జ్యోతి ప్రజ్వలన చేసి సదస్సును ప్రారంభిస్తున్న ముఖ్యఅతిథులు
తిరుపతి సిటీ : తిరుపతి ఇప్పటికే నాలెడ్జ్ హబ్‌గా పేరుగాంచిందని, త్వరలో నాలెడ్జ్ క్యాపిటల్‌గా తయారవుతుందని ఐజర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంతను భట్టాచార్య చెప్పారు. ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ ఆడిటోరియంలో గురువారం సుస్థిర గ్రామీణ జీవనోపాధి సాధనపై జరిగిన జాతీయ సదస్సుకు దేశంలోని పలు వెటర్నరీ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వీసీలు, విభాగాల డైరెక్టర్లు, డీన్‌లతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ అనేక ఏళ్లుగా జంతు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు.
దేశంలో జీవనోపాధికోసం గ్రామీణ ప్రజలు సగటున రోజుకు 30 మంది పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారని, సుస్థిర గ్రామీణ జీవనోపాధికోసం వర్సిటీలు ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. జంతు సంరక్షణపై దృష్టి సారించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యాధి మూలాలకు పరిష్కార మార్గాలను కనుగొనాలని పిలుపునిచ్చారు. అనంతరం సదస్సుకు హాజరైన వీసీలు మాట్లాడుతూ మొబైల్ యాప్స్ ద్వారా రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించి వారి ప్రమాణాలను మెరుగుపర్చాలని సూచించారు.
పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై జాతీయ సదస్సు దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. పరిశోధనల సంపుటిని ఆవిష్కరించి, అనంతరం శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు పలు అంశాలపై వక్తలు అవగాహన కల్పించారు. సదస్సులో కర్ణాటక బీదర్ వర్సిటీ వీసీ కేసీ వీరన్న, తిరుపతి పద్మావతీ మహిళా వర్సిటీ వీసీ డి భారతి తదితరులు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment