వైద్యశాఖ నిర్ణయం.. హౌస్‌సర్జన్లకు శాపం | health department decision curse for house surgens | Sakshi
Sakshi News home page

వైద్యశాఖ నిర్ణయం.. హౌస్‌సర్జన్లకు శాపం

Published Mon, Feb 9 2015 3:26 AM | Last Updated on Sat, Sep 2 2017 9:00 PM

health department decision curse for house surgens

 

  •      కోర్సుకాలం పొడిగింపుతో పీజీ ప్రవేశ పరీక్షకు అనర్హత
  •      600 మంది విద్యార్థులు దూరమయ్యే ప్రమాదం
  •      ఉమ్మడి పరీక్షతో ఏపీ సహా ప్రైవేటు వైద్య విద్యార్థులకే లాభం
  •      జూడాల డిమాండ్లపై కొనసాగుతోన్న జాప్యం... భద్రత నిర్ణయం గాలికి

 సాక్షి, హైదరాబాద్: జూడాలు రెండు నెలలపాటు చేసిన సమ్మె కాలాన్ని వారి కోర్సు కాలంలో అదనంగా కలుపుతూ వైద్య విద్యా శాఖ ఇచ్చిన ఉత్తర్వులు వైద్య విద్యార్థులకు శరాఘాతంగా మారాయి. ఈ నిర్ణయం వల్ల ముఖ్యంగా ఎంబీబీఎస్ హౌస్ సర్జన్ చేస్తున్న వారికి, పీజీ చివరి సంవత్సరం చేస్తున్న వారికి నష్టం కలిగిస్తుంది. ఎంబీబీఎస్ పూర్తయి హౌస్ సర్జన్‌లో ఉన్న విద్యార్థులకు మార్చి ఒకటో తేదీన పీజీ ప్రవేశ పరీక్ష ఉంది. వైద్య విద్యాశాఖ కోర్సు కాలం పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడంతో ఉస్మానియా, గాంధీ, వరంగల్ ఎంజీఎం, ఆదిలాబాద్ రిమ్స్‌కు చెందిన 600 మంది హౌస్‌సర్జన్ విద్యార్థులు అర్హత కోల్పోతారు. ఒకటో తేదీ దగ్గర పడుతున్నా వైద్యవిద్యాశాఖ అధికారులు మాత్రం పొడిగింపు ఉంటుందని... ఏమాత్రం వెనక్కు తగ్గేది లేదని తెగేసి చెపుతుండటంతో విద్యార్థులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. రెండు రాష్ట్రాలకు కలిపి ప్రవేశ పరీక్ష ఉంటున్నందున ఈ  నిర్ణయంతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యార్థులు, మొత్తం ప్రైవేటు కాలేజీ వైద్య విద్యార్థులు ముందుకు పోతారని... తాము పొందాల్సిన పీజీ సీట్లు వారు దక్కించుకుంటారని జూడా నేతలు ఆవేదన చెందుతున్నారు. ఇదిలావుంటే వైద్య పీజీ కోర్సు మే నెలలో పూర్తి కావాలి. ప్రభుత్వ నిర్ణయంతో జూలైలో పూర్తికానుంది. పీజీ తర్వాత సూపర్ స్పెషాలిటీ ప్రవేశ పరీక్ష ఉంటుంది. పొడిగింపు వల్ల ఆ పరీక్షకు అర్హత కోల్పోతామన్న భయాందోళనలు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలో ప్రభుత్వం కలగజేసుకొని ఈ ఉత్తర్వులను వెనక్కు తీసుకోవాలని, సమ్మె కాలాన్ని హాజరైనట్లుగా గుర్తించాలని జూడాల రాష్ట్ర కన్వీనర్ శ్రీనివాస్ కోరుతున్నారు.
 స్టైఫెండ్ ఏరియర్స్‌పై అస్పష్టత
 జూడాల ఐదు కీలక డిమాండ్లలో ప్రభుత్వం నాలుగింటిని ఒప్పుకుంది. ఆ డిమాండ్లకు సంబంధించిన ఫైలు ఆర్థికశాఖ నుంచి సీఎం వద్దకు వెళ్లింది. దాదాపు నెల రోజులు కావస్తున్నా ఆ ఫైలుపై సంతకం కాలేదు. ప్రధానంగా 15 శాతం స్టైఫెండ్ పెంచాలన్న డిమాండ్ కూడా ప్రభుత్వం ఒప్పుకున్న దాంట్లో ఉంది. వాస్తవంగా గత ఏడాది జనవరి నుంచి ఈ పెంపుతో స్టైఫెండ్ రావాలి. అప్పటినుంచి ఏరియర్స్ ఇవ్వాలి. కానీ ఇప్పటివరకు ఎటువంటి నిర్ణయం వెలువడ లేదు. దీనిపై ఇటీవల వైద్య ఆరోగ్య మంత్రి లక్ష్మారెడ్డిని జూడా నేతలు కలిశారు. పరిష్కరిస్తామని చెప్పారు గాని ఆచరణకు నోచుకోలేదని విమర్శిస్తున్నారు. అలాగే జూడాలపై ఇటీవలి కాలంలో దాడులు పెరిగాయని, భద్రత కోసం స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ (ఎస్‌పీఎఫ్)ను ఏర్పాటు చేస్తామని హామీ ఇచ్చినా అమలుకు నోచుకోలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement