rajiv vidhya mission
-
సొమ్ము రాజీవ్ విద్యా మిషన్‌ది.. సోకు శైలజానాథ్‌ది!
అనంతపురం ఎడ్యుకేషన్ : అత్తసొమ్ము అల్లుడు దానం చేసినట్లు రాజీవ్ విద్యా మిషన్ సిబ్బంది వ్యవహరిస్తే.. సొమ్మొకరది.. సోకొకరిది అన్నట్లు అధికారమే పరమావధిగా హల్చల్ చేసిన నేపథ్యం ఆ మాజీ మంత్రిది. కార్యాలయ అవసరాల కోసం వచ్చిన పరికరాలను తాను మంత్రిగా ఉన్నప్పుడు సొంత అవసరానికి తీసుకెళ్లిన ఆయన.. ఇప్పటికీ తిరిగి ఇవ్వకపోవడంతో అధికారులు ఇబ్బందులు పడుతున్నారు. వివరాల్లోకి వెళితే.. ఫైవ్ స్టార్ హోటళ్లకు వెళ్లే కోటీశ్వరులు కొందరు చెంచాలు దొంగిలిస్తుంటారు. వేలాది రూపాయల విలువ చేసే పట్టు చీరలు కొనే ఉన్నత వర్గ మహిళల్లో కొందరు చేతిరుమాళ్లు నొక్కేస్తుంటారు. పెద్ద పెద్ద స్థానాల్లో ఉంటూ ఇలా చిన్న చిన్న వస్తువులు కొట్టేయడం ఓ జబ్బు. దీన్ని వైద్యపరిభాషలో ‘క్లిప్టోమానియా’ అంటారు. రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం)కు చెందిన ఓ ఫ్యాక్స్ మిషన్, కంప్యూటర్, ఫెడస్టల్ ఫ్యాన్లు లాంటి వాటిని డాక్టర్ సాకే శైలజానాథ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రిగా ఉన్నప్పుడు తన ఇంట్లో ఉంచుకున్నారు. ఆయన మాజీ అయ్యాక కూడా తిరిగి ఇవ్వలేదు. దీంతో ఈయనకు కూడా ‘క్లిప్టోమానియా’ ఉందేమోనని ఆర్వీఎంలో పలువురు చర్చించుకుంటున్నారు. ఆర్వీఎం ప్రాజెక్ట్ అధికారి (పీఓ) కార్యాలయంలో ఉండే కొన్ని వస్తువులను అప్పట్లో కొందరు సిబ్బంది శైలజానాథ్ ఇంటికి తరలించి విధేయతను చాటుకున్నట్లు సమాచారం. మంత్రికి ప్రొటోకాల్ మర్యాదలు పాటించే మిషతో సిబ్బంది గతంలో భారీగానే నిధులు భోంచేశారు. ఈ విషయం సమాచార హక్కు చట్టం ద్వారా వెలుగుచూసింది. కార్యాలయ అవసరాల కోసం ప్రభుత్వం సరఫరా చేసిన ఫ్యాక్స్, ప్రింటర్ లాంటి వస్తువులు సైతం తరలించిన వైనం తాజాగా ‘సాక్షి’ పరిశీలనలో వెలుగులోకి వచ్చింది. ప్రభుత్వం మారిన తర్వాత కూడా వాటిని సదరు మాజీ మంత్రి వెనక్కు పంపకపోవడం గమనార్హం. ఫ్యాక్స్ మిషన్ (08554-242418) తరలించడంతో పాటు అప్పటి నుంచి బిల్లు కూడా ప్రతినెలా ఆర్వీఎం అధికారులే చెల్లిస్తూ వచ్చినట్లు తెలిసింది. ప్రస్తుతం ఆర్వీఎంలో ఉన్నతాధికారులకు ఏదైనా ఫ్యాక్స్ చేయాలంటే బయట నుంచి పంపాల్సిన దుస్థితి నెలకొంది. కార్యాలయానికి ఎవరైనా ఫ్యాక్స్ పంపుతామంటే మిషన్ పని చేయడం లేదంటూ సిబ్బంది చెప్పడం అలవాటుగా మారిపోయింది. కార్యాలయానికి నాలుగు ఫెడస్టల్ ఫ్యాన్లు తెప్పించగా, వాటిలో మూడింటిని అప్పట్లోనే శైలజానాథ్ నివాసానికి తరలించినట్లు సమాచారం. కార్యాలయంలో కనిపించని కంప్యూటర్ ఆర్వీఎం కార్యాలయ అవసరాల పేరిట మూడేళ్ల క్రితం అధికారులు రూ.38 వేలు పెట్టి అనంతపురంలోని ఓ షాపులో కంప్యూటర్ కొనుగోలు చేశారు. దాన్ని కార్యాలయానికి తీసుకురాకుండా నేరుగా శైలజానాథ్ ఇంటికి తరలించారు. ఇప్పటికీ అది అక్కడే ఉంది. ఇందుకు సంబంధించిన బిల్లు నేటికీ మంజూరు చేయలేదు. సదరు షాపు యజమాని ఆర్వీఎం కార్యాలయం చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. బిల్లు విషయంలో ఇటీవల ఆర్వీఎంలోని ఓ ఉద్యోగితో తీవ్రస్థాయిలో వాగ్వాదానికి దిగాడు. కార్యాలయంలో లేని కంప్యూటర్‌కు బిల్లు మంజూరు చేయాలంటే అధికారులు వెనకడుగు వేస్త్తున్నారు. ఒకవేళ బిల్లు ఇస్తే భవిష్యత్తులో వచ్చే ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని గతంలో ఇక్కడ పని చేసిన ఇద్దరు అధికారులు నాన్చుడి ధోరణి అవలంబిస్తూ వచ్చారు. ఇదిలాఉండగా.. ఫ్యాక్స్ మిషన్ విషయమై కార్యాలయ సూపరింటెండెంట్ ప్రవీణ్‌కుమార్‌ను ‘సాక్షి’ వివరణ కోరగా...‘చాలా రోజులుగా కార్యాలయంలో ఫ్యాక్స్ మిషన్ లేదు. రిపేరీ ఉందనే విషయం సిబ్బంది చెప్పార’ంటూ పేర్కొన్నారు. మాజీ మంత్రి శైలజానాథ్ వివరణ తీసుకునేందుకు ప్రయత్నించగా.. ఆయన ఫోన్లో అందుబాటులోకి రాలేదు. విషయం తెలీదు ఫ్యాక్స్ మిషన్, ఫెడస్టల్ ఫ్యాన్లు, కంప్యూటర్ తదితర వస్తువుల విషయం నాకు తెలీదు. కంప్యూటర్ కొనుగోలు బిల్లు కూడా నా వద్దకు రాలేదు. ఒకసారి మావాళ్లతో మాట్లాడి కార్యాలయానికి సంబంధించిన వస్తువులు ఎక్కడైనా ఉంటే వెంటనే తె ప్పించే లాచ చర్యలు తీసుకుంటా. - మధుసూదన్‌రావు, పీఓ, ఆర్వీఎం -
ఆర్వీఎం.. అయోమయం!
సాక్షి ప్రతినిధి, సంగారెడ్డి: రాజీవ్ విద్యా మిషన్.. రికార్డులు చూస్తే అంతా ఉన్నట్టే అనిపిస్తుంది.. కానీ ఏదీ సవ్యంగా ఉండదు.. ఇదొక అక్రమాల పుట్ట. అంతులేని అవినీతికి, అంతకు మించిన అలసత్వానికి పర్యాయ పదం ఆర్వీఎం. ప్రజాదనం కొల్లగొట్టి ఏజెన్సీల గల్లా నింపడం, వాళ్లిచ్చే కమీషన్లను పోగేసుకోవడమే అధికారుల పని. ఆ తర్వాత పర్యవేక్షణ లేక కోట్లాది విలువైన ఉపకరణాలు విద్యార్థులకు ఉపయోగపడకుండానే పోతున్నాయి. గ్రామీణ ప్రాంతం విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించడం, వారిలో నైపుణ్యాలను మెరుగుపరిచి కాన్వెంట్ స్కూల్ విద్యార్థులకు దీటుగా మలిచేందుకు కంప్యూటర్ విద్యను బోధించాలని ప్రతిపాదించారు. ఫైళ్లు చకచక కదిలాయి. కంప్యూటర్లు సరఫరా చేసేందుకు కాంట్రాక్ట్‌ను ఓ ఏజెన్సీకి అప్పగించారు. సుమారు కోటి రూపాయలకి పైగా ఖర్చు చేసి జిల్లాలో 43 కస్తూర్బా పాఠశాలలకు 125 కంప్యూటర్లు, ఫర్నిచర్‌ను పంపిణీ చేశారు. వాటి ద్వారా 7,500 మంది విద్యార్థులకు కంప్యూటర్ పరిజ్ఞానం అందించాలని నిర్దేశించారు. పైగా కలెక్టర్ స్మితా సబర్వాల్ పాఠశాల మౌలిక వసతులు, ఉత్తీర్ణత సాధనపై ప్రత్యేక దృష్టి సారించారు. ఇటీవల పాఠశాల ప్రధానోపాధ్యాయులతో సమావేశమయ్యారు. హాజరుశాతం, ఉత్తీర్ణత పెంచాలని ఆదేశాలు జారీచేశారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన కస్తూర్బా పాఠశాలల పనితీరు, వాటిలో బోధన ఉపకరణాల ద్వారా చేసే విద్యాబోధన తీరును పరిశీలించేదుకు ‘సాక్షి’ కొన్ని పాఠశాలలను సందర్శించినప్పుడు అంతులేని అలసత్వం బయటపడింది. ఎంతో ఉపయుక్తమైన కంప్యూటర్ పరిజ్ఞానాన్ని అందించకుండా వేలాది మంది విద్యార్థుల భవిష్యత్తును గాలికి వదిలేసిన తీరు ‘సాక్షి’ కెమెరాకు చిక్కాయి. కోట్లాది రూపాయలను ఖర్చు చేసిన కంప్యూటర్లను ఉపయోగించకుండా, ఏళ్లకేళ్లుగా కనీసం సీల్ తీయకుండా అటక మీద పడేయడం ఆశ్చర్యంగొలిపింది. ‘సాక్షి’కి అందిన సమాచారం మేరకు 43 పాఠశాలల్లో ఒక్క పాఠశాలలో కూడా కంప్యూటర్ విద్యాబోధన లేదు. శివ్వంపేటలో కస్తుర్బా గిరిజన బాలికల వసతి గృహానికి రెండు సంవత్సరాల క్రితం ఐదు కంప్యూటర్లను సరఫరా చేసింది. వీటిని కనీసం సీల్ కూడా తీయకుండా అటకమీద వేశారు. అప్పటి నుంచి అవి వృథాగా ఉన్నాయి. కాగా కంప్యూటర్ బోధన అందించేందుకుగాను అవకాశం లేకపోవడంతో వాటిని ఉపయోగించడం లేదని అక్కడి ఉపాధ్యాయుడు చెప్తున్నారు. అల్లాదుర్గంలో కంప్యూటర్లను మూలకు పడేశారు. అక్కడి విద్యార్థులకు కంప్యూటర్ అంటే కూడా ఏమిటో తెలియని పరిస్థితి ఉంది. కొండాపూర్‌లో కంప్యూటర్లను ఉపయోగించకుండానే పనికి రాకుండా పోయాయి. యూపీఎస్, మానిటర్లోకి ఎలుకలు వెళ్లి వైర్లు కొరికివేయడంతో అవి చెడిపోయాయి. కంగ్టిలో కంప్యూటర్లు ఉంచడానికి స్థలం లేదని ఓ మూలన పడేశారు. కంప్యూటర్ బోధించడానికి ఎవరూ లేరని విద్యార్థులు చెప్తున్నారు. జగదేవ్‌పూర్‌లో ఒక్క రోజు కూడా వాడకుండానే రిపేర్‌కు వచ్చాయి. ఇక్కడ కంప్యూటర్ విద్యాబోధన చేయలేదని విద్యార్థులు చెప్తున్నారు. మేమేం చేయగలం: ప్రధానోపాధ్యాయుల ఆవేదన కంప్యూటర్లను ఏర్పాటు చేశారు కానీ వాటిని బోధించే ఉపాధ్యాయులను నియమించలేదని ప్రధానోపాధ్యాయులు చెబుతున్నారు. గత ఏడాది కంప్యూటర్ విద్యా బోధన కోసం కేజీబీవీలో పనిచేస్తున్న సీఆర్టీలలో కంప్యూటర్ అవగాహన కలిగిన ఉపాధ్యాయులను ఎంపిక చేసి విద్యా బోధన చేయించేవారు. ఎలాంటి అదనపు చెల్లింపులు చెల్లిం చకపోవడంతో పనిచేస్తున్న సీఆర్టీలు బోధించేందుకు నిరాకరించారు. ఈ విద్యా సంవత్సరం ప్రారంభమై ఆరు మాసాలు కావస్తున్నా కంప్యూటర్ బోధకుల నియామకంలో స్పష్టమైన ఆదేశాలు ఇంతవరకు అందలేదు. దీంతో కంప్యూటర్ బోధనపై దృష్టి సారించలేకపోయామని హెడ్మాస్టర్లు చెప్తున్నారు. కోట్లాది రూపాయలు ఖర్చు చేసి కంప్యూటర్లు కొనుగోలు చేసిన ప్రభుత్వం వాటిని బోధించడానికి గౌరవ వేతనం ఇచ్చి ఒక్క ఇన్స్ట్రక్టర్ను పెట్టాలనే ఆలోచన మాత్రం చేయలేదని వారు అంటున్నారు. వృధా నిజమే కంప్యూటర్ బోధనకు టీచర్లను నియమించకపోవడంతో వృధాగా పడి ఉన్నాయి. కంప్యూటర్ సీఆర్టీల కోసం ఆర్వీఎం సంచాలకులకు ప్రతిపాదనలు పంపాం. ఈ విద్యా సంవత్సరం కూడా కేజీబీవీల్లో పనిచేస్తున్న సీఆర్టీలలో కంప్యూటర్ పరి జ్ఞానం ఉన్న వారిని ఎంపిక చేసి వారికి శిక్షణ ఇచ్చేందుకు ప్రతిపాదనలు పంపినా ఇంతవరకు అనుమతి రాకపోవడంతో శిక్షణ ఇవ్వలేకపోయాం. -రమేష్, ఆర్వీఎం ఇన్చార్జి పీఓ -
బడులిక గుడులే
ప్రాథమిక పాఠశాలల్ని పటిష్టపరిచేందుకు ‘సంకల్పం’ పేరిట సరికొత్త పథకం ఉత్తమ, అత్యుత్తమ పాఠశాలలకు ధ్రువీకరణ పత్రాలు 90 రోజుల ప్రత్యేక ప్రణాళిక సిద్ధం చేసిన రాజీవ్ విద్యామిషన్ ఈనెల 27నుంచి 2,561 ప్రాథమిక పాఠశాలల్లో అమలు ఏలూరు సిటీ, న్యూస్‌లైన్ : సర్కారీ బడులు విద్యార్థులకు మరింత విజ్ఞానం పంచే గుడులుగా మారనున్నారుు. విద్యార్థుల్లో సృజనాత్మకత, ఆలోచనా ధోరణిలో మార్పు తీసుకువచ్చే దిశగా ‘సంకల్పం’ పేరిట రాజీవ్ విద్యామిషన్ సరికొత్త పథకాన్ని రూపొందించింది. ఆడుతూ పాడుతూ విజ్ఞానార్జన చేసేలా విద్యార్థుల్ని తీర్చిదిద్దేందుకు 90 రోజుల కార్యాచరణ ప్రణాళికను సిద్ధం చేసింది. ఈనెల 27నుంచి జిల్లాలోని 2,561 ప్రాథమిక పాఠశాలల్లో దీనిని అమలు చేస్తారు. ఇదీ ప్రణాళిక ప్రాథమిక పాఠశాలలను బలోపేతం చేయడమే ‘సంకల్పం’ పథకం లక్ష్యం. మారుతున్న సామాజిక పరిస్థితులకు అనుగుణంగా విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించటం.. ప్రాథమిక పాఠశాల లను విద్య, సౌకర్యాల పరంగా అభివృద్ధి చేయడం ఇందులో ప్రధాన అంశాలు. కేంద్రీకృత విద్య, కృత్యాధార విద్యకు ప్రాధాన్యం ఇస్తూ.. ఆటపాటలు వంటి సహ పాఠ్య కార్యక్రమాలతో విద్యార్థుల పురోభివృద్ధికి కృషి చేస్తారు. ప్రతి పాథమిక పాఠశాలను విద్య, సౌకర్యాలు, క్రీడాంశాల్లో అభివృద్ధి చేసేందుకు అవసరమైన కార్యక్రమాలు చేపడతారు. ఈ పథకం అమలులో పాఠశాలలకు ర్యాంకింగ్‌లు ఇచ్చి ఉత్తమ, అత్యుత్తమ పాఠశాలలుగా ఎంపికైన వాటికి డీఈవో, కలెక్టర్ నుంచి సర్టిఫికెట్లు అందజేస్తారు. కమిటీలు.. తనిఖీలు జిల్లాలో వివిధ యూజమాన్యాల్లోని ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలు 2,561 వరకు ఉన్నాయి. వీటిలో 1లక్షా 36వేల 665 మంది చదువుతున్నారు. వీటితోపాటు 260 ప్రాథమికోన్నత పాఠశాలల్లో 33వేల 904మంది విద్యార్థులు ఉన్నారు. వీరికి నాణ్యమైన విద్య, సదుపాయాలు కల్పిం చాలన్నది ‘సంకల్పం’ పథకం లక్ష్యం. ఈ కార్యక్రమం కోసం రాజీవ్ విద్యామిషన్ పరిధిలో పనిచేస్తున్న 14 మంది సెక్టోరల్ అధికారులు, 48మంది ఎంఈవోలు, 239 మంది క్లస్టర్ రిసోర్స్ పర్సన్లు, 254 మంది స్కూల్ కాంప్లెక్స్ ప్రధానోపాధ్యాయులతో కమిటీలు వేస్తారు. ఈ కమిటీలు తమ పరిధిలోని పాఠశాలలను తనిఖీ చేస్తారుు. పాఠశాలల్లో విద్యాపరమైన అభివృద్ధితోపాటు విద్యార్థులకు కల్పిస్తున్న సదుపాయాలు, లైబ్రరీ వంటి అంశాలతోపాటు, క్రీడాంశాల్లో విద్యార్థుల ప్రగతిని కమిటీలు అంచనా వేస్తారుు. ఈ మూడు అంశాల్లో అత్యుత్తమ, ఉత్తమ ప్రతిభ కనబర్చిన పాఠశాలలను గుర్తిస్తారు. తొలిదశలో ప్రాథమిక పాఠశాలల్లోను, రెండోదశలో ప్రాథమికోన్నత పాఠశాలల్లోను పథకాన్ని అమలు చేసేందుకు రాజీవ్ విద్యామిషన్ అధికారులు ప్రణాళిక రూపొందించారు. లక్ష్యాలివీ ప్రతి ప్రాథమిక పాఠశాలలో అభివృద్ధి ప్రణాళిక తయారీ.. అమలు తల్లిదండ్రులతో విధిగా సమావేశాలు నిర్వహించి విద్యా అవసరాలపై అవగాహన కల్పించటం వినడం, మాట్లాడడం, చదవటం, రాయటం అనే కనీస అభ్యసన సామర్థ్యాలను విద్యార్థుల్లో పెంపొందించటం నైతిక, సామాజిక విలువలతో కూడిన విద్య అందించటం గ్రంథాలయం, పుస్తక పఠనానికి ప్రాధాన్యం ఇస్తూ విద్యార్థుల్లో ఆలోచన, సృజనాత్మకతను వెలికితీయటం వేసవి సెలవుల్లో విద్యార్థి ప్రతిభకు మెరుగుపెట్టేందుకు ప్రత్యేక కార్యాచరణ పాఠ్యాంశాలు, బోధనోపకరణాల ద్వారా సమగ్ర విద్యాబోధన ఏటా సంకల్పం బృందాల ద్వారా పాఠశాలల తనిఖీ, ఉత్తమ పాఠశాలల గుర్తింపునకు ప్రాధాన్యం వెనుకబడిన పాఠశాలలకు ప్రోత్సాహం అం దించి ఉత్తమ పాఠశాలగా తీర్చిదిద్దేందుకు కృషి విద్యార్థుల హాజరు శాతాన్ని పెంచటంతోపాటు పాఠశాలలో కొనసాగేలా చూడటం ప్రతి పాఠశాలలలో గ్రంథాలయం ఏర్పాటు.. రోజూ లైబ్రరీ పీరియడ్ నిర్వహించటం సమగ్ర అభివృద్ధి నిలయంగా పాఠశాల ప్రాథమిక పాఠశాలలు అభివృద్ధి చే స్తూనే నాణ్యమైన విద్య విద్యార్థులకు అందించాలనే లక్ష్యంతో సంకల్పం కార్యక్రమాన్ని అమలు చేయాలని నిర్ణయించారు. ప్రతీ పాఠశాలనూ విద్యార్థి సమగ్ర అభివృద్ధికి నిలయంగా మార్చాలనే ఉద్దేశంతో ప్రభుత్వం ఈ కార్యక్రమం చేపట్టింది. నిధులను సక్రమంగా వినియోగించి వాటి ఫలాలు విద్యార్థికి అందించేందుకు కృషి చేస్తున్నాం. జిల్లా విద్యాధికారి, కలెక్టర్ ఆదేశాల మేరకు ఈకార్యక్రమం అమలు చేస్తాం. -ఆర్వీఎం ఏఎంవో ఏ. సర్వేశ్వరరావు -
బాల్యం బుగ్గి
ఒంగోలు, న్యూస్‌లైన్: అవును నిజమే! బాల్యం మగ్గుతోంది. కార్ఖానాలు, కర్మాగారాలు, హోటళ్లు.. ఇలా ఒకటేమిటి.. ఎక్కడ చూసినా బాలకార్మికులే. బడి బాట పట్టాల్సిన బాలలు బతుకు బాట పడుతున్నారు. మండే ఎండలో వయసుకు మించిన భారం మోస్తున్నారు. ఈ నేపథ్యంలో బాల కార్మిక వ్యవస్థను నిర్మూలించాల్సిన ప్రభుత్వం చోద్యం చూస్తోంది. ఎక్కడైనా బాల కార్మికులు ఉన్నారని ఫిర్యాదు వస్తే చైల్డ్‌లైన్ వంటి సంస్థలకు సమాచారం ఇచ్చి చేతులు దులుపేసుకుంటోంది. విద్యాశాఖ, రాజీవ్ విద్యా మిషన్, కార్మికశాఖలు బాల కార్మిక వ్యవస్థ నిర్మూలను తూతూమంత్రంగా చర్యలు తీసుకుంటున్నాయి. ఫలితంగా ఏటా కార్మికుల సంఖ్య పెరుగుతూనే ఉంది. జూన్‌తో సరి జూన్ రావడం ఆలస్యం. పంతుళ్లే ప్రత్యేక షెడ్యూల్ వేసుకుని మరీ బాల కార్మికులను గుర్తించి వారిని బడిబాట పట్టించే పనిలో నిమగ్నమవడం ఏటా చూస్తున్నాం. ఈ హడావుడంతా రెండు నెలలే. ఆ తర్వాత అడ్మిషన్లు పూర్తి చేసి బాల కార్మికుల వైపు కన్నెత్తి చూడరు. జిల్లా కేంద్రం ఒంగోలు కూడా ఇందుకు మినహాయింపు కాకపోవడం గమనార్హం. నగరంలోని ఇందిరమ్మ కాలనీల్లో దాదాపు 40 మంది బడి ఈడు పిల్లలు బతుకు బాట పట్టారు. వారంతా గోతాలు తీసుకొని చెత్త ఏరుకునేందుకు నగరంలోని వివిధ ప్రాంతాల్లో రోజూ సంచరిస్తుంటారు. ఇక పోతురాజు కాలువ సమీపంలోనూ మరో 50 మంది పిల్లలు రోజూ పాత కాగితాలు ఏరుకునే పనిలో బిజీగా ఉంటారు. వీరంతా మధ్యాహ్నం వరకు చిత్తుకాగితాలు ఏరుకుని ఆ తర్వాత రంగారాయుడు చెరువు సమీపంలోని పాత కాగితాల దుకాణంలో అమ్ముకుని ఇంటి బాట పట్టడం అందరికీ తెలిసిందే. అంతేకాకుండా ఒంగోలు, కనిగిరి, కందుకూరు, చీరాల, ఇంకొల్లు, మేదరమెట్ల, అద్దంకి, పొదిలి, మార్కాపురం తదితర ప్రాంతాల్లో బడికి పనికిరారంటూ తమ పిల్లలను కొందరు తల్లిదండ్రులు మెకానిక్ షెడ్లలో చేర్పిస్తుండటం విచారకరం. ఫ్లాస్క్లతో రోడ్ల వెంట.. చీరాల, కందుకూరుల్లో హోటళ్లలో కూడా బాల కార్మికులు కనిపిస్తున్నారు. ఒంగోలులో కొందరు సరికొత్త వ్యాపారానికి తెరలేపారు. చిన్న చిన్న పిల్లలు ఒక ఫ్లాస్క్ పట్టుకొని మెకానిక్ షెడ్లు, దుకాణాల చుట్టూ తిరిగి టీ విక్రయిస్తుంటారు. ఒక వేళ ఎవరైనా ప్రశ్నిస్తే ఆ పిల్లవాడు చెప్పేది ఒకటే. డబ్బులు లేకపోవడంతో తానే ఫ్లాస్క్ కొనుక్కొని వ్యాపారం చేస్తున్నానంటాడే. అంతే తప్ప వ్యాపారి పేరు చెప్పేందుకు ఇష్టపడడు. ఇక అద్దంకి, సంతనూతలపాడు, నాగులుప్పలపాడు, కొత్తపట్నం, యర్రగొండపాలెం, పుల్లలచెరువు తదితర ప్రాంతాల్లో వ్యవసాయ పనులకు బాల కార్మికులు వెళ్తుంటారు. పెద్దల కూలీ రూ.300లు ఉంటే పిల్లలకు రూ.200 నుంచి రూ. 250 వరకు ఇస్తున్నారు. పిల్లలైతే మరింత స్పీడుగా పని చేస్తారనే నమ్మకం కూడా సంబంధింత యజమానుల్లో ఉండటం బాలకార్మిక వ్యవస్థ పెరిగేందుకు మరో కారణమని చెప్పవచ్చు. భిక్షగాళ్ల వేషంలో.. టంగుటూరు, సింగరాయకొండ, మార్టూరు, మార్కాపురం తదితర ప్రాంతాల్లోని ఫ్యాక్టరీల్లోనూ బాలలు మగ్గుతున్నారు. కొంతమంది ఫ్యాక్టరీ యజమానులు ఒకడుగు ముందుకేసి పిల్లలకు 14 సంవత్సరాలు నిండినట్లు సర్టిఫికెట్లు తెప్పించుకుని మరీ పనిలోకి పెట్టుకుంటున్నారు. సింగరాయకొండ, టంగుటూరు ప్రాంతాల నుంచి దాదాపు 50 మంది పిల్లలు రకరకాల వేషాల్లో భిక్షాటన పేరుతో ఒంగోలు వస్తుంటారు. వీరి వెనుక ఏదైనా ముఠా ఉందా.. లేక తల్లిదండ్రులే ప్రోత్సహిస్తున్నారా.. అనే అంశంపై అధికారులు దృష్టి సారించకపోవడం గమనార్హం. బడిబాట పట్టిన పిల్లల్లో బడి మానేసిన వారెందరు? వారు ప్రస్తుతం ఏం చేస్తున్నారనే విషయంపై ఆరా తీస్తే మరిన్ని విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం లేకపోలేదు. మార్కాపురం పలకల గనులు, చీమకుర్తి గ్రానైట్ క్వారీలు, స్పిన్నింగ్ మిల్లుల్లో బాల కార్మికులు నారకయాతన అనుభవిస్తున్నా ప్రభుత్వానికి పట్టకపోవడం దురదృష్టకరం. -
విద్యాబోధకులు ఏరి..!
