ప్రాథమిక పాఠశాలల్ని పటిష్టపరిచేందుకు ‘సంకల్పం’ పేరిట సరికొత్త పథకం
ఉత్తమ, అత్యుత్తమ పాఠశాలలకు ధ్రువీకరణ పత్రాలు
90 రోజుల ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసిన రాజీవ్ విద్యామిషన్
ఈనెల 27నుంచి 2,561 ప్రాథమిక పాఠశాలల్లో అమలు
ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ :
సర్కారీ బడులు విద్యార్థులకు మరింత విజ్ఞానం పంచే గుడులుగా మారనున్నారుు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా ధోరణిలో మార్పు తీసుకువచ్చే దిశగా ‘సంకల్పం’ పేరిట రాజీవ్ విద్యామిషన్ సరికొత్త పథకాన్ని రూపొందించింది. ఆడుతూ పాడుతూ విజ్ఞానార్జన చేసేలా విద్యార్థుల్ని తీర్చిదిద్దేందుకు 90 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈనెల 27నుంచి జిల్లాలోని 2,561 ప్రాథమిక పాఠశాలల్లో దీనిని అమలు చేస్తారు.
ఇదీ ప్రణాళిక
ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయడమే ‘సంకల్పం’ పథకం లక్ష్యం. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటం.. ప్రాథమిక పాఠశాల లను విద్య, సౌకర్యాల పరంగా అభివృద్ధి చేయడం ఇందులో ప్రధాన అంశాలు. కేంద్రీకృత విద్య, కృత్యాధార విద్యకు ప్రాధాన్యం ఇస్తూ.. ఆటపాటలు వంటి సహ పాఠ్య కార్యక్రమాలతో విద్యార్థుల పురోభివృద్ధికి కృషి చేస్తారు. ప్రతి పాథమిక పాఠశాలను విద్య, సౌకర్యాలు, క్రీడాంశాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన కార్యక్రమాలు చేపడతారు. ఈ పథకం అమలులో పాఠశాలలకు ర్యాంకింగ్‌లు ఇచ్చి ఉత్తమ, అత్యుత్తమ పాఠశాలలుగా ఎంపికైన వాటికి డీఈవో, కలెక్టర్ నుంచి సర్టిఫికెట్లు అందజేస్తారు.
కమిటీలు.. తనిఖీలు
జిల్లాలో వివిధ యూజమాన్యాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 2,561 వరకు ఉన్నాయి. వీటిలో 1లక్షా 36వేల 665 మంది చదువుతున్నారు. వీటితోపాటు 260 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 33వేల 904మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి నాణ్యమైన విద్య, సదుపాయాలు కల్పిం చాలన్నది ‘సంకల్పం’ పథకం లక్ష్యం. ఈ కార్యక్రమం కోసం రాజీవ్ విద్యామిషన్ పరిధిలో పనిచేస్తున్న 14 మంది సెక్టోరల్ అధికారులు, 48మంది ఎంఈవోలు, 239 మంది క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు, 254 మంది స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో కమిటీలు వేస్తారు. ఈ కమిటీలు తమ పరిధిలోని పాఠశాలలను తనిఖీ చేస్తారుు. పాఠశాలల్లో విద్యాపరమైన అభివృద్ధితోపాటు విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలు, లైబ్రరీ వంటి అంశాలతోపాటు, క్రీడాంశాల్లో విద్యార్థుల ప్రగతిని కమిటీలు అంచనా వేస్తారుు. ఈ మూడు అంశాల్లో అత్యుత్తమ, ఉత్తమ ప్రతిభ కనబర్చిన పాఠశాలలను గుర్తిస్తారు. తొలిదశలో ప్రాథమిక పాఠశాలల్లోను, రెండోదశలో ప్రాథమికోన్నత పాఠశాలల్లోను పథకాన్ని అమలు చేసేందుకు రాజీవ్ విద్యామిషన్ అధికారులు ప్రణాళిక రూపొందించారు.
లక్ష్యాలివీ
ప్రతి ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి ప్రణాళిక తయారీ.. అమలు
తల్లిదండ్రులతో విధిగా సమావేశాలు నిర్వహించి విద్యా అవసరాలపై అవగాహన కల్పించటం వినడం, మాట్లాడడం, చదవటం, రాయటం అనే కనీస అభ్యసన సామర్థ్యాలను విద్యార్థుల్లో పెంపొందించటం నైతిక, సామాజిక విలువలతో కూడిన విద్య అందించటం గ్రంథాలయం, పుస్తక పఠనానికి ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థుల్లో ఆలోచన, సృజనాత్మకతను వెలికితీయటం
వేసవి సెలవుల్లో విద్యార్థి ప్రతిభకు మెరుగుపెట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ
పాఠ్యాంశాలు, బోధనోపకరణాల ద్వారా సమగ్ర విద్యాబోధన
ఏటా సంకల్పం బృందాల ద్వారా పాఠశాలల తనిఖీ, ఉత్తమ పాఠశాలల గుర్తింపునకు ప్రాధాన్యం
వెనుకబడిన పాఠశాలలకు ప్రోత్సాహం అం దించి ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు కృషి
విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచటంతోపాటు పాఠశాలలో కొనసాగేలా చూడటం
ప్రతి పాఠశాలలలో గ్రంథాలయం ఏర్పాటు.. రోజూ లైబ్రరీ పీరియడ్ నిర్వహించటం
సమగ్ర అభివృద్ధి నిలయంగా పాఠశాల
ప్రాథమిక పాఠశాలలు అభివృద్ధి చే స్తూనే నాణ్యమైన విద్య విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో సంకల్పం కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతీ పాఠశాలనూ విద్యార్థి సమగ్ర అభివృద్ధికి నిలయంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. నిధులను సక్రమంగా వినియోగించి వాటి ఫలాలు విద్యార్థికి అందించేందుకు కృషి చేస్తున్నాం. జిల్లా విద్యాధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు ఈకార్యక్రమం అమలు చేస్తాం.
-ఆర్వీఎం ఏఎంవో ఏ. సర్వేశ్వరరావు
బడులిక గుడులే
Published Sat, Jan 25 2014 12:01 AM | Last Updated on Sat, Sep 2 2017 2:57 AM
Advertisement