ఏలూరులో విద్యార్థుల ర్యాలీలో పాల్గొన్న భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, ఎంపీ కోటగిరి శ్రీధర్, వైఎస్సార్‌సీపీ విద్యార్థి సంఘ నాయకులు
ఏలూరు టౌన్: ‘వన్స్ మోర్ సీఎం వైఎస్ జగన్... జయహో జగన్..’ నినాదాలతో ఏలూరు నగరం మార్మోగింది. ‘వై ఏపీ నీడ్స్ జగన్’ కార్యక్రమంలో భాగంగా సోమవారం ఏలూరులో విద్యార్థి సాధికారత ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్‌సీపీ విద్యార్థి విభాగం నిర్వహించిన ఈ ర్యాలీలో నగరంలోని పలు కళాశాలలకు చెందిన వేలాది మంది విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాలంటూ పెద్దఎత్తున నినాదాలు చేశారు.
వైఎస్సార్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కందుల దినేష్రెడ్డి నేతృత్వంలో ఏలూరు ఎమ్మెల్యే, పార్టీ జిల్లా అధ్యక్షుడు ఆళ్ల నాని సహకారంతో ఈ కార్యక్రమాన్ని చేపట్టారు. ముఖ్య అతిథులుగా భారత మాజీ క్రికెటర్ అంబటి రాయుడు, ఏలూరు ఎంపీ కోటగిరి శ్రీధర్ హాజరయ్యారు. తొలుత ఏలూరు జెడ్పీ కార్యాలయ ప్రాంతం నుంచి ఫైర్‌స్టేషన్ సెంటర్ వద్దకు ర్యాలీగా వచ్చారు. అక్కడ దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి నాయకులు పూలమాలలు వేసి నివాళుల ర్పించారు. అనంతరం ఫైర్‌స్టేషన్ సెంటర్, కోర్టు సెంటర్, ఏలూరు జీజీహెచ్ మీదుగా రామచంద్రరావుపేట వరకు ర్యాలీ నిర్వహించారు.
విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు బాట వేస్తున్న సీఎం జగన్: రాయుడు
అంబటి రాయుడు మాట్లాడుతూ విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి బాటలు వేస్తూ విద్యారంగాన్ని అభివృద్ధి చేస్తున్నారని చెప్పారు. ‘ఆడుదాం–ఆంధ్ర’లో ప్రతి విద్యార్థి, యువత పాల్గొని తమ ప్రతిభను చాటాలని సూచించారు. ఎంపీ కోటగిరి శ్రీధర్ మాట్లాడుతూ పేద, మధ్య తరగతి వర్గాల పిల్లలకు అత్యుత్తమ విద్యను అందించేందుకు సీఎం వైఎస్ జగన్ ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిష్ మీడియం ప్రవేశపెట్టారని చెప్పారు.
ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యాదీవెన, వసతి దీవెన వంటి పథకాలతో విద్యార్థులకు అండగా నిలుస్తున్నారని తెలిపారు. జెడ్పీ చైర్‌పర్సన్ ఘంటా పద్మశ్రీ, వైఎస్సార్‌సీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎస్‌ఎంఆర్ పెద్దబాబు, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి భరత్‌రెడ్డి, ఏలూరు అధ్యక్షుడు ఏలూరు అంజి, జేసీఎస్ జిల్లా కో–ఆర్డినేటర్ వైఎన్‌వీ శివరావు తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment