knowledge
-
సంపదలు సత్కార్యాలకు ద్వారాలు
సాధారణంగా సంపద అంటే డబ్బులు అనుకుంటారు. కాని, సనాతన ధర్మం ఎప్పుడు కాగితం ముక్కల్ని కాని, లోహపు బిళ్ళలని కాని ధనంగా పరిగణించినట్టు కనపడదు. అష్టలక్ష్ములు అని చేప్పే సంపదలు ఏవైతే ఉన్నాయో వాటిని మాత్రమే ధనంగా చెప్పటం జరిగింది. సత్కార్యాలు చేయటానికి చేతి నిండుగా డబ్బు లేదే అని బాధ పడ నవసరం లేదు. మనకి ఎన్నో రకాలైన సంపదలు ఉన్నాయి. వాటిని సద్వినియోగం చేయవచ్చు.సంపదలు ఉంటే ఎన్నో సత్కార్యాలు చేయవచ్చు అంటే ఆశ్చర్యం అనిపిస్తుంది. సంపదలు అనుభవించటానికి మాత్రమే అని లోకంలో ఉన్న అభిప్రాయం. కానీ, అవి ఎన్ని పనులు చేయటానికో సాధనాలు. దురదష్టవంతులు, దుర్మార్గులు అయినవారికి పతనానికి హేతువులుఅవుతాయి. సంపద అంటే ఇతరులకి ఎంత ఇచ్చినా తరగనంత ఉన్నది. తాను అనుభవించటానికి లేదే అని కొద్దిగా కూడా బాధ పడవలసిన అవసరం లేనంత ఉండటం. ఎవరికైనా ఇవ్వాలంటే ముందు తన దగ్గర ఉండాలి కదా! ఇవ్వాలని ఉద్దేశం ఉంది కాని, తన దగ్గర తగినంత లేక పోతే ఏమి చేయగలరు ఎవరైనా? అందువల్ల ఎవరికైనా సహాయం చేయాలంటే తగినంత సమకూర్చుకోవలసి ఉంటుంది. అన్నిటిని మించి ఆరోగ్యవంతమైన శరీరం ఉంది. దానితో శారీరకంగా బలహీనంగా ఉన్న వారికి సహాయం చేయ వచ్చు. బలహీనుడు మరొకరికి చేయూత నివ్వలేడు కదా! కనీసం ఈ సంపదని పెంపొందించు కోవచ్చు. ఆపదలో ఉన్న వారిని ఆదుకోవటం కోసమైనా ఆరోగ్యంగా, బలంగా ఉండాలి. అదీ కాక పోయినా, తాను ఇతరుల పైన ఆధార పడి ఉండకుండా ఉంటే అదే పెద్ద సహాయం. (నట్టింటి నుంచి.. నెట్టింటికి..)మరొక ప్రధాన మైన సంపద జ్ఞానసంపద. ఇతరులకి జ్ఞానాన్ని పంచాలి అంటే తన దగ్గర ఉండాలి. ఎంత చదువుకుంటే ఏం లాభం? అంటూ ఉంటారు చాలా మంది. నిజమే! దానిని ఎవరికి పంచక, తన జీవితంలో ఉపయోగపరచక పోతే వ్యర్థమే. సార్థకం చేసుకోవాలంటే తనకున్న జ్ఞానాన్ని వీలైనంత మందికి పంచుతూ పోవాలి. ఈ మాట అనగానే నాకు పెద్ద పెద్ద డిగ్రీలు లేవు నేనేం చేయ గలను? అంటారు. జ్ఞానం అంటే కళాశాలలలోనో, విశ్వవిద్యాలయాలలోనో చదివితే వచ్చేది కాదు. ఆ చదువు సహజంగా ఉన్న దానికి సహకరించ వచ్చు. అనుభవంతో, లోకాన్ని పరిశీలించటంతో వచ్చేది ఎక్కువ. ఆ జ్ఞానాన్ని తన వద్దనే ఉంచుకోకుండా పదిమందికి పంచితే నశించకుండా తరువాతి తరాలకి అందుతుంది. అందుకే ధర్మశాస్త్రాలు కూడా ఏదైనా విషయంలో కలిగిన సందేహానికి పరిష్కారం గ్రంథాలలో లభించక పోతే ఆ కుటుంబంలో వృద్ధురాలైన మహిళని అడగమని చెప్పాయి. అనుభవ జ్ఞానం అంత గొప్పది. అన్నిటినీ మించినది ప్రేమ. దీనితోఎన్నిటినో సాధించవచ్చు. ఈ సంపద పంచిన కొద్ది పెరుగుతూ ఉంటుంది. మనం ఇచ్చినదే మన సంపద. దాచుకున్నది ఏమవుతుందో తెలియదు. మనం అన్ని విధాలా సంపన్నులం అయే మార్గం తెలిసింది కదా! శారీరికంగా ఏమీ చేయలేనప్పుడు ఏ మాత్రం కష్టపడకుండా చేయగలిగిన సహాయం కూడా ఉంది. అది మాట సాయం. ఏదైనా సమస్య వచ్చినప్పుడు ఏం చేయాలో తెలియని స్థితిలో ఉన్న వారికి మాట సహాయం చేయవచ్చు. తాను చేయ లేక పోయినా, చేసే వారిని చూపించ వచ్చు. అది కూడా తనకి అందుబాటులో లేక పోతే కష్టంలో ఉన్నప్పుడు ఓదార్పుగా ఒక్క మాట చెపితే ఎంతో ధైర్యం కలుగుతుంది. మాట్లాడితే నోటి ముత్యాలు రాలిపోవుగా! ఇదీ చేయటం రాక పోతే ఊరకున్నంత ఉత్తమం లేదు. పిచ్చి మాటలు మాట్లాడి చెడగొట్టకుండా ఉండటం కూడా గొప్ప సహాయమే అంటారు తెలిసిన పెద్దలు. నేర్పుగా మాట్లాడిన ఒక్క మాటతో సమస్యల పరిష్కారం, బాధల నుండి ఓదార్పు దొరకటం చూస్తూనే ఉంటాం. – డా. ఎన్. అనంతలక్ష్మి -
సందిగ్ధ జ్ఞానం
జ్ఞానానికి, అజ్ఞానానికి మధ్య ఉన్నది ‘అ’భేదమే కదా అనుకుంటాం కానీ, ఆ రెండింటికీ మధ్య ఏడు సముద్రాలంత దూరం ఉంది. అజ్ఞానమనే చీకటి ఒడ్డు నుంచి, జిజ్ఞాస అనే అలల మీదుగా, జ్ఞానమనే వెలుగుల తీరం వైపు సాగే ప్రయాణంలో ఆనందమే మనకు తెప్పవుతుంది. అందుకే జ్ఞానానందమనే మాట పుట్టింది. అయితే, ఆ ఆనందాన్ని అంటిపెట్టుకుని ఒక విషాదమూ ఉంటుంది. అది ఏమిటంటే... మన ఊహకు అందనంత వయసున్న ఈ అనంతవిశ్వంలో భూమి ఒక గోళీకాయ కన్నా కూడా చిన్నదనుకుంటే, దానిపై జీవించే మనిషి నలుసుపాటి కూడా చేయడు. అతని అస్తిత్వాన్ని కాలం కొలమానంతో కొలిస్తే అది కొన్ని క్షణాలను మించదు. కనుక అనంతవిశ్వం గురించిన జ్ఞానం సంగతలా ఉంచి, ఈ భూమి గురించి, ఈ భూమి మీద తన మనుగడ గురించిన జ్ఞానం మొత్తాన్నే ఒక మనిషి తన జీవితకాలంలో సంగ్రహించుకోవడం అసాధ్యం. అదీ అసలు విషాదం. మనిషిలో మెదడు ఎప్పుడు వికసించిందో అప్పుడే అతనిలో విశ్వం గురించిన జ్ఞానాన్వేషణ మొదలై, వేలసంవత్సరాలుగా కొనసాగుతూనే ఉంది. చంద్రుడి వృద్ధి, క్షయాలను అనుసరించి కాలగణనాన్నీ, ఋతుభ్రమణాన్ని అనుసరించి వేటజంతువుల గుర్తింపునూ మనిషి ప్రారంభించి వాటిని ఒక పొడవాటి ఎముకపై నమోదు చేయడం నక్షత్రాలు, రాశులతో ముడిపడిన జ్యోతిర్విజ్ఞానానికి నాంది అయిందంటారు. ఆపైన మొక్కల సేకరణ నుంచి, పెరటిసాగుకు; అక్కడి నుంచి వ్యవసాయానికి సాగే క్రమంలో ఆహారవిజ్ఞానాన్ని బహుముఖాలుగా విస్తరించుకుంటూ వెళ్ళాడు. రాతిపనిముట్ల తయారీలో సాంకేతికజ్ఞానాన్ని, ఏదో అతీతశక్తి ఈ విశ్వాన్ని సృష్టించి నడిపిస్తోందన్న ఊహ నుంచి మత, ఆధ్యాత్మిక విజ్ఞానాన్ని; నియమ నిబంధనలు, కట్టుబాట్లతో కలసి జీవించడం నుంచి సంస్కృతిని సంతరిస్తూ, నిర్మిస్తూ వచ్చాడు. ఇందులో ప్రతిదీ జ్ఞానాన్వేషణలో మేలి మలుపే; జ్ఞానపు నిచ్చెన నధిరోహించడంలో నిశ్చయాత్మకమైన మెట్టే. నగరాల నిర్మాణం మీదుగా నాగరికతాదిశగా సాగిన ఈ యాత్రలో ఇంతవరకు మనిషి ఎక్కడా మడమ తిప్పింది లేదు; ఆకాశమే హద్దుగా ఆ యాత్ర ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. అయినా సరే, సంపూర్ణజ్ఞానం మనిషికి ఎప్పటికీ అందని ఎండమావిలా ఊరిస్తూనే ఉంది. కనిపించని జ్ఞానచంద్రుడి చీకటిపార్శ్వం అదే. సంకేతాల నుంచి లిపిని అభివృద్ధి చేసుకుని జ్ఞానాన్ని పుస్తక రూపంలో భద్రపరచడం ఈ క్రమంలో మరొక మెరుపుల మజిలీ. మొదట్లో విశ్వసృష్టి, దేవుడు, మతం, ఆధ్యాత్మికత, శాస్త్ర విజ్ఞానం, సాంకేతికజ్ఞానం వగైరా వింగడింపు లేకుండా తనకు తెలిసిన జ్ఞానం మొత్తాన్ని, తనకు తెలిసిన ప్రక్రియలో ఒకేచోట రాశిపోసిన ఉత్సాహం మనిషిది. అందుకే గణితశాస్త్రాన్ని కూడా పద్యాల్లో చెప్పిన పావులూరి మల్లన్నలు మన దేశంలో, మన సాహిత్యంలో కనిపిస్తారు. తర్వాత తర్వాత జ్ఞానం అనేక శాఖలు గల మహావృక్షంగా ఎదిగిపోయి, ఒక మనిషి తన జీవితకాలంలో ఏ ఒక్క శాఖనూ పూర్తిగా తేరి చూసే వీలుకుండా నిలువుగా అడ్డంగా విస్తరించిపోయింది. తన కళ్ళ ముందే ఉన్న, తన నిత్యజీవనంతో ముడిపడి ఉన్న, తన అనుభవంలోకి వచ్చే అనేక విషయాల ఆనుపానులు తెలియకుండానే మనిషి తన జీవితకాలాన్ని ముగించవలసి రావడం కన్నా పెనువిషాదం ఇంక ఏముంటుంది? ప్రసిద్ధ కథారచయిత పెద్దిభొట్ల సుబ్బరామయ్య ‘ఇంగువ’ అనే కథలో ఈ విషాదాన్నే ఒకింత హాస్యగంభీరస్ఫోరకంగా చిత్రిస్తారు. అందులో రాజశేఖరం అనే వ్యక్తిని ఇంగువ ఎలా తయారవుతుందనే ప్రశ్న చిరకాలంగా వేధిస్తూ ఉంటుంది. అతను వృద్ధాప్యంలో మంచం పడతాడు. ఒక మిత్రుడు అతణ్ణి చూడడానికి వెడతాడు. రాజశేఖరం అతి కష్టం మీద నోరు తెరచి అదే ప్రశ్న అడుగుతాడు. దానికి సమాధానం తెలుసుకోకుండానే జీవితం చాలిస్తానేమోనన్న బెంగ అతని ముఖంలో కనిపిస్తుంది. మిత్రుడు వెంటనే వెళ్ళి ఇంకో మిత్రుని కలసి సమాధానం కనుక్కొని తిరిగి వస్తాడు. కానీ అప్పటికే రాజశేఖరం కన్నుమూస్తాడు. ఇప్పటిలా ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చి, గూగుల్ శోధించి ఉంటే, ‘ఫెరులా’ అనే మొక్క నుంచి పుట్టే జిగురే గట్టిపడి ఇంగువగా తయారవుతుందనీ, ‘అసాఫోటిడా’ అనేది దాని శాస్త్రీయ నామమనీ, ఈ మొక్క ఎక్కువగా ఇరాన్ ఎడారుల్లో, అఫ్ఘానిస్తాన్, ఉజ్బెకిస్తాన్ పర్వతప్రాంతాలలో సాగవుతుందనీ రాజశేఖరం తెలుసుకుని ఉండేవాడు.అలాగని అతనికా అదృష్టం లేకపోయిందనడానికీ వీల్లేదు. ఇంటర్నెట్ ఆధారిత బహుళ మాధ్యమాలతో సమాచారవిప్లవం కొత్తపుంతలు తొక్కిందనుకునే ఈ రోజున కూడా చిన్న చిన్న సందేహాలు తీరకుండానే దేహం చాలించే రాజశేఖరాలు ఉంటూనే ఉన్నారు. జ్ఞానతీరానికి ఏ కొంచెమైనా దగ్గరవడానికి ఏ అత్యాధునిక సాధనాలూ సాయపడడం లేదు. పరిమిత జీవితకాలం అతని నిస్సహాయతను ఇప్పటికీ గుర్తుచేసి వెక్కిరిస్తూనే ఉంది. మరోవైపు సమాచార ఉల్బణం నుంచి నిక్కమైన సమాచారానికి బదులు అసత్యాలు, అర్ధసత్యాలు, వక్రీకరణలు పుట్టుకొచ్చి జ్ఞానాన్వేషణను అజ్ఞానాన్వేషణగా మార్చివేశాయి. అలా వ్యాప్తిలోకి వచ్చినదే ‘ఫేక్’ లేదా నకిలీ సమాచారమనే మాట. నేటి రాజశేఖరాలను వేధిస్తున్నది కేవలం సమాచార రాహిత్యం కాదు, నిజమో, అబద్ధమో తెలియని సమాచార సందిగ్ధం. జ్ఞాన, అజ్ఞానాల మధ్య ఆ మాత్రపు అక్షరభేదాన్ని కూడా తుడిచేసి పూర్తి అభేదాన్ని స్థాపించే యుగంలో ఉన్నాం. అదీ విషాదం! -
అజ్ఞాన జ్ఞానం
‘ఆదియందు అక్షరమున్నది’(జాన్ 1:1) అని బైబిల్ వాక్కు. అజ్ఞానం అనాది నుంచి ఉన్నది. సృష్టిలో అజ్ఞానానికి ముందు ఏముందో ఎవరికీ తెలీదు. అజ్ఞానం అమేయమైనది; అజ్ఞానం అప్రమేయమైనది; అజ్ఞానం అనాదినిధనమైనది; అజ్ఞానం అప్రయత్నలబ్ధమైనది; అజ్ఞానం అగాధమైనది; అజ్ఞానం అనంతమైనది; అజ్ఞానం అజరామరమైనది. విచిత్రంగా జ్ఞానాజ్ఞానాల నడుమ ఒక సారూప్యత ఉంది. ఇవి రెండూ అగోచరమైనవే! రెండింటికీ ఒక భేదం కూడా ఉంది. జ్ఞానానికి అవధులు ఉంటాయేమో గాని, అజ్ఞానానికి ఎలాంటి అవధులూ ఉండవు.అజ్ఞానం నుంచి మానవాళికి అప్రయత్నంగా దొరికే ఆస్తి– మూర్ఖత్వం. అజ్ఞానం నుంచి ఉద్భవించడం వల్ల మూర్ఖత్వమూ అనంతమైనదే! ‘అనంతమైనవి రెండే రెండు. ఒకటి: ఈ విశ్వం, రెండు: మనుషుల మూర్ఖత్వం; విశ్వం సంగతి నాకింకా పూర్తిగా తెలీదు’ అన్నాడు ప్రపంచ ప్రఖ్యాత భౌతిక శాస్త్రవేత్త, నోబెల్ గ్రహీత అల్బర్ట్ ఐన్‌స్టీన్. మానవ మూర్ఖత్వానికి గల అనంత తత్త్వం అవగతమయ్యే నాటికి పాపం ఆయన తలపండితుడైపోయాడు. అనంతమైన అజ్ఞాన సాగరాన్ని ఈదులాడి ఒడ్డున పడితే తప్ప జ్ఞానమేమిటో తెలియదు. చాలామందికి అజ్ఞానసాగరంలో ఈదులాడుతూ ఒడ్డునున్న వాళ్ల మీదకు అజ్ఞాన తరంగాలను వెదజల్లుతుంటారు. వాళ్లకదో వేడుక!అజ్ఞానానికి గల అనేక పర్యాయపదాల్లో ‘మాయ’ ఒకటి. ఎవరి అజ్ఞానం వారికి తెలీదు. ఎదుటివారి అజ్ఞానాన్ని గుర్తించడంలో మాత్రం ప్రతి ఒక్కరూ జ్ఞానులే! ప్రవచన ప్రసంగాల్లో అజ్ఞానాన్ని నేరుగా ప్రస్తావిస్తే, శ్రోతల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉంది. అందువల్ల ప్రవచనకర్తలు అజ్ఞానాన్ని ‘మాయ’ అని సున్నితంగా చెబుతుంటారు. ‘తస్మాదజ్ఞాన సంభూతం హృత్స్థం జ్ఞానాసినాత్మన/ ఛిత్వైనం సంశయం యోగమాతిష్ఠోత్తిష్ఠ భారత’– (4:42) అని భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్ముడు అర్జునుడికి బోధించాడు. అంటే, ‘అజ్ఞానం కలిగిన బుద్ధిలో నిలకడగా ఉన్న ఆత్మ గురించిన సందేహాన్ని జ్ఞానమనే ఖడ్గంతో ఖండించి, తత్త్వజ్ఞానానికి సాధనమైన కర్మయోగాన్ని స్వీకరించు’ అని అర్థం. బుద్ధిలో అజ్ఞానం ఉన్నట్లు శ్రీకృష్ణుడు గుర్తించి చెప్పాడు. కాబట్టి ఆయన జ్ఞాని. అజ్ఞానాన్ని ఖండించడానికి జ్ఞానఖడ్గాన్ని ప్రయోగించాలని ఆయన ఉద్బోధించాడు. శ్రీకృష్ణ పరమాత్ముడి గీతబోధ విన్న అర్జునుడు మొదలుకొని ఎందరెందరో జ్ఞానఖడ్గానికి పదునుపెట్టి అజ్ఞానాన్ని ఖండిస్తూనే ఉన్నారు. ఖండఖండాల అజ్ఞానం కొన్ని మెదళ్లలోకి చేరి, అఖండంగా పెరిగిపోతుండటమే విడ్డూరం. బహుశా, ఇదే మాయ కావచ్చు!‘ఇగ్నోరెన్స్ ఈజ్ బ్లిస్’ అని ఇంగ్లిష్ నానుడి. అంటే, అజ్ఞానమే ఆనందమన్నమాట! ఈ నానుడినే కొంత విస్తరిస్తూ, ‘అజ్ఞానమే ఆనందం అంటుంటారు గాని, అజ్ఞానం మన విధికృతం’ అని చెప్పింది అమెరికన్ రచయిత్రి, పాత్రికేయురాలు గేయిల్ లైండ్స్. విధికృతమైన వాటిని ఎవరు మాత్రం తప్పించుకోగలరు? కాబట్టి అజ్ఞానాన్ని కూడా ఎవరూ తప్పించుకోలేరు. అజ్ఞానాన్ని గురించి తెలుసుకోవాలంటే, జ్ఞానులు ఎంతో ప్రయాసతో ప్రయత్నించవలసి ఉంటుంది. అజ్ఞానులకు ఆ బెడద లేదు. తమకు అప్రయత్నలబ్ధమైన అజ్ఞానానందాన్ని నిక్షేపంగా ఆస్వాదిస్తుంటారు. అజ్ఞానాన్ని గురించి అసలు ఎందుకు తెలుసుకోవాలి? అంటే, జ్ఞానాన్ని పెంచుకోవడానికి అని చెబుతారు చాలామంది. పాపం వాళ్లు చాలా అమాయకులు. అసలు సిసలు ముదురు జ్ఞానులు కొందరు ఉన్నారు. వాళ్లు అజ్ఞానాన్ని గురించి నానా రకాల అధ్యయనాల్లో మునిగి తేలుతూ ఉంటారు. జనబాహుళ్యంలో అజ్ఞాన విస్తరణకు పనికొచ్చే పద్ధతులకు రూపకల్పన చేస్తుంటారు. వాటిని జనాల మీద ప్రయోగిస్తుంటారు. ఇదొక ప్రత్యేక శాస్త్రం. ఇంగ్లిష్‌లో దీనినే ‘ఆగ్నటాలజీ’ అంటారు. అంటే, అజ్ఞానాధ్యయన శాస్త్రం అన్నమాట! మన దేశంలోని విశ్వవిద్యాలయాలు ఈ శాస్త్రం మీద ఇంకా దృష్టి సారించలేదు గాని, అభివృద్ధి చెందిన పాశ్చాత్య దేశాల్లోని పలు విశ్వవిద్యాలయాలు ఈ శాస్త్రం మీద అధ్యయనాలు కొనసాగిస్తున్నాయి. ‘ఆగ్నటాలజీ’ అనే అజ్ఞానాధ్యయన శాస్త్రానికి ఆ పేరుతో పిలవడం ఆలస్యంగా మొదలైంది గాని, అజ్ఞానానికి సంబంధి«ంచిన పరిజ్ఞానం అంతకంటే ముందు నుంచే ఆచరణలో ఉంది. స్కాటిష్ సామాజిక చరిత్రకారుడు అయాన్ బోల్ 1992లో తొలిసారిగా ‘ఆగ్నటాలజీ’ అనే మాటను ప్రయోగించాడు. అమెరికన్ సిగరెట్ తయారీ కంపెనీలు 1969లో ఉద్ధృతంగా చేసిన ప్రచారం ఆగ్నటాలజీకి ఉదాహరణగా నిలుస్తుందని శ్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీ ప్రొఫెసర్ రాబర్ట్ ప్రోక్టర్ తేల్చిచెప్పాడు. కార్పొరేట్ సంస్థల నుంచి రాజకీయ పార్టీల వరకు నానా వర్గాలు ఆగ్నటాలజీ పద్ధతులను ఉపయోగించుకుంటూ, ప్రజల అజ్ఞానానికి జ్ఞాన ఖడ్గాల వల్ల ముప్పు లేకుండా కాపాడుతూ తమ ప్రయోజనాలను నెరవేర్చుకుంటున్నాయి.ఇది హైటెక్కు టమారాల యుగం. జ్ఞానం జనాలకు అందుబాటులో లేని సరుకేమీ కాదు. అందుబాటులో ఉన్నంత మాత్రాన జనాలందరూ జ్ఞానాన్ని పొందినట్లు కాదు. ఈ కృత్రిమ మేధ కాలంలో కూడా రాజకీయ, తాత్త్విక అంశాలకు సంబంధించిన జ్ఞానాన్ని జనాలు విశ్వాసాలు, మతాచారాలు, ప్రచారం ద్వారా మాత్రమే పొందుతున్నారు. ఇది విపరీత అజ్ఞాన శకం. పత్రికలు, ప్రసార సాధనాలు, సామాజిక మాధ్యమాలు ఆగ్నటాలజీ ప్రయోగాలకు సాధనాలుగా మారుతున్నాయి. ప్రజలను మాయలో ముంచెత్తుతున్నాయి. ‘మతములన్నియు మాసిపోవును/ జ్ఞానమొక్కటి నిలిచి వెలుగును’ అన్న గురజాడ ఆశయం ఎక్కడ? అజ్ఞానంపై శాస్త్ర పరిశోధనలు సాగిస్తున్న నేటి పరిస్థితులెక్కడ? -
సమయోచిత జ్ఞానమే.. వివేచన!
వివేచన అంటే సమయోచిత జ్ఞానం, యుక్తాయుక్త విచక్షణ, లోచూపు, శోధన, దార్శనికత, విశ్లేషణా సామర్థ్యం. ఇతరులకు తోచని, అవగాహనకు రాని సూక్ష్మాంశాలను గ్రహించగల ఓ శక్తి. ఈ వివేచన కొందరిలో మాత్రమే ఉండే ఓ అపురూపమైన శక్తి.అసలు వివేచన ఎలా ఒనగురుతుంది... అని ప్రశ్నించుకుంటే... ప్రధానంగా చదువు వల్ల పొందే జ్ఞాన, పరిజ్ఞానాల వల్ల అని చె΄్పాలి. ఈ భావాన్నే ΄ోతన‘‘జదివిన సదసద్వివేక చతురత గలుగు జదువగ వలయును జనులకు.. ’’అని హిరణ్యకశిపుని చేత పలికిస్తాడు. చదువు వల్ల జ్ఞానంతోపాటు ఔచిత్యాననౌచిత్యాలు, మంచి చెడు విచక్షణలు తెలుస్తాయి. అవి మన పలుకులో, ప్రవర్తనలో, ఆలోచనాసరళిలో అభిలషణీయమైన చక్కని మార్పు తెస్తాయి. ఈ వివేచన మన వైయుక్తిక జీవిత సుఖ సంతోషాలకు, ఆరోగ్యకరమైన సామాజిక వికాసానికి పునాదులు వేస్తుంది.విద్యనభ్యసించటం వలన వివేచన అనే శక్తిని పొందటం జరుగుతుంది. కాని ఇది ఎల్లప్పుడూ నిజం కావలసిన అవసరం లేదని లోకానుభావం, పరిశీలన చెపుతాయి. కొందరు విద్యావంతులలో కనిపించని ఈ వివేచన కొన్ని సందర్భాలలో అక్షర జ్ఞానంలేని వారెందరి లోనో కనిపించటం ఆశ్చర్యం కలిగిస్తుంది. కానీ, ఇది వాస్తవం. వారి సంభాషణల్లో, సమస్యలను పరిష్కరించే వేళల్లో సమయోచిత జ్ఞానాన్ని చూపుతూ, విచక్షణను ప్రదర్శిస్తూ వివేచనాపరులుగా పేరు తెచ్చుకున్న వారున్నారు."పంచతంత్రంలోని పావురాలు – వేటగాడి కథ వివేచనా పార్శ్వమైన ముందుచూపుని సూచిస్తుంది. ఆకాశమార్గం లో పయనించే పావురాలు భూమిపై ఒకచోట చల్లిన నూకలను చూచి, కిందకు దిగి తిందామనుకున్నప్పుడు వారిని వారించిన చిత్రగ్రీవునిలో ఉన్నది ముందుచూపే. అప్రమత్తతే. ఇవి వివేచనలోని కోణాలే . చిత్రగ్రీవుని మాటను పెడచెవిని పెట్టి ్రపాణాల మీదకు తెచ్చుకున్న మిగిలిన పావురాలలో ఉన్నది తొందరపాటుతనం, విచక్షణారాహిత్యం. జ్ఞానాన్ని సందర్భానుసారంగా ఉపయోగించగలగాలని ఈ ఉదంతం మనకు చెపుతుంది. అలాగే మూడు చేపలకథలోని దీర్ఘదర్శి అన్న చేప తన్రపాణాలను కాపాడుకున్నది ఈ ముందుచూపు వల్లే కదూ!"ఇది ఎలా సాధ్యమవుతుంది? జీవనక్రమంలో వచ్చే ఆటు΄ోట్లను తట్టుకుని, నిబ్బరంగా ఉంటూ, మనసును దిటవు చేసుకోవటంవల్ల వారికి ఇది సాధ్యమవుతుంది. అలాగే చేదు అనుభవాలు, జీవితం నేర్పిన పాఠాలు పొందిన ఇంగితజ్ఞానంతో జీవితాన్ని మరింత లోతుగా పరిశీలిస్తూ, విశ్లేషించుకునే వీరికి ఈ వివేచనాశక్తి కరతలామలకమవుతుంది.కౌరవులు పాండవులను పెట్టే ఇబ్బందులను, చేసే దుశ్చర్యలను గమనిస్తూ ఎప్పటికప్పుడు వారిని అప్రమత్తులను చేసి, రక్షించినవాడు శ్రీ కృష్ణుడు. అలా వివేచనకు గొప్ప ఉదాహరణగా నిలిచాడు. వివేచనాశీలి ఎదుటవారి మాటలను, వాటి అంతరార్థాన్ని గ్రహించగలడు. వారి మనసులో మెదిలే ఆలోచనలను పసిగట్టగలరు. వాటిని విశ్లేషించగలరు. ఇవన్నీ వివేచనకున్న కోణాలే.బెర్ట్రాండ్ రసెల్.. జ్ఞానం –వివేకం.. అన్న వ్యాసంలో ఈ రెండిటి మధ్య ఉన్న సూక్ష్మమైన భేదాన్ని ఒక ఉదాహరణతో ఎంతో స్పష్టంగా వివరించాడు. రివాల్వర్ ఎలా ఉపయోగించాలో తెలియటం జ్ఞానం. దాన్ని ఎప్పుడు వాడాలి, అసలు వాడాలా, వద్దా అన్న సందర్భానౌచిత్య నిర్ణయశక్తే వివేచన. మనలో చాలామందికి విషయం పరిజ్ఞానం ఉంటుంది. కాని ఎక్కడ ప్రదర్శించాలో, ఎక్కడ కూడదోనన్న వివేకం ఉండదు. మన ప్రతిభా నైపుణ్యాలను అసందర్భంగా ప్రదర్శించి, అవమానం పొందకూడదు. ఉచితానుచితాలు తెలుసుకుని ప్రవర్తించటం కూడా వివేచనే. సాంకేతికాభివృద్ధి... ముఖ్యంగా అంతర్జాల సాంకేతికత విశ్వాన్ని కుగ్రామం చేసింది. ఆ సాంకేతికతను అంది పుచ్చుకోవాలి. వాటి ఫలితాలు అనుభవించాలి. ఇందంతా జ్ఞానపరమైనది. అభినందనీయం. కాని సక్రమమార్గంలో ఉపయోగించుకోవటంలోనే మన వివేచన ఉంటుంది. – లలితా వాసంతి -
విదేశాల్లో ‘మినీ ఇండియా’లు?
భారత్‌కు వెలుపల అత్యధిక భారతీయ జనాభా కలిగిన దేశాలు ఏవో మీకు తెలుసా? మారిషస్, యూకే, యూఏఈ, సింగపూర్‌తో సహా పలు దేశాల్లో భారతీయులు నివసిస్తున్నారు. కొన్ని దేశాల్లో ‘మినీ ఇండియా’లు కూడా ఉన్నాయి. ఇక్కడ భారతీయుల ఇళ్లను సులభంగా గుర్తించవచ్చు. అవి ఏఏ దేశాలో ఇప్పుడు తెలుసుకుందాం. మారిషస్ మారిషస్‌లో 70శాతం జనాభా భారతీయులని తెలిస్తే ఎవరికైనా ఆశ్చర్యం కలుగుతుంది. ఇది సాంస్కృతికరంగ స్వర్గధామం. ఇక్కడ భారతీయ ఆహార ఖజానా విరివిగా కనిపిస్తుంది. ఇది విదేశాల్లో స్థిరపడాలనుకున్న భారతీయుల ఉత్తమ ఎంపిక అని అంటారు. యూకే భారతదేశం- యునైటెడ్ కింగ్‌డమ్‌ల మధ్య సాంస్కృతిక సంబంధాలు ఉన్నాయి. యూకేలో కనిపించే భారతీయ రెస్టారెంట్లు, దుకాణాలు దీనికి తార్కాణంగా నిలుస్తాయి. యూకేలో భారత సంస్కృతి కనిపిస్తుంది. యూకేలోని కొన్ని ప్రాంతాలు.. మనం భారత్‌లోనే ఉన్నామా అని అనిపించేలా ఉంటాయి. యూకేలోనూ భారతీయులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ ఎమిరేట్స్‌లో ఎక్కడికి వెళ్లినా భారతీయులు తప్పనిసరిగా కనిపిస్తారు. ఇక్కడ ఉంటే ఇండియాలో ఉన్నట్టేనని చాలామంది అంటుంటారు. యూఏఈ మొత్తం జనాభాలో భారతీయులు 42 శాతం ఉన్నారు. సౌదీ అరేబియా సౌదీ అరేబియాలోని మొత్తం జనాభాలో 10 శాతం నుంచి 13 శాతం వరకూ భారతీయులు ఉన్నారు. ప్రవాస భారతీయులు పెద్ద సంఖ్యలో ఉన్న దేశంగా సౌదీ అరేబియా గుర్తింపు పొందింది. కెనడా మెరుగైన ఉద్యోగావకాశాలు, ఉన్నత జీవన ప్రమాణాలు ఉచిత ఆరోగ్య సంరక్షణ సౌకర్యాలు తదితర అదనపు ప్రయోజనాలు భారతీయులను కెనడావైపు మళ్లేలా చేస్తున్నాయి. విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ విడుదల చేసిన అధికారిక సమాచారం ప్రకారం కెనడాలో గణనీయ సంఖ్యలో భారతీయులున్నారు. ఒమన్ ఒమన్ మొత్తం జనాభాలో ప్రవాస భారతీయులు దాదాపు 20 శాతం ఉన్నారు. 2023 నాటికి ఒమన్‌లో దాదాపు తొమ్మది లక్షల మంది భారతీయులు ఉన్నారు. ఒమన్‌లోని భారతీయులు అక్కడి సాంస్కృతిక వైభవానికి తోడ్పాటునందిస్తున్నారు. సింగపూర్ 2023లో సింగపూర్‌లో భారతీయుల జనాభా ఏడు లక్షలు. సింగపూర్ ప్రభుత్వం ‘లిటిల్ ఇండియా’ ప్రాంత అభివృద్ధికి చేయూతనందిస్తోంది. సింగపూర్ సాంస్కృతిక వైభవానికి అక్కడి భారతీయులు తోడ్పాటునందిస్తున్నారు. అమెరికా అమెరికాలో అత్యధిక సంఖ్యలో భారతీయులున్నారు. ప్రపంచంలో తమది రెండవ అతిపెద్ద భారతీయ ప్రవాసులు కలిగిన దేశమని యునైటెడ్ స్టేట్స్ పేర్కొంది. అమెరికాలో నివసిస్తున్న భారతీయులు కెరీర్‌ను మెరుగుపరుచుకోవడంలో పాటు పలు వ్యాపారాలు చేపడుతున్నారు. -
ఏ జంతువులు అంతరిక్షాన్ని చూశాయి? తాబేళ్లు, ఈగలు ఏం చేశాయి?
మనుషులే కాదు ఎన్నో జంతువులను కూడా అంతరిక్షంలోకి పంపారు. ఈగలు, కుక్కలు, ఎలుకలు, చేపలు, కోతులు, చింపాంజీలను వివిధ ప్రయోజనాల కోసం అంతరిక్షంలోకి పంపారు. జంతువులను అంతరిక్షంలోకి పంపే ప్రక్రియ 21వ శతాబ్దంలోనూ కొనసాగింది. దీని సాయంతో అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో అనేక ప్రయోగాలు నిర్వహించారు. అంతరిక్ష రంగంలో నూతన విజయాలు సాధించినప్పుడల్లా మనం శాస్త్రవేత్తల కృషిని మెచ్చుకుంటాం. అయితే పలు జంతువులు కూడా ఈ విజయంలో భాగస్వామయ్యమయ్యాయనే సంగతిని మరచిపోతుంటాం. మనుషులు అంతరిక్షంలోకి వెళ్లకముందు పలు జంతువులను అక్కడికి పంపించారు. ఆ తర్వాతే మనుషులను అక్కడికి సురక్షితంగా పంపించవచ్చని శాస్త్రవేత్తలు గ్రహించారు. ఏఏ జంతువులు అంతరిక్షంలోకి పంపారో ఇప్పుడు తెలుసుకుందాం. అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జీవులు ఈగలు, వీటిని 1947లో అమెరికా శాస్త్రవేత్తలు పంపారు. నాడు శాస్త్రవేత్తలు.. వ్యోమగాములపై ఖగోళ రేడియేషన్ ఎలాంటి ప్రభావం చూపుతుందో తెలుసుకోవాలనుకున్నారు. V-2 బాలిస్టిక్ క్షిపణిని ఉపయోగించి, 109 కిలోమీటర్ల ఎత్తుకు ఈగలను అంతరిక్షంలోకి పంపారు. పారాచూట్ ద్వారా వాటిని న్యూ మెక్సికోలో దింపారు. క్యాప్సూల్స్ తెరిచినప్పుడు ఈగలు సజీవంగా కనిపించాయి. అంతరిక్షంలోకి పంపబడిన జంతువులలో కోతుల జాతులు ఉన్నాయి. వీటిలో రీసస్ మకాక్స్, పిగ్-టెయిల్డ్ కోతులు, స్క్విరెల్-టెయిల్డ్ కోతులు, చింపాంజీలు కూడా ఉన్నాయి. ఆల్బర్ట్- II అనే పేరుగల రీసస్ మకాక్ 1949లో 134 కిలోమీటర్ల వరకూ చేరుకుంది. అయితే అది తిరిగి వస్తుండగా మృతి చెందింది. దీని తరువాత 1961 లో కోతి జాతికి చెందిన హామ్ అనే చింపాంజీని నాసా అంతరిక్షంలోకి పంపింది, అది సురక్షితంగా తిరిగి వచ్చింది. మానవ ఆరోగ్యం, ఔషధాల తయారీ మొదలైన పరిశోధనలలో ఎలుకలను ఎక్కువగా ఉపయోగిస్తారు. మానవులపై అంతరిక్ష వాతావరణం ప్రభావాన్ని తెలుసుకునేందుకు ఎలుకలను అంతరిక్షంలోకి పంపారు. ఎలుకల అంతరిక్ష అనుభవాల గురించి నాసా ఒక వివరణాత్మక అధ్యయనాన్ని కూడా నిర్వహించింది. 1950లో 137 కిలోమీటర్ల వరకు అంతరిక్షంలోకి తొలి ఎలుకను పంపారు. అయితే అది పారాచూట్ ఫెయిల్యూర్‌తో మృతి చెందింది. సోవియట్ యూనియన్ గరిష్ట సంఖ్యలో కుక్కలను అంతరిక్షంలోకి పంపింది. వాటిలో అత్యంత ప్రసిద్ధమైనది 1957లో లైకా అనే శునకం. అయితే అది భూమికి తిరిగి రాలేకపోయింది. ఇది అంతరిక్షంలోకి వెళ్లిన మొదటి జంతువుగా ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందింది. అయితే దీనికి ముందు కూడా కొన్ని కుక్కలను అంతరిక్షంలోకి పంపారు. ఆశ్చర్యంగా అనిపించినా అంతరిక్షంలోకి తాబేలును కూడా పంపిన మాట మాత్రం నిజం. 1968లో అమెరికా, సోవియట్ యూనియన్ల మధ్య చంద్రుడిపైకి వెళ్లేందుకు పోటీ నెలకొన్న నేపధ్యంలో రష్యా రెండు తాబేళ్లను జోండ్ 5 అనే అంతరిక్ష నౌకలో అంతరిక్షంలోకి పంపింది. అవి చంద్రుని చుట్టూ ఆరు రోజులు తిరిగిన తర్వాత భూమికి తిరిగి వచ్చాయి. అయితే అవి ప్రణాళిక ప్రకారం కజకిస్తాన్‌లో ల్యాండ్ కాకుండా హిందూ మహాసముద్రంలో పడిపోయాయి. అయితే వాటిని రక్షించారు. నాసా ఈ జంతువులనే కాకుండా, కప్పలు, సాలెపురుగులు (1973), చేపలు (1973), టార్డిగ్రేడ్ (2007), పిల్లి (1963) ని అంతరిక్షంలోకి పంపింది. 2012లో జపాన్ అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి చేపలను పంపింది. ఇంతేకాకుండా అనేక మొక్కలపై, ముఖ్యంగా ఆహారం తయారీపై అంతరిక్షంలో పలు ప్రయోగాలు జరిగాయి. అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రంలో సూక్ష్మజీవుల పెరుగుదలపై కూడా అనేక ప్రయోగాలు జరిగాయి. ఇది కూడా చదవండి: పుతిన్ రష్యా అధ్యక్షుడెలా అయ్యారు? -
విషయ పరిజ్ఞానమే కొలమానం
సాక్షి, అమరావతి: పాఠశాల విద్యలో విద్యార్థి వికాస చదువులకు రాష్ట్రంలో ప్రాధాన్యం పెరిగింది. పిల్లలు జాతీయ, అంతర్జాతీయంగా రాణించేలా పరీక్షల్లోను, ప్రశ్నల తీరులోను మార్పులు తీసుకొచ్చారు. అకడమిక్ మార్కులు కంటే.. విద్యార్థి మానసిక వికాసం, విశ్లేషణ సామర్థ్యాల పెంపుపై దృష్టి పెట్టారు. అందుకు అనుగుణంగా విషయ పరిజ్ఞానం అంచనా వేసేలా పరీక్షలు నిర్వహిస్తున్నారు. కొన్ని దశాబ్దాలుగా పరీక్షల్లో సంప్రదాయ ప్రశ్నల శైలి.. మార్కుల సాధనకే పరిమితమైంది. పిల్లల్లో వికాసం, విశ్లేషణ సామర్థ్యాలను అంచనా వేసే విధానం కరువైంది. దీంతో గత ఏడాది నుంచి రాష్ట్రంలో పాఠశాల విద్యాశాఖ పరీక్ష నిర్వహణ, ప్రశ్నల శైలిలో మార్పులు తీసుకొచ్చింది. మరోపక్క కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా విద్యాస్థాయిని అంచనా వేసేందుకు, అభ్యసన లోపాలను గుర్తించేందుకు వివిధ రకాల సర్వేలు చేస్తోంది. వీటిలో ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నేషనల్ అచీవ్మెంట్ సర్వే (ఎఫ్ఎల్ఎస్), నేషనల్ అచీవ్మెంట్ సర్వే ముఖ్యమైనవి. వీటిద్వారా వివిధ రాష్ట్రాల్లో విద్యార్థుల సామర్థ్యాలను, ఉపాధ్యాయుల బోధనా నైపుణ్యాలను అంచనా వేసి రాష్ట్రాలకు ర్యాంకింగ్ ఇస్తోంది. విద్యా సంవత్సరంలో నిర్వహించే ఫార్మెటెవ్, సమ్మెటివ్ అసెస్మెంట్లలో 1 నుంచి 8వ తరగతుల విద్యార్థులకు సిలబస్ ప్రకారం విశ్లేషణాత్మక ప్రశ్నలకు ప్రాధాన్యం ఇస్తోంది. ఎన్ఏఎస్ సర్వేకు అనుగుణంగా పరీక్షలు దేశవ్యాప్తంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు కేంద్ర ప్రభుత్వం నేషనల్ అచీవ్మెంట్ టెస్ట్ (ఎన్ఏఎస్), ఫౌండేషనల్ లిటరసీ అండ్ న్యూమరసీ నేషనల్ అచీవ్మెంట్ సర్వేను ఏటా చేపడుతుంది. 2021లో కేంద్రం ఎన్ఏస్, 2022లో ఎఫ్ఎల్ఎస్ నిర్వహించింది. కరోనా అనంతరం నిర్వహించిన ఈ సర్వేలో దేశవ్యాప్తంగా అభ్యసన లోపాలు ఉన్నట్టు గుర్తించి, వాటిని అధిగమించేందుకు పలు సంస్కరణలను చేపట్టి నూతన విద్యా విధానానికి అనుగుణంగా అమలు చేస్తోంది. ఇందులో భాగంగా విద్యార్థుల సామర్థ్యాలను అంచనా వేసేందుకు ఏ తరహా పరీక్షలు, ప్రశ్నలు ఉంటాయో అదే విధానాన్ని ప్రభుత్వం పాఠశాల విద్యలో గత ఏడాది నుంచి అనుసరిస్తోంది. కేంద్ర ప్రభుత్వం వచ్చే నెల 3న జాతీయ స్థాయిలో సర్వే నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తోంది. ఇందులో భాగంగా గత నెలలో అండమాన్–నికోబార్‌లో వివిధ రాష్ట్రాల అసెస్మెంట్ సభ్యులకు శిక్షణ ఇచ్చింది. అందులో రాష్ట్రాలు విద్యా ప్రమాణాలు పెంచేందుకు తీసుకుంటున్న చర్యలు, అసెస్మెంట్లో అనుసరించాల్సిన విధానాలను విడుదల చేసింది. దీనికి అనుగుణంగా సిద్ధమవ్వాల్సిందిగా రాష్ట్రాలను ఆదేశించింది. రాష్ట్ర స్థాయిలో అసెస్మెంట్ సెల్ ఏర్పాటు ప్రస్తుతం రాష్ట్రంలో ఈ తరహా పరీక్ష విధానాన్ని 2022–23 విద్యా సంవత్సరంలో ప్రవేశపెట్టారు. కేంద్రం నిర్వహించే నేషనల్ అచీవ్మెంట్ సర్వే, ఎఫ్ఎల్ఎస్ పరీక్షల తరహాలోనే రాష్ట్రంలో పరీక్ష పత్రాలను రూపొందిస్తున్నారు. ఇందుకోసం 15 మంది నిపుణులైన ఉపాధ్యాయులతో రాష్ట్ర విద్యా పరిశోధన శిక్షణ మండలి (ఎస్సీఈఆర్టీ) ఆధ్వర్యంలో ప్రత్యేక అసెస్మెంట్ సెల్ ఏర్పాటు చేశారు. విద్యార్థులు సాధించిన ఫలితాల ఆధారంగా బోధనలో సైతం మార్పులు చేస్తున్నారు. ఇందుకోసం ప్రతినెలా సబ్జెక్టు టీచర్లకు స్కూల్ కాంప్లెక్స్ శిక్షణ సైతం ఇస్తున్నారు. విద్యార్థి సామర్థ్యం అంచనాకు విశ్లేషణాత్మక ప్రశ్నలు ఒక విద్యా సంవత్సరంలో పాఠశాల విద్యాశాఖ నాలుగు ఫార్మెటివ్, రెండు సమ్మెటివ్ (ఆరు) అసెస్మెంట్లు నిర్వహిస్తోంది. వీటిలో రెండు ఫార్మెటివ్, ఒక సమ్మెటివ్ అసెస్మెంట్లకు ‘ఓఎంఆర్’ విధానం అనుసరిస్తున్నారు. ఈ విద్యా సంవత్సరంలో ఎఫ్ఏ–1 ఓఎంఆర్ విధానంలో పూర్తిచేయగా, ఎఫ్ఏ–2ను పాత విధానంలో మంగళవారం నుంచి నిర్వహించనున్నారు. ఈ విధానాన్ని 1 నుంచి 8వ తరగతి వరకు అనుసరిస్తోంది. పదో తరగతిలో బోర్డు పరీక్షలకు ఇబ్బంది లేకుండా 9, 10 తరగతులకు పాత విధానంలోనే పరీక్షలు నిర్వహిస్తున్నారు. ఎఫ్ఏలో మొత్తం 20 మార్కులకు 15 ప్రశ్నలు ఉంటాయి, ఇందులో 10 ప్రశ్నలకు ఓఎంఆర్ విధానంలో జవాబులు గుర్తించాలి. మరో ప్రశ్నలకు 5 డిస్క్రిప్టివ్ విధానంలో సమాధానాలు రాయాలి. ఈ ప్రశ్నలన్నీ విద్యార్థి మానసిక సామర్థ్యం, ప్రశ్నలు అర్థం చేçసుకునే విధానాన్ని పరీక్షించేలా ఉంటాయి. -
నాలెడ్జ్ క్యాపిటల్‌గా తిరుపతి
తిరుపతి సిటీ : తిరుపతి ఇప్పటికే నాలెడ్జ్ హబ్‌గా పేరుగాంచిందని, త్వరలో నాలెడ్జ్ క్యాపిటల్‌గా తయారవుతుందని ఐజర్ డైరెక్టర్ ప్రొఫెసర్ సంతను భట్టాచార్య చెప్పారు. ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ ఆడిటోరియంలో గురువారం సుస్థిర గ్రామీణ జీవనోపాధి సాధనపై జరిగిన జాతీయ సదస్సుకు దేశంలోని పలు వెటర్నరీ విశ్వవిద్యాలయాల నుంచి వచ్చిన వీసీలు, విభాగాల డైరెక్టర్లు, డీన్లతో కలసి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రసంగించారు. ఎస్వీ వెటర్నరీ యూనివర్సిటీ అనేక ఏళ్లుగా జంతు సంరక్షణలో కీలక పాత్ర పోషిస్తోందని కొనియాడారు. దేశంలో జీవనోపాధికోసం గ్రామీణ ప్రజలు సగటున రోజుకు 30 మంది పట్టణ ప్రాంతాలకు వలస వెళుతున్నారని, సుస్థిర గ్రామీణ జీవనోపాధికోసం వర్సిటీలు ప్రధాన పాత్ర పోషించాలని సూచించారు. జంతు సంరక్షణపై దృష్టి సారించి అధునాతన సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి వ్యాధి మూలాలకు పరిష్కార మార్గాలను కనుగొనాలని పిలుపునిచ్చారు. అనంతరం సదస్సుకు హాజరైన వీసీలు మాట్లాడుతూ మొబైల్ యాప్స్ ద్వారా రైతులకు అవసరమైన సమాచారాన్ని అందించి వారి ప్రమాణాలను మెరుగుపర్చాలని సూచించారు. పాడి రైతులు ఎదుర్కొంటున్న సమస్యలు, పరిష్కార మార్గాలపై జాతీయ సదస్సు దృష్టి సారించాల్సిన అవసరముందన్నారు. పరిశోధనల సంపుటిని ఆవిష్కరించి, అనంతరం శాస్త్రవేత్తలకు, విద్యార్థులకు పలు అంశాలపై వక్తలు అవగాహన కల్పించారు. సదస్సులో కర్ణాటక బీదర్ వర్సిటీ వీసీ కేసీ వీరన్న, తిరుపతి పద్మావతీ మహిళా వర్సిటీ వీసీ డి భారతి తదితరులు పాల్గొన్నారు. -
వైద్య విద్యార్థులకు వరం.. డిజిటల్ లైబ్రరీ
లబ్బీపేట(విజయవాడతూర్పు): వైద్యవిద్యకు సంబంధించిన అత్యాధునిక పుస్తకాలు, వివిధ రకాల అరుదైన చికిత్సలకు సంబంధించిన వీడియోలు, వేలాది జర్నల్స్‌తో కూడిన డిజిటల్ లైబ్రరీ (ఈ–లైబ్రరీ)ని వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయం విద్యార్థులకు అందుబాటులోకి తీసుకువచ్చింది. వైఎస్సార్ మెడ్‌నెట్ కన్సార్షియం పేరుతో ఏర్పాటు చేసిన ఈ లైబ్రరీలో మెడికల్, డెంటల్, ఫిజియోథెరపీ, ఆయుష్, పారా మెడికల్, నర్సింగ్ కోర్సులకు సంబంధించి వేలాది రకాల అత్యాధునిక పాఠ్యపుస్తకాలు, జర్నల్స్, అరుదైన చికిత్సలు, ట్రీట్మెంట్ ప్రొటోకాల్‌కు సంబంధించిన వీడియోలు ఉంచారు. ప్రతి విద్యార్థి డిజిటల్ లైబ్రరీని సులభంగా వినియోగించుకునేందుకు మైలాఫ్ట్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చారు. దీనికోసం యూనివర్సిటీ రూ. 4 కోట్లు వెచ్చించింది. మైలాఫ్ట్.. యూజర్ ఫ్రెండ్లీ యాప్.. డాక్టర్ వైఎస్సార్ ఆరోగ్య విశ్వవిద్యాలయంలో 2008లోనే డిజిటల్ లైబ్రరీ ఏర్పాటు చేశారు. కానీ పరిమిత సంఖ్యలో మాత్రమే అక్కడ పుస్తకాలు అందుబాటులో ఉండేవి. లైబ్రరీలో మాత్రమే దాన్ని ఉపయోగించుకునే అవకాశం ఉండటంతో లైబ్రరీ పనివేళల్లో వెళ్లేందుకు కుదరకపోవడంతో విద్యార్థులు ఇబ్బంది పడేవారు. పరిస్థితి గమనించిన ప్రస్తుత వర్సిటీ అధికారులు అత్యాధునిక పరిజ్ఞానంతో మైలాఫ్ట్ (మై లైబ్రరీ ఆన్ ఫింగర్ టిప్స్) అప్లికేషన్‌ను రూపొందించారు. ఈ యాప్ ద్వారా విద్యార్థులు, టీచింగ్ వైద్యులు, ఎక్కడినుంచైనా తమ మొబైల్లో సైతం లాగిన్ అయ్యి డిజిటల్ లైబ్రరీని వినియోగించుకునే అవకాశం కల్పించారు. దీన్లో 21 వేలకు పైగా ఈ–బుక్స్, 22,433కు పైగా ఈ– జర్నల్స్, 11,000 పైగా వీడియోలు ఉన్నాయి. ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా ప్రతి విద్యార్థి ఆధునిక విజ్ఞానాన్ని అందిపుచ్చుకునేలా డిజిటల్ లైబ్రరీని ఆధునీకరించాం. మైలాఫ్ట్ యూజర్ ఫ్రెండ్లీ యాప్ ద్వారా విద్యార్థులు, ఫ్యాకల్టీ ఎక్కడి నుంచైనా, తమ మొబైల్స్‌లో సైతం లాగిన్ అయ్యే అవకాశం కల్పించాం. డిజిటల్ లైబ్రరీ వినియోగంపై అన్ని కళాశాలల్లో అవగాహన కల్పిస్తున్నాం. – డాక్టర్ వి.రాధికారెడ్డి, రిజిస్ట్రార్, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ సద్వినియోగం చేసుకోవాలి మైలాఫ్ట్ యాప్‌ను ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలి. వర్సిటీ వైస్ ఛాన్సలర్ ఆదేశాల మేరకు టెక్నికల్ సిబ్బందితో కలిసి జోనల్ వారీగా సదస్సులు నిర్వహించి యాప్ వినియోగంపై ఫ్యాకలీ్ట, విద్యార్థుల్లో అవగాహన కలి్పస్తున్నాం. వేలాది ఈ–బుక్స్, ఈ–జర్నల్స్, వీడియోలు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థులు తమ విజ్ఞానాన్ని పెంపొందించుకునేందుకు ఇవి ఎంతగానో దోహదపడతాయి. – డాక్టర్ కె.సుధ, కో ఆర్డినేటర్, కన్సార్షియం, డాక్టర్ వైఎస్సార్ హెల్త్ యూనివర్సిటీ -
Natural Skills: సహజ నైపుణ్యాన్ని ఉపయోగించుకోవాలి
ఈ మధ్యన ఒకటి–రెండు సందర్భాలలో మెకానికల్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, సివిల్ ఇంజనీరింగ్ చదువుతున్న ఒకరిద్దరు చురుకైన విద్యార్థులను కలవడం సంభవించింది. వాళ్లతో మాటా–మాటా కలిపి, వారి–వారి ప్రొఫెషనల్ విద్యాభ్యాసంలో భాగంగా ఏం నేర్చుకుంటున్నారూ, అధ్యాపకులు ఏం నేర్పిస్తున్నారనీ ప్రశ్నిస్తే, వారిదగ్గర నుండి ఆశించిన సమాధానం రాలేదు. మెకానికల్ ఇంజనీరింగ్ పూర్తి అయిన తరువాత ఏరకమైన మెషిన్లమీద పనిచేస్తావని ప్రశ్నిస్తే తెలియదని అమాయకంగా వచ్చింది జవాబు. కంప్యూటర్ ఇంజనీరింగ్ తరువాత సరాసరి ఏదైనా ప్రోగ్రామింగ్ చేయగలరా అంటే దానికీ జవాబు లేదు. సివిల్ ఇంజనీరింగ్ తరువాత ఎలాంటి ప్రాజెక్టులలో పనిచేయాలని అనుకుంటున్నావని అడిగితే అసలే అర్థం కాలేదు. అందరూ విద్యార్థులూ ఇలాగేనా అంటే కావచ్చు, కాకపోవచ్చు. స్వతహాగా తెలివైన కొందరి విషయంలో మినహాయింపు ఉండవచ్చు. ఇంజనీరింగ్ లాంటి ప్రొఫెషనల్ కోర్సులన్నీ ఇటీవల కాలంలో ‘నాలెడ్జ్ బేస్డ్’ (అంతంత మాత్రమే) తప్ప ‘స్కిల్ బేస్డ్’ కాకపోవడమే బహుశా దీనికి కారణం కావచ్చు. ఇదిలా ఉంటే ఎలాంటి ఫార్మల్ ఎడ్యుకేషన్ లేకుండా రకరకాల వృత్తి నిపుణులు మన దేశంలో, రాష్ట్రంలో కోకొల్లలు. వారంతా స్వయంశక్తితో వారి వారి వృత్తుల్లో ఎలా ప్రావీణ్యం సంపాందించుకున్నారో అనేది కోటి రూకల ప్రశ్న. వారిలో గ్రామీణ వృత్తులు మొదలుకుని, పట్టణాలలో, నగరాలలో పనిచేస్తున్న వాహనాలు, ఎయిర్ కండీషన్లు వంటి వాటిని బాగుచేసే మెకానిక్కులు చాలామందే ఉన్నారు. వీరు రిపేర్లు చేయడానికి వచ్చేటప్పుడు తమ వెంట ఒక జూనియర్ కుర్రవాడిని తీసుకు వస్తారు. అతడు కొంతకాలానికి సీనియర్ అయిపోతాడు. అందుకే ఇటువంటివారు నేర్చుకున్న విద్య భావితరాలవారికి అందుబాటులోకి తీసుకువచ్చే విధానం ప్రవేశపెట్టాలి. వీరికి సంబంధిత విద్యార్హతలు లేకపోయినా ప్రొఫెషనల్ కోర్సుల విద్యార్థులకు ప్రాక్టికల్స్ చెప్పేటప్పుడు ఉపయోగించుకునే విధానం రూపొందిస్తే మంచిదేమో! యాభై, అరవై ఏళ్ల అనుభవంతో చేస్తున్న సూచన ఇది. చేతి గడియారం పనిచేయకపోతే, కంపెనీ షోరూమ్‌కు పోయి ఇస్తే బాగుచేసి ఇవ్వడానికి సమయం పట్టే అవకాశాలున్నాయి కాబట్టి, ఎప్పటిలాగే, ఆలవాటున్న ఒక రిపేర్ షాప్‌కు పోయాను ఇటీవల. ఆ చిన్న షాప్‌లో ఎప్పటిలాగే ఇద్దరు నిశ్శబ్దంగా పనిచేసుకుంటూ కూర్చున్నారు. ఆ ఇద్దరిలో సీనియర్ వ్యక్తి (బహుశా) బ్యాటరీ కొత్తది వేయాలని చెప్పి రూ. 220 అవుతుందన్నాడు. నేను సరే అనగానే ఐదు నిమిషాలలో ఆ పని కానిచ్చి నా చేతిలో పెట్టాడు. గత ఏభై ఏళ్లుగా... తన తండ్రి కాలం నుంచి అక్కడే రిపేర్లు చేస్తున్నామనీ, గడియారాలు రిపేరు చేసే విద్య ఎప్పటినుంచో తనకు వచ్చనీ, ఎలా అబ్బిందో తెలియదనీ, ఎక్కడా నేర్చుకున్నది కాదనీ అన్నాడు. ఇటీవల మనం వాడుకునే వస్తువులు చెడిపోయినప్పుడు ఎక్కువగా కంపెనీల సర్వీసింగ్ మెకానిక్‌లను పిలవకుండా స్వంతంగా నేర్చుకున్న పనితనంతో తక్కువ ధరకు సర్వీసు చేసి పోతున్న లోకల్ టాలెంట్లనే వినియోగదారులు ఆశ్రయించడం వీరికి ఉన్న విశ్వసనీయతను తెలియ జేస్తోంది. ఇటువంటి నేచురల్ టాలెంట్ ఉన్న వారు అన్ని రంగాల్లోనూ ఉన్నారు. మా చిన్నతనంలో ఖమ్మం పట్టణంలో మేమున్న మామిళ్ళ గూడెం బజారులో (లంబాడి) రాము అని ఆర్టీసీలో మెకానిక్‌గా పని చేస్తున్న వ్యక్తి ఉండేవాడు. అతడు ఏ మెకానికల్ ఇంజనీరింగ్ చదువు కోలేదు. కాని అద్భుతమైన రీతిలో మెకానిజం తెలిసిన వ్యక్తి. ఆ రోజుల్లో ఖమ్మంలో కార్లు, జీపులు బహుశా చాలా తక్కువ. వాటికి కానీ, లారీలకు కానీ ఏ విధమైన రిపేర్ కావాలన్నా రామునే దిక్కు. రాముకు సహజ సిద్ధంగా అబ్బిన విద్య అది. అప్పట్లో హైదరాబాద్‌లో మా బంధువు లబ్బాయి ఒకడిది అద్భుతమైన మెకానికల్ బ్రెయిన్. ఇంకా కంప్యూటర్లు ప్రాముఖ్యం చెందని రోజుల్లో సాఫ్ట్వేర్, హార్డ్వేర్లలో నైపుణ్యం సంపాదించాడు. ఎట్లా నేర్చుకున్నాడో, ఎవరికీ తెలియదు. ఇంటర్మీడియేట్ చదవడానికి ప్రయత్నం చేశాడు. కుదరలేదు. స్నేహితుల సహాయంతో అమెరికా చేరుకున్నాడు. చిన్నగా హార్డ్‌వేర్ మెకానిజంలో పేరు తెచ్చుకున్నాడు. ఎన్నో కంపెనీలు అప్పట్లో అతడి మీద ఆధారపడేవి. అంచెలంచెలుగా ఎదిగి ఫార్మల్ డిగ్రీలు లేకపోయినా నైపుణ్యం ప్రాతిపదికగా అక్కడ స్థిరపడిపోయాడు. అతడా విద్య ఎలా నేర్చుకున్నాడు? చాలా కాలం క్రితం ఆంధ్రాబ్యాంక్‌లో కొఠారి చలపతి రావు అనే ఆయన పనిచేసేవారు. అక్కడ చేరడానికి ముందర కొన్ని చిన్నచిన్న ఉద్యోగాలు కూడా చేశాడు. ఇంకా అప్పటికి కంప్యూటర్లు పూర్తి స్థాయిలో వాడకంలోకి రాలేదు. కేవలం మామూలు గ్రాడ్యుయేట్ మాత్రమే అయిన కొఠారి చలపతిరావు స్వయంగా నేర్చుకుని ఆంధ్రా బ్యాంక్ కంప్యూటర్ సిస్టం ఏర్పాటు చేశాడు. ఆయన్ని అంతా కంప్యూటర్ భీష్మ పితామహుడు అని పిల్చేవారు. ఆయన ఆ విద్య ఎలా నేర్చుకున్నాడు? వీరిలాంటి అనేకమంది సహజ నైపుణ్యం ఉన్నవారిని ప్రొఫెషనల్ కోర్సుల కాలేజీలలో క్వాలిఫికేషన్ లేకపోయినా అయినా ఉపయోగించుకోవాలి. అప్పుడే సాంకేతిక విద్య అభ్యసించే విద్యార్థులకు మంచి నైపుణ్యం అందుబాటులోకి వస్తుంది. (క్లిక్ చేయండి: గట్టివాళ్లే చట్టానికి గౌరవం) - వనం జ్వాలా నరసింహారావు చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్, తెలంగాణ ప్రభుత్వం -
ఇంగితమూ జ్ఞానమే!
విద్యాభ్యాసం, విస్తృత పుస్తక పఠనాల వల్ల పొందే జ్ఞానం ఒకటైతే, మనిషిలో ఉండే సహజమైన గ్రహింపు శక్తి, అవగాహన శక్తి వలన వచ్చే జ్ఞానం మరొకటి. దీనికే ఇంగితం లేదా ఇంగితజ్ఞానం అని పేరు. చదువుకున్న వారిలోనే ఇది ఉండనక్కరలేదు. ఇది ప్రతి మనిషిలో ఉండే ఒక అంతర్లీనమైన ఒక జీవలక్షణం. జీవితంలో మనకు కలిగే అనేక అనుభవాలతో ఈ ఇంగితం మరింతగా పదునెక్కుతుంది. అందుకే ఇది ఎంతో విశిష్టమైంది. చదువుతో నిమిత్తంలేకుండా ప్రతి మనిషి జీవనానికి, జీవితానికి అత్యంత ఆవశ్యకమైనది. ఈ ఇంగితం మనలను అప్రమత్తులను చేసి వ్యవహార దక్షతను పొంచి జీవితం సజావుగా సాగేటట్టు చేస్తుంది. విద్యాధికులలో ఉండే జ్ఞానమనే బంగరు పళ్లెరానికి ఇది ఒక గోడ చేర్పు లాంటిది. అనేక శాస్త్రాలను మధించి దాని జ్ఞానామృతాన్ని గ్రోలిన పండితులైనా, తమ జీవితాన్ని నూతన ఆవిష్కరణల కోసమై ధారపోసే శాస్త్రవేత్తలైనా తమ ఇంగితం ఉపయోగించవలసిన అవసరం ఉంటుంది. అలా కానివేళ, వారి జ్ఞానం వారికే కాక మానవాళికే ముప్పు తెస్తుంది. చరిత్ర పుటలు తిరగవేసినా, మన సమకాలీన చరిత్రను పరిశీలించినా ఈ విషయం తేటతెల్లమవుతుంది. ఒక గురువు తనవద్ద శ్రద్ధతో విద్యాభ్యాసాన్ని పూర్తిచేసుకున్న నలుగురు శిష్యులకు చనిపోయిన వారిని బతికించగల అద్భుత శక్తినిచ్చాడు. అయితే, దానిని అత్యవసరమైనప్పుడు మాత్రమే ఉపయోగించ మని హెచ్చరించి పంపాడు. వారిలో ముగ్గురు మార్గమధ్యంలో ఒక పులి కళేబరాన్ని చూసి వారి అద్భుత శక్తిని ప్రయోగించాలని ఉవ్విళ్ళూరటం, నాలుగవవాడు వారి మూర్ఖత్వానికి వగచి, హితవు పలికి భంగపడి వీరికి దూరంగా వెళ్లి తన ప్రాణాలు దక్కించుకున్న కథ మనకు తెలుసు. ప్రాణాలు కోల్పోయిన ఆ నలుగురు జ్ఞానసంపన్నులే. కాని వారిలో కొరవడిన ఇంగితం ప్రాణం నిలబెట్టుకున్న వాడిలో మెండుగా ఉంది. అలాగే పరస్త్రీని తాకకూడదన్న ధర్మాన్ని మనసులో స్థిరరచుకున్న ఒక శిష్యుడు ప్రవాహంలో కొట్టుకుపోతున్న ఒక స్త్రీని రక్షించడానికి ముందుకు రాలేదు. అక్కడ ఆపదలో ఉన్నది ఒక జీవి మాత్రమేనని భావించిన రెండోవాడు ఆమెను కాపాడటానికి కారణం ఇంగితమే. ఇంగితమంటే వివేకమే. ఒకరకమైన యుక్తాయుక్త విచక్షణ. సందర్భోచిత జ్ఞానం. మన చదువుల సారానికి, జీవితానుభవాన్ని విచక్షణాశక్తిని కలిపి చూడగలగటమే ఇంగితం. మన ప్రవర్తనలో, వ్యవహార శైలిలో దానిని చూపగలిగేవారి జీవితం అపార్థాలు, తగాదాలు లేకుండా సాగుతుంది. వందలాది పక్షులకు ఆశ్రయమిచ్చే ఓపెద్ద చెట్టుకింద కూర్చుని ధ్యానముద్రలో ఉన్నాడో పండితుడు. అపుడో పక్షి విడచిన విసర్జనం అతని తల మీద పడింది. విపరీతమైన కోపమొచ్చిన ఆయన దాని వంక తీక్షణంగా చూసాడు. అంతే! ఆ పక్షి కాలి బూడిదై పోయింది. ఆయనకు సంతోషమూ, గర్వమూ కలిగాయి. అన్ని పక్షులున్న చెట్టు కింద కూర్చుంటే ఆ అనుభవం ఎదురవ్వటం నీరు పల్లానికి వెళుతుందన్న నంత సహజం. ఇంత చిన్న విషయం ఆయనకు తట్టకపోవటానికి కారణం తన ఇంగితజ్ఞానాన్ని ఉపయోగించ లేకపోవటమే. ఇక్కడ ఇంగితమంటే వివేకమని అర్థం. చాల సహజమైన ఈ ఇంగితజ్ఞానాన్ని ఉపయోగించకపోతే పండితులు, జ్ఞానసంపన్నులు వారి శాస్త్ర సంబంధమైన జ్ఞానాన్ని, సాధన ద్వారా పొందిన జ్ఞానాన్ని ఎలా మట్టిపాలు చేసుకుంటారో చెపుతుందీ ఉదాహరణ. నిస్సందేహంగా జ్ఞానమే ఆధిక్యమైనది, గొప్పది, విలువైనది. ఈ జ్ఞానాన్ని ప్రదర్శించేటప్పుడు ఒక నియంత్రణాశక్తిగా ఈ ఇంగితం పనిచేయాలి. రివాల్వరు ఉపయోగించగలగటం జ్ఞానం. అయితే, దానిని ఆ సందర్భంలో వాడవలసిన అవసరం ఉందా లేదా అనే సంగతిని మనకు బోధపరచే గొప్ప వజ్జ ఈ ఇంగితం. ఇంగితమంటే తార్కికత, విచక్షణ, భావోద్వేగాలపై ఒక పట్టు. ఇంగితమంటే మన శక్తియుక్తుల్ని అవసరమైన చోట, తప్పనిసరైన క్షణాన మాత్రమే ఉపయోగించేటట్టు మనల్ని సమాయత్తం చేసే ఒక నిబద్ధత, ఒక అదుపు. అలా కానివేళలలో అది పిచుక మీద బ్రహ్మాస్త్రమే అవుతుంది. ఒక పండితుడు గణితంలో అపారమైన జ్ఞానాన్ని సంపాదించాడు. విశేషమైన ప్రజ్ఞతో గణితానికి చెందిన ఏ లెక్కనైనా, సమస్యనైనా పరిష్కరించసాగాడు. తన గ్రామంలోనూ, చుట్టుపక్కల గ్రామాలలోనూ అంతటి మేధావి లేడని ఖ్యాతి పొందాడు. పేరు, డబ్బు వచ్చింది. ప్రజలు, ఇంత గణితశాస్త్ర పండితులు ఆయన ప్రజ్ఞాపాటవాలకు ఆశ్చర్యానుభూతికి లోనై ఆయనకు నీరాజ నాలిచ్చి సత్కారాలు, సన్మానాలు చేసారు. గణితంలో తనకన్నా ప్రజ్ఞావంతుడు లేడనే అహంకారం ప్రవేశించింది అతనిలో. గర్వం తారస్థాయికి చేరుకొని ‘నాతో పోటీపడగలవారెవరైనా ఉన్నారా మీ గ్రామంలో?’ అని సవాలు విసరి, తలపడినవారిని ఓడించి, దూషించి అవమానించసాగాడు. ఒకసారి ఒక సాయంసంధ్య వేళలో ఒక గ్రామంలోకి ప్రవేశిస్తున్న సమయాన ఒక పశువుల కాపరి కలిసాడు. ఆ చదువురానివాడితోనూ తన గొప్పతనాన్ని గురించి అతిగా చెపుతూ వెళుతున్నాడు. ఒకచోట ఆ కాపరి తటాలున కిందకు వంగి ఒక గుప్పెడు ఇసుకను తీసుకుని ‘అయ్యా, కొంచెం ఇదెంతో లెక్కించి చెప్పగలరా?’ అని ఆ గణితశాస్త్ర పండితుణ్ణి అడిగాడు. ఆ ప్రశ్నకాపండితుడి నోటివెంట ఒక క్షణం మాట రాలేదు. ఆలోచన స్తంభించి పోయింది. చివరకు ఆ ఇసుకను లెక్కించలేమన్నాడు. దానికా పశువులు కాపరి ‘సామీ! దీనిని గుప్పెడని కదా అంటారు. ఐదు వేళ్ళు దగ్గరకు చేర్చి తీసుకుంటే చారెడు, రెండు అరచేతులతో తీసుకుంటే దోసెడు, బొటనవేలికి, చూపుడువేలికి మధ్య తీసుకుంటే చిటికెడని కదా అంటారు’ అన్నాడు. అంతే ఆ పండితుడికి తన తప్పు తెలిసింది. మామూలు పద్ధతిలోనే ఆ ఇసుకను లెక్కించే యత్నం చేయటం వల్ల సమాధానం చెప్పలేకపోయానని. సహజసిద్ధమైన ఇంగితజ్ఞానాన్ని తను చూపలేకపోయానని అర్థం చేసుకుని తన అహంకారానికి సిగ్గుపడి అతడికి నమస్కరించి ఇంటిముఖం పట్టాడు. నిజానికి ఆ నిరక్షరాస్యుడు పండితుడికి ఏ విషయంలో పోటీనే కాదు. కాని అతడు పండితుణ్ణి ప్రశ్నించటానికి కారణం అతడి ఇంగితమే. దీనినే మరో కోణం నుండి చూస్తే ఆ పండితుడి గర్వానికి, అనుచిత ప్రవర్తనకు ఆ పశువుల కాపరి ప్రశ్న నిరోధకం. అంతేకాదు. సహజ సిద్ధమైన ఇంగితానికి.. జీవితపరిశీలన, అన్వయం, సందర్భాచిత ఆకళింపు జత కూడితే అది విశేషమైన ప్రజ్ఞ. ఏ పుస్తకాలలో చెప్పని ఏ గురువు నేర్పని విద్య ఇది. ఇంగితమనే పుస్తకంలో జీవితానుభావాలే పుటలు, అధ్యాపకులు. మనలో సహజంగా ఉండే ఏ అద్భుత శక్తి, మన జీవిత మార్గదర్శి. విద్య వల్ల మరింతగా పదునెక్కాలి. అపుడే మరింతగా ప్రకాశిస్తుంది. ఇంగితమంటే లోకజ్ఞానం. ఇది మన నిత్య వ్యవహారాల నిర్వహణలో సహాయపడుతూ ఉంటుంది. అలాగే కొన్ని ముఖ్య సందర్భాలలో కీలకమైన నిర్ణయాలు తీసుకునేటప్పుడు ఈ ఇంగితం మనకు ఎంతో వెన్నుదన్నుగా ఉంటుంది. ఇంగితం మన ‘వివేచనా నేత్రం’ ఇన్ని ఉదాహరణలవల్ల మనం గ్రహించవలసింది ఏమిటి? ఇంగితమంటే ఒకసహజమైన తెలివిడి, లోతైన పరిశీలన, బుద్ధికి, మనస్సుకి గోచరమయ్యే ఒక అద్భుత అవగాహన. చదువుకున్న వారిలో ఉండేవి, ఉండవలసిన లక్షణాలు ఇవే కదూ! శాస్త్రపరమైన జ్ఞానం అక్షరాస్యులదైతే, నిరక్షరాస్యులది పరిశీలనా గతమైనది. ఇంగితం జ్ఞానమే. అది సహజాతమైనది అన్నారు పెద్దలు. –బొడ్డపాటి చంద్రశేఖర్, ఆంగ్లోపన్యాసకులు -
ఐదేళ్లలో 100% పరిజ్ఞానం!
సాక్షి, హైదరాబాద్: ప్రభుత్వ స్కూళ్ళలో విద్యార్థి చదివే, రాసే సామర్థ్యాన్ని ఇకపై వారానికోసారి అంచనా వేయ బోతున్నారు. అభ్యసన సామర్థ్యాలపై ప్రతి నెలా రాష్ట్ర స్థాయిలో సమీక్ష చేపట్టబోతున్నారు. ముఖ్యంగా భాష, గణితంపై దృష్టి పెట్టనున్నారు. తద్వారా వచ్చే ఐదేళ్లలో 3, 5 తరగతుల విద్యార్థుల్లో 100% తెలివి తేటలు (పరిజ్ఞానం) పెంచాలని రాష్ట్ర విద్యాశాఖ లక్ష్యంగా పెట్టు కుంది. అలాగే 8వ తరగతి విద్యార్థుల్లో ప్రస్తుత సామర్థ్యాని 85 శాతానికి తీసుకెళ్లాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ‘తొలిమె ట్టు’ కార్యక్రమానికి ఆగస్టు 15 నుంచి శ్రీకారం చుట్టింది. దీనికోసం ప్రత్యేక ప్రణాళికను సిద్ధం చేశారు. 1–5 తరగ తుల విద్యార్థుల కోసం తొలిమెట్టు అమలు చేయబోతు న్నారు. దీంతో పాటే 6–10 తరగతుల విద్యార్థుల అభ్యసన నష్టాలపై దృష్టి పెట్టాలని నిర్ణయించారు. ‘న్యాస్’ రిపోర్టుతో మేల్కొలుపు అన్ని రాష్ట్రాల్లో విద్యా ప్రమాణాలపై నేషనల్ అచీవ్మెంట్ సర్వే (న్యాస్) ప్రతి రెండేళ్ళకోసారి సర్వే నిర్వహిస్తుంది. సర్వేలో భాగంగా విద్యార్థులకు పలు ప్రశ్నలు వేయడం ద్వారా వారి స్థాయిని అంచనా వేస్తుంది. గత ఏడాది నవంబర్‌లో ఈ ప్రక్రియ పూర్తి చేసి, ఫలితాలు వెల్లడించింది. కరోనా కారణంగా రెండేళ్ళలో విద్యా ప్రమాణాలు అనూహ్యంగా తగ్గాయని తాజా నివేదికలో పేర్కొంది. రాష్ట్రంలో విద్యా ప్రమాణాల మెరుగుపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సూచించింది. ఈ నేపథ్యంలోనే విద్యాశాఖ కార్యాచరణకు దిగింది. పాఠశాలల ప్రారంభంలోనే విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సు నిర్వహించింది. దీనికి కొనసాగింపుగా 1–5 తరగతులకు తొలిమెట్టు, 6–10 తరగతుల్లో అభ్యసన నష్టాల భర్తీకి కార్యక్రమాలు నిర్వహిస్తారు. వారం వారం అంచనా... విద్యార్థులకు వారంలో ఐదు రోజుల పాటు రెగ్యులర్ క్లాసులు జరుగుతాయి. అదనంగా ఓ గంట తొలిమెట్టు కింద ప్రత్యేక క్లాసు తీసుకుంటారు. విద్యార్థి వెనుకబడిన సబ్జెక్టు, పాఠాన్ని అర్థమయ్యేలా మళ్ళీ బోధిస్తారు. వారికి అర్థమైందా లేదా అనే దానిపై పాఠశాల స్థాయిలో చిన్న పరీక్ష నిర్వహిస్తారు. ఇది రాత పూర్వకంగా లేదా మౌఖికంగానైనా ఉండొచ్చు. ఒక పాఠం కనీసం 80 శాతం మందికి అర్థమవ్వాలని తొలిమెట్టు ప్రణాళికలో పేర్కొన్నారు. ఉన్నత తరగతుల విద్యార్థులకూ ఇదే విధానాన్ని అమలు చేస్తారు. -
ఉక్రెయిన్‌కు అంత సత్తా ఎక్కడిది?
ఉక్రెయిన్‌పై రష్యా దాడి అంటే పిచ్చుకపై బ్రహ్మాస్త్రమేనని అందరూ అనుకున్నారు. ఏదో నాలుగైదు రోజుల్లో ఉక్రెయిన్‌ని రష్యా స్వాధీనం చేసుకుంటుందని అంచనాలు కట్టారు. కానీ అందరి లెక్కలు తప్పాయి. రెండు వారాలైనా ఉక్రెయిన్ దండు రష్యా దండయాత్రని సమర్థంగా అడ్డుకుంటోంది. నాటో తన బలగాలు దింపకపోయినా, నో–ఫ్లై జోన్‌ని ప్రకటించడానికి నిరాకరించినా ఉక్రెయిన్ పోరాటాన్ని ఆపలేదు. చావో రేవోకి సిద్ధమై యుద్ధం చేస్తోంది. యుద్ధంలో ఉక్రెయిన్ ఈ స్థాయి పోరాటపటిమను ఎలా చూపిస్తోంది? ఉక్రెయిన్‌కి కలిసొచ్చే అంశాలేమిటి? రష్యా చేసిన తప్పిదాలేంటి? సన్నద్ధత పశ్చిమ దేశాల సహకారంతో ఉక్రెయిన్ తన ఆయుధ సంపత్తిని పెంచుకుంది. రష్యా 2014లో క్రిమియాను ఆక్రమించుకున్న దగ్గర్నుంచి ఉక్రెయిన్ ఆత్మ రక్షణ కోసం అన్ని జాగ్రత్తలు తీసుకుంది. ప్రత్యేక బలగాలను ఏర్పాటు చేసి నాటో సైనికులతో శిక్షణనిచ్చింది. ‘ఏ క్షణంలో రష్యా దాడికి దిగినా ఎదుర్కోవడానికి 8ఏళ్లుగా ఉక్రెయిన్ ప్రణాళికలు రచిస్తోంది. ఆయుధాల పెంపు, బలగాలకు శిక్షణ, వ్యూహరచన వంటి అంశాల్లో బలంగా నిలిచింది’అని జార్జ్‌టౌన్ వర్సిటీ అసోసియేట్ ప్రొఫెసర్ డౌగ్లస్ చెప్పారు. స్థానబలం స్థానబలానికి మించిన బలం ఏదీ లేదంటారు. సరిగ్గా ఇక్కడే రష్యా ఉక్రెయిన్‌ని తక్కువ అంచనా వేసింది. సోవియెట్ యూనియన్‌గా ఉన్న రోజుల్లో ఉక్రెయిన్ భౌగోళిక పరిస్థితుల్ని అంచనా వేసుకుందే తప్ప, ఇన్నేళ్లలో ఆ ప్రాంతం ఎంత మారిపోయిందో, స్థానికంగా ఉక్రెయిన్ బలగాల ప్రాబల్యం ఎలా పెరిగిందో తెలుసుకోలేకపోయింది. ప్రజలే ఆయుధాలు చేతపట్టి తిరుగుబాటు చేస్తారని గ్రహించుకోలేక ఇప్పుడు కదన రంగంలో గట్టి ప్రతిఘటనను ఎదుర్కొంటోంది. పట్టణ ప్రాంతాల రూపురేఖలు మారిపోవడంతో ఉక్రెయిన్ బలగాలు ఎటు నుంచి వచ్చి మీద పడతాయో తెలుసుకోలేక రాజధాని కీవ్‌ను పదిహేను రోజులైనా స్వాధీనం చేసుకోలేకపోతోంది. ‘ఉక్రెయిన్‌లో మార్పుల్ని అంచనా వేయడంలో రష్యా విఫలమైంది. వీధి వీధిలోనూ, ప్రతీ భవంతిలోనూ అన్నిచోట్లా రష్యా బలగాలు సవాళ్లను ఎదుర్కొంటున్నాయి’అని కాలేజీ ఆఫ్ ఇంటర్నేషనల్ సెక్యూరిటీ అఫైర్స్ ప్రొఫెసర్ స్పెన్సర్ మెరెదిత్ చెప్పారు. సంఘీభావం పౌర నివాసాలు, పాఠశాలలు, ఆస్పత్రుల్ని లక్ష్యం గా చేసుకొని రష్యా బలగాలు దాడి చేస్తూ ఉండడంతో ఉక్రెయిన్ ప్రజలతో ప్రపంచదేశాల్లో రష్యా పై ఒక కసి పెరిగింది. ప్రాణాల మీదకొస్తున్నా అధ్యక్షుడు జెలెన్స్కీ లెక్కచేయకుండా కీవ్‌లో ఉంటూ అందరిలోనూ పోరాట స్ఫూర్తిని రగిలించారు. దీంతో ప్రజలంతా స్వచ్ఛందంగా ఆయుధాలు చేతపూని ఎదురుదాడికి దిగారు. రష్యా భీకరమైన దాడులకు ఎదురుదాడికి దిగడం తప్ప ఉక్రెయిన్‌కు మరో మార్గం లేదని రిటైర్డ్ ఫ్రెంచ్ కల్పనర్ మైఖేల్ గోయా అభిప్రాయపడ్డారు. ఆయుధాలే ఆయుధాలు రష్యా దాడి మొదలు పెట్టిన తర్వాత నాటో బలగాలు నేరుగా మద్దతు ఇవ్వకపోయినా ఆయుధాలను లెక్కకు మించి సరఫరా చేస్తున్నాయి. నాటోలో సభ్యత్వం లేకపోయినప్పటికీ స్వీడన్, ఫిన్లాండ్ సహా 20కిపైగా దేశాలు వేల సంఖ్యలో యుద్ధట్యాంక్ విధ్వంసక ఆయుధాలను పంపించాయి. దాడి మొదలయ్యాక రోజుకో కొత్త రకం ఆయుధాలు ఉక్రెయిన్‌కు అందుతున్నాయి. 2,000కు పైగా స్ట్రింగర్ మిస్పైల్ (మ్యానన్ పోర్టబుల్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్), 17 వేలకు పైగా యుద్ధ ట్యాంక్ విధ్వంసక తేలికపాటి ఆయుధాలు, 2,000 యుద్ధట్యాంక్ విధ్వంసక క్షిపణులను పశ్చిమ దేశాలు సరఫరా చేశాయి. గ్రనేడ్లు, రాకెట్లు, ఇతర ఆయుధాలు భారీ సంఖ్య లో ఉన్నాయి. ఉక్రెయిన్‌లో ప్రతీ ఒక్కరి చేతిలో ఆయుధం ఉందంటే అతిశయోక్తి కాదేమో. రష్యా తప్పిదాలు ఉక్రెయిన్‌ని కొట్టడం ఏమంత పెద్ద పని కాదని రష్యా తేలిగ్గా తీసుకుంది. ఎక్కువగా బలగాలను మోహరించలేదు. మూడు రోజుల్లో రాజధాని కీవ్ వశమైపోతుందని భావించడం రష్యా వ్యూహాత్మక తప్పిదమని అమెరికాలోని రష్యా స్టడీస్ ప్రోగ్రామ్ ఎట్ ది సెంటర్ ఫర్ నేవల్ అనాలిసస్ డైరెక్టర్ మైఖేల్ కోఫ్మన్ పేర్కొన్నారు. ఆ తర్వాత ఎన్ని బలగాలను మోహరించినప్పటికీ ఈలోగా ఉక్రెయిన్ చేతుల్లోకి ఆయుధాలు వచ్చి చేరాయి. నైతిక స్థైర్యం రష్యా సైన్యానికి ఊహించని నష్టం జరగడంతో సైనికులు నైతిక స్థైర్యం తగ్గిపోయింది. యుద్ధభూమిలో వేల సంఖ్యలో మరణాలు, క్షతగాత్రులతో పాటు చాలామందికి తాము యుద్ధానికి వెళుతున్నామన్న విషయం తెలీదు. పుతిన్ ప్రభుత్వం సైనికులకు అసలు విషయం చెప్పకుండా దాచి కదనరంగానికి పంపడం తప్పిదేమనన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. –సాక్షి, నేషనల్ డెస్క్ -
ముక్తి అంటే ఏమిటి? ఎలా సాధించాలి?
శాస్త్రాలలోని విషయాలను గురుసమ్ముఖంలో కూర్చొని శ్రవణం చేసి, గ్రహించిన జ్ఞానాన్ని ఏకాగ్రమైన మనస్సుతో అనుభవానికి తెచ్చుకొని, స్వీయ స్వరూపాన్ని తెలుసుకోవటమే ‘జ్ఞానం’. ఆ జ్ఞానాన్ని ఏకాగ్రతతో అనుభవానికి తెచ్చుకొనుటకు ఆచరించే ఉపాయమే ‘యోగం’ (యోగ సాధన) మనస్సు పూర్తిగా నిర్మలంగా, నిష్కల్మషంగా, స్వచ్ఛంగా ఉంటేనే అందులో పరమాత్మ ఉండేది. నిర్మలమైన అద్దంలో ప్రతిబింబం బాగా ప్రకాశిస్తుంది గాని, దుమ్ము కొట్టుకొని ఉన్న అద్దంలో ప్రతిబింబం సరిగ్గా కనిపించదు గదా! కనుక నీలో పరమాత్మ జ్ఞానం ప్రకాశించాలంటే నీ అంతఃకరణం స్వచ్ఛంగా నిర్మలంగా ఉండాలి. అలాంటి జ్ఞానం కలిగి, నిరంతరం యోగం నందే ఉండాలి, ఏదో కొద్దిసేపు నేను ఆత్మను అనే జ్ఞానంలో ఉండటం కాక శాశ్వతంగా – స్థిరంగా ఆత్మగా ఉండిపోవాలి. ఇలా ఉండాలంటే మనం బ్రహ్మనిష్ఠ, కరుణా సముద్రుడైన గురువును ఆశ్రయించాలి. నిత్యం గురువు ద్వారా సందేహాలను తొలగించుకోవాలి. అలా జ్ఞానంలో నిలబడటం జరుగుతుంది. బుద్ధి ద్వారా పరమాత్మను గురించి శ్రవణం చేయడం, విచారణ చేయడం. ఆయనను చేరుకొనేందుకు కృషి చెయ్యాలి. సత్కార్యాలను సక్రమంగా చేసినట్లైతే స్వర్గ లోకాలకు వెళ్ళి అక్కడ భోగాలు అనుభవించటం కూడా నిజమే. అయితే పుణ్యఫలం ఖర్చైపోగానే తిరిగి ఈ లోకంలోకి రావాలాల్సిందే. మళ్ళీ చరిత్ర ప్రారంభించవలసిందే. తాను చెప్పే నూతన విషయాలను, సూక్ష్మబుద్ధికి తప్ప అంతుబట్టని వేదాంత విషయాలను అతడు చక్కగా అర్థం చేసుకొని వదలవలసిన వాటిని వదిలి, పట్టుకోవలసిన వాటిని పట్టుకోవాలి. తీవ్రమైన మోక్షాపేక్షతో తన దగ్గరకు వచ్చిన శిష్యుడు దృఢ నిశ్చయంతో మోక్షమార్గంలో ప్రయాణించాలంటే తాను కొన్ని కఠోరమైన సత్యాలను చెప్పక తప్పదు. అందుకే గురువులు ఇలా గట్టిగా చెబుతుంటారు. వాడు పిల్లికి బిచ్చం పెట్టడు, ఫలానా వాడు ఎంగిలి చేత్తో కాకిని తోలడు, వాడికి పూజా లేదు పునస్కారం లేదు. ఇంక వాడేం మోక్షాన్ని పొందుతాడు? మోక్షాన్ని గనక పొందాలంటే భక్తితో భగవంతుని కొలవాలని, జపతపాలు చేయాలని, పరోపకారాలు (దానధర్మాలు) చేయాలని.. ఇలా చేస్తేనే ముక్తి అని అంటూ ఉంటారు. ముక్తి పొందాలనుకున్నవారు, మోక్షప్రాప్తిని కోరేవారు ఇవన్నీ చెయ్యాల్సిన పనిలేదా? చేయకూడదా ? అంటే చేయాల్సిందే. అయితే ఎలా చేయాలి ? ఎందుకు చేయాలి? మన మనోబుద్ధుల అలజడులు తగ్గించి శాంత పరచుకోవటానికి – నిష్కామంగా, ఎట్టి కోరికలు లేకుండా కర్మలను చేయాలి. అంతవరకే వీటి ప్రయోజనం. సరే మరి ఇంత కర్కశంగా చెప్పటం ఎందుకు? వేదాంతాన్ని అభ్యసించటానికి ఒక సద్గురువు ను సమీపించేటప్పటికే శిష్యుడు కొన్ని అర్హతలను కలిగి ఉండాలి. ఈ సంసార సాగరాన్ని తరించే ఉపాయాన్ని బోధించమని గురువును ప్రార్థించినప్పుడు గురువు చెప్పే సునిశిత విషయాలను గ్రహించే మానసిక స్థిరత్వం, ఏకాగ్రత, బుద్ధిసూక్ష్మత శిష్యుడికి ఉండాలి. అలా ఉండాలంటే అప్పటికే వారు ధార్మిక జీవనానికి అలవాటు పడి, నిష్కామ కర్మలు, జపతపాలు ఇష్టదేవతారాధన మొదలైన వాటిని సక్రమంగా ఆచరించేవారై ఉండాలి. ► మీరు ఇతరులను ఆదుకుంటే ఇతరులు మిమ్మల్ని ఆదుకుంటారు. ► మీరు ఇతరుల అభివృద్ధికి కృషి చేస్తే , మీ అభివృద్ధికి ఇతరులు కృషి చేస్తారు. ► మీరు ఇతరుల కోసం సమయాన్ని వెచ్చిస్తేనే, మీ కోసం ఇతరులు సమయాన్ని వెచ్చిస్తారు. ► మీరు ఇతరులకు ఆత్మ విజ్ఞానాన్ని పంచితే , మీకు సృష్టి ఆత్మ విజ్ఞానం పంచుతుంది. ► మీరు ఇతరుల దైవత్వానికి కృషి చేస్తేనే , మీరు దైవత్వం పొందగలుగుతారు. ► ‘పరోపకారం‘ (దానాలు) చేయాలని నిజంగా మీరు నిర్ణయించుకుంటే ఎన్నో రకాలుగా చేయవచ్చు. మనసు ఉంటే మార్గం ఎప్పుడూ ఉంటుంది. ► ‘పరోపకారం’ ద్వారా అన్ని సమస్యలలో నుంచి సులభంగా, వేగంగా, శాశ్వతంగా బయటపడవచ్చు. ► సామాన్యంగా లోకంలో ముక్తి అంటే ఏవో పైనున్న లోకాలకు వెళ్ళి కైలాసం, వైకుంఠం, లేదా స్వర్గానికి వెళ్ళి సుఖాలు అనుభవించటమే అని అనుకుంటారు. కాని కలియుగంలో అన్నిటికన్నా ప్రధానం ► ‘పరోపకారం’. (దానాలు) చేసుకోకపోతే ముక్తి ఎలా వస్తుంది..? జీవితంలోని ఏ సమస్యలైనా ‘పరోపకారం’ ద్వారా తొలగిపోతాయి. సర్వ అనారోగ్యాలను, సమస్త సమస్యలను ‘పరోపకారం’ ద్వారా శాశ్వతంగా తొలగించుకోవచ్చు. ఎవరికైనా సహాయం చేయండి. మంచి పనులు చేయండి. అడగక ముందే వారి అవసరాన్ని కనిపెట్టి, ఏమీ ప్రతిఫలం ఆశించకుండా సహాయం చేయండి. ఏ సహాయం చేయగలుగుతారో అదే చేయండి. మీకు సహాయం చేసే వీలు లేకపోతే కనీసం సహాయం ఎక్కడ దొరుకుతుందో తెలియజెప్పండి. మీరు ఏదైనా సహాయం చేస్తేనే మీకు సహాయాలు లభిస్తాయి. మీరు ప్రేమను పంచితేనే, మీరు ప్రేమను పొందగలుగుతారు. బయటి ప్రవర్తన – లోపల మనస్సు రెండూ ఒక్కటిగా ఉంటేనే ధ్యానంలో మనస్సు నిలుస్తుంది. జ్ఞానాన్ని చక్కగా గ్రహించగలుగుతారు. అప్పుడే మనస్సు పరమాత్మకు దగ్గరగా ఉంటుంది. ఇలా మనస్సు నిర్మలంగా స్వచ్ఛంగా ఉండాలంటే – నిరంతరం భగవంతుని పూజలు, యజ్ఞలు, పరోపకారం (దానాలు), తపస్సులు, ఆధ్యాత్మిక సాధనలు భక్తితో ఆచరించాలి. అలాగాక ఆచరణ గొప్పగా ఉండి మనస్సు మాత్రం ప్రాపంచిక విషయాలతో, స్వార్థపూరిత భావాలతో వ్యవహరిస్తే అది పరమాత్మకు దూరం చేస్తుంది. – భువనగిరి, కిషన్ యోగి -
విద్వాన్ సర్వత్ర పూజ్యతే!
ధనం మూడు రకాలుగా ఉంటుంది. ఒకటి బాహ్యంలో ఉండే భౌతికమైన ధనం. రెండవది మానసిక ధనం. మూడవది పుణ్యరూపమయిన ధనం. ఈ మూడూ సమానమైన ప్రాతినిధ్యాన్ని, సమానమైన ప్రతిపత్తిని పొంది ఉంటాయి. అయితే శాస్త్రాన్ని అన్వయం చేసుకోకపోతే మాత్రం బాహ్యంలో ధనమున్నప్పటికీ అది ప్రమాదహేతువై కూర్చుంటుంది. అందుకే శంకరాచార్యులవారు సౌందర్యలహరిలో – సరస్వతీదేవి, లక్ష్మీదేవి.. ఇద్దరి అనుగ్రహం అవసరమేనని అంటారు. సరస్వతీకటాక్షం లేని లక్ష్మీదేవికటాక్షం బాహ్యంలో భయ హేతువు. ఐశ్వర్యం ఉంది. చదువు లేదు. ఎక్కడ సంతకం పెట్టాలో తెలియదు, ఎవడేం చేస్తాడో తెలియదు. అంతరంలో–ఎక్కడ దానం చేయాలో తెలియదు, అపాత్రదానం చేసి తనకున్న వైభవాన్ని పాడుచేసుకుంటాడు. అదే సరస్వతీ కటాక్షంతో కూడుకున్న లక్ష్మీకటాక్షంలో అభ్యున్నతి పొందడానికి అవకాశం ఎక్కువగా ఉంటుంది. సరస్వతీ కటాక్షమున్నవారికి లక్ష్మీకటాక్షం లేకపోవడం అన్నమాట ఉండదు. విద్వాన్ సర్వత్ర పూజ్యతే. ఎంత చదువున్నా తాదాత్మ్యత చెందడు. ప్రసాదబుద్ధితో బతుకుతుంటాడు. ‘ఇవన్నీ నావి కావమ్మా, నీ పాదాలు పట్టుకోవడం చేత వచ్చిన కీర్తి’ అనే భావనతో ఉంటాడు. అది అభ్యున్నతికి హేతువవుతుంది. ఇది బాహ్యంలో శాంతికి, భోగాన్ని అనుభవించడానికి, పుణ్యకర్మ చేయడానికి అత్యంత ప్రధానం. రెండవది మానసిక ధనం. అంటే శాంతి. శాస్త్ర ప్రకారం మనం ఏది చేసినా...‘ఓం శాంతిః శాంతిః శాంతిః’ అంటాం. తాను శాంతంగా ఉండాలి. పదిమందిని శాంతంగా ఉంచగలగాలి. ప్రశాంతంగా ఉండడంకన్నా ఐశ్వర్యం లోకంలో మరొకటి ఉండదు. బాహ్యంలో ఎంత ఐశ్వర్యవంతుడయినా తనకింకా ఏదో లేదనే బాధతో బతికేవాడు దరిద్రుడు. తనకి ఏది లేకపోయినా ‘నాకేం తక్కువయిందని’..అన్నభావనతో బతికేవాడు మహదైశ్వర్యవంతుడు. కొంతమంది పూరింట్లో ఉన్నా ఎంతో తృప్తిగా జీవిస్తుంటారు. పెద్దపెద్ద రాజభవంతుల్లో ఉన్నా ఇంకా ఏదో లేదని ఎప్పుడూ వెంపర్లాడుతుండేవాడు నిత్య దరిద్రుడు. అందుకే మానసికమైన ధనం భౌతికమైన ధనం కన్నా చాలా గొప్పది. ఐశ్వర్యమయినా, ఆనందమయినా మానసికమైన ధనాన్ని ఆవహించి ఉంటాయి. మూడవది పుణ్యధనం. ఇక్కడ ప్రశాంతంగా ఉన్నావు. మంచిదే. ఇక్కడ ధనవంతుడిగా ఉన్నావు. మంచిదే. కానీ జన్మ పరంపర ఇక్కడితో ఆగిపోతుందని నమ్మకం ఏమిటి? జ్ఞానం కలుగుతుందనీ, దానివల్ల పునరావృతి పొందవనీ, మళ్ళీ జన్మ స్వీకరించవనీ నమ్మకమేం లేదుగా! ఇప్పుడు నీవు అనుభవిస్తున్న ఐశ్వర్యం కానీ, ప్రశాంతత కానీ గత జన్మల పుణ్యఫలమేగా! దానిని నీవు అనుభవిస్తున్న కొద్దీ ఖర్చయిపోతుంటుందిగా! మరి వచ్చే జన్మకి పుణ్యం ఎక్కడినుంచి వస్తుంది ? ఇక్కడి ధనాన్ని, ఇక్కడి పుణ్యాన్ని, ఇక్కడి తెలివిని, ఇక్కడి శక్తిని పుణ్యం కింద మార్చుకోవాలిగా! అదెలా మారుతుంది? పాండిత్యం ఉంటే నీకున్న పాండిత్యాన్ని పదిమందికీ పంచి పెట్టడానికి ఉపయోగిస్తే అది అందరికీ చేరుతుంది. తరగని సంపదలా నీ వద్దే ఉంటుంది కూడా! అందుకే విద్వాన్ సర్వత్ర పూజ్యతే అన్నారు పెద్దలు. చదవండి: The Exorcism Of The Emily Rose: ఓ అమ్మయి కన్నీటి గాథ.. ఆరు ప్రేతాత్మలు ఆరేళ్లపాటు వేధించి.. అతి క్రూరంగా..!! -
వైదిక విజ్ఞానం
వేద వాఙ్మయంలో ఆరు విభాగాలున్నాయి. అవి శిక్ష, వ్యాకరణం, ఛందస్సు, నిరుక్తం, జ్యోతిష్యం, కల్పం. వీటినే షడంగాలు అంటారు. ఇవి వేదాలను అర్థం చేసుకోవడానికి ఉపయోగిస్తారు. ఈ షడంగాలను అధ్యయనం చెయ్యకుండా వేదాలను చదువ కూడదన్నది సాంప్రదాయం. షడంగాలను అధ్యయనం చేయకుండా వేదాలను చదివితే, అవి సరైన రీతిలో అర్థంకాకపోగా, విపరీతమైన అర్థాలు వచ్చేదానికి అవకాశం వుంటుంది. అందుకే ముందుగా మనం వేదాంగాల గురించి తెలుసుకుందాం... వేదాల్లోని అక్షరాలు, పదాలు, అవి పలికే విధానం గురించి, వేద మంత్రాల స్వరాలు, ఒత్తిడి, శ్రావ్యతల గురించి, మంత్రాలు పలికే సమయంలో పదాల కలయిక, వాటి నియమాల గురించి శిక్షాశాస్త్రం వివరిస్తుంది. మనిషి ఆలోచనలను వ్యక్తపరచడానికి కావలసిన పదాలు, వాక్యనిర్మాణం, భాషావిశ్లేషణ నియమాలు, సంధులు, పదవిఛ్ఛేదాలు, పదాల ఏర్పాటు, మొదలైన వాటిగురించి వ్యాకరణం వివరిస్తుంది. వేదమంత్రాలన్నీ ఏదో ఒక ఛందస్సులో చెప్పబడినవే కనుక ఒక క్రమ పద్ధతిలో నిర్ణీతసంఖ్యలో అక్షరాల ఆధారంగా మంత్రాలను అర్థం చేసుకోవడాన్ని ఛందస్సు వివరిస్తుంది. వేదాలలోని శబ్దాలు, వాటి వ్యుత్పత్తి, నిర్మాణం, అవి ఉపయోగించిన సందర్భాన్ని బట్టి వాటి అర్థాలు, అస్పష్టమైన అర్థంతో చేసిన పద ప్రయోగాలను అర్థం చేసుకోవడం,మొదలైనవాటి వాటిగురించి వివరించేది నిరుక్తం. ఆచారాలు, సూర్యచంద్రాది గ్రహ, నక్షత్రాలను బట్టి ఏర్పడు శుభాశుభ సమయాలు, ఋతువులు, ఇత్యాది ఖగోళ శాస్త్ర విఙ్ఞానాన్ని అందించేదే జ్యోతిష్య శాస్త్రం. యఙ్ఞయాగాదులలో నిర్మించే యఙ్ఞగుండాలు, వేదికలు, యాగశాలల నిర్మాణ విధానాలు, జననం, మరణం, వివాహం వంటి సంఘటనలలో జరుపవలసిన ఆచారాలు మొదలైన వాటి గురించి కల్పం వివరిస్తుంది. వేదవాఙ్మయానికి జ్యోతిష్యం నేత్రం వంటిది అని శాస్త్రోక్తి. సర్వేంద్రియాణాం నయనం ప్రధానం. అలాగే షడంగాలలో జ్యోతిష్యం ప్రధానం. ఎందుకంటే, మిగిలిన ఐదు శాస్త్రాలూ ఎక్కువభాగం భాషకు సంబంధించినవి. కానీ జ్యోతిష్యశాస్త్రం మాత్రం ఖగోళంలోని గ్రహనక్షత్రాది జ్యోతుల గతులను, వాటివలన ఏర్పడే పరిణామాలను వివరిస్తుంది. ఆ రోజుల్లో ఖగోళాన్ని దర్శించి అధ్యయనం చేసేవారు. కాంతివంతంగా వుంటాయి కనుక గ్రహాలను నక్షత్రాలను కలిపి, జ్యోతులు అంటారు. వాటిని అధ్యయనం చేసే శాస్త్రాన్ని జ్యోతిష్య శాస్త్రం అన్నారు. ఈ జ్యోతిష్య శాస్త్రం ద్వారానే వేదాల్లో వుండే ఎన్నో ఖగోళ అద్భుతాలను, విఙ్ఞానాన్ని అర్థం చేసుకోవచ్చు. వేదాల్లో వుండే ఖగోళ విఙ్ఞానాంశాలు మచ్చుకి కొన్ని. ఋగ్వేద ప్రథమ మండలంలో సూర్యుడు తన కక్ష్యలో చరించడాన్ని, సూర్యాకర్షణశక్తి వల్లనే భూమి, ఇతర పదార్థాలు సూర్యుడిచుట్టూ తిరుగుతున్నాయని, సూర్యుడు చాలా భారీగా వుంటాడనీ, అతని ఆకర్షణశక్తి వల్లనే గ్రహాలు ఒకదానితో మరొకటి ఢీకొనకుండా వుంటాయని తెలిపారు. మరొక మంత్రంలో, ‘కదిలే చంద్రుడు నిత్యం సూర్యునినుండి కాంతికిరణాలను పొందుతాడు’ అనీ, ‘చంద్రుడి వివాహానికి సూర్యుడు తన కుమార్తెలాంటి ఒక కిరణాన్ని బహుమతిగా ఇచ్చాడు’ అని, చంద్రకళలు మారడంలో సూర్యకిరణాల పాత్రని తెలియజేశారు. ఋగ్వేదం ఐదవ మండలంలో ఒక మంత్రం ‘ఓ సూర్యదేవా! ఎవరికైతే నీ వెలుగును బహుమతిగా ఇస్తున్నావో వారి (చంద్రుడు) వలన నీవెలుగు నిరోధించబడినప్పుడు, భూమి అకస్మాత్తుగా చీకటిలో భయపడుతుంది‘ అంటూ గ్రహణాలకు కారణం సుర్యుడు, చంద్రుడు, భూమియే అని చెప్పింది. ఋగ్వేద ఎనిమిదవ మండలంలో, సౌరకుటుంబంలోని ఆకర్షణశక్తుల గురించి, ‘ఓ ఇంద్రా..! గురుత్వాకర్షణ, ఆకర్షణ, ప్రకాశం, కదలిక లక్షణాలను కలిగియున్న శక్తివంతమైన కిరణాలను ప్రసరించి ఆకర్షించడం ద్వారా ఈ విశ్వాన్ని నిలపండి‘ అంటూ సూర్యుణ్ణి, భోగప్రదాత అయిన ఇంద్రుడితోపోల్చి చెప్పారు. మరొక మంత్రంలో సృష్టికర్తను ఉద్దేశించి ‘ఓ దేవా! మీకున్న అనంతమైన శక్తితో సూర్యుని సృష్టించి, ఆకాశంలో ధృవపరచి, సూర్యుని, ఇతర గోళాలను సమన్వయపరచి స్థిరం చేసినారు’ అని సూర్యుని చుట్టూ గ్రహాలు స్థిరంగా తిరగడం గురించి తెలిపారు. ఋగ్వేద పదవ మండలంలో ‘ఈ భూమికి కాళ్ళు, చేతులు లేకపోయినప్పటికీ అది సూర్యుని చుట్టూ తిరుగుతుంది. దానితోబాటూ దానిమీద వుండే అన్నీ కదులుతాయి’ అని చెప్పారు. యజుర్వేదంలో ఒక మంత్రంలో సూర్యుని ఆకర్షణశక్తి గురించి, ‘సూర్యుడు తన కక్ష్యలో కదులుతూ తనతోబాటు భూమివంటి వస్తువులను తనతోబాటు తీసుకు వెళ్తున్నాడు’ అని చెప్పారు. అథర్వవేదంలో ‘సూర్యుడు భూమిని, ఇతర గ్రహాలను పట్టి వుంచాడు’ అని తెలియజేశారు. – ఆచార్య తియ్యబిండి కామేశ్వరరావు -
అవగాహన లేకుంటే..చిక్కులే!
సాక్షి, కరీంనగర్: వరంగల్‌లో తొమ్మిది నెలల చిన్నారిపై జరిగిన అమానవీయ ఘటనపై గత శుక్రవారం కువైట్‌లో ప్లకార్డులు పట్టుకొని నిరసన తెలిపిన 24మంది ప్రవాసాంధ్రులను కువైట్ నిఘా బృందాలు అరెస్టు చేశాయి. నిరసన ప్రదర్శన ఉద్దేశం మంచిదే అయినా ఆ దేశ చట్టాలకు విరుద్ధం కాబట్టి నిరసనకారులు ఇబ్బందుల్లో పడ్డారు. భారత దేశంలో పౌరులు తమ హక్కుల కోసం, అభిప్రాయాలను వ్యక్తం చేయడం కోసం, సమస్యలను ప్రభుత్వాల దృష్టికి తీసికెళ్లడానికి బంద్‌లు, రాస్తారోకోలు, నిరాహార దీక్షలు, ప్రదర్శనలు చేయడం సర్వసాధారణం. భారత్‌లో పుట్టిపెరిగిన వారు ఉద్యోగ రీత్యా గల్ఫ్ దేశాలకు వెళ్లినప్పుడు అక్కడి ఆచార వ్యవహారాలు, చట్టాలపై అవగాహన లేకపోవడం వలన చిక్కుల్లో పడుతున్నారు. స్వేచ్ఛ ఎక్కువగా ఉండే ప్రజాస్వామ్య దేశమైన భారత్ నుంచి రాచరిక పాలన, ముస్లిం షరియా చట్టాలు అమలులో ఉండే అరబ్ గల్ఫ్ దేశాలకు వలస వెళ్లిన భారతీయులు అక్కడి పరిస్థితులలో ఇమడలేక మానసిక సంఘర్షణ పడుతుంటారు. కొంత కాలం తర్వాత అలవాటుపడి సర్దుకుపోతుంటారు. రాచరిక వ్యవస్థ అమలులో ఉన్న గల్ఫ్ దేశాలలో అక్కడి చట్టాల ప్రకారం సమ్మెలు, నిరసన ప్రదర్శనలు చేయడం నిషేధం. గల్ఫ్‌లో సభలు, సమావేశాలు,సాంస్కృతిక కార్యక్రమాలు, వ్యాపార సదస్సులు తదితర ఏ కార్యక్రమం చేపట్టాలన్నా అక్కడి ప్రభుత్వాల అనుమతి తప్పనిసరి. సోషల్ మీడియా ప్రభావం గల్ఫ్‌లో ఉండే చాలా మంది ప్రవాసులు స్వదేశంలో ఉండే తమ కుటుంబ సభ్యులతో వాయిస్ కాల్, వీడియో కాల్ మాట్లాడటానికి స్మార్ట్ ఫోన్లలో ఐఎంఓ (ఈమో), బోటిం, వాట్సాప్ లాంటి యాప్‌లను వినియోగిస్తున్నారు. సమాచారం తెలుసుకోవడానికి, అభిప్రాయాలను పంచుకోవడానికి ఫేస్బుక్, వాట్సాప్ లాంటి సామాజిక మాధ్యమాలను విరివిగా వాడుతున్నారు. స్వదేశంలో జరిగే సంఘటనలు, సామాజిక, రాజకీయ కార్యకలాపాలపై తమ సోషల్ మీడియాలో భిన్నమైన అభిప్రాయాలను, స్పందనలను తెలియజేస్తున్నారు. రకరకాల విషయాలపై ఫేస్బుక్లో, వాట్సాప్ గ్రూపులలో వాగ్యుద్ధాలు, తీవ్రమైన వాదోపవాదాలు జరుగుతుంటాయి. అర్థవంతమైన, విషయాత్మక చర్చలు, విలువైన సమాచార మార్పిడి కూడా జరుగుతున్నది. వార్తలు, విశేషాల అప్డేట్స్ కోసం ప్రవాసులు సోషల్ మీడియాపై ఆధారపడుతున్నారు. – మంద భీంరెడ్డి, ప్రవాసీ మిత్ర. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించొద్దు మంచి కోసమైనా సరే.. గల్ఫ్ దేశ నిబంధనలకు విరుద్ధంగా పొతే జైలుపాలవుతాం. ఏ కార్యక్రమం చేయాలన్నా మన దేశానికి చెందిన సీనియర్ల సలహా తీసుకుని నిర్వహించాలి. ఆ దేశ ప్రభుత్వాల అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. అనుమతి లేకుండా ఏ కార్యక్రమం కూడా చేయకూడదు. గల్ఫ్‌లో చట్టం తన పని తాను కచ్చితంగా చేసుకుంటపోతది. వరంగల్ ఘటనపై ఆవేదనతో నిరసన వ్యక్తం చేసి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వారు అరెస్టయ్యారు. వారిని విడిపించాల్సిన బాధ్యత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలపై ఉంది. – గోలి, శ్రీనివాస్,ఖతార్ వినతి పత్రం రూపంలో పంపాలి గల్ఫ్ దేశాలకు వలస వచ్చిన మనం ఇక్కడ అతిథులం మాత్రమే. ఈ దేశాల పౌరులం కాదు. మన సమస్యలు గానీ, అభిప్రాయాలు గానీ ఏమైనా వ్యక్తం చేయాలన్నా వినతి పత్రం రూపంలో ఇండియన్ ఎంబసీకి పంపాలి. మన సమస్యలపై భారత ప్రభుత్వానికి, ఆయా శాఖలకు ఉత్తరాలు రాయవచ్చు. కానీ, గల్ఫ్‌లో నిరసన ప్రదర్శనలు, ఆందోళనలు చేయడం నిషేధం. ఇక్కడి చట్టాలు చాలా కఠినంగా ఉంటాయి. – షహీన్ సయ్యద్, సామాజిక కార్యకర్త, కువైట్ -
బోధన నైపుణ్యాలు, ఆధునిక పరిజ్ఞానాల్లో సహకారం
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విద్యార్థులకు నాణ్యమైన విద్య, ఉపాధి అవకాశాలు కల్పించేందుకు ప్రత్యేక చర్యలు చేపడుతున్నట్లు ఉన్నత విద్యా మండలి చైర్మన్ తుమ్మల పాపిరెడ్డి తెలిపారు. బోధన నైపుణ్యాల పెంపు, ఆధునిక పరిజ్ఞానంలో పరస్పర సహకారం, విద్యార్థులకు విదేశాల్లో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో తోడ్పాటును అందించేందుకు ఇండో అమెరికన్ ఛాంబర్ ఆఫ్ కామర్స్‌తో (ఐఏ సీసీ) గురువారం ఉన్నత విద్యా మండలి ఒప్పందం చేసు కుంది. ఈ సందర్భంగా పాపిరెడ్డి మాట్లాడుతూ అమెరికా, తెలంగాణలోని వర్సిటీల మధ్య పరస్పర అవగాహన ఏర్పడుతుందన్నారు. అమెరికా వర్సిటీల్లో ఉన్న సాంకేతిక పరిజ్ఞానం, మంచి సిలబస్, విద్యార్థులకు ఉపయోగపడే అంశాలు, బోధనా పద్ధతుల్లో అనుసరిస్తున్న విధానం వంటి అనేక అంశాలను విద్యార్థులకు అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ఆర్.లింబాద్రి, వెంకటరమణ, ఓయూ వీసీ ఎస్.రామచంద్రం, జేఎన్టీయూహెచ్ వీసీ వేణుగోపాలరెడ్డి, వరంగల్ ఎన్ఐటీ డైరెక్టర్ ఎన్వీ రమణారావు మాట్లాడారు. -
ధర్మాన్ని తెలుసు కోవడమే జ్ఞానం తత్త్వ రేఖలు
భారతీయ ఆధ్యాత్మిక జ్ఞానం హేతుబద్ధతను మించిన తర్కాన్ని ఏనాడో చేసింది. వాటి రూపాలే ఉపనిషత్తులు. పూర్ణమదః పూర్ణమిదం అంటూ ‘థియరీ ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ ఎనర్జీ’ సూత్రాన్ని సంస్కృత భాష వేల ఏళ్ల క్రితమే ఉద్భోధించింది. తదేజతి తన్నైజతి అంటూ విశ్వశక్తి గురించి అప్పుడే విశ్లేషణ చేసింది. కామం, సంకల్పం, సంశయం, శ్రద్ధ, అశ్రద్ధ, ధైర్యం, అధైర్యం, లజ్జ, బుద్ధి, భయం అన్నీ మనోరూపాలేనని మానసిక శాస్త్రాన్నీ విడమర్చింది. ఇలా అనేక శాస్త్రాలకు బీజమేశాయి ఉపనిషత్తులు. వీటిని ఆకళింపు చేసుకుంటే ఆత్మ, పరమాత్మల ఏకత్వాన్ని అర్థం చేసుకోవడంతోపాటు ఆచరణలో పెట్టడం సాధ్యం అవుతుంది. తద్వారా మనిషి అరిషడ్వర్గాలను అణచివేసి, నిష్కామకర్మను దినచర్యగా చేసుకోగలుగుతాడు. నిష్కామకర్మ వలన ఎలాంటి భవబంధాలు మనిషిని తాకలేవు. తద్వారా మృత్యుంజయ మంత్రంలో చెప్పినట్టుగా మనిషి మృత్యుభావనను జయించి అమృతమయ జీవితాన్ని జీవించగలుగుతాడు. అదే ఆధ్యాత్మికజ్ఞాన లక్ష్యం.ఈ జ్ఞానాన్ని అర్థం చేసుకోలేక సాధారణ మానవుడు రజ్జుసర్ప భ్రాంతిని పొందుతున్నాడు. అంటే ఈ కనిపించే భౌతిక రూపాలు సత్యమనుకుంటూ బంధనాలు వేసుకుంటున్నాడు. కులం మతం లాంటి బలహీనతలను పొందుతున్నాడు. ప్రకృతిలో మానవుడు ఒక భాగమేనన్న నిజాన్ని మనం అనుక్షణం గుర్తు పెట్టుకోవాలి. ఈ ప్రాకృతిక రూపాలు ఏ విధంగా తమ తమ కర్మలను ఆచరించి ఇతర ప్రాకృతిక రూపాల మనుగడకు దోహదపడుతున్నాయో, ఆ విధంగా మానవుడు కూడా తన మానవత్వ కర్మలను ఆచరించి, పాంచభౌతిక రూపాన్ని సాధించి, చివరకు పంచభూతాల ద్వారా అనంతశక్తిగా మార్పుచెందడమే ధర్మం. అదే మోక్షం. దాన్ని తెలుసుకోవడమే జ్ఞానం. అజ్ఞానం చేత కర్మఫలాలు శాశ్వతం అనుకుంటున్నాం. అయితే, సృష్టి, స్థితి, లయలు అనేవి నిరంతర క్రియలు అని తెలుసుకుని కర్మఫలాలు ఆశించకుండా కర్మలు ఆచరించడమే నిష్కామకర్మ. ఏతావాతా నిష్కామకర్మకు ఆధారం జ్ఞానం. జ్ఞానమంటే హేతువాదమే! జ్ఞాన సాహిత్య నిధి అయిన ఉపనిషత్తులు, ఆదిశంకరుని అద్వైతాన్ని అవగాహనలోకి తెచ్చుకోవడం తద్వారా నిష్కామ కర్మలను ఆచరించడం ద్వారా అరిషడ్వర్గాలను చిదిమి వేయగలం. నిష్కామ కర్మ వల్ల ప్రతిఫలించే తాదాత్మ్యత హృదయాంతరాల నుండి మొదలుకొని ముఖవర్చస్సు వరకు ఆవహించి ఉంటుంది. అద్వైతజ్ఞాని ప్రతి జీవిలోనూ, నిర్జీవిలోనూ, పంచభూతాలలోనూ, శూన్యంలోనూ అంతర్లీనంగా ఉండే ఈశావాస్యమిదం సర్వాన్ని దర్శించగలుగుతాడు. ’అహం బ్రహ్మాస్మి’ని అనుభవించగలుగుతాడు. – గిరిధర్ రావుల -
సత్యాన్వేషణమే జ్ఞానం
చీకటి తొలగాలంటే వెలుగు కావాలి. అరిషడ్వర్గాలు తొలగాలంటే జ్ఞానం కావాలి. జ్ఞానార్జన అంత సులభమైన విషయం కాదు. జ్ఞానమంటే హేతువును అర్థం చేసుకోవడం. జ్ఞానమంటే స్థితిని అవగతం చేసుకోవడం. కార్యకారణ తత్వాన్ని ఆకళింపు చేసుకోవడం. ఆత్మానాత్మ వివేకం పొందడమే జ్ఞానం. ఏతావాతా ‘నేను’ లోపల, బయట ఏముందో అవగతం చేసుకోవడమే జ్ఞానం. జ్ఞాని స్థితప్రజ్ఞుడు. అతనికి సుఖదుఃఖాలతో, జయాపజయాలతో, కష్టనష్టాలతో, ఆరోగ్యానారోగ్యాలతో, కలిమిలేములతో పనిలేదు. ఏదైనా సమానమే. కంటికి కనిపించే భౌతిక రూపాలన్నీ ఆ అనంతమైనశక్తి నుండి ఉద్భవించినవే. పంచభూతాల మేలిమి కలయిక వల్ల శరీరాలు ఏర్పడ్డాయని తెలుసుకోవడం, తిరిగి పాంచభౌతికమైనవన్నీ అదేశక్తిలో విలీనమవుతుందని అర్థం చేసుకోవడం జ్ఞానం. అదే అద్వైతవాదం. జ్ఞానం అనేది ఓ మానసిక తపస్సు. నిరంతర శోధన దృశ్యమాన ప్రపంచం లో ఉన్న మానవుడు దృశ్యమాన ప్రపంచం ద్వారా అదశ్యమైన శక్తిని సాధ్యం చేసుకోవడమే జ్ఞానం. అదే సత్యాన్వేషణ. మరి ఈ సత్యం అంటే ఏమిటి? ‘సతత యతీతి సత్యం’. అంటే నిరంతరంగా ఉండేదే సత్యం. నేను ఉంటానా? ఉండను. మీరు ఉంటారా? ఉండరు. చుట్టూతా ఉండే చెట్టు, పుట్ట, గట్టు, ఏరులు, నదులు, కొండలు, కోనలు ఏవీ నిరంతరంగా ఉండేవి కావు. అంతేనా సూర్యుని నుండి జన్మించిన భూమి నశించేదే. మనందరికీ ఆధారమైన సూర్యుడూ నశిస్తాడు. నక్షత్రాలు, నక్షత్ర మండలాలు నశించి తిరిగి అనంతశక్తిలో భాగమవుతాయి. అంటే భౌతిక రూపంలో ఉన్న ఖగోళ పదార్థాలన్నీ తిరిగి ఆ అనంత ఖగోళ శక్తిగా మారిపోవడం అనేది, అదే శక్తి నుండి ఖగోళ పదార్థాలు రూపొందడం అనేది నిరంతర ప్రక్రియ. అదే విషయాన్ని అంటే దృశ్యమాన భౌతిక ప్రపంచం ఆ అనంతశక్తి నుండి ఏ విధంగా ఉద్భవిస్తుంది అనే విషయం బృహదారణ్యకోపనిషత్తు స్పష్టంగా వివరించింది. ఏ విధంగానైతే సాలీడు నుండి దారం వెలువడుతుందో, ఏ విధంగానైతే నిప్పు నుంచి నిప్పురవ్వ లు వెలువడతాయో, అదే విధంగా ఈ ఆత్మ(అనంతశక్తి) నుండి అన్ని రకాల శక్తులు, అన్ని రకాల లోకాలు, అన్ని రకాల దేవతలు(అభౌతిక జీవులు), సంపూర్ణ స్థూల జగత్తు ఉత్పన్నమౌతుంది. దానిని తెలుసుకో! దాని దగ్గరకు వెళ్ళు! అది సత్యానికే సత్యం! ఆ మూలాధార ప్రాణమే సత్యం! అలా చెప్పేదీ సత్యమే! – రావుల గిరిధర్ -
మీ టూర్ ప్లానింగ్ ఎలా ఉంటుంది..?
కొత్త కొత్త ప్రదేశాలు, సందర్శనీయ స్థలాలను చూడటం వల్ల విజ్ఞానంతో పాటు వినోదం కూడా దొరుకుతుంది. అందుకే చాలా మంది ఏడాదిలో ఒక్కసారైనా ఏదో కొత్త ప్రదేశానికి టూర్ ప్లాన్ చేసుకుంటారు. అయితే మరికొందరు మాత్రం ముందస్తు టూర్ ప్రణాళిక వేసుకోరు. దాంతో కొత్త ప్రదేశంలో ఇబ్బందులు పడతారు. మీరు టూర్ ప్లానింగ్‌లో ఎంత పర్ఫెక్ట్గా ఉంటారు? చెక్ చేసుకోండి. 1. మీరు వెళ్తున్న ప్రదేశం గురించి ముందుగానే ఇంటర్నెట్లోనో, గైడ్ నుంచో సమాచారం సేకరిస్తారు. ఎ. అవును బి. కాదు 2. అవసరమైన మేరకు నగదు ఉంచుకుని డెబిట్ కార్డ్స్, క్రెడిట్ కార్డ్స్, ట్రావెల్ చెక్స్ వంటివి దగ్గర పెట్టుకుంటారు. ఎ. అవును బి. కాదు 3. అక్కడి వాతావరణం, వేసుకోవాల్సిన దుస్తుల గురించి వాకబు చేస్తారు. ఎ. అవును బి. కాదు 4. ఫస్ట్ ఎయిడ్ కోసం అవసరమైన మందులను క్యారీ చేస్తారు. ఎ. అవును బి. కాదు 5. కలుషితమైన నీళ్లు తాగే ప్రమాదాన్ని నివారించడానికి వాటర్‌బాటిల్‌ను క్యారీ చేస్తారు. ఎ. అవును బి. కాదు 6. మీరు వెళ్లాల్సిన ప్రదేశం రూట్ మ్యాప్‌ను జాగ్రత్తగా స్టడీ చేస్తారు. ఎ. అవును బి. కాదు 7. మీరు వెళ్లే ప్రదేశంలోని హోటల్స్, బస చేయదగ్గ ప్రదేశాల గురించి ముందుగానే సమాచారం తీసుకుంటారు. ఎ. అవును బి. కాదు 8. అక్కడ స్థానికంగా ఉంటున్న ఒకరిద్దరి చిరునామాలు ముందుగానే తీసుకుని దగ్గర ఉంచుకుంటారు. ఎ. అవును బి. కాదు 9. దారిలో మీరు చూడదగ్గ ప్రదేశాల విషయంపై కూడా మీకు అవగాహన ఉంటుంది. ఎ. అవును బి. కాదు 10. భద్రత పరంగా టూర్లో తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి మీకు బాగా తెలుసు. ఆ మేరకు భద్రతచర్యలు తీసుకుంటారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు ఏడు కంటే ఎక్కువ వస్తే టూర్ ప్లానింగ్‌లో మీరు పక్కాగా ఉంటారు. మీరు వెంట ఉంటే మీ వెంట వచ్చేవారికి సైతం బోల్డంత ఊరటగా ఉంటుంది. ఒకవేళ ‘బి’ లు ఎక్కువగా వస్తే మీరు టూర్ ప్లానింగ్ గురించి పెద్దగా ఆలోచించరు. అప్పుడు వచ్చే ఇబ్బందుల గురించి అప్పుడే ఆలోచించవచ్చు అని అనుకుంటారు. ఇలా ముందుగా ప్లాన్ చేసుకోకపోతే ప్రయాణంలో ఇక్కట్లు ఎదురయ్యే అవకాశాలు ఎక్కువ. వాటిని వీలైనంతగా తగ్గించుకోడానికి ‘ఎ’లను సూచనలుగా తీసుకుని టూర్ ప్లాన్ చేయండి. -
స్కూలు నుంచి వచ్చిన పిల్లలతో మీరెలా గడుపుతున్నారు?
ఇరుగుపొరుగు పిల్లలు సాయంత్రం స్కూల్ నుంచి ఇంటికొచ్చాక చలాకీగా ఆటల్లో మునిగిపోతారు, గెంతుతారు, గోలచేస్తూ ఆనందం పొందుతారు... ఇలా సంతోషించే వారిని, ఇంటì నుంచే కొంతమంది పిల్లలు చూస్తుంటారు. ఎందుకంటే వాళ్ల ఇంట్లో బాగా స్ట్రిక్ట్. పిల్లలను బయటకు రానివ్వరు... ఆటలాడనివ్వరు. వారిని కేవలం పుస్తకాలకే పరిమితం చేయాలనుకుంటారు. వీరి తల్లిదండ్రులు వారివారి వృత్తుల్లో బిజీగా ఉండటం వల్ల పిల్లల్ని గమనించే సమయం వారికి దొరకదు. దీంతో స్కూలు నుంచి ఇంటికొచ్చాక ఏమిచేయాలో తెలియక పిల్లలు అయోమయంలో పడతారు. పట్టించుకునేవారు లేక తల్లడిల్లుతారు... స్కూలు నుంచి ఇంటికొచ్చిన పిల్లలను మీరెలా గమనిస్తున్నారు? లీజర్ టైంలో వారితో ఎలా గడుపుతున్నారు? 1. పిల్లలను బయటకి తీసుకెళతారు. వారిలో నాలెడ్జ్ (మేధను పెంచే గేమ్స్, బుక్ రీడింగ్ మొదలైనవి) పెంచేందుకు వివిధరకాలుగా ప్రయత్నాలు చేస్తారు. ఎ. అవును బి. కాదు 2. ఉదాయాన్నే పిల్లలను నిద్రలేపి వారిలో యాక్టివ్నెస్ పెంచుతారు. ఎక్కువసేపు పడుకోనివ్వరు. ఎ. అవును బి. కాదు 3. పిల్లలతో పాటు పాఠశాలకు వెళ్ళటమన్నా, వారి యాక్టివిటీస్‌లో పాలుపంచుకోవట మన్నా ఉత్సాహం చూపుతారు. ఎ. అవును బి. కాదు 4. పిల్లలకు హోంవర్క్‌లో సహాయం చేస్తారు. ఎ. అవును బి. కాదు 5. పిల్లలకు కొత్తకొత్త క్రేయాన్స్, పెయింట్స్, పుస్తకాలు కొనిస్తుంటారు. ఎ. అవును బి. కాదు 6. పేరెంట్స్, టీచర్స్ మీటింగ్‌లకు తప్పక హాజరవుతారు. ఎ. అవును బి. కాదు 7. స్కూలు నుంచి ఇంటికొచ్చిన పిల్లలకు రొటీన్ పనులను చెప్పి బోర్ కొట్టించరు. ఎ. అవును బి. కాదు 8. లంచ్‌లో పిల్లలకు ఇష్టమైన, బలమైన ఆహారాన్ని ఇచ్చేలా చూస్తారు. ఎ. అవును బి. కాదు 9. పిల్లలు ఎక్స్‌ట్రాకరికులర్ యాక్టివిటీస్‌లో పాల్గొనేలా చూస్తారు. ఎ. అవును బి. కాదు 10. పాఠశాల నుంచి ఇంటికొచ్చిన పిల్లలను ప్రేమతో దగ్గరకు తీసుకుంటారు. వారి సందేహాలు తీర్చుతారు. ఎ. అవును బి. కాదు ‘ఎ’ లు ఆరు దాటితే పిల్లలను పాఠశాలకే పరిమితం చేయాలని అనుకోరు. స్కూల్ అయిపోయాక కూడ వారి గురించి శ్రద్ధ తీసుకుంటారు. దీనివల్ల పిల్లలు త్వరగా మెచ్యూరిటీ సాధిస్తారు. ‘బి’ లు ఆరు దాటితే పాఠశాల అనంతరం లేదా పాఠశాల బయట పిల్లల గురించి మీరు సరిగా పట్టించుకోరు. పాఠశాలే పిల్లలకు అన్ని విషయాలు నేర్పిస్తుందని అపోహ పడుతుంటారు. స్కూల్లో పిల్లలు ఎన్నో విషయాలు నేర్చుకుంటారు. ఇంటిదగ్గర వారి గురించి శ్రద్ధ తీసుకోవలసిన బాధ్యత తల్లిదండ్రులది. -
నాలెడ్జ్ మన ఆయుధం
-
డ్యాన్స్ చేస్తే తెలివి పెరుగుతుంది
తెలివితేటలు పెరగాలంటే ఉల్లాసంగా, ఉత్సాహంగా కాసేపే డ్యాన్స్ చేస్తే చాలంటున్నారు శాస్త్రవేత్తలు. డ్యాన్స్ చేస్తే మెదడు చురుకుగా మారి, తెలివితేటలు పెరుగుతాయని బ్రిటన్‌లోని కొవెంట్రీ యూనివర్సిటీకి చెందిన శాస్త్రవేత్తలు చెబుతున్నారు. కొందరు విద్యార్థులపై నిర్వహించిన పరిశోధనల్లో ఈ శాస్త్రవేత్తలు పలు ఆసక్తికరమైన విశేషాలను కనుగొన్నారు. వారానికి ఒక సల్సా డ్యాన్స్ క్లాస్‌కు హాజరైన వారిలో విషయాలను ఆకళింపు చేసుకునే శక్తి 8 శాతం, ఏకాగ్రత 13 శాతం, జ్ఞాపకశక్తి 18 శాతం పెరిగినట్లు తమ పరిశోధనలో తేలిందని కొవెంట్రీ వర్సిటీ శాస్త్రవేత్త మైకేల్ డంకన్ చెబుతున్నారు. కేవలం సల్సా అనే కాదని, ఎలాంటి నాట్యమైనా ఏకాగ్రతను గణనీయం పెంచుతుందని ఆయన అంటున్నారు. ఇక ఆలస్యమెందుకు... మెదడు మందకొడిగా మారిందనిపిస్తే మరింకేమీ ఆలోచించకుండా మంచి మ్యూజిక్ పెట్టుకుని కాసేపు ఒళ్లు అలసిపోయేలా స్టెప్పులెయ్యండి చాలు. -
విజ్ఞానం పేరుతో విధ్వంసం
స్పీకర్ మధుసూదనాచారి సాక్షి, హైదరాబాద్: విజ్ఞానం పేరుతో విధ్వంసం జరుగుతోందని, ప్లాస్టిక్ బియ్యం వార్తలు ఆందోళన కలిగిస్తున్నాయని శాసనసభా స్పీకర్ మధుసూదనా చారి అన్నారు. శనివారం ఆయన అసెంబ్లీలోని తన చాంబర్లో కాకతీయ వర్సిటీ పరిశోధనా విద్యార్థులు రూపొందించిన ‘తెలంగాణ ఎకానమి – దృక్కోణం’ పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఆయన మాట్లాడుతూ, ‘సమూలంగా ఒక జాతిని ఏ జీవీ చంపదని.. ప్లాస్టిక్ బియ్యం తింటే మానవ జాతి మనుగడ ఉంటుందా? సమాజం ఎటు పోతోందని ప్రశ్నించారు. నా జీవితంలో ఇద్దరు కాల జ్ఞానులను చూశానని, ఒకరు జయశంకర్ కాగా, రెండో వ్యక్తి సీఎం కేసీఆర్. టీఆర్ఎస్ పేరుతో తెలంగాణ ఉద్యమంలోకి వెళ్ళాలని 2000 సంవత్సరంలొనే అనుకున్నాం. ఏం జరుగుతుందో ఆనాడే కేసీఆర్ చెప్పారు. తెలంగాణ ఉద్యమం ఒక వైవిధ్యమైన ఉద్యమం’అని స్పీకర్ పేర్కొన్నారు. ‘తెలంగాణ ఎకానమి – దృక్కోణం’ పుస్తకాన్ని తెచ్చిన ప్రొ.భాస్కర్‌ను ఆయన అభినందించారు. -
జ్ఞాన భాండాగారాలు
జీవన కాలమ్ ఈ దేశం ఎంతటి అజ్ఞానాన్నయినా తట్టుకుని భరించగలదు. కానీ ‘జ్ఞానం’ ఎక్కడో జైళ్లలో భద్రంగా ఎదురు చూస్తుంటుంది. చౌతాలాని మార్గదర్శకంగా గ్రహించండి. మీ చదువులు మీ కోసం జైళ్లలో భద్రంగా ఎదురు చూస్తున్నాయని మరవకండి. ఈ దేశంలో చాలామంది రాజకీయ నాయకులు జైలుకి వెళ్లాల్సిన అవసరం ఉందని తను వెళ్లి నిరూపించిన సీని యర్ నాయకులు ఓంప్రకాష్ చౌతాలా. ఆయన ఉపాధ్యాయుల నియామకం విషయంలో పెద్ద కుంభకోణాన్ని జరిపి, జైలుకి వెళ్లి బుద్ధిగా చదువుకుని తన 82వ ఏట ఇప్పుడిప్పుడే ఇంటర్మీడియెట్ పరీక్ష పాసయ్యారు. వారు తీహార్ జైల్లో గత నాలుగున్నర ఏళ్లుగా ఉంటున్నారు. ఇది ఈ దేశ చరిత్రలో మార్గదర్శకమైన పరిణామంగా నేను భావిస్తున్నాను. ఈ వార్తను ముఖ్యంగా లల్లూ ప్రసాద్ యాదవ్ వంటి వారు శ్రద్ధగా గమనించాలి. వారు గడ్డి కుంభకోణంలో ఆ మధ్య జైలుకి వెళ్లి వచ్చారు. ఆ సమయాన్ని ఆయన వృధా చేసుకున్నారని చౌతాలాని చూస్తే అర్థమౌతుంది. ఆ సమయంలో కనీసం రెండో ఫారం చదివినా రేపు ప్రభుత్వం ఫైళ్లు చదువుకోడానికి ఉపయోగపడేది. అలాగే లల్లూ ఇద్దరు కొడుకులు–తేజ్ ప్రతాప్ యాదవ్, తేజస్వీ యాదవ్ బిహార్‌లో మంత్రులుగా ఉన్నారు. వారిలో ఒకాయన ఉప ముఖ్యమంత్రి. అర్హతలు ఏమిటీ అనేది అర్థం పర్థం లేని ప్రశ్న. క్లాసయినా పాసయే సదవకాశాన్ని కల్పించాలి. ‘మిష’ అంటారా? తమ తండ్రిగారి లాగ ఏదో గడ్డి తిని ఆ సరాసరి ముఖ్యమంత్రి పదవికి వచ్చే అవకాశముంది. కనుక వారిని వెంటనే జైలుకి పంపి రెండో తరగతికయినా తర్ఫీదు ఇప్పిస్తారని మనం ఆశించవచ్చు. ఈ దేశంలో జైళ్లకు ఎంతో అపకీర్తి ఉంది. అలనాడు తిలక్ మహాశయులు జైల్లో ఉంటూ భగవద్గీతకి వ్యాఖ్యానం రాశారు. రాజాజీ పిల్లలకు అర్థమయ్యే సరళమైన ఇంగ్లీషులో రామాయణ, భారతాలను వ్రాశారు. నెహ్రూగారు ‘డిస్కవరీ ఆఫ్ ఇండియా’ రాశారు. ఇవన్నీ ఆ పెద్దల వికారాలుగా మనం సరిపెట్టుకోవచ్చు. చౌతాలా హర్యానా ముఖ్యమంత్రిగా ఉంటే ఏనాడయినా ఇంటర్ పరీక్ష పాసయ్యేవారా? వారికి చిన్నతనంలో చదువు సరిగ్గా సాగలేదు. తర్వాత సాగించాలనుకుంటే తండ్రి దేవీలాల్‌తో పాటు రాజకీయాలలో ఉండడంవల్ల చదువుకునే అవకాశం రాలేదని ప్రస్తుత హర్యానా ప్రతిపక్ష నేత–అభయ్ సింగ్ చౌతాలా తన తాత గురించి చెప్పారు. ఈ మధ్య ఒక నానుడి ఏర్పడింది. ‘నువ్వేం చదువుకోలేదా? మరేం పర్వాలేదు. సరాసరి పార్లమెంటుకి వెళ్లే అర్హతలున్నట్టే. లేదూ? చదువుకోవాలని ఉందా? నిక్షేపంగా జైలుకి వెళ్లు’. ఈ దేశంలో ఏ అర్హతా అక్కరలేని వ్యాపకం ఒక్కటే–రాజకీయ రంగం. చదువుకుంటే గుమస్తావి అవుతావు. చదువు లేకపోతే మంత్రివి అవొచ్చు. రేపట్నుంచి జస్టిస్ కర్ణన్ వంటివారు జైల్లో ఉంటారు. మన జైళ్లలో ఉన్న కొందరు మహనీయులైన నాయకుల పేర్లు– జయలలిత, కనిమొళి, శశికళ, సురేష్ కల్మాడీ, అక్బరుద్దీన్ ఒవైసీ, పప్పు యాదవ్, ఎ. రాజా, యడ్యూరప్ప, అమర్ సింగ్, పండిత సుఖ్రాం, మధుకోడా. అయితే వీరంతా జైళ్లను సద్వినియోగం చేసుకోలేదని చెప్పాలి. తను హత్యకు గురవడానికి చాలాకాలం ముందు చెర్లపల్లి జైలు నుంచి – జూలకంటి శ్రీనివాస్ అనే మొద్దు శీను నా నవల ‘సాయంకాలమైంది’ చదివి నాలుగు పేజీల ఉత్తరం రాశాడు. ఆ నవల చదివి ఉత్తరం రాసిన మరొకాయన ఉన్నారు. ఈ దేశపు మాజీ ప్రధాని పీవీ నరసింహారావుగారు. ఆ రెండు ఉత్తరాలూ నా దగ్గర భద్రంగా ఉన్నాయి. అయితే మొద్దు శీను ఉత్తరం కొట్టొచ్చినట్టు గుర్తుకు వస్తూంటుంది. కారణం– అతడు జైల్లో లేకపోతే కలలో కూడా నవల చదివి ఉండడు. ఏకాంతం అంతర్ముఖుడిని చేస్తుంది. ఆ నిశ్శబ్దం– తనకు లేనిదీ, తను కోల్పోయినదీ–గుర్తుకు తెస్తుంది. తీరిక, నిస్సహాయమైన ఏకాంతం–దాన్ని భర్తీ చేసుకునే వెసులుబాటుని కల్పిస్తుంది. అందుకు కనీసం – ఒక నేరమైనా చేయాలి. జైలుకి వెళ్లే అర్హతని సంపాదించుకోవాలి. అప్పుడు – కనీసం ఇంటర్మీడియెట్ చదువయినా అబ్బుతుంది. లేకపోతే ఏమవుతుంది? మీరు రాష్ట్రానికయినా ముఖ్యమంత్రులయిపోతారు. లేదా జైలుకి వెళ్లే తండ్రులుంటే పార్లమెంటు సభ్యులయినా అయిపోతారు. ఈ దేశం ఎంతటి అజ్ఞానాన్నయినా తట్టుకుని భరించగలదు. ఈ సంస్కృతికి ఉన్న మన్నిక అది. కానీ ‘జ్ఞానం’ ఎక్కడో జైళ్లలో భద్రంగా ఎదురు చూస్తుంటుంది. కనుక నాయకులకిదే పిలుపు. చౌతాలాని మార్గదర్శకంగా గ్రహించండి. సత్వరంగా ఏ ఉపాధ్యాయుల కొంపలో ముంచండి. లేదా గడ్డి తినండి. మీ చదువులు మీ కోసం జైళ్లలో భద్రంగా ఎదురు చూస్తున్నాయని మరిచిపోకండి. గొల్లపూడి మారుతీరావు -
విజ్ఞానం ద్వారానే మానవ వికాసం
కర్నూలు (న్యూసిటీ): విజ్ఞానం ద్వారానే మానవ వికాసం కలుగుతుందని జన విజ్ఞాన వేదిక జిల్లా అధ్యక్షుడు యాగంటీశ్వరప్ప పేర్కొన్నారు. ఆదివారం కృష్ణానగర్‌లోని జన విజ్ఞాన వేదిక కార్యాలయంలో జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 28వ తేదీన జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా సైన్సులో వచ్చిన మార్పులను వివరించాలన్నారు. సైన్సును సక్రమంగా వినియోగించుకొనకపోతే వినాశనం జరుగుతుందన్నారు. బాల్యం నుంచే సైన్సుపై అభిరుచి పెంచుకునేలా శాస్త్రీయ విద్య ఉండటం సమాజం గుర్తించాలని పేర్కొన్నారు. సమావేశంలో జన విజ్ఞాన వేదిక జాతీయ ప్రధాన కార్యదర్శి మహమ్మద్‌మియ్యా, రాష్ట్ర కోశాధికారి సురేష్‌కుమార్, జిల్లా ప్రధాన కార్యదర్శి బాబు, కార్యదర్శులు శ్రీరాములు, వీరేష్, కోశాధికారి దామోదరం, జిల్లా నాయకులు ఎలమర్తి రమణయ్య, జిల్లా మండల శాఖ ప్రతినిధులు పాల్గొన్నారు. -
జంగిల్ ఫీట్స్
హ్యూమర్ ప్లస్ మనకెంత తెలుసో అదే జ్ఞానం. ఒక తొండ బస్కీలు లేసి తీసి తనది సిక్స్‌ప్యాక్ బాడీ అనుకుంది. జ్ఞానాన్ని అమ్ముకోవడం తెలిస్తే దాన్ని విజ్ఞానమంటారు. అందుకే అడవిలో జిమ్స్టార్ట్ చేసింది. ఒక ఊసరవెల్లి వచ్చి రిబ్బన్ కట్ చేసింది. రకరకాల రంగులు మారుస్తూ అది ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. తొండ ప్రత్యేకత ఏమంటే అది ప్రతిదానికీ తల ఊపుతూ ఉంది. ఈ ఒక్క లక్షణముంటే చాలు మనమెక్కడున్నా పెద్దమనిషి అని పిలుస్తారు. అందువల్ల తొండకి అండదండలు లభించాయి. జిమ్‌లో బాడీమసాజ్, వెయిట్‌లాస్, మెమరీలాస్ ఇలా చాలా ఐటమ్స్ ప్రవేశపెట్టింది. మొదట ఒక నత్తవచ్చి రన్నింగ్ నేర్పించమని అడిగింది. ‘‘నత్తలతో పరిగెత్తించడం కార్పొరేట్ సంస్కృతి, పరిగెత్తేవాటిని నత్తలుగా మార్చడం ప్రభుత్వ విధానం. ఇది అడవి. భోజ్యమే తప్ప రాజ్యముండదు’’ అని తొండ రెండు బస్కీలు తీసింది. బస్కీలు తీస్త్తూ మాట్లాడ్డం, మాట్లాడుతూ బస్కీలు తీయడం తొండ బాడీ లాంగ్వేజ్.నత్తకి స్కేటింగ్ బూట్లు కట్టి ఒక తోపు తోస్తే ‘కొత్తగా రెక్కలొచ్చెనా’ అని పాడుకుంటూ వెళ్లింది. షికారు ముగిసిన తర్వాత నత్త చిత్త భ్రాంతితో పొర్లుదండాలు పెట్టి ‘‘నత్తకే వేగం నేర్పావంటే నువ్వు మామూలు తొండవి కాదు, ఉద్ధండ పిండానివి’’ అని పొగిడింది.‘‘ఉన్నచోటునే ఉంటూ పరిగెత్తుతున్నామని అనుకోవడం భ్రాంతి, భ్రమలు, కలలే జీవన విధానమైనప్పుడు భ్రాంతిని కాంతిమతం చేసుకోవాలి. దీన్నే పర్సనాలిటి డెవలప్మెంట్ అంటారు’’ అంది బస్కీటోన్తో తొండ.తరువాత ఒక ఎలుగుబంటి వచ్చి బాడీమసాజ్ చేయమని అడిగింది. ‘‘నీలో ఏది బొచ్చో, ఏది బాడీనో తెలుసుకోవడానికే రెండు రోజులు పడుతుంది’’ అని తొండ గొణుక్కుని, ఖడ్గమృగాన్ని అవుట్‌సోర్సింగ్‌కి తీసుకుంది. ఒక గ్యాలన్ ఫిల్టర్ వాటర్ వేతనంగా ఇవ్వాలని అది కోరింది. ఎలుగుబంటిని చూడగానే ఖడ్గమృగం ఒక్కసారిగా జడుసుకుంది. ఒక బూజుకర్ర తీసుకుని దాని ఒంటిపై ఎడాపెడా బాదింది. దట్టమైన దుమ్ముధూళితోపాటు కొన్ని వందల తేనెటీగలు కూడా ‘జుమ్మంది నాదం’ అంటూ పైకి లేచి కోపంతో ఖడ్గమృగం వెంటపడ్డాయి.‘వీటికి నోట్లోనే కుట్టు మిషనుంటుంది’ అనుకుంటూ ఖడ్గమృగం పారిపోయింది. తేనెటీగల్ని ఆశ్చర్యంగా చూస్తూ ‘‘ఇంతకాలం ఒంటిపై తేనె పట్టు ఉంచుకుని తేనెకోసం చెట్లూపుట్టలూ వెతికానా?’’ అంది ఎలుగుబంటి. ‘‘అదే ఈ ప్రపంచానికి పట్టిన తెగులు. తమలో ఉన్నది తెలుసుకోలేరు. దేనికోసమో వెతుకుతూ ఉంటారు. నీ అన్వేషణ నీతోనే ముగుస్తుంది’’ అంది తొండ. ఒక కొండచిలువ బుసబుస వచ్చి తనకి స్కిప్పింగ్ నేర్పించమని అడిగింది. ‘‘ప్రపంచమంతా రజ్జు సర్పభ్రాంతితో చస్తూ వుంది. మనం తాడనుకున్నవాడు పాముగా మారుతాడు. పాము అనుకుని హడలి చస్తే అక్కడ తాడూ బొంగరమూ రెండూ ఉండవు. పాము వచ్చి తాడును కోరుకోవడం వాస్తవ విరుద్ధం. మనం నకిలీగా జీవించాలి తప్ప, మనలాంటి నకిలీలను తయారు చేయకూడదు’’ అంది తొండ. కొండ చిలువ వినలేదు. దానికి స్కిప్పింగ్ తాడు ఇస్తే రెండుసార్లు ఎగిరింది. మూడోసారి తన తోకనే తాడు అనుకుని దబ్బున పడింది. తరువాత ఒక జింక వేగంగా వగరుస్తూ వచ్చి తనకి చిరుతకంటే వేగంగా పరిగెత్తడం నేర్పమని అడిగింది. తొండ విషాదంగా నవ్వి ‘‘నువ్వెంత వేగంగా పరిగెత్తినా, నిన్ను తినేవాడు నీకంటే వేగంగా పరిగెత్తుకుంటూ వస్తాడు. చిరుత నీకు మృత్యురూపమైతే గద్ద నాకు మృత్యురూపం. మృత్యువు ఒక నీడలా మనల్ని వెంటాడుతూ ఉంటుంది. ఏదో ఒక రోజు అది మనముందు నిలబడి చిరునవ్వు నవ్వుతుంది. అప్పుడు మనకు ఏడుపొచ్చినా నవ్వాల్సిందే’’ అంది.ఇంతలో చిరుతవచ్చి జింకని పట్టేసుకుంది. గద్దకి దొరక్కుండా తొండ మాయమైంది. - జి.ఆర్.మహర్షి -
మునిగిపోకుండా ఉండాలంటే..!
బౌద్ధవాణి ‘సమ్యక్ సంకల్పం, సమ్యక్ జ్ఞానం ఉండి, మన మనస్సు దృఢంగా ఉంటే మనం దుఃఖ సాగరంలో మునిగిపోం’ అని తెలియజెప్పే సంఘటన ఇది. బుద్ధుడు శ్రావస్తిలోని జేతవనంలో ఉన్నాడు. ప్రతిరోజూ సాయంత్రం తొలి జాములో ధర్మోపదేశం చేసేవాడు. శ్రావస్తి సమీపంలో అచిరవతి నది పాయ ఒకటి ఉండేది. దానికి ఆవలి వైపు గ్రామంలో సుజాతుడనే బుద్ధుని అభిమాని ఒకడుండేవాడు. అతను గృహస్థుడే అయినా ‘బుద్ధ ధమ్మా’న్ని చక్కగా పాటిస్తుండేవాడు. ‘పంచశీల’ను ఆచరించేవాడు. ఒకసారి అతను బుద్ధుని ప్రవచనం వినడానికి బయలుదేరాడు. నదీ తీరానికి వచ్చేసరికి పడవల వాళ్లెవరూ లేరు. అయినా వెళ్లాలని నిశ్చయించుకున్నాడు. ధైర్యంతో నీటిలో దిగాడు. ‘పంచశీల’ పఠించాడు. ధమ్మాన్ని స్మరించాడు. అడుగు ముందు కేశాడు. విచిత్రం అతను నీటిలో దిగిపోలేదు. నీటి పైన నడుస్తూ వెళ్లిపోతున్నాడు. అలా కొంతదూరం వెళ్లాడు. అక్కడే నదిలో అలలు అల్లకల్లోలంగా ఉన్నాయి. అతని దృష్టి అలల మీదికి మళ్లింది. అంతే... మనస్సులో భయం పొడసూపింది. అంతే... సుజాతుడు మెల్లగా నీటిలోకి దిగబడిపోతున్నాడు. అతను వెంటనే చంచలమైన తన చిత్తాన్ని దిటవు పరచుకున్నాడు. తిరిగి నీటి మీద తేలి, నడచి ఆవలి ఒడ్డుకు వెళ్లిపోయాడు. బుద్ధుని దగ్గరకు వెళ్లి నమస్కరించాడు. ‘‘సుజాతా! ఎలా వచ్చావు?’’ అని అడిగాడు బుద్ధుడు. సుజాతుడు జరిగింది చెప్పాడు.‘‘దృఢ చిత్తం లేనివానికి మనస్సు వ్యాకులత చెందుతుంది. బలహీనపడుతుంది. లక్ష్యాన్ని చేరనీయకుండా, నిస్తేజంగా ముంచేస్తుంది. సద్ధర్మమే నిన్ను దుఃఖమనే ఏట్లో మునిగిపోకుండా కాపాడుతుంది’’ అని బుద్ధుడు చెప్పాడు.ఈ కథలో ఒక చక్కటి నీతి ఉంది. భయాన్ని జయించడం, చిత్త బలాన్ని చేకూర్చుకోవడం, సడలని సంకల్పం వల్ల ఎంతటి అవాంతరాన్నైనా దాటవచ్చు అనే బుద్ధ సందేశం. - బొర్రా గోవర్ధన్ -
తల్లికి రోజూ పూజ చెయ్యడమా?
మాతృభక్తి అంటే... చిన్నప్పుడు పెద్దలు పిల్లల ఆలనాపాలనా చూస్తే, పిల్లలు పెద్దయ్యాక తల్లితండ్రుల ఆలనా పాలనా చూడాలి. ఏ కారణంగానైనా తల్లితండ్రులు పిల్లల పెంపకంలో శ్రద్ధ వహించక పోయినా వారిని చక్కగా చూసుకోవడం పిల్లల కర్తవ్యం. మాతృదేవోభవ’ అన్న గురువు ఆదేశం అందరికీ ఆచరణీయం. దాని అర్థం - ‘తల్లే దైవంగా కలవాడవు కమ్ము’ అని. తల్లి మొదటి గురువు, దైవం కూడా! భక్తి ప్రపత్తులతో తల్లిని సేవించాలి. తల్లి మాటను తల దాల్చాలి. ఇది వేదవాక్కు. ఆదర్శ పురుషులుగా పేరొందిన వారందరూ తల్లి మాటను శిరసావహించినట్టు చరిత్ర చెబుతోంది. ఎందుకంటే తల్లిగా ఏ స్త్రీ కూడా బిడ్డకి హాని చేయాలని అనుకోదు. వ్యక్తిగా, కూతురిగా, సోదరిగా, భార్యగా, కోడలిగా చెడ్డదై ఉండవచ్చు కానీ, తల్లిగా మాత్రం చెడ్డతనం ఏ కోశానా ఉండదు. ఎంతైనా తల్లి కూడా మానవమాత్రురాలు. ఆవిడ తెలివి, జ్ఞానం, పరిస్థితులు, మానసిక స్థితి మొదలైన అంశాల మీద ఆమె మాటలు ఆధారపడి ఉంటాయి. ఈ పరిమితులను అర్థం చేసుకుంటే తప్ప అవి ఆచరణ యోగ్యాలా కాదా అనేది తెలియదు. ఇవేవీ పట్టించుకోకుండా అమ్మ అన్నది కదా అని పాటించి, జీవితాలను వ్యర్థం చేసుకున్న సామాన్యులు ఎందరో కనపడతారు. విచక్షణ లేకపోవడమే దీనికి కారణం. ప్రహ్లాదుడు తండ్రి మాటని పాటించాడా? అలాగని ఎదిరించలేదు, చులకన చెయ్యలేదు. తండ్రిది సరైన దారి కాదు కనుక, తండ్రి మీద ఉన్న భక్తితో అతడిని సరైన దారిలో పెట్టడానికి ప్రయత్నం చేశాడు. తల్లి కూడా పొరబాటున క్షణికావేశంలోనో, తెలివి లేకో, మతిమాలో ఏదైనా చెబితే - మాతృభక్తి ఉన్నవారు తల్లికి సర్దిచెప్పవలసి ఉంటుంది. అంతేకానీ ఆమెకు తెలియక విషం పెడుతుంటే తెలిసిన కొడుకో, కూతురో మాతృభక్తి పేరుతో తినరు కదా! మాతృభక్తి అంటే తల్లికి రోజూ పూజ చెయ్యడం కానట్టే, మూర్ఖంగా చెప్పినవన్నీ చెయ్యడం కూడా కాదు. ఆమె ధర్మమార్గంలో చరించేలా, ఉద్ధరించబడేలా, ఉత్తమగతులకు వెళ్ళేలా చేయడం నిజమైన మాతృభక్తి. దీనికి శ్రీరామచంద్రుడు పెద్ద ఉదాహరణ. తల్లి కౌసల్యాదేవి రాముణ్ణి అడవికి వెళ్ళవద్దని ఎంతగానో బతిమాలింది. ‘తండ్రి మాట విన్నట్టే, నా మాట కూడా వినాల్సి ఉంది’ అన్నది. నిజానికి రాముడు తండ్రి మాట కూడా వినలేదు. దశరథుడు కూడా రాముణ్ణి అరణ్యానికి వెళ్ళవద్దనే అన్నాడు. తనను చెరసాలలో ఉంచి కానీ, చంపి కానీ సింహాసనాన్ని అధిరోహించమనే అడిగాడు. కానీ, తండ్రి చెప్పిన ఆ మాటలు రాముడు విన్నాడా? లేదే! పినతల్లి అయిన కైకకు తండ్రి గారిచ్చిన మాటను అమలు జరిపి, తండ్రిని సత్యవాక్య పాలకుణ్ణి చేశాడు. అదేవిధంగా తల్లిని కూడా ధర్మపాలన చేయడానికి ప్రోత్సహించాడే కానీ, కౌసల్య దుఃఖవివశురాలై అన్న మాటల్ని అమలు చేయలేదు. పిల్లల మీద ఎంత ప్రేమ ఉన్నా, వృద్ధాప్యంలో భర్తను వదలి ఉండడం ధర్మం కాదనీ, భర్తకు అవసరం ఉన్నప్పుడు అతడికి సేవ చెయ్యడం ముఖ్యధర్మమనీ కౌసల్యకు పాతివ్రత్య ధర్మాలను గుర్తుచేశాడు. ఆమెకి తెలియవని కాదు. దుఃఖం మాటున మరుగుపడ్డాయి. మాతృభక్తి అంటే అది. అంతేకానీ, తల్లి కదా అని చెప్పిన ప్రతి వెర్రి మొర్రిమాటనూ అమలు చెయ్యాలనుకోవటం మూర్ఖత్వం. ఇక, మూర్తీభవించిన ధర్మమైన అన్నగారి అడుగుజాడల్లో నడిచిన భరతుడు తల్లి కోరికను అనుసరించి సింహాసనాన్ని అధిరోహించలేదే! అయాచితంగా మహాసామ్రాజ్యం లభించింది కదా అని అంగీకరిస్తే, ఉభయతారకంగా ఉండేది. రాజ్యానికి రాజ్యం. మాతృవాక్య పరిపాలకుడన్న ఖ్యాతి. దోషం - ధర్మవిరుద్ధమైన కోరిక కోరిన తల్లిది. తనకు మాత్రం లాభం, సుఖం. అలా తల్లికి పాపం (అధర్మ దోషం) వస్తుంటే పట్టించుకోకుండా చూస్తూ ఊరుకుంటే అది తల్లి మీద ప్రేమ ఉన్నట్టా? తల్లికి పాపం రాకూడదనీ, ఆమెకు దుర్గతి రాకూడదనీ కైక కోరికను నిరాకరించి ఆమెకు ఎంతో మేలు చేశాడు భరతుడు. ఇది మాతృభక్తి. పిల్లలకు భక్తి ఉన్నట్టే పెద్దలకు వాత్సల్యం కూడా ఉండాలి. ‘చిన్నతనంలో వాళ్ళకు సేవ చేశాం కాబట్టి, ఇప్పుడు మాకు చెయ్యవలసిందే’ అనడం సరి కాదు. అది తల్లితండ్రుల కర్తవ్యం. పెళ్లి చేసుకోవడమే ఈ బాధ్యతను స్వీకరించడానికి సిద్ధమయ్యామని చెప్పడం! పిల్లలను పెంచడం ఏదో పెద్ద త్యాగం చెయ్యడమనుకునే వారికి సంతానమెందుకు? వృద్ధాప్యంలో తమని చూస్తారనుకుని పిల్లల్ని పెంచితే అది లాభనష్టాలను బేరీజు వేసుకొని చేసే వ్యాపారమవుతుంది. తల్లితండ్రులకు లేని మానవతా భావన పిల్లలకు ఎలా ఉంటుంది? ఉండాల్సిన అవసరం ఏముంది? నిజమే! చిన్నప్పుడు పెద్దలు పిల్లల ఆలనాపాలనా చూస్తే, పిల్లలు పెద్దయ్యాక తల్లితండ్రుల ఆలనా పాలనా చూడాలి. ఏ కారణంగానైనా తల్లితండ్రులు పిల్లల పెంపకంలో శ్రద్ధ వహించక పోయినా వారిని చక్కగా చూసుకోవడం పిల్లల కర్తవ్యం. అంత మాత్రాన పిల్లల్ని వారి సుఖసంతోషాలను వదులుకుని తమకు సేవ చెయ్యమనడం (తమకు శక్తి ఉన్నా కూడా) ఎంత సమంజసం? ‘బతికినంత కాలం బతకం కదా’ అంటారు. కానీ, ఈలోగా పిల్లలు (కొడుకు కోడలో, కూతురు అల్లుడో) వృద్ధులై పోతారు. జీవితాన్ని అనుభవించే వయసు దాటిపోయి ఉంటుంది. తాము యౌవనంలో అనుభవించిన సుఖాలనూ, భోగాలనూ తమ సంతానానికి దూరం చెయ్యడం భావ్యమా? ఏ కారణంగానైనా తాము సుఖాలని అనుభవించ లేదు కనుక అసూయతో పిల్లల్ని వాటికి దూరం చెయ్యడం న్యాయమా? తల్లితండ్రుల మీద ప్రేమ, భక్తి ఉన్న వారు గమనించవలసింది - వారు చెప్పినదాన్ని ఆచరించడం వల్ల వారికి ఉత్తమగతులు లభిస్తాయా, లేదా అన్నది. అంతేకానీ, పెద్దలు కదా అని వాళ్ళు చెప్పిన తప్పు పనులు చెయ్యడం వల్ల వాళ్ళూ తామూ కూడా ఇహపరాలను కోల్పోతారు. అటు పెద్దలు, ఇటు యువతరం గుర్తించవలసిన అంశం ఇది. - డా. ఎన్. అనంతలక్ష్మి -
సాంకేతిక పరిజ్ఞానంపై శిక్షణ
కాకినాడ సిటీ : జిల్లాలోని డ్వాక్రా సంఘ సభ్యులకు సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పించేవిధంగా శిక్షణ కార్యక్రమాలు నిర్వహించేలా ప్రత్యేక కార్యాచరణను జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ రూపొందించింది. ఈ మేరకు ముందుగా సభ్యులకు శిక్షణనిచ్చేందుకు ప్రతి మండల పరిధిలోని ఆరుగురు సభ్యులను శిక్షకులుగా (ఇంటర్నెట్ సాతీ)ఎంపిక చేశారు. ఎంపిక చేసిన సాతీలకు ముందుగా శిక్షణ ఇచ్చేందుకు షెడ్యూల్‌ను రూపొందించారు. 5,6 తేదీల్లో అమలాపురం టీటీడీసీలోనూ, 7న రాజమండ్రి ఎన్‌ఎంఎస్‌లోనూ, 13 నుంచి 18వ తేదీ వరకు సామర్లకోట టీటీడీసీలోనూ శిక్షణ ఇవ్వనున్నారు. ఇక్కడ శిక్షణ పొందిన సాతీలు మూడు నెలల వ్యవధిలో క్షేత్రస్థాయిలో 3లక్షల 69వేల 600 సంఘ సభ్యులకు డిజిటల్ లిట్రసీపై శిక్షణ ఇస్తారని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ పీడీ మల్లిబాబు తెలిపారు. -
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించేలా కృషి చేయాలి
–డీఎస్ఓ నాగేశ్వర్రావు అవంతీపురం(మిర్యాలగూడ రూరల్): విద్యార్థులు చదువుకే పరిమితంగా కాకుండా అన్ని రంగాల్లో రాణించేలా గిరిజన గురుకుల పాఠశాల విద్యార్థులకు శిక్షణ ఇస్తున్నట్లు గిరిజన గురుకుల పాఠశాల జిల్లా పర్యవేక్షణాధికారి నాగేశ్వర్రావు అన్నారు. సోమవారం మండల పరిధిలోని అవంతీపురం గిరిజన బాలుర పాఠశాలలో సందర్శంచిన అనంతరం మాట్లాడుతూ రాష్ట్ర గురుకుల సెక్రెటరీ ప్రవీణ్ కుమార్ విద్యార్థులకు ఉత్తమ విద్యాతోపాటు క్రీడలు, పర్వతారోహణ, సివిల్ సర్వీస్ వంటి వాటికి విద్యార్థి దశ నుంచే అవగాహన కల్పించి, అందులో రానించే విధంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. ఇప్పటివరకు జిల్లాలో నాలుగు గిరజన గురుకుల పాశాలలు ఉండగా అందులో 2,500 మంది విద్యార్థులు విద్యానభ్యసిస్తున్నట్లు తెలిపారు. అన్ని పాఠశాలల్లో ఈ విద్యా సంవత్సరం డిజిటల్ తరగతిలు నిర్వహిస్తున్నమని అందుకు కావలసిన పరికరాలు అయా పాఠశాలలకు పంపిణీ అయినట్లు తెలిపారు. ప్రభుత్వం ఈ విద్యా సంవత్సరంలో జిల్లాకు ఆరు అదనపు గురుకులాలను మిర్యాలగూడ , మల్లెపల్లి , చివ్వెంల బాలకలకు, దామరచర్ల, దేవరకొండ ,పెద్దవూర లో బాలురకు మంజూరు చేసిందిన్నారు. జిల్లా నుంచి 10 మంది విద్యార్థులు పర్వతారోహణ శిక్షణకు ఎంపిపైనట్లు తెలిపారు. విద్యార్థులకు అక్టోబర్ 14 నుంచి 16 వరకు ఖమ్మం జిల్లాలో ని గుండాల,సూదిమెట్లలో జోనల్ స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్ నూనె కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్క్యూపీ విధానంతో విజ్ఞానం
∙సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ స్టేషన్ ఘన్ పూర్ : ఎన్క్యూపీ విధానంతో ఉపాధ్యాయులతో పాటు విద్యార్థుల్లో విజ్ఞా నం, శాస్త్రీయ దృక్ఫథం పెంపొందుతుందని సాంఘిక సంక్షేమ గురుకులాల కార్యదర్శి ప్రవీణ్‌కుమార్ అన్నారు. స్థానిక సాంఘీక సంక్షేమ గురుకుల పాఠశాలలో సోమవారం ఏర్పాటుచేసిన ఎన్క్యూపీ సెమినార్ ఆయన పరిశీలించారు. ఆ తర్వాత ప్రవీణ్‌కుమార్ విలేకరులతో మాట్లాడుతూ ఎన్క్యూపీ విధానాన్ని ఒక్క శాతం మంది ఉపాధ్యాయులే వ్యతిరేకించారని, ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకువెళ్లామని తెలిపారు. కాగా, ఎన్క్యూపీ విధానం ఉపాధ్యాయులు, విద్యార్థులకు లాభదాయకమని, ఈ విధానాన్ని తొలిసారి స్టేషన్ ఘన్ పూర్ లో ప్రవేశపెట్టామని పేర్కొన్నారు. వరంగల్, ఖమ్మం, ఆదిలాబాద్, కరీంనగర్ జిల్లాలకు చెందిన ఉ పాధ్యాయులు హాజరైన ఈ సెమినార్లో లక్ష్మ య్య, గీతాలక్ష్మి, హైమావతి, డీసీఓ రూపాదేవి, ప్రిన్సిపాల్ కాళహస్తి పాల్గొన్నారు. -
విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలి : డీసీఓ
అంతీపురం(మిర్యాలగూడ రూరల్), విద్యార్థులు అన్ని రంగాల్లో రాణించాలని గురుకుల పాఠశాలల జిల్లా కోఆర్డీనేటర్ వై. నాగేశ్వర్రావు కోరారు. శనివారం మండలంలోని అవంతీపురం గిరిజన బాలుర గురకుల పాఠశాలలో జిల్లా స్థాయిలో నిర్వహించిన విగ్నోసైట్ ఫెస్ట్ సభలో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో దేవరకొండ, మిర్యాలగూడ ,తుంగతుర్తి, దామరచర్ల పాఠశాలల విద్యార్థులు పాల్గొన్నారు. చదువుతో పాటు ఆటలు, ఉపన్యాసాలు, క్విజ్, ఆధునిక పరిజ్ఞానం పలు అంశాలు నేర్చుకొని ప్రతిభను కనబరచాలన్నారు. విజేతలకు బహుమలు పంపిణీ‡ ... విగ్నోఫెస్ట్లో నిర్వహించిన వివిధ పోటీ ల్లో గెలిచిన విద్యార్థులకుS నాగేశ్వర్రావు బహుమతుల ప్రదానం చేశారు. వ్యాసరచల న పోటీ(ఈఎం)లో ప్రథమ బహుమతి, ఆర్ విజయ్(మిర్యాలగూడ ), ద్వితీయ ఎల్. స్నేహ(దేవరకొండ), తెలుగు విభాగంలో ఆర్. పవన్(ఎంఎల్‌జీ), ద్వీతీయ స్థానంలో దివ్య(దామరచర్ల) నిలిచారు. ఉపన్యాస పోటీల్లో బి. భరత్(ఎంఎల్‌జీ), శ్రావణి(డీవీకే), ఇష్టాగోష్టీ, క్విజ్ పోటీల్లో ప్రథమ ,ద్వితీయ స్థానాలు మిర్యాలగూడ, దామరచర్ల, స్ఫెల్బీలో తుంగతుర్తి విద్యార్థులు ప్రథమ స్థానంలో, మిర్యాలగూడ విద్యార్థులు ద్వితీయ స్థానంలో నిలిచారు. ఈ కార్యక్రమంలో ప్రిన్సిపాల్, వైస్ ప్రిన్సిపాల్ కరుణాకర్, అజయ్, వాడపల్లి వెంకటేశ్వర్లు, జైలాని, ప్రకాష్, రాజు,ప్రసాద్, నరేందర్, సైదులు తదితరులు పాల్గొన్నారు. -
వేదాలతోనే జ్ఞాన వికాసం
ప్రతి జిల్లాలో వేద పాఠశాలలు ఉండాలి ప్రముఖ పండితుడు శ్రీరామశర్మ సామర్లకోట: వేదాలతోనే జ్ఞాన వికాసానికి అవకాశం ఉంటుందని ప్రముఖ వేదపండితుడు చిఱా<వూరి శ్రీరామశర్మ పేర్కొన్నారు. పంచారామ క్షేత్రమైన శ్రీకుమారరామ భీమేశ్వరాలయంలో శ్రీ బాలత్రిపుర సుందరి వేదశాస్త్ర పరిషత్తు ఆధ్వర్యంలో ఆదివారం జరిగిన 18వ వేదసభకు శర్మ అధ్యక్షత వహించారు. వేదాల ద్వారా సృష్టిలోని ప్రతి అంశాన్నీ తెలుసుకోవడానికి అవకాశం ఉందన్నారు. వేద స్వస్తి నిర్వహించడం వలన ఆయా ప్రాంతాలలోని ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారని తెలిపారు. వేదాలలోని మహిమలను, వేద సంరక్షణావశ్యకతను వివరించారు. వేదాల ప్రాముఖ్యతను భావితరాలకు తెలియజేయడానికి ప్రతి జిల్లాలో ఒక వేద పాఠ శాల ఉండాలన్నారు. దువ్వూరి లక్ష్మణ ఘనపాఠి, సర్వేశ్వర ఘనపాఠిల పర్యవేక్షణలో ఉభయ గోదావరి జిల్లాల నుంచి వచ్చిన సుమారు 125 మంది వేద పండితులు ‘చతుర్వేద పారాయణ, వేద స్వస్తి నిర్వహించారు. అనంతరం పండితులను నిర్వాహకులు సత్కరించారు. పరిషత్తు నిర్వాహకులు డాక్టర్ చందలాడ అనంతపద్మనాభం, పసల పద్మరాఘవరావు, సింగవరపు సాయిబాబు, గ్రంధి రామకృష్ణ, పాలకుర్తి ప్రసాద్, ఆలయ ట్రస్టుబోర్డు చైర్మన్ కంటే బాబు తదితరులు పాల్గొన్నారు. -
జ్ఞానమే ఉపనిషత్సారం
వారుణీవిద్యనే బ్రహ్మవిద్య అని కూడా అంటారు. ఇది హృదయాకాశంలో నెలకొని ఉంటుంది. ఇన్ని తపస్సులతో బ్రహ్మాన్వేషం చేసి బ్రహ్మాన్ని తెలుసుకున్నవాడు ఆ ఆనందాన్ని పొందుతాడు. అతడికి అన్నం సమృద్ధిగా దొరుకుతుంది. మంచి సంతానం, గో సంపద, బ్రహ్మవర్ఛస్సు, గొప్పకీర్తి లభిస్తాయి. ఆనందమే బ్రహ్మం అని తెలిసింది కదా అని అన్నాన్ని నిందించకూడదు. అన్నం నుంచే అన్వేషణ మొదలౌతుంది. అన్నంతోనే ప్రాణం నిలుస్తుంది. ప్రాణం శరీరంలోనే ఉంటుంది కనుక శరీరానికి అన్నం కావాలి. అన్నాన్ని చులకనగా చూడకూడదు. నీరే అన్నం. అన్నాన్ని కడుపులోని అగ్ని స్వీకరిస్తుంది. నీటిలో అగ్ని, అగ్నిలో నీరు ఉంటాయి. అన్నం అన్నంలోనే ఉంటుందని తెలుసుకున్నవాడికి అన్నం, సంతానం, పశుసంపద, బ్రహ్మవర్ఛస్సు, కీర్తి అన్నీ వచ్చేస్తాయి. అన్నం బహుకుర్వీత. ఆహారాన్ని బాగా పండించండి. ఈ భూమి అంతా అన్నమే. ఈ అన్నాన్ని ఆహారం భుజిస్తుంది. ఆకాశం భూమిలో ఉంది. భూమి ఆకాశంలో ఉంది. అన్నం అన్నంలో ఉంది. అన్నంకోసం వచ్చినవారిని పెట్టకుండా పంపకండి. ఇది మానవులందరి వ్రతం. అందరికీ అన్నం పెట్టడానికి ఆహారాన్ని బాగా ఉత్పత్తి చేయండి. దానికోసం ఎంతైనా కష్టపడండి. ఎవరు ఎప్పుడు వచ్చినా ఆహారం ఇవ్వగలిగి ఉండండి. ఎక్కువ ఆహారాన్ని పండించడానికి ఎక్కువగా, తక్కువగా పండించినవాడికి తక్కువగా అన్నం దొరుకుతుంది. బాగా పండించి అన్నదానం చేయండి. ఇది తెలుసుకున్నవాడికి అన్నానికి, సంపదకు లోటు ఉండదు. అతని వాక్కులో క్షేమంగా, ప్రాణాపానాల్లో యోగక్షేమాలుగా, చేతుల్లో పనిగా, కాళ్లల్లో నడకగా, విసర్జకావయవంగా పరమాత్మ ఉంటాడు. వర్షంలో తృప్తిగా, విద్యుత్తులో శక్తిగా, పశువుల్లో కీర్తిగా, నక్షత్రాల్లో వెలుగుగా, జననేంద్రియాల్లో ఉత్పత్తికి అవసరమైన ఆనందంగా, ఆకాశంలో సర్వం తానుగా పరమాత్మ ఉంటాడు. ఇది తెలుసుకున్నవాడు ఆ వెలుగును ఉపాసించి తనలోని పరమాత్మను దర్శించగలుగుతాడు. అన్నిటికీ అతీతుడు అవుతాడు. అన్నాన్ని నేనే; స్వీకర్తనూ నేనే. ఈ సత్యాన్ని తెలుసుకున్నదీ నేనే. ఈ విశ్వభువనమంతా వ్యాపించి ఉన్నదీ నేనే. కాంతిమయ జ్యోతిని నేనే అనే విజ్ఞానంతో ఆనందమయుడు అవుతాడు. ఇదే భృగువల్లిలో తైత్తిరీయోపనిషత్తు సందేశం. ఐతరేయం: వేదాలలో మొదటిదైన ఋగ్వేద ఉపనిషత్తులలో మొదటిది ఐతరేయం. ఓం వాఙ్మే మనసి ప్రతిష్ఠితా.. (వాక్కు నా మనసుల్లో ప్రతిష్ఠితం) అనేది శాంతిమంత్రం. ఈ ఉపనిషత్తు పరమాత్మ సృష్టిని ప్రారంభించడం ఎలా జరిగిందో వర్ణిస్తుంది. ప్రాణుల అవయవాలు, మానవ సృష్టి, ఆకలి దప్పులు, ఆహార సృష్టి, ఆహారం వెంట మానవుడు పరుగెత్తడం, అపానవాయువు ద్వారా ఆహారాన్ని పట్టుకోవడం, మానవులకు తోడుగా ఉండటానికి పరమాత్మ మానవుడి నడినెత్తిని చీల్చుకొని, కన్ను, హృదయం, కంఠస్థానాల్లో నివాసం ఏర్పరచుకోవడం, అతణ్ణి ఇంద్రుడుగా పిలవడం మొదటి అధ్యాయం. వీర్యోత్పత్తి, స్త్రీ గర్భంలో శిశువుగా మారటం, సంతానోత్పత్తి, గర్భకోశంలో జరిగే మార్పులు, నిరాకార పరమాత్మ సాకారంగా ఎనభై నాలుగు లక్షల జీవరాశులుగా మారిన వైనం అంతా రెండో అధ్యాయంలో చెప్పిన ఐతరేయ ఉపనిషత్తు సుప్రసిద్ధం. ఛాందోగ్యోపనిషత్తు: ఎనిమిది ప్రపాఠకాలతో నూట ఏభై ఆరు ఖండాలుగా ఉన్న ఈ ఉపనిషత్తు ‘ఓంకారం, ఉద్గీథోపాసన, దానివిధానం, దానితో ముక్తిని వివరిస్తుంది. మానవదేహంలోని అవయవాలు, ప్రాణాలు, పంచభూతాలు అన్నీ ఓంకారమయమే. ప్రాణులన్నీ తమకు తెలియకుండానే ప్రాణాయామం, ఉద్గీథోపాసన చేస్తున్నాయి. పంచవిధ సామగానం, సప్తవిధ సామగానం, అగ్నిలో ఉద్భవించే రధంతర సామ, హింకార ఉద్గీథ సమ్మేళనం. వైరూప, వైరాజ, శక్వరీ, వేవంతీ, యజ్ఞయజ్ఞీయ, రాజస సామగానాలు, పశుసంపదకోసం, యజ్ఞంకోసం చేయవలసిన సామగానాలు, సూర్యకిరణాల్లో ఉండే మధునాడులు, సూర్యగమన విశేషాలు, పరబ్రహ్మస్వరూపం, విశ్వానికున్న దిక్కులు (జుహూ, సహమాన, రాజ్ఞీ, సుభూత) ఇవి మనకు తూర్పు, దక్షిణ, పడమర ఉత్తరాలయ్యాయి. యజ్ఞపురుష స్వరూపం మొదలైన ఎన్నో విషయాలను అందించే ఈ మహోపనిషత్తులో చాలా కథలు ఉన్నాయి. చాలామంది రుషులు, గురుశిష్యుల సంభాషణలు, సంవాదాలు ఉన్నాయి. సత్యకామ జాబాలి కథ పరమాద్భుతం. ఉపకోసలుని యజ్ఞవిద్య, శ్వేతకేతు ప్రవాహణ సంవాదం, పంచాగ్ని విద్య, గౌతముడు, ఉపమన్యువు, ఋషుల కుమారుల ఆత్మాన్వేషణ, అశ్వపతి మహారాజు ప్రవచనం, నారద సనత్కుమార సంవాదం, బ్రహ్మ ప్రజాపతికి, ప్రజాపతి మనువుకు చెప్పిన ఆత్మజ్ఞానం అన్నీ సంభాషణలుగా దీనిలో చూడవచ్చు. ఈ భూమి అంతా అన్నమే. అన్నం నుంచే అన్వేషణ మొదలవుతుంది. అన్నంతోనే ప్రాణం నిలుస్తుంది. ప్రాణం శరీరంలోనే ఉంటుంది కనుక శరీరానికి అన్నం కావాలి. అన్నాన్ని చులకనగా చూడకూడదు. అన్నాన్ని కడుపులోని అగ్ని స్వీకరిస్తుంది. నీటిలో అగ్ని, అగ్నిలో నీరు ఉంటాయి. బృహదారణ్యకోపనిషత్తు: ఇది అయిదు అధ్యాయాల్లో నలభై ఆరు బ్రాహ్మణాలుగా విస్తరించింది. ఇది శుక్ల యజుర్వేదానికి చెందినది. శతపథ బ్రాహ్మణంలోని చివరి ఆరు అధ్యాయాలే ఈ ఉపనిషత్తు. ఇందులో ఆరణ్యకం, ఉపనిషత్తు కలిసే ఉంటాయి. సృష్టి, పరబ్రహ్మ తత్వం, మరెన్నో విషయాలు, సంవాదాలు, సంభాషణల రూపంలో ఎన్నో లౌకిక, వేదాంత విషయాలు, ప్రకాంతి పరిశీలన, పరిశోధన రూపంలో తెలుస్తాయి. దేవతలు, రాక్షసుల మధ్య జరిగిన పాపపుణ్యాల విభాగం, దానివల్ల మానవదేహంలో జరిగిన మార్పులు, మరణానంతర సమాచారం, యాజ్ఞవల్క్య మహర్షి చెప్పిన అనేక విషయాలు తప్పక చదివి తీరాలి. ఎందరో ఋషుల పేర్లు దీనిలో కనిపిస్తాయి. యాజ్ఞవల్క్యుడు తన భార్య మైత్రేయికి ఉపదేశించిన మోక్షవిజ్ఞానం, దమం, దానం, దయాగుణాల ఆవశ్యకత, ప్రాణోపాసన, గాయత్రీమంత్ర విశిష్టత, జ్ఞానేంద్రియాల మధ్య ఘర్షణ, ప్రాణం తీర్పు చెప్పటం, దాంపత్యంలో భార్యాభర్తల ఇష్టానిష్టాలు, సంతానోత్పత్తి, జననం, నామకరణం మొదలైనవి ఎలా చెయ్యాలి? ఎందుకు చెయ్యాలి? మొదలైన సూచనలన్నీ దీనిలో ఉన్నాయి. - డా.పాలపర్తి శ్యామలానంద ప్రసాద్ (ఈ శీర్షిక ఇంతటితో ముగిసింది) -
కృష్ణం వందే జగద్గురుమ్
కృష్ణతత్వం లోకానికి తన గీత ద్వారా జ్ఞానం అందించి వెలుగు చూపిన సారధి జగద్గురువు శ్రీకృష్ణుడు. పెనుచీకటికి ఆవల ఏకాకారుడై కోటి సూర్య సమప్రకాశ విరాజితుడు, సర్వేశ్వరుడైన గీతకారుడు లోకానికి గీత అందించి జ్ఞాన ప్రసూనాలు వికశింపజేసిన విజ్ఞాని. అధర్మం ఏర్పడినప్పుడు యథా యదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత! అభ్యుత్థా నమ ధర్మశ్య తదాత్మానం సృజామ్యహం!! అని ప్రవచించిన ఆది గురువు శ్రీకృష్ణుడు. కృష్ణతత్వమ్ అంటే సమానత్వం, ప్రేమ పరిపూర్ణ వికాస రూపం. శ్రీకృష్ణుని బోధనలు ధర్మ పరిరక్షణ, సమభావన, కర్తవ్య నిర్వహణ బాధ్యత, ఆది గురువుగా ఆయన జీవన విధానమే లోకానికి ఒక ప్రామాణికం. సామాన్య జనులకు, భక్తులకు ఊరట కలిగించే ధర్మం పక్షాన, పేదల పక్షాన నిలిచిన సామాన్యవాది. కులమతాలకు అతీతంగా ఎలా కలిసిపోవాలో తెలిపిన అభ్యుదయ మూర్తి. ధర్మ రక్షణకు పూనుకున్నవాడు. అధర్మం అంతు చూసినవాడు. ద్రౌపది వస్త్రాపహరణ సమయంలో అండగా నిలిచి స్త్రీ యొక్క శీలం కాపాడి స్త్రీ దైవస్వరూపం అని లోకుల కళ్ళు తెరిపించిన ఆదర్శమూర్తి. ధర్మం విలువ తెలుపుటకు, ధర్మం పక్షాన నిలుచుటకు వయోపరిమితి అడ్డుకాదు అని తెలిపిన ధర్మశీలి. స్నేహానికి సరైన నిర్వచనం ఏదైనా వుందీ అంటే అది కేవలం శ్రీకృష్ణుడు. కుచేలునిపై శ్రీకృష్ణుడు చూపిన వాత్సల్యం అతని స్నేహధర్మానికి పరాకాష్ఠ. అర్జునుడికి తాను చేయవలసిన కర్తవ్యాన్ని ఉపదేశించి అధర్మాన్ని ఎదుర్కోవడం ఎంత కష్టం అయినా ధర్మంతో పోరాటం చేస్తే కీర్తి లభిస్తుందని తెలిపిన తత్వదర్శి శ్రీకృష్ణపరమాత్మ. - శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి -
ప్రతిభా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
రాప్తాడు: ఇంజినీరింగ్ విద్య పూర్తి చేసిన విద్యార్థులు పరిశోధనలు చేయడం ద్వారా ప్రతిభా నైపుణ్యాలు పెంపొందించుకోవచ్చని, తద్వారా మేధాశక్తిని సంపాదించవచ్చని మ్యాట్ ల్యాబ్ ట్రైనర్ విక్రమ్ కుమార్ విద్యార్థులకు సూచించారు. శనివారం మండల పరిధిలోని హంపాపురం సమీపంలోని శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఎస్వీఐటీ)లో కళాశాల డైరెక్టర్ చక్రధర్‌రెడ్డి అధ్యక్షతన ఫైనల్ ఇయర్ ఈసీఈ, ఈఈఈ చదువుతున్న విద్యార్థులకు రెండు రోజుల పాటు మ్యాట్ ల్యాబ్‌పై వర్క్ షాపు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా మ్యాట్ ల్యాబ్ ట్రైనర్ విక్రమ్ కుమార్ హజరై మ్యాట్ ల్యాబ్‌లోని పరికరాలు ఎలా పనిచేస్తాయి.. వాటిని ఎలా ఉపయోగించాలి.. వాటి ద్వారా ఎలా టెక్నాలజీని అభివృద్ధి చే యాలనే అంశాలపై విద్యార్థులకు ప్ర యోగాల ద్వారా అవగాహన కల్పిం చారు. అలాగే మ్యాట్ ల్యాబ్‌పై విద్యార్థులు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. కళాశాల చైర్మన్ సి.సోమశేఖర్‌రెడ్డి మాట్లాడుతూ పెరుగుతున్న టెక్నాలజీకి అనుగుణంగా విద్యార్థులు నూతన ప్రయోగాలు చేస్తూ సరికొత్త ఒరవడికి నాందీ పలకాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో కళాశాల డైరెక్టర్ సి.చక్రధర్‌రెడి, కళాశాల ప్రిన్సిపల్ టి.సూర్యశేఖర్‌రెడ్డి, ఏఓ మధుసూదన్‌రెడ్డి, వైస్ ప్రిన్సిపల్ సత్యశ్రీ, హెచ్ఓడీ ఎస్ఎల్వీ ప్రసాద్, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
జ్ఞానంపై ఒంటరితనం ప్రభావం
టొరంటో: పరిస్థితులనుబట్టి మనలోని జ్ఞానపుస్థాయి మారుతూ ఉంటుంది. అయితే దీనిపై ఒంటరితనం ప్రభావం పడుతుందని ఇటీవల జరిపిన ఓ అధ్యయనంలో తేలింది. దైనందిన జీవితంలోని పరిస్థితులనేవి వ్యక్తిత్వంపైనా, తెలివిగా ఆలోచించడంపైనా ప్రభావం చూపుతాయని కెనడాలోని వాటర్లూ విశ్వవిద్యాలయానికి చెందిన ఇగోర్ గ్రాస్మేన్ చెప్పారు. ఇక కొంతమంది వ్యక్తుల విషయంలో కొన్ని కొన్ని పరిస్థితులు వారికి అత్యంత అనుకూలంగా మారతాయని, తెలివితేటలు పెరిగేందుకు దోహదపడతాయని చెప్పారు. ఇందుకు అనేక ఉదాహరణలు ఉన్నాయని, కొంతమంది అద్భుతమైన చతురతను కలిగిఉంటారని తెలిపారు. ఈ ఉదాహరణలు అసాధారణమైనవేమీ కావని తాజా అధ్యయనంలో తేలిందన్నారు. ఆటలో ప్రతిసారి ఏ ఒక్కరిదీ పైచేయిగా ఉండదని తెలిపారు. కాగా సోషల్ సైకలాజికల్ పర్సనాలిటీ సైన్స్ అనే జర్నల్‌లో ఈ వివరాలు ప్రచురితమయ్యాయి. -
పరిపూర్ణ మానవుడు బుద్ధుడు
అజ్ఞానమనే చీకటిని పారద్రోలిన వెలుగుల సూర్యుడు బుద్ధుడు. అశాంతి అనే నిశీధిలో ప్రశాంతతని నెలకొల్పిన వెన్నెల చంద్రుడు బుద్ధుడు. మానవాళిని మహాదుఃఖసాగరం నుండి కాపాడటానికి ‘ధమ్మం’అనే నావను నిర్మించిన ప్రాజ్ఞుడు. ఆ నావకు చుక్కాని ఆయన ప్రవచించిన పంచశీల. నావను దారిలో నడిపించే నావికుడు ఆయన బోధించిన అష్టాంగమార్గం. నావను నడిపే తెరచాప ఆయన ప్రబోధించిన చతురార్య సత్యాలు. మానవ హృదయాల్లోంచి ద్వేషం, పగ, ప్రతీకారం, మోసం, ఈర్ష్య, అసూయలు అనే చెడ్డ ఆలోచనల్ని తుడిచేసి, వాటి స్థానంలో దయ, జాలి, కరుణ, ప్రేమ, అనురాగం, మైత్రి లాంటి మానవీయ భావనల్ని పెంపొందించిన మహనీయుడు బుద్ధుడు. ఆయన కేవలం మానవజాతి మేలును మాత్రమే కోరుకోలేదు. సమస్త జీవకోటి మేలును కాంక్షించాడు. పశుపక్ష్యాదులు, క్రిమికీటకాలు, జలచర భూచరాలు.. అన్నింటి పట్ల దయను ప్రదర్శించాడు. బుద్ధత్వం అనేది ఒక జీవకారుణ్యమూర్తికి ఉండవలసిన లక్షణం. ఏ వ్యక్తి అయినా దానం, శీలం, నిష్కామం, ప్రజ్ఞ, ధీరత్వం, ఓర్పు, సత్యం, పట్టుదల, మైత్రి, ఉపేక్ష అనే పది విశేష గుణాల్ని సాధిస్తే బుద్ధత్వం పొందగలడు. పరిపూర్ణుడవుతాడు. ఈ పరిపూర్ణత్వమే అనంత కరుణని ప్రసాదిస్తుంది. మనిషిని మానవీయునిగా, సమస్త జీవజాతిని ప్రేమించే జీవకారుణ్యమూర్తిగా మలుస్తుంది. ఈ దశ సుగుణాలూ రాసిపోసిన మహోన్నతా మానవతామూర్తే తథాగతుడు గౌతమబుద్ధుడు. - డా. బొర్రా గోవర్ధన్ -
భవిష్యత్ టీచర్.. ట్వీటర్
వాషింగ్టన్: సోషల్ మీడియా ట్వీటర్‌ను విద్యార్థులు విద్యా విషయాల్లో సమర్థంగా ఉపయోగించుకుంటే పాఠాలు చెప్పే టీచర్‌గా పనిచేస్తుందని పరిశోధకులు తెలిపారు. ట్వీటర్‌తో స్కూల్లో చెప్పిన పాఠాలకు అదనపు సమాచారాన్ని రాబట్టవచ్చని చెప్పా రు. ఎనిమిదో తరగతి సైన్స్ విద్యార్థులు ట్వీటర్‌ను బోధన సాధనంగా ఉపయోగించి మంచి ఫలితాలు పొందారని అమెరికాలోని వెర్మాంట్ వర్సిటీ పరిశోధకులు తెలిపారు. ఈ అధ్యయనంలో పాల్గొన్న విద్యార్థులు ట్వీటర్ ద్వారా సైన్స్‌పై పూర్తి అవగాహన, సైన్స్ ప్రయోగాలకు ప్రేక్షకులను పెంచుకోవడం, రోజువారీ ఘటనలను సైన్స్‌తో పోల్చుకోవడం, కొత్త విధానంలో సైన్స్ గురించి కమ్యూనికేట్ చేయడం వంటివాటిలో పురోగతి సాధించామన్నారు. -
ఆ బాంబర్లు.. ఎయిర్‌పోర్టులో క్లీనర్లు!!
బ్రసెల్స్ బాంబర్ సోదరులు విమానాశ్రయంలో క్లీనర్లుగా పనిచేశారా? ఇబ్రహిం, ఖలీద్ ఎల్ బాక్రాయిలకు టెర్మినల్ నిర్మాణంపై పూర్తి అవగాహన ఉందా? వీరిద్దరూ అమెరికా టెర్రర్ వాచ్ లిస్టులో ఉన్నారా? ఇలా ఉత్పన్నమౌతున్న ఎన్నో అనుమానాలు ఒక్కొక్కటే నిజమౌతున్నాయి. విమానాశ్రయాన్ని నాశనం చేయడమే లక్ష్యంగా ఆ జిహాదీ సోదరులు టెర్మినల్‌లో క్లీనర్లుగా పనికి చేరినట్లు స్వయంగా వారి మేనమామ తెలపడం ఆ అనుమానాలను నిజం నిజం చేస్తోంది. ఇబ్రహీం, ఖలీద్ ఎల్ బక్రాయి బ్రసెల్స్ ఉగ్రదాడులకు ముందే వ్యూహం పన్నినట్లు తాజాగా తెలుస్తోంది. విమానాశ్రయాన్ని నాశనం చేయాలన్న లక్ష్యంతోనే వారిద్దరూ అక్కడ క్లీనర్స్ గా చేరి, సెక్యూరిటీ చెక్ ల నుంచి కూడా ఎలా తప్పించుకోవాలో క్షుణ్ణంగా పరిశీలించారని తెలుస్తోంది. ఆ సోదరులిద్దరూ కనీసం పాఠశాల చదువు కూడా పూర్తి చేయలేదని, ఎయిర్ పోర్ట్, రెస్టారెంట్లో వాళ్ళిద్దరూ క్లీనర్స్ గా చేరారని, వేసవికాలంలో ఎయిర్ పోర్టు శుభ్రం చేసే పనిలో ఉన్నారని వారి మేనమామ తెలిపారు. ఈ సోదరులిద్దరూ అమెరికా టెర్రర్ వాచ్ లిస్టులో ఉన్నట్లు తెలుస్తోందని విమానాశ్రయాన్ని పరిశీలించిన బెల్జియన్ ప్రాసిక్యూటర్ ఒకరు తెలిపారు. ఇబ్రహీం గతంలో రెండుసార్లు బహిష్కరణకు గురైనట్లు వెల్లడించినా, అతడు ఐసిస్ మోజులో ఉన్నాడని తెలిపినా తమ హెచ్చరికలను బెల్జియం విస్మరించిందని టర్కిష్ అధికారులు కూడా అంటున్నారు. గత జూలైలో ఓ టర్కిష్ పోలీసును ఇబ్రహీం కాల్చి చంపేశాడని వారు చెప్తున్నారు. ఈ నేపథ్యంలో బెల్జియం హోం, న్యాయశాఖ మంత్రులు రాజీనామా చేశారు. అయితే ప్రధానమంత్రి వారిని వారించారు. విపత్కర పరిస్థితుల్లో రాజీనామా సరైన నిర్ణయం కాదంటూ వారిని అంగీకరించలేదు. 29 ఏళ్ళ ఇబ్రహీం, బాంబ్ మేకర్ నజీమ్ లాచ్రౌ ఇద్దరూ జావెంటెమ్ ఎయిర్ పోర్టులో సూట్ కేస్ బాంబు పేల్చి బీభత్సం సృష్టించారు. బాంబు పేలే సమయానికి వారు చేతులకు గ్లౌజెస్ పెట్టుకుని తమ ట్రాలీలను తీసుకెళ్తున్నట్లు సీసీటీవీ ఫుటేజ్ ను బట్టి తెలుస్తోందని, వారి పక్కనే టోపీ పెట్టుకుని ఓ తెల్లజాతి వ్యక్తి సీసీటీవీలో కనిపించాడని, అతడికి చెందిన బాంబు పేలకపోవడంతో అక్కడినుంచి పారిపోయాడని పోలీసులు తెలిపారు. అమెరికా అధికారులు కూడా అతడు అమెరికా వాచ్ లిస్టులో ఉన్నట్లు వెల్లడించారు. విమానాశ్రయంలో ఉగ్రదాడి జరిగిన కొద్ది సేపటికే మీల్ బీక్ స్టేషన్లో బాంబు దాడికి పాల్పడిన ఖలీద్ అక్కడినుంచి కూడా తప్పించుకొని ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే ఈ జిహాదీ సోదరులిద్దరూ పాఠశాల స్థాయి వరకూ బాగానే చదివినా.. ఆ తర్వాత వారిద్దరికీ నేర చరిత్ర తీవ్రంగానే ఉంది. ఇద్దరూ పలు కేసుల్లో జైలు శిక్ష అనుభవించారు. అదే నేపథ్యంలో వారు ఎయిర్ పోర్ట్ ను లక్ష్యంగా చేసుకుని ముందుస్తు అంచనాతోనే అక్కడ క్లీనర్స్ గా పనికి చేరి ఉండొచ్చని వారి మేనమామ చెబుతున్నారు. జైలుశిక్ష అనుభవించిన అనంతరం వారిలో తీవ్ర మార్పు కనిపించిందని, హుందాగా కనిపించడం, వస్త్రధారణలో వచ్చిన మార్పులతో పాటు ఇబ్రహీం ఎప్పుడూ ఎవరికో ఒకరికి సహాయం చేస్తుండేవాడని ఇదంతా చూస్తే వారు తిరిగి ఇలాంటి చర్యకు పాల్పడతారని ఊహించలేదని వారి మేనమామ విచారణలో వెల్లడించాడు. కాగా ఎయిర్ పోర్ట్ అధికారులు మాత్రం ఆ సోదరులిద్దరూ విమానాశ్రయంలో క్లీనర్స్ గా పనిచేశారా లేదా అన్నది ఇంకా నిర్థారించలేదు. మరోవైపు బాంబ్ మేకర్ నజీమ్ లాచ్రౌ సోదరుడు మౌరాద్ లాచ్రౌ మాత్రం తమ అన్న మూడేళ్ళ క్రితం సిరియా పారిపోయినప్పటినుంచీ అతడితో తమ కుటుంబానికి ఎటువంటి సంబంధం లేదని, సూసైడ్ బాంబర్స్ తీరు ఎంతో సిగ్గుగా, బాధగా అనిపించిందని తెలిపారు. -
నేను మీ కన్నుని
నాకంటే సంక్లిష్టమైన అవయవం మరొకటి లేదు. నేను ఆనంద్ కన్నును. సున్నుండ సైజులో ఉంటాన్నేను. సైజు చూసి నన్ను తక్కువగా అంచనా వేయకండి. కోట్లాది ఎలక్ట్రికల్ కనెక్షన్ల సాయంతో నేను క్షణంలోనే పదిహేను లక్షల సందేశాలను స్వీకరిస్తాను. ఆనంద్ విజ్ఞానంలో ఎనభైశాతం నా ద్వారా వచ్చినదే. చరిత్రపూర్వ యుగంలోని ఆనంద్ పూర్వీకుల్లో నా పనితీరే వేరు. వాళ్లకు ఎదురయ్యే అపాయాలు ఎంతదూరంలో ఉన్నాయో చూపడమే నా పని. ఇప్పటికి కూడా దూరంగా ఉండే వాటిని చూడటానికి అనువుగానే నా నిర్మాణం ఉంటుంది. అయితే, ఇప్పుడు ఆనంద్ నన్ను చాలా కష్టపెడుతున్నాడు. చదవడం, టీవీ చూడటం వంటి పనులతో బలవంతంగా క్లోజప్‌లో చూసేలా చేస్తున్నాడు. ఆనంద్ ఒక్కడనే కాదు గానీ, ఈ కాలంలో మనుషులందరూ ఇదే పని చేస్తున్నారు. ఇదీ నా నిర్మాణం నా ముందు గదిలో ఒక కిటికీ ఉంటుంది. ప్రస్ఫుటంగా కనిపించే దానిని ‘కార్నియా’ అంటారు. నల్లగుడ్డు అని కూడా అంటారు. చూసే ప్రక్రియ ఇక్కడి నుంచే మొదలవుతుంది. కాంతి కిరణాలను ఇది ఒక క్రమపద్ధతిలో నాలోకి వంచుతుంది. దీని తర్వాత ‘ప్యూపిల్’ అనే భాగం ఉంటుంది. అది కాంతికిరణాల ప్రవేశద్వారం. కాంతికిరణాలు ఎక్కువగా ఉంటే, అవన్నీ ఒకేసారి లోపలకు పోకుండా ఇది ముడుచుకుంటుంది. చీకటిగా ఉన్నప్పుడు విశాలంగా తెరుచుకుంటుంది. నాలోని అద్భుతం అంతా ప్యూపిల్ తర్వాత ఉండే లెన్స్ నుంచి మొదలవుతుంది. ఇది బాదం ఆకారంలో ఉంటుంది. అత్యంత బలమైన కండరాలు లెన్స్ అంచుల మీద కవర్ అయ్యేలా ఉంటాయి. ఇవి లెన్స్‌ను పట్టి ఉంచుతాయి. ఈ కండరాలు బిగుతుగా మారినప్పుడు నేను దగ్గరి వస్తువులను చూస్తాను. దూరపు వాటిని చూడాలంటే, ఈ కండరాలు కాస్త రిలాక్స్ అవుతాయి. చూపు ఓ విద్యుత్స్రాయనిక చర్య ఆనంద్ ఏదైనా వస్తువును చూసేటప్పుడు దాని నుంచి వచ్చే కాంతి కిరణాలు నాలోని లెన్స్ నుంచి లోపలకు ప్రవేశిస్తాయి. అవన్నీ ఉల్లిపొరలాంటి ‘రెటీనా’ అనే తెరపై పడతాయి. రెటీనా విస్తీర్ణం కేవలం మూడు చదరపు సెంటీమీటర్లే. అయినా, అందులో కాంతిని గ్రహించే 13.7 కోట్ల రిసెప్టార్ కణాలు ఉంటాయి. బ్లాక్ అండ్ వైట్ దృశ్యాలను చూసేందుకు వీలుగా రాడ్ ఆకారంలో 13 కోట్ల కణాలు, రంగులను చూసేందుకు కోన్ ఆకారంలో 70 లక్షల కణాలు ఉంటాయి. రాడ్స్లో ఉండే ఎరుపు-ఊదా రంగులో ‘రడాప్సిన్’ అనే పిగ్మెంట్ ఉంటుంది. ఈ పిగ్మెంట్‌లో జరిగే విద్యుత్స్రాయనిక చర్య వల్లే చూడటం అనే ప్రక్రియ జరుగుతుంది. రంగులను చూడటానికి ఉపయోగపడే కోన్స్‌లో ఎరుపు, ఆకుపచ్చ, నీలి రంగులను గుర్తించడానికి వేర్వేరు పిగ్మెంట్లు ఉంటాయి. ప్రాథమికమైన ఈ రంగులను ఉపయోగించి చిత్రకారులు వివిధ వర్ణాలను రాబట్టినట్లే, కోన్స్లోని ఈ పిగ్మెంట్ల సాయంతోనే వివిధ రంగులను, వాటి ఛాయలను మెదడు గుర్తిస్తుంది. ఉదాహరణకు ఆనంద్ చిమ్మచీకట్లో ఒక మిణుగురును క్షణకాలం చూశాడనుకోండి. అప్పుడు రాడ్ కణాల మీద పడ్డ కాంతి కాస్త వెలిసిపోయినట్లుగా (బ్లీచ్) అవుతుంది. ఆ సమయంలో రాడ్ కణాల్లో ఒక వోల్టులోని పది లక్షలవ వంతు విద్యుత్తు పుడుతుంది. దాని ఫలితంగా ఆ దృశ్యం ఆప్టిక్ నెర్వ్ ద్వారా మెరుపు వేగంతో మెదడుకు చేరుతుంది. ఈ విద్యుత్స్రాయన చర్యకు పట్టే సమయం 0.002 సెకండ్లే! అయితే, కోన్స్‌లో మాత్రం చీకటిలో ఈ విద్యుత్స్రాయనిక చర్య చాలా తక్కువగా జరుగుతుంది. అందుకే చీకట్లో ఆనంద్ మెదడు రంగులను గుర్తించలేదు. ఆ పనిని రాడ్స్ కణాలే చేస్తుండటంతో రంగులు ఉన్నా, అవన్నీ నలుపు తెలుపుల్లో బూడిద రంగులోనే కనిపిస్తాయి. అంతా తల వెనుకే... చూపును కలిగించే మెదడులోని దృష్టి కేంద్రం తల వెనుక భాగంలో ఉంటుంది. ఆనంద్‌కు తల వెనుక బలంగా దెబ్బ తగిలిందనుకోండి. అతడి దృష్టి కేంద్రం తీవ్రంగా గాయపడి శాశ్వతంగా చూపు కోల్పోవచ్చు. ఒక మోస్తరు దెబ్బతగిలిందనుకోండి. క్షణకాలం అతడికి చుక్కలు కనిపిస్తాయి. దెబ్బ తాకిన సమయంలో కళ్లలో జరిగే విద్యుత్ ప్రక్రియకు విఘాతం ఏర్పడటం వల్ల అలా జరుగుతుందన్న మాట. చూసేదంతా మెదడే... చూడటానికి నేనో సాధనాన్ని మాత్రమే. నిజానికి చూసేదంతా మెదడే. ఆనంద్ నిద్రపోతున్నా కలలో అతడికి అనేక దృశ్యాలు కనిపిస్తుంటాయి. ఆ సమయంలో అతడి కళ్లు మూసుకుని ఉన్నా, చుట్టూ చిమ్మచీకటి ఆవరించి ఉన్నా అతడికి కల కనిపిస్తూనే ఉంటుంది. ఒకవేళ ఆనంద్ పుట్టుగుడ్డి అనుకోండి. అలాంటప్పుడు అతడికి కలలోనూ ఎలాంటి దృశ్యాలూ కనిపించవు. కేవలం స్పర్శ, వినికిడి, వాసనల ద్వారా కలిగిన జ్ఞానాలే కలలో వ్యక్తమవుతూ ఉంటాయి. అపారం నా కండరబలం నా కండరాల బలం అపారం. రోజుకు దాదాపు నాలుగు లక్షల సార్లు నా కండరాలు కదులుతూ ఉంటాయి. ఆనంద్ రోజుకు యాభై మైళ్లు నడిస్తే, అతడి కాళ్ల కండరాలకు ఎంతటి శ్రమ కలుగుతుందో, రోజూ నా కండరాలకు అంతే శ్రమ కలుగుతుంది. నాలోని లాక్రిమల్ గ్రంథులు స్రవించే కన్నీళ్లను చిమ్మేలా చేసుకుని క్షణకాలంలో నన్ను నేను శుభ్రం చేసుకుంటూ ఉంటాను. నా కార్నియాను తేమగా ఉంచుకుంటాను. నా కన్నీళ్లలో ఉండే ‘లైసోజైమ’ నన్ను ఇన్ఫెక్షన్లు కలిగించే సూక్ష్మజీవుల నుంచి రక్షిస్తూ ఉంటుంది. అలసట నుంచి నన్ను నేను కాపాడుకోవడానికి నిత్యం ప్రయత్నిస్తుంటాను. ఆనంద్ కనురెప్ప కొట్టినప్పుడల్లా ‘హమ్మయ్య’ అనుకుంటుంటా. ఒక్కోసారి అవతలి వైపు ఉండే నా సోదరుడు కాస్త విశ్రాంతి తీసుకుంటే, తొంభై శాతం పనిభారాన్ని నేనే తీసుకుంటా. నేను రిలాక్స్ అయ్యేటప్పుడు వాడు ఆ భారాన్ని తీసుకుంటాడనుకోండి. నాకో అద్భుతమైన గూడు... ప్రకృతి నాకో అద్భుతమైన గూడు ఏర్పాటు చేసింది. ఒక పక్క చెక్కిలి ఎముకలు, మరోపక్క నుదుటి ఎముక... వాటి మధ్య ఉండే చిన్ని తొర్రలో నేనుంటా. ఏదైనా దెబ్బ తగిలితే... మొదట వాటికే తగిలేలా నా గూడు ఉంటుంది. అప్పటికీ అగ్నికణాల్లాంటివి ఏవో దూసుకొస్తూనే ఉంటాయి. ఇలాంటి రేణువులు ఎగిసే చోట పనిచేసే వారు కళ్లజోడు ధరిస్తే మేలు. ఇక నన్ను మరింత బాధపట్టే అంశాల్లో జబ్బులు మరొకటి. కొన్నిసార్లు నాలోంచి పోయే ద్రవాల కంటే నాలోకి వచ్చే ద్రవాలు పెరిగే స్థితి ఒకటి ఉంటుంది. అలా జరిగితే నాలోని ఆప్టిక్ నర్వ్ దెబ్బతిని, చూపు తగ్గుతుంది. ఈ పరిస్థితినే గ్లకోమా అంటారు. ఈ పరిస్థితి అదేపనిగా కొనసాగితే ఆనంద్‌కు శాశ్వతంగా చూపు పోవచ్చు. ఆనంద్‌కు ఈ వయసులో వచ్చే అవకాశం ఉన్న జబ్బు ఇదే. దీనికోసం ఆనంద్ ఏటా తప్పనిసరిగా డాక్టర్‌తో పరీక్ష చేయించుకోవాలి. టోనోమీటర్ అనే పరికరాన్ని ఉపయోగించి డాక్టర్ గ్లకోమా ఉన్నది లేనిదీ నిర్ధారిస్తారు. ఇక ఈ వయసులో ఆనంద్‌కు ఆస్టిగ్మాటిజమ్ అనే జబ్బు వచ్చే అవకాశాలూ ఉన్నాయి. అద్దం మీద నీటి బుడగ ఉన్నప్పుడు దాంట్లోంచి చూస్తే ఎలా మసగ్గా కనిపిస్తుందో, ఆస్టిగ్మాటిజమ్ వచ్చినప్పుడు అలాగే కనిపిస్తుంది. ఇక రెటీనా ఊడిపోవడం అనేది మరో సీరియస్ సమస్య. విపరీతమైన కాంతిని వెదజల్లే మెరుపును చూసినప్పుడు ఇలా జరగవచ్చు. ఇదే జరిగితే ఊడిన రెటీనాను యథాస్థానంలో అతికించడానికి శస్త్రచికిత్స చేయక తప్పదు. ఎనభై శాతం కేసుల్లో శస్త్రచికిత్సలు విజయవంతమవుతాయి. నాలోని కార్నియా, లెన్స్... ఈ రెండూ పారదర్శకంగా ఉంటాయి. వాటిలో తలెత్తే లోపాల వల్ల వచ్చే అంధత్వాన్ని కార్నియా మార్పిడి శస్త్రచికిత్స ద్వారా దూరం చేయవచ్చు. లెన్స్‌లో పారదర్శకత తగ్గితే కాటరాక్ట్ ఆపరేషన్‌తో సరిచేయవచ్చు. అదృష్టవశాత్తూ... ఇలాంటి చాలా సమస్యలను ఆనంద్ ఇప్పటి వరకూ అధిగమించాడు. కానీ వయసు పెరుగుతున్న కొద్దీ అతడి ఇతర కండరాల్లాగే కంటి కండరాలూ బలహీనమవుతాయి. రెటీనాకు రక్తసరఫరా చేసే రక్తనాళాలూ బిరుసెక్కుతాయి. రెటీనాకు మునపటిలా రక్తసరఫరా జరగకపోవచ్చు. ఇలా జరుగుతందేమోనని ఆనంద్ భయపడాల్సిందేమీ లేదు. నాపై కాస్త దృష్టి పెడితే చాలు. ఆనంద్‌కు జీవితాంతం దృష్టి మెరుగ్గా ఉంటుంది. చూపు కలకాలం పదిలంగా ఉండాలంటే బీటా కెరోటిన్ ఎక్కువగా ఉండే క్యారట్, విటమిన్ ‘ఏ’ ఉండే గుడ్లు, పాలు వంటి పోషకాహారాలు తీసుకోవాలి. -
ద్విభాషా పరిజ్ఞానం మెదడుకు మంచిదే!
పరిపరి శోధన మన స్కూళ్లలో చాలావరకు మూడు భాషలు నేర్పిస్తున్నారు. తెలిసిన భాష తప్ప మిగిలిన భాషలను నేర్చుకోవడాన్ని చాలామంది తప్పనిసరి తంటాగా భావిస్తుంటారు. అయితే, ఒకటికి రెండు భాషలు నేర్చుకోవడం మెదడుకు మంచిదేనని అంతర్జాతీయ వైద్య పరిశోధకులు చెబుతున్నారు. కనీసం రెండు భాషల్లో దాదాపు సరిసమానమైన పరిజ్ఞానం ఉన్నట్లయితే పక్షవాతం వంటివి సోకినప్పుడు త్వరగా కోలుకునే అవకాశాలు పెరుగుతాయని చెబుతున్నారు. పక్షవాతం సోకిన 600 మంది రోగులపై పరీక్షలు జరిపిన తర్వాత ఈ నిర్ధారణకు వచ్చినట్లు ఎడిన్బర్గ్ వర్సిటీ పరిశోధకులు చెబుతున్నారు. రెండు భాషల్లో మంచి పరిజ్ఞానం ఉన్న రోగుల్లో మెదడు పనితీరు త్వరగా మెరుగుపడినట్లు గుర్తించామని వారు అంటున్నారు. -
ఓ మనిషీ.. తిరిగిచూడు
ఉరుకులు.. పరుగుల నగర జీవనంలో.. తోటి మనిషికి ఏ ఆపదొచ్చినా.. పట్టించుకునే ఓపిక.. సాయపడాలనే తాపత్రయం అరుదు. సృష్టిలోనే జ్ఞాన సంపన్నుడైన మనిషే.. తోటివారు చచ్చినా చలించని కాలమిది. మానవత్వం మరుగైపోతున్న ప్రపంచమిది. అలాంటిది వాహనం ఢీకొన్న లేగదూడ కోసం ఏ జ్ఞానంలేని పశువులు మూడు గంటల పాటు రోడ్డుపై మూగగా రోదించాయి. దూడ దగ్గరికొచ్చిన వారిపై తిరగబడి రక్షణగా నిలిచాయి. వాహనాలనూ అడ్డుకున్నాయి. ముఖ్యంగా తల్లి పశువు ఆవేదన చూపరులను కలచివేసింది. ఈ ఘటన తిరుపతిలోని టౌన్‌క్లబ్-అలిపిరి మార్గంలో మంగళవారం చోటు చేసుకుంది. ఫొటోలు: కె.మాధవరెడ్డి, తిరుపతి -
మరణించిన తర్వాత మనిషి ఏమవుతాడు?
మృత్యువు అనంతరం ఆత్మ ఏం చేస్తుంది? మరణించిన ప్రతి జీవీ తప్పనిసరిగా తిరిగి జన్మ ఎత్తుతుందా? మానవ జన్మకు రాని అంటే పునర్జన్మ లేని ఆత్మలు ఎక్కడ ఉంటాయి? ఎలా ఉంటాయి? ఇటువంటి సందేహాలు చాలామందిలో మెదళ్లను తొలిచేస్తూనే ఉంటాయి. ఈ సందేహాలు ఇప్పటి తరానివి కావు... కొన్ని వేల ఏళ్ల క్రితమే సత్యకామ జాబాలి అనే బాలకుడికి వచ్చాయట. కాదు కాదు... తెగ పీడించుకు తినడంతో అనుభవంతో, జ్ఞానంతో తలపండిన పెద్దల ముందుంచాడట తన సందేహాలను. అయితే ఎవరి నుంచీ సంతృప్తికరమైన సమాధానం లభించలేదట. దాంతో సత్యకామ జాబాలి ఈ సంగతేదో మృత్యువునే అడిగి తేల్చుకుందామని కఠోర తపస్సు చేసి మృత్యువును ప్రత్యక్షం చేసుకుని ఆత్రంగా అడిగాడట. అయితే మృత్యువు కూడా మౌనమే వహించిందట. అంటే మృత్యువు కూడా తన పరిధి దాటి తెలుసుకోలేదన్నమాట. ఎందుకంటే దానికే జీవం లేదు కాబట్టి, దానిగుండా ప్రయాణించాల్సిన జీవుడే అంటే మానవుడే దానికి సమాధానం తెలిసినవాడు. అయితే పునర్జన్మ సిద్ధాంతాన్ని అందరూ నమ్మరు కదా మరి! ఇప్పటి రోజులలో అయితే ఈ ప్రశ్న ఎవరినడిగినా ‘‘అదేం ప్రశ్న? మరణించిన తర్వాత ఇక జీవితమేంటి?’’ అంటూ ఆ ప్రశ్న వేసిన వారిని అమాయకులుగా జమకట్టేస్తారు చాలామంది. స్వర్గనరకాలు మన సంగతెలా ఉన్నా, మృత్యువు తర్వాత ఆత్మ భౌతికంగా తాను చేసుకున్న పాపపుణ్యాలను అనుసరించి స్వర్గం లేదా నరకాన్ని చేరుకుంటుందని ఇంచుమించు అన్ని మతాలూ చెబుతాయి. స్వర్గమనేది మరణం తర్వాత కూడా సుఖాలను అనుభవింపజేసేదని, అందుకే బతికినంతకాలం దానధర్మాలూ, పరోపకారాలూ చేసి, బోలెడంత పుణ్యం మూటక ట్టేసుకుని, ఆనక ఇంచక్కా స్వర్గసుఖాలను అనుభవించండని పెద్దలు చెబుతుంటారు. వాళ్లు చెప్పిన నాలుగు మంచిముక్కలూ చెవినేసుకోకుండా విచ్చలవిడిగా పాపాలు చేసేస్తే, నరకానికి పోతారు. అక్కడ వేడి వేడి నూనెలో వేగుతూ, చీమూ నెత్తురూతో నిండి, కుళ్లుకంపు కొట్టే వైతవరణీనదిలో పడి, ఉక్కిరిబిక్కిరవుతూ, ఇనుపశూలాలతో ఒళ్లంతా చిల్లులు పడేలా పొడిపించుకోవలసిందే... అని ఆస్తికులు చెబుతారు. మరణానంతర జీవితం గురించి తెలుసుకునేముందు అసలు మృత్యువంటే ఏమిటో చూద్దాం... ‘‘మృత్యువంటే జీవితానికి క్రీనీడ... జీవితం బొమ్మయితే మృత్యువు బొరుసు. ఈ జీవితాన్ని అనుక్షణం వెన్నంటి ఉండేది మృత్యువు. ఈ జీవితాన్ని కాపాడుకుంటూ పోయేదీ మృత్యువే. మృత్యువు జీవిత ద్వారబంధం దగ్గర కాపలా లేకపోతే రక్షణ ఎక్కడిది? అందుకే మృత్యువును కాదని జీవితాన్ని ప్రత్యేకంగా చూడలేం’’ అంటారు సికిందరాబాద్ తిరుమలగిరిలోని మాస్టర్ యోగాశ్రమ సంచాలకులు, యోగాపై అనేక గ్రంథాలను రాసిన డాక్టర్ వాసిలి వసంత కుమార్. ‘జీవితంలో పోరాడగలవారికే మృత్యుస్పర్శ తెలుస్తుంది. మనల్ని అతలాకుతలం చేసే పరిస్థితుల్లో సైతం మనం జీవితం నుంచి పారిపోకూడదు. పైగా ఎదురొడ్డి నిలవాలి. ఆ నిబ్బరం, ఆ నిలువరింపు ఉంటే మృత్యువు సైతం మనల్ని భయపెట్టలేదు. ఆ మృత్యుదర్శనం సైతం విశ్వరూప సందర్శనంలా మనల్ని అనందపరుస్తుంది’ అని ఆయన తన తాజా పుస్తకం ‘యోగానంద లహరి’లో చెబుతారు. అసలు మృత్యువంటే ఏమిటి? ఈ శరీరాన్ని కాదని అంతరాత్మ స్వేచ్ఛను పొందడమే మృత్యువు కదా! అంతరాత్మ స్వేచ్ఛగా ఏం చేస్తుంది? బాధ్యతగా మరో శరీరంలోకి ప్రవేశిస్తుంది. అంటే మరో రూపంలోకి పరిణమిస్తుందన్నమాట. మృత్యువు గురించి ఇంకాస్త లోతుగా చెప్పుకోవాలంటే.. మృత్యువు అనేది ఈ శరీరం నుంచి మరో శరీరంలోకి మార్పే. అంటే ఆత్మ అదే. అంతరాత్మ స్పందనలలో మార్పుండదు. అంతెందుకు.. మృత్యువుతో మనం ఈ శరీరాన్ని త్యజిస్తాం కాబట్టి ఆ తర్వాతి జీవితం అంటే పరజన్మ ఎలా ఉంటుందన్న భయం ఉండదు. ఆత్మ- మృత్యువులలో జీవితం బొమ్మ అయితే మృత్యువు బొరుసు. మృత్యువు బొమ్మ అయితే జీవితం బొరుసు. ఈ రెంటిలో ఒకదాని ఉనికి సాధ్యమైనప్పుడు రెండవదాని ఉనికి సాధ్యం కాదు. అంటే రెండవది అగోచరంగా ఉంటుంది. ప్రాణం ఎక్కడి నుండి, ఎలా అందుతుందో తెలుసుకుంటే మృత్యువుపై విజయం సాధించవచ్చని, దానికి ఏమాత్రం భయపడనవసరం లేదని ‘మృత్యువు తర్వాత జీవితం’ ‘యోగానంద లహరి’, ‘యోగసాధన’, ‘భానుమతి’ వంటి పుస్తకాలను రాసిన శ్రీ శార్వరి వంటి సీనియర్ రచయితలు చెబుతారు. మన కంటికి కమ్మిన పొర తొలగిపోతేనే జ్ఞానదృష్టి అలవడుతుందని, అందుకు యోగసాధన అవసరమంటారాయన. ప్రేతాత్మలు... పునర్జన్మలూ... కోరికలు తీరిన ఆత్మ వెంటనే పునర్జన్మ తీసుకుంటుందని, కోరికలు తీరకపోతే ప్రేతాత్మగా మారి, తన కోరికలను తీర్చుకోవడం కోసం ఇతరులను ఆశ్రయించి, వారి ద్వారా తీర్చుకుంటూ ఉంటుందని చాలా కథలలో, సీరియల్స్‌లో చదివే ఉంటాం, సినిమాలలో చూసే ఉంటాం. అప్పుడెప్పుడో అంటే ఏఎన్నారూ, ఎన్టీయారూ, శోభన్‌బాబుల కాలంలో వచ్చిన ‘దేవుడే గెలిచాడు’, ‘శ్రీ రామ రక్ష‘, ‘విశ్వరూపం’, సుమన్, చిరంజీవిల హయాంలోని ‘ఆత్మబంధం’, ‘యముడికి మొగుడు’ ఆ తర్వాతి కాలంలోని ‘ఆ నలుగురు’, రజనీకాంత్ ‘చంద్రముఖి’, దానికి సీక్వెల్‌గా వెంకటేష్‌తో తీసిన ‘నాగవలి’్ల, లారెన్స్ రాఘవేంద్ర తన నటనతో ఒక ఊపు ఊపేసిన ‘కాంచన’, నిన్నమొన్నల్లో వచ్చిన ‘గంగ’, ‘త్రిపుర’ వంటి సినిమాలన్నీ ‘ఆత్మీయై’మెనవే! విఠలాచార్య సినిమాలు, హారర్ చిత్రాలు సరేసరి. శరీరం రోమాంచితమయ్యే అలాంటి సినిమాలు అందులోనూ సెకండ్ షోలు చూసి ఒంటరిగా ఇంటికి రావాలన్నా... వచ్చాక ఒంటరిగా ఇంట్లో ఉండాలన్నా భయంతో వ ణుకు పుట్టి మెడలో ఆంజనేయస్వామి లాకెట్టో, నుదుటిపై సింధూరమో పెట్టుకుంటే కానీ ఉలికిపాటు తగ్గనివారెందరో! ఇక ‘కథలు, నవలల సంగతి చెప్పనే అక్కరలేదు (ఆత్మకథలు కాదు సుమీ!) క్రైమ్ స్టోరీల్లోకి కూడా ఆత్మలు చొచ్చుకొచ్చేసి, అద్భుతాలు, అంతకుమించి అరాచకాలెన్నో చేసి చూపిస్తుంటాయి. చదివినంతసేపూ థ్రిల్లింగానే ఉంటాయి కానీ.. ఆ తర్వాతే... వీటికన్నా దయ్యం సినిమాలే కాస్తంత బెటరనిపిస్తుంది! అసలీ చర్చంతా ఎందుకు, మృత్యువు తర్వాత జీవితం ఉందా లేదా, ఉంటే ఎలాంటి జీవితాన్ననుభవిస్తారనేదే కదా సందేహం..? అది తెలుసుకునేందుకు ఇంకా చా...లా సమయం ఉంది! అనుభవించడానికి బోలెడంత జీవితమూ ఉంది. సఫలం చేసుకోగలిగితే ఇప్పుడే స్వర్గం... లేకపోతే ఇక్కడే నరకం... కాదంటారా? - డి.వి.ఆర్.భాస్కర్ మనిషికి ప్రధానంగా మూడు శరీరాలుంటాయి. అవి 1. ఆత్మ తత్వం గల స్పిరిచ్యువల్ బాడీ, 2. భావోద్వేగాలకు నెలవైన సూక్ష్మశరీరం, 3. కంటికి కనిపించే స్థూల శరీరం లేదా భౌతిక శరీరం. భూలోకంలోని ప్రతి జీవీ మరణించిన తర్వాత ఏదో ఒక సూక్ష్మలోకం చేరుకుంటుంది. కొద్ది ప్రయత్నం, మరికొద్దిగా సాధనతో ఈ లోకాల్ని దర్శించగలం. అనుభవించగలం. పరలోకాలను సందర్శించడం కోసం మరణించనే అవసరం లేదు. ఆత్మ సంస్కారం గల వ్యక్తి కేవలం సంకల్పమాత్రాన భౌతిక శరీరాన్ని వదలకుండానే సూక్ష్మలోకాల్ని అంతకంటే సూక్ష్మాతి సూక్ష్మ శరీరంతో దర్శించి రావచ్చు అంటారు యోగ సాధకులు. -
కలాం నివాసాన్ని విఙ్ఞాన కేంద్రంగా చేయాలన్న ఆప్
ఢిల్లీ: దివంగత మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం ఢిల్లీలో నివసించిన ఇంటిని విఙ్ఞాన కేంద్రంగా మార్చాలని ఆప్ డిమాండ్ చేసింది. రాష్ట్రపతి పదవీ కాలం ముగిసిన అనంతరం కలాం 10 రాజాజీ మార్గ్‌లో నివాసమున్నారు. అయితే ప్రస్తుతం ఈ నివాసాన్ని కేంద్ర సాంస్కృతిక శాఖ మంత్రి మహేష్ శర్మకు కేటాయించారు. దీనిపై ఆప్ నేత, ఢిల్లీ పర్యాటక శాఖ మంత్రి కపిల్ మిశ్రా మాట్లాడుతూ.. హుటాహుటిన ఆ ఇంటిని ఓ మంత్రికి కేటాయించాల్సిన అవసరం ఏముందనీ.. కలాం నివాసమున్న ఇంటిని ఆయన స్మారకార్ధం విఙ్ఞాన కేంద్రంగా మార్చాలని అన్నారు. తమిళనాడులోని రామేశ్వరానికి మాత్రమే కలాంను పరిమితం చేసేలా ఆయనకు సంబంధించిన వస్తువులు, పుస్తకాలు, ఇతర కలాం ఙ్ఞాపకాలను అక్కడికి తరలించడం సరికాదని మిశ్రా అభిప్రాయపడ్డారు. కలాం నివాసాన్ని ఆయన గౌరవార్థం ఢిల్లీలో పర్యాటక స్థలంగా మార్చాలని ఆప్ భావిస్తున్నట్లు మిశ్రా తెలిపారు. -
టీవీ చూసేవారికి నో హ్యాపీ...
పరిపరి శోధన విజ్ఞానం కంటే వినోదం కోసమే చాలామంది టీవీ చూస్తుంటారు. కాలక్షేపం కోసం, సమస్యలను తాత్కాలికంగానైనా మరచిపోవడం కోసం గంటల తరబడి టీవీకి అతుక్కుపోతుంటారు. ఇలాంటి శాల్తీలకు జీవితంలో ఏమాత్రం సంతోషం ఉండదట. మరోలా చెప్పాలంటే, నిజానికి జీవితంలో సంతోషం కోల్పోయిన వారే రోజూ గంటల తరబడి టీవీ చూస్తూ గడిపేస్తారని స్టీవెన్ మార్టిన్ అనే అమెరికన్ పరిశోధకుడు బల్లగుద్ది చెబుతున్నాడు. గడచిన మూడు దశాబ్దాలుగా టీవీ ప్రేక్షకుల తీరుతెన్నులపై విస్తృతంగా అధ్యయనం చేసిన తర్వాతే ఈ నిర్ధారణకు వచ్చానని అతడు అంటున్నాడు. సమస్యల వలయంలో చిక్కుకున్న వారు వాటికి పరిష్కారం గురించి ఆలోచించకుండా టీవీ చూడటానికి అలవాటు పడితే, త్వరలోనే దానికి బానిసలుగా మారుతారని హెచ్చరిస్తున్నాడు. -
ఫ్యానుకు లైటు!
భలే బుర్ర అవసరమే ఆవిష్కరణలకు తల్లి. అదే మన మెదడుకు పదును పెడుతుంది. అదే మనలోని శాస్త్రవేత్తను మేల్కొలుపుతుంది. వనరులతో పనిలేదు, పెద్దగా డబ్బూ దస్కం కూడా అక్కర్లేదు. పెద్దపెద్ద డిగ్రీలూ వగైరా అవసరం లేదు. కాస్త తెలివితేటలుంటే చాలు, జటిల సమస్యలకు కూడా తేలికపాటి పరిష్కారాలను వెదుక్కోగలం. శాస్త్రవేత్తల ఘనతను కాదు, సామాన్యుల తెలివిని పరిశీలిస్తే ఈ విషయం మనకు అర్థమవుతుంది. ఒక సామాన్యుడి తెలివికి ఇదొక ఉదాహరణ. ఈ ఫొటోలో కనిపిస్తున్న ఆసామి పేరు మహేశ్వరన్. బెంగళూరు వీధుల్లో కాల్చిన మొక్కజొన్నలు అమ్ముతూ పొట్ట పోసుకుంటూ ఉంటాడు. పగలంతా ఈ వ్యాపారానికి పెద్ద గిరాకీ ఉండదు. సాయంత్రమైతేనే కస్టమర్ల సందడి మొదలవుతుంది. బొగ్గుల మంటపై మొక్కజొన్న కండెలను కాలుస్తూ, వేడివేడిగా కస్టమర్లకు అందించాలి. వాళ్లిచ్చే డబ్బులు తీసుకుని, చిల్లర లెక్క తప్పకుండా తిరిగివ్వాలి. చీకటి ముసురుకునే సమయంలో, సరైన వీధిదీపాలు లేని ప్రాంతాల్లో ఇదంతా మా చెడ్డ ఇబ్బంది. బండి మీద ఒక లైట్ అయినా ఏర్పాటు చేసుకోకపోతే పని జరగదు. అది మాత్రమేనా? బొగ్గులు రాజేసేందుకు జబ్బలు పీకేలా విసనకర్రతో విసురుతూ ఉండాలి, మరోపక్క కస్టమర్లనూ సంభాళిస్తూ ఉండాలి. చాలాకాలం ఈ సమస్యతో వేసారిపోయిన మహేశ్వరన్‌కు ఉన్నట్లుండి బుర్రలో బల్బు వెలిగింది. అంతే! ఉన్న వనరులతోనే తన అవసరాలకు తగిన టూ ఇన్ వన్ పరికరాన్ని రూపొందించుకున్నాడు. ఒక చిన్న బార్లైట్ ఫ్రేమ్‌కి, పాతబడ్డ టేబుల్ ఫ్యాన్‌ని కూడా ఫిక్స్ చేసి బండి మీద అమర్చుకున్నాడు. ఆ ఫ్యాన్ గాలితో నిప్పులు రాజేసి పొత్తులు కాలుస్తాడు. లైటు వెలుగులో డబ్బులు లెక్కపెట్టుకుంటాడు. వెలుగు, గాలి ఏకకాలంలో ఇచ్చే ఈ పరికరాన్ని బెంగళూరు జనాలు అబ్బురంగా చూస్తున్నారు. -
ప్రతిభ ఆధారంగానే నియామకాలు: ఈటల
కరీంనగర్: తెలంగాణలో ఉద్యోగాల నియామకం నిరంతర ప్రక్రియ అని.. ప్రతిభ ఆధారంగానే నియామకం ఉంటుందని ఆర్థిక మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. ఆదివారం ఆయన కరీంనగర్ జిల్లా కొత్తపల్లిలో జరిగిన గ్రామజ్యోతి కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం మీడియాతో మాట్లాడారు. నిరుద్యోగులు బ్రోకర్లను ఆశ్రయించి మోసపోవద్దని సూచించారు. ఎవరు ఎలా విమర్శించినా ప్రజల ఎజెండాగానే ముందుకెళ్తామని చెప్పారు. పోటీ పరీక్షలపై మీడియా చెప్పిన వాస్తవాలకు స్పందిస్తామని తెలిపారు. రూమర్స్‌తో నిరుద్యోగులు అయోమయానికి గురికావద్దన్నారు. అదే విధంగా.. ప్రతి ఒక్కరు 'గ్రామజ్యోతి' కార్యక్రమంలో పాల్గొని అభివృద్ధి పనుల్లో భాగస్వాములు కావాలని మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో భాగంగా పలు అభివృద్ధి కార్యక్రమాలను ప్రారంభించారు. హరిత తెలంగాణ నిర్మించుకోవడానికి అందరు మొక్కలు నాటాలని మంత్రి సూచించారు. -
విషయ పరిజ్ఞానంతోనే విజయం
చైతన్యపురి (హైదరాబాద్): విషయ పరిజ్ఞానంతోనే పోటీ పరీక్షల్లో విజయం సాధించవచ్చని విజిలెన్స్ అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ఎ. ప్రదీప్‌రెడ్డి అన్నారు. శుక్రవారం దిల్‌సుఖ్‌నగర్‌లో 'సాక్షి' రాజధాని ఇన్స్టిట్యూట్ ఆఫ్ పోలీస్ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన ఎస్ఐ, కానిస్టేబుల్ ఉద్యోగాల పోటీ పరీక్షలపై నిర్వహించిన అవగాహన కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా హాజరైన ప్రదీప్‌రెడ్డి విద్యార్థులకు పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు అవసరమైన మెళకువలను వివరించారు. ప్రభుత్వానికి రెవెన్యూ, పోలీసు శాఖలు చాలా కీలకమైనవని తెలిపారు. సమాజానికి దగ్గరగా వెళ్లి సేవ చేసేది పోలీసులేనని ఆయన ఈ సందర్భంగా గుర్తు చేశారు. అభ్యర్థులు ప్రణాళికబద్ధంగా ఏకాగ్రతతో ఆందోళన లేకుండా లక్ష్య సాధన కోసం రోజుకు 16 గంటలు కష్టించి చదివితే పోలీసు ఉద్యోగాలను కైవసం చేసుకుంటారన్నారు. అనంతరం సరూర్‌నగర్ ఇన్స్పెక్టర్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ.. నైతిక విలువలు, కుటుంబం, సమాజం పట్ల బాధ్యత వహించే ఉద్యోగాల్లో ప్రధానమైనది పోలీసు ఉద్యోగమని పేర్కొన్నారు. అభ్యర్థులు దళారుల మాటలు నమ్మి ఆర్థికంగా నష్టపోవద్దని, రిక్రూట్మెంట్ పారదర్శకంగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో ఇన్స్టిట్యూట్ డెరైక్టర్లు శంకర్‌రెడ్డి, లక్ష్మణ్, పలువురు ఫ్యాకల్టీ సభ్యులు పాల్గొన్నారు. -
రెండు రెళ్లు ఆరు
ఒకాయనకి జ్ఞానం అజీర్ణమై దిక్కుతోచక ఒక పుస్తకం రాసి పడేశాడు. ఆ పుస్తకాన్ని కొందరు ప్రముఖులకి పంచి శాస్త్ర ప్రకారం ఆవిష్కరణ సభ పెట్టాడు. సభా మర్యాద మేరకు వక్తలు గొంతు సవరించుకున్నారు. ‘‘ఈ పుస్తకం చదివి వారం రోజులు జబ్బుపడ్డాను. మనుషులకి డబ్బు చేసినా, జబ్బు చేసినా మబ్బుపట్టిన ఈ లోకం విచ్చుకుంటుంది. పిల్లలంతా వచ్చి ఎలాగూ నేను పోతానని రాతకోతలు పూర్తిచేశారు. వెంటిలేటర్ వాడాల్సి వస్తే, ఎన్ని రోజుల్లో తీసివేయాలో కూడా లెక్కలేశారు. ఈ పుస్తకాన్ని ఇంకెవరైనా చదివేస్తారేమోనని భయపడి ఆస్పత్రి నుంచి చక్రాల కుర్చీలో సభకు వచ్చేశాను’’ అన్నాడో ముసలాయన. ఆ ఊళ్లో అనేకమంది పిచ్చికి కారణమైన ఒక మానసిక వైద్యుడు లేచి, ‘‘పిచ్చి రెండు రకాలు. తనకు మాత్రమే పిచ్చి ఉందనుకోవడం, తనకు తప్ప ఈ లోకానికంతా పిచ్చి ఉందనుకోవడం. లోకమంతా వీళ్లతోనే నిండి ఉండటం వల్ల నేను బిజీగా ఉండిపోయి, ఈ పుస్తకాన్ని ఒక మిత్రుడికి ఇచ్చాను. దాన్ని చదవడం ముగించి, ఆయన తలకిందులుగా మా ఆస్పత్రికి వచ్చాడు. ఈ లోకం తలకిందులుగా ఎందుకుందని గొడవపడ్డాడు. ఆయన్ని తలకిందులుగానే ఒక గోడకి ఆనించి, కౌన్సెలింగ్ స్టార్ట్ చేశాను. ఈ లోకం భక్తులకి హనుమంతుడి తోకలా, డాక్టర్లకి స్టెతస్కోప్‌లా, లాయర్లకి నల్లకోటులా, టీవీ యాంకర్లకి మైకులా, కొందరు నాయకులకి రహస్య కెమెరాలా కనిపిస్తుందని ఎవడి లోకం వాడిదని నచ్చజెప్పాను. కొంచెం స్థిమితపడ్డ తరువాత యధావిధిగా తలపైకి, కళ్లు కిందకి చేశాను. ఐదు నిమిషాల తరువాత ప్రతిదానికి తలకిందులైపోయే మనుషుల్ని తాను చూడలేనని శీర్షాసనంతో ఇంటికెళ్లిపోయాడు. పాఠకుల్ని తలకిందులు చేయగల ఈ పుస్తకం రచయితకి ఏమిస్తుందో తెలియదు కానీ నాకు మాత్రం పేషంట్లనిచ్చింది. మనకేంటి అనేది సమాజపు నినాదం కాబట్టి ఈ పుస్తకం సమాజ శ్రేయస్సుని కోరేదనడంలో సందేహం లేదు’’ అని ముగించాడు. రచయిత భార్య మైకు తీసుకుని, ‘‘తలకు చమురు, కణతలకి అమృతాంజనం, ఒంటికి సెంటు మాత్రమే రాసే ఈయన... ఒక పుస్తకం కూడా రాస్తాడని నేనెప్పుడూ అనుకోలేదు. రాసుకు పూసుకు తిరిగేవాళ్లే రచయితలవుతారని నానుడి. అక్షరాలు పుస్తకాలవుతాయేమో కానీ పుస్తకాలు మాత్రం ఎన్నటికీ రూపాయలు కావు. ఇది తెలిసినా ఆయన పుస్తకం రాయడానికి ఎందుకొప్పుకున్నానంటే ఒకరోజైనా మావారు అచ్చోసిన ఆంబోతులా తిరుగుతుంటే చూడాలని కోరిక’’ అని ముగించింది.అప్పటికీ మిగిలివున్న ఒక ప్రేక్షకుడు పారిపోతున్న ఇంకొకణ్ణి పట్టుకుని, ‘‘గురువుగారూ! ఇంతకూ ఆ పుస్తకంలో ఏముంది?’’ అని అడిగాడు. ‘‘చిన్నప్పుడు బట్టీపట్టిన ఎక్కాలన్నీ తిరగరాశాడు. అందులో కూడా ఆయన సొంతాభిప్రాయాలు అనేకమున్నాయి. రెండు రెళ్లు ఆరు అని రాశాడు తిక్కలోడు.’’ ‘‘ఎంత గొప్పగా రాశారండి. రెండు రెళ్లు నాలుగన్నవాణ్ణి ఈ లోకం ఎప్పుడైనా బతకనిచ్చిందా! రచయితల్లో కూడా మహానుభావులుంటారు.’’ - జి.ఆర్.మహర్షి -
టూకీగా ప్రపంచ చరిత్ర 109
వేకువ జ్ఞానం పొందేందుకు రకరకాలుగా ప్రయత్నించాడు సిద్ధార్థుడు. కుటుంబాన్ని వదిలేసి, ‘రాజగృహ’ దిశగా బయలుదేరాడు. బయలుదేరే సమయానికి యశోధర కొడుకును ప్రసవించింది. పుత్ర వాత్సల్యమనే మోహపాశమైనా సిద్దార్థుని ప్రయత్నాన్ని ఆపలేకపోయింది. ఆశ్రమాన్ని వదిలి, వింధ్య పర్వత ప్రాంతంలోని ఒక కొండగుహను ఎన్నుకుని తపస్సులో కూర్చున్నాడు. కొన్ని రోజులకు సిద్దార్థుని శరీర బలం పూర్తిగా నీరసించిందేగానీ జ్ఞానం జాడ దొరకలేదు. ఇలా లాభం లేదనుకుని నదివొడ్డునే ఉన్న రావిచెట్టు నీడలో కూర్చుని, నెలల పర్యంతం తనలో తాను తర్కించుకోవడం మొదలెట్టాడు. అలా తర్కించుకోగా తర్కించుకోగా... మెదడును కమ్ముకున్న మబ్బులు కొద్దికొద్దిగా విచ్చిపోవడం ప్రారంభించాయి. కొంతకాలానికి జ్ఞానోదయమైన సంతృప్తితో బుద్ధుడైన సిద్దార్థుడు సంచారానికి బయలుదేరాడు. లోకంలోని బాధలన్నింటికీ మూలం స్వార్థచింతన; మానవుని అంతరంగానికి ‘దురాశ’ అనేది అంతులేని యాతనకు గురిచేస్తుందనేది బుద్ధుని తాత్వికచింతనకు పునాది.అందువల్ల, వదులుకోవలసినవాటిలో మొదటిది - ఇంద్రియాలను తృప్తిపరచాలనే కోరిక; రెండవది - కీర్తి, సంపదలను ఆర్జించాలనే ఆశ; మూడవది - చిరంజీవిగా ఉండాలనే తాపత్రయం. మనిషి ఆలోచనా ప్రపంచం నుండి ‘నేను’ (అహం) అనే సర్వనామం తొలగించుకుంటే, మహోన్నతమైన జ్ఞానానికి దారి ఏర్పడుతుంది. ‘నిర్వాణం’ అంటే ప్రాణాలను త్యజించడం కాదు, ‘అహం’ అనే భావాన్ని త్యజించడం. ఈ లక్ష్యాల సాధన కోసం తప్పనిసరిగా పాటించవలసిన క్రమశిక్షణగా ఎనిమిది నియమాలనూ గౌతమబుద్ధుడు నిర్దేశించాడు. వాటిల్లో మొదటిది మాటలో నిజాయితి; రెండవది నడవడికలో నిజాయితి; మూడవది బతుకు తెరువులో నిజాయితి; నాలుగవది వాంఛలో పరిశుద్ధత; ఐదవది సరైన దృక్పథం; ఆరవది ప్రయత్నంలో నిజాయితి; ఏడవది ఉద్రేకాల నిగ్రహం; ఎనిమిదవది ఆత్మపరిశీలనలో నిజాయితి. ఇక్కడ ప్రధానంగా మనం గమనించవలసింది కోరికలు చంపుకోవాలని కాదు బుద్ధుడు చెప్పింది; వాటిని సరైన మార్గానికి మరలించమని. కోరికలు చంపుకోగలిగినవి కావు; అవి చచ్చిపోతే మనిషికి బతుకు మీద ఆశే చచ్చిపోతుంది. పైగా, కోరికలను వదులుకోవడం ఆచరణ సాధ్యం కాని ప్రయత్నం.అందువల్ల, కోరికలను సరైన మార్గంలో నడిపేందుకు ప్రతిమనిషి సరైన దృక్పథం ఏర్పరుచుకోవాలి. ఉదాహరణకు సమాజానికి సేవ చేయడం, న్యాయం నిలబెట్టేందుకు పాటుపడటం. కళల పట్ల ఆసక్తి వంటివి పెంపొందించుకోవాలని ఉద్దేశం. ప్రయత్నంలో నిజాయితి అంటే - పనేమో మంచిదే, కానీ దాన్ని సాధించేందుకు అవలంబించిన మార్గం నీచమైనదై, ఫలితాన్ని బట్టి మార్గాన్ని సమర్థించుకోవడం తగదని ఉద్దేశం. ఉద్రేకాలనేవి జీవికి సహజ లక్షణం. వాటిని అదుపులో పెట్టుకోగలిగినప్పుడే పశుత్వం వదలిన మనిషౌతాడు. అందువల్ల, ఉద్రేకాలను నియంత్రించడమే కాదు, ఆ దశ నిరంతరం కొనసాగాలంటే మనం చేసుకునే ఆత్మపరిశీలనలో నిజాయితీ ఉంటేనే సాధ్యం అనేది వాటి సారాంశం. ఈ బోధనలకు తోడు బుద్ధుడు పునర్జన్మల వంటి విశ్వాసాలను ఖండించాడు. బుద్ధుని ప్రచారాలు వైదికులకు వ్యతిరేకం కాకపోయినా, ఆ కోవకు చెందినవాళ్లకు అవి కంటగింపు కలిగించినా, ప్రజాబాహుళ్యాన్ని ఆ తత్వం ఆకర్షించింది. జీవితాంతం ఆదరాభిమానాలు చూరగొన్న తాత్వికునిగా తన 80వ ఏట గౌతమబుద్ధుడు ‘కుశినర (నేటి ఉత్తరప్రదేశ్‌లోని కుశినగర్)’లో జీవిత ప్రస్థానం ముగించాడు. బుద్ధుని బోధనలు స్పష్టమైనవిగాను, అర్థం చేసుకునేందుకు తేలికైనవిగాను ఉండటమే కాక, అత్యాధునిక భావాలకు దగ్గరగా ఉండటం మనకు ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది. (సమాప్తం) ఇన్ని రోజులుగా మీ ఆదరణ పొందిన ‘టూకీగా ప్రపంచ చరిత్ర’ను నేటితో ముగిస్తున్నాము. దీనిని పుస్తకరూపంలో చూడాలనుకునేవారు ఈ క్రింది రచయితను సంప్రదించవచ్చు. - ఎడిటర్ -
జ్ఞానం వికసించిన రోజు...
మే 4, సోమవారం బుద్ధపూర్ణిమ కొందరు ఆయన్ని గొప్ప తత్త్వవేత్తగా కొనియాడతారు. ఇంకొందరు సమాజాన్ని చక్కదిద్దిన సంస్కర్తగా శ్లాఘిస్తారు. ఆయనే పశువుల్లా, పాశవికంగా బతికే మానవులకు శాంతి, అహింస, కరుణ, దయ, జాలి, ప్రేమ, మైత్రి లాంటి ధర్మాల్ని ప్రబోధించిన బుద్ధుడు. క్రీస్తుకు 600 సంవత్సరాల పూర్వమే మనిషి నడవడికకు మెరుగైన దారి చూపిన మార్గదర్శి ఆయన. అంతటి మహనీయుడు మన దేశం నేలమీద పుట్టడం మనందరికీ గర్వకార ణం. ప్రపంచానికి శాంతి, అహింసల్ని ప్రబోధించిన దేశంగా భారతదేశం పొందిన కీర్తికి ఈ తథాగతుడే కారణం. బుద్ధుని బోధనలు ఎన్నెన్నో ఉన్నాయి. అన్నీ ఆణిముత్యాలే. అజరామరాలే. వీటన్నింటిలో వెలకట్టలేనివి పంచశీల. బుద్ధుడు జ్ఞానానికి ఎంతటి ప్రాధాన్యత ఇచ్చాడో, అంతకు మించి శీలానికి ఇచ్చాడు. శీలం అనేది అందరికీ ఉండాల్సిన నైతిక గుణంగా భావించాడు. ప్రబోధించాడు. శీలం మన జీవన విధానమని చాటాడు. బుద్ధుడు చెప్పిన శీలం అంటే నైతిక జీవనమే. మనవల్ల ఇతరులెవరూ ఇబ్బంది పడని విధానమే శీలం. ఈ నైతిక జీవనం మనిషిని మానసిక రుగ్మతలకు దూరం చేస్తుంది. మనశ్శాంతిని ప్రసాదిస్తుంది. ఉత్సాహాన్ని నింపుతుంది. నిజం చెప్పాలంటే పరిపూర్ణమానవుడిగా జీవించే అవకాశాన్ని కల్పిస్తోంది. 1. పంచశీలలో ‘జీవహింస చేయను’ అనేది మొదటిది. స్వర్గసుఖం కోసం యజ్ఞాల్లో వేలాది జీవుల్ని బలివ్వడాన్ని బుద్ధుడు ఒప్పుకోలేదు. రాజులు సాగించే అమానుషమైన జంతువేటల్ని వ్యతిరేకించాడు. భూమి మీద పుట్టిన ప్రతి జీవికీ జీవించే హక్కు ఉంది అని బోధించాడు. 2. రెండోది దొంగతనం గురించి, ‘పరుల సొమ్ము దొంగిలించను’ అని సాధారణంగా చెప్పుకుంటాం కానీ బుద్ధుడు దొంగిలించడమే కాదు, నీది కాని వస్తువుని, నీవు కష్టపడి సంపాదించని వస్తువుని, మరొకరు నీకు దానంగా ఇవ్వని వస్తువుని దారిలో దొరికినా తీసుకోకూడదు- అలా తీసుకున్నా అది పరుల సొమ్మును హరించడమే అన్నాడు. 3. మూడోది ‘అబద్ధాలు చెప్పను’ అనేది. దీనినే బుద్ధుడు ‘ముసావాద’ అన్నాడు. అంటే మోసపు మాటలు చెప్పను అని. ఎదుటి వారికి నష్టాన్ని కలిగించడం కోసమో లేదా తాను లాభం పొందడం కోసమో చెప్పే మోసపు మాటలు పలకరాదన్నాడు. 4. నాలుగోది కామానికి సంబంధించినది. సాధారణంగా స్త్రీ, పురుషుల శారీరక వాంఛల్ని కామం అంటాం. అయితే భార్యాభర్తల పవిత్ర సంబంధాన్ని బుద్ధుడు తప్పు పట్టలేదు. ‘కామదురాచారం’ మాత్రం కూడదని చెప్పాడు. కుటుంబ వ్యవస్థని గౌరవించాడు. 5. ఇక ఐదవది, మత్తుపానీయాలు, మత్తుని, ఉద్రేకాల్ని కలిగించే పదార్థాన్ని సేవించకూడదని చెప్పాడు. వీటివల్ల మనిషి తన విజ్ఞత కోల్పోయి, ఉచ్చనీచాలు ఎరుగని పశువులా ప్రవర్తిస్తాడని, ఎదుటివారికి ఇబ్బందికరంగా తయారవుతాడని ప్రబోధించాడు. ఈ ఐదు విషయాలు ప్రతి ఒక్కరూ పాటిస్తే- నేరం, శిక్షలతో పనేముంటుంది? మనిషికి తప్పు చేసిన భావన ఎప్పుడూ కలుగదు. కాబట్టి సంతోషంగా, నిస్సిగ్గుగా, నిర్భీతిగా, ప్రశాంతంగా, ప్రేమపూర్వకంగా బతకగలుగుతారు. అవాంతరాలకి, అవాంఛనీయ విధానాలకీ, అక్రమాలకీ తావులేని అందమైన ప్రపంచం రూపొందుతుంది. మనిషి జీవితానికి ఒక విలువ వస్తుంది. ఉత్సాహంగా బతికే మనిషి జీవితం కుంటుపడదు. వేగంగా, ధైర్యంగా ముందుకు సాగుతుంది. ఒక జీవిని చంపడమే కాదు, దాన్ని బంధించినా, అంటే జంతువులు, పక్షుల్ని కట్టేసి పెంచుకున్నా హింసే అన్నాడు. బానిసత్వాన్నీ హింసగానే పరిగణించాడు. చేతలతోనే కాదు, మాటల ద్వారా దూషించినా, కఠినంగా మాట్లాడినా, వ్యంగ్యంగా మాట్లాడినా, రెండర్థాల పదాలతో బాధపెట్టినా- ఇవన్నీ ‘జీవహింస’గానే చెప్పాడు. ఐతే ఏదైనా కావాలని, తెలిసి చేస్తేనే అది నేరం అవుతుందని, తెలియక జరిగిన హింస తప్పు మాత్రమే అవుతుందని చెప్పాడు. బుద్ధుడు బోధించిన ఈ పంచశీల మనిషి జీవితానికి ఒక చక్కటి నియంత్రణ. ఎందుకంటే- ప్రతివ్యక్తి పంచశీల ధరించి, స్వతంత్ర నియంత్రణ కలిగి ఉంటే... ఒక వ్యక్తి మరో వ్యక్తిని మోసగించడు. ఒకడు మరొకని దోపిడీ చేయడు. దగా చేయడు. చంపుకు తినడు. ఎదుటి వారి జీవితంలో అనవసరంగా తల దూర్చడు. దురాశాపరుడు కాడు- తోటి వ్యక్తుల్తో, సమాజంతో తగవు పడడు. ద్వేషాన్ని పెంచబోడు. పాపాన్ని మూటగట్టుకోడు. నలుగురితో మంచిగా ఉంటాడు. నలుగురి మేలు కోరుకుంటాడు- కాబట్టి అతనికి అడుగడుగునా అడ్డంకులుండవు. వెనక్కి లాగేవారు కానీ, ఎత్తి పడేసేవారు గానీ ఉండరు. ప్రతి వ్యక్తి మరో వ్యక్తిలో మానవీయతనే చూస్తాడు. మానవీయునిగానే జీవిస్తాడు. పంచశీలను తెలుసుకున్నవాడు తను తాను తెలుసుకుంటాడు. పంచశీలను పాటించేవాడు తనను తాను గెలుచుకుంటాడు. జీవితాన్ని గెలుస్తాడు, జీవనాన్ని గెలుస్తాడు. నిజమైన విజేతగా నిలుస్తాడు. అందుకే... బుద్ధం శరణం గచ్ఛామి. - బొర్రా గోవర్ధన్ బౌద్ధం- పున్నమి: బౌద్ధానికి ముందు మన సంప్రదాయంలో పున్నమికి ప్రాముఖ్యత లేదు. బుద్ధుని తర్వాత చాంద్రమానం ప్రాముఖ్యత హెచ్చింది. పౌర్ణమికి ప్రాధాన్యత పెరిగింది. బౌద్ధానికీ, పౌర్ణమికీ అవినాభావ సంబంధం ఉంది. బుద్ధుడు జన్మించిన ది, ఇల్లు విడిచినదీ, జ్ఞానోదయం పొందినదీ, పరినిర్వాణం పొందినదీ వైశాఖ పూర్ణిమరోజే. బుద్ధుడు తొలిగా పరివ్రాజకుడైనదీ, ధర్మప్రచారం ప్రారంభించినదీ, తొలి బౌద్ధసంఘం ప్రారంభించినదీ ఆషాఢ పూర్ణిమ నాడు. బుద్ధుడు తన తల్లికి భిక్షుణిగా దీక్ష ఇచ్చినది ఆశ్వయుజ పౌర్ణమి నాడు; అశోకుని కుమార్తె సంఘమిత్ర, కుమారుడు మహేంద్రుడు శ్రీ లంకలో బౌద్ధధర్మం ప్రారంభించినది ( విదేశంలో తొలి బౌద్ధ ధర్మస్థాపన) జ్యేష్ట పౌర్ణమినాడు కాగా, ఫాల్గుణ పౌర్ణమి బుద్ధుడు తన ఏడేళ్ల కుమారుడు రాహులునికి భిక్షు దీక్ష ఇచ్చిన రోజు. -
ఏ జ్ఞానమైనా సరే....
గ్రంథపు చెక్క జ్ఞానం సంపాదించడం వల్ల శాంతి చెడదు. సంపాయించిన జ్ఞానాన్ని విశ్వసించి దాన్ని జీవితం మీదికి తెచ్చుకొని ఆ జ్ఞానం ప్రకారం జీవితాన్ని వంకర తిప్పడం వల్ల కలుగుతాయి అనర్థాలు ఏ జ్ఞానమైనా సరే అది రిలెటివ్. ఓ మూల నుంచి ఓ కోణం నించే అది సత్యం. సంపూర్ణమైన జ్ఞానం ఏదీ కాదు. నీకు సత్యం కనుక అది నాకు సత్యం కానక్కర్లేదు అనే స్తిమితం, విశాలత్వం ఉంది ఈ దేశంలో త్యాగమనేది త్యాగమని తెలియకుండానే జరగాలి. తెలిసి జరిగినప్పుడు తనకీ, ఇతరులకీ విషతుల్యం బోధనలు రెండు విధాలు...తాను నమ్మినది బోధించడం, తాను నమ్మనిది బోధించడం! ద్వేషం ప్రేమకు చాలా సన్నిహితం. అందుకనే మనం ప్రేమిస్తున్నవాళ్ళు అపరాధం చేసినప్పుడు మనకి ఎక్కువ ద్వేషం కలుగుతుంది మనుష్యుడు మృగాల కన్న వివేకవంతుడైనందుకు, మృగాల ఆనందాన్ని త్యజించడానికి కాదు ఆ వివేకాన్ని ఉపయోగించాల్సింది. - చలం ‘విషాదం’ (ఇతర వ్యాసాలు) పుస్తకం నుంచి. -
యాంత్రికత కాదు, సృజనాత్మకత కావాలి
నాలెడ్జ్ ఎకానమీకీ, గత ఆర్థికవ్యవస్థకీ తేడా ఉన్నది. కాబట్టి పాఠశాలలు మడికట్టుకొని సమాజానికి దూరంగా ఉంటే విద్యార్థి నిరర్థకుడు అవుతాడు. భవిష్యత్తును తీర్చే నైపుణ్యాన్ని కలిగిస్తేనే మానవ సంపదగా మనిషి మారతాడు. ప్రతి ఉదయం లాగే ఈరోజు కూడా 6 గంటలకు ఉస్మాని యా ప్రాంగణం దగ్గర వాకిం గ్‌కి వెళ్లినపుడు ప్యాంట్లు, షర్టు లతో ఉన్న కొందరమ్మాయిలు చేతిలో ల్యాప్‌టాప్‌లతో పరిగె డుతూ కనిపించారు - బస్ కోసం. ఆ సన్నివేశం నన్ను ఐదారు దశాబ్దాల వెనక్కు లాక్కెళ్లింది. 50, 60 ఏళ్ల క్రితం అదే వయసున్న అమ్మా యిలు గుంపులు గుంపులుగా కొడవళ్లు పట్టుకొని కూలి పనులకు వడివడిగా వెళ్లే దృశ్యం గుర్తొచ్చింది. ఇరవ య్యేళ్ల క్రితం ఆదిలాబాద్‌లో తిరుగుతున్నప్పుడు ఉద యమే పారలు పట్టుకొని పరిగెత్తుతున్న కార్మికులను చూశాను. 60 ఏళ్లలో ఎంత మార్పు! ఈ మార్పును చైనాలో, పోలెండ్‌లో, అమెరికాలో కూడా చూశాను. ఈనాడు సామాజిక విప్లవానికి సమాంతరంగా విజ్ఞానంతో కూడిన ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చెందుతు న్నది. దీనికి సంతోషపడుతుంటే దానికి సమాంతరంగా నిరుద్యోగం కూడా పెరుగుతున్నది. సాంకేతిక పరిజ్ఞా నం పుణ్యమా అని చాలా ఉద్యోగాలను యంత్రాల ప్రాతిపదికగా రూపొందిస్తున్నారు. ఒక షిఫ్ట్‌లో వంద మంది చేసే పనిని ఒకే ఒక్క యంత్రం అర నిమిషంలో చేస్తోంది.పెట్టుబడిదారుడు మనిషికన్నా యంత్రాన్నే వ్యాపార సాధనంగా భావిస్తున్నాడు. కాబట్టి ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ఆవిష్కరణ జరిగితేనే మనిషి సమ స్యలను పరిష్కరించుకోగలుగుతాడు. నూతన ఆవిష్కర ణలకు మూలం జ్ఞానం. ఇది నాలెడ్జ్ ఎకానమీ. దీనిలో విద్యారంగాన్ని ప్రతిక్షణం మార్చుకుంటూ కొత్త భావా లను దీక్షతో అమలు చేయగలిగితేనే ఆర్థిక రంగంలో కొత్త ఉద్యోగావకాశాలు, కొత్త సంపదను సృష్టించడం సాధ్యమవుతుంది. ఇప్పటి వరకు పెట్టుబడిదారీ దేశాలు వినియోగంలోకి రుణాలు ఇచ్చి, డబ్బు చలామణీతో ఆర్థిక వ్యవస్థను నడిపించగలిగాయి. అది ఫలితాలివ్వక అక్కడ వాల్‌స్ట్రీట్ ఉద్యమం లేక స్ప్రింగ్ ఉద్యమాలు ఆవిర్భవించాయి. కాబట్టి విద్యారంగాన్ని కాలానుగుణం గా ఎంత సంస్కరించగలిగితే అంత కొత్త ఆర్థిక వ్యవ స్థను మనం ముందు తరాలకు అందించగలుగుతాం. ఇది ఏదో ఒక దేశం సమస్య కాదు. ప్రపంచ దేశాలన్నీ ఇదే పరిస్థితిని గమనించి తమ విద్యావ్యవస్థలను సంస్క రించుకుంటున్నాయి. ఇదివరకు ఏ దేశ సమస్యను ఆ దేశమే పరిష్కరించుకొనేది. కానీ నేడు సమస్య ఏ దేశా నిదైనా, దాని పరిష్కారం అనేక దేశాలతో ముడిపడి ఉం టోంది. ఆ పరిష్కారం గ్లోబల్ పరిష్కారంగా మారు తున్నది. ఇప్పుడు దేశ సరిహద్దుల సమస్య కాదు ప్రధా నం. ఆ దేశంలోని ప్రజలు ఎదుర్కొంటున్న పేదరికం, ఆర్థిక అసమానతలు, ఆర్థిక సంక్షోభాలు, ప్రజల అనేకా నేక సమస్యలే ప్రధానం. ఆయా సమస్యల ఆధారంగా జరగాల్సిన నూతన ఆవిష్కరణలు వాటికి పరిష్కారం. అలాంటి ఆవిష్కరణలకు పునాది నిర్మించుకోవడానికి విశ్వవిద్యాలయాలనే కాదు, చిన్న తరగతుల నుంచి కూడా మన బోధనా పద్ధతులు మార్చుకోవాలి. వెనుకటి కాలంలో పుస్తకాలలో ముద్రించింది బోధిస్తే సరిపోయే ది. కానీ దానితో గత సమాజమే ఆవిష్కృతం అవుతుం ది. అంతే తప్ప ప్రస్తుత సమస్యకు పరిష్కారం దొరకదు. చరిత్రను ప్రస్తుత పరిస్థితులకు అన్వయించకపోతే భవిష్యత్తుని నష్టపోతాం. మనం నిన్నటి సమాజం కన్నా రేపటి సమాజం గురించి ఆలోచించవలసి ఉన్నది. రేపు పిల్లవాడికి కావాల్సింది నైపుణ్యం మాత్రమే. అనగా రేపటి సమస్యలను పరిష్కరించడానికి వర్తమాన విద్యా ర్థుల్లో క్లిష్ట సమస్యలను ఏ విధంగా పరిష్కరించాలనే ఆలోచనను అలవాటుగా మార్చాలి. సృజనాత్మక విద్యా బోధనను అలవర్చాలి. దీనినే క్రిటికల్ థింకింగ్ అం టాం. అది యాంత్రిక బోధన ద్వారా సాధ్యంకాదు. సృజనాత్మకత కావాలి. సమాచార రంగంలో కూడా విప్ల వాలు వచ్చాయి. ఈనాడు ఒంటరిగా ఆలోచించడం కన్నా నలుగురితో కలసి ఆలోచించడం అవసరం. ఆ నలుగురు ఒకే గదిలో ఉండాల్సిన అవసరం కూడా లేదు. కానీ ఒక జట్టుతో కలసి పనిచేసే అలవాటు రావా లి. మనకు కనపడని వ్యక్తులతో కలసి పనిచేయాలి. ఇత రుల సహకారం కావాలంటే వారి నాగరికత, సంస్కృతి అలవాట్లను గౌరవించే లక్షణం కూడా ఉండాలి. దాన్నే టీం స్పిరిట్ అంటారు. టీం స్పిరిట్ కావాలంటే మన అభిప్రాయాలను ఇతరులకు అందజేసే శాసనాలపైన మనకు అభినివేశం కావాలి. అనగా ఓరల్ కమ్యూని కేషన్, రిటెన్ కమ్యూనికేషన్ ఉంటేనే ఇతరులతో కలసి ఆలోచించవచ్చు. కాబట్టి ఈనాటి విద్యార్థికి కంఠస్థం చేయడంకన్నా కొత్త సమాజం సృష్టించేందుకు నైపుణ్యం కావాలి. అందుకు పునాది మన తరగతి గదిలోనే పడవ లసి ఉంటుంది. కాబట్టి పారిశ్రామిక రంగానికీ, ఆర్థిక రంగానికీ విద్యాలయాలు తోడైతేనే క్లాసులో కనపడే విద్యార్థికి భవిష్యత్తులో ఉపాధి, జీవించే లక్షణం ఏర్పడ తాయి. నాలెడ్జ్ ఎకానమీకీ, గత ఆర్థిక వ్యవస్థకీ తేడా ఉన్నది. కాబట్టి పాఠశాలలు మడికట్టుకొని సమాజానికి దూరంగా ఉంటే మీ దగ్గర ఉన్న విద్యార్థి నిరర్థకుడు అవుతాడు. భవిష్యత్తును తీర్చే నైపుణ్యాన్ని కలిగిస్తేనే మానవ సంపదగా మనిషి మారతాడు. ఈనాటి సవాలు ఇదే. విద్యారంగంతో సంబంధమున్న వారంతా దీనికి సమాయత్తం కావాలి. అప్పుడే ఈ ప్రజాస్వామిక వ్యవ స్థలో భాగస్వాములమవుతాం. లేకుంటే కూలీలుగానే మిగిలిపోతాం. (వ్యాసకర్త ప్రముఖ విద్యావేత్త) -
అంతర్గత నిర్మాణంతో అసలైనశ్రేయస్సు
సద్గురు జగ్గీ వాసుదేవ్ ఈ భూమిపై మనిషి శ్రేయస్సు కోసం శాస్త్ర, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా ముఖ్యంగా గత వంద సంవత్సరాలుగా ఎంతో కృషి జరిగింది. దీనివల్ల మనకు ఖచ్చితంగా ఎంతో సౌఖ్యమూ, సౌలభ్యమూ ఏర్పడ్డాయి. మన ముందు తరాల వారు ఇటువంటి సుఖమయ జీవితాన్ని కనీసం ‘కల’ కూడా కని ఉండరు. వీటివల్ల మానవాళి మెరుగుపడిందా? మీరు ప్రపంచాన్ని, ముఖ్యంగా పశ్చిమదేశాలను, ఉదాహరణకు అమెరికాను చూసినట్లయితే, నలభై శాతం మంది ప్రజలు తమ మానసిక సమతుల్యత కోసం మందులపై ఆధారపడి ఉన్నారు. ఇది శ్రేయస్సు కాదు. మానవాళి ఎందుకు బాగాలేదు అంటే మనం బాహ్యం గురించిన జాగ్రత్తలు తీసుకున్నాం కాని అంతర్గత క్షేమాన్ని ఎప్పుడూ పట్టించుకోలేదు. నిజమయిన మానవ శ్రేయస్సు ఒక వ్యక్తి తనలో తాను ప్రశాంతంగా, ఆనందంగా ఉన్నప్పుడే కలుగుతుంది. మీలో మీరు ప్రశాంతంగా, ఆనందంగా ఎలా ఉండాలో మీకు తెలియనప్పుడు, మీరు ఉండే ఇల్లు, నడిపే కారు, వేసుకునే బట్టలు, మీ చుట్టూ ఉన్నవాళ్ళు, వీటికోసం మీరు చేసిన కృషి, ఇవన్నీ వ్యర్థం అవుతాయి. మీరు మీ స్వతహాగా ప్రశాంతంగా, సంతోషంగా జీవించగలిగినప్పుడే, మీ జీవితాన్ని భయమూ, ఆందోళనా లేకుండా గడపగలుగుతారు. నాకేమి అవుతుందో అన్న భయం మీలో ఉన్నంతవరకూ, మీరు కేవలం సగం అడుగులు మాత్రమే వేస్తారు. పూర్తి అడుగులు ఎప్పుడూ వేయరు. కాబట్టి, మనిషి తన పూర్తి సామర్థ్యం ఏమిటో తెలుసుకోవాలనుకున్నప్పుడు, మొదట తనలో ప్రశాంతత, ఆనందంతో కూడిన అంతర్గత స్థిరత్వం కలిగి ఉండాలి. అప్పుడే తను జీవితపు అవకాశాలను అన్వేషించి అందుకోగలుగుతాడు. లేకపోతే, అతని ఆనందం యాదృచ్ఛికం కావడం వల్ల, అతను జీవితం గురించి ఒక పెద్ద సందిగ్ధస్థితిలో ఉంటాడు. మీరు ఎవరయినా, ఎంతటి శక్తిశాలురైనా, బయటి పరిస్థితులు ఎల్లవేళలా 100% మీ అదుపులో ఉండవు. ఎందుకంటే అవి ఎన్నో ఆటంకాలను కలిగి ఉంటాయి. వాటిలో చాలావరకు మీకు తెలియను కూడా తెలియవు. మీకు తెలిసిన కొన్నింటినే మీరు నియంత్రించే ప్రయత్నం చేస్తారు, కాని మిగతావి మీకు అర్థం కూడా కావు. అలాంటప్పుడు నియంత్రించే ప్రసక్తే ఉండదు. అవన్నీ మీకు అనువుగా జరుగుతాయని మీరు ఆశిస్తున్నారు అంతే. కాని, మీ అంతర్గత విషయాలకు వచ్చేసరికి మీరు ఒక్కరే ఉంటారు. కనీసం అవైనా మీరనుకున్న తీరులో జరిగి తీరాలి. లేదంటే మీరు దారి తప్పారని అర్థం. అంతా ఇందువల్లే, అంటే వారి అంతర్గతం వారి ఆధీనంలో లేకపోవడం వల్లే, ఒత్తిడికి గురై, పూర్తిగా అలసిపోతుంటారు. మీ పనిని బట్టి మీరు ఒత్తిడికి గురికారు. మీ వ్యవస్థను మీరు నియంత్రించుకోలేకపోవడం వల్ల ఒత్తిడి జనిస్తుంది. మీరు నిజంగా మీ జీవితంలో నాణ్యత కావాలనుకుంటే, మీ చుట్టూ ఉన్న జీవితంలో అదే నాణ్యత ఉండాలనుకుంటే, మీలోని అంతర్గత పరిస్థితులను స్థిరపరుచుకుని, మీ మనస్సు, మీ భావాలు, మీ వ్యవస్థ బాహ్యజీవితపు ఒడిదుడుకులను అనుసరించకుండా స్థిరంగా ఉండేలా చేయాలిసి ఉంటుంది. మీలో అంతర్గత ఒడిదుడుకులూ, సమస్యలు లేనప్పుడు మీరు బాహ్య సవాళ్ళను సమర్థవంతంగా ఎదురుకోగలరు. మరి అలాంటి అంతర్గత పరిస్థితిని ఏర్పరుచుకునే మార్గమేదయినా ఉందా? తప్పక ఉంది. బాహ్యపరిస్థితులను మనం కోరుకున్నవిధంగా సృష్టించుకోవడానికి శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానం వున్న విధంగానే, అంతర్గత పరిస్థితులనూ మనం కోరుకున్నవిధంగా సృష్టించుకోవడానికి శాస్త్ర-సాంకేతిక పరిజ్ఞానం ఉంది. ప్రపంచాన్ని మనకు అనువుగా నిర్మించుకున్న విధంగానే, మన అంతర్గతాన్ని కూడా మనం మనకు కావలసిన విధంగా నిర్మించుకోగలం. కాబట్టి, మీరు నిజంగా మీ జీవితంలో నాణ్యత మెరుగుపడాలి అనుకుంటే, ఆ దిశగా అడుగులు వేయాలి. మీ అంతర్గత శ్రేయస్సుకోసం మీ సమయాన్ని కొంత వెచ్చించడానికి సిద్ధపడాలి. ఇది జరిగితే, మీరు పనిచేసే విధానంలో అసాధారణ మార్పు గమనిస్తారు. ఇందుకు కావలసిన పరిజ్ఞానం ఉంది. దీన్నే నేను ఇన్నర్ ఇంజనీరింగ్ (అంతర్గత నిర్మాణం) అంటాను. ఇది యోగా ద్వారా సాధ్యం. దీనిద్వారా అత్యున్నతమైన శ్రేయస్సును పొందవచ్చు. ప్రేమాశీస్సులతో, సద్గురు -
మట్టి పరీక్షలు.. నవశకానికి నాంది
గజ్వేల్: ‘వ్యవసాయరంగం కష్టాల్లో ఉంది.. నేల స్వభావాన్ని బట్టి పంటలు వేసుకునే పరిజ్ఞానం అందుబాటులోలేక రైతులు పీకల్లోతూ కష్టాల్లో ఉన్నారు.. ఇలాంటి తరుణంలో ప్రపంచంలోనే తొలిసారిగా చేపట్టబోతున్న పూర్తిస్థాయి మట్టి పరీక్షలు రైతన్నల ఆత్మహత్యల నివారణకు పునాది వేయాలి, నవ శకానికి నాంది పలకాలి’ అని వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి ఆకాంక్షించారు. కొత్త రకం మట్టి పరీక్షలకు పెలైట్ ప్రాజెక్ట్ కింద ఎంపికైన గజ్వేల్‌లో మంగళవారం ఎన్ఎస్ఎస్ఎల్యూపీ(నేషనల్ బ్యూరో ఆఫ్ సాయిల్ సర్వే అండ్ యూటీలైజ్ ప్లానింగ్) సంస్థ అధ్వర్యంలో చేపట్టనున్న పూర్తిస్థాయి భూసార పరీక్షల కార్యక్రమాన్ని వ్యవసాయశాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాల కొండయ్య తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా పట్టణంలోని లక్ష్మీ గార్డెన్స్‌లో ఏర్పాటుచేసిన సభలో ఆయన మాట్లాడారు. నేల స్వభావం తెలియక రైతులు తమకు తోచిన పంటలు వేసుకోవడం, మోతాదుకు మించి ఎరువులను వాడటం వల్ల పెట్టుబడులు విపరీతంగా పెరిగిపోతుండగా.. ఆశించిన దిగుబడులు రాక రైతులు నష్టపోవడం సహజ పరిణామంగా మారుతోందన్నారు. ఈ దుస్థితిని నివారించేందుకే ప్రభుత్వం పూర్తిస్థాయి మట్టి పరీక్షల కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. గజ్వేల్ మండలంలోని అన్ని గ్రామాల్లో 1,778 మట్టి నమునాలను సేకరించి వాటి పరీక్షల ఫలితాలతో రైతులకు ‘సాయిల్ హెల్త్ కార్డ్’ అందించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్డులో రైతులు వచ్చే 50 ఏళ్లు పాటు తమ భూముల్లో ఏయే పంటలు వేయాలి? భూముల్లో ఎలాంటి పోషకాలు లోపించాయి? వాటిని భర్తీ చేసుకోడానికి ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయాలపై ప్రణాళిక అందివ్వడం జరుగుతుందన్నారు. దీంతో రైతులకు పంటల సాగులో అవగాహన ఏర్పడి తక్కువ పెట్టుబడితో ఎక్కువ దిగుబడులను సాధించే అవకాశం కలుగుతుందన్నారు. ఈ పరీక్షల నిర్వహణకు ఈ ఏడాది రూ.20 కోట్లు కేటాయించినట్లు చెప్పారు. ప్రస్తుతం గజ్వేల్‌తోపాటు మహబూబ్‌నగర్ జిల్లా తిమ్మాజీపేట, ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలాల్లో ప్రారంభమవుతున్న ఈ కార్యక్రమాన్ని భవిష్యత్తులో రాష్ట్రంలోని 46 లక్షల హెక్టార్లలో చేపడతామన్నారు. రైతు సంక్షేమానికి ముఖ్యమంత్రి కేసీఆర్ చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారని కొనియాడారు. బిందు, తుంపర సేద్యానికి ఈ ఏడాది రూ.430 కేటాయిస్తున్నట్లు వెల్లడించారు. గత పదేళ్ల సమైక్య పాలనలో 129 హెక్టార్లలో పాలీహౌస్‌ల ఏర్పాటుకు కేవలం రూ.24 కోట్లు కేటాయిస్తే....ప్రస్తుతం సీఎం కేసీఆర్ తొలి బడ్జెట్లోనే వెయ్యి ఎకరాల్లో ఏర్పాటు చేసేందుకు రూ.250 కోట్లు కేటాయించారని తెలిపారు. ములుగు మండలం వంటిమామిడిలో కూరగాయాలు సాగుచేస్తున్న రైతుల కోసం కోల్డ్ స్టోరేజీ ఏర్పాటు చేస్తామని ప్రకటించారు. భూసార పరీక్షలతో రైతుకు లాభం వ్యవసాయశాఖ ప్రధాన కార్యదర్శి పూనం మాలకొండయ్య మాట్లాడుతూ, ఆహార భద్రతను సాధించాలంటే ముందుగా నేల భద్రంగా ఉండాలన్నారు. ఈ విషయం తెలియాలంటే భూసార పరీక్షలతోనే సాధ్యమన్నారు. ఎన్ఎస్ఎస్ఎల్యూపీకు చెందిన గొప్ప శాస్త్రవేత్త ఎస్కే.సింగ్ నేతృత్వంలో చేపట్టబోతున్న ఈ పూర్తిస్థాయి మట్టి పరీక్షలు వ్యవసాయ రంగంలో కొత్త అధ్యాయాన్ని లిఖించబోతున్నాయన్నారు. మెదక్ ఎంపీ కొత్త ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ, డైనమిక్ ఆఫీసర్‌గా పేరున్న పూనం మాలకొండయ్య తెలంగాణలోనే సేవలందించాలని కోరారు. సభలో వ్యవసాయశాఖ కమిషనర్ జనార్ధన్‌రెడ్డి, ఫ్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్శిటీ ప్రత్యేకాధికారి ప్రవీన్‌రావు, ‘గడా’ (గజ్వేల్ ఏరియా డెవలప్మెంట్ అథారిటీ) ఓఎస్డీ హన్మంతరావు, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డి, వ్యవసాయశాఖ జిల్లా జాయింట్ డెరైక్టర్ హుక్యానాయక్, గజ్వేల్ నగర పంచాయతీ చైర్మన్ గాడిపల్లి భాస్కర్, ఎంపీపీ చిన్నమల్లయ్య, ఎంపీపీ ఉపాధ్యక్షురాలు రజిత, నగర పంచాయతీ వైస్ చైర్మన్ అరుణ, గజ్వేల్ ఏడీఏ శ్రావణ్‌కుమార్ తదితరులు పాల్గొన్నారు. మట్టి పరీక్షలు, పరిజ్ఞానం, పంటలు, Soil tests, knowledge, crops -
వేదం.. జీవననాదం
తిరుమల: భారతీయుల జీవనశైలి వేద ప్రామాణికమైందని, వేదం జీవన నాదంగా కొనసాగాలని కంచి మఠం స్వామి విజయేంద్ర సరస్వతి ఉద్ఘాటించారు. తిరుమల ధర్మగిరిలోని శ్రీవేంకటేశ్వర వేద విజ్ఞానపీఠంలో ఈ నెల పదో తేదీ నుంచి బుధవారం వరకు వరకు జరిగిన వేద శాస్త్ర ఆగమ విద్వత్ సదస్సు ముగింపు కార్యక్రమం బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా వచ్చిన విజయేంద్ర సరస్వతి అనుగ్రహభాషణం చేశారు. టీటీడీ వైదిక ధార్మిక కార్యక్రమాలను కొన్ని దశాబ్దాలుగా ప్రతిష్టాత్మకంగా చేపడుతోందని ప్రశంసించారు. వేద పారాయణధారులు ధనం, ప్రఖ్యాతుల కోసం ఎప్పుడూ ఆశపడరని, విజ్ఞానం కోసం కృషి చేస్తారని అన్నారు. వేదం జీవననాదంగా కొనసాగితే దేశం పరమ సుభిక్షమవుతుందన్నారు. అంతకుముందు మహాపాధ్యాయ తాతాచార్య మాట్లాడుతూ 1968 నుంచి వేద శాస్త్ర ఆగమ సంరక్షణ కోసం టీటీడీ వైదిక విద్య, శ్రౌతయాగాలు, చతుర్వేద హవనాలు నిర్వహిస్తోందన్నారు. టీటీడీ ఈవో ఎంజీ గోపాల్ మాట్లాడుతూ వేద విద్య వ్యాప్తి కోసం టీటీడీ నిత్యం కృషి చేస్తోందన్నారు. ఇందులో భాగంగానే వచ్చే ఏడాది ఫిబ్రవరిలో అఖిలభాతర వేద విద్వత్ సదస్సును శ్రీవేంకటేశ్వర విశ్వ విద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహించనున్నట్టు తెలిపారు. వేద విద్య పారాణయదారులను ప్రోత్సహించేందుకు 2010 నుంచి క్రమాపాఠీలు, ఘనాపాఠీలకు, వృద్ధ పండితులను గుర్తించి ఆర్థికసాయం అందిస్తున్నామని తెలిపారు. ప్రస్తుతం వేద పారాయణదారులకు ఇస్తున్న రూ.12 వేలను రూ.16 వేలకు, ఘనాపాఠీలకు ఇస్తున్న రూ.13 వేలను రూ.17 వేల కు, వృద్ధ పండితులకు ఇస్తున్న రూ.8 వేలను రూ.10 వేలకు పెంచనున్నట్లు ఈవో వెల్లడిం చారు. దీనిపై తర్వలో జరగనున్న టీటీడీ స్పెసిఫైడ్ అథారటీ సమావేశంలో చర్చిస్తామన్నారు. ప్రస్తుతం నిర్వహించిన వేద విద్వత్ సదస్సులో ఉత్తీర్ణులైన 180 మందిని అభినందిస్తున్నట్లు చెప్పారు. అంతకుముందు ‘శృతివివేచనం’ అనే పుస్తకాన్ని కంచి పీఠం స్వామితో కలసి ఈవో ఎంజీ గోపాల్ ఆవిష్కరించారు. అనంతరం ఉత్తీర్ణులైన విద్యార్థులను, పరీక్షాధికారులను సన్మానించారు. జేఈవో శ్రీనివాసరాజు, ఎస్వీ.వేద విశ్వవిద్యాలయం ఉపకులపతి కేఈ.దేవనాథన్, రాష్ట్రీయ సంస్కృత విద్యాపీఠం ఉపకులపతి ఆచార్య హరేకృష్ణ శతపతి, వేద విజ్ఞానపీఠం ప్రిన్స్‌పాల్ అవధాని, ఇతర పండితులు, అధ్యాపకులు, వేద విద్యార్థులు పాల్గొన్నారు. -
దివ్య చైతన్య దీపిక
జగన్మాత జీవిత పరమార్థాన్ని చూపించగలిగే మహాశక్తి జగన్మాతను శైలపుత్రి, బ్రహ్మచారిణి, చంద్రఘంటా, కూష్మాండ, స్కందమాత, కాత్యాయినీ, కాళరాత్రీ, మహాగౌరీ, సిద్ధిధాత్రి అనే తొమ్మిది రూపాలలో నవరాత్రులూ ఆరాధించి విజయదశమి పర్వదినాన విశ్వజనని దివ్యరూపాన్ని విశేషంగా కొలుస్తారు. వసంతరుతువు, శరదృతువు ప్రాణులకు క్లిష్టకాలాలు. జనులకు అనారోగ్యం కలిగించే ఈ మాసాలలో చెడును ఎదుర్కొని, శుభాలను ప్రసాదించమని కాంక్షిస్తూ జగద్రక్షకి అయిన దుర్గాదేవిని పూజించాలని శాస్త్రోక్తం. మానవుడికి కలిగే ప్రమాదాలను అంతర్ముఖ తత్త్వంతో దర్శించిన వ్యాసాది ఋషిపుంగవులు వాటి నిర్మూలన కోసం, నివారణ కోసం దివ్య చైతన్య దీపిక అయిన జగన్మాత ఆరాధనే అనివార్యం, ఆనంద ప్రదాయకం అని ప్రబోధించారు. జగములనేలే జగన్మాత సత్యానికీ, ధర్మానికీ, సామరస్యానికీ విజయానికీ అధినేత్రి. వివేకం, విజ్ఞానం, శాస్త్రం, శక్తి, సంగీతం, సాహిత్యం అమ్మ విభూతిలోని భాగాలే. జీవితంలో ఒడిదుడుకులు, స్తబ్ధత ఏర్పరిచే పరిస్థితులు మనిషిని మానసికంగా, శారీరకంగా కృంగదీస్తే భగవంతునిపై భారం వేసి కాలానుగుణంగా జీవిత యజ్ఞం కొనసాగించాలనే ఆంతర్యం, విశ్వకళ్యాణం కోసం, ధర్మపరిరక్షణ కోసం అలౌకిక భావనాతుల్య అవతారాలలో జగన్మాత ఆవిర్భావం జరిగింది. దసరా అంటే పది రోజులని అర్థం. కనుక అమ్మవారిని నవరాత్రులూ విశేషంగా ఆరాధించి జీవన దృక్పథాన్ని విజయ పథంలో నడిపించమనీ వేడుకోవాలి. సంప్రదాయం, సంస్కృతి కలగలసిన విజయదశమి మానవ జీవితాల్లో ఆనంద అనుభవాలను అందిస్తూ పావనం చేస్తుంది. -ఇట్టేడు అర్కనందనాదేవి -
వినియోగం అనే లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ?
సోషల్ - మెథడ్స్ బోధనా లక్ష్యాలు- స్పష్టీకరణాలు అవగాహన: ఉపాధ్యాయుడు తరగతిలో జ్ఞానం అనే లక్ష్యాన్ని బోధించిన తర్వాత అవగాహన అనే లక్ష్యాన్ని సాధించాలి. జ్ఞానం అవగాహనకు సోపానం. అవగాహన అంటే ఏదైనా భావనలను యథాతథంగా కాకుండా అర్థవంతంగా అభ్యసించడం. అవగాహన స్పష్టీకరణలు: విచక్షణ: విద్యార్థి భావనలు, సూత్రాలు, యధార్థాల మధ్య తేడాలు (తారతమ్యాలు భేదాలు, వ్యత్యాసాలు) గుర్తించడం. 1. ప్రత్యక్ష పన్నులకు, పరోక్ష పన్నులకు మధ్య తేడా తెలుసుకోవడం. 2. సూర్య, చంద్ర గ్రహణాల మధ్య తేడా తెలుసుకోవడం. 3. చెక్కుకు, డ్రాఫ్టుకు మధ్య తేడా తెలుసుకో వడం. వర్గీకరించడం: భావనలను విద్యార్థి వివిధ రకాలుగా పేర్కొనడం. 1. బడ్జెట్‌ను మిగులు బడ్జెట్, లోటు బడ్జెట్, సంతులిత బడ్జెట్లుగా వర్గీకరించడం. 2. నిరుద్యోగాన్ని ఇచ్ఛాపూర్వక, అనిచ్ఛాపూ ర్వక నిరుద్యోగంగా వర్గీకరించడం. 3. ప్రభుత్వాన్ని శాసన శాఖ, కార్యనిర్వాహక శాఖ, న్యాయశాఖలుగా వర్గీకరించడం. సరిపోల్చడం: భావనల మధ్య పోలికలను చెప్పడం. 1. జైనమతాన్ని, బౌద్ధమతంతో సరిపోల్చడం. 2. గవర్నర్ అధికారాలను రాష్ర్టపతి అధికారా లతో సరిపోల్చడం. 3. హైకోర్టు విధులను సుప్రీంకోర్టు విధులతో సరిపోల్చడం. ఉదాహరణలివ్వడం: ఉపాధ్యాయుడు ఉదాహర ణలివ్వడం ఒక బోధన నైపుణ్యం. దానికి అదనంగా విద్యార్థి మరో ఉదాహరణ ఇచ్చిన ట్లయితే అతడు పాఠ్యాంశాలను అర్థం చేసుకున్నాడని భావం. 1. ఉచిత వస్తువులకు గాలి, నీరు ఉదాహరణగా పేర్కొనడం. 2. ఆహార పంటలకు వరి, గోధుమ జొన్న ఉదాహరణగా పేర్కొనడం. 3. ఐచ్ఛిక ద్రవ్యానికి చెక్కు, డ్రాఫ్టులను ఉదాహరణగా పేర్కొనడం. పరస్పర సంబంధాలను గుర్తించడం: వివిధ భావనల మధ్య విద్యార్థి సంబంధాలను గుర్తించడం. 1. ధరకు డిమాండ్‌కు మధ్య విలోమ సంబంధాన్ని గుర్తించడం. 2. డిమాండ్‌కు సప్లయ్‌కు మధ్య అనులోమ సంబంధాన్ని గుర్తించడం. 3. అడవుల నరికివేతకు, వాతావరణ సమతౌ ల్యం దెబ్బ తినడానికి మధ్య సంబంధాన్ని గుర్తించడం. వివరించడం: విద్యార్థి ఏదైనా ఒక భావనను సులభం నుంచి క్లిష్టతకు, తెలిసిన అంశాల నుంచి తెలియని అంశాలకు అర్థవంతంగా చెప్పడాన్ని వివరిం చడం అంటారు. 1. విద్యార్థి భూభ్రమణం, భూపరిభ్రమణం అనే అంశాలను అర్థవంతంగా చెప్పడం. వ్యాఖ్యానించడం: విద్యార్థి దత్తాంశాలను అర్థవంతంగా చెప్పడం. 1. 1951 నుంచి 2011 వరకు వివిధ దశాబ్దాల్లోని అక్షరాస్యత రేటు ఆధారంగా భారతదేశంలో అక్షరాస్యత పెరిగింది అని వ్యాఖ్యానించడం. 1951 18.3% 1991 52.5% 2001 65% 2011 74.04% తప్పులను గుర్తించడం: విద్యార్థి ఏదైనా ఒక వాక్యంలో తప్పులను గుర్తించడం. 1. ‘మొఘలు సామ్రాజ్య స్థాపకుడు అక్బర్’ అనే వాక్యం తప్పు అని విద్యార్థి గుర్తించాడు. తప్పులను సరిదిద్దడం: విద్యార్థి ఏదైనా ఒక వాక్యంలో తప్పులను గుర్తించి వాటిని సరి దిద్దడం. 1. మొఘల్ సామ్రాజ్య స్థాపకుడు అక్బర్ అనే వాక్యంలోని తప్పును అక్బర్‌కు బదులుగా బాబర్‌గా విద్యార్థి సరిదిద్దాడు. గతంలో అడిగిన ప్రశ్నలు 1. వినియోగం అనే లక్ష్యానికి చెందిన స్పష్టీకరణ? (డీఎస్సీ-2006) 1) విచక్షణ చేయడం 2) ఉదాహరణలు ఇవ్వడం 3) సాధారణీకరించడం 4) నమూనాలను తయారుచేయడం 2. ప్రపంచ శాంతిని కాపాడటంలో ఐక్య రాజ్యసమితి పాత్రలో ప్రధానంగా అభినందించదగింది? (డీఎస్సీ-2006) 1) నైపుణ్యానికి సంబంధించింది 2) మానసిక, చలనాత్మక రంగానికి సంబంధించింది 3) జ్ఞానాత్మక రంగానికి సంబంధించింది 4) భావావేశ రంగానికి సంబంధించింది 3. విద్యార్థి బంగాళాఖాతంలో ఇటీవల ఏర్పడిన తుఫానును చక్రవాత వర్షపాతానికి ఉదాహరణగా పేర్కొన్నాడు. ఆ విద్యార్థి సాధించిన లక్ష్యం? (డీఎస్సీ-2006) 1) అవగాహన 2) నైపుణ్యం 3) జ్ఞానం 4) వినియోగం 4. సౌర కుటుంబం పాఠాన్ని 8వ తరగతి విద్యార్థి అభ్యసించిన తర్వాత ఓ రోజు స్నేహితులతో కలిసి నక్షత్రశాలను సందర్శించాడు. దీన్ని బట్టి అతడు ఏ లక్ష్యాన్ని సాధించాడని చెప్పొచ్చు? (డీఎస్సీ-2004) 1) వైఖరి 2) అభిరుచి 3) నైపుణ్యం 4) ప్రశంస 5. విద్యావిధానం విద్యా లక్ష్యాల వైపు పయనిస్తున్నపుడు ఆ మార్గంలో ఆచరణ ద్వారా సాధించగలిగే స్థాయిని సూచించే బిందువు? (డీఎస్సీ-2004) 1. సామర్థ్యం 2. కనీస అభ్యసన స్థాయి 3. లక్ష్యం 4. ఉద్దేశం సమాధానాలు 1) 3; 2) 4; 3) 1; 4) 2; 5) 3. మాదిరి ప్రశ్నలు 1. బ్లూమ్స్ వర్గీకరించిన జ్ఞానాత్మక రంగం లోని లక్ష్యాలు సరళం నుంచి క్లిష్టతకు ఏ ఆధిక్యత శ్రేణిలో ఉంటాయి? 1) జ్ఞానం, అవగాహన, సంశ్లేషణ, విశ్లే షణ, మూల్యాంకనం, వినియోగం 2) జ్ఞానం, అవగాహన, వినియోగం, విశ్లే షణ, సంశ్లేషణ, మూల్యాంకనం 3) జ్ఞానం, అవగాహన, సంశ్లేషణ, విని యోగం, విశ్లేషణ, మూల్యాంకనం 4) జ్ఞానం, అవగాహన, మూల్యాంకనం, వినియోగం, సంశ్లేషణ, విశ్లేషణ 2. 2001 భారతదేశ అక్షరాస్యత రేటు, ఆంధ్ర ప్రదేశ్ అక్షరాస్యత రేటుకు సంబంధించిన దత్తాంశాలను వ్యాఖ్యానించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) జ్ఞానం 2) అవగాహన 3) వినియోగం 4) నైపుణ్యం 3. మదర్ థెరిసా సేవానిరతిని ప్రశంసించిన విద్యార్థి ఏ రంగంలోని ప్రవర్తనలో మార్పు కలిగింది? 1) జ్ఞానాత్మక రంగం 2) భావావేశ రంగం 3) మానసిక చలనాత్మక రంగం 4) జ్ఞానాత్మక రంగం, భావావేశ రంగం 4. పరీక్ష మార్కులతో నిమిత్తం లేకుండా ఉత్తీర్ణులయ్యే పద్ధతిని ప్రవేశపెట్టిన సంవత్సరం? 1) 1961 2) 1971 3) 1981 4) 1977 5. కిందివాటిలో అవగాహన అనే లక్ష్యానికి సంబంధించింది? 1) దత్తాంశాలను వ్యాఖ్యానిస్తాడు 2) దత్తాంశాలను విశ్లేషిస్తాడు 3) దత్తాంశాల ఆధారంగా పరస్పర సంబంధాలు గుర్తిస్తాడు 4) పోలికలు, భేదాలు చెపుతాడు 6. ‘విద్యార్థులు పాలు పంచుకునే గుణానికి ఎక్కువ ప్రాముఖ్యం ఇవ్వాలి. కానీ లక్ష్య సాధనకు కాదు’ అని అభిప్రాయపడినవారు? 1) ఆర్నవెల్ 2) జాన్సన్ 3) బ్లూమ్స్ 4) డివే 7. జర్మనీ ఏకీకరణలో బిస్మార్‌క నిర్వహించిన పాత్రను వివరించండి? అనే ప్రశ్న ద్వారా ఉపాధ్యాయుడు పరీక్షించదలచుకున్న లక్ష్యం? 1) జ్ఞానం 2) వినియోగం 3) అవగాహన 4) నైపుణ్యం 8. నాణేలను సేకరించడం, ఆల్బమ్‌ల్లో చిత్రా లను భద్రపరచడం మొదలైన ప్రవ ర్తనాంశాలను కలిగిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) అభిరుచులు 2) వైఖరులు 3) ప్రశంస 4) వినియోగం 9. పటాలను కచ్చితమైన స్కేల్‌తో గీయగలిగిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) వినియోగం 2) నైపుణ్యం 3) అవగాహన 4) జ్ఞానం 10. కిందివాటిలో వినియోగం అనే లక్ష్యానికి సంబంధించని స్పష్టీకరణం? 1) పరికల్పన రూపొందించడం 2) వ్యాఖ్యానించడం 3) ఫలితాలను ఊహించడం 4) సాధారణీకరించడం 11. కిందివాటిలో జ్ఞానాత్మక రంగానికి సంబంధించని లక్ష్యం? 1) సంశ్లేషణ 2) గ్రహించడం 3) విశ్లేషణ 4) మూల్యాంకనం 12. జాతీయ సమైక్యత అనే పాఠ్యాంశాన్ని విన్న తర్వాత దేశభక్తి, సహనం కలిగిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) అభిరుచులు 2) వైఖరులు 3) వినియోగం 4) ప్రశంస 13. ఉష్ణోగ్రత, వాతావరణ పీడనం మధ్య విలోమ సంబంధం పేర్కొన్న విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) జ్ఞానం 2) అవగాహన 3) వినియోగం 4) నైపుణ్యం 14. సూర్య కుటుంబం నమూనాను తయారు చేసిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) జ్ఞానం 2) అవగాహన 3) వినియోగం 4) నైపుణ్యం 15. వీచే దిశలను బట్టి పవనాలను వర్గీకరించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) జ్ఞానం 2) అవగాహన 3) వినియోగం 4) నైపుణ్యం 16. కింది వాటిలో భావావేశ రంగానికి సంబంధించని లక్ష్యం? 1) సహజీకరణం 2) శీల స్థాపనం 3) ప్రతిస్పందనం 4) వ్యవస్థాపనం 17. భారతదేశంలో అధిక జనాభాకు కారణాలను విశ్లేషించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) జ్ఞానం 2) అవగాహన 3) వినియోగం 4) నైపుణ్యం 18. నౌకాశ్రయానికి - ఓడరేవుకు మధ్య తేడాలను పేర్కొన్న విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) జ్ఞానం 2) అవగాహన 3) వినియోగం 4) నైపుణ్యం 19. నీలి విప్లవం అంటే ఏమిటి అనే ప్రశ్న ద్వారా మాపనం చేయదలచుకున్న లక్ష్యం? 1) జ్ఞానం 2) అవగాహన 3) వినియోగం 4) నైపుణ్యం 20. హైస్కూల్ విద్యార్థి 10వ తరగతిలో దర్శనీయ ప్రదేశాలు అనే పాఠ్యాంశం విన్న తర్వాత చిత్తూరు జిల్లాలోని తిరుపతిని సందర్శించాడు. ఆ విద్యార్థిలో ఏ రంగంలో మార్పు కలిగింది? 1) జ్ఞానాత్మక రంగం 2) భావావేశ రంగం 3) మానసిక చలనాత్మక రంగం 4) జ్ఞానాత్మక, మానసిక, చలనాత్మక రంగాలు 21. గత మూడు రోజుల నివేదిక ఆధారంగా రేపటి ఉష్ణోగ్రతను ఒక విద్యార్థి ఊహించగలగడం అనే సామర్థ్యం ఏ లక్ష్య సాధనకు సంబంధించింది? 1) జ్ఞానం 2) అభిరుచి 3) వినియోగం 4) అవగాహన 22. ఇతరుల మాటలను గౌరవంగా వినడం ఏ బోధనా లక్ష్యానికి సంబంధించింది? 1) అవగాహన 2) వైఖరి 3) నైపుణ్యం 4) జ్ఞానం 23. రాజ్యాంగ ప్రవేశికను గుర్తుకు తెచ్చుకున్న విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) జ్ఞానం 2) అవగాహన 3) వినియోగం 4) అభిరుచి 24. ద్రవ్యాన్ని న్యాయాత్మకమైన టెండర్ ద్రవ్యం, ఇచ్ఛాపూర్వక ద్రవ్యంగా వర్గీ కరించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) జ్ఞానం 2) అవగాహన 3) వినియోగం 4) నైపుణ్యం 25. ఎకనమిక్ సర్వే దత్తాంశాల ఆధారంగా మరణ రేటు తగ్గింది అని వ్యాఖ్యానించిన విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) జ్ఞానం 2) అవగాహన 3) వినియోగం 4) అభిరుచులు 26. సమస్యా పరిష్కార పద్ధతి ప్రధానంగా ఏ రంగానికి సంబంధించింది? 1) భావావేశ రంగం 2) జ్ఞానాత్మక రంగం 3) మానసిక చలనాత్మక రంగం 4) చలనాత్మక రంగం 27. కింది వాటిలో భావావేశ రంగానికి చెందినవారు? 1) ఎలిజబెత్ సింపసన్ 2) డేవిడ్ ఆర్.క్రాత్ హోల్ 3) ఆర్. హెచ్. దావే 4) హౌరో 28. భావావేశ రంగంలో లక్ష్యాలు సరళత నుంచి క్లిష్టతకు వరుసగా? 1) గ్రహించడం, ప్రతిస్పందించడం, వ్యవస్థాపనం, విలువకట్టడం, శీల స్థాపనం 2) గ్రహించడం, ప్రతిస్పందించడం, విలువ కట్టడం, వ్యవస్థాపనం, శీలస్థాపనం 3) గ్రహించడం, ప్రతిస్పందించడం, శీల స్థాపనం, విలువకట్టడం, వ్యవస్థాపనం 4) గ్రహించడం, ప్రతిస్పందించడం, వ్యవ స్థాపనం, శీలస్థాపనం, విలువ కట్టడం 29. వివిధ జాతుల మధ్య పరస్పర సంబంధాలను విద్యార్థి ప్రశంసించడం ఏ రంగానికి చెందిన లక్ష్యం? 1) భావావేశ 2) జ్ఞానాత్మక 3) మానసిక చలనాత్మక 4) పైవేవీ కాదు 30. మానసిక చలనాత్మక రంగానికి సంబం ధించిన లక్ష్యాలు సరళత నుంచి క్లిష్టతకు వరుసగా 1) సునిశితత్వం, అనుకరణ, హస్తలాఘ వం, సహజీకరణం, సమన్వయం 2) అనుకరణ, హస్తలాఘవం, సునిశి తత్వం, సహజీకరణం 3) అనుకరణ, హస్తలాఘవం, సమ న్వయం, సునిశితత్వం, సహజీకరణం 4) అనుకరణ, హస్తలాఘవం, సమన్వయం, సునిశితత్వం, సహజీకరణం 31. నైపుణ్యం అనే లక్ష్యాన్ని సాధించడానికి అనువైన పాఠ్యపథక సోపానం? 1) పునర్విమర్శ 2) గైహికం 3) సామాన్యీకరణం 4) ప్రావేశిక చర్య 32. నదీ తీర ప్రాంతాల్లో నాగరికతలు అభివృద్ధి చెందడానికి కారణాలను పేర్కొన్న విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) జ్ఞానం 2) అవగాహన 3) వినియోగం 4) నైపుణ్యం 33. భారత స్వాతంత్య్రోద్యమ చరిత్ర పాఠ్యాం శాలు విన్న విద్యార్థి దేశభక్తిని కలిగి ఉన్నాడు. ఆ విద్యార్థిలో నెరవేరిన లక్ష్యం? 1) అభిరుచులు 2) వైఖరులు 3) ప్రశంస 4) వినియోగం సమాధానాలు 1) 2; 2) 2; 3) 4; 4) 2 5) 2; 6) 2; 7) 3; 8) 1; 9) 2; 10) 2; 11) 2; 12) 2; 13) 2; 14) 4; 15) 2; 16) 1; 17) 3; 18) 2; 19) 1; 20) 2; 21) 3; 22) 2; 23) 1; 24) 2; 25) 2; 26) 2; 27) 2; 28) 2; 29) 1; 30) 2; 31) 2; 32) 3; 33) 2. -
సంతోషమే జీవితప్రయోజనం!
గ్రంథపు చెక్క మానవులందు జ్ఞానము అంకురించినది మొదలు ‘‘నేను ఎవ్వడను? ఎచ్చట నుండి వచ్చితిని? ఎచ్చటికి పోవుచున్నాను? మరణమే నా స్థితికి అంత్యమా లేక మరనంతర జీవితము కలదా? మానవకోటి యందు ఇట్టి వివిధత్వమునకు కారణములేమి? సృష్టికర్త ఉన్నాడా? ఉండిన యే ఉద్దేశముతో ఇట్టి విచిత్రమైన సృష్టిని గావించు చున్నాడు. ఒకడు సుఖింపనేల, మరి యొకడు దుఃఖింపనేల? ఇట్టి ప్రశ్నలు, విచారములు, సంశయములు పొటమరించు చుండెను. నాటి నుండి నేటి వరకు ఇట్టి ప్రశ్నలడుగబడుచున్నవి. ఒక్కొక్క దేశమున ఒక్కొక్కకాలమున ఒక్కొక్క మతము ఇటువంటి సమస్యల చిక్కు విడదీయ ప్రయత్నించినది. తన పుట్టు పూర్వోత్తరములు తెలిసికొను ఇచ్చ ప్రతి మానవునకును సహజముగ నుండును. ఇట్టి విషయములనే ఖయ్యాము తన రుబాయతులలో చర్చించియున్నాడు. పాశ్చాత్యవిమర్శకులు కొందరు ఖయ్యామును ఎపిక్యుర్ అని పేర్కొనిరి. వాడుకలో ఎపిక్యుర్ అనగా పరచింతన లేని భోగలాలసుడు. ఎపిక్యురస్ సిద్ధాంతములు ఒకటి రెండు విషయములలో తప్ప ఖయ్యాము నమ్మకముల కంటే భిన్నముగా ఉండును. ‘‘శరీరం భౌతికం. ఆత్మ భౌతికమైన సూక్ష్మశరీరం. ఆత్మ దేహమున వ్యాపించి యుండును. దేహముతోడ ఆత్మయు నశించును. మరణాంతర జీవితం లేదు. సంతోషమే జీవిత ప్రయోజనము. విధి యనునది లేదు. మానవుని అదృష్టము తన చేతిలో యున్నది’’ అని ఎపిక్యురస్ చెప్పెను. ఎపిక్యురసు, ఖయ్యాముల భావములు చాలావరకు పరస్పర విరుద్ధములు. ఎపిక్యురసు నిరీశ్వరవాది, ఖయ్యాము ఈశ్వరవాది. అతడు విధి లేదని చెప్పును. ఇతడు మన సుఖదుఃఖములు విధినిర్ణీతములని సిద్ధాంతీకరించును. - దువ్వూరి రామిరెడ్డి ‘పానశాల’ నుంచి. (సెప్టెంబర్ 11 దువ్వూరి వర్థంతి) -
చిన్నారుల వికాసానికి.. ప్లే స్కూల్ టీచర్
నేటి విద్య కంటెంట్ జనరల్ స్టడీస్: బయాలజీ బ్యాంకింగ్ ఎగ్జామ్స్: రీజనింగ్ పేజీలను www.sakshieducation.com నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు. బాలలు.. విరిసీవిరియని పసిమొగ్గలు. వారికి విద్యాబుద్ధులు నేర్పడం కత్తిమీద సాములాంటిదే. చిన్నారుల పట్ల సానుభూతితో వ్యవహరించి, అక్కున చేర్చుకొని, ప్రేమను పంచి ఆటపాట నేర్పాల్సి ఉంటుంది. అలాంటి ప్రత్యేకమైన గురువులే.. ప్లే స్కూల్ టీచర్లు. మానసికంగా, శారీరకంగా సున్నితంగా ఉండే పసిపిల్లల్లో ప్రాపంచిక పరిజ్ఞానం పెంపొందించే ప్లే స్కూల్ ఉపాధ్యాయులకు నగరాలు, పట్టణాలు అనే తేడా లేకుండా అన్నిచోట్లా ప్రస్తుతం అధిక డిమాండ్ ఉంది. అవకాశాలకు, ఆదాయానికి లోటులేని ఈ వృత్తిలోకి ప్రవేశించే వారి సంఖ్య క్రమంగా పెరుగుతోంది. ఆకర్షణీయమైన వేతనాలు సాధారణ టీచర్లకు, ప్లే స్కూల్ టీచర్లకు మధ్య ఎంతో వ్యత్యాసం ఉంటుంది. వీరు సాధారణంగా ఐదేళ్లలోపు బాలలకు గురువులు. ప్లే స్కూల్ ఉపాధ్యాయులకు ప్రత్యేక శిక్షణ అవసరమవుతుంది. బుజ్జాయిల మనస్తత్వాలను అర్థం చేసుకొని పనిచేసేవారే ఈ రంగంలో రాణిస్తారు. ప్లే స్కూల్ అంటే ఒకప్పుడు ఎవరికీ అంతగా తెలియని పరిస్థితి ఉండేది. ప్రస్తుతం నగరాలతోపాటు ద్వితీయ శ్రేణి పట్టణాల్లో ఇవి ఇబ్బడిముబ్బడిగా వెలుస్తున్నాయి. దీంతో వీటిలో పనిచేసే ఉపాధ్యాయులకు డిమాండ్ పెరిగిపోయింది. వీరికి ఆకర్షణీయమైన వేతనాలు లభిస్తున్నాయి. కార్పొరేట్ ప్లే స్కూళ్లు భారీ వేతనాలను ఆఫర్ చేస్తున్నాయి. చిన్నారుల గురువులుగా శిక్షణ పొందినవారు వనరులను సమీకరించుకొని, సొంతంగా ప్లే స్కూల్‌ను ఏర్పాటు చేసుకోవచ్చు. లక్షణాలు: చిన్నపిల్లలకు బోధించే ఉపాధ్యాయులకు అంతులేని సహనం ఉండాలి. బాలల పట్ల ప్రేమ, సానుభూతి తప్పనిసరిగా అవసరం. వారు ఆసక్తి చూపే ఆటలు, పాటల ను పూర్తిగా నేర్చుకొని అందులో నైపుణ్యం సంపాదించాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. అర్హతలు: మనదేశంలో ఎర్లీ చైల్డ్‌హుడ్ కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటిని పూర్తిచేసినవారు ప్లే స్కూళ్లలో టీచర్లుగా పనిచేయొచ్చు. ఇంటర్మీడియెట్, గ్రాడ్యుయేషన్ పూర్తయిన తర్వాత వీటిలో చేరేందుకు అవకాశం ఉంది. బీఈడీ, ఎంఈడీ చేసినవారు సైతం ప్లే స్కూళ్లలో టీచర్లుగా చేరొచ్చు. వేతనాలు: ప్లే స్కూల్ ఉపాధ్యాయులకు ప్రారంభంలో నెలకు రూ.6 వేల నుంచి రూ.10 వేల వేతనం అందుతుంది. తర్వాత సీనియార్టీని బట్టి వేతనం పెరుగుతుంది. ఎర్లీ చైల్డ్‌హుడ్ కోర్సులను ఆఫర్‌చేస్తున్న సంస్థలు ఆంధ్ర మహిళా సభ-హైదరాబాద్ వెబ్సైట్: www.andhramahilasabha.org.in ఇందిరాగాంధీ జాతీయ సార్వత్రిక విశ్వవిద్యాలయం వెబ్సైట్: www.ignou.ac.in నేషనల్ కౌన్సిల్ ఫర్ టీచర్ ఎడ్యుకేషన్ వెబ్సైట్: www.ncte-india.org ఆనందాన్ని పంచే కెరీర్ శ్రీ ప్రస్తుతం తల్లిదండ్రులిద్దరూ ఉద్యోగులు కావటం, పోటీవాతావరణంలో ప్లేస్కూల్స్‌కు డిమాండ్ పెరిగింది. సాధారణ టీచర్ ఎడ్యుకేషన్ పూర్తిచేసిన వారికంటే ఎర్లీ చైల్డ్ హుడ్ కోర్సులు చేసిన వారే... పసిపిల్లల మనసెరిగి పాఠ్యాంశాలను బోధించగలరు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఆంధ్రమహిళాసభలో మాత్రమే ఎర్లీ చైల్డ్‌హుడ్ ఎడ్యుకేషన్‌లో పీజీ డిప్లొమా కోర్సు ఉంది. ఇక్కడ ఉన్న 45 సీట్లు మహిళలకు మాత్రమే కేటాయించారు. కోర్సు పూర్తవగానే ప్లేస్మెంట్ లభిస్తుంది.్ణ -ఎం.రమ, కోర్సు కో-ఆర్డినేటర్, ఆంధ్రమహిళాసభ బీఈడీ కళాశాల -
మూడు దేశాల ముద్దుబిడ్డ
బాల్యంలో తల్లి చెప్పే రామాయణ భారత గాథలు విన్నారు ఆనందాదేవి.. పెద్దయ్యాక కూడా వాటిని మర్చిపోలేదు...వాటినుంచి ఎంతో జ్ఞానం సంపాదించుకున్నారు...ప్రపంచ సాహిత్యాన్ని అధ్యయనం చేసి, తన జ్ఞానపరిధిని పెంచుకున్నారు... మనిషికి మనసుకు మధ్య జరిగే సంఘర్షణలను తన కథలకు ప్రధానాంశంగా చేసుకున్నారు... రచనలలో భిన్న సంస్కృతులను చూపారు... భావవ్యక్తీకరణలో కొత్తకోణం ఆవిష్కరించారు...విమర్శకుల ప్రశంసలనందుకుంటూనే అనేక అవార్డులను గెలుచుకున్న ఆనందాదేవిమారిషస్లో పుట్టి, ఫ్రెంచ్‌లో రచనలు చేసిన అచ్చ తెలుగింటి అమ్మాయి అంటే ఆశ్చర్యమే! మారిషస్‌లోని ఆనందాదేవి ఇల్లు, చెరుకుతోట మధ్యలో ప్రశాంత వాతావరణంలో ఉంది. అలాంటి ఆహ్లాదకరమైన వాతావరణంలో ఆమె ఇంకా ఆహ్లాదకరమైన పుస్తకాలెన్నో చదివారు. ఆడుకోవడానికి చెల్లి తప్ప ఆ రోజుల్లో రేడియో, టీవీ వంటి ప్రచార సాధనాలు లేవు. అయితే ఆ ఇంటి లైబ్రరీలో ఆర్థర్ కోనన్డోయ్లే, అగాథా క్రిస్టీ వంటి రచయితల రచనలు, 1001 నైట్స్ అండ్ బౌడేలైర్... వంటి ఎన్నో మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. ఎందుకంటే ఆమె తల్లితండ్రులకు పుస్తకాలే ప్రాణం! బహుశ పుస్తకాలు చదివే అలవాటు వారి దగ్గర నుంచే అబ్బి ఉంటుంది. మనసుతోనే ప్రయాణం... భారతీయ సంస్కృతి సంప్రదాయాలలో పెరిగిన ఆనందాదేవి, తన ఏడవ ఏటనే కవిత్వం రాయడం ప్రారంభించారు. 15 వ ఏట రచించిన చిన్న కథకు, ‘రేడియో ఫ్రాన్స్ ఇంటర్నేషనల్ అవార్డు’ అందుకున్నారు. ‘‘ప్రపంచంలో ఏయే ప్రాంతాలకు ఎలా వెళ్లాలో తెలుసుకోవడానికి టైమ్ అట్లాస్ చూసేదానిని. నేను రాసే కథలలో అట్లాస్ చూస్తూ ఆయా ప్రాంతాలకు నా మనసుతో ప్రయాణిస్తుంటాను. నేను ఫ్రెంచ్‌లో రాస్తున్నప్పటికీ నాలో, నా రచనలలో భారతీయత ఉంటుంది. ఇప్పటికే నా రచనలు అనేక ఇతర భాషలలోకి అనువాదమయ్యాయి... ’’ అంటారు. భాషల మాటకారి... దేవి రచనలు ఫ్రెంచిభాషలో ఉంటాయి కాని, ఆమె పలు భాషలు మాట్లాడగలరు. ‘‘నాకు తెలుగు, క్రియోల్, ఫ్రెంచ్, భోజ్‌పురి, హిందీ భాషలు వచ్చు. ఎవరైనా నన్ను ‘మీరు ఏ భాషలో ఆలోచిస్తారు?’ అని ప్రశ్నిస్తే, ‘‘ఏ భాషలో మాట్లాడితే ఆ భాషలో ఆలోచిస్తాను. ’’ అంటారు ఆమె. రచనలు... ఆనందాదేవి రచనలలో అనేక సామాజిక అంశాలు ప్రతిబింబిస్తాయి. స్త్రీల గురించి, అనేక సామాజిక రుగ్మతల గురించి, అంగవైకల్యం, వ్యభిచారం, వృద్ధాప్యం, స్వలింగ సంపర్కం... వంటి ఎన్నో అంశాల మీద అనేక వ్యాసాలు రచించారు. ఇంకా... చిన్నకథలు, నవలలు రాస్తూ, అనువాదాలు చేస్తూ, పుస్తకాలు ప్రచురిస్తున్నారు. సాహిత్యం అనేది భాషాభేదం లేకుండా, తమ తమ అభిప్రాయాలను వ్యక్తం చేయడానికి అనువైనదనే విషయాన్ని ప్రచారం చేయడం లక్ష్యంగా పెట్టుకున్నారు. కలకత్తాలో... కలకత్తాలో ఉన్నప్పుడు కొన్నిరోజులపాటు కొందరు వేశ్యలను దగ్గరగా గమనించారు ఆనంద. ఈ విషయం చెబుతూ, ‘‘వారు ఎటువంటి దుస్తులు ధరించాలి? ఏ విధంగా ప్రవర్తించాలి? వంటి అంశాల మీద వారికి స్వేచ్ఛ ఉండదనిపించింది. ఈ విషయంలో ఆడపిల్లల కంటె మగపిల్లలను బాగా ఎడ్యుకేట్ చేయాలనిపించింది. వారికి స్త్రీలను గౌరవించడం నేర్పాలని నేను చెప్పినప్పుడు, చాలామంది న్యాయమూర్తులు, రాజకీయనాయకులు నన్ను విమర్శించారు’’ అని గుర్తు చేసుకున్నారు ఆనందాదేవి. ముగింపు పాఠకులకే! ‘‘రచయిత పురుషుడైతే, ఇంటికి వెళ్లగానే, తనను డిస్టర్బ్ చేయవద్దని, తాను రాసుకోవాలని చెప్పగలుగుతాడు. స్త్రీకి అలా కుదరదు. ఇంటికి వెళ్లి అన్ని పనులూ చేసుకుని, పిల్లలకు కావలసినవన్నీ చూసి, ఆ తరువాత సమయం, ఓపిక... ఉంటేనే రాసుకుంటారు. అంతేగాని, ‘నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను రాసుకుంటున్నాను’ అనే అర్హత ఆమెకు ఉండదు కదా!’’ అంటారు ఆనంద. ఇంకా... ‘‘రచనలు చేయడమంటే పాఠకులను చాలెంజ్ చేయడమే. ఒక రచన చేస్తే, అందులోకి పాఠకుడు ప్రవేశించాలి. పాఠకులతో సున్నితంగా ఆడుకోవడమంటే నాకు ఇష్టం. అందుకే ముగింపు ఒక్కోసారి పాఠకులకే వదిలేస్తుంటాను. నా తాజా నవల ‘లెస్ జోర్స్ వివంత్స్ (ద లివింగ్ డేస్), నవల ముగింపును పాఠకులకే వదిలేశాను’’ అన్నారు, ప్రస్తుతం స్విట్జర్లాండ్‌లో నివసిస్తున్న ఆనందాదేవి. అయితే సమస్యలను మాత్రం ఆమె అలా గాలికి వదిలేయలేదు. తనకు చేతనైన పరిష్కారాలను సూచిస్తుంటారు. బహుశ ఆ అలవాటే ఆమె పురస్కారాలు అందుకోవడానికి అర్హురాలిని చేసి ఉండవచ్చు! గుర్తింపు లేకపోవడమే మంచిది... నన్నొక ప్రత్యేక వ్యక్తిగా నిలిపింది మారిషస్. అయినప్పటికీ నేను నా రచనలు చేసేటప్పుడు నేను మారిషస్ స్త్రీని అనుకోను. నేను కంప్యూటర్ ముందు కూర్చునే ఒక ప్రాణిని. ఒక్కోసారి పెన్ పేపరు పుచ్చుకునే ప్రాణిని. కథలు రాస్తూ, నాకు తెలియని ప్రదేశాలకు ప్రయాణిస్తుంటాను. రచయితగా నాకొక గుర్తింపు లేకపోవడాన్ని, లేదనుకోవడాన్ని నేను ఇష్టపడతాను. కొత్తకొత్త వ్యక్తుల మస్తిష్కంలో నన్ను నేను ఆవిష్కరించుకోగలను... వారిలాగ ఆలోచిస్తూ, వారిలాగ ఉంటూ... - ఆనందాదేవి -
సివిల్స్-2014.. సుసాధ్యమే
బీఏ/ బీకాం/ బీఎస్సీ పూర్తిచేశారా? మీరు చదివిన సాధారణ డిగ్రీలకు అత్యుత్తమ ఉద్యోగాలు ఎలా వస్తాయని దిగులు చెందుతున్నారా? మీ కోసమే యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ).. సివిల్ సర్వీసెస్ - 2014 ప్రకటనను విడుదల చేసింది. వయోపరిమితిని, ప్రయత్నాల సంఖ్యను పెంచడం సానుకూలాంశం. ఇందులో విజయం సాధించాలంటే.. కావాల్సిందల్లా.. మానసిక సన్నద్ధత, విషయ పరిజ్ఞానం, వ్యక్తిత్వ సామర్థ్యం. ఇవి ఉంటే చాలు.. మీరు కూడా ఒక జిల్లాకు కలెక్టర్ లేదా సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ (ఎస్పీ) కావొచ్చు, లేదంటే విదేశాల్లో మనదేశం తరపున ఇండియన్ ఫారెన్ సర్వీస్ అధికారిగా సేవలందించొచ్చు. ప్రిలిమినరీ, మెయిన్స్.. ఇంటర్వ్యూలనే మూడు దశల్లో యూపీఎస్సీ నిర్వహించే పరీక్షల్లో మీ ప్రతిభను చూపే సామర్థ్యాన్ని పెంపొందించుకోండి. నిండైన ఆత్మవిశ్వాసం, సాధించగలమనే తపన, ఓటములకు బెదరని వ్యక్తిత్వం, పరిపూర్ణ విషయ పరిజ్ఞానం, తప్పులను త్వరగా సరిదిద్దుకోగల లక్షణాలను సొంతం చేసుకుంటే సివిల్స్సుసాధ్యమే అంటున్నారు నిపుణులు. సివిల్స్ - 2014లో లక్ష్య సాధనకు నిపుణుల సూచనలు.. సలహాలు.. అర్హతలు.. దరఖాస్తు విధానం సివిల్ సర్వీసెస్ పరీక్షను ఎవరు నిర్వహిస్తారు? నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుంది? జాతీయస్థాయిలో హోదాపరంగా ఉన్నతమైన ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి 20కిపైగా సర్వీసుల్లో నియామకానికి ప్రతి ఏటా సివిల్ సర్వీసెస్ పరీక్షను యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహిస్తోంది. ఈ ఏడాది ప్రకటన మే 31న వెలువడింది. దరఖాస్తుల స్వీకరణకు చివరి తేదీ జూన్ 30. ఆగస్టు 24న ప్రిలిమినరీ పరీక్షను నిర్వహిస్తారు. ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ఏదైనా ఎస్బీఐ శాఖలో రూ.100 ఫీజు చెల్లించాలి లేదా ఎస్బీఐ/ఎస్బీఐ గ్రూప్ (స్టేట్ బ్యాంక్ ఆఫ్ హైదరాబాద్, స్టేట్‌బ్యాంక్ ఆఫ్ పాటియాలా, స్టేట్ బ్యాంక్ ఆఫ్ మైసూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ బికనీర్ అండ్ జైపూర్, స్టేట్ బ్యాంక్ ఆఫ్ ట్రావెన్కోర్)ల్లో నెట్ బ్యాంకింగ్ /డెబిట్ కార్డ్ ద్వారా కూడా ఫీజు చెల్లించొచ్చు. మహిళలు, ఎస్సీ, ఎస్టీలు, శారీరక వికలాంగులు ఫీజు చెల్లించనవసరం లేదు. ఈ ఏడాది మొత్తం పోస్టుల సంఖ్య 1291. సివిల్ సర్వీసెస్ పరీక్షకు హాజరయ్యేందుకు అర్హతలేంటి? ఏదైనా బ్యాచిలర్స్ డిగ్రీ పూర్తిచేసినవారు సివిల్ సర్వీసెస్ పరీక్ష రాసేందుకు అర్హులు. డిగ్రీ ఫైనలియర్ విద్యార్థులూ అర్హులే. వీరు మెయిన్స్ నాటికి తమ ఉత్తీర్ణతా సర్టిఫికెట్లు చూపాలి. వయోపరిమితి నిబంధన కూడా ఉంది. ఆగస్టు 1, 2014 నాటికి అన్ని వర్గాల అభ్యర్థులకు కనీసం 21 ఏళ్ల వయసు ఉండాలి. జనరల్ కేటగిరీ అభ్యర్థులకు గరిష్ట వయోపరిమితి 32 ఏళ్లు.. ఓబీసీలకు 35 ఏళ్లు. ఎస్సీ, ఎస్టీలకు 37 ఏళ్లు. అంధులు, బధిరులు, శారీరక వికలాంగులకు గరిష్ట వయోపరిమితి 42 ఏళ్లు. సివిల్ సర్వీసెస్ పరీక్షను ఎన్నిసార్లు రాయొచ్చు? పీహెచ్ అభ్యర్థులకు ఎక్కువసార్లు రాసుకునే వెసులుబాటు ఉందా? గతేడాది వరకు సివిల్స్ పరీక్షలను జనరల్ కేటగిరీ అభ్యర్థులు గరిష్టంగా నాలుగుసార్లు మాత్రమే రాసుకునే వీలుండేది. ఈ ఏడాది నుంచి దాన్ని ఆరుసార్లకు పెంచారు. ఓబీసీలకు ఇప్పటివరకు ఏడుసార్లు సివిల్స్ రాసుకునే అవకాశం ఉండేది. ఈ ఏడాది నుంచి తొమ్మిదిసార్లు రాసుకునే వీలు కల్పించారు. ఎస్సీ, ఎస్టీలు, పీహెచ్ (అంధ, బధిర, వికలాంగులు) గరిష్ట వయోపరిమితికి లోబడి ఎన్నిసార్లైనా రాసుకోవచ్చు. జనరల్ కేటగిరీకి చెందిన పీహెచ్ అభ్యర్థులు తొమ్మిదిసార్లు మాత్రమే రాసుకునే వీలుంది. దూరవిద్యా విధానం/ఓపెన్ యూనివర్సిటీల ద్వారా డిగ్రీ పూర్తిచేసినవారు సివిల్స్ పరీక్ష రాసేందుకు అర్హులేనా? వివిధ యూనివర్సిటీలు దూరవిద్యా విధానం ద్వారా అందించే బ్యాచిలర్స్ డిగ్రీ కోర్సులు ఉత్తీర్ణులైనవారు సివిల్స్ రాసేందుకు అర్హులే. అయితే ఆ కోర్సుకు సంబంధిత అధీకృత సంస్థల (యూజీసీ/డిస్టెన్స్ ఎడ్యుకేషన్ బ్యూరో/ఏఐసీటీఈ తదితర) గుర్తింపు ఉండాలి. సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా ఏయే సర్వీసుల్లో పోస్టులను భర్తీ చేస్తారు? సివిల్ సర్వీసెస్ పరీక్ష ద్వారా మొత్తం 23 సర్వీసుల్లో ఉద్యోగులను ఎంపిక చేస్తారు. వాటి వివరాలు.. 1. ఇండియన్ అడ్మినిస్ట్రేటివ్ సర్వీస్ 2. ఇండియన్ ఫారెన్ సర్వీస్ 3. ఇండియన్ పోలీస్ సర్వీస్ 4. ఇండియన్ పీ అండ్ టీ అకౌంట్స్ అండ్ ఫైనాన్స్ సర్వీస్, గ్రూప్-ఏ 5. ఇండియన్ ఆడిట్ అండ్ అకౌంట్స్ సర్వీస్ - గ్రూప్-ఏ 6. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (కస్టమ్స్ అండ్ సెంట్రల్ ఎక్సైజ్), గ్రూప్-ఏ 7. ఇండియన్ డిఫెన్స్ అకౌంట్ సర్వీస్, గ్రూప్-ఏ 8. ఇండియన్ రెవెన్యూ సర్వీస్ (ఐటీ), గ్రూప్-ఏ 9. ఇండియన్ ఆర్డినెన్స్ ఫ్యాక్టరీస్ సర్వీసెస్, గ్రూప్-ఏ (అసిస్టెంట్ వర్క్స్ మేనేజర్, అడ్మినిస్ట్రేషన్) 10. ఇండియన్ పోస్టల్ సర్వీస్, గ్రూప్-ఏ 11. ఇండియన్ సివిల్ అకౌంట్ సర్వీస్, గ్రూప్-ఏ 12. ఇండియన్ ైరె ల్వే ట్రాఫిక్ సర్వీస్, గ్రూప్-ఏ 13. ఇండియన్ రైల్వే అకౌంట్స్ సర్వీస్, గ్రూప్-ఏ 14. ఇండియన్ రైల్వే పర్సనల్ సర్వీస్ - గ్రూప్-ఏ 15. పోస్ట్ ఆఫ్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ ఇన్ రైల్వే ప్రొటెక్షన్ సర్వీస్ - గ్రూప్-ఏ 16. ఇండియన్ డిఫెన్స్ ఎస్టేట్స్ సర్వీస్, గ్రూప్-ఏ 17. ఇండియన్ ఇన్ఫర్మేషన్ సర్వీస్(జూనియర్ గ్రేడ్), గ్రూప్-ఏ 18. ఇండియన్ ట్రేడ్ సర్వీస్, గ్రూప్-ఏ, (గ్రేడ్-3) 19. ఇండియన్ కార్పొరేట్ లా సర్వీస్, గ్రూప్-ఏ, 20. ఆర్మ్డ్ఫోర్సెస్ హెడ్‌క్వార్టర్స్ సివిల్ సర్వీస్, గ్రూప్-బి (సెక్షన్ ఆఫీసర్స్ గ్రేడ్) 21. ఢిల్లీ, అండమాన్-నికోబార్ ఐస్లాండ్స్, లక్షద్వీప్, డామ న్-డయ్యూ, దాద్రానగర్ హవేలి సివిల్ సర్వీస్-గ్రూప్-బి 22. ఢిల్లీ, అండమాన్-నికోబార్, లక్షద్వీప్, డామ న్-డయ్యూ, దాద్రానగర్ హవేలి పోలీస్ సర్వీస్-గ్రూప్-బి 23. పాండిచ్చేరి సివిల్ సర్వీస్ - గ్రూప్-బి దరఖాస్తు చేసుకోవడమెలా? ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. ముందుగా www.upsconline.nic.in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. అందులో ‘ఆన్లైన్ అప్లికేషన్ ఫర్ వేరియస్ ఎగ్జామినేషన్స్ ఆఫ్ యూపీఎస్సీ’ అనే లింక్ కనిపిస్తుంది. దాన్ని క్లిక్ చేస్తే సివిల్ సర్వీసెస్ నోటిఫికేషన్, చివరి తేదీ, పార్ట్-1, పార్ట్-2 రిజిస్ట్రేషన్స్ కనిపిస్తాయి. ముందుగా పార్ట్-1 రిజిస్ట్రేషన్ క్లిక్ చేస్తే ఆన్లైన్ అప్లికేషన్ ఫారం ఓపెన్ అవుతుంది. ఇందులో పేరు, జెండర్, పుట్టిన తేదీ, తండ్రి పేరు, తల్లి పేరు, జాతీయత, వివాహ స్థితి, విద్యార్హతలు, చిరునామా వంటివి ఉంటాయి. వీటిని జాగ్రత్తగా పూర్తి చేయాలి. మీ పేరు, పుట్టినతేదీ పదోతరగతి సర్టిఫికెట్లో ఎలా ఉందో అలానే రాయాలి. తర్వాత కంటిన్యూ బటన్ క్లిక్ చేస్తే మరిన్ని వివరాలు వస్తాయి. వీటిని కూడా పూర్తి చేస్తే పార్ట్-1 రిజిస్ట్రేషన్ పూర్తవుతుంది. మీ వివరాలు అన్నీ సరిచూసుకున్నాక ‘యూ అగ్రి’ బటన్ క్లిక్ చేస్తే మీకు రిజిస్ట్రేషన్ ఐడీ వస్తుంది. ఈ ఐడీ, పుట్టినతేదీతో పార్ట్-2 రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఇందులో ముందుగా నిర్దేశించిన సైజ్‌లో మీ ఫొటో, సంతకం స్కాన్ చేసి ఉంచుకోవాలి. ఫొటో, సంతకం అప్లోడ్ చేశాక మిగిలిన వివరాలు నింపాలి. సివిల్స్‌కు ఎంపికైతే పదోన్నతులు ఎలా ఉంటాయి? ఐఏఎస్‌కు ఎంపికైనవారు మొదట అసిస్టెంట్ కలెక్టర్‌గా బాధ్యతలు చేపడతారు. ఆ తర్వాత పనితీరు, అనుభవాన్ని బట్టి వరుసగా కలెక్టర్/డిప్యూటీ కమిషనర్/డిప్యూటీ సెక్రటరీ/డిప్యూటీ డెరైక్టర్; కలెక్టర్/డిప్యూటీ కమిషనర్/అడిషనల్ సెక్రటరీ/జాయింట్ సెక్రటరీ/డెరైక్టర్; సెక్రటరీ/కమిషనర్ అండ్ సెక్రటరీ; ప్రిన్సిపల్ సెక్రటరీ/ఫైనాన్షియల్ కమిషనర్, చీఫ్ సెక్రటరీ/చైర్మన్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ హోదాలకు చేరుకుంటారు. ఐపీఎస్‌కు ఎంపికైనవారు వరుస క్రమంలో.. అసిస్టెంట్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, అడిషనల్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్/సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, ఇన్స్పెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, అడిషనల్ డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్, డెరైక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (హెడ్ ఆఫ్ స్టేట్) చేరుకుంటారు. ఇండియన్ రెవెన్యూ సర్వీస్.. అసిస్టెంట్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్, డిప్యూటీ కమిషనర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్, జాయింట్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్, అడిషనల్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్, కమిషనర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్, కమిషనర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్, చీఫ్ కమిషనర్ ఆఫ్ ఇన్‌కం ట్యాక్స్, డెరైక్టర్ జనరల్ ఆఫ్ కస్టమ్స్ అండ్ ఎక్సైజ్/బోర్డ్ అండ్ ట్రిబ్యునల్ మెంబర్స్. పరీక్ష విధానం.. ప్రిపరేషన్ ప్లాన్ సివిల్స్ పరీక్ష విధానాన్ని వివరించండి? ఎన్ని మార్కులకు ఉంటుంది? ఎన్ని పేపర్లు ఉంటాయి? సివిల్స్ ఎంపిక మూడు దశలుగా ఉంటుంది. అవి.. 1. ప్రిలిమినరీ, 2. మెయిన్స్ 3. ఇంటర్వ్యూ. ప్రిలిమ్స్: సివిల్స్‌కు దరఖాస్తు చేసుకున్నవారికి ముందుగా ప్రిలిమ్స్ నిర్వహిస్తారు. ఇది ఇంగ్లిష్ లేదా హిందీ మాధ్యమాల్లో ఉంటుంది. ఇందులో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 200 మార్కులుంటాయి. పేపర్-1లో 100 ప్రశ్నలు, పేపర్-2లో 85 ప్రశ్నలు ఉంటాయి. ఆబ్జెక్టివ్ విధానంలో ప్రశ్నలు అడుగుతారు. తప్పుగా గుర్తించిన సమాధానాలకు నెగెటివ్ మార్కులుంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 0.33 మార్కుల కోత విధిస్తారు. ఒక్కో పేపర్ పరీక్ష కాలవ్యవధి రెండు గంటలు (120 నిమిషాలు). ప్రిలిమ్స్ కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ఇందులో ఉత్తీర్ణులైనవారిని అందుబాటులో ఉన్న పోస్టులు, రిజర్వేషన్స్‌ను దృష్టిలో ఉంచుకుని ప్రతిభ ఆధారంగా మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్‌లో వచ్చిన మార్కులను చివరి ఎంపికలో పరిగణించరు. మెయిన్స్: అందుబాటులో ఉన్న పోస్టుల్లో.. ఒక్కో పోస్టుకు 12 లేదా 13 మంది చొప్పున మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. మెయిన్స్‌లో అన్ని పేపర్ల (ఇంగ్లిష్ మినహాయించి)ను తెలుగు మాధ్యమంలో కూడా రాసుకోవచ్చు. ప్రశ్నపత్రం మాత్రం ఇంగ్లిష్/హిందీల్లో ఉంటుంది. ప్రశ్నలన్నీ కన్వెన్షనల్ (వ్యాస రూప) విధానంలో ఉంటాయి. మెయిన్స్ పరీక్ష విధానం: ఇందులో 300 మార్కులకు పేపర్-ఏ ఉంటుంది. భారత రాజ్యాంగం గుర్తించిన భాషల్లో ఏదో ఒకదాన్ని ఎంచుకుని పరీక్ష రాయాల్సి ఉంటుంది. మన రాష్ట్ర విద్యార్థులు తెలుగును ఎంచుకుని రాయొచ్చు. ఇది కేవలం అర్హత పరీక్ష మాత్రమే. సంబంధిత మాతృభాషల్లో అభ్యర్థి సామర్థ్యాన్ని తెలుసుకునే ఉద్దేశంతో ఈ పరీక్షను నిర్వహిస్తారు. పేపర్-బి: ఇంగ్లిష్ (300 మార్కులు). ఇంగ్లిష్‌లో అభ్యర్థికి సాధారణ పరిజ్ఞానం ఉందో, లేదో పరిశీలించడం ఈ పరీక్ష ప్రధాన ఉద్దేశం. పేపర్-ఏ, పేపర్-బి రెండు పదో తరగతి/మెట్రిక్యులేషన్ స్థాయిలో ఉంటాయి. వీటి మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు. అయితే అభ్యర్థులు పేపర్-ఏలో 30 శాతం, పేపర్-బిలో 25 శాతం మార్కులు సాధించాలి. మౌఖిక పరీక్ష: మెయిన్స్‌లో ఉత్తీర్ణులైనవారిని అందుబాటులో ఉన్న పోస్టులు, రిజర్వేషన్స్‌ను దృష్టిలో ఉంచుకుని పోస్టుకు ఇద్దరు చొప్పున మౌఖిక పరీక్షకు ఎంపిక చేస్తారు. దీనికి 275 మార్కులుంటాయి. అంటే మెయిన్స్, ఇంటర్వ్యూలకు కలిపి మొత్తం మార్కులు 2025. ఈ మార్కుల ఆధారంగా ఎంపిక ఉంటుంది. సివిల్స్ ప్రిలిమ్స్‌లో పేపర్-1లో ఏయే అంశాలుంటాయి? ప్రిలిమ్స్ పేపర్-1.. 200 మార్కులకు ఉంటుంది. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ఇందులో జాతీయ, అంతర్జాతీయ అంశాలు, భారతదేశ చరిత్ర, భారత జాతీయోద్యమం, ఇండియన్-వరల్డ్ జాగ్రఫీ, భారతదేశ రాజకీయ వ్యవస్థ - పాలన - రాజ్యాంగం, పంచాయతీరాజ్, పబ్లిక్ పాలసీ, హక్కుల వివాదాలు, ఆర్థిక- సామాజిక అభివృద్ధి, సమ్మిళిత వృద్ధి, పేదరికం, సామాజిక రంగం, పర్యావరణం, జీవ వైవిధ్యం, వాతావరణ మార్పు, జనరల్ సైన్స్ మొదలైన అంశాలు ఉంటాయి. ఎన్సీఈఆర్టీ ఎనిమిదో తరగతి- 12వ తరగతి పాఠ్యపుస్తకాలు, హిందూ దినపత్రిక, ఏదైనా ఒక తెలుగు దినపత్రికను ప్రతి రోజూ చదవాలి. ప్రిలిమ్స్ పేపర్-2లో ఏయే అంశాలుంటాయి? ఎలా ప్రిపేర్ కావాలి? ప్రిలిమ్స్ పేపర్-2 కూడా 200 మార్కులకు ఉంటుంది. ఈ పేపర్‌ను సీశాట్ అంటారు. పరీక్ష వ్యవధి: రెండు గంటలు. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్ విధానంలో ఉంటాయి. ఇందులో కాంప్రహెన్షన్, ఇంటర్ పర్సనల్ స్కిల్స్, కమ్యూనికేషన్ స్కిల్స్, లాజికల్ రీజనింగ్ అండ్ ఎనలిటికల్ ఎబిలిటీ, డెసిషన్ మేకింగ్ అండ్ ప్రాబ్లం సాల్వింగ్, జనరల్ మెంటల్ ఎబిలిటీ, బేసిక్ న్యూమరసీ (నంబర్స్ - రిలేషన్స్), డేటా ఇంటర్‌ప్రిటేషన్ (చార్ట్స్, గ్రాఫ్స్, టేబుల్స్, డేటా సఫిషియన్సీ), ఇంగ్లిష్ లాంగ్వేజ్ కాంప్రహెన్షన్ స్కిల్స్ మొదలైన అంశాలు ఉంటాయి. ఇందులో బేసిక్ న్యూమరసీ, డేటా ఇంటర్‌ప్రిటేషన్, ఇంగ్లిష్ లాంగ్వేజ్ పదో తరగతి స్థాయిలో ఉంటాయి. బ్యాంక్ పరీక్షల మెటీరియల్, క్యాట్, శాట్ వంటి పరీక్షల ప్రశ్నపత్రాలను సాధన చేయాలి. ఆర్ఎస్ అగర్వాల్ రాసిన ఎనలిటికల్ ఎబిలిటీ కూడా ఉపయోగపడుతుంది. మెయిన్స్‌లో ఇంగ్లిష్ ప్రాధాన్యం ఎంతమేర ఉంటుందో తెలపండి? మారిన సివిల్స్ మెయిన్స్ పరీక్షల్లో ఇంగ్లిష్ ప్రాధాన్యం ఎంతో ఉంది. చాలామంది అభ్యర్థులకు సబ్జెక్ట్‌పై అవగాహన ఉన్నా ఇంగ్లిష్ రాకపోవడం వల్ల మార్కులు సాధించలేకపోతున్నారు. ముఖ్యంగా దక్షిణ భారతదేశానికి చెందిన విద్యార్థులు ఈ అంశంలో వెనుకబడిపోతున్నారు. ఉత్తర భారతదేశానికి చెందిన అభ్యర్థులకు హిందీలో లేదంటే ఇంగ్లిష్‌లో మంచి పట్టు ఉంటుంది. కాబట్టి చక్కటి ఇంగ్లిష్ రావడానికి రోజూ హిందూ దినపత్రికను చదవడంతోపాటు లోక్‌సభ, రాజ్యసభ, బీబీసీ, ఎన్డీటీవీ వంటి న్యూస్ చానెళ్లను రోజూ అరగంట సేపైనా చూడాలి. వీటిల్లో మంచి ఉచ్ఛారణతో కూడిన ఇంగ్లిష్‌ను వినొచ్చు. అంతేకాకుండా వివిధ అంశాలు చర్చకు వస్తుంటాయి. ప్రిపరేషన్ కోణంలోనూ ఉపయుక్తంగా ఉంటుంది. సివిల్స్ మెయిన్స్ జనరల్ ఎస్సేలో ఏయే అంశాలు ఉంటాయి? దీనికి ప్రత్యేకించి సిలబస్ అంటూ లేదు. చాలామంది అభ్యర్థులు ప్రస్తుత వర్తమాన వ్యవహారాలపై సిద్ధం అవుతుంటారు. ఇది సరికాదు. సామాజిక, ఆర్థిక, మత, సాంఘిక, ఆధ్యాత్మికం ఇలా ఏ అంశంపైనైనా ప్రశ్నలు అడగొచ్చు. ఏ అంశం ఇచ్చినా చక్కని విశ్లేషణ, నిర్మాణం, సమస్యను విశ్లేషించగలగడం, రచనా నైపుణ్యం అభ్యర్థికి ఉండాలి. రైటింగ్ స్కిల్స్ కూడా తప్పనిసరి. సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్-1లో ఏయే అంశాలుంటాయి? భారతీయ సంస్కృతి, వారసత్వం, ప్రపంచ చరిత్ర, భూగోళ శాస్త్రం వంటి అంశాలపై ప్రశ్నలుంటాయి. ప్రాచీన కాలం నుంచి ఆధునిక భారతదేశంలో సాహిత్యం, నిర్మాణం, సంస్కృతి, 18వ శతాబ్దం మధ్య నుంచి ఇప్పటివరకు ప్రముఖ సంఘటనలు, వ్యక్తులు, వివాదాలు తదితర అంశాలు, భారత స్వాతంత్య్రోద్యమంలో ముఖ్య దశలు-ఉద్యమాలు-వ్యక్తులు, పారిశ్రామిక విప్లవం, ప్రపంచ యుద్ధాలు, సామ్రాజ్యవాదం, కమ్యూనిజం, పెట్టుబడిదారి విధానాలు, భారతీయ సమాజం, భిన్నత్వంలో ఏకత్వం, పట్టణీకరణ, భారతదేశంలో ప్రపంచీకరణ ప్రభావం, పేదరికం, ప్రాంతీయవాదం, లౌకికవాదం, సాధికారత, భూకంపాలు, సునామీ, తుపానులు తదితర అంశాలపై ప్రశ్నలుంటాయి. ఎన్సీఈఆర్టీ ఎనిమిదో తరగతి నుంచి 12వ తరగతి పాఠ్యపుస్తకాలు, హిందూ దినపత్రిక, యోజన, కురుక్షేత్ర వంటివి చదవాలి. సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్-2లో ఏయే అంశాలుంటాయి? జీఎస్ పేపర్-2 అంతా పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ పేపర్-2 అని చెప్పొచ్చు. జీఎస్-2లో భారత రాజ్యాంగం, భారత పార్లమెంట్, రాష్ట్రాల శాసనసభల నిర్మాణం, విధులు, కేంద్ర, రాష్ట్రాల విధులు - బాధ్యతలు, సమాఖ్య వ్యవస్థలో సవాళ్లు-సమస్యలు, ప్రజాప్రాతినిధ్య చట్టం, రాజ్యాంగ సంస్థలు - నియామకాలు-అధికారాలు-విధులు-బాధ్యతలు, భారత్-పొరుగు దేశాలతో సంబంధాలు, పేదరికం-ఆకలి సమస్యలు, భారత్ - ప్రపంచ దేశాల గ్రూపుల్లో (సార్క్, నామ్, జీ-20 తదితర) సభ్యత్వం , ముఖ్యమైన అంతర్జాతీయ సంస్థలపై ప్రశ్నలుంటాయి. ఇండియన్ పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్- రమేశ్ అరోరా, ఇండియన్ కాన్స్టిట్యూషన్ - డీడీ బసు, దిన పత్రికలు, మ్యాగజైన్లు చదవాలి. టీవీ చానెళ్లలో చర్చలు చూడాలి. సివిల్స్ మెయిన్స్ జనరల్ స్టడీస్-3లో ఏయే అంశాలుంటాయి? జీఎస్-3లో సాంకేతికత, ఆర్థికాభివృద్ధి, జీవవైవిధ్యం, పర్యావరణం, రక్షణ, విపత్తు నిర్వహణ వంటి అంశాలుంటాయి. జీఎస్ పేపర్-3కి వివిధ దినపత్రికలు, ఎకనమిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, యోజన, ఎకనమిక్ సర్వే, కురుక్షేత్ర వంటివి చదవాలి. ప్రత్యేకంగా పాఠ్యపుస్తకాలంటూ లేవు. ది ఎకానమిస్ట్ (బ్రిటన్ నుంచి వెలువడుతుంది)లో సైన్స్ అండ్ టెక్నాలజీపై ప్రశ్నలుంటున్నాయి. హిందూలో ప్రతి గురువారం ఎస్ అండ్ టీపై వచ్చే అంశాలు, సెమినార్ అనే మాసపత్రిక ఉపయుక్తం. అన్ని ప్రశ్నలూ.. ప్రస్తుత సమస్యలకు అన్వయించడం, అప్లికేషన్ ఓరియెంటెడ్‌గా ఉంటున్నాయి. ఉదాహరణకు ఐటీ దేశభద్రతకు ముప్పు కలిగిస్తుందా?. సివిల్స్ మెయిన్స్ జీఎస్-4కు ఎలా సిద్ధమవ్వాలి? జీఎస్‌లోని నాలుగు పేపర్లలో ఇదే సులువైనదని చెప్పొచ్చు. కేస్ స్టడీస్‌లో ప్రభుత్వ ఉద్యోగిగా సంబంధిత సమస్యను నీవైతే ఎలా ఎదుర్కొంటావు? అనే కోణంలో ప్రశ్నలుంటాయి. ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్ - జి. సుబ్బారావు, వీఎన్ రాయ్, యాక్సెస్ పబ్లిషింగ్ బుక్స్, ఎథిక్స్ అండ్ ఇంటిగ్రిటీ అండ్ వ్యాల్యూస్ - రమేశ్ కె.అరోరా ఉపయుక్తం. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్‌ను ఆప్షనల్‌గా ఎంపిక చేసుకున్నవారికి ఈ పేపర్ సులువుగా ఉంటుంది. సివిల్స్ ప్రిలిమ్స్, మెయిన్స్‌కు రెండింటి ఉమ్మడి ప్రిపరేషన్‌ను వివరించండి ? సివిల్స్‌కు ప్రకటన వెలువడిన నాటి నుంచి కూడా మెయిన్స్ కోణంలోనే ప్రిపరేషన్ ఉండాలి. చాలామంది ముందు ప్రిలిమ్స్‌కు సిద్ధమవుతారు. ఆ తర్వాత మెయిన్స్ సంగతి చూద్దాంలే అనే నిర్లిప్తతతో ఉంటారు. ఇది సరికాదు. ముందు నుంచీ ప్రిలిమ్స్‌తోపాటే మెయిన్స్‌కు కూడా సిద్ధమవ్వాలి. ప్రిలిమ్స్‌లోని సీశాట్‌ను ప్రత్యేకంగా చదువుకోవాలి. మెయిన్స్ పూర్తయ్యాక ఇంటర్వ్యూ గురించి ఆలోచించాలి. ఎంపికలో ప్రభావం చూపించే మెయిన్స్ ప్రధాన పేపర్లు పేపర్-1 (ఎస్సే) మార్కులు: 250 పేపర్-2 (జనరల్ స్టడీస్-1 (ఇండియన్ హెరిటేజ్ అండ్ కల్చర్, వరల్డ్ హిస్టరీ, వరల్డ్ జాగ్రఫీ) ) - మార్కులు: 250 పేపర్-3 (జనరల్ స్టడీస్-2 (పాలన, రాజ్యాంగం, పాలిటీ, సామాజిక న్యాయం, అంతర్జాతీయ సంబంధాలు) - మార్కులు: 250 పేపర్-4 (జనరల్ స్టడీస్-3 (టెక్నాలజీ, ఎకనామిక్ డెవలప్మెంట్, బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంట్, సెక్యూరిటీ అండ్ డిజాస్టర్ మేనేజ్మెంట్)) - మార్కులు: 250 పేపర్-5 (జనరల్ స్టడీస్-4 (ఎథిక్స్, ఇంటిగ్రిటీ అండ్ ఆప్టిట్యూడ్))- మార్కులు: 250. పేపర్-6 (ఆప్షనల్ సబ్జెక్ట్ - పేపర్-1) - మార్కులు: 250 పేపర్-7 (ఆప్షనల్ సబ్జెక్ట్ - పేపర్-2) - మార్కులు: 250 కోచింగ్ పాత్ర.. టైమ్ మేనేజ్మెంట్ పాపులర్ ఆప్షన్స్ ఏవి? మెయిన్స్ పరీక్షల్లో ఆప్షనల్లో రెండు పేపర్లు ఉంటాయి. ఒక్కో పేపర్‌కు 250 మార్కులుంటాయి. ఒక్కో పేపర్ పరీక్ష వ్యవధి మూడు గంటలు. జాతీయస్థాయిలో పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ బాగా పాపులర్ అని చెప్పొచ్చు. ఇవేకాకుండా హిస్టరీ, జాగ్రఫీ, సోషియాలజీ, సైకాలజీ, ఆంత్రోపాలజీ వంటి సబ్జెక్టులను ఎక్కువమంది విద్యార్థులు ఎంచుకుంటున్నారు. కోచింగ్ సదుపాయం అందుబాటులో ఉండటంతోపాటు కొన్ని సబ్జెక్టుల సిలబస్ తక్కువ ఉండటం ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఆయా రాష్ట్రాల విద్యార్థులు తమ మాతృభాషల సాహిత్యాన్ని ఎంచుకుని కూడా పరీక్షలు రాస్తున్నారు. మన రాష్ట్ర విద్యార్థులు తెలుగు సాహిత్యాన్ని ఎంచుకుంటున్నారు. ఆప్షనల్లో అత్యధిక మార్కులు సాధించాలంటే అన్ని అంశాలపై పట్టుండాలి. మారిన విధానంలో చాయిస్ కూడా చాలా తక్కువ ఉంది. దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ప్రతి ప్రశ్నలో అనేక ఉప ప్రశ్నలు ఉంటున్నాయి. ప్రశ్నలు కూడా పరోక్షంగా ఉంటున్నాయి. థియరీ కంటే కూడా అప్లికేషన్ ఓరియెంటేషన్‌కు ఎక్కువ ప్రాధాన్యత నిస్తున్నారు. సమకాలీన అంశాలు, సమస్యలపై ఎక్కువ ప్రశ్నలు అడుగుతున్నారు. సివిల్స్‌కు కోచింగ్ తప్పనిసరా? కోచింగ్ పాత్ర ఏమిటి? సివిల్స్ సాధనలో కోచింగ్ పాత్ర కీలకమని చెప్పొచ్చు. కోచింగ్ సెంటర్స్ అభ్యర్థిలో ఉన్న నైపుణ్యాలకు మెరుగులు పెడతాయని చెప్పొచ్చు. కోచింగ్ వల్ల ఏది చదవాలో.. ఏది చదవకూడదో తెలుస్తుంది. దీనివల్ల సమయం కూడా ఆదా అవుతుంది. మారిన పరీక్ష విధానంలో టైమ్ కీలకం కాబట్టి కోచింగ్ తీసుకుంటేనే మంచిది. కోచింగ్ అనేది లాంచింగ్ ప్యాడ్ లాంటిది. దీంతో పోటీకి తగ్గట్లు అభ్యర్థులు సిద్ధం కావచ్చు. ఇతర అభ్యర్థుల నుంచి ప్రేరణ, స్ఫూర్తి పొందొచ్చు. అయితే కోచింగ్ లేకపోయినా సొంత ప్రిపరేషన్‌తో విజయం సాధించినవారు కూడా ఉన్నారు. గ్రామీణ ప్రాంత అభ్యర్థులకు సివిల్స్ గురించి అంతగా అవగాహన లేదు. వీరు జాతీయస్థాయిలో పోటీపడాల్సి ఉంటుంది కాబట్టి కోచింగ్ అవసరమనే చెప్పాలి. ఎలాంటి కోచింగ్ సెంటర్‌ను ఎంపిక చేసుకోవాలి? కోచింగ్ సెంటర్‌ను సంస్థ బ్రాండ్ నేమ్‌ను చూసి ఎంపిక చేసుకోకూడదు. ఫ్యాక ల్టీ బేస్డ్ కోచింగ్ సెంటర్‌ను ఎంచుకోవాలి. ప్రస్తుత పరిణామాలను విశ్లేషించి, కాన్సెప్ట్ బేస్డ్ విధానంలో చెప్పగల ఫ్యాకల్టీ ఉన్న శిక్షణ కేంద్రాన్ని ఎంపిక చేసుకోవాలి. వర్తమాన వ్యవహారాలపై అసాధారణమైన పట్టు ఉండి, ప్రస్తుత పరిణామాలకు గతాన్ని కూడా జోడించి చెప్పే ఫ్యాకల్టీ ఉన్న శిక్షణ కేంద్రం ఉత్తమం. అందులోనూ మాడ్యూల్ బేస్డ్ కోచింగ్ అందిస్తున్న సంస్థలైతే మంచిది. నోట్స్ ప్రిపరేషన్లో ఎలాంటి మెళకువలు పాటించాలి? ప్రస్తుతం మారిన పరీక్ష విధానంలో ప్రశ్నలన్నీ వర్తమాన వ్యవహారాలు, సమాజంలో, మీడియాలో చర్చకు వస్తున్న వివిధ అంశాలపై ఆధారపడి ఉంటున్నాయి. జనరల్ స్టడీస్‌లోని నాలుగు పేపర్లు, ఎస్సే మొత్తం అదేవిధంగా ఉంటున్నాయి. పాఠ్యపుస్తకాలు, ఇతర మెటీరియల్ అన్నీ కూడా నోట్స్ రూపంలో ఉన్నవే. అయితే వివిధ దినపత్రికలు, మ్యాగజైన్లు, పాఠ్యపుస్తకాల్లోని ముఖ్యమైన అంశాలను సినాప్సిస్, బుల్లెట్ పాయింట్స్‌లా రాసుకోవాలి. వాటిని ఎప్పటికప్పుడూ తాజా సమాచారంతో అప్డేట్ చేసుకుంటుండాలి. వీటిని వీలైనప్పుడు చదువుకోవడానికి అనుకూలంగా ఉండేటట్లు తయారుచేసుకోవాలి. వీటిని పదేపదే చదవాలి. ఇంటర్నెట్పై అతిగా ఆధారపడకూడదు. దీనివల్ల కాలయాపన జరుగుతుంది. రీడింగ్ స్కిల్స్ ఎలా ఉండాలి? దినపత్రికలు, మ్యాగజైన్లు చదివేటప్పుడు ఏదైనా అంశంలోని ప్రధాన విషయాన్ని గుర్తించగలగాలి. ఆ అంశానికి సంబంధించిన ఇతర విషయాలను పాఠ్యపుస్తకాలు, రిఫరెన్స్ బుక్స్‌లో సేకరించి, ఒక చోట క్రోడీకరించుకుని చదువుకోవాలి. ఇలా చేస్తే ఆయా అంశాలపై పట్టు లభిస్తుంది. ఎక్కువ మార్కులు సాధించాలంటే రాత ఎలా ఉండాలి? అద్భుతమైన రైటింగ్ రాయలేకున్నా ఉన్నంతలో రాసింది అర్థమయ్యేట్లుగా ఉండాలి. గొలుసుకట్టులాగా రాయకూడదు. పదాలు విడివిడిగా ఉండాలి. మారిన పరీక్ష విధానంలో చాయిస్ తగ్గిపోయింది. దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి. అందుబాటులో ఉన్న మూడు గంటల్లో అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాలంటే రైటింగ్ ప్రాక్టీస్ తప్పనిసరి. మెయిన్స్‌లో మంచి మార్కులు సాధించడం ఎలా? ముందు ప్రశ్నను అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత సమాధానం సూటిగా, స్పష్టంగా రాయాలి. అవసరమైన మేరకు మాత్రమే సమాధానం ఉండాలి. పరిచయం. నిర్మాణం, ఉపోద్ఘాతం అంటూ సమయం వృథా చేయకూడదు. ప్రశ్నకు తగ్గట్టే ఆన్సర్‌ను కూడా ప్రశ్నతోనే ప్రారంభించాలి. తక్కువ పద బంధాలతో ఎక్కువ అర్థం వచ్చేలా, విశ్లేషణాత్మకంగా, ప్రభావవంతంగా రాయాలి. పాయింట్‌వైజ్ రాస్తే మంచి మార్కులు పొందొచ్చు. వాటిలో కంటెంట్, తాజా అంశాలు ఉండాలి. ప్రతి ప్రశ్నకు జవాబు రాసేటప్పుడు కొంత ఖాళీ వదలాలి. చివరి పేజీలో రఫ్ వర్క్ మాదిరిగా జవాబు ఫ్రేమ్ వర్క్ తయారుచేసుకోవాలి. ఇలా రాస్తే గరిష్ట మార్కులు పొందొచ్చు. టైమ్ మేనేజ్మెంట్ స్కిల్స్‌ను వివరించండి? ముందు ఇష్టం ఉన్న టాపిక్స్‌ను చదువుదాం. చివరకు కష్టమైనవి చదువుదామనుకోకూడదు. ప్రాధాన్యతల పరంగా సబ్జెక్టులను చదవాలి. 500, 200, 100, 50 పదాలు ఇలా.. సమయపరిమితిలోగా ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వడం ప్రాక్టీస్ చేయాలి. ప్రతి రోజూ గంట సేపైనా చదువుకున్న అంశంపై రాస్తూ ఉండాలి. ఒక పేజీలో 150 పదాలు ఎనిమిది లేదా తొమ్మిది నిమిషాల్లో రాయగలగాలి. ఇలా రోజూ చేస్తే పరీక్ష నాటికి వేగం అలవడి అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయొచ్చు. జాబ్ చేస్తూ ప్రిపరేషన్ కొనసాగించడమెలా? జాబ్ చేస్తూ కూడా సివిల్స్ రాసుకోవచ్చు. అయితే ఒకసారి కోచింగ్ తీసుకుని ఉంటే బాగుంటుంది. ఖాళీ సమయంలో దినపత్రికలు, వివిధ మ్యాగజైన్లు వంటివాటిని చదువుకోవచ్చు. ఇంటర్నెట్ ద్వారా అవసరమైన సమాచారాన్ని సేకరించుకోవచ్చు. దీన్ని క్రోడీకరించుకుని, కోర్ సబ్జెక్టులకు అనుసంధానం చేసుకోవాలి. అభ్యర్థులకు ఒత్తిడి సహజం? దీన్ని ఎలా అధిగమించాలి? ఒత్తిడిని ఎదుర్కోవాలంటే మీ మీద మీకు నమ్మకం ఉండాలి. అపజయం ఎదురైనా విజేతలైనవారి గెలుపు పాఠాలను ఒంటబట్టించుకోవాలి. ఒకటి, రెండుసార్లు అపజయం ఎదురైనా ఈసారి విజయం మీదేనని నమ్మాలి. గత విజేతల సక్సెస్ స్టోరీలను చదివి ప్రేరణ పొందాలి. వేరేవాళ్లతో పోల్చుకుని నిరాశ చెందకూడదు. ఒత్తిడిని అధిగమించడానికి సంగీతం వినడం, మిత్రులతో చిట్‌చాట్, ఏదైనా గేమ్ ఆడుకోవడం వంటివి చేయాలి. ఎల్లవేళలా సానుకూల దృక్పథంతో ఉండాలి. సివిల్స్ అభ్యర్థి మెంటల్ మేకప్ ఎలా ఉండాలి? చాలామంది అభ్యర్థులు రోజులో 18 గంటలు లేదంటే 20 గంటలు చదివితేనే విజయం సాధిస్తామని నమ్ముతారు. ఇది సరికాదు. రోజువారీ కార్యక్రమాలను తప్పనిసరిగా చేయాలి. నడక, వ్యాయామంతోపాటు యోగా, ప్రాణాయామం వంటివి అభ్యసించాలి. అల్పాహారం, భోజనం నిర్ణీత వేళల్లోగా పూర్తిచేయాలి. అదేవిధంగా మీ ప్రిపరేషన్‌కు దోహదపడే సన్నిహిత మిత్రులను ఎంపిక చేసుకోవాలి. సివిల్స్ అంటే పరిశోధన కాదు అనే విషయాన్ని గుర్తించాలి. అనేక కెరీర్ ఆప్షన్స్‌లో ఇది కూడా ఒకటి అని భావించాలి. ఇంటర్వ్యూలో విజయం సాధించాలంటే ఎలా? ఇంటర్వ్యూలో నిజాయతీగా ఉండాలి. తెలియని విషయాలను తెలియదని చెప్పాలి. ఎక్కువ శాతం ప్రశ్నలు ఆ రోజు వరకు మీడియాలో చర్చకు వస్తున్న వివిధ అంశాలపై అడుగుతారు. కాబట్టి వర్తమాన వ్యవహారాలపై పట్టుండాలి. మంచి కమ్యూనికేషన్ స్కిల్స్ ఉండాలి. సమాజంలో రాజకీయంగా, సాంఘికంగా, ఆర్థికంగా అణగారిన వర్గాల పట్ల సానుభూతి చూపాలి. వీరి గురించి వ్యతిరేకంగా మాట్లాడకూడదు. ఎందుకంటే ప్రభుత్వాలన్నీ కూడా బలహీన వర్గాలసంక్షేమానికే కట్డుబడి ఉంటాయి. అదేవిధంగా బోర్డు సభ్యులతో మొండిగా వాదనకు దిగకూడదు. అభ్యర్థి వ్యక్తిత్వాన్ని అంచనా వేయడానికి ప్రయత్నిస్తారు. అసందర్భ ప్రశ్నలు కూడా వేసే అవకాశం ఉంది. అభ్యర్థి సమయస్ఫూర్తిని కూడా పరిశీలిస్తారు. ఉదాహరణకు ఒక అభ్యర్థిని ‘ఇక్కడకు (ఇంటర్వ్యూ ప్రదేశానికి) ఎలా చేరుకున్నావు’ అని ప్రశ్నించారు. ఆ అభ్యర్థి ఆటోలో వచ్చాను అని సమాధానమిచ్చాడు. వెంటనే బోర్డు సభ్యుడొకరు ఆటో నెంబర్ ఎంత? అని ప్రశ్నించారు? అభ్యర్థి సమాధానం చెప్పలేక మిన్నకుండిపోయాడు. చెప్పలేకపోవడం వల్ల అభ్యర్థి అజాగ్రత్తగా ఉంటాడని ఇంటర్వ్యూ బోర్డ్ అనుకునే ప్రమాదముంది. ఆ ఆటోలో పొరపాటున అభ్యర్థి సర్టిఫికెట్లు, లగేజీ మర్చిపోతే పరిస్థితేంటి? కాబట్టి అభ్యర్థి సమయస్ఫూర్తిని కూడా సభ్యులు పరిశీలిస్తారు. సివిల్స్‌కు ఎంత ఖర్చు అవుతుంది? మన రాష్ట్రంలో ప్రధాన కోచింగ్ సెంటర్లలో లక్ష రూపాయల వరకు ఫీజు ఉంటుంది. ఢిల్లీ లాంటి నగరాల్లో లక్షన్నర రూపాయల వరకు ఉంటుంది. కోచింగ్‌లో ప్రిలిమ్స్, మెయిన్స్‌లకు శిక్షణనిస్తారు. కోచింగ్ వ్యవధి దాదాపు పది నెలలు. హాస్టల్ వసతి, భోజన ఖర్చుల కింద నెలకు మరో రూ.5000 వరకు అవుతాయి. పుస్తకాలు, ఇతర ఖర్చులు అదనం. ఆర్థిక సమస్యలు ఉంటే ఎలా అధిగమించాలి? పార్ట్‌టైం జాబ్ చేసుకుంటూ సివిల్స్‌కు సిద్ధం కావచ్చు. తద్వారా ఆర్థిక సమస్యలు అధిగమించొచ్చు. ఇప్పుడు చాలా బుక్స్‌ను ఆన్లైన్లో ఉచితంగా చదువుకోవచ్చు. అంతేకాకుండా కేంద్ర గ్రంథాలయాల్లో సభ్యత్వం తీసుకుని వివిధ పుస్తకాలను అధ్యయనం చేయొచ్చు. బీసీలు, ఎస్సీ, ఎస్టీలు, మైనార్టీల కోసం ప్రత్యేకంగా ప్రభుత్వం తరపున స్టడీ సర్కిళ్లు ఉన్నాయి. వీటిలో సివిల్స్ కోసం ఉచిత కోచింగ్ ఇస్తారు. దీంతోపాటు స్టైఫండ్ కూడా అందుతుంది. కొన్ని స్వచ్ఛంద సంస్థలు నిరుపేద అభ్యర్థులకు సహాయం అందిస్తున్నాయి. ఇన్పుట్స్ గురజాల శ్రీనివాసరావు, సీనియర్ ఫ్యాకల్టీ సివిల్స్ డా॥బి.జె.బి.కృపాదానం, సీనియర్ ఫ్యాకల్టీ సివిల్స్ -
సకలం... సుందరం
సుందరకాండ పరమ పవిత్రమైన పఠనీయ గ్రంథం, నిత్య పారాయణ దివ్య చరితం. ఏ సమయంలో ఎవరితో ఏ విధంగా నడచుకోవాలో సోదాహరణంగా, సవివరంగా చెప్పే వ్యక్తిత్వ వికాస విజ్ఞాన భాండాగారం. భగవద్గీత అనగానే శ్రీకృష్ణుడు గుర్తుకొచ్చినట్లుగానే, సుందరకాండ అనగానే హనుమంతుడు జ్ఞప్తికి రావడం సహజం. గీత లాగే సుందరకాండ కూడా చక్కటి వ్యక్తిత్వ వికాస గ్రంథం. వాల్మీకి శ్రీమద్రామాయణ రచన ప్రారంభించిన క్రమంలో బాలకాండ, అయోధ్యకాండ, అరణ్యకాండ, కిష్కింధకాండ పూర్తయ్యాయి. తర్వాతి కాండకు ఏం పేరు పెట్టాలా అని ఆలోచించాడు. కానీ మంచి పేర్లేమీ ఆయనకు తోచలేదు. అప్పుడు ఆయన మనసులో రామభక్తుడైన హనుమంతుడు మెదిలాడు. కొత్తకాండకు హనుమత్కాండ అని పేరు పెడదామనుకున్నాడు. అదే విషయాన్ని హనుమను పిలిచి ఆయనకు చెప్పబోతున్నాడు. ఇంతలో అంజనాదేవి ‘‘మహర్షీ! సుందరుడిని ఒకసారి నా వద్దకు పంపించు’’అని అనడం వాల్మీకికి వినిపించింది. వాల్మీకి మహర్షి ‘‘సుందరా! మీ తల్లిగారు పిలుస్తున్నారు, వెళ్లిరా నాయనా!’’అని చెప్పారు. హనుమకు కూడా ‘‘నాయనా, సుందరా! ఎక్కడున్నావు తండ్రీ’’ అంటున్న తల్లి గొంతు వినిపించింది. వెంటనే హనుమ తన తల్లి వద్దకు వెళ్లి, ‘‘అమ్మా! సుందరుడెవరు?’’ అని అమాయకంగా అడిగాడు. అప్పుడు అంజనాదేవి ‘‘నీకన్నా సుందరుడెవరు నాయనా? బాల్యంలో నువ్వు బాలభానుడిలా సుందరంగా భాసించేవాడివి. అందుకే నేను నీకు సుందరుడనే పేరే పెట్టాను. అయితే ఇంద్రుడు నీ హనువుపై వజ్రాయుధంతో కొట్టడం వల్ల నీకు హనుమంతుడనే పేరు వచ్చింది. మహర్షి రాయబోయే కాండకు నీ పేరు పెట్టడమే బాగుంటుంది. ఎందుకంటే ఆ కాండకు సంబంధించిన వారందరూ సుందరమైన వారే! రాముడు సుందరుడు, ఆయన సతీమణి సీత ఎంతో సుందరమైనది. వారిద్దరికీ సంబంధించిన ఈ కథ సుందరమైనది. ఆ తల్లి నివసించబోయే అశోకవనం కూడా సుందరమైనదే. ఆ కావ్యానికి అనుసంపుటి చేసిన గాయత్రీ మాత ఎంతో సుందరమైనది. అన్నింటికీ మించి ఆ కావ్యరచన సుందరంగా సాగుతోంది కాబట్టి ఆ కాండకు సుందరకాండ అని పేరు పెట్టడమే సముచితం’’ అంది అంజనాదేవి. ఈ సంభాషణనంతటినీ ఆలకిస్తున్న వాల్మీకి వెంటనే ఆ కాండకు సుందరకాండ అని పేరు పెట్టాడు. హనుమ గురించి అధికంగా ఉండే సుందరకాండ పరమ పవిత్రమైన పఠనీయ గ్రంథం, నిత్య పారాయణ దివ్య చరితం. ఏ సమయంలో ఎవరితో ఏ విధంగా నడచుకోవాలో సోదాహరణంగా, సవివరంగా చెప్పే వ్యక్తిత్వ వికాస విజ్ఞాన భాండాగారం. భక్తితో పారాయణ చేసిన వారి కోర్కెలను తీర్చే కల్పతరువు. ఈ గ్రంథాన్ని పారాయణ చేయాలంటే నియమాలను పాటించాలేమో అని చాలామంది భయపడతారు. అయితే ఏవైనా ప్రత్యేకమైన ప్రయోజనాలను ఆశించినప్పుడు నియమాలను పాటించక తప్పదు కానీ, మానసికానందం కోసం పఠించేవారు సర్వకాల సర్వావస్థలలోనూ హాయిగా చదువుకోదగ్గ సద్గ్రంథమిది. నేడు హనుమజ్జయంతి. భక్తి ప్రధానం అని గుర్తుంచుకోండి. ఈ వేళ అయినా ఈ గ్రంథ పారాయణ మొదలు పెట్టండి... ఆధ్యాత్మికానందంలో ఓలలాడండి. - డి.వి.ఆర్. -
సాక్షి ‘మైత్రి’ భేష్
సాక్షి, సిటీబ్యూరో: ‘సాక్షి’ మహిళల కోసం వినూత్నమైన కార్యక్రమాలను నిర్వహిస్తోంది. వారికి వినోదం, విజ్ఞానంతో పాటు నిపుణలతో అవసరమైన సలహాలు సూచనలు అందిస్తోంది. ఈ ప్రస్తానాన్ని కొనసాగించడంతోపాటు చైతన్యవంతమైన కార్యక్రమాల పరంపరను యువత కోసం విస్తరించింది. ఇందులో భాగంగానే యువత భవిష్యత్తు కోసం సాక్షి ‘యువ మైత్రి’ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. మంగళవారం నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లోని సెమినార్ హాల్లో జరిగిన యువ మైత్రి కార్యక్రమానికి జంటనగరాల విద్యార్థులతో విశేష స్పందన లభించింది. కెరీర్ అంశాలపై యువత సందేహాలను ఆంధ్ర మహిళా సభ ప్రిన్సిపల్ డాక్టర్ దుర్గ నివృత్తి చేశారు. భవిష్యత్తులో యువత ప్రాధాన్యత, ఉద్యోగ అవ కాశాలు వంటి తదితర అంశాలపై ఆమె విద్యార్థులకు వివరించారు. రెండో సెషన్లో జరిగిన మహిళ మైత్రి కార్యక్రమంలో మహిళలకు న్యాయసలహాలు, ఆరోగ్య సమస్యలపై నిపుణలు అవగాహన కల్పించారు. పెద్ద సంఖ్యలో మహిళలు పాల్గొన్నారు. ఉత్తేజాన్ని నింపింది సాక్షి యువ మైత్రి పేరిట నిర్వహించిన కెరియర్ సంబంధించిన మార్గదర్శకత్వం కౌన్సెలింగ్ ఉత్తేజాన్ని నింపింది. నేటియువతకు ఇలాంటి కార్యక్రమాలు చాలా అవసరం. ఏ రంగాన్ని ఎంచుకోవాలో తెలియక ఇబ్బంది పడుతున్న యువతకు ఈ కార్యక్రమం ఒక వేదిక లాంటిది. -సాయి వీణశ్రీ (విద్యార్థిని-కరీంనగర్) యువత చేతిలోనే దేశం రాబోయే రోజుల్లో భారతదేశ అభివృద్ధి యువత చేతిలోనే ఉంటుంది. నెగిటివ్ దృక్పథం, ఆలోచనా విధానంలో లోపాలతో బాధపడుతున్న యువతకు ఈ కౌన్సెలింగ్ ఒక వేదికగా ఉపయోగపడుతుంది. యువత కోసం‘సాక్షి’ ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను నిర్వహించాలని కోరుకుంటున్నాను. -కె.శ్రీనివాస్(భువనగిరి) కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం నేటియువతకు ఏ రంగంలో రాణించాలన్నా వ్యక్తిత్వ వికాసం, కమ్యూనికేషన్ స్కిల్స్ చాలా ముఖ్యం. వీటిని సాక్షి ఉచితంగా అందించడం అభినందనీయం. యువ మైత్రి పేరిట కెరియర్‌కు సంబంధించిన అంశాలపై కౌన్సెలింగ్‌తోపాటు జాబ్‌ఫెయిర్‌కు సంబంధించిన సదస్సులను కూడా నిర్వహిస్తే బాగుంటుంది. - సయీఫుద్దీన్ మాలిక్ (వనస్థలిపురం) -
పుస్తకాలు విజ్ఞాన నేస్తాలు
తిరుపతి కల్చరల్, న్యూస్‌లైన్: విజ్ఞానాన్ని పెంపొందించే మంచి నేస్తాలు పుస్తకాలు అని జిల్లా కలెక్టర్ కే.రామ్‌గోపాల్ తెలిపారు. భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో ఎస్వీ హైస్కూల్ క్రీడా మైదానంలో శనివారం ఏర్పాటు చేసిన 8వ పుస్తక ప్రదర్శన ను ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచంలోని అనేక సంగతులను అవలోకనం చేసుకునేందుకు పుస్తక ప్రదర్శన దోహదపడుతుందన్నారు. అధునాతన టెక్నాలజీ కారణంగా పుస్తకం మనుషులకు దూరమయ్యే పరిస్థితి నెలకొందన్నారు. బయట దేశాల్లో అం దరి చేతుల్లో పుస్తకం దర్శనమిస్తుందని, కానీ మన దేశంలో సెల్ఫోన్లు కనిపిస్తాయన్నారు. ఫలితంగా సమాజంలో సంస్కృతి, సాంప్రదాయాలు కరువవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. పుస్తక పఠనం జీవితాన్ని నేర్పడమే కాక లోకజ్ఞానాన్ని, మానవీయ విలువలను పెంచుతుందన్నారు. మానసిక ప్రశాంతతకు దోహదం చేస్తుందన్నారు. ప్రతి ఒక్కరూ పుస్తక పఠనం అలవర్చుకుని విజ్ఞానవంతులై భావితరాలకు మార్గదర్శకులు కావాలని ఆయన పిలుపునిచ్చా రు. భారతీయ విద్యాభవన్ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. అనంతరం భారతీయ విద్యాభవన్ చైర్మన్, టీటీడీ ఈవో ఎంజీ.గోపాల్ మాట్లాడు తూ మనిషి మస్తకాన్ని చైతన్యపరచే సాధనం పుస్తకమన్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలకు పుస్తక పఠనం పట్ల ఆసక్తి పెంచి వారిలో భాష పట్ల మమకారం, సమాజం పట్ల అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. భారతీ య విద్యాభవన్ డెరైక్టర్ సత్యనారాయణరాజు మాట్లాడుతూ అందరికీ పుస్తక పఠనం పెంపొం దించాలనే లక్ష్యంతో ప్రతి ఏటా తమ సంస్థ ఆధ్వర్యంలో పుస్తక ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నామని చెప్పారు. ప్రస్తుతం ఏర్పాటు చేసిన 8వ పుస్తక ప్రదర్శనలో రాష్ట్రం నుంచే కాక ఇతర రాష్ట్రాలకు చెందిన సాహిత్యం, సామాజిక శాస్త్రా లు, విద్య, విజ్ఞానం, పోటీ పరీక్షలకు సంబంధించిన అనేక రకాల పుస్తకాలతో సుమారు 68 స్టాల్స్ ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. అనంతరం పద్మావతి మహిళా వర్శిటీ రిజిస్ట్రార్ పీ.విజయలక్ష్మీ మాట్లాడుతూ పుస్తకాలు మానవీయ సంబంధాలకు అద్దం పడతాయన్నారు. దీనికి ముందు పుస్తకాలను పల్లకిలో ఉంచి మహతి కళాక్షేత్రం నుంచి పుస్తక ప్రదర్శన కేంద్రం వరకు ఊరేగింపు నిర్వహించి పుస్తకం గొప్పతనాన్ని చాటారు. లోక సంచారి అనుభవాలు ‘జ్ఞాని లోక సంచారి’ అన్న సామెతను ఒంటబట్టించుకున్న రచయిత పరవస్తు లోకేశ్వర్ ఒంటరిగా ఆసియాలోని అన్ని దేశాలకు లింక్ కలిగిన రూటులో సాహసయాత్ర చేశారు. రెండువేల సంవత్సరాల క్రితం చైనా నుంచి రోమ్కు సిల్క్ ఎగుమ తి చేసే వారు. ఆ మార్గంలో ఖజికిస్థాన్ రాజధాని థాష్కెంట్ నుంచి చైనా రాజధా ని బీజింగ్ వరకు 16 వేల కిలోమీటర్లు 55 రోజులు ఒంటరిగా యాత్ర సాగించారు. ఈ యాత్ర ద్వారా తాను గ్రహించిన విషయాలను, పొందిన అనుభూతుల ను అక్షరరూపంలో కూర్చి ‘సిల్క్ రూట్లో సాహసయాత్ర’ అనే పుస్తకా న్ని రూపొందించారు. రచయిత ఈ పుస్తకంతో పాటు తన ఇతర రచనలతో తిరుపతిలో భారతీయ విద్యాభవన్ వా రు ఏర్పాటు చేసిన పుస్తక ప్రదర్శనలో 51వ స్టాల్లో ఉన్నారు. ఆయన వద్దకు వెళ్లి పుస్తకాలు కొనుగోలు చేశామంటే, పుస్తకంతో పాటు ఆయన యాత్రా విశేషాలను తెలుసుకోవడం చక్కటి అను భూతినిస్తుంది. -
బడులిక గుడులే
ప్రాథమిక పాఠశాలల్ని పటిష్టపరిచేందుకు ‘సంకల్పం’ పేరిట సరికొత్త పథకం ఉత్తమ, అత్యుత్తమ పాఠశాలలకు ధ్రువీకరణ పత్రాలు 90 రోజుల ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసిన రాజీవ్ విద్యామిషన్ ఈనెల 27నుంచి 2,561 ప్రాథమిక పాఠశాలల్లో అమలు ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : సర్కారీ బడులు విద్యార్థులకు మరింత విజ్ఞానం పంచే గుడులుగా మారనున్నారుు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా ధోరణిలో మార్పు తీసుకువచ్చే దిశగా ‘సంకల్పం’ పేరిట రాజీవ్ విద్యామిషన్ సరికొత్త పథకాన్ని రూపొందించింది. ఆడుతూ పాడుతూ విజ్ఞానార్జన చేసేలా విద్యార్థుల్ని తీర్చిదిద్దేందుకు 90 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈనెల 27నుంచి జిల్లాలోని 2,561 ప్రాథమిక పాఠశాలల్లో దీనిని అమలు చేస్తారు. ఇదీ ప్రణాళిక ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయడమే ‘సంకల్పం’ పథకం లక్ష్యం. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటం.. ప్రాథమిక పాఠశాల లను విద్య, సౌకర్యాల పరంగా అభివృద్ధి చేయడం ఇందులో ప్రధాన అంశాలు. కేంద్రీకృత విద్య, కృత్యాధార విద్యకు ప్రాధాన్యం ఇస్తూ.. ఆటపాటలు వంటి సహ పాఠ్య కార్యక్రమాలతో విద్యార్థుల పురోభివృద్ధికి కృషి చేస్తారు. ప్రతి పాథమిక పాఠశాలను విద్య, సౌకర్యాలు, క్రీడాంశాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన కార్యక్రమాలు చేపడతారు. ఈ పథకం అమలులో పాఠశాలలకు ర్యాంకింగ్‌లు ఇచ్చి ఉత్తమ, అత్యుత్తమ పాఠశాలలుగా ఎంపికైన వాటికి డీఈవో, కలెక్టర్ నుంచి సర్టిఫికెట్లు అందజేస్తారు. కమిటీలు.. తనిఖీలు జిల్లాలో వివిధ యూజమాన్యాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 2,561 వరకు ఉన్నాయి. వీటిలో 1లక్షా 36వేల 665 మంది చదువుతున్నారు. వీటితోపాటు 260 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 33వేల 904మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి నాణ్యమైన విద్య, సదుపాయాలు కల్పిం చాలన్నది ‘సంకల్పం’ పథకం లక్ష్యం. ఈ కార్యక్రమం కోసం రాజీవ్ విద్యామిషన్ పరిధిలో పనిచేస్తున్న 14 మంది సెక్టోరల్ అధికారులు, 48మంది ఎంఈవోలు, 239 మంది క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు, 254 మంది స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో కమిటీలు వేస్తారు. ఈ కమిటీలు తమ పరిధిలోని పాఠశాలలను తనిఖీ చేస్తారుు. పాఠశాలల్లో విద్యాపరమైన అభివృద్ధితోపాటు విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలు, లైబ్రరీ వంటి అంశాలతోపాటు, క్రీడాంశాల్లో విద్యార్థుల ప్రగతిని కమిటీలు అంచనా వేస్తారుు. ఈ మూడు అంశాల్లో అత్యుత్తమ, ఉత్తమ ప్రతిభ కనబర్చిన పాఠశాలలను గుర్తిస్తారు. తొలిదశలో ప్రాథమిక పాఠశాలల్లోను, రెండోదశలో ప్రాథమికోన్నత పాఠశాలల్లోను పథకాన్ని అమలు చేసేందుకు రాజీవ్ విద్యామిషన్ అధికారులు ప్రణాళిక రూపొందించారు. లక్ష్యాలివీ ప్రతి ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి ప్రణాళిక తయారీ.. అమలు తల్లిదండ్రులతో విధిగా సమావేశాలు నిర్వహించి విద్యా అవసరాలపై అవగాహన కల్పించటం వినడం, మాట్లాడడం, చదవటం, రాయటం అనే కనీస అభ్యసన సామర్థ్యాలను విద్యార్థుల్లో పెంపొందించటం నైతిక, సామాజిక విలువలతో కూడిన విద్య అందించటం గ్రంథాలయం, పుస్తక పఠనానికి ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థుల్లో ఆలోచన, సృజనాత్మకతను వెలికితీయటం వేసవి సెలవుల్లో విద్యార్థి ప్రతిభకు మెరుగుపెట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ పాఠ్యాంశాలు, బోధనోపకరణాల ద్వారా సమగ్ర విద్యాబోధన ఏటా సంకల్పం బృందాల ద్వారా పాఠశాలల తనిఖీ, ఉత్తమ పాఠశాలల గుర్తింపునకు ప్రాధాన్యం వెనుకబడిన పాఠశాలలకు ప్రోత్సాహం అం దించి ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు కృషి విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచటంతోపాటు పాఠశాలలో కొనసాగేలా చూడటం ప్రతి పాఠశాలలలో గ్రంథాలయం ఏర్పాటు.. రోజూ లైబ్రరీ పీరియడ్ నిర్వహించటం సమగ్ర అభివృద్ధి నిలయంగా పాఠశాల ప్రాథమిక పాఠశాలలు అభివృద్ధి చే స్తూనే నాణ్యమైన విద్య విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో సంకల్పం కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతీ పాఠశాలనూ విద్యార్థి సమగ్ర అభివృద్ధికి నిలయంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. నిధులను సక్రమంగా వినియోగించి వాటి ఫలాలు విద్యార్థికి అందించేందుకు కృషి చేస్తున్నాం. జిల్లా విద్యాధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు ఈకార్యక్రమం అమలు చేస్తాం. -ఆర్వీఎం ఏఎంవో ఏ. సర్వేశ్వరరావు -
ఎర్త్ టు మార్స్ 2014!
ప్రత్యేకం 2013లో... రష్యాలో గ్రహశకలం కలకలం పుట్టించింది. భూమిలాంటి గ్రహాలు మరిన్ని దొరికాయి. ఓ ఆస్టరాయిడ్ భూమి సమీపం నుంచే దూసుకుపోయింది. వొయెజర్-1 సౌరకుటుంబం అంచులు దాటేసింది. భారత ఉపగ్రహం అంగారక యాత్రకు బయలుదేరింది. చైనా తొలి రోవర్ చంద్రుడిపై వాలిపోయింది. మరి 2014లో? శాస్త్రసాంకేతిక రంగంలో ఎలాంటి మార్పులు రానున్నాయి? అంతరిక్ష అన్వేషణ ఏ మలుపులు తిరగనుంది? ప్రపంచ విజ్ఞాన రంగం ఏటికేడాదీ వడివడిగా అడుగులు వేస్తోంది. భారత్‌తో సహా అనేక వర్ధమాన దేశాలు అగ్రదేశాలకు దీటుగా అంతరిక్ష శోధనకు, క్షిపణి పరిజ్ఞాన సముపార్జనకూ నడుం బిగించాయి. దేశాలు, ప్రైవేటు కంపెనీల మధ్య పోటీ నేపథ్యంలో టెక్నాలజీ కొత్త పుంతలు తొక్కుతోంది. క్రితం ఏడాదితో పోలిస్తే 2014లో భూగోళం నుంచి ఖగోళం దాకా మరిన్ని పరిశోధనలు ఊపందుకోనున్నాయి. అమెరికా, భారత్‌లు పంపిన మావెన్, మామ్ ఉపగ్రహాలు అరుణగ్రహాన్ని చేరుకుని ఏడాది చివరికల్లా శోధన మొదలు పెట్టనున్నాయి. పదిహేను ఏళ్లుగా సాగుతున్న అగ్రదేశాల అంతరిక్ష ప్రయోగశాల అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రం (ఐఎస్ఎస్) నిర్మాణం ఎట్టకేలకు పూర్తికానుంది. గ్రహశకలాల మైనింగ్ కోసం ప్రయత్నాలూ ప్రారంభం కానున్నాయి. మూలకణ చికిత్సలు, జీన్థెరపీలు, త్రీడీ ప్రింటింగ్ వంటి సాంకేతికతల్లోనూ విప్లవాత్మక మార్పులు రానున్నాయి. రోసెట్టా నిద్రలేస్తుంది..! అదో వ్యోమనౌక. పేరు రోసెట్టా. 2004లో యూరోపియన్ స్పేస్ ఏజెన్సీ ప్రయోగించింది. ఇప్పటిదాకా పలుసార్లు భూమి, అంగారక గ్రహాల సమీపం గుండా సూర్యుడిని చుట్టేసి వచ్చిన రోసెట్టా 2011 జూలైలో నిద్రాణస్థితిలోకి వెళ్లింది. మూడేళ్ల తర్వాత ఇప్పుడు జనవరి 20, 2014న గాఢనిద్ర నుంచి మేలుకోనుంది. ఎందుకంటే.. ఓ తోకచుక్కపై దిగిపోవడం కోసం! అవును రోసెట్టాను పంపిందే ‘67పీ/చుర్యుమోవ్-గెరాసిమెంకో’ అనే తోకచుక్కపై దిగడం కోసం. ఇన్నేళ్లూ.. దిగకుండా ఇది ఎందుకు చక్కర్లు కొట్టిందని అనుకుంటున్నారు కదూ. సూర్యుడి చుట్టూ గంటకు లక్ష కి.మీ. వేగంతో తిరుగుతూ ఆ తోకచుక్క స్పీడును సరిగ్గా అందుకోవడానికే ఇన్నేళ్లు పట్టింది మరి! గ్రహాలు ఏర్పడకముందు సౌరకుటుంబంలో పరిస్థితులు ఎలా ఉండేవో ఈ అధ్యయనంతో తెలుస్తుందని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రోసెట్టా మిషన్ మొత్తం ఖర్చు సుమారు రూ.9 వేల కోట్లు కానుందని అంచనా. ఈ మిషన్ విజయవంతం అయితే గనక.. ఉల్కల మైనింగ్ చేపట్టి ఖనిజాలు తోడుకునేందుకూ మార్గం సుగమం కానుంది. జీఎస్ఎల్వీ... సత్తా చాటేనా? అగ్ని-5 ఖండాంతర క్షిపణి ప్రయోగంతో క్షిపణి సాంకేతికతలో అగ్రదేశాలకు దీటుగా సత్తా చాటిన భారత్ జీఎస్ఎల్వీ రాకెట్ల ప్రయోగంలో మాత్రం ఇంకా విజయం సాధించాల్సి ఉంది. 2013 ఆగస్టు 19న నెల్లూరులోని శ్రీహరికోట నుంచి జీఎస్ఎల్వీ డీ-5 రాకెట్ ద్వారా జీశాట్-14 ఉపగ్రహాన్ని ప్రయోగించాల్సి ఉండగా.. ఆఖరి గంటలో ఇంధన లీకేజీ వల్ల వాయిదా పడింది. రాకెట్‌ను పూర్తిగా విడదీసేసి, మళ్లీ అనుసంధానం చేస్తున్న ఇస్రో 2014 జనవరిలో ప్రయోగం చేపట్టేందుకు సిద్ధమవుతోంది. అయితే 1992లోనే క్రయోజెనిక్ టెక్నాలజీని భారత్‌కు అమ్మేందుకు రష్యా సిద్ధపడినప్పటికీ.. అమెరికా ఆంక్షల వల్ల వెనకడుగేసింది. ఈ నేపథ్యంలో స్వదేశీయ జీఎస్ఎల్వీ ప్రయోగంతో సత్తా చాటితే గనక.. అమెరికా కన్నుకుట్టే విజయాన్ని భారత్ సాధించినట్టే. అది 2014లోనైనా సాధ్యమవ్వాలని కోరుకుందాం. అరుణగ్రహాన్ని చేరనున్న మామ్! అంగారకుడిపై పరిశోధనల కోసం ఇస్రో నవంబరు 5, 2013న ప్రయోగించిన మార్స్ ఆర్బిటర్ మిషన్ (మామ్-మంగళ్యాన్) ఉపగ్రహం రోదసిలో రోజుకు 10 లక్షల కి.మీ. వేగంతో విజయవంతంగా దూసుకుపోతోంది. సుమారు 10 నెలలపాటు 68 కోట్ల కి.మీ. ప్రయాణించి అది 2014 సెప్టెంబరు 24న అంగారకుడి కక్ష్యను చేరుకోనుంది. అంగారకుడిపైకి ఇదివరకే రోవర్లు, ల్యాండర్లను పంపిన అమెరికా నవంబరు 18న మావెన్ అనే మరో ఉపగ్రహాన్ని కూడా ప్రయోగించింది. అది కూడా 2014 సెప్టెంబరు 22న మార్స్ కక్ష్యను చేరనుందని అంచనా. ఈ రెండు ఉపగ్రహాలు అందించే సమాచారాన్ని ఇస్రో, నాసాలు పరస్పరం అందించుకుంటూ పరిశోధనలు చేపట్టనున్నాయి. అయితే మావెన్ మిషన్ ఖర్చు (485 మిలియన్ డాలర్లు)తో పోలిస్తే మామ్ మిషన్ ఖర్చు చాలా తక్కువ (రూ.450 కోట్లు-69 మిలియన్ డాలర్లు) మాత్రమే కావడం విశేషం. మార్స్ మీదుగా దూసుకుపోనున్న తోకచుక్క! సైడింగ్ స్ప్రింగ్ (సీ/2013 ఏ1) అనే ఓ తోకచుక్క 2014 అక్టోబరు 19న అంగారకుడికి అత్యంత సమీపం నుంచే దూసుకుపోనుండటంతో శాస్త్రవేత్తల్లో ఒక పక్క ఉత్సాహం, మరో పక్క గుబులూ కలుగుతోంది. ఆ తోకచుక్క మార్స్‌ను ఢీకొట్టకున్నా.. దాని శకలాలు అంగారకుడి చుట్టూ తిరుగుతున్న వ్యోమనౌకకు ముప్పును తెస్తాయేమోనన్న ఆందోళనా వ్యక్తం అవుతోంది. గూగుల్ అంతరిక్ష పోటీ .. నిలిచేదెవరో? మరో రెండేళ్లలో అంతరిక్ష రేసులకూ తెర లేవనుంది. ఎక్స్ ప్రై జ్ ఫౌండేషన్ నిర్వహిస్తున్న ఈ రోదసీ పోటీలకు ఇంటర్నెట్ సెర్చింజన్ దిగ్గజం గూగుల్ స్పాన్సర్‌గా వ్యవహరిస్తోంది. పోటీ ఏమిటంటే.. చంద్రుడిపైకి రోబోటిక్ వ్యోమనౌకను పంపాలి. అది చంద్రుడిపై అపోలో మిషన్ సైట్లో దిగి కనీసం అరకిలోమీటరు దూరం తిరగాలి. భూమికి ఫొటోలు, ఇతర సమాచారం కూడా పంపాలి. అలా చే స్తే పోటీలో విజేతలైనట్లే. ప్రై వేటు నిధులతో ఏర్పాట్లు చేసుకున్న బృంద సభ్యులు మాత్రమే పాల్గొనేందుకు అర్హులు. మొదటి విజేతకు 30 మిలియన్ డాలర్లు (రూ.185 కోట్లు), రెండో విజేతకు 10 మిలియన్ డాలర్లు (రూ.61 కోట్లు) ప్రైజ్‌మనీ. పోటీకి తుదిగడువు 2015, డిసెంబరు 31. తొలుత 34 టీంలు బరిలో నిలవగా.. కొందరు తప్పుకోవడం, మరికొందరు విలీనం కావడంతో 20 టీంలు మాత్రమే మిగిలాయి. వీరిలో భారత్‌కు చెందిన ఏకైక బృందం ‘టీం ఇండస్’ కూడా ఉండటం విశేషం. ఢిల్లీకి చెందిన రాహుల్ నారాయణ్ దీనికి నేతృత్వం వహిస్తున్నారు. రోదసీ టెక్నాలజీతో కృత్రిమ గుండె! గుండెజబ్బుల వల్ల అభివృద్ది చెందుతున్న దేశాల్లోనే ఏటా 10 కోట్ల మంది మృత్యువాత పడుతున్నారు. డిమాండ్‌కు తగ్గట్లు దాత లు దొరకకపోవడమూ సమస్యను పెంచుతోంది. అందువల్ల అచ్చం మనిషి గుండె మాదిరిగానే అత్యంత కచ్చితత్వంతో పనిచేసే కృత్రిమ గుండె తయారీ చేయడమే దీనికి చక్కని పరిష్కారం. ఫ్రాన్స్‌కు చెందిన కార్డియాక్ సర్జన్ ప్రొఫెసర్ అలియన్ కార్పెంటీర్ సరిగ్గా అలాంటి గుండెనే ఆవిష్కరించారు. ఏరోస్పేస్ కంపెనీ ఆస్ట్రియమ్తో కలిసి కొన్నేళ్లపాటు పరిశోధనలు చేపట్టిన కార్పెంటీర్ ఎట్టకేలకు ఉపగ్రహాలు, రాకెట్ల టెక్నాలజీని వైద్యరంగానికి అన్వయిస్తూ.. అత్యంత సమర్థమైన గుండెను రూపొందించారు. దీనిని ఫ్రాన్స్‌లో ఓ రోగికి అమర్చి పరీక్షించేందుకు సన్నాహాలు చేస్తున్నారు. అన్నీ సవ్యంగా సాగితే 2014 చివరి నాటికే ఈ గుండె అందుబాటులోకి రానుంది. హన్మిరెడ్డి యెద్దుల 2014... కుటుంబ సేద్య సంవత్సరం అంతర్జాతీయ ప్రయోజనాల కోసం ఏటా ఓ సమస్య లేదా అంశానికి ప్రాధాన్యమిస్తూ దాని పేరుతో అంతర్జాతీయ సంవత్సరాలను ప్రకటించిన ఐక్యరాజ్యసమితి.. 2014ను ‘అంతర్జాతీయ ఫ్యామిలీ ఫార్మింగ్(కుటుంబ వ్యవసాయం) అండ్ క్రిస్టలోగ్రఫీ’ సంవత్సరంగా పాటించాలని నిర్ణయించింది. ప్రపంచవ్యాప్తంగా రైతు కుటుంబాలను, వారి వ్యవసాయాన్ని ప్రోత్సహించడం, రైతు సంఘాలను పటిష్టం చేయడం, క్షేత్రస్థాయిలో వివిధ దేశాల ప్రభుత్వాలు, సంస్థల సహకారంతో వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం వంటి లక్ష్యాలను నిర్దేశించింది. అలాగే క్రిస్టలోగ్రఫీ (స్ఫటిక విజ్ఞానశాస్త్రం) పురోగతికి కూడా ఈ ఏడాది పాటుపడాలని ఐరాస పిలుపునిచ్చింది. -
ప్రశ్నలు వేయడమే జ్ఞానం అదే ప్రశ్నోపనిషత్ సారం!
ప్రశ్నలు వేయడమే జ్ఞానమని ఉపనిషత్తులు చెప్పాయి. ఆలోచన కలిగిన ‘ప్రశ్న’ అనితరసాధ్యమైన ‘సమాధానాన్ని’ అన్వేషించడానికి సాధనంగా మారుతుంది. ప్రశ్నలేనిదే అన్వేషణ జరగదు. అద్భుత ఆవిష్కరణలు సమాధాన రూపేణా ఆవిర్భవించవు. ఇందుకు నిదర్శనమే ప్రశ్నోపనిషత్తు. తీర్థయాత్రలలో భాగంగా పిప్పలాద మహర్షి ప్రయాగక్షేత్రంలో కాత్యాయనుని కొడుకు కబన్ధితో జరిపిన ప్రశ్నోత్తర సందర్భం సృష్టి రహస్యాన్ని వర్ణిస్తుంది. ‘‘విశ్వరూపం హరిణం జాతవేదసం పరాయణం జ్యోతిరేకం తపంతం: సహస్ర రశ్మిః శతధా వర్తమానః ప్రాణః ప్రజానాముద యత్యేష సూర్యః’ విశ్వమే రూపంగా కలవాడు, సహస్రకోటి కిరణాలతో ప్రాణికోటికి ప్రాణమైన సూర్యుడు అదుగో ఉదయిస్తున్నాడు. చంద్రప్రకాశాన్ని ఉత్తేజపరుస్తూ జీవనాధారమై వస్తున్నాడని పిప్పలాదుడు చెప్పిన అమృతవాక్కులు అధర్వణవేదానికి చెందిన ప్రశ్నోపనిషత్తులోని అక్షరసత్యాలు. ప్రశాంత వాతావరణంలో ఓరోజు కబన్ధి గురువైన పిప్పలాద రుషితో - ‘చరాచర జగత్తులో ఉంటున్న ఈ ప్రాణులంతా ఎక్కడనుండి పుడుతున్నాయి?’ అని సృష్టి ఆవిర్భావాన్ని, ప్రాణుల పుట్టుకనూ ప్రశ్నిస్తాడు. ప్రపంచంలోని సకల జీవసమూహాన్నీ సృష్టించేవాడు బ్రహ్మ. అతను తపస్సు చేసి సృష్టి రచనకు శ్రీకారం చుట్టాడు. తపశ్శక్తితో ‘పదార్థం- శక్తి’అనే జంటను సృష్టించాడు. అవే అన్నప్రాణాలు. అన్నప్రాణాల సమ్మేళనం వల్లనే అనేక రకాల జీవరాశి ప్రపంచంలోకి అడుగుపెట్టింది. అన్నంలో చంద్రుడూ, ప్రాణంలో సూర్యుడూ నిత్యమై, నిఖిలమై ఉంటున్నారు. అందుకే బ్రహ్మ మొట్టమొదట అన్నప్రాణాలైన ‘పదార్థం- శక్తి’ సృష్టించాడు. వీటితో సృష్టిరచన ఎలా జరిగిందో వివరించాడు పిప్పలాదుడు. ప్రతిరోజూ ప్రాణమే సూర్యుడిలా ఉదయించి అన్నిప్రాణులకూ తన ప్రకాశంతో జీవనాధారమైన శక్తినిస్తుంది. తన సహస్రకోటికిరణాలతో అంతటా వ్యాపించగలిగే సూర్యుడే సర్వాత్మ. సకల ప్రాణులకూ ఆశయమై, జగన్నేత్రమై, వెలుగొందుతూ జన్మను ప్రసాదిస్తాడు. కనుక సూర్యుడే శక్తిచంద్రుడు పదార్థం. సూర్యుని వెలుగు వల్లనే చంద్రుడు ప్రకాశిస్తాడు కదా! అలాగే శక్తివల్లనే పదార్థం ఏర్పడుతుంది. చంద్రుడు భూమిలోని సారానికి కారకుడు. సృష్టిలోని అన్నం చంద్రుని స్వభావ ంతోనే ఏర్పడుతుంది. నిశీధికి రారాజు అయిన చంద్రుణ్ణే ప్రభావితం చేసే సూర్యభగవానుని ఆరాధించే విధానాన్నీ ప్రశ్నోపనిషత్తు వివరించింది. సూర్యునిచే నిర్మింపబడిన కాలమే బ్రహ్మం. ఆయనకు ఉత్తరాయణం, దక్షిణాయనం అనే రెండు గతులున్నాయి. సంవత్సరమంటే కాలమే. ఈ కాలమే జగతికి ఆధారం. ప్రపంచంలో పుట్టి తన సంసారచక్రానికి కోరికలతో కట్టుబడి జీవించేవారు దక్షిణాయనం ద్వారా చంద్రలోకాన్ని పొంది మళ్లీ మళ్లీ జన్మను పొందుతారు. ఎవరు సత్యవంతులై ఆత్మతత్వాన్ని అన్వేషించేవారుగా ఉంటారో, వారే జీవిత పరమార్థాన్ని తెలుసుకుని ప్రాణస్వరూపమైన సూర్యలోకాన్ని ఉత్తరాయణం ద్వారా పొందుతారు. సూర్యరూపశక్తే సకల సృష్టికీ ఆదికారణం. మాసమే ప్రజాపతి. దానిలో కృష్ణపక్షం పదార్థం. శుక్లపక్షం శక్తి. అహోరాత్రులు ప్రజాపతి. దానిలో పగలు శక్తి- రాత్రి పదార్థం. అలా అన్నమే ప్రజాపతి. అందులో నుండే శక్తి కలుగుతుంది. దానినుండే ప్రాణులంతా పుడుతున్నారని సవివరంగా ప్రాణుల పుట్టుకనూ, వారు పొందే స్థితిగతులనూ విశదీకరిస్తాడు పిప్పలాద మహర్షి. అద్భుతమైన చరాచర సృష్టి ‘పదార్థం- శక్తి’. అనే జంటనుండి ఆవిర్భవించిందనే విషయాన్ని చెప్పిన ప్రశ్నోపనిషత్తు శాస్త్రీయ విజ్ఞాన సమన్వయంతో సృష్టి రహస్యాన్ని వర్ణించింది. అసలు ప్రాణానికి సూర్యునితో, అన్నానికి చంద్రునితో తాదాత్మ్యం చేసి ఆధ్యాత్మికపరంగా వివరించడమనేది వేదాంత తత్త్వశాస్త్రంలో ఆదిలోనే అర్థవంతంగా సాధించిన అపూర్వ విజయం. అదే ప్రశ్నోపనిషత్ సారం. - ఇట్టేడు అర్కనందనాదేవి శ్లోకం విదితాఖిల శాస్త్ర సుధాజలధే మహితోపనిషత్కథితార్థనిధే, హృదయే కలయే విమలం చరణం భవ శంకర దేశిక మే శరణమ్ శాస్త్రజ్ఞానమనే అమృత సముద్రాన్ని ఆపోశన పట్టిన మహత్తరమైన ఉపనిషదర్థాలకు సుధానిధీ, పరమ పవిత్రమైన నీ పాదాన్ని హృదయంలో తలచినంతమాత్రానే శరణాగతిని ప్రసాదించే ఓ శంకరాచార్యా! నీకు నమస్కారం. -
పరిజ్ఞానాన్ని దేశ ప్రగతికి వినియోగించాలి
హసన్‌పర్తి, న్యూస్‌లైన్ : శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని దేశ ప్రగతి కోసం వినియోగించాలని ఎన్పీడీసీఎల్ సీఎండీ కార్తీకేయ మిశ్రా విద్యార్థులకు సూచించారు. అన్నాసాగరంలోని వరదారెడ్డి ఇంజినీరింగ్ కళాశాలలో రెండు రోజులపాటు నిర్వహించే ‘స్పుత్నిక్-2013’ జాతీయ స్థాయి టెక్నికల్, కల్చరల్ ఫెస్ట్ గురువారం ప్రారంభమైంది. ముఖ్యఅతిథిగా మిశ్రా పాల్గొని కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భగా ఆయన మాట్లాడుతూ దేశ భవిష్యత్ విద్యార్థుల చేతిలోనే ఉందన్నారు. నవ సమాజ నిర్మాణంలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలని ఆయన ఆకాంక్షిం చా రు. ప్రముఖ కార్డియాలజిస్ట్ డాక్టర్ ప్రభాకర్ మాట్లాడుతూ ఇంజినీరింగ్, మెడికల్ సబ్జెక్టులు ఒకదానికొకటి అనుసంధానం కలిగి ఉంటాయన్నారు. ఇప్పటివరకు 450 గుండె ఆపరేషన్లు చేసినట్లు తెలిపారు. పల్లె ప్రజలకు అందుబాటులో ఉండే విధంగా ‘గ్రామ ప్రజల గుండె చికిత్సాలయం’ అనే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఎస్సార్ విద్యాసంస్థల చైర్మన్ వరదారెడ్డి మాట్లాడుతూ ఆధునిక శాస్త్ర పరిజ్ఞానాన్ని పెంపొందించుకోవడానికి ఇలాంటి ఫెస్ట్ లు ఉపయోగపడతాయన్నారు. రాష్ట్రంలో ని వివిధ ప్రాంతాలకు చెందిన సుమారు 500 మంది విద్యార్థులు పాల్గొని తమ ఈవెంట్స్‌ను ప్రదర్శించారు.ప్రోగ్రాం కన్వీనర్ ఎన్.సుధాకర్, ఫ్యాకల్టీ కోఆర్డినేటర్ రమేష్, రాము, శరత్, పాండురంగ, గోవర్ధన్, మధుసూదన్, ఉపేందర్ పాల్గొన్నా రు. అనంతరం విద్యార్థులు ప్రదర్శించిన ఈవెంట్స్‌ను అతిథులు తిలకించారు.