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: రాజీవ్ విద్యామిషన్ అధికారుల అలసత్వంతో జిల్లాలోని కొన్ని పాఠశాలల్లో చదువులు చట్టుబండలవుతున్నాయి. విద్యాసంవత్సరం మరో మూడు నెలల్లో ముగుస్తున్నా ఇప్పటి వరకు ప్రాథమిక, ప్రాథమికోన్నత పాఠశాలల్లో విద్యాబోధకుల (అకడమిక్ ఇన్స్ట్రక్టర్లు) నియామకాలు ఒక కొలిక్కి రాలేదు. విద్యాబోధకులను సెప్టెంబర్ 7వ తేదీ నాటికి నియమించాలని ఎస్పీడీ స్పష్టంగా ఉత్తర్వులు జారీ చేసినా నేటికీ ఆ ఉత్తర్వులు అమలు కాలేదు. 532 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు మంజూరు జిల్లాకు మొత్తం 532 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు మంజూరయ్యాయి. వేసవి సెలవుల అనంతరం జూన్ 13న పాఠశాలలు పునఃప్రారంభమయ్యాయి. ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతుల కారణంగా జిల్లాలో 286 పాఠశాలల్లో కొన్నింటిలో అసలు టీచర్లు లేకపోగా కొన్నింటిలో మాత్రం ఒక్కొక్క టీచరే బోధిస్తున్నారు. గతంలో ఉపాధ్యాయుల కొరత ఉన్న పాఠశాలలకు విద్యావలంటీర్లను నియమించేవారు. అయితే విద్యాహక్కు చట్టం ప్రకారం పాఠశాలల్లో విద్యావలంటీర్లను నియమించరాదు. కేవలం రెగ్యులర్ టీచర్లతోనే విద్యాబోధన చేయించాలి. డీఎస్సీ నిర్వహించకపోవడంతో కొత్త టీచర్ల నియామకాలు జరగలేదు. దీంతో పాఠశాలల్లో విద్యావలంటీర్లకు బదులుగా అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించేందుకు ప్రభుత్వం సంకల్పించింది. జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలలకు, అసలు టీచర్లు లేని పాఠశాలలకు 286 అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల పోస్టులు మంజూరు చేయాలని ప్రతిపాదనలు పంపగా వాటిని మంజూరు చేశారు. వీరికి నెలకు రూ.5 వేల చొప్పున గౌరవవేతనం చెల్లించేందుకు నిధులుకూడా ఇచ్చారు. ఇదిలా ఉండగా జిల్లాలోని బడిబయట పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్న 28 మండలాల్లో పిల్లల సంఖ్య ఎక్కువగా ఉన్న పాఠశాలలకు విద్యాబోధకులను అదనంగా నియమించనున్నారు. జిల్లాకు మంజూరైన 175 నాన్ రెసిడెన్షియల్ స్పెషల్ ట్రైనింగ్ సెంటర్ల(ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ)కు విడుదలైన నిధులతో ఈ 28 మండలాల్లో నియమించే విద్యాబోధకులకు గౌరవవేతనం చెల్లిస్తారు. ఈ విధంగా మరో 246 అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులు మంజూరు చేశారు. దీంతో జిల్లాకు మొత్తం 532 పోస్టులు మంజూరయ్యాయి. వీటిలో 6 పోస్టులు ఉర్దూ అభ్యర్థులకు కేటాయించారు. జిల్లాలో పుల్లలచెరువు మండలానికి అత్యధికంగా 49 పోస్టులు మంజూరు చేశారు. 1920 దరఖాస్తులు: జిల్లాకు మంజూరైన 532 అకడమిక్ ఇన్స్ట్రక్టరు పోస్టులకు మొత్తం 1920 మంది అభ్యర్థులు దరఖాస్తు చేశారు. అభ్యర్థుల ఎంపికలో రిజర్వేషన్లు పాటిస్తారు. జిల్లాలోని అన్ని పాఠశాలలకు రిజర్వేషన్లు వర్తింపజేస్తూ జిల్లా విద్యాశాఖాధికారి తయారు చేసిన రిజర్వేషన్ల జాబితాకు కలెక్టర్ ఆమోదముద్ర వేశారు. అభ్యర్థుల ఎంపికలో స్థానికులకు ప్రాధాన్యతనిమ్మన్నారు. టీటీసీ, బీఈడీ, డీఈడీ విద్యార్హతలున్నవారే ఈ పోస్టులకు అర్హులు. 1998 డీఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు కూడా ఎంపికలో ప్రాధాన్యత ఇవ్వాలి. అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలు సెప్టెంబర్ 7వ తేదీ నాటికి పూర్తి చేయాల్సి ఉంది. 7 నెలల పాటు అంటే 2014 మార్చి వరకు వీరిని కొనసాగించాలి. అభ్యర్థులు సంబంధిత మండల విద్యాధికారులకు దరఖాస్తులు సమర్పించాలి. మండల స్థాయిలో ఎంఈఓలు ఎంపిక చేసిన అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను పాఠశాల యాజమాన్య కమిటీ (ఎన్ఎంసి)లు పాఠశాలల్లో చేర్చుకోవాలి. అయితే ఎన్‌ఆర్‌ఎస్‌టీసీ నిధులతో కూడా అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమిస్తుండటంతో దీనికి కలెక్టర్ ఆమోదముద్ర తప్పనిసరైంది. దీంతో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల ఎంపికలో జాప్యం జరుగుతోంది. నష్టపోతున్న విద్యార్థులు, అభ్యర్థులు పాఠశాలల్లో అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల నియామకాలు ఒక కొలిక్కి రాకపోవడంతో ఇటు విద్యార్థులు, అటు అభ్యర్థులు తీవ్రంగా నష్టపోతున్నారు. ఈ ఏడాది ప్రారంభం నుంచి పాఠశాలల్లో ఉపాధ్యాయుల కొరత వల్ల పిల్లల చదువులు సాఫీగా సాగడం లేదు. ఆగస్టు నుంచి సమైక్యాంధ్ర సమ్మె కూడా పాఠశాలల పనితీరును దెబ్బతీసింది. ఏకోపాధ్యాయ పాఠశాలల్లో ఒక్కరే అన్ని తరగతుల విద్యార్థులకు బోధించాల్సి రావడంతో విద్యార్థులకు నాణ్యమైన విద్య అందడం లేదు. అసలు టీచరు లేని పాఠశాలల పరిస్థితి మరీ దారుణం. అక్కడ రోజుకొక టీచర్ పని చేస్తుండటం పరిస్థితి మరీ అధ్వానంగా తయారైంది. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన విద్యనందిస్తామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం ఆచరణలో అందుకు భిన్నంగా వ్యవహరిస్తోంది. దీంతో ప్రభుత్వ పాఠశాలల్లో చదువులు ఆశించిన స్థాయిలో సాగడం లేదు. రెగ్యులర్‌గా టీచరు పోస్టులు రాని క్వాలిఫైడ్ అభ్యర్థులు అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టులపైనే ఆశలు పెట్టుకున్నారు. అకడమిక్ ఇన్స్ట్రక్టర్లుగా కనీసం రూ. 5 వేలు వస్తే కుటుంబాలు సాఫీగా సాగిపోతాయని ఆశించిన అభ్యర్థులకు నిరాశే మిగిలింది. అకడమిక్ ఇన్స్ట్రక్టర్ పోస్టుల కోసం దరఖాస్తు చేసిన 1920 మందిలో 1098 మంది అర్హులుగా గుర్తించారు. వివిధ కారణాల వల్ల 689 మంది దరఖాస్తులను పెండింగ్‌లో ఉంచారు. అకడమిక్ ఇన్‌స్ట్రక్టర్ల సేవలను వినియోగించుకునేందుకు గడువు మరో రెండు నెలల్లో ముగియనుండగా ఇప్పటి వరకు విద్యాబోధకుల నియామకాలు ఒక కొలిక్కి రాలేదు. ఫలితంగా విద్యార్థులు నష్టపోతున్నారు. అధికారులు ఇప్పటికైనా స్పందించి వెంటనే విద్యాబోధకులను నియమించాలని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. -
ఆర్వీఎం పీవోగా శ్రీనివాస్‌రెడ్డి
ఆదిలాబాద్ టౌన్, న్యూస్‌లైన్ : రాజీవ్ విద్యామిషన్(ఆర్వీఎం) రెగ్యులర్ పీవోగా కరీంనగర్ జిల్లా పెద్దపెల్లి ఆర్డీవో శ్రీనివాస్‌రెడ్డిని నియమిస్తూ ప్రభుత్వం సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. రెండు రోజుల కిందట కలెక్టర్ అహ్మద్‌బాబు ఆర్వీఎం పీవోగా విధులు నిర్వహిస్తున్న పెర్క యాదయ్యను తప్పించి వికలాంగుల సంక్షేమ శాఖ ఏడీ నారాయణకు బాధ్యతలు అప్పగించారు. పదిహేను నెలల్లో తొమ్మిది మంది పీవోలు మారగా, మళ్లీ సోమవారం రెగ్యులర్ పీవోగా నియమిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఇదివరకు రెగ్యులర్ పీవోగా పనిచేసిన విశ్వనాథ్ బదిలీ అయిన తర్వాత పీవోలుగా పరిశ్రమల శాఖ మేనేజర్ రవీందర్, జెడ్పీ సీఈవో వెంకటయ్య, ఆర్డీవో రవినాయక్‌లు ఇన్చార్జి పీవోలుగా పనిచేశారు. ఆ తర్వాత మెప్మా పీడీ రాజేశ్వర్ రాథోడ్, సీపీవో షేక్ మీరాకు బాధ్యతలు అప్పగించినప్పటికీ వారు తిరస్కరించారు. ఆ తర్వాత ఎస్సీ కార్పొరేషన్ ఏడీ పెర్క యాదయ్యను అప్పటి కలెక్టర్ అశోక్ నియమించారు. అవినీతి ఆరోపణలు ఎదుర్కోవడంతో కలెక్టర్ అహ్మద్‌బాబు యాదయ్యను తప్పించి నారాయణను నియమించారు. బాధ్యతలు అప్పగించి రెండు రోజులు గడవకముందే ప్రభుత్వం రెగ్యులర్ పీవోను నియమించింది. ఆర్వీఎం గాడిలో పడేనా? ఆర్వీఎంలో అవినీతి, అక్రమాలు జరుగుతున్నట్లు జోరుగా ప్రచారం సాగుతోంది. పరిపాలన గాడి తప్పింది. ఇప్పటికైనా రెగ్యులర్ పీవోగా నియామకమైనా శ్రీనివాస్‌రెడ్డి గాడిలో పెట్టేనా అని పలువురు చర్చించుకుంటున్నారు. -
ఉచితం అడ్రస్సేది?
అధికారుల అనుచిత చర్యల కారణంగా ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు సకాలంలో ఉచిత దుస్తులు అందడంలేదు. కుట్టుపని తమకు కిట్టుబాటు అవుతుందో లేదో చూసుకుని, జేబుల్లోకి వెళ్లే నోట్లను బేరీజువేసుకుని మరీ యూనిఫారాలు కుట్టించే పనిని అధికారులు చేపడుతుండడంతో పిల్లలు పాత, చిరిగిపోయిన దుస్తులతో పాఠశాలకు వెళ్లవలసిన దుస్థితి ఏర్పడుతోంది. విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: ఉచిత యూనిఫాం పంపిణీ జిల్లాలో ప్రహసనంగా మారింది. రాజీవ్ విద్యామిషన్ (ఆర్వీఎం) అధికారులకు, ఎంఈఓలకు, స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ (ఎస్ఎంసీ)ల మధ్య సమన్వయం లోపం వల్ల సకాలంలో దుస్తుల పంపిణీ కావడంలేదు. దీంతో జిల్లాకు మంజూరైన నిధులు బ్యాంకులో మూలుగుతున్నాయి. విద్యార్థులకు ఉపయోగపడే విధంగా విద్యాసంవత్సరం ప్రారంభంలో ఏనాడూ పంపిణీ జరిగిన దాఖలాలు లేవు. గత ఏడాది ఇవ్వవలసిన దుస్తులను ఈ విద్యా సంవత్సరంలో ఆరు నెలలు గడిచిన తరువాత ఇటీవల పంపిణీ చేశారు. ఇలా ప్రతి ఏడాదీ దుస్తులను ఆలస్యంగా ఇస్తున్నారు. దీన్ని సరిదిద్దాలనే లక్ష్యంతో ఈ ఏడాది (2013-14)కి సరిపడా దుస్తులకు విద్యాసంవత్సరం ప్రారంభంలోనే రాజీవ్ విద్యామిషన్ నిధులు విడుదల చేసింది. గత ఏడాది డైస్ ప్రకారం 1-8వ తరగతుల మధ్య ఉన్న 1,75,927 మంది విద్యార్థుల దుస్తుల కోసం రూ. 7.03 కోట్లు ఇప్పటికే జిల్లాకు వచ్చాయి. అక్టోబర్ చివరి నాటికి ఆప్కో నుంచి వస్త్రాన్ని తెప్పించుకునేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. కానీ ఇప్పటి వరకు దాని అడ్రెస్స్లేదు. నవంబర్ ఒకటో తేదీ నుంచి దుస్తులు కుట్టడం ప్రారంభించి డిసెంబర్ మొదటి వారంలోపువిద్యార్థులకు సరఫరా చేయాలని ఆదేశాలు ఉన్నాయి. కానీ ఆ దిశగా తీసుకుంటున్న చర్యలు కనిపించడం లేదు. ఆప్కో సరఫరా చేసే వస్త్రానికి సంబంధించిన తీర్మానాలను ఎస్‌ఎంసీల నుంచి ఎంఈఓల ద్వారా జిల్లా కేంద్రానికి పంపించాల్సి ఉండగా, చాలా మండలాల నుంచి ఇప్పటి వరకు తీర్మానాలు చేరలేదు. చాలా పాఠశాలల్లో ఎస్ఎంసీలను ఏర్పాటు చేయకపోవడం వల్లే ఈ పరిస్థితి ఏర్పడింది. జిల్లాలో సుమారు 90 పాఠశాలల్లో ఇప్పటి వరకు స్కూల్ మేనేజ్మెంట్ కమిటీలను ఏర్పాటు చేయలేదు. ఎస్‌ఎంసీల నుంచి ప్రతిపాదనలు పూర్తిస్థాయిలో వచ్చిన తర్వాత వస్త్రం కొనుగోలు చేస్తామని, ఆ తరువాత దుస్తుల కుట్టించే బాధ్యతను ఎస్‌ఎంసీలే వహిస్తాయని ఆర్వీఎం అధికారులు చెబుతున్నారు. దీని కోసం ఆర్వీఎం రాష్ట్రస్థాయి అధికారులు పెట్టిన గడువు డిసెంబర్ మొదటి వారంతో పూర్తయింది. అయితే ఇంకా 10 మండలాల నుంచి ఎస్ఎంసీ తీర్మానాలు రావాల్సి ఉంది. ఎస్ఎంసీలను ఎప్పుడు నియమిస్తారో, తీర్మానాలు ఎప్పుడు చేస్తారో, వస్త్రాన్ని ఎప్పుడు కొనుగోలుచేస్తారో, ఎప్పుడు కుట్టిస్తారో, యూనిఫాంలు ఎప్పుడు పంపిణీ చేస్తారో పైవాడికే తెలియాలి. గత ఏడాది పరిస్థితి యూనిఫాంలు కుట్టించడంలో గత ఏడాది కూడా తీవ్ర జాప్యం నెలకొంది. కొంతమంది ఎంఈఓలు తమకు నచ్చిన కాంట్రాక్టర్లకు యూనిఫాం కుట్టే పనిని అప్పగించి అరకొరగా సరఫరా చేయడంతోపాటు పంపిణీలో జాప్యం నెలకొంది. తొలుత స్కూల్ మేనేజ్మెంట్ కమిటీల నుంచి ఆప్కోకి ఇచ్చిన తీర్మానాలను ఎంఈఓలు, జిల్లా అధికారులు తిరస్కరించారు. రాజకీయ ఒత్తిడితో స్థానిక ప్రైవేటు ఏజెన్సీకి దుస్తుల పంపిణీని అప్పగించారు. ప్రభుత్వ రంగ సంస్థ అయిన ఆప్కో ద్వారా వస్త్రం తెప్పించుకోవాలని స్పష్టమైన ఆదేశాలు ఉన్నా గత ఏడాది కొంతమంది ఎంఈఓలు స్థానిక దుకాణదారులతో కుమ్మక్కై వారి ద్వారా వస్త్రాన్ని తెప్పించారు. దీంతో దుస్తుల సరఫరాలో సహజంగానే జాప్యం జరిగింది. వాటిని ఈ ఏడాది అక్టోబర్ నెలాఖరులో పంపిణీ చేశారు. -
ఇక ఆదర్శ ప్రైమరీ స్కూళ్లు
విజయనగరం అర్బన్, న్యూస్‌లైన్: సర్కారు పాఠశాలల్లో మెరుగైన విద్యాబోధనను అందించేందుకు రాజీవ్ విద్యామిషన్ వినూత్న ప్రయోగం చేస్తోంది. ఎంపిక చేసి న ప్రాథమిక పాఠశాలల్లో నూతన బోధానా పద్ధతులను శతశాతం అమలు చేసేందుకు ప్రణాళిక రూపొందించింది. ఇందులో భాగంగా జిల్లాలోని 102 మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా మార్చనున్నారు. మండల రిసోర్స్ గ్రూప్ (ఎంఆర్జీ)గా వ్యవహరించే ఉపాధ్యాయులు పనిచేస్తున్న పాఠశాలలను ముందుగా ఆదర్శ పాఠశాలలుగా తీర్చిదిద్దుతారు. ఈ మేరకు రాజీవ్ విద్యామిషన్ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ వి.ఉషారాణి నుంచి జిల్లా కేంద్రానికి ఉత్తర్వులు అందాయి. ప్రతి ఎం ఆర్జీ గ్రూప్‌లో ముగ్గురు సభ్యులుంటారు. అంటే జిల్లాలోని మొత్తం 34 మండలాల పరిధిలోని 102 మంది ఉపాధ్యాయులు అంకితభావంతో విధులు నిర్వహిస్తూ అధునాతన అంశాలతో.. కొత్త విధానాలతో గుణాత్మక విద్యను అందించాల్సి ఉంటుం ది. వీరంతా అకడమిక్ బృందంగా ఏర్పడి ఇత ర పాఠశాలల్లో కూడా బోధనా ప్రమాణాల ను మెరుగుపరచాల్సి ఉంటుంది. విధివిధానాలు... పాఠశాలపై విజన్ ఏర్పర్చుకుని అందుకు తగిన ప్రణాళిక రూపొందించుకుని (పాఠశా ల అభివృద్ధి ప్రణాళిక) అమలు చేయాలి. పాఠశాలకు అవ సరమైన వనరులను సమీకరించి అందరినీ భాగస్వాములను చేయాలి. విషయ స్వభావం, బోధనా లక్ష్యాలు, అభ్యాసనా ప్రక్రియలు, బోధనా వ్యూహాలు అనుసరించి పిల్లల సామర్థ్యాల సాధనకు అనుగుణంగా తరగతి గది ప్రక్రియ అమలు చేయాలి. వినూత్న కార్యక్రమాలను నిర్వహించాలి. పాఠశాలలకు సహకరించే వివిధ వ్యవస్థలతో అనుసంధానమై గుణాత్మక విద్యకు కృషి చేయాలి. ఎంఆర్జీ సభ్యుల పాత్ర ఎంఆర్జీ సభ్యులు తమ పాఠశాలలతోపాటు స్కూల్ కాంప్లెక్స్, మండల స్థాయిలో అన్ని పాఠశాలలను ఆదర్శ పాఠశాలలుగా రూపొందించేందుకు కృషి చేయాలి. తోటి ఉపాధ్యాయులు, హెచ్ఎంల సహకారం తీసుకోవాలి. తమ సబ్జెక్టుల్లో 80 శాతానికిపైగా విద్యార్థులు ఏ+/ఏ స్థాయి సాధిం చేలా కృషి చేయాలి. విద్యార్థుల హాజరుపై కూడా దృష్టి పెట్టాలి. వివిధ సబ్జెక్టుల్లో విద్యార్థుల మధ్య ప్రగతి అంతరాన్ని తగ్గించాలి. సమీక్ష సమావేశాలు, సెమినార్ల ద్వారా ఇతర ఉపాధ్యాయులకు బోధనాంశాల పై వివరించాలి. విద్యార్థులకు ఆటలు, పాట లు, సృజనాత్మక కార్యక్రమాలు, వార్షికోత్సవా లు నిర్వహించాలి. క్షేత్ర పరిశీలన, ప్రాజెక్టులు, స్థానికంగా ఉండే వ్యక్తులు, వృత్తులు, సంస్థలను బోధనాభ్యాసంలో ఉపయోగిం చాలి. ఇంకా పలు అం శాలు ఎంఆర్జీ సభ్యులకు నిర్దేశించారు. -
మధ్యాహ్న భోజన చెల్లింపులన్నీ ఆన్లైన్
ఒంగోలు ఒన్‌టౌన్, న్యూస్‌లైన్: జిల్లాలో మధ్యాహ్న భోజనానికి సంబంధించిన బడ్జెట్ కంటిజెన్సీ నిధులు వివరాలన్నీ మండల విద్యాధికారులకు ఆన్లైన్ ద్వారా తెలియజేస్తామని డీఈఓ ఏ రాజేశ్వరరావు తెలిపారు. మంగళవారం సాయంత్రం స్థానిక రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి కార్యాలయంలో నిర్వహించిన ఎంఈఓల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఖజానా కార్యాలయాలకు పంపించిన బడ్జెట్ కేటాయింపు కాపీలను ఎంఈఓలకు మెయిల్లో చేస్తామన్నారు. వీటిని పరిశీలించుకొని తమకు కేటాయించిన బడ్జెట్ మేరకు బిల్లులు పెట్టుకోవాలని ఎంఈఓలకు సూచించారు. మధ్యాహ్న భోజన పథకం వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేయాలన్నారు. ఎంఈఓలు తప్పనిసరిగా మధ్యాహ్న భోజన పథకం అమలును పరిశీలించాలని ఆదేశించారు. పాఠశాలల సందర్శన నివేదికలను ప్రతి బుధవారం ఆన్లైన్లో నమోదు చేసి సమర్పించాలని సూచించారు. బడిబయటి పిల్లలందరినీ (ఓఎన్సిసీ) పాఠశాలల్లో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. 14 ఏళ్లు దాటిన వారిని ఓపెన్ స్కూలు సొసైటీలో చేర్పించాలని ఆదేశించారు. విద్యార్థులకు ప్రీమెట్రిక్ ఉపకార వేతనాలు ప్రభుత్వరంగ పాఠశాలల్లో ఐదు నుంచి పదో తరగతి వరకు చదువుతున్న ఎస్సీ బాల, బాలికలందరికీ ప్రీ మెట్రిక్ ఉపకార వేతనాలిస్తున్నట్లు సాంఘిక సంక్షేమ శాఖ ఉపసంచాలకులు సరస్వతి తెలిపారు. గతంలో 9, 10 తరగతుల విద్యార్థులకు మాత్రమే ఉపకార వేతనాలు మంజూరు చేసేవారన్నారు. ప్రస్తుత విద్యా సంవత్సరం ఐదు నుంచి ఎనిమిదో తరగతి వరకు చదువుతున్న ఎస్సీ బాల, బాలికలకూ వర్తింపజేస్తున్నట్లు తెలిపారు. బాలురకు నెలకు రూ.100, బాలికలకు నెలకు రూ.150 ఉపకార వేతనంగా చెల్లిస్తామన్నారు. ఉపకార వేతనాల కోసం విద్యార్థులు కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, బ్యాంకు ఖాతా నంబర్‌ను మీ సేవా కేంద్రంలో నమోదు చేయించుకోవాలని సూచించారు. 9, 10 తరగతుల విద్యార్థులు ఆధార్ నంబర్‌నూ నమోదు చేయించుకోవాలన్నారు. వీరికి రెగ్యులర్ స్కాలర్‌షిప్‌ల మొత్తాన్ని విడుదల చేసినట్లు తెలిపారు. విద్యార్థులు జీరో బ్యాలెన్సుతో బ్యాంకులో ఖాతాలు ప్రారంభించుకోవచ్చని తెలిపారు. సీజనల్ హాస్టళ్లకు ప్రతిపాదనలు తల్లిదండ్రులెవరైనా పనుల కోసం వలస వెళితే వారి పిల్లల కోసం సీజనల్ హాస్టళ్లను ప్రారంభించనున్నట్లు రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి కే రామశేషు తెలిపారు. 25 నుంచి 50 మంది వరకు పిల్లలుంటే అక్కడ సీజనల్ హాస్టల్ ప్రారంభించేందుకు ప్రతిపాదనలు పంపాలని ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులను కోరారు. దొనకొండ, పెదచెర్లోపల్లి మండలాల్లోని పాఠశాలల విద్యార్థులకు వెంటనే యూనిఫాం పంపిణీ చేయాలని ఆదేశించారు. విద్యార్థుల్లేని పాఠశాలలకు గతేడాది విడుదలైన నిధులను వెంటనే ఆర్వీఎం ఖాతాకు జమ చేయాలని ఆర్వీఎం ఎఫ్ఎఓ యెహోషువా సూచించారు. అన్ని పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ ప్రారంభించాలని ఆ విభాగం ఇన్చార్జి సీహెచ్ వాసంతి కోరారు. ఆరు లక్షల మంది నిరక్షరాస్యులు జిల్లాలో ఇప్పటికీ ఆరు లక్షల మంది నిరక్షరాస్యులున్నట్లు వయోజన విద్యాశాఖ ఉపసంచాలకులు సీ వీరభద్రరావు తెలిపారు. వీరిలో అధికంగా మహిళలే ఉన్నారన్నారు. వీరందరినీ అక్షరాస్యులుగా తీర్చిదిద్దే కార్యక్రమాన్ని డీఆర్డీఏ, డ్వామాలు స్వీకరించాని కోరారు. జిల్లాలో వంద శాతం అక్షరాస్యత సాధించేందుకు అందరూ కృషి చేయాలన్నారు. నిధులెప్పుడిస్తారు ? రాజీవ్ విద్యామిషన్ ప్రాజెక్టు అధికారి కార్యాలయం నుంచి మండల విద్యాధికారులకు సకాలంలో నిధులు విడుదల చేయకపోవడంపై ఎంఈఓలు అసంతృప్తి వ్యక్తం చేశారు. పాఠశాలల్లో పారిశుధ్య కార్యక్రమాలకు రూ.1400 విడుదల చేయనున్నట్లు గతేడాది ప్రకటించారు. ఇంత వరకు ఆ నిధులు విడుదల చేయలేదు. విద్యా పక్షోత్సవాలకు వినియోగించిన వాహనాలకు చెల్లించాల్సిన రూ.25 వేలు ఇప్పటికీ రాలేదు. మండలాల్లో నిర్వహించిన శిక్షణా కార్యక్రమాలకు నిధులు పూర్తిగా చెల్లించ లేదని పలువురు ఎంఈఓలు తెలిపారు. సమావేశంలో ఉపవిద్యాధికారులు బీ విజయభాస్కర్, వీ రామ్మోహనరావు, కే వెంకట్రావు, షేక్ చాంద్‌బేగం, అసిస్టెంట్ డెరైక్టర్లు డీవీ రామరాజు, రాజీవ్ విద్యామిషన్ సెక్టోరల్ అధికారులు ఎన్ అంజిరెడ్డి, జాన్‌వెస్లీ, ఎంఈఓలు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు పాల్గొన్నారు. -
సర్కారు చదువు తిరోగమనం
సాక్షి, రంగారెడ్డి జిల్లా : సర్కారు బడిలో బోధన సన్నగిల్లుతోంది.. విద్యార్థి సామర్థ్యం రోజురోజుకీ తగ్గుతోంది.. తరగతి పెరుగుతున్న కొద్దీ వారి ప్రతిభ క్రమంగా మసక బారుతుంది. ఇటీవల రాజీవ్ విద్యామిషన్ రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ సహా పలువురు రాష్ట్ర స్థాయి అధికారులు జిల్లాలోని కొన్ని పాఠశాలలను తనిఖీ చేసి విద్యార్థుల సామర్థ్యాన్ని పరిశీలించగా.. పలు ఆసక్తికర అంశాలు వెలుగు చూశాయి. ఉపాధ్యాయులు విధులకు సకాలంలో బడికి హాజరు కాకపోవడం ఒక ఎత్తయితే, విద్యార్థికి పాఠ్యాంశాల్లో కనీస సామర్థ్యం కూడా లేకపోవడం వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. పరిశీలించిన అన్ని పాఠశాలల్లోనూ దాదాపు ఇదే పరిస్థితి కనిపించడంతో.. జిల్లా విద్యాశాఖపై వారు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం జరిగిన ఉపాధ్యాయుల టెలీకాన్ఫరెన్స్‌లోనూ ఆర్వీఎం ఎస్పీడీ ఉషారాణి విద్యాశాఖపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తూ పనితీరు మార్చుకోవాలంటూ ముక్కుసూటిగా స్పష్టం చేయడం గమనార్హం. ఎవరి సామర్థ్యం ఎంత..? జిల్లాలో 2,314 ప్రభుత్వ పాఠశాలలున్నాయి. వీటిలో 1,640 ప్రాథమిక పాఠశాలలు, 247 ప్రాథమికోన్నత పాఠశాలలు కాగా మరో 427 ఉన్నత పాఠశాలలున్నాయి. వీటిల్లో దాదాపు 3.5లక్షల మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. పాఠ్యాంశాల బోధన అనంతరం క్రమ ం తప్పకుండా విద్యార్థులకు లఘు పరీక్షలు, యూనిట్ పరీక్షలు నిర్వహించడం ఉపాధ్యాయుల ప్రధాన బాధ్యత. వీటి ఆధారంగానే విద్యార్థుల సామర్థ్యం ఏమిటో స్పష్టమవుతుంది. అయి తే జిల్లాలోని చాలా పాఠశాలల్లో ఇప్పటివరకు పరీక్షలు నిర్వహించిన దాఖలాలు లేవు. కొన్ని పాఠశాలల్లో పరీక్షలు నిర్వహించినప్పటికీ.. వా టి ఫలితాలను ప్రకటించలేదు. ప్రోగ్రెస్ కార్డుల పై ప్రభుత్వం ఎలాంటి మార్గనిర్దేశం చేయనందునే పంపిణీ చేయలేదని ఉపాధ్యాయులు చెప్పుకొస్తున్నారు. కానీ పరీక్షపత్రాల మూల్యాంకనం అనంతరం వచ్చిన మార్కులను కూడా విద్యార్థికి తెలియజేయక పోవడం ఉపాధ్యాయుల పనితీరును స్పష్టం చేస్తోంది. ఆర్వీఎం రాష్ట్ర స్థాయి అధికారులు ఓ పాఠశాలను తనిఖీ చేసి నాలుగో తరగతి విద్యార్థిని పరిశీలించగా.. పాఠ్యపుస్తకాన్ని సైతం చదవలేక తెల్లముఖం వేయడంతో అధికారులు ముక్కున వేలేసుకున్నారు. త్రైమాసిక పరీక్షలు దగ్గరపడుతున్నా విద్యార్థి సామర్థ్యాన్ని గుర్తించడంపై జిల్లా విద్యాశాఖ సైతం ఇప్పటివరకు దృష్టి సారించ లేదు. వెనుక‘బడి’... ఆర్వీఎం రాష్ట్ర ప్రాజెక్టు డెరైక్టర్ నిర్వహించిన టెలీకాన్ఫరెన్స్‌లో జిల్లా విద్యాశాఖ పలు అంశాల్లో అట్టడుగు స్థానంలో ఉందని పేర్కొన్నారు. బోధనలో నాణ్యత లేదని, ఉపాధ్యాయుల హాజరు శాతం సరిగా లేదని, విద్యార్థులకు యూనిఫాంల పంపిణీ ప్రక్రియలో ఇతర జిల్లాలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్నారన్నారు. పాఠశాల యాజమాన్య కమిటీల ఏర్పాటులోనూ తీవ్ర జాప్యం జరగడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇలా పలు అంశాల్లో లోపాలను గుర్తు చేస్తూ సరిదిద్దుకోవాలని ఆదేశించారు.