నాటి నుంచి నేటి వరకు.. ప్రజాపథమే అజెండా | YSR Congress Party Celebrates 11th Formation Day | Sakshi
Sakshi News home page

నాటి నుంచి నేటి వరకు.. ప్రజాపథమే అజెండా

Published Fri, Mar 12 2021 2:52 AM | Last Updated on Fri, Mar 12 2021 2:15 PM

YSR Congress Party Celebrates 11th Formation Day - Sakshi

సరిగ్గా పదేళ్ల క్రితం పుట్టిన పార్టీ వైఎస్సార్‌సీపీ. తొలి ఎనిమిదేళ్లలో ఈ పార్టీ ఎదుర్కొన్నన్ని సమస్యలు, కుట్రలు, కుయుక్తులు బహుశా ఏ పార్టీ కూడా చవిచూసి ఉండకపోవచ్చు. నిరంతరం పోరాటమే. ఊపిరి సలపనివ్వని రీతిలో ప్రత్యర్థులు ఉక్కిరిబిక్కిరి చేసినా ధైర్యంగా అడుగులు ముందుకు వేసింది. అసలు సిసలు పోరాటం అంటే ఇదేననే రీతిలో ప్రజా సమస్యలపై యుద్ధమే చేసింది. పార్టీ అధినేత వైఎస్‌ జగన్‌ కృషి, పట్టుదల, కార్యదక్షతతో దాదాపు రెండేళ్ల క్రితం అత్యధిక శాతం ప్రజల మద్దతుతో అధికారం చేపట్టింది. ఇక అప్పటి నుంచి ప్రజా సంక్షేమమే లక్ష్యంగా విప్లవాత్మక పాలనకు శ్రీకారం చుట్టింది. అనతి కాలంలోనే యావత్‌ దేశం ఆంధ్రప్రదేశ్‌ వైపు చూసేలా ఇదివరకెన్నడూ కనీ వినీ ఎరుగని రీతిలో ‘సంక్షేమం – అభివృద్ధి’ రెండు కళ్లుగా భావించి పాలనను కొత్త పుంతలు తొక్కిస్తోంది.

సాక్షి, అమరావతి : ఆశయాలు అంబరాన్ని తాకితే ప్రజాదరణే పునాదిగా నిలుస్తుందని వైఎస్సార్‌సీపీ నిరూపించింది. ఆకాంక్షల ఉన్నతికి జనాభిమానమే బ్రహ్మరథం పడుతుందని.. విశ్వసనీయత, విలువలకు విశ్వమే అండగా నిలుస్తుందని  చాటి చెప్పింది. ఈ సిద్ధాంతాలే ఊపిరిగా ప్రజా క్షేత్రంలో పురుడు పోసుకున్న వైఎస్సార్‌సీపీ నేడు 11వ వసంతంలోకి అడుగు పెట్టింది. ఈ సుదీర్ఘ ప్రస్తానంలో వైఎస్సార్‌సీపీని వెంటాడిన వేధింపులు, చీకటి పర్వాలు, పైశాచిక రాజకీయం సృష్టించిన ఎదురు దెబ్బలు ఎన్నో ఉన్నాయి. మహానేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి మరణంతో ఆంధ్ర రాష్ట్రం నివ్వెరపోయింది. సంక్షేమ సారథి అకాల మరణంతో ఎన్నో గుండెలు ఆగిపోయాయి.


ఇడుపులపాయలో వైఎస్సార్‌సీపీ జెండాను ఆవిష్కరిస్తున్న వైఎస్‌ విజయమ్మ, వైఎస్‌ జగన్‌(ఫైల్‌) 

పేదవాడి బతుకును కారుచీకట్లు కమ్ముకున్నాయి. మహానేత లక్ష్యాలను ఆ తర్వాత సర్కార్లు అలక్ష్యం చేశాయి. తండ్రి ఆశయాలు తెరమరుగు చేసే ఆనాటి పాలకుల వైఖరిపై వైఎస్‌ జగన్‌ నిరసన గళమెత్తారు. నేనున్నానంటూ ముందుకొచ్చారు. వెంటాడే కుట్రలు ఛేదించుకుని ముందుకెళ్లారు. 2010 నవంబర్‌ 29న తన పార్లమెంట్‌ స్థానానికి, కాంగ్రెస్‌ పార్టీ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఆ త్యాగానికి జనం నీరాజనాలు పలికారు. కడప ఎంపీగా నిలబడి 5,45,043 ఓట్ల రికార్డు మెజారిటీతో గెలిచారు. వైఎస్సార్‌ ఆశయ సాధన దిశగా... విశ్వసనీయ రాజకీయాలకు తెరతీస్తూ 2011 మార్చి 12వ తేదీన వైఎస్సార్‌సీపీని స్థాపించారు. జన నేతగా జగన్‌ వేసిన ప్రతీ అడుగు ప్రజాక్షేత్రం వైపే కొనసాగింది.

విశ్వసనీయతకు పట్టం
ఎదురయ్యే సవాళ్లను వ్యక్తిగానే ఎదుర్కొన్న జగన్‌.. వైఎస్సార్‌సీపీని ఓ శక్తిగా మార్చారు. 2012లో జరిగిన ఉప ఎన్నికల్లో 19 స్థానాలకు పోటీ చేసి, 17 సీట్లు కైవసం చేసుకున్నారు. జన బలమే కొండంత అండగా దుర్మార్గపు రాజకీయ వ్యవస్థను ప్రశ్నించారు. పేదవాడి పక్షాన నిలబడి పోరాడారు. 2014 నాటికి ఆంధ్రప్రదేశ్‌ రాజకీయ ప్రస్తానమే మారిపోయింది. తెలుగుదేశం పార్టీ అనైతిక పొత్తులతో.. అలవికాని వాగ్దానాలతో ఎన్నికలకెళ్లింది. విలువలే ప్రధానంగా.. నిజాలే హామీలుగా వెళ్లిన వైఎస్సార్‌సీపీ అధికారానికి కూతవేటు దూరంలో నిలిచింది. 44.47 శాతం ఓట్లతో 67 సీట్లు, 8 లోక్‌సభ స్థానాలు గెలుచుకుని బలమైన ప్రతిపక్షంగా నిలబడింది. 


2019 మే 30న విజయవాడలో రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తున్న వైఎస్‌ జగన్‌ 

ప్రజా క్షేత్రమే దేవాలయం
అధికార మదం.. దౌర్జన్యం.. అవినీతి.. అక్రమాలు.. ఏకమై సాగిపోతున్న చంద్రబాబు పాలనపై విపక్ష నేతగా వైఎస్‌ జగన్‌ ఉక్కు పిడికిలి బిగించారు. అన్నదాత ఆక్రందనపై నిలదీశారు. అక్కచెల్లెమ్మలకు జరిగిన అన్యాయాన్ని ప్రశ్నించారు. పేదవాడి సంక్షేమం పచ్చ నేతల ఫలహారం అవుతుంటే హూంకరించారు. యువత ఆశలు ఆవిరవుతుంటే ధిక్కరించారు. కూడు, గూడు లేని పేదల పక్షాన స్వరం విన్పించారు. ఢిల్లీ వీధుల్లో ఆంధ్రుల హక్కులు తాకట్టు పెట్టిన టీడీపీ అన్యాయాన్ని నిగ్గదీసి అడిగారు. చినబాబు నుంచి పెదబాబు వరకు చేసిన అవినీతి కంపును కడిగేశారు. వెల్లువలా ఉద్యమాలు చేశారు. దగాపడ్డ జనానికి అండగా నిలిచారు.


ప్రమాణ స్వీకార సభలో భావోద్వేగానికి గురైన తల్లి విజయమ్మతో సీఎం వైఎస్‌ జగన్‌ 

జగన్‌ జనాభిమానాన్ని తట్టుకోలేని టీడీపీ.. దొడ్డిదారి రాజకీయాలకు తెరతీసింది. సంతల్లో పశువుల్లా 23 మంది ఎమ్మెల్యేలను అవినీతి సొమ్ముతో కొనేసింది. సమస్యలు నిలదీసే శాసనసభ సాక్షిగా విపక్షం గొంతును ఏకపక్షంగా నొక్కేసింది. దీంతో ప్రజలకు గుండె ధైర్యం చెప్పేందుకు జగన్‌ జనం బాట పట్టారు. కాలిబాటన ప్రజా జీవితానికి దగ్గరయ్యారు. ఇడుపులపాయలో మొదలైన ప్రజాసంకల్ప యాత్ర ఇచ్ఛాపురం వరకు సాగింది. జనం గుండె చప్పుడులోంచి మేనిఫెస్టో రూపొందించింది వైఎస్సార్‌సీపీ. మా మేనిఫెస్టో మాకు ఖురాన్‌.. బైబిల్‌.. భగవద్గీత.. అని చెప్పిన జగన్‌ మాటల్లో విశ్వసనీయతను జనం నమ్మారు. 50 శాతం ఓట్లతో.. 151 సీట్లు ఇచ్చి చరిత్రలో ఎన్నడూ లేనంత మెజారిటీతో అధికారం అప్పగించారు. 


పాదయాత్రలో ఓ అవ్వతో ఆప్యాయంగా.. వైఎస్‌ జగన్‌ 

విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు
ముఖ్యమంత్రిగా వైఎస్‌ జగన్‌ బాధ్యతలు చేపట్టగానే ఇదివరకెన్నడూ.. ఎక్కడా లేని విధంగా విద్యా రంగంలో సంస్కరణలకు నాంది పలికారు. నాడు–నేడు కార్యక్రమంలో ప్రభుత్వ సూళ్ల రూపు రేఖలే మారిపోతున్నాయి. తొమ్మిది రకాల మౌలిక సదుపాయాలతో కార్పొరేట్‌ పాఠశాలలకు దీటుగా వాటిని తీర్చిదిద్దుతున్నారు. రెండేళ్ల క్రితం రాష్ట్రంలో ప్రభుత్వ సూళ్లను చూసిన వారెవరైనా, ఇప్పుడు చూస్తే పోల్చుకోలేనంతగా మార్పు కనిపిస్తోంది. పర్యవసానంగా విద్యార్థుల చేరికలు భారీగా పెరిగాయి. కొన్ని పాఠశాలల్లో అయితే ఇక సీట్లు లేవు.. అని చెప్పాల్సిన పరిస్థితి నెలకొందంటే ఏ స్థాయిలో మార్పు వచ్చిందో ఇట్టే అర్థమవుతోంది. పేద పిల్లలు ఎంత వరకు చదవాలనుకుంటే అంత వరకు ప్రభుత్వమే చదివిస్తుందని ఇచ్చిన మాట మేరకు విద్యా దీవెన కింద ఫీజు రీయింబర్స్‌మెంట్‌ అందజేస్తున్నారు. గత ప్రభుత్వ బకాయిలు సైతం చెల్లించి, తాజాగా తల్లుల ఖాతాల్లో ఫీజు మొత్తం జమ చేస్తున్నారు. విద్యార్థుల హాస్టల్, వసతి ఖర్చుల కోసం వసతి దీవెన కింద ఏటా రూ.20 వేల వరకు సాయం అందిస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు విద్యా కానుక కిట్‌ అందజేస్తున్నారు. 


మన బడి నాడు–నేడులో భాగంగా ప్రభుత్వ స్కూళ్లలో ఏర్పాటు చేసే సదుపాయాలను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి  

వైద్య రంగానికి పెద్దపీట 
వైద్య రంగంలో విప్లవాత్మక రీతిలో నియామకాలు చేపట్టారు. ప్రభుత్వ ఆస్పత్రిలోకి అడుగు పెట్టగానే ఏదైనా కార్పొరేట్‌ ఆస్పత్రిలోకి వచ్చామా.. అనే రీతిలో సౌకర్యాలు, వాతావరణం ఉండేలా, మంచి వైద్యం, రోగులకు మంచి భోజనం లభించేలా దృష్టి సారించారు. ఈ మేరకు ఈ రంగంలో కూడా నాడు–నేడు కింద అభివృద్ధికి కార్యాచరణ రూపొందించి అమలు చేస్తున్నారు. ఈ పరంపరలో అవసరమైన మేరకు వైద్యులు, సిబ్బంది, టెక్నీషియన్ల నియామకాలు పూర్తయ్యాయి. ఇంకా ఎక్కడైనా అవసరం ఉంటే తీసుకోండని సీఎం అధికారులను ఇటీవల సమీక్షలో ఆదేశించారు. ప్రధానంగా ఆరోగ్యశ్రీలో ఎవరూ ఊహించని మార్పులు తెచ్చారు.


ఆరోగ్య శ్రీ కార్డును ఓ మహిళకు అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి 

పొరుగు రాష్ట్రాల్లోని కార్పొరేట్‌ ఆస్పత్రుల్లో వైద్యం చేయించుకున్నా, ఆరోగ్య శ్రీ పథకాన్ని వర్తింప చేస్తున్నారు. ఈ పథకం కింద పేదలు ఏదైనా ఆపరేషన్‌ చేయించుకున్న తర్వాత కొద్ది రోజులు పనులకు వెళ్ల లేరు. విశ్రాంతి అవసరం అవుతుంది. ఆ సమయంలో వారి జీవనభృతికి ఇబ్బంది కాకుండా ‘వైఎస్సార్‌ ఆరోగ్య ఆసరా’ కింద రోజుకు రూ.225 లేదా నెలకు గరిష్టంగా రూ.5,000 ఇస్తున్నారు. 108, 104 సర్వీస్‌ వ్యవస్థ రూపు రేఖలు మార్చారు. కొత్తగా 16 మెడికల్‌ కళాశాలల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ప్రతి గ్రామంలో, పట్టణాల్లోని వార్డుల్లో వైఎస్సార్‌ హెల్త్‌ క్లినిక్స్‌ ఏర్పాటు చేస్తున్నారు. ప్రధానంగా కోవిడ్‌–19 నేపథ్యంలో సీఎం వైఎస్‌ జగన్‌ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య రంగం మంచి ప్రగతి కనబరిచింది. 

వ్యవసాయ విప్లవం
రైతు బావుంటేనే దేశం, రాష్ట్రం బావుంటుందని భావించిన సీఎం జగన్‌.. ఆ దిశగా కీలక నిర్ణయాలు తీసుకున్నారు. రైతులు, కౌలు రైతులకు పెట్టుబడి సాయం కోసం రైతు భరోసా పథకాన్ని ప్రారంభించి, ఏటా ఈ పథకం కింద మూడు విడతల్లో రూ.13,500 ఇస్తున్నారు. ఊరూరా రైతు భరోసా కేంద్రాలు ఏర్పాటు చేశారు. నాణ్యమైన పురుగు మందులు, ఎరువులు ఇక్కడే లభించేలా చర్యలు తీసుకున్నారు. ప్రత్యేకంగా అగ్రికల్చర్‌ అసిస్టెంట్లను నియమించి రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చేలా చర్యలు తీసుకున్నారు.


రైతులకు పెట్టుబడి రాయితీ అందజేస్తున్న సీఎం వైఎస్‌ జగన్‌ 

రానున్న రోజుల్లో ప్రతి ఆర్బీకే పరిధిలో మల్టీ పర్పస్‌ ఫెసిలిటీ సెంటర్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేశారు. రైతులు పండించిన పంటకు కనీస మద్దతు ధర కల్పించడంలో భాగంగా ప్రభుత్వమే ఆ పంటలు కొనుగోలు చేసేలా సరికొత్త కార్యక్రమానికి నాంది పలికారు. రైతులకు ఉచిత పంటల బీమా అమలు చేస్తున్నారు. 9 గంటల పాటు ఉచిత విద్యుత్‌ ఇస్తున్నారు. ఆక్వా రైతులకు కూడా సబ్సిడీపై విద్యుత్‌ సరఫరా చేస్తున్నారు. ఉచిత విద్యుత్‌ పథకం సవ్యంగా అమలు చేయడానికి ఏకంగా 10 వేల మెగావాట్ల సౌర విద్యుత్‌ కేంద్రాన్ని ఏర్పాటు చేస్తున్నారు. 

సంక్షేమం, అభివృద్ధి.. రెండు కళ్లు
రాష్ట్రంలో పాలన పగ్గాలు చేపట్టినప్పటి నుంచి ముఖ్యమంత్రి  వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి సంక్షేమం, అభివృద్ధి.. రెండు కళ్లుగా భావించి ముందుకు సాగుతున్నారు. ‘అభివృద్ధి అంటే నిన్నటి కంటే నేడు బావుండటం.. నేటి కంటే రేపు మరింత బావుంటుందని నమ్మకం కలిగించడం’ అని సరికొత్త నిర్వచనం చెప్పారు. విద్య, వైద్యం, వ్యవసాయం, పాలనలో పారదర్శకత, మహిళా సాధికారతకు పెద్దపీట వేస్తూ విప్లవాత్మక పథకాలు, కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. కేవలం 20 నెలల్లోనే 90 శాతం హామీలను అమలు చేసి రికార్డు సృష్టించారు.


పేదలకు కట్టించే ఇంటి నమూనాను పరిశీలిస్తున్న ముఖ్యమంత్రి 

జగన్‌ పాలనకు జనం నీరాజనం
ఇంటిముందుకే వచ్చిన సంక్షేమాన్ని చూసి ప్రజలు జగన్‌ను గుండెల్లో నింపుకుంటున్నారు. భరోసా దక్కిన రైతన్న ముఖంలో చిరునవ్వు కన్పిస్తోంది. పిల్లలను బడికి పంపే అమ్మలో గుండె ధైర్యం నెలకొంది. ఉపాధి దక్కుతుందన్న నమ్మకం యువతలో పెరిగింది. ఆరోగ్య శ్రీ అండ ఉందనిపేదవాడు భావిస్తున్నాడు. బడుగు, బలహీన వర్గాల్లో అభివృద్ధి ఆనందం తొణికిసలాడుతోంది. ఇంటికే వచ్చి ఏం కావాలో తెలుసుకునే గ్రామ సచివాలయ వ్యవస్థ.. ఊళ్లోనే బడి.. ఆస్పత్రి.. మౌలిక సదుపాయాలతో మెరుగైన పల్లెలు.. 21 నెలల్లోనే జగన్‌ సాధించిన విజయాలు. అందుకే పంచాయతీ ఎన్నికల్లో పార్టీకి 80 శాతం ప్రజా మద్దతు లభించింది. పురపాలక ఎన్నికల్లోనూ ఫ్యాన్‌ స్పీడ్‌ను జనమే పెంచారు. తమ కోసం ఎందాకైనా.. అంటూ తెగించే నేత కోసం ఈ బంధం, ప్రస్థానం ఇంకెన్నాళ్లయినా ఇలానే కొనసాగుతుందని ప్రజలు  చెబుతున్నారు.


ఇంటింటికీ రేషన్‌ ప్రారంభ కార్యక్రమానికి హాజరైన అక్కచెల్లెమ్మలు 

‘ఆమె’ సంక్షేమమే లక్ష్యం
వైఎస్‌ జగన్‌ 21 నెలల పాలనలో మహిళల పట్ల అడుగడుగునా అత్యంత శ్రద్ధ కనిపించింది. మహిళల రక్షణ, సంక్షేమం కోసం విప్లవాత్మక రీతిలో పథకాలు, కార్యక్రమాలు అమలు చేస్తున్నారు. భద్రత కోసం ‘దిశ’ చట్టం తీసుకొచ్చేందుకు అసెంబ్లీలో బిల్లు పాస్‌ చేసి కేంద్రానికి పంపారు. ప్రత్యేకంగా దిశ పోలీసుస్టేషన్లు ప్రారంభించారు. దిశ యాప్‌ కూడా అందుబాటులోకి తీసుకొచ్చారు. ఏదైనా సమస్య ఎదురైనప్పడు ఈ యాప్‌ ఉపయోగిస్తే పోలీసులు వెంటనే చేరుకుని రక్షణ కల్పిస్తారు. రక్షణ పరంగా ఇతరత్రా పలు చర్యలు తీసుకున్నారు. నామినేటెడ్‌ పదవులు, నామినేషన్‌ పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్‌ కల్పిస్తూ ఏకంగా చట్టం చేశారు. దీంతో ఎవరూ ఊహించని విధంగా మామూలు సగటు మహిళలు ఎంతో మందికి ఇవాళ మార్కెట్‌ యార్డ్‌ చైర్‌పర్సన్‌లు, పలు కార్పొరేషన్ల చైర్‌పర్సన్లు, డైరెక్టర్‌ పదవులు  దక్కాయి.

ప్రభుత్వ పథకాల లబ్ధిదారులుగా మహిళలకే అవకాశం కల్పించారు. పిల్లలను బడికి పంపే ప్రతి పేద తల్లికి ఏటా అమ్మ ఒడి కింద రూ.15 వేలు ఇస్తున్నారు. ప్రధానంగా రాష్ట్రంలో ఇటీవల 30 లక్షలకు పైగా ఇళ్ల స్థలాలు పంపిణీ చేసి.. వారందరికీ ఇళ్లు కట్టించి ఇచ్చే కార్యక్రమానికి నాంది పలికారు. ఈ పథకం కింద మహిళల పేరుతోనే పట్టాలు ఇవ్వడం గమనార్హం. వైఎస్సార్‌ చేయూత, వైఎస్సార్‌ ఆసరా పథకాల కింద అందజేసిన సొమ్ముకు తోడు బ్యాంకు రుణాలు అందజేసి మహిళలు చిరు వ్యాపారాలు ప్రారంభించేలా తోడ్పాటు అందిస్తున్నారు. ఇందులో భాగంగా ప్రభుత్వం పెద్ద పెద్ద కంపెనీలతో ఒప్పందాలు చేసుకుంది. సున్నా వడ్డీ పథకాన్ని కూడా ప్రభుత్వం తిరిగి ప్రారంభించింది. ఇటీవల బాలికల ఆరోగ్యంపై అత్యంత శ్రద్ధ చూపుతూ.. ప్రభుత్వ విద్యా సంస్థల్లో 7–12 తరగతుల బాలికలకు శానిటరీ న్యాప్కిన్లు పంపిణీ చేసే కార్యక్రమాన్ని సీఎం లాంఛనంగా ప్రారంభించారు. జూలై నుంచి ఈ కార్యక్రమం అమలు కానుంది.  

పాలనలో పారదర్శకత
గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటు.. అనంతరం వాటి పనితీరుతో ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ పాలన దక్షతపై దేశ వ్యాప్తంగా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. గ్రామాల్లో ప్రతి 50 ఇళ్లకు, పట్టణాల్లో ప్రతి 100 ఇళ్లకు ఒక వలంటీర్‌ను నియమించి.. ప్రభుత్వ పథకాలను లబ్ధిదారుల ఇళ్ల వద్దకే తీసుకెళ్లిన ఘనత సీఎం జగన్‌కే దక్కుతుంది. ప్రతి పథకానికి నిర్ణీత కాల వ్యవధిలో కులం, మతం, ప్రాంతం, పార్టీ చూడకుండా.. అర్హత ఉన్న వారందరికీ ప్రభుత్వ పథకాలు వర్తింప చేస్తున్నారు.


సీఎంగా తొలి సంతకం చేస్తూ.. 

తనకు ఓటు వేయని వారైనా సరే అర్హత ఉంటే పథకాలు అందించాల్సిందేనని సీఎం చెబుతున్నారు. బియ్యం కార్డు, పింఛన్‌ కార్డు, ఆరోగ్యశ్రీ కార్డు.. ఇలా ఏదైనా సరే వలంటీర్లే లబ్ధిదారుల వద్దకు వెళ్లి వివరాలు కనుక్కుని ఆయా పథకాలు వారికి అందేలా చేస్తున్నారు. సరిగ్గా ప్రతి నెలా 1వ తేదీ ఉదయాన్నే అవ్వాతాతలు, ఇతరులకు సామాజిక పింఛన్లు పంపిణీ చేస్తున్నారు. గ్రామ, వార్డు సచివాలయాల్లో శాశ్వత సిబ్బందిని నియమించారు. వలంటీర్లతో కలుపుకుని ఏకంగా 4 లక్షలకు పైగా ఉద్యోగావకాశాలు కల్పించారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement