కోల్‌కతా వైద్యవిద్యార్థిని హంతకుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్
సాక్షి నెట్‌వర్క్: రాష్ట్రవ్యాప్తంగా శుక్రవారం జూనియర్ డాక్టర్లు ఆందోళన చేశారు. పలుచోట్ల విధులు బహిష్కరించారు. కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ మెడికల్ కాలేజీలో ట్రైనీ డాక్టర్‌పై జరిగిన లైంగికదాడి, హత్యపై తీవ్ర నిరసన వ్యక్తం చేశారు. ర్యాలీలు, ప్రదర్శనలు, మానవహారాలు, రాస్తారోకోలు నిర్వహించారు. హత్యకు గురైన వైద్యురాలి ఆత్మకు శాంతి కలగాలంటూ కొవ్వొత్తులతో ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విచారణను సత్వరం పూర్తిచేసి దోషుల్ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైద్య సిబ్బందికి పూర్తి భద్రత కల్పించాలని, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.
సెంట్రల్ ప్రాటెక్షన్ యాక్ట్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. విశాఖపట్నంలోని ఆంధ్ర మెడికల్ కళాశాల జూనియర్ డాక్టర్ల ఆధ్వర్యంలో ఆర్కేబీచ్ నుంచి వైఎంసీఏ వరకు ర్యాలీ జరిగింది. ర్యాలీలో వైద్య సంఘాలు, వైద్య సిబ్బంది, విద్యార్థి యూనియన్లు, ఇతర స్వచ్ఛంద సంస్థల వారు పాల్గొన్నారు. కర్నూలులో జూనియర్ డాక్టర్ల సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్ నుంచి రాజ్‌విహార్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. రాజ్‌విహార్ సెంటర్‌లో మానవహారంగా ఏర్పడి రాస్తారోకో చేసి, ర్యాలీగా మెడికల్ కాలేజిలోని ధర్నా శిబిరానికి చేరుకున్నారు.
చిత్తూరులోని జిల్లా ఆస్పత్రిలో పీజీ డాక్టర్లు అత్యవసర సేవలకు మినహాయింపు ఇచ్చి ఓపీ సేవల్ని బంద్ చేశారు. అనంతరం ధర్నా నిర్వహించారు. విజయవాడలో నిర్వహించిన ఆందోళనలో సిద్ధార్థ, నిమ్రా, పిన్నమనేని సిద్ధార్థ, ఎన్‌ఆర్‌ఐ, ఎయిమ్స్ మంగళగిరి వైద్య కళాశాలల జూనియర్ వైద్యులు, అసోసియేషన్ ఆఫ్ ఓరల్ అండ్ మాక్సిల్లో ఫేషియల్ సర్జన్స్ ఆఫ్ ఇండియా, ఇండియన్ డెంటల్ అసోసియేషన్, మెడికల్ రిప్స్ అసోసియేషన్, గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఏపీ వంటి సంఘాల నుంచి పెద్ద ఎత్తున వైద్యులు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు.
మరణించిన వైద్యురాలి ఆత్మకు శాంతికలగాలంటూ కొవ్వొత్తులతో ఎంజీ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. వైద్యులపై జరుగుతున్న దాడులపై స్కిట్స్ ప్రదర్శించారు. విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యవసర వైద్యసేవలను, క్యాజువాలిటీ, లేబర్‌రూమ్, ఐసీయూల్లో విధులను బహిష్కరించారు. దీంతో అత్యవసర కేసులను మాత్రమే చేర్చుకున్నారు. నెల్లూరు ప్రభుత్వ మెడికల్ కళాశాలకు అనుబంధంగా ఉన్న పెద్దాస్పత్రిలో జూనియర్ డాక్టర్లు వైద్యసేవలను నిలిపేశారు.
రెండోరోజు శుక్రవారం కూడా జూనియర్ డాక్టర్లు, పీజీ విద్యార్థులు, మెడికల్ కళాశాల, పెద్దాస్పత్రి ప్రాంతంలో ర్యాలీ నిర్వహించి ఆస్పత్రి ఆవరణలో ధర్నా చేశారు. రాత్రి మరోసారి జీటీ రోడ్డులో ర్యాలీ నిర్వహించారు. కడపలోని రిమ్స్ ఆస్పత్రి ఆవరణలో జూనియర్ డాక్టర్లు నిరసన వ్యక్తం చేశారు. తిరుపతిలోని రుయా, స్విమ్స్ వైద్యులు నిరసన ర్యాలీ నిర్వహించి ధర్నా చేశారు. ఒంగోలులో ప్రభుత్వ మెడికల్ కాలేజీకి చెందిన జూనియర్ వైద్యులు క్యాండిల్ ర్యాలీ నిర్వహించారు.
24 గంటలు సాధారణ వైద్యసేవల బంద్
ఆర్‌జీ కర్ ఘటనకు నిరసనగా ఐఎంఏ నిర్ణయం
సాక్షి, అమరావతి: కోల్‌కతాలోని ఆర్‌జీ కర్ కళాశాలలో వైద్య విద్యార్థినిపై అత్యాచారం, హత్యకు నిరసనగా శనివారం వైద్యసేవల్ని బంద్ చేయాలని ఇండియన్ మెడికల్ అసోసియేషన్ (ఐఎంఏ) నిర్ణయించింది. దీనికి వివిధ వైద్యసంఘాలు మద్దతుగా నిలిచాయి. దీంతో అన్ని ఆస్పత్రుల్లో శనివారం వైద్యసేవలు నిలిచిపోనున్నాయి. శనివారం ఉదయం 6 గంటల నుంచి ఆదివారం ఉదయం 6 గంటల వరకు 24 గంటలపాటు అత్యవసర వైద్యసేవలు మినహా మిగిలిన సేవలను బహిష్కరిస్తున్నట్టు ఐఎంఏ రాష్ట్ర జనరల్ సెక్రటరీ డాక్టర్ ఫణిధర్ ఒక ప్రకటనలో తెలిపారు.
ఈ ఘటనపై విచారణను వేగవంతంగా పూర్తిచేయాలని, ప్రత్యేకకోర్టు ఏర్పాటు చేసి నేరస్తులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైద్యులపై ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలోను వైద్యసిబ్బంది రక్షణ చట్టాన్ని సవరించి కఠినతరం చేయాలని డిమాండ్ చేశారు. నిరసన అనంతరం ప్రభుత్వాలు తీసుకునే చర్యల ఆధారంగా తమ కార్యాచరణను ప్రకటిస్తామని తెలిపారు.
వైద్యుల న్యాయమైన డిమాండ్లకు ప్రజలు, ప్రజాసంఘాలు, అన్ని రాజకీయ పక్షాలు మద్దతు పలకాలని ఆయన కోరారు. మహిళా ఆరోగ్య సంరక్షణ నిపుణులు ఎక్కువగా హింసకు గురవుతున్నారని అసోసియేషన్ ఆఫ్ సర్జన్స్ ఆఫ్ ఇండియా (ఏఎస్‌ఐ) ఏపీ చాప్టర్ చైర్మన్ డాక్టర్ కె.శివశంకరరావు ఒక ప్రకటనలో తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment