జూనియర్‌ లాయర్లకు నెలకు రూ.5 వేలు | YS Jagan Mohan Reddy Give Five Thousand Rupees To Junior Lawyers | Sakshi
Sakshi News home page

జూనియర్‌ లాయర్లకు నెలకు రూ.5 వేలు

Published Fri, Oct 11 2019 4:33 AM | Last Updated on Fri, Oct 11 2019 4:33 AM

YS Jagan Mohan Reddy Give Five Thousand Rupees To Junior Lawyers - Sakshi

సాక్షి, అమరావతి: మరో ఎన్నికల హామీ అమలుకు ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చారు. జూనియర్‌ లాయర్ల (అడ్వకేట్‌)కు నెలకు రూ.5000 చొప్పున స్టైఫండ్‌ ఇస్తామని ఎన్నికల ప్రణాళికలో వైఎస్‌ జగన్‌ హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆ హామీని వచ్చే నెల 2వ తేదీన పూర్తి స్థాయిలో అమలు చేయాలని ముఖ్యమంత్రి నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన విధివిధానాలకు ఆయన ఆమోదం తెలిపారు. కొత్తగా లా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసిన యువ లాయర్లు వృత్తిలో స్థిరత్వం పొందే వరకు అంటే మూడేళ్ల పాటు నెలకు 5000 రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించాలని ముఖ్యమంత్రి  నిర్ణయించారు. ఇందుకు సంబంధించిన మార్గదర్శకాలతో కూడిన జీవోను ఈ నెల 14వ తేదీన ప్రభుత్వం జారీ చేయనుంది. అర్హులైన జూనియర్‌ అడ్వకేట్స్‌కు వచ్చే నెల 2వ తేదీన నిర్దేశించిన బ్యాంకు అకౌంట్లలో ఆ మేరకు నగదు జమ చేయనున్నారు. ఆ మరుసటి రోజు అంటే వచ్చే నెల 3వ తేదీన లబ్ధిదారులకు నగదు జమకు సంబంధించిన రశీదులతో పాటు ముఖ్యమంత్రి సందేశాన్ని వలంటీర్లు డోర్‌ డెలివరీ చేయనున్నారు. దరఖాస్తులను గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా గ్రామ, వార్డు వలంటీర్లకు పంపిస్తారు. తనిఖీల అనంతరం అర్హులైన దరఖాస్తుదారుల వివరాలను పట్టణ ప్రాంతాల్లో మున్సిపల్‌ కమిషనర్లు, గ్రామీణ ప్రాంతాల్లో ఎంపీడీవోలకు పంపుతారు. వారు పరిశీలించాక జిల్లా కలెక్టర్ల ఆమోదానికి పంపుతారు. అర్హులైన వారి వివరాలను సీఎఫ్‌ఎంఎస్‌ పోర్టల్‌లో ఉంచుతారు. అర్హులైన జాబితాలను సామాజిక తనిఖీ నిమిత్తం గ్రామ, వార్డు సచివాలయాల్లో ప్రదర్శిస్తారు.

  •  దరఖాస్తు దారు లా గ్రాడ్యుయేషన్‌ డిగ్రీ పొంది ఉండాలి.
  • దరఖాస్తుదారు పేరు రాష్ట్ర బార్‌ కౌన్సిల్‌ సెక్షన్‌ 17 న్యాయవాద చట్టం 1961 ప్రకారం రోల్స్‌లో నమోదై ఉండాలి.
  • కొత్తగా లా గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసి ఉండాలి.
  • న్యాయవాద చట్టం 1961 సెక్షన్‌ 22 ప్రకారం రోల్‌లో నమోదైన తొలి మూడేళ్ల ప్రాక్టీసు సర్టిఫికెట్‌ను పరిగణనలోకి తీసుకుంటారు.
  • జీవో జారీ అయ్యే నాటికి జూనియర్‌ లాయర్లు ప్రాక్టీసు ప్రారంభించి తొలి మూడేళ్లు పూర్తి కాకపోతే మిగిలిన సంవత్సరాలకు స్టైఫండ్‌కు అర్హులు.
  • 15 ఏళ్ల ప్రాక్టీసు అనుభవం కలిగిన సీనియర్‌ న్యాయవాదులు లేదా సంబంధిత బార్‌ అసోసియేషన్‌ నుంచి ధృవీకరణ పత్రంతో  ప్రాక్టీసులో క్రియాశీలకంగా ఉన్నట్లు ప్రతి ఆరు నెలలకు జూనియర్‌ అడ్వకేట్స్‌ అఫిడవిట్‌ను సమర్పించాలి.
  • న్యాయవాద వృత్తి నుంచి వైదొలిగినా, ఏదైనా మెరుగైన ఉద్యోగం వచ్చినా.. ఆ వివరాలను ఆన్‌లైన్‌ ద్వారా సంబంధిత అధికారులకు తెలియజేయాలి.
  • బార్‌ కౌన్సిల్‌లో న్యాయవాదిగా పేరు నమోదు చేసుకున్న తర్వాత రెండేళ్ల వరకు వారి సర్టిఫికెట్లు బార్‌ కౌన్సిల్‌లో ఉంచాలి.
  • కుటుంబంలో ఒకరికి మాత్రమే వర్తింప చేస్తారు.
  • కుటుంబం అంటే భర్త, భార్య, మైనర్‌ పిల్లలు.
  • ప్రతి దరఖాస్తు దారు ఆధార్‌ కార్డు కలిగి ఉండాలి.
  • జీవో జారీ చేసేనాటికి జూనియర్‌ న్యాయవాది 35 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలి.
  • జీవో జారీ అయ్యే నాటికి తొలి మూడేళ్ల ప్రాక్టీసు పూర్తి అయి ఉంటే అనర్హులు
  • జూనియర్‌ న్యాయవాది పేరు మీద నాలుగు చక్రాల వాహనం ఉంటే అనర్హులు
  • నాన్‌ ప్రాక్టీసు న్యాయవాదులు అనర్హులు
  • అర్హులు వెబ్‌సైట్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • లా డిగ్రీతో పాటు పుట్టిన తేదీ ధృవీకరణ పత్రం అప్‌లోడ్‌ చేయాలి.
  • సీనియర్‌ న్యాయవాది ధృవీకరణతో బార్‌ కౌన్సిల్‌లో రిజిస్ట్రేషన్‌ అయినట్లు అఫిడవిట్‌ అప్‌లోడ్‌ చేయాలి.
  • దరఖాస్తుతో పాటు ఆధార్‌ నంబర్‌ను పొందుపరచాలి.
  • దరఖాస్తు దారు నిర్దేశిత బ్యాంకు ఖాతా వివరాలను తెలియజేయాలి. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement