stipend
-
స్టైపెండ్ పెంచకుంటే పోరుబాటే..
తిరుపతి సిటీ/లబ్బీపేట(విజయవాడతూర్పు) : వెటర్నరీ జూడాలకు స్టైఫండ్ పెంచకపోతే పోరుబాట తప్పదని వెటర్నరీ వర్సిటీ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ అధ్యక్షుడు జూనపూడి ఎజ్రా ప్రభుత్వాన్ని హెచ్చరించారు. తిరుపతి ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ పశువైద్య కళాశాలలో శుక్రవారం జూడాలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పదేళ్లుగా తమకు స్టైఫండ్ రూ.7 వేలే ఇస్తున్నారని.. అదీ సమయానికి ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలోని అన్ని వెటర్నరీ వర్సిటీల్లో రూ.23 వేలు ఇస్తున్నా.. తిరుపతి వర్సిటీలో మాత్రం పెంచకుండా కాలయాపన చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఇస్తున్న స్టైఫండ్ నిత్యావసరాలకు సరిపోవడం లేదని, వెంటనే రూ.15 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. మూడు నెలలుగా వర్సిటీలో పాలన స్థంభించిపోయిందని, వర్సిటీకి పూర్తి స్థాయి వీసీ, రిజిస్ట్రార్లను నియమించాలని కోరారు. ప్రభుత్వానికి రెండు నెలలు గడువిస్తున్నామని, అప్పటికీ స్పందించకుంటే విధులను బహిష్కరించి పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. అనంతరం ఇన్చార్జి రిజిస్ట్రార్ చెంగల్రాయులుకు వినతి పత్రం ఇచ్చారు. నిరసన కార్యక్రమంలో జూడాల అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ పవన్‌నాయక్, జనరల్ సెక్రటరీ ఆకాష్ పెద్ద సంఖ్యలో జూనియర్ డాక్టర్లు పాల్గొన్నారు. విజయవాడ జీజీహెచ్‌లో జూడాల నిరసనతమపై జరుగుతున్న దాడుల నుంచి రక్షణ కల్పించాలని, ఆస్పత్రిలో సౌకర్యాలు మెరుగుపర్చాలని కోరుతూ విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో జూనియర్ వైద్యులు శుక్రవారం మెరుపు ఆందోళనకు దిగారు. ఐదు గంటల పాటు నిరసన వ్యక్తం చేశారు. పెనుగంచిప్రోలు మండలం నవాబుపేటకు చెందిన రవి కలుపుమందు తాగి మెడిసిన్ వార్డులో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందాడు. ఈ సమయంలో మృతుడి బంధువులు, జూడాల మధ్య వివాదం చెలరేగింది. ఈ నేపథ్యంలో మృతుడి బంధువులు జూడాలపై దాడి చేశారు. దీంతో శుక్రవారం ఉదయం సమ్మె నోటీసు తీసుకుని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి.వెంకటేష్ వద్దకు వెళ్లగా.. సమస్యలేమైనా ఉంటే పరిష్కరిస్తామని, సమ్మె నోటీసు తీసుకోనని చెప్పినట్లు జూడాలు తెలిపారు. దీంతో ఉదయం 9 గంటలకు వందలాది మంది జూడాలు ఆస్పత్రి క్యాజువాలిటీ ఎదుట ఆందోళనకు దిగారు.తమకు రక్షణ కల్పించాలని, సెంట్రల్ ప్రొటెక్షన్ యాక్ట్‌ను అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర వైద్య విద్యా సంచాలకులు డాక్టర్ నరసింహం ప్రభుత్వాస్పత్రికి చేరుకుని జూడాలతో కలిసి సూపరింటెండెంట్ చాంబర్లో చర్చలు జరిపారు. సమస్యలు పరిష్కరిస్తానని ఆయన హామీ ఇవ్వడంతో జూడాలు ఆందోళన విరమించారు. -
సకాలంలో స్టైఫండ్ విడుదల, కొత్త బిల్డింగ్
-
తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం
సాక్షి,హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏడాదికి ముందే డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్‌కు ప్రభుత్వం తాజాగా నిధులను విడుదల చేసింది. 2024-2025 ఏడాది మొత్తానికి సరిపడా నిధులు ముందే డిప్యూటీ సీఎం, ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్క విడుదల చేశారు. దీంతో సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు, టీచింగ్ మెడికల్ స్టాప్, నర్సింగ్, పారామెడికల్ సిబ్బందికి బిగ్ రిలీఫ్ దక్కింది. ఇక.. ఏడాదికి ముందే ప్రభుత్వం స్టైఫండ్ నిధులు విడుదల చేయటంపై ఉద్యోగులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
వైద్యులకు స్టైపెండ్ అందడం లేదు!
సాక్షి, హైదరాబాద్: ప్రైవేట్ మెడికల్ కాలేజీలు ఎంబీబీఎస్ ఇంటర్న్‌లకు, పీజీ వైద్య విద్యార్థులకు స్టైపెండ్ ఇవ్వడం లేదని తేలింది. ఈ సమస్యపై జాతీయ మెడికల్ కమిషన్ (ఎన్ఎంసీ) ఆధ్వర్యంలో గూగుల్ ఫాం ద్వారా ఆన్లైన్ సర్వే నిర్వహించింది. మరోవైపు దేశవ్యాప్తంగా వైద్య విద్యార్థులు ఎన్ఎంసీకి ఫిర్యాదులు చేస్తున్నారు. మొత్తంగా 70 శాతం మంది యూజీ ఇంటర్న్‌లకు, పీజీ విద్యార్థులకు స్టైపెండ్ అందడం లేదని తేలింది. దీంతో ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లోని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇకనైనా అధికారులు జోక్యం చేసుకొని స్టైఫండ్ ఇప్పించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. 10,178 మందితో ఆన్లైన్ సర్వే... ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో ఎంబీబీఎస్ ఇంటర్న్లు, పీజీ వైద్య విద్యార్థులకు స్టైపెండ్ చెల్లించే సమస్యపై గూగుల్ ఫాం ద్వారా ఆన్లైన్ సర్వే జరిగింది. పీజీ విద్యార్థుల నుంచి మొత్తం 10,178 మంది నుంచి ఫీడ్ బ్యాక్ వచ్చింది. అందులో 7,901 మంది వివరాలను విశ్లేషించారు. దేశవ్యాప్తంగా 19 రాష్ట్రాలలోని 213 ప్రైవేట్ మెడికల్ కాలేజీల నుంచి ఫీడ్‌బ్యాక్ స్వీకరించారు. అందులో 2,110 మంది పీజీ విద్యార్థులు తమకు స్టైపెండ్ అందడం లేదని స్పష్టం చేశారు. 4,288 మంది విద్యార్థులు తమకు చెల్లించే స్టైపెండ్ ఆయా రాష్ట్రాల్లోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలు చెల్లిస్తున్న స్టైపెండ్‌తో సమానంగా ఉండటం లేదని వెల్లడించారు. తమకు వచ్చే స్టైపెండ్‌ను ఆయా ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలే వెనక్కు తీసుకుంటున్నాయని పేర్కొన్నారు. అనేక కాలేజీలు కాగితాలపై మాత్రం విద్యార్థులకు స్టైపెండ్ ఇస్తున్నట్లు రాసుకుంటున్నాయి. కానీ వాస్తవంగా వారికి ఒక్క పైసా ఇవ్వడంలేదు. ఆందోళనలకు సిద్ధమవుతున్న జూ.డాక్టర్లు... తెలంగాణలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని జూనియర్ డాక్టర్లు స్టైపెండ్ చెల్లింపులో జాప్యంపై సమ్మెకు సిద్ధమవుతున్నారు. మెజారిటీ ప్రైవేట్ కాలేజీలు స్టైపెండ్లు చెల్లించడం లేదని, ఈ సమస్యపై ఎన్ఎంసీని ఆశ్రయించినట్లు విద్యార్థులు చెబుతున్నారు. అయితే ప్రైవేట్ కాలేజీల విద్యా ర్థులు సమ్మెకు వెళ్లలేని పరిస్థితులు నెలకొన్నాయి. వారు యూనియన్లు ఏర్పాటు చేసుకుంటే యాజమాన్యాలు సహించడంలేదు. గత్యంతరం లేక అప్పులు చేయాల్సి వస్తుందని హైదరా బాద్‌లోని ఒక ప్రైవేట్ మెడికల్ కాలేజీకి చెందిన ఒక జూనియర్ డాక్టర్ అభిప్రాయపడ్డారు. ఏదేమైనా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి స్టైపెండ్ వచ్చేలా ఆందోళనలు చేస్తామని కొందరు విద్యార్థులు అంటున్నారు. కాగా, వైద్య విద్యార్థులకు స్టైపెండ్‌చెల్లించక పోవడంపై వైద్యవిద్య అధికారులను ‘సాక్షి’ వివరణ కోరేందుకు ప్రయత్నించగా అధికా రులు అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. -
ఎంబీబీఎస్ విద్యార్థులకు స్టైపెండ్ చెల్లించండి
న్యూఢిల్లీ: దేశంలో 70 శాతం వైద్య కళాశాలలు ఎంబీబీఎస్ విద్యార్థులకు సక్రమంగా స్టైపెండ్ చెల్లించకపోవడంతో సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఇంత జరుగుతున్నా జాతీయ మెడికల్ కమిషన్(ఎన్ఎంసీ) ఏం చేస్తోందని నిలదీసింది. స్టైపెండ్ చెల్లించేలా ఆదేశాలివ్వాలని కోరుతూ విద్యార్థులు దాఖలు చేసిన పిటిషన్‌పై ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ డీవై చంద్రచూడ్ నేతృత్వంలోని సుప్రీంకోర్టు ధర్మాసనం సోమవారం విచారణ చేపట్టింది. ప్రైవేట్ మెడికల్ కాలేజీ విద్యార్థుల నుంచి భారీగా డొనేషన్లు, క్యాపిటేషన్ ఫీజులు వసూలు చేస్తుంటాయని పేర్కొంది. ఎంబీబీఎస్ విద్యార్థులు నిర్బంధ కారి్మకులు కాదని తేలి్చచెప్పింది. వారికి తక్షణమే స్టైపెండ్ చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఎన్ఎంసీని ఆదేశించింది. -
నెలకు రూ. 83వేలకు పైనే ఇస్తారు.. ఈ అర్హతలుంటే చాలు!
Google Winter Internship 2024: ప్రస్తుతం ఎక్కువ శాలరీలు ఇస్తున్న కంపెనీలలో ప్రముఖ టెక్ దిగ్గజం 'గూగుల్' ఒకటని అందరికి తెలుసు. ఈ సంస్థలో ఉద్యోగం కోసం చాలామంది విశ్వప్రయత్నం చేస్తారు. అందులో అందరికి జాబ్ వస్తుందని ఖచ్చితంగా చెప్పలేము. కానీ ఇప్పుడు ఈ సంస్థ 'వింటర్ ఇంటర్న్‌షిప్-2024' పేరుతో ఒక ప్రత్యేక ప్రోగ్రామ్ నిర్వహిస్తోంది. దీనికి ఎలా అప్లై చేసుకోవాలి? స్టైఫండ్ ఎంత ఇస్తారనే మరిన్ని వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం. గూగుల్ కంపెనీ ప్రవేశపెట్టిన ఈ ఇంటర్న్‌షిప్ కోసం అప్లై చేసుకోవాలంటే కంప్యూటర్ సైన్స్ లేదా సంబంధిత రంగాలలో బ్యాచిలర్, మాస్టర్స్ లేదా డ్యూయల్-డిగ్రీ ప్రోగ్రామ్‌లో చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులై ఉండాలి. టెక్ దిగ్గజంతో మీ కెరీర్‌ని ప్రారంభించాలని చూస్తున్నట్లయితే, ఫ్రెషర్లకు ఈ ఇంటర్న్‌షిప్ సువర్ణావకాశం అనే చెప్పాలి. అప్లై చేయడం ఎలా? అప్లై చేయడానికి ముందు ఒక రెజ్యూమ్ క్రియేట్ చేసుకోవాలి. అందులో తప్పకుండా కోడింగ్ ల్యాంగ్వేజ్ మీద మీకు నైపుణ్యం ఉన్నట్లు నిర్దారించాలి. https://cse.noticebard.com/internships/google-winter-internship-2024/ఈ లింకులోకి వెళ్లి రెజ్యూమ్ సెక్షన్లో రెజ్యూమ్ అప్లోడ్ చేయాలి. హయ్యర్ స్టడీస్ విభాగంలో అవసరమైన విషయాలు ఫిల్ చేయాలి. ఆ తరువాత డిగ్రీ స్టేటస్ కింద 'నౌ అటెండింగ్' ఆప్షన్ ఎంచుకోవాలి. తరువాత ఇంగ్లీష్ ట్రాన్స్క్రిప్ట్ను అప్లోడ్ చేసి, అప్లికేషన్ సబ్మిట్ చేయాలి. దరఖాస్తు చేసుకోవడానికి లాస్ట్ డేట్ 2023 అక్టోబర్ 01. ఇందులో ఎంపికైన వారు హైదరాబాద్, బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది. ఇదీ చదవండి: పండుగ సీజన్లో అదిరిపోయే బ్యాంక్ ఆఫర్లు - ఇవి కదా కస్టమర్ కోరుకునేది! కనీస అర్హతలు.. ఇంటర్న్‌షిప్ కోసం అప్లై చేసుకోవాలంటే సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ లేదా సంబంధిత సాంకేతిక రంగంపై దృష్టి సారించే అసోసియేట్, బ్యాచిలర్ లేదా మాస్టర్స్ డిగ్రీ ఉండాలి. సాఫ్ట్వేర్ డెవలప్మెంట్లో అనుభవం. ఒకటి లేదా అంతకంటే ఎక్కువ భాషలలో కోడింగ్ ప్రావీణ్యం (Ex: C, C++, Java, JavaScript, Python). ఎంపికైన వారు ఇంటర్న్‌షిప్ సమయంలో గూగుల్‌లో సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ ఇంటర్న్‌గా పనిచేయాల్సి ఉంటుంది. ఇందులో గూగుల్ టెక్నాలజీ సవాళ్ళను ఎదుర్కొంటూ సేవలందించాల్సి ఉంటుంది. సెర్చ్ సామర్థ్యాన్ని మరింత మెరుగుపరచడం, కంప్యూటింగ్ ప్లాట్‌ఫామ్, నెట్వర్కింగ్ టెక్నాలజీలను అభివృద్ధి చేయడం, వీడియో ఇండెక్సింగ్‌ను ఆటోమేట్ చేయడం వంటివి ఉండవచ్చు. మొత్తం మీద సంక్లిష్టమైన సాంకేతిక సమస్యలకు వినూత్న పరిష్కారాలను రూపొందించడమే మీ పని. స్టైఫండ్ ఎలా? ఇంటర్న్‌షిప్‌కి ఎంపికైన వ్యక్తి ఆరు నెలలు లేదా 22 నుంచి 24 నెలలు హైదరాబాద్ లేదా బెంగళూరులో పనిచేయాల్సి ఉంటుంది. ఈ సమయంలో స్టైఫండ్‌గా నెలకు రూ. 83,947 కంపెనీ అందిస్తుంది. ఈ ప్రోగ్రామ్ 2024 జనవరి నుంచి ప్రారంభమవుతుంది. -
వైద్య విద్యార్థుల స్టైపెండ్ పెంపు
సాక్షి, హైదరాబాద్: వైద్య విద్యార్థులకు శుభవార్త. వారి నెలవారీ స్టైపెండ్‌ను ప్రభుత్వం పెంచింది. సగటున 15 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది. హౌస్ సర్జన్లతో పాటు పీజీ మెడికల్, పీజీ డిప్లొమా, సూపర్ స్పెషాలిటీ, సీనియర్ రెసిడెంట్లకు ఇస్తున్న స్టైపెండ్‌ను పెంచుతూ రాష్ట్ర వైద్య,ఆరోగ్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ శనివారం ఉత్తర్వులు జారీ చేశారు. ఇది ఈ ఏడాది జనవరి నెల నుంచే అమలు చేయనున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు ఆదేశాల మేరకు స్టైఫండ్ పెంపు ప్రక్రిను వేగంగా పూర్తి చేసి అమలు చేస్తున్నట్లు రాష్ట్ర ఆర్థిక, వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి టి.హరీశ్‌రావు స్పష్టం చేశారు. ఇలావుండగా స్టైపెండ్ పెంపు నిర్ణయంపై తెలంగాణ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్ష, కార్యదర్శులు కౌశిక్ కుమార్ పింజర్ల, ఆర్కే అనిల్‌కుమార్ హర్షం వ్యక్తం చేశారు. సీఎం కేసీఆర్, మంత్రి హరీశ్‌రావు, వైద్య విద్య సంచాలకులు రమేశ్‌రెడ్డి తదితరులకు జూడా తరపున కృతజ్ఞతలు తెలిపారు. -
తెలంగాణ సర్కార్ వినూత్న ఆలోచన.. చదువుకుంటూనే సంపాదన!
సాక్షి, హైదరాబాద్: నైపుణ్యంతో కూడిన డిగ్రీ కోర్సులకు శ్రీకారం చుట్టాలని నిర్ణయించిన రాష్ట్ర ఉన్నత విద్యామండలి.. అందుకనుగుణంగా ప్రణాళికను సిద్ధంచేస్తోంది. వచ్చే ఏడాది (2023–24) నుంచి ప్రయోగాత్మకంగా దీన్ని అమలు చేసే వీలుంది. ఈ క్రమంలో ఈనెల 28న వంద కాలేజీల ప్రిన్సిపల్స్, ఉన్నతాధికారులతో కీలక సమావేశం నిర్వహిస్తున్నట్టు మండలి చైర్మన్ ప్రొఫెసర్ ఆర్.లింబాద్రి తెలిపారు. ఏ కాలేజీలో ఏ కోర్సు సాధ్యమనేది చర్చించి, త్వరలో ప్రణాళికను ప్రకటిస్తామని చెప్పారు. ఇప్పటికే సంప్రదాయ డిగ్రీ కోర్సుల స్థానంలో ఇంజనీరింగ్‌తో సమానంగా డేటా సైన్స్, ఆర్టిఫీషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్, ఆనర్స్ కోర్సులను అందుబాటులోకి తెచ్చారు. తాజాగా ప్రవేశపెట్టే నైపుణ్య కోర్సులు డిగ్రీ విద్య స్వరూప స్వభావాల్ని మారుస్తాయని, చదువుతూనే ఉపాధి పొందవచ్చని మండలి అధికారులు తెలిపారు. దీనికి సంబంధించిన విధివిధానాలనూ తెలంగాణ స్టేట్ హయ్యర్ ఎడ్యుకేషన్ కౌన్సిల్ తయారుచేస్తోందని ప్రొఫెసర్ లింబాద్రి తెలిపారు. చదవండి: 3 నెలల్లో ఆర్టీసీ ఎన్నికలు నిర్వహించండి.. ప్రభుత్వానికి హైకోర్టు ఆదేశం ఏమిటీ కోర్సులు? కేంద్ర ప్రభుత్వ స్కిల్ ఇండియా పథకంలో భాగంగా స్కిల్ డెవలప్మెంట్ అండ్ ఎంట్రప్రెన్యూర్షిప్ కొన్నేళ్లుగా సరికొత్త కోర్సులపై అధ్యయనం చేసి.. 14 నైపుణ్య కోర్సులకు రూపకల్పన చేసింది. వీటిలో రిటైల్ మేనేజ్మెంట్, క్రియేటివ్ రైటింగ్, ఈ–కామర్స్, లాజిస్టిక్స్, గేమింగ్ అండ్ యానిమేషన్ వంటి కోర్సులున్నాయి. స్కిల్ కోర్సులను రెండు రకాలుగా నిర్వహించాలని యోచిస్తున్నారు. ఫస్టియర్ నుంచే స్కిల్ కోర్సులుండేలా ఒక పథకం, రెండో ఏడాది నుంచి వీటిని అమలు చేయడం మరో విధానంగా తీసుకురానున్నారు. చదివే సమయంలోనే స్టైపెండ్ డిగ్రీ చదివే సమయంలో స్కిల్ కోర్సులను ప్రాక్టికల్‌గా నేర్పుతారు. ఇందుకు కొన్ని సంస్థలతో ఉన్నత విద్యామండలి ఒప్పందం చేసుకుంటుంది. ఆయా సంస్థల్లో వారానికి మూడు రోజులు విద్యార్థి ప్రాక్టికల్‌గా శిక్షణ పొందుతారు. ఈ సమయంలో రూ.10 వేల వరకూ నెలకు ఉపకార వేతనం అందుతుంది. రాష్ట్రంలో మొత్తం 1,056 డిగ్రీ కాలేజీలున్నాయి. వీటిలో తొలుత 103 ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో స్కిల్ కోర్సులు ప్రవేశపెట్టే ఆలోచనలో ఉన్నారు. చదవండి: బీఆర్ఎస్ దేశంలోనే నంబర్-1.. సెకండ్ ప్లేస్‌లో ఆప్..! -
జూనియర్ డాక్టర్లకు ఏపీ ప్రభుత్వం గుడ్ న్యూస్.. స్టైఫండ్ పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని జూనియర్ డాకర్టకు ఏపీ ప్రభుత్వం శుభవార్తనందించింది. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంచుతూ వైద్య ఆరోగ్య శాఖ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. అన్ని కేటగిరిల్లో దాదాపు 15 శాతం పెంచుతున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. చదువుతున్న సంవత్సరాలను బట్టి స్టైఫండ్‌లో పెంపుదల ఉంటుందని వెల్లడించింది. ఎంబీబీఎస్ విద్యార్థులకు రూ.19,589 నుంచి రూ.22,527కు స్టైఫండ్ పెంచింది. పీజీ ఫస్టియర్ విద్యార్థులకు రూ. 44,075 నుంచి రూ.50,686కు, సెకండియర్ విద్యార్థులకు రూ.46,524 నుంచి రూ.53,503కు, థర్డ్ ఇయర్ విద్యార్థులకు రూ.48,973 నుంచి రూ.56,319కు పెంచింది. స్టైఫండ్‌ను పెంచుతూ ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడంతో జూనియర్ డాక్టర్లు హర్షం వ్యక్తం చేస్తున్నారు. చదవండి: విశాఖ కోసం రాజీనామాకు సిద్ధపడ్డ మంత్రి ధర్మాన.. వారించిన సీఎం జగన్ -
దీపావళి వేళ నర్సింగ్ విద్యార్థులకు శుభవార్త..!
సాక్షి, హైదరాబాద్: నర్సింగ్ విద్యార్థులకు శుభవార్త. రాష్ట్ర ప్రభుత్వం వారి ఇంట దీపావళి వెలుగులు నింపింది. ఆ విద్యార్థుల స్టైపెండ్‌ను మూడింతలకుపైగా పెంచింది. ఈ మేరకు వైద్య, ఆరోగ్య శాఖ కార్యదర్శి రిజ్వీ బుధవారం ఉత్తర్వులు జారీచేశారు. స్టైపెండ్ పెంపుదల వెంటనే అమలులోకి వస్తుందని పేర్కొన్నారు. ఈ పెంపుదల నర్సింగ్ స్కూళ్లు, నిమ్స్‌ల్లో చదువుతున్న జీఎన్ఎం, బీఎస్సీ (నర్సింగ్) విద్యార్థులకు వర్తిస్తుంది. ఎంఎస్సీ (నర్సింగ్) విద్యార్థులకు కూడా స్టైపెండ్ విధానాన్ని తొలిసారిగా ప్రవేశపెట్టినట్లు వైద్య విద్యా సంచాలకుడు (డీఎంఈ) డాక్టర్ రమేశ్‌రెడ్డి పేర్కొన్నారు. ఎంఎస్సీ(నర్సింగ్) మొదటి ఏడాది విద్యార్థులకు నెలకు రూ.9 వేలు, రెండో ఏడాది విద్యార్థులకు రూ.10 వేల స్టైపెండ్ అందజేస్తారు. -
స్టయిఫండ్ ఇవ్వలేమంటే కుదరదు: ఏపీ వైద్య ఆరోగ్యశాఖ
సాక్షి, అమరావతి: ప్రైవేటు వైద్య కాలేజీల్లో పీజీ వైద్య విద్య అభ్యసిస్తున్న విద్యార్థులకు నెలవారీ స్టయిఫండ్ ఇవ్వలేమంటే కుదరదని వైద్య ఆరోగ్యశాఖ తేల్చి చెప్పింది. కొన్ని నెలల క్రితం ప్రైవేటు వైద్య కళాశాలల అసోసియేషన్ ప్రభుత్వానికి లేఖ ఇచ్చింది. ఈ లేఖలో.. తమకు వైద్యకాలేజీల నిర్వహణ భారం పెరిగిందని, ఈ నేపథ్యంలో పీజీ చదువుకుంటున్న వారికి స్టయిఫండ్ కింద నిధులు చెల్లించలేమని, దీనిపై ప్రభుత్వం ఆదేశాలు ఇవ్వాలని కోరింది. కొన్ని నెలలుగా ఈ ఫైలు పెండింగ్‌లో ఉందంటూ ప్రైవేటు వైద్యకాలేజీల యాజమాన్యాలు స్టయిఫండ్ చెల్లించడం లేదు. ఈ నేపథ్యంలో ప్రైవేటు యాజమాన్యాల లేఖను వైద్య ఆరోగ్యశాఖ తిరస్కరించింది. ప్రభుత్వ కాలేజీల్లో స్టయిఫండ్ ఎలా ఇస్తున్నామో, ప్రైవేటులోనూ అంతేనని, దీన్ని ఇవ్వలేమని చెప్పడం కుదరదని స్పష్టం చేసింది. వ్యయ నిర్వహణకు సంబంధించిన ప్రైవేటు యాజమాన్యాలు ఇచ్చిన నివేదికను అనుసరించే ఫీ రెగ్యులేటరీ కమిటీ స్టయిఫండ్ ఇవ్వాలని నిర్ణయించిందని, దీన్ని ఇప్పుడు కాదనేందుకు లేదని చెప్పింది. చదవండి: విజయవాడలో అరుదైన పిల్లి హల్చల్.. ఎలా వచ్చింది? -
కోవిడ్‌తో ‘అనాథలైన’ చిన్నారులకు స్టైపండ్ పెంపు !
న్యూఢిల్లీ: కోవిడ్ కారణంగా తల్లిదండ్రులను కోల్పోయి అనాథలైన పిల్లలకు తాము అందిస్తున్న నెలవారీ ఆర్థికసాయాన్ని రెట్టింపు చేయాలని మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం యోచిస్తోంది. ప్రభుత్వం ప్రస్తుతం ఇస్తున్న రూ.2,000ల స్టైపండ్‌ను రూ.4,000కు పెంచాలని భావిస్తున్నట్లు సంబంధిత కేంద్ర ఉన్నతాధికారి ఒకరు మంగళవారం వెల్లడించారు. ఈ పెంపు ప్రతిపాదనను కేంద్ర మంత్రి మండలి ఆమోదించాల్సి ఉంది. పిల్లలకు అందిస్తున్న నెలవారీ భత్యాన్ని పెంచాలని కేంద్ర మహిళా, శిశు సంరక్షణ మంత్రిత్వ శాఖ ప్రతిపాదించిందని, త్వరలో ఈ ప్రతిపాదన కేబినెట్ ముందుకు వెళ్లనుంది. -
గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీలు
ముంబైలోని ముంబై పోర్ట్ ట్రస్ట్ 2020–21 సంవత్సరానికిగాను వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 11 ► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–05, టెక్నీషియన్ అప్రెంటిస్–06. ► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిగ్రీ ఉత్తీర్ణులవ్వాలి. ► వయసు: 14 నుంచి 18ఏళ్ల మధ్య ఉండాలి. స్టయిపెండ్: నెలకు రూ.9000 చెల్లిస్తారు. ► టెక్నీషియన్ అప్రెంటిస్: విభాగాలు: మెకానికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. వయసు: 14 నుంచి 18ఏళ్ల మధ్య ఉండాలి. స్టయిపెండ్: నెలకు రూ.8000 చెల్లిస్తారు. ► ఎంపిక విధానం: ఇంజనీరింగ్ డిప్లొమా/ఇంజనీరింగ్ డిగ్రీలో సాధించిన మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్/ఆఫ్‌లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తులను ఏటీసీ, బందర్‌భవన్, థర్డ్ ఫ్లోర్, ఎన్.వీ.నక్వా మార్గ్, మజగాన్(ఈస్ట్), ముంబై–400010 చిరునామాకు పంపించాలి. ► దరఖాస్తులకు చివరి తేది: 27.08.2021 ► వెబ్సైట్: www.mumbaiport.gov.in నీప్‌కోలో 94 గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్‌లు షిల్లాంగ్(మేఘాలయ)లోని భారత ప్రభుత్వ విద్యుచ్ఛక్తి మంత్రిత్వశాఖకు చెందిన నార్త్ ఈస్ట్రన్ ఎలక్ట్రిక్ పవర్ కార్పొరేషన్ లిమిటెడ్(నీప్కో).. వివిధ విభాగాల్లో గ్రాడ్యుయేట్, టెక్నీషియన్ అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం ఖాళీల సంఖ్య: 94 ► ఖాళీల వివరాలు: గ్రాడ్యుయేట్ అప్రెంటిస్–44, టెక్నీషియన్ అప్రెంటిస్–50. ► గ్రాడ్యుయేట్ అప్రెంటిస్: విభాగాలు: ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్, ఐటీ. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్: నెలకు రూ.18,000 చెల్లిస్తారు. ► టెక్నీషియన్ అప్రెంటిస్: విభాగాలు: సివిల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్/మెకానికల్ ఇంజనీరింగ్, ఐటీ. అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజనీరింగ్ డిప్లొమా ఉత్తీర్ణులవ్వాలి. స్టయిపెండ్: నెలకు రూ.15,000 చెల్లిస్తారు. వయసు: 31.07.2021 నాటికి 18 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. ► ఎంపిక విధానం: ఇంజనీరింగ్ డిగ్రీ/డిప్లొమాలో సాధించిన మెరిట్ మార్కుల ఆధారంగా ఎంపికచేస్తారు. ► దరఖాస్తు విధానం: ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ► ఈమెయిల్: neepco.apprentices20@gmail.com ► నాట్స్ పోర్టల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 20.08.2021 ► ఈమెయిల్ ద్వారా దరఖాస్తులకు చివరి తేది: 10.09.2021 ► వెబ్సైట్: https://neepco.co.in ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్, పాలక్కడ్‌లో 21 ట్రెయినీలు కేరళలోని పాలక్కడ్‌లో ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్ ఒప్పంద ప్రాతిపదికన ట్రెయినీ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం పోస్టుల సంఖ్య: 21 ► పోస్టుల వివరాలు: ట్రెయినీ(ఇంజనీర్) డిజైన్ అండ్ ఇంజనీరింగ్–04, ట్రెయినీ(ఇంజనీర్) కమర్షియల్–13, ట్రెయినీ(డ్రాఫ్ట్స్‌మెన్), మెకానికల్ ఇంకజనీరింగ్ –04. ► అర్హత: సంబంధిత సబ్జెక్టుల్లో ఇంజినీరింగ్ డిప్లొమా, బీఈ/బీటెక్ ఉత్తీర్ణులవ్వాలి. సంబంధిత పనిలో అనుభవంతో మంచి కమ్యూనికేషన్ నైపుణ్యాలు ఉండాలి. ► వయసు: పోస్టుల్ని అనుసరించి 01.07.2021 నాటికి 25, 27 ఏళ్లు మించకుండా ఉండాలి. ► జీతం: పోస్టుల్ని అనుసరించి నెలకి రూ.9000, రూ.12,000 చెల్లిస్తారు. ► దరఖాస్తు విధానం: ఆఫ్‌లైన్/ఈమెయిల్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. సీనియర్ పర్సనల్ ఆఫీసర్(పీఅండ్ఏ), ఇన్స్ట్రుమెంటేషన్ లిమిటెడ్, కంజికోడ్ వెస్ట్, పాలక్కడ్–678–623 చిరునామకు పంపించాలి. ► ఈమెయిల్: hr@ilpgt.com ► దరఖాస్తులకు చివరి తేది: 15.08.2021 ► వెబ్సైట్: www.ilpgt.com -
ఎస్బీఐలో ఖాళీలు.. ఆన్లైన్లో అప్లై చేసుకోండి
దేశంలోని అతిపెద్ద ప్రభుత్వ రంగ బ్యాంకు... స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా(ఎస్బీఐ)కు చెందిన ముంబయిలోని సెంట్రల్ రిక్రూట్మెంట్ అండ్ ప్రమోషన్ విభాగం... దేశవ్యాప్తంగా అప్రెంటిస్ ఖాళీల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. ► మొత్తం అప్రెంటిస్ ఖాళీల సంఖ్య: 6100 ► తెలుగు రాష్ట్రాల్లో అప్రెంటిస్ ఖాళీలు: ఆంధ్రప్రదేశ్‌లో 100, తెలంగాణలో 125. ► అప్రెంటిస్ శిక్షణ వ్యవధి: ఒక ఏడాది. ► అర్హత: గుర్తింపు పొందిన యూనివర్సిటీ/ఇన్స్టిట్యూట్ నుంచి గ్రాడ్యుయేషన్ ఉత్తీర్ణత ఉండాలి. ► వయసు: 31.10.2020 నాటికి 20 నుంచి 28ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ/ఎస్టీ/ఓబీసీ/పీడబ్ల్యూడీ అభ్యర్థులకు ప్రభుత్వ నిబంధనల ప్రకారం గరిష్ట వయోపరిమితిలో సడలింపు లభిస్తుంది. ► స్టయిపెండ్: అప్రెంటిస్ శిక్షణ కాలం ఏడాది పాటు నెలకు రూ.15000 స్టయిపెండ్ లభిస్తుంది. ఇతర ఎలాంటి అలవెన్సులు/ప్రయోజనాలు ఉండవు. ► ఎంపిక విధానం: ఆన్లైన్ రాత పరీక్ష, స్థానిక భాష పరీక్ష, మెడికల్ టెస్టుల ఆధారంగా ఎంపిక జరుగుతుంది. ► రాత పరీక్ష ఇలా: ఎస్బీఐ అప్రెంటిస్ రాత పరీక్ష ఆన్లైన్ విధానంలో ఆబ్జెక్టివ్ తరహాలో జరుగుతుంది. మొత్తం 100 ప్రశ్నలు–100 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు. ఇందులో నాలుగు విభాగాలు.. జనరల్/ఫైనాన్షియల్ అవేర్నెస్–25 ప్రశ్నలు–25 మార్కులు, జనరల్ ఇంగ్లిష్–25 ప్రశ్నలు–25 మార్కులు, క్వాంటిటేటివ్ అప్టిట్యూడ్–25 ప్రశ్నలు–25 మార్కులు, రీజనింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూటర్ అప్టిట్యూడ్–25 ప్రశ్నలు–25 మార్కులకు ఉంటుంది. పరీక్ష సమయం ఒక గంట(60 నిమిషాలు). ప్రతి విభాగానికి 15 నిమిషాలు కేటాయించారు. ప్రతి సరైన సమాధానానికి ఒక మార్కు లభిస్తుంది. ప్రతి తప్పు సమాధానానికి 1/4 మార్కు కోత ఉంటుంది. ప్రశ్న పత్రం ఇంగ్లిష్, హిందీలో ఉంటుంది. ► దరఖాస్తు విధానం: ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ► ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం: 06.07.2021 ► ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేది: 26.07.2021 ► వెబ్సైట్: https://bank.sbi/web/careers, https://apprenticeshipindia.org -
సీనియర్ రెసిడెంట్లకు భారీగా స్టైఫండ్ పెంపు: ఏకే సింఘాల్
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు స్టైఫండ్‌ను రూ. 45 వేల నుంచి 75 వేలకు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకుందని వైద్యారోగ్యశాఖ ముఖ్యకార్యదర్శి అనిల్‌కుమార్ సింఘాల్ బుధవారం తెలిపారు. కాగా రాష్ట్రంలో కరోనా విధుల్లో సుమారు 350 మంది సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు ఉన్నారని.. పెంచిన స్టైఫండ్ వీరికి వర్తిస్తుందని తెలిపారు. కాగా రాష్ట్రంలో ఉన్న జూనియర్ డాక్టర్ల డిమాండ్‌పై ప్రభుత్వం చర్చిస్తోందన్నారు. అలాగే రాష్ట్రంలో పీజీ పూర్తి చేసిన 800 మంది డాక్టర్లకు స్టైఫండ్ పెంచాలని వారు కోరారని.. పీజీ వైద్యుల డిమాండ్లను కూడా ప్రభుత్వం పరిశీలిస్తోందని వివరించారు. విదేశాలకు వెళ్లేవారికి మొదటి ప్రాధాన్యత అనంతరం రాష్ట్రంలో కరోనా పరిస్థితిపై మాట్లాడుతూ.. '' ఏపీలో తాజా కరోనా కేసుల లెక్కల ప్రకారం పాజిటివిటీ రేట్ 13.02 శాతంగా ఉంది. గడచిన 24 గంటల్లో 443 టన్నుల మేర ఆక్సిజన్ వినియోగించాం. 25 లక్షల మందికి పైగా రెండు డోసులు పూర్తయ్యాయి. 50 లక్షల మందికి పైగా మొదటి డోస్ వేయడం పూర్తైంది. విదేశాలకు వెళ్లే ఉద్యోగులు, విద్యార్ధులకు వ్యాక్సినేషన్ మొదటి ప్రాధాన్యం ఇవ్వనున్నాం. విదేశాలకు వెళ్లే వాళ్లు పాస్ పోర్టు నెంబర్ ఇవ్వాలి. గతంలో ఆధార్ నెంబరుతోనే కోవిన్ పోర్టల్‌లో రిజిస్టర్ చేసుకునేవారు. తాజాగా పాస్ పోర్టు నెంబరును కూడా కోవిన్ పోర్టల్‌లో పెట్టేలా చర్యలు తీసుకోవాలని కేంద్రాన్ని కోరాం. అని తెలిపారు చదవండి: ఏపీలో కొత్తగా 12,768 కరోనా కేసులు -
సీనియర్ రెసిడెంట్లకు స్టైఫండ్ రూ.20 వేలు పెంపు
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో పీజీ పూర్తయిన తర్వాత సీనియర్ రెసిడెంట్లుగా పనిచేస్తున్న వారికి స్టైఫండ్ కింద ఇచ్చే సొమ్మును రూ.45 వేల నుంచి రూ.65 వేలకు పెంచింది. త్వరలోనే ప్రభుత్వం దీనిపై ఉత్తర్వులు జారీ చేయనుంది. గత కొన్ని రోజులుగా సీనియర్ రెసిడెంట్లు స్టైఫండ్ పెంచాలని కోరిన నేపథ్యంలో ఈ నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా 350 మంది వరకు సీనియర్ రెసిడెంట్లు ఉంటారు. వీళ్లందరికీ ప్రభుత్వం విధిగా సీనియర్ రెసిడెన్సీ చేయాలన్న నియమం లేదు. కానీ ప్రభుత్వ ఉద్యోగాల్లో చేరాలంటే సీనియర్ రెసిడెన్సీ చేసి ఉండాలి కాబట్టి వాళ్లు తమ వీలును బట్టి చేరిన వారే. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఒకేసారి రూ.20 వేలు పెంచుతున్నామని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు తెలిపారు. అంతేకాకుండా సీనియర్ రెసిడెంట్లకు ఇచ్చే స్టైఫండ్‌లో టీడీఎస్(టాక్స్ డిడక్షన్స్)ను కూడా తొలగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. సమ్మెకు వెళ్లేందుకే మొగ్గు ప్రభుత్వం స్టైఫండ్ పెంచుతున్నట్టు హామీ ఇచ్చినా సీనియర్ రెసిడెంట్లు సమ్మెవైపే మొగ్గు చూపారు. మంగళవారం నుంచే విధులు బహిష్కరిస్తున్నట్టు ప్రకటించారు. పలు కాలేజీల్లో నోటీసులు ఇచ్చినట్టు తెలిసింది. తాము ఎన్నో రోజులుగా రూ.80 వేలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నామని సీనియర్ రెసిడెంట్లు చెప్పారు. ఈ సందర్భంగా సీనియర్ రెసిడెంట్ల ప్రతినిధి రవి బానోత్ మాట్లాడుతూ.. తాము విధుల బహిష్కరణకే మొగ్గు చూపుతున్నామన్నారు. కరోనా సమయంలో ఈ చర్యలు సమంజసమేనా? అన్న ప్రశ్నకు.. చాలా రోజుల నుంచే స్టైఫండ్ అడుతున్నామని.. ఇప్పడు తాము నిర్ణయం తీసుకున్నామన్నారు. ఇది సమయం కాదు కరోనా విజృంభిస్తున్న వేళ సీనియర్ రెసిడెంట్లు తీసుకున్న ఈ నిర్నయం సరైంది కాదని వైద్య విద్యా సంచాలకులు డా.రాఘవేంద్రరావు అన్నారు. సీనియర్ రెసిడెంట్ల ప్రతనిధితో రూ.20 వేలు పెంచుతున్నట్టు చెప్పామని, అయినా విధుల బహిష్కరణకే మొగ్గు చూపుతున్నారన్నారు. దీనిపై అన్ని విధాలా చెప్పామని, ప్రత్యామ్నాయ చర్యలు తీసుకుంటామని ఆయన ‘సాక్షి’తో చెప్పారు. ప్రస్తుతం పనిచేస్తున్న సీనియర్ రెసిడెంట్ల గడువు మూడు మాసాలే ఉందన్నారు. -
జూనియర్ డాక్టర్ల చర్చలు సఫలం..విధుల్లోకి జూడాలు
సాక్షి, హైదరాబాద్/గాంధీ ఆస్పత్రి: రాష్ట్రవ్యాప్తంగా గత రెండు రోజులుగా అత్యవసర, సాధారణ విధులను బహిష్కరించిన జూని యర్ డాక్టర్లు సమ్మె విరమించి గురువారం రాత్రి నుంచి విధుల్లో చేరారు. నాలుగు ప్రధాన డిమాండ్లతో ఈనెల 26 నుంచి అత్యవసర, ఐసీయూ సేవలు మినహా విధులు బహిష్కరిం చిన సంగతి తెలిసిందే. స్టైపెండ్ పెంపు, హెల్త్‌కేర్ వర్కర్స్‌తో పాటు వారి కుటుంబ సభ్యులకు నిమ్స్‌లో చికిత్స, పదిశాతం ప్రోత్సాహ కం, విధినిర్వహణలో మరణించిన వారి కుటుంబాలకు పరిహారం అనే నాలుగు డిమాం డ్లపై ఈనెల 10న సమ్మె నోటీసులు ఇవ్వగా... సీనియర్ రెసిడెంట్ డాక్టర్లు సైతం సమ్మె నోటీసు ఇచ్చి బుధవారం నుంచి విధులు బహిష్కరించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు సూచనలతో రంగంలోకి దిగిన వైద్య విద్య సంచాలకులు బుధవారం రాత్రి పొద్దుపోయే వరకు చర్చలు జరిపినప్పటికీ లిఖితపూర్వక హామీ రాకపోవడంతో గురువారం కూడా సమ్మె కొనసాగించారు. రెండు ప్రధాన డిమాండ్లు పరిష్కారం కోవిడ్–19 అత్యవసర పరిస్థితుల్లో విధులు బహిష్కరించడం సరికాదనే కోణంలో జూని యర్ డాక్టర్ల సంఘం, సీనియర్ రెసిడెంట్ డాక్టర్ల సంఘాలతో బీఆర్కే భవన్లో వైద్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ ప్రత్యేకంగా చర్చ లు జరిపారు. ఇంటర్న్‌షిప్ డాక్టర్లతో పాటు జూనియర్ డాక్టర్ల స్టైపెండ్ 15% పెంచుతూ తీసుకున్న నిర్ణయాన్ని వివరించారు. అదేవిధంగా సీనియర్ రెసిడెంట్ డాక్టర్లకు కూడా స్టైఫండ్ 15 శాతం పెంచుతున్నట్లు అప్పటికప్పుడు ఉత్తర్వులు జారీ చేశారు. వీటితో పాటు కరోనా బారిన పడితే జూనియర్ డాక్టర్లు, వారి కుటుంబ సభ్యులకు నిజాం ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్‌లో చికిత్సకు సైతం ప్రభుత్వం అనుమతించింది. అదేవిధంగా విధినిర్వహణలో మరణించిన హెల్త్‌కేర్ వర్కర్స్ కుటుంబసభ్యులకు పరిహారం ఇచ్చే అంశంపై ముఖ్యమంత్రితో మాట్లాడి నిర్ణయం తీసుకుంటామని కార్యదర్శి హామీ ఇచ్చారు. రెండు ప్రధాన డిమాండ్లు పరిష్కరించగా... మిగతావాటిపై ముఖ్యమంత్రితో చర్చించనున్నట్లు స్పష్టత రావడంతో జూనియర్ డాక్టర్లు, సీనియర్ రెసిడెంట్లు సమ్మె విరమిస్తున్నట్లు ప్రకటించారు. డిమాండ్లు పూర్తిస్థాయిలో నెరవేరనప్పటికీ ప్రభుత్వం నుంచి సానుకూల స్పందన రావడంతో సమ్మె విరమిస్తున్నట్లు జూడాల సంఘ రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ వాసరి నవీన్, హైదరాబాద్ గాంధీ ఆస్పత్రి యూనిట్ అధ్యక్ష, కార్యదర్శులు మణికిరణ్‌రెడ్డి, సునయ్లు చెప్పారు. త్వరలో మిగతా డిమాండ్లు సైతం పరిష్కారమవుతాయని జూడాల సంఘం ఆశాభావం వ్యక్తం చేసింది. కోవిడ్–19 అత్యవసర సమయంలో రోగులకు వైద్య సేవలు అందించాలి్సన ఆవశ్యకత దృష్ట్యా సమ్మె విరమిస్తున్నట్లు తెలిపారు. ఈ మేరకు జూడాలు గురువారం రాత్రి 9 గంటల నుంచి విధుల్లో చేరడంతో రెండ్రోజుల పాటు సాగిన సమ్మెకు తెరపడింది. స్టైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు సీనియర్ రెసిడెంట్లకు ప్రస్తుతం నెలకు రూ.70వేల చొప్పున స్టైఫండ్ ఇస్తున్నారు. దీనిని 15 శాతం పెంచాలని ప్రభుత్వానికి వైద్య విద్య విభాగం ప్రతిపాదనలు పంపింది. ఈ ప్రతిపాదనలను పూర్తిగా పరిశీలించిన ప్రభుత్వం నెలవారీ స్టైఫండ్‌ను రూ.80,500కు పెంచింది. ఈ మొత్తాన్ని 2021 జనవరి 1 నుంచి అమలు చేయనున్నట్లు వెల్లడించింది. ఈÐ మేరకు వైద్య శాఖ కార్యదర్శి ఎస్ఏఎం రిజ్వీ గురువారం ఉత్తర్వుల జారీ చేశారు. ఇలావుండగా ఎంబీబీఎస్, బీడీఎస్, పీజీ డిగ్రీ, పీజీ డిపొ్లమా, ఎండీఎస్ కోర్సులు చదువుతున్న వైద్య విద్యార్థులకు సైతం ప్రభుత్వం స్టైఫండ్‌ను 15 శాతం పెంచింది. ఇందుకు సంబంధించి వైద్య విద్య విభాగం ప్రతిపాదనలు పంపగా... ప్రభుత్వం ఈ ప్రతిపాదనలు కూడా ఆమోదించి ఉత్తర్వులు జారీ చేసింది. స్టైఫండ్ పెంపు ఇలా... కోర్సు ప్రస్తుత స్టైఫండ్ పెంచిన తర్వాత హౌస్ సర్జన్మెడికల్ 19,589 22,527 హౌస్సర్జన్డెంటల్ 19,589 22,527 పీజీ డిప్లొమాలో.. మొదటి సంవత్సరం 44,075 50,686 రెండో సంవత్సరం 46,524 53,503 సూపర్ స్పెషాలిటీలో.. మొదటి సంవత్సరం 48,973 56,319 రెండో సంవత్సరం 51,422 59,135 మూడో సంవత్సరం 53,869 61,949 పీజీ డిగ్రీ అండ్ ఎండీఎస్‌లో.. మొదటి సంవత్సరం 44,075 50,686 రెండో సంవత్సరం 46,524 53,503 మూడో సంవత్సరం 48,973 56,319 పెంపు జీవో విడుదల ఇంటర్నస్, పీజీ, సూపర్ స్పెషాలిటీ పీజీ, సీనియర్ రెసిడెంట్ల (ఎస్ఆర్)కు స్టైపెండ్ 15% పెంపు. 2021 జనవరి నుంచి పెంపు వర్తింపు. స్టైపెండ్ పెంపు జీవో విడుదల నిమ్స్‌లో పడకలకు ఓకే జూడాలు, వారి కుటుంబసభ్యులు కరోనా బారిన పడితే నిమ్స్‌లో పడకలు కేటాయించి వైద్యసేవలు అందించేందుకు అంగీకారం. ఇవి సీఎం దృష్టికి.. కీలకమైన ఎక్స్‌గ్రేషియా అంశంతో పాటు ఇన్సెంటివ్స్ (ప్రోత్సాహకాలు) అంశంపై కూడా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకువెళ్తామని స్పష్టమైన హామీ. -
తెలంగాణ జూడాలు, హౌస్ సర్జన్లకు తీపి కబురు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలోని జూనియర్ డాక్టర్లు, హౌస్ సర్జన్లు, పీజీ వైద్యులకు రాష్ట్ర ప్రభుత్వం తీపి కబురు చెప్పింది. పది రోజుల క్రితం జూనియర్ డాక్టర్లు జీతాలు పెంచాలంటూ ప్రభుత్వానికి లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గతంలో ఇచ్చిన హామీ మేరకు జూనియర్ డాక్టర్లకు ప్రభుత్వం 15 శాతం స్టైఫండ్ పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. హౌస్ సర్జన్ మెడికల్, హౌస్ సర్జన్ డెంటల్కు 19,589 రూపాయల నుంచి రూ.22,527కి పెంచుతూ ఉత్తర్వులు జారీ చేసింది. పీజీ డిగ్రీ, డిప్లొమా, సూపర్ స్పెషాలిటీ, ఎండీఎస్ వారికి.. ప్రస్తుత స్టైఫండ్‌కి 15 శాతం పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇక నేటి ఉదయం స్నేహ సోమారెడ్డి అనే వైద్యురాలు గత నాలుగు నెలలుగా తమకు సరిగా జీతాలు అందడం లేదంటూ కేటీఆర్‌కు ట్వీట్ చేశారు. ‘‘సార్ కరోనా కష్టకాలంలో మీరు ఎందరికో సహాయం చేస్తున్నారు. కానీ రెసిడెంట్ డాక్టర్లు కరోనా లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆస్పత్రుల్లో నిరంతరం సేవలందిస్తున్నారు. గత నాలుగు నెలల నుంచి మాకు జీతాలు అందడం లేదు. కోవిడ్ డ్యూటీలకు హాజరైన వారికి ఇతర రాష్ట్రాల్లో ప్రోత్సహకాలు ఇస్తున్నారు. మాకు ఇలాంటివి ఏం అందడం లేదు. మా ప్రాణాలను పణంగా పెట్టి సేవలు అందిస్తున్నాం. ఇలాంటి పరిస్థితుల్లో మేం ఎలా వర్క్ చేయగలం సార్’’ అంటూ ట్వీట్ చేశారు. We have brought this issue to Hon’ble CM’s notice and he has issued orders to Health secretary to enhance stipends of house surgeons and PGs by 15% GOs being issued today https://t.co/A88ptZfbut — KTR (@KTRTRS) May 18, 2021 ఈ ట్వీట్‌పై మంత్రి కేటీఆర్ స్పందించారు. ‘‘హౌస్ సర్జన్లు, పీజీ వైద్యుల సమస్యలను సీఎం కేసీఆర్ దృష్టికి తీసుకెళ్లాం. వారికి 15 శాతం స్టైఫండ్ పెంచాలని హెల్త్ సెక్రటరీకి సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. ఇవాళ జీవో విడుదల అవుతుందని’’ కేటీఆర్ రీట్వీట్ చేశారు. మొత్తంగా ఇవాళ మధ్యాహ్నం 15 శాతం స్టైఫండ్ పెంపునకు సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యాయి. చదవండి: డెత్ సర్టిఫికెట్ కోసం ‘యుద్ధం’: స్పందించిన మంత్రి కేటీఆర్ -
ఏపీ: జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ పెంపు
సాక్షి, విజయవాడ: రాష్ట్రంలో ఉన్న జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ మొత్తాన్ని పెంచుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ప్రభుత్వం బుధవారం ఓ ప్రకటన విడుదల చేసింది. దీంతో హౌస్ సర్జన్, పీజీ డిగ్రీ, డిప్లొమా, డెంటల్, సూపర్ స్పెషలిటీ విద్యార్థులకు స్టైఫండ్ పెంపు వర్తిస్తుంది. స్టైఫండ్ పెంపు వివరాలు.. ఎంబీబీఎస్ విద్యార్థులకు రూ.19,589, పీజీ డిగ్రీ విద్యార్థులకు మొదటి ఏడాది రూ.44,075, రెండో ఏడాది రూ.46,524, ముడో ఏడాది రూ.48, 973 పెరగనుంది. అదే విధంగా పీజీ డిప్లొమా విద్యార్థులుకు మొదటి రూ.44,075, రెండో ఏడాది రూ.46524 పెంపు వర్తిస్తుంది. సూపర్ స్పెషలిటీ విద్యార్థులకు మొదటి ఏడాది రూ.48,973, రెండో ఏడాది రూ.51,422, మూడో ఏడాది రూ.53,899 పెరగనుంది. ఎండీఎస్ విద్యార్థులకు మొదటి ఏడాది రూ.44,075, రెండో ఏడాది రూ.46,524, మూడో ఏడాది రూ.48,973 పెంచినట్లు ప్రభుత్వం పేర్కొంది. -
జూనియర్ లాయర్లకు నెలకు రూ.5 వేలు
సాక్షి, అమరావతి: మరో ఎన్నికల హామీ అమలుకు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జూనియర్ లాయర్ల (అడ్వకేట్)కు నెలకు రూ.5000 చొప్పున స్టైఫండ్ ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో వైఎస్ జగన్ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ హామీని వచ్చే నెల 2వ తేదీన పూర్తి స్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలకు ఆయన ఆమోదం తెలిపారు. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో స్థిరత్వం పొందే వరకు అంటే మూడేళ్ల పాటు నెలకు 5000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన జీవోను ఈ నెల 14వ తేదీన ప్రభుత్వం జారీ చేయనుంది. అర్హులైన జూనియర్ అడ్వకేట్స్‌కు వచ్చే నెల 2వ తేదీన నిర్దేశించిన బ్యాంకు అకౌంట్లలో ఆ మేరకు నగదు జమ చేయనున్నారు. ఆ మరుసటి రోజు అంటే వచ్చే నెల 3వ తేదీన లబ్ధిదారులకు నగదు జమకు సంబంధించిన రశీదులతో పాటు ముఖ్యమంత్రి సందేశాన్ని వలంటీర్లు డోర్ డెలివరీ చేయనున్నారు. దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గ్రామ, వార్డు వలంటీర్లకు పంపిస్తారు. తనిఖీల అనంతరం అర్హులైన దరఖాస్తుదారుల వివరాలను పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్ కమిషనర్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలకు పంపుతారు. వారు పరిశీలించాక జిల్లా కలెక్టర్ల ఆమోదానికి పంపుతారు. అర్హులైన వారి వివరాలను సీఎఫ్ఎంఎస్ పోర్టల్‌లో ఉంచుతారు. అర్హులైన జాబితాలను సామాజిక తనిఖీ నిమిత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు. దరఖాస్తు దారు లా గ్రాడ్యుయేషన్ డిగ్రీ పొంది ఉండాలి. దరఖాస్తుదారు పేరు రాష్ట్ర బార్ కౌన్సిల్ సెక్షన్ 17 న్యాయవాద చట్టం 1961 ప్రకారం రోల్స్‌లో నమోదై ఉండాలి. కొత్తగా లా గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉండాలి. న్యాయవాద చట్టం 1961 సెక్షన్ 22 ప్రకారం రోల్లో నమోదైన తొలి మూడేళ్ల ప్రాక్టీసు సర్టిఫికెట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు. జీవో జారీ అయ్యే నాటికి జూనియర్ లాయర్లు ప్రాక్టీసు ప్రారంభించి తొలి మూడేళ్లు పూర్తి కాకపోతే మిగిలిన సంవత్సరాలకు స్టైఫండ్‌కు అర్హులు. 15 ఏళ్ల ప్రాక్టీసు అనుభవం కలిగిన సీనియర్ న్యాయవాదులు లేదా సంబంధిత బార్ అసోసియేషన్ నుంచి ధృవీకరణ పత్రంతో ప్రాక్టీసులో క్రియాశీలకంగా ఉన్నట్లు ప్రతి ఆరు నెలలకు జూనియర్ అడ్వకేట్స్ అఫిడవిట్‌ను సమర్పించాలి. న్యాయవాద వృత్తి నుంచి వైదొలిగినా, ఏదైనా మెరుగైన ఉద్యోగం వచ్చినా.. ఆ వివరాలను ఆన్లైన్ ద్వారా సంబంధిత అధికారులకు తెలియజేయాలి. బార్ కౌన్సిల్లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న తర్వాత రెండేళ్ల వరకు వారి సర్టిఫికెట్లు బార్ కౌన్సిల్లో ఉంచాలి. కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తింప చేస్తారు. కుటుంబం అంటే భర్త, భార్య, మైనర్ పిల్లలు. ప్రతి దరఖాస్తు దారు ఆధార్ కార్డు కలిగి ఉండాలి. జీవో జారీ చేసేనాటికి జూనియర్ న్యాయవాది 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలి. జీవో జారీ అయ్యే నాటికి తొలి మూడేళ్ల ప్రాక్టీసు పూర్తి అయి ఉంటే అనర్హులు జూనియర్ న్యాయవాది పేరు మీద నాలుగు చక్రాల వాహనం ఉంటే అనర్హులు నాన్ ప్రాక్టీసు న్యాయవాదులు అనర్హులు అర్హులు వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. లా డిగ్రీతో పాటు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం అప్లోడ్ చేయాలి. సీనియర్ న్యాయవాది ధృవీకరణతో బార్ కౌన్సిల్లో రిజిస్ట్రేషన్ అయినట్లు అఫిడవిట్ అప్లోడ్ చేయాలి. దరఖాస్తుతో పాటు ఆధార్ నంబర్‌ను పొందుపరచాలి. దరఖాస్తు దారు నిర్దేశిత బ్యాంకు ఖాతా వివరాలను తెలియజేయాలి. -
డిఎస్సీ కోసం ఉచిత శిక్షణా తరగతులు
సాక్షి, నంద్యాల : ప్రతి నిరుద్యోగిని ఉద్యోగిగా చూడాలన్న ఆకాంక్షతో నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటి నడుం కట్టింది. ఎటువంటి ఫీజులు లేకుండా, పేద విద్యార్థులకు భోజన వసతితో కూడిన నాణ్యమైన విద్యనందిస్తూ ఉద్యోగార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఏపీపీఎస్సి నిర్వహించు గ్రూప్ -2, 3, 4, వీఆర్ఓ పరీక్షలకు, రైల్వే శాఖ నిర్వహించు గ్రూప్-సి, డి, పోలీసు ఉద్యోగాలకు, డీఎస్సీ పరీక్షలకు ఈ నెల 29నుంచి నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్ వారు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులందరూ ఈ నెల 29న సోమవారం నాడు ఉదయం 9 గంటలకు శోభా హోటల్ పక్కన గల శ్రీ వెంకటేశ్వర (యస్.వి) డిగ్రీ కాలేజిలో, బస్‌స్టాండ్ పక్కన గల చిన్మయ హైస్కూల్లో తరగతులు ప్రారంభమవుతాయి. తెల్ల రేషన్ కార్డు కలిగిన అభ్యర్థులు నేరుగా సంస్థ కార్యాలయాన్ని సంప్రదించినా వారికి మరొక అవకాశం కల్పించబడను. అభ్యర్థులందరూ ఈ విషయాన్ని గమనించి తరగతులకు తప్పక హాజరు కాగలరని సంస్థ నిర్వాహకులు కుమార్ తెలిపారు. అభ్యర్థులకు సంస్థ నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహించి, శిక్షణా కాలంలో మెటీరియల్ అందిస్తారు. గ్రామీణ ప్రాంత నిరుద్యోగ అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి వారికి మరొక అవకాశం కల్పించారు. ఆసక్తి గల అభ్యర్థులు www.krishnamma.org వెబ్సైట్లో లేదా సంస్థ కార్యాలయంలో నేరుగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణా కాలంలో ప్రతి రోజూ రెండు గ్రాండ్ టెస్ట్‌లు నిర్వహించి, అందులో ప్రతిభ కనబరిచిన వారికి ప్రోత్సాహకాలు అందింస్తారు. రెండవ బ్యాచ్ కోసం గ్రూప్స్ ఉద్యోగాలకు ఈ నెల 29న సోమవారం తరగతులు ప్రారంభమవుతాయి. రైల్వే, పోలీసు, డీఎస్సీ ఉద్యోగాలకు 28వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్‌ను కానీ, సంస్థ కార్యాలయాన్ని కానీ సందర్శించాలని తెలిపారు. చిరునామా- శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నేషనల్ జూనియర్ కాలేజి వెనుక, శ్రీనివాస కాంప్లెక్స్, నంద్యాల. అభ్యర్థులు తమ సందేహాల నివృత్తి కోసం 99850 41168 నెంబర్‌ను సంప్రదించగలరు. -
ఉచిత శిక్షణా తరగతులకు జూలై 29న ప్రవేశ పరీక్ష
సాక్షి, నంద్యాల : ప్రతి నిరుద్యోగిని ఉద్యోగిగా చూడాలన్న కాంక్షతో నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటి నడుం కట్టింది. ఎటువంటి ఫీజులు లేకుండా, భోజన వసతితో కూడిన నాణ్యమైన విద్యనందిస్తూ ఉద్యోగార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఏపీపీఎస్సి నిర్వహించు గ్రూప్ -2, 3, 4, వీఆర్ఓ పరీక్షలకు, రైల్వే శాఖ నిర్వహించు గ్రూప్-సి, డి, పోలీసు ఉద్యోగాలకు, డీఎస్సీ పరీక్షలకు ఈ నెల 29(జూలై)న నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్ వారు ఉచిత శిక్షణా తరగతులకు ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. రిజిస్ట్రేషన్ చేసుకున్న అభ్యర్థులందరూ ఈ నెల 29(జూలై)న ఆదివారం నాడు ఉదయం 10 గంటలకు శోభా హోటల్ పక్కన గల శ్రీ వెంకటేశ్వర (యస్.వి) డిగ్రీ కాలేజిలో పరీక్షకు తప్పక హాజరు కాగలరని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్న పోస్టుకు 150 మార్కులకు పరీక్ష జరుగును. కట్ ఆఫ్ 100 మార్కులుగా నిర్ణయించారు. గ్రామీణ ప్రాంత నిరుపేద అభ్యర్థులు ఈ సదవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని కోరుచున్నాము. వంద మంది అభ్యర్థులను పరీక్షలో సాధించిన మెరిట్ మార్కుల ప్రకారం ఎంపిక చేసి వారికి ఉచిత శిక్షణ, భోజన వసతి, స్టయిఫండ్‌తో పాటు మెటీరియల్‌ను అందజేస్తారు. మహిళా అభ్యర్థులకు 33 శాతం మేర రిజర్వేషన్లు కల్పించడమైనది. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు ప్రతి నెలా 1000 రుపాయలు స్టయిఫండ్‌గా అందజేయుదురు. తెల్ల రేషన్ కార్డు కలిగిన అభ్యర్థులు మాత్రమే ఈ ఉచిత శిక్షణకు అర్హులు. కట్ ఆఫ్ మార్కులు సాధించని అభ్యర్థులకు సంస్థ నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణా తరగతులు నిర్వహిస్తుందని సంస్థ కార్యదర్శి తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి www.krishnamma.org వెబ్సైట్లో లేదా సంస్థ కార్యాలయంలో జూలై 27వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. శిక్షణా కాలంలో ప్రతి రోజూ రెండు గ్రాండ్ టెస్ట్‌లు నిర్వహించి, అందులో ప్రతిభ కనబరిచిన మరో 50 మందికి అదనంగా భోజన వసతి, స్టయిఫండ్ కల్పిస్తామన్నారు. రెండవ బ్యాచ్ కోసం గ్రూప్స్ ఉద్యోగాలకు ఆగస్ట్ 5వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయి. రైల్వే, పోలీసు, డీఎస్సీ ఉద్యోగాలకు ఆగస్ట్ 6వ తేదీన తరగతులు ప్రారంభమవుతాయని తెలిపారు. మరింత సమాచారం కోసం వెబ్‌సైట్‌ను కానీ, సంస్థ కార్యాలయాన్ని కానీ సందర్శించాలని తెలిపారు. చిరునామా- శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నేషనల్ జూనియర్ కాలేజి వెనుక, శ్రీనివాస కాంప్లెక్స్, నంద్యాల. అభ్యర్థులు తమ సందేహాల నివృత్తి కోసం 99850 41168, 99850 36121 నెంబర్లను సంప్రదించగలరు. -
పోటీపరీక్షలకు స్టయిఫండ్, వసతితో ఉచిత శిక్షణ
సాక్షి, నంద్యాల(ఎడ్యుకేషన్) : నేడు దేశంలో పెరుగిపోతున్న నిరుద్యోగ సమస్యకు ప్రభుత్వాలు ఎటువంటి జవాబుదారీతనం వహించట్లేదు. అడపాదడపా నోటిఫికేషన్లు వస్తున్నప్పటికీ సరైన శిక్షణ లేక యువత నిరుద్యోగులుగానే మిగిలి పోతున్నారు. ప్రతి నిరుద్యోగిని ఉద్యోగిగా చూడాలన్న కాంక్షతో నంద్యాలలోని శ్రీ క్రిష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటి నడుం కట్టింది. ఎటువంటి ఫీజులు లేకుండా, భోజన వసతితో కూడిన నాణ్యమైన విద్యనందిస్తూ ఉద్యోగార్థుల జీవితాల్లో వెలుగులు నింపుతున్నారు. ఏపీపిఎస్సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు ఆగస్ట్ 4వ తేదీన, ఉపాధ్యాయ పరీక్షల కోసం డీఎస్సీ తరగతులను ఆగస్ట్ 6న తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడును. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహించబడును. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నేషనల్ కాలేజ్ వెనుక, శ్రీనివాస కాంప్లెక్స్, నంద్యాల నందు అర్హత పరీక్షను జూలై 30 తేదీన పరీక్ష రాయదలచిన వారు www.krishnamma.org వెబ్సైట్ నందు పేర్లు నమోదు చేసుకొనగలరు. మరింత సమాచారం కోసం 99850 36121 నెంబర్‌ను సంప్రదించగలరు. -
శ్రీ క్రిష్ణమ్మ చెంతన..నిరుద్యోగులకు వంతెన..
సాక్షి, నంద్యాల(ఎడ్యుకేషన్) : ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగిన పది మంది యువకులు చాలు నాకు. దేశాన్ని పునర్నిర్మించటానికి, అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లటానికి. తన మాటలతో యువతను ఉత్తేజ పరిచారు స్వామి వివేకానంద. కొంత మంది యువకులు వారిని ఆదర్శంగా తీసుకొని తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. వివిధ పోటీపరీక్షల కోసం యువకులకు ఉచితంగా శిక్షణనిస్తున్నారు. నంద్యాలలోని శ్రీ నాగకృష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆద్వర్యంలో ఏపీపిఎస్సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించబడును. కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు జూలై 16 తరగతులు ప్రారంభం. ఉపాధ్యాయ పరీక్షల కోసం డీఎస్సీ తరగతులను జూలై 18న తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడును. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహించబడును. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నేషనల్ కాలేజ్ వెనుక, శ్రీనివాస నగర్, నంద్యాల. మరింత సమాచారం కోసం 99850 41168 నెంబర్‌ను సంప్రదించగలరు. -
ఇచట నిరుద్యోగులు...ఉద్యోగులుగా..
సాక్షి, నంద్యాల(ఎడ్యుకేషన్) : ఇనుప కండలు, ఉక్కు నరాలు కలిగిన పది మంది యువకులు చాలు నాకు. దేశాన్ని పునర్నిర్మించటానికి, అభివృద్ధి పథం వైపు తీసుకెళ్లటానికి. తన మాటలతో యువతను ఉత్తేజ పరిచారు స్వామి వివేకానంద. కొంత మంది యువకులు వారిని ఆదర్శంగా తీసుకొని తమ సేవా కార్యక్రమాలను కొనసాగిస్తున్నారు. వివిధ పోటీపరీక్షల కోసం యువకులకు ఉచితంగా శిక్షణనిస్తున్నారు. స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు కూడా తోడు కావడంతో వివేకానందుల వారి ఆలోచనలకు ప్రాణం పోశారు. కేవలం ఒక్క రూపాయి మాత్రమే తీసుకొని వివిధ రకాల పోటీ పరీక్షలకు ఉచిత శిక్షణ అందిస్తుంది. ఆ శిక్షణలో రాటుదేలిన పలువురు నేడు అత్యున్నత స్థాయిలో పదవులను అలంకరించారు. నంద్యాలలోని నాగకృష్ణమ్మ ఎడ్యుకేషనల్ సొసైటీ వారి ఆద్వర్యంలో ఏపీపిఎస్సీ నిర్వహించే గ్రూప్-2, గ్రూప్-3, గ్రూప్-4, వీఆర్ఓ ఉద్యోగాలకు నాలుగు నెలల పాటు ఉచిత శిక్షణ తరగతులు నిర్వహించబడును. కేవలం 100 మంది విద్యార్థులకు మాత్రమే ఈ అవకాశం కల్పించబడునని స్వచ్ఛంద సంస్థ నిర్వాహకులు తెలిపారు. అలాగే రైల్వే బోర్డ్ నిర్వహించే గ్రూప్-సి, గ్రూప్-డి, రైల్వే పోలీసు ఉద్యోగాలకు జూలై 16న తరగతులు ప్రారంభం. ఉపాధ్యాయ పరీక్షల కోసం డీఎస్సీ తరగతులను జూలై 18న తరగతులు ప్రారంభిస్తామని, ఈ అవకాశాన్ని ప్రతి పేద విద్యార్థి సద్వినియోగం చేసుకోవాలని సంస్థ నిర్వాహకులు గిరీష్ బాబు తెలిపారు. అభ్యర్థులకు తెల్లరేషన్ కార్డు కలిగి ఉంటే వారికి నెలకు 1000 స్టయిఫండ్(శిక్షణ భృతి) కల్పించబడును. అలాగే గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వసతితో పాటు బోజన సౌకర్యం కల్పించబడునని తెలిపారు. తరగతులు ఉదయం 9 గం. నుంచి సాయంత్రం 6గం. వరకు నిర్వహించబడును. శిక్షణా కాలంలో ఉచిత స్టడీ మెటీరియల్ అందించబడునని సంస్థ ప్రధాన కార్యదర్శి తెలిపారు. అప్లికేషన్లు లభించు స్థలం..శ్రీ క్రిష్ణమ్మ స్టడీ సర్కిల్, నంద్యాల. మరింత సమాచారం కోసం 99850 41168 నెంబర్‌ను సంప్రదించగలరు.