బైఠాయించారు.
యూనివర్సిటీలోకి అధ్యాపకులు, సిబ్బంది వెళ్లకుండా అడ్డుకున్నారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. వర్సిటీ అసోసియేట్ డీన్ ఎం.శ్రీనివాసరావు పలుమార్లు విద్యార్థులతో మాట్లాడగా 11 గంటలకు అధ్యాపకులు, సిబ్బందిని లోపలకు వెళ్లేందుకు అంగీకరించారు.
ఖాళీ కంచాలు, గరిటెలతో వినూత్న నిరసన
మరోవైపు కృష్ణాజిల్లా గన్నవరంలోని ఎన్టీఆర్ పశువైద్య కళాశాల విద్యార్థులు తమ ఆందోళనను తీవ్రతరం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరికి నిరసనగా బుధవారం ఉదయం కళాశాల ప్రధాన గేట్లను మూసివేసి బోధన, బోధనేతర సిబ్బందిని లోపలికి రాకుండా అడ్డుకున్నారు.
ఈ విషయం తెలుసుకున్న గన్నవరం సీఐ శివప్రసాద్ నేతృత్వంలో పోలీసు సిబ్బంది అక్కడికి చేరుకుని విద్యార్థులతో చర్చలు జరిపినప్పటికీ ప్రయోజనం లేకపోయింది. ప్రభుత్వ తీరును వ్యతిరేకిస్తూ ఖాళీ కంచాలను గరిటెలతో మోగిస్తూ విద్యార్థులు వినూత్న నిరసనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment