సుదీర్ఘ పని గంటలతో జూడాలు సతమతం
నిరంతరాయంగా రెండు మూడు రోజులు విధులు
జూడాలకు వారంలో 74 గంటల కంటే ఎక్కువ వద్దని ఎన్‌ఎంసీ సూచన
కోల్‌కతాలో హత్యాచారానికి గురైన వైద్యురాలు 36 గంటలు విధుల్లోనే
ఆధునిక సదుపాయాలతో వైద్య రంగం ఎంత పురోగమిస్తున్నా జూనియర్ వైద్యుల (జూడా) వెట్టి చాకిరీకి మాత్రం తెర పడటం లేదు. ప్రాణం పోసే వైద్యులు ఒత్తిడితో ప్రాణాపాయ పరిస్థితిల్లో కూరుకుపోతున్నారు. తమతో యంత్రాలకన్నా ఘోరంగా పని చేయిస్తున్నారని జూడాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా కోల్‌కతాలోని ఆర్‌జీకార్ ఆస్పత్రిలో హత్యాచారానికి గురైన రెసిడెంట్ వైద్యురాలు 36 గంటలుగా నిరంతరాయంగా విధుల్లో ఉన్నట్టు వెల్లడైంది. – సాక్షి, అమరావతి
ప్రభుత్వ, ప్రైవేట్ వైద్య కళాశాలల్లో ఎంబీబీఎస్, పీజీ విద్యార్థులతో ఏకదాటిగా రెండు, మూడు రోజులు పనిచేయించడంతో పనిభారం, మానసిక ఒత్తిడికి దారితీస్తోంది. ప్రతి నలుగురు ఎంబీబీఎస్, ఇతర యూజీ కోర్సుల విద్యార్థుల్లో ఒకరు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు సర్వేలో వెల్లడైంది. ప్రతి ముగ్గురు పీజీ విద్యార్థుల్లో ఒకరు ఆత్మహత్య ఆలోచనల్లో ఉన్నట్లు వెల్లడించడం ఆందోళన కలిగిస్తోంది.
ఎన్‌ఎంసీ (జాతీయ మెడికల్ కౌన్సిల్) ఆధ్వర్యంలో నేషనల్ టాస్క్‌ఫోర్స్ ఫర్ మెంటల్ హెల్త్, వెల్ బీయింగ్ దేశవ్యాప్తంగా 25,590 మంది ఎంబీబీఎస్, 5,337 మంది పీజీ వైద్య విద్యార్థులు, 7,035 మంది ఫ్యాకల్టీని ఆన్‌లైన్ సర్వే చేయడం ద్వారా ఈ నివేదికను రూపొందించింది. 28 శాతం మంది ఎంబీబీఎస్, 15 శాతం మంది పీజీ విద్యార్థులు మానసిక సమస్యలు ఎదుర్కొంటున్నట్లు చెప్పారు. గత ఏడాది కాలంలో 16.2 శాతం మంది యూజీ, 31.2 శాతం మంది పీజీ విద్యార్థులు తమకు ఆత్మహత్య ఆలోచనలు వచ్చినట్టు తెలిపారు.
237 మంది పీజీ విద్యార్థులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు పేర్కొనడం నివ్వెరపరుస్తోంది. సర్వేలో పాల్గొన్న పీజీ విద్యార్థుల్లో 45 శాతం మంది తాము వారానికి 60 గంటలకు పైగానే పనిచేస్తున్నట్టు వెల్లడించారు. 56 శాతం మంది వారాంతపు సెలవు లేకుండా పనిచేస్తున్నామని తెలిపారు. 9.7 శాతం మంది యూజీ, 18 శాతం పీజీ విద్యార్థులు ర్యాగింగ్ గురవుతున్నామన్నారు.
ఎంఎన్‌సీ సూచనలివీ..
» రెసిడెంట్ డాక్టర్లకు వారానికి 74 గంటల కంటే ఎక్కువ పని గంటలు వద్దు. వారాంతపు సెలవు ఇవ్వాలి.
» వైద్య విద్యార్థులు మానసిక ఒత్తిడి, సమస్యలను అధిగమించేలా యోగా, క్రీడలు, ఇతర కార్యక్రమాలను కళాశాలలు నిర్వహించాలి.
సంస్కరణలు చేపట్టాలి..
ఎంబీబీఎస్‌తో సమానంగా పీజీ సీట్లు పెరుగుతున్నందున పీజీ వైద్యుల పని వేళలను కుదించాలి. 24 గంటల పాటు విధులు నిర్వహించిన జూడాలకు తప్పనిసరిగా సెలవు ఇవ్వాలి. ఆస్పత్రుల్లో వసతులు పెంచాలి. – డాక్టర్ జయధీర్, అదనపు కార్యదర్శి, భారత ప్రభుత్వ వైద్యుల సంఘం
వసతులు పెంచాలి
ఆర్‌జీకార్ ఘటన అభద్రతా భావాన్ని కలిగిస్తోంది. ఆస్పత్రుల సిబ్బందిలో 60 నుంచి 70% మహిళలే ఉన్నా తగిన మౌలిక సదుపాయాలు లేవు. సీసీ కెమెరాలు పెంచాలి. సిబ్బందిపై చిన్న ఘటన జరిగినా వెంటనే గుర్తించే వ్యవస్థ ఉండాలి. – డాక్టర్ జాగృతి, జూనియర్ డాక్టర్, సిద్ధార్థ వైద్య కళాశాల
దేశానికే దిశా నిర్దేశం
హైదరాబాద్‌లోని ‘దిశ’ ఘటన వెలుగులోకి వచ్చిన వెంటనే వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం తక్షణమే స్పందించి అసెంబ్లీలో ’దిశ’ బిల్లు ప్రవేశపెట్టి దేశానికే దిశా నిర్దేశం చేసింది. నాడు సీఎంగా ఉన్న వైఎస్ జగన్ ప్రత్యేక చొరవతో తీసుకున్న చరిత్రాత్మక నిర్ణయానికి దేశమంతా ప్రశంసలు లభించాయి. మహిళలు, బాలికలపై లైంగిక దాడులు, వేధింపుల ఘటనల్లో కేసు దర్యాప్తు, విచారణ 21 రోజుల్లోపే పూర్తి చేసి దోషికి మరణదండన విధించేలా బిల్లు రూపొందించారు.
సత్వర విచారణ, శిక్షలు విధించేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలు, ప్రత్యేక పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, ప్రత్యేక కోర్టులు, ఫోరెన్సిక్ ల్యాబ్‌ల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. దిశ యాప్ ప్రత్యేకంగా తెచ్చి బాధితులు సమాచారం ఇచ్చిన పది నిముషాల్లోనే పోలీసులు రక్షణ కల్పించేలా చర్యలు చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